Saturday, October 10, 2020

రాసక్రీడ, జల క్రీడాభి వర్ణనలు .... శ్రీ మహాభాగవత కథ-61 : వనం జ్వాలా నరసింహారావు

 రాసక్రీడ, జల క్రీడాభి వర్ణనలు

 శ్రీ మహాభాగవత కథ-61

వనం జ్వాలా నరసింహారావు

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

తనను ఆరాధిస్తూ వుండమని చెప్పిన శ్రీకృష్ణుడి పలుకుల వల్ల, అతడితో కూడిక వల్ల, గోపికలు వారి మనస్సులలో అమితంగా కలిగున్న విరహతాపాన్ని ఒక్కసారిగా విడిచి పెట్టారు. సరిగ్గా ఆ సమయంలోనే, శ్రీకృష్ణుడు, నానారకాల మూర్తులను ధరించి, వలయాకారంగా సంచరిస్తూ, చిత్రాకారుడై, రమణీమణులతో రాసక్రీడకు ఉపక్రమించాడు. గోపకలంతా గోపాలుడి చుట్టూ వలయాకారంగా, ఒకరి చేతులు మరొకరు పట్టుకుని, భ్రమణం చేశారు. బహువిధాలుగా గోచరించే ముఖ విన్యాసాలతో, హస్తపాద విన్యాసాలతో రాసలీల భాసిల్లింది. చరాచర ప్రపంచానికి ఆనందాన్ని కలగచేసింది.

శ్రీహరి ఇనుమడించిన ఉత్సాహంతో రాసక్రీడకు ఉపక్రమించాడు. ఇద్దరు పడుచులు వీణలను అందుకుని ఇంపుగా వాయించసాగారు. పాట కూడా పాడసాగారు. అప్పుడు కృష్ణుడు నిశ్చలంగా తన పిల్లనగ్రోవిని విలాసంగా చేతులో తీసుకుని పెదవుల ముందు వించి పూరించసాగాడు. గోపాంగనల మధ్య నిలిచాడు. గోపికలు ఎంతమంది వున్నారో అందరికీ కృష్ణులుగా తానేర్పడి, ఆ రాసమండలాన్ని ఏర్పారు చేశాడు. జగన్మోహనుడై తన చరణాలను దగ్గరికి చేర్చాడు. సమస్థితిలో నిలుచుని, అంజలి పుటాల్లో పుష్పాలు చల్లాడు. తన హస్తాలను గోపికాజనుల గొంతు మీద వుంచాడు. వారి పాటను అనుసరిస్తూ విచిత్రమైన పాద సంచారాలు చేస్తూ, రాసక్రీడ అనే ఆటలో ప్రవేశించాడు. కొనసాగించాడు.

ఆ సమయంలో సలుపుతున్న ఆ రాసక్రీడ సకల జనుల మనస్సులకు ఉల్లాసాన్ని కలగ చేసింది. గోపికా స్త్రీలంతా ఒక్కొక్కరు, ఒక్కొక్క కృష్ణుడితో కూడుకున్నవారై ఆడుతూ ఉత్సాహంగా గడిపారు. కృష్ణుడు గోపికలతో రాసక్రీడ చేస్తుంటే, అంబర వీధిలో దేవతా ప్రభువులు నిలిచి వీక్షించారు. ఆకాశం నుండి దుందుభులు మ్రోగాయి. గంధర్వ పతులు పాడారు. దేవతా స్త్రీలంతా ఆనంద పారవశ్యంతో తమ భర్తలమీద సోలి, వాలిపోయారు. గోపికలు అలా కృష్ణుడితో కలిసి రాసక్రీడ జరుపుతుంటే ఆ రాత్రి మెల్లగా గడిచింది. యమునా నది నీటి తుంపురులతో, అడవి పూల పరిమళంతో చల్లటి గాలి వీచింది. రాసక్రీడ చేయడం వల్ల గోపికా స్త్రీలకు పట్టిన చెమట పోగొట్టింది ఆ గాలి. అప్పుడు గోపికలు ఒక్కొక్కరే కృష్ణుడి సరసన చేరి ఆడుతూ, పాడుతూ, కృష్ణుడిని శ్లాఘిస్తూ, అలసి పోయారు. అలసిన ఆ గోపికలను తన చిరునవ్వులతో, మృదువైన చేతి స్పర్శతో, అనురాగపు చూపులతో, ముచ్చటైన మాటలతో, శ్రీహరి మన్నించాడు.

అలా భగవంతుడైన శ్రీకృష్ణుడు తాను ఆత్మారాముడైనప్పటికీ, ఎందరు గోపికా స్త్రీలున్నారో అందరు కృష్ణులుగా ఏర్పడి, గోపికలతో రాసక్రీడ సలిపాడు. అప్పుడు ఆ గోపికా స్త్రీలంతా కూడి, కృష్ణుడు తమతో పాటుగా నవ్వాడని, తమనే చూశాడని, తమతో వేడుకగా మాట్లాడాడని మనస్సులలో అనుకుని, ఇదంతా తమ పూర్వ జన్మ పుణ్యమని శ్లాఘించుకున్నారు.

రాసక్రీడ ముగిసిన తరువాత చెమట పట్టిన దేహాలను శుభ్రం చేసుకోవడానికి యమునా నదిలో దిగారు. ముందు గోపికలు ప్రవేశించి, అడుగు లోతు, మోకాలి లోతు, నడుము లోతు అని చెప్పుకుంటూ జలాల్లోకి ప్రవేశించారు. యమునా నదీ తరంగాలు వచ్చి వారిని తాకసాగాయి. వారంతా నీళ్లలో తమ బింబాలను, చంద్ర బింబాన్ని చూసుకున్నారు. నీటిని అరచేతులతో పైకి ఎగిరే విధంగా ఎగజిమ్మారు. కృష్ణుడి చేతుల నుండి చల్లుతున్న నీళ్లలో తడిసిపోయారు. సరసపు మాటలు చెప్పుకున్నారు. గోపికలు చేతుల నిండా నీళ్లు తీసుకుని కృష్ణుడి మీద చల్లారు. చల్లుతూ తత్తర పడ్డారు. పడుతూ వినోదించారు. గోపికలు చల్లిన నీళ్లకు శ్రీకృష్ణుడు తడిసిపోయాడు.

జలక్రీడ అయిన తరువాత శ్రీకృష్ణుడు గోపికలతో కూడి నీళ్లలో నుండి బయటకు వచ్చి, వస్త్రాలు, ఆభరణాలు ధరించారు. అలా శ్రీహరి శరత్కాలంలో గోపికా స్త్రీలతో అస్ఖలితేంద్రియుడై క్రీడించాడు. సకల జీవుల్లో సర్వం తానై చరించే సర్వేశ్వరుడికి గోపికలు పరంగనలు కారు. అన్నీ ఆయనే కాబట్టి తనతో తానే క్రీడించాడు. ‘సర్వం విష్ణుమయం జగత్ అనేది అర్థం చేసుకోవాలి. ఇంతలో వేకువ జాము కావడంతో గోపికలు కృష్ణుడితో క్రీడలు చాలించి అతడి దగ్గర సెలవు పుచ్చుకుని, పోవడానికి మనస్సు రాకపోయినా, విధిలేక తమ ఇండ్లకు చేరారు. గోపికల భర్తలు కృష్ణుడి మోహంలో పడిపోయినందున భార్యలను ఏమీ అనలేదు.              

          (బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

No comments:

Post a Comment