Friday, October 9, 2020

మురళీ మోహనగీతానికి కృష్ణుడి దగ్గరకొచ్చిన గోపికలు .... శ్రీ మహాభాగవత కథ-60 : వనం జ్వాలా నరసింహారావు

 మురళీ మోహనగీతానికి కృష్ణుడి దగ్గరకొచ్చిన గోపికలు

 శ్రీ మహాభాగవత కథ-60

వనం జ్వాలా నరసింహారావు

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

శరత్కాలం కలువలకు మేలు కలిగించే సమయం. మన్మథుడికి కదన సమయం. చకోర పక్షులకు భోగానుభవ కాలం. శారద పూర్ణిమనాడు చంద్రుడు ఉదయించే సమయాన మనోహరమైన రూపంతో వున్నాడు. ఈ విధంగా చంద్రోదయం అయింది. చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. చంద్రుడిని చూసిన శ్రీకృష్ణుడు యమునానదీ తీరంలో లోకానికి మోహం పుట్టే విధంగా తన మురళితో ఒక మోహన గీతాన్ని ఆలపించాడు. అది విన్న గోపికలు పరవశులై చేస్తున్న పనులు ఆపుచేశారు. ఏం చేస్తున్నారో తెలియక ప్రవర్తించ సాగారు. మెరుపు తీగల్లాగా వడి-వడిగా నడుచుకుంటూ కృష్ణుడిని చూడడానికి పోయారు. కొందరు గోపికలు ఇంటి నుండి బయటకొచ్చే ధైర్యం చాలక, బయటకు రాలేక, మనస్సులోనే కృష్ణుడిని ఆలింగనం చేసుకుని, ఆ ధ్యానంలో పరవశించి పోయారు. దరిమిలా, ఆ భావనా తీవ్రతవల్ల త్రిగుణాలకు అతీతమై, బంధవిముక్తులై, శరీరాలను వదిలి ముక్తిని పొందారు.

తన మధుర గీతాన్ని విని వచ్చిన గోపికలను చూసి, వారిని కుశల ప్రశ్నలు అడిగి, సింహాలు, పెద్దపులులు, ఏనుగులు మొదలైన మృగాలు సంచరించే రాత్రి సమయంలో ఒంటరిగా తానున్న దూర ప్రదేశానికి ఎందుకు వచ్చారని అడిగాడు కృష్ణుడు. ఇండ్లకు పొమ్మని సలహా ఇచ్చాడు. వారెక్కడికి వెళ్లారో తెలియక వారి-వారి బంధువులు వెతుకుతారని, కాబట్టి ఇలాంటి తెగువతో కూడిన పనులు మంచిది కాదని అన్నాడు. ఇల్లాలి ధర్మాన్ని వదిలి, భర్తల, అత్తమామల, సోదరుల గౌరవాన్ని పోగొట్టి ఇండ్లు విడిచి రావచ్చా అని ప్రశ్నించాడు. లోకులు వాళ్లను గురించి ఏమనుకుంటారని విస్మయం చెందాడు. వారిక్కడికి రావడం చూస్తుంటే, వారి మనస్సులలో కలవరం కలిగినట్లు తనకు అనిపిస్తున్నదన్నాడు. కాబట్టి ఇండ్లకు పోయి, మనస్సులలోని కలవరాన్ని పోగొట్టుకుని బిడ్డలకు పాలిచ్చి, ఆవులకు దూడలను విడవండని చెప్పాడు. ఇండ్లకు పోయి భర్తలను సేవించమన్నాడు.

ఇలా కృష్ణుడు చెప్తుంటే, విన్న గోపికల పెదవులు కంది ఎండిపోయాయి. కన్నుల నుండి నీరు కారింది. ముఖాలు వాచిపోయాయి. పరంపరగా వచ్చే మన్మథ బాణాలకు ధైర్యం చెడిపోయింది. దుఃఖంతో మాటలు తడబడ్డాయి. కృష్ణుడి మాటలకు భయపడ్డారు. మరలి పోవడానికి కాళ్లు కదలక, పాదాలను నేలకు రాస్తూ, కృష్ణుడితో తాము చెప్పాలనుకున్నది చెప్పారు. తాము కృష్ణుడిని నమ్మి, ఇండ్లలో పనులన్నీ విడిచి, ఆయన పాదపద్మాలు సేవించాలని తమవారికి చిక్కకుండా ఇక్కడికి వచ్చినందున, ఈశ్వరుడైన ఆయన, తమను ముముక్షువులను ఏలినట్లు ఏలరాదా అని అడిగారు. కృష్ణుడు తప్ప ఇతరాలు ఏవీ వద్దనుకునే తమ బోటి వారిని విడవడం ధర్మమా? అని ప్రశ్నించారు. తమకు సర్వం ఆయనే అన్నారు. తమ తాపాన్ని తొలగించమని ప్రార్థించారు. తమ మనస్సులను దొంగిలించాడు కాబట్టి కృష్ణుడిని వదిలి పోవడానికి కాళ్లు-చేతులు రావడం లేదన్నారు. ఆయన పట్ల విరహంతో వచ్చిన తమను ఆయన దాస్యం చేయడానికి అంగీకరించమని వేడుకున్నారు.

ఇలా అంటున్న గోపికల దుఃఖ వచనాలు విని, నవ్వి, కృష్ణ పరమాత్మ ఆత్మారాముడై వారితో క్రీడించాడు. తన దయగల చూపులతోనూ, స్పర్శనం చేతనూ, ఆలింగనం చేతనూ, మేలములాడుతూ, గోపస్త్రీలతో సంగమ క్రీడను కొనసాగించాడు. గోపికల మధ్య నిండు చంద్రుడిలాగా ప్రకాశించాడు. బృందావనానికే అలంకారమై పోయాడు. ఇదంతా చేస్తూ అదృశ్యమయ్యాడు. హఠాత్తుగా కృష్ణుడు కనబడక పోయేసరికి గోపికలు తల్లడిల్లి పోయారు. ఒళ్లు తెలియని స్థితిలో పడిపోయారు. శ్రీకృష్ణమూర్తిని యమునా నదీతీరంలో వెతకసాగారు. చెట్టు-చెట్టునూ, గుట్ట-గుట్టనూ గాలించారు. భావోద్రేకంతో, కృష్ణుడి మీద నిమగ్నమైన మనస్సులతో, కృష్ణ లీలలను అనుకరించారు. తన్మయత్వం నుండి తదాకార స్థితిని పొందారు గోపికలు. తమలో తాము రకరకాలుగా కృష్ణభావనలో మునిగి తేలారు. కృష్ణుడి పూర్వ లీలలను తలచుకుని పొగడ సాగారు.

ఇలా బృందావనంలో పరమాత్ముడైన కృష్ణుడి కోసం వెతికి చూశారు కాని కానలేకపోయారు. చిన్నగా యమునా నది ఇసుక తిన్నెల మీదికి చేరారు. శ్రీహరిని ఉద్దేశించి గీతలు పాడారు. గోపికలంతా మధురమైన కంఠంతో కృష్ణుడిని పొగడుతూ, పాడుతూ, ‘రావయ్యా! దర్శనమియ్యవయ్యా!’ అని ఆయన్నే తలచుకుంటూ రోదించసాగారు. అప్పుడు కృష్ణుడు మనోహరమైన ఆకారంతో, వెలలేని పట్టు వస్త్రాన్ని ధరించి, ఆ గోపికల ముందు సాక్షాత్కరించాడు. గోపికలకు పోయిన ప్రాణాలు లేచివచ్చాయి. గోపికలు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కృష్ణుడిని పట్టుకుని తనివితీరా ఆనందాన్ని పొందారు. ఆయన రూపాన్ని తమ హృదయాలలో బంధించారు. తమను వదిలి ఎక్కడికి పోయాడని చిరుకోపంతో ఆయన్ను నిందించారు. అంతా పరవశించారు. అలా గోప స్త్రీలంతా కృష్ణుడి అందమైన మోహనాకారాన్ని చూసి, విరహ తాపం అణగి పోవడంతో, పరమోత్సవం చేసుకున్నారు.

శ్రీకృష్ణుడు గోపికా స్త్రీలు తనను చుట్టుకుని వెంటరాగా, ఆ అడవి మధ్యలో, పరబ్రహ్మం లాగా ప్రకాశించాడు. గోపికలతో కలిసి, యమునా నది అలల తాకిడికి మెత్తగా అయిపోయిన ఇసుక మీద చేరాడు. గోపికలంతా ఆయన కూచోడానికి తమ చీరల పమిటలను పరచి కృష్ణుడికి పీఠంగా వేశారు. గోపికా స్త్రీలంతా కృష్ణుడికి అనేక విధాలుగా మర్యాదలు చేశారు. ఆయనెందుకు అదృశ్యమయ్యాడని అడిగారు. జవాబుగా కృష్ణుడు, తాను మిక్కిలి దయగల వాడినని, గోపికల మనస్సులకు ప్రియమైన బంధువునని, వారు ఎప్పటికీ తనను విడవకుండా ధ్యానించడం కోసం కనుమరుగయ్యానని చెప్పాడు. వారిని వదిలి తాను పోవడం తప్పేనని, తన తప్పును మన్నించమని, విరహతాపంతో వారి అన్న మాటలన్నీ విన్నానని అన్నాడు. తనను సేవించాలన్న ఆసక్తితో వున్న వారికి ఉపకారం చేయడానికి యుగాల పర్యంతం పాటుపడ్డా తాను ఆశక్తుడినేనని, తనను ఆరాధిస్తూ వుండమని చెప్పాడు.         

          (బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

No comments:

Post a Comment