Wednesday, October 21, 2020

రుక్మిణీదేవితో శ్రీకృష్ణుడి విరసోక్తులు, ఊరడింపు .... శ్రీ మహాభాగవత కథ-72 : వనం జ్వాలా నరసింహారావు

 రుక్మిణీదేవితో శ్రీకృష్ణుడి విరసోక్తులు, ఊరడింపు

శ్రీ మహాభాగవత కథ-72

వనం జ్వాలా నరసింహారావు

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

ఒక రోజున శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి అంతఃపురంలో కూర్చున్నాడు. ఆ సమయంలో అంతఃపురమంతా ఆహ్లాదకరంగా వుంది. రుక్మిణీదేవి తన అంతఃపురానికి వచ్చిన శ్రీకృష్ణుడిని సమీపించింది. ఆయనకు మెల్లగా వింజామర విసరసాగింది. రుక్మిణిని చూసి మందహాసం చేస్తూ శ్రీకృష్ణుడు ఒక ప్రశ్న అడిగాడు. ఆమె తండ్రి, అన్న, అందరూ ఆమెను శిశుపాలుడికిచ్చి పెళ్లి చెయ్యాలనుకుంటే ఆమె ఎందుకు తనను వరించిందని అడిగాడు. తామెల్లప్పుడూ సముద్ర మధ్యలో వుండేవారమని, నిధి నిక్షేపాలు లేనివారమని, రహస్యంగా జీవించే వాళ్లమని, గుణం లేని వాళ్లమని, అలాంటి తనను ఆమె ఎందుకు కోరిందని అడిగాడు. తాను ఆమెకి సరితూగనని తెలుసుకోలేక పోయిందని, తనను కోరి పెళ్లి చేసుకుని తప్పు చేసిందని, జరిగిన తప్పును సరిదిద్దుకోవడానికి ఆమె తనకు తగిన రాజునెవరినైనా ఎన్నుకుని వివాహమాడమని చెప్పాడు.

కృష్ణుడు ఇంకా ఇలా అన్నాడు. తనకు స్త్రీలపట్ల వ్యామోహం కాని, సంతానం కావాలనే వాంఛ కాని, ధనం సంపాదించాలనే ఆసక్తికాని లేవనీ, కామమోహాలలో కొట్టుకు పోయేవాడిని కాదనీ, దేని పట్లా ఆపేక్షలేని వాడిననీ, అలాంటి నిష్కాముడైన తనను పతిగా ఎంచి కష్టాల పాలు కావద్దనీ అన్నాడు. ఇలా అంటూ, భగవంతుడైన శ్రీకృష్ణుడు, తానే ‘పతికి ప్రియురాలినని, పైగా పట్టపు దేవేరినని గర్విస్తున్న రుక్మిణీదేవి అహంకారాన్ని క్షణంలో మటుమాయం చేసి మౌనం ధరించాడు. ఈ అప్రియమైన మాటలు విన్న రుక్మిణీదేవి దుఃఖంతో నలిగిపోయింది. ముఖం వాడిపోయింది. తనువు వణికిపోతూ తూలిపోయింది. తలదించుకుని శోకమూర్తిలా నిలబడిపోయింది. కాంతిహీన అయిపోయి నేలమీద పడిపోయింది. అప్పుడు రుక్మిణీదేవి దగ్గరికి కృష్ణుడు వచ్చాడు. మెల్లగా లేవనెత్తాడు. ఆమెను సేద దీర్చాడు. ఓదార్చాడు. కిందపడ్డ నగలతో ఆమెను అలంకరించాడు. రుక్మిణీదేవి దుఃఖం పోయే విధంగా ఆమెను తన కౌగిలిలో చేర్చుకున్నాడు. 

ఆ తరువాత ఆమెను పానుపు మీద చేర్చి తియ్యటి మాటలతో మృదువుగా అనునయించాడు. అప్పుడు రుక్మిణీదేవి ఆయన్ను పరిపరి విధాల స్తుతించింది. భగవత్ తత్త్వాన్ని వివరించింది. తనతో అన్న మాటలు సత్యమేనా ఆని అడిగింది. ఆయనకు తాను తగినదానిని కాదా అని ప్రశ్నించింది. సాక్షాత్తు ధర్మ స్వరూపుడైన ఆయన అలా ఎందుకన్నాడని అడిగింది. రుక్మిణీదేవి మాటలకు శ్రీకృష్ణుడు సంతోషించాడు. తాను నవ్వులాటగా అన్న మాటలకు మనస్సులో అంతగా కలత చెందాల్నా? అని అన్నాడు. వేటలో కాని, యుద్ధంలో కాని, కలహంలో కాని, రతివేళకాని, బాధపడేట్లు మాటలన్నా వాటిని దూషణలుగా తీసుకోకూడదన్నాడు. ఆమె మనస్సు తెలుసుకోవడానికి అలా అన్నానని చెప్పాడు.

రుక్మిణి పతివ్రతా శిరోమణి అని, సచ్చీలం కలదని, వివేకవతని, నిర్మల స్వభావం కలదని, ధర్మ నిరతని, ఆమె మనస్సులో ఎప్పుడూ తన సేవల గురించే ఆలోచన చేస్తుందని, ఆమెను నిందించినందుకు క్షమించమని అన్నాడు శ్రీకృష్ణుడు రుక్మిణీదేవితో. ఈ అనునయమైన మాటలకు, భర్త ప్రణయ సంభాషణకు రుక్మిణి అమితంగా సంతోషించింది. ఆయన్ను మళ్లీ స్తుతించింది. శ్రీకృష్ణుడు ఆమెను గౌరవాదరాలతో సన్మానించాడు. ఆ తరువాత కోరికలు తీరే విధంగా పరస్పర ప్రేమాతిశయంతో విహరించారు. శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి మన్మథ క్రీడలలో తేలియాడారు. వారిద్దరికీ ప్రద్యుమ్నుడు, చారుధేష్ణుడు, చారుదేవుడు, సుధేష్ణుడు, సుచారువు, చారుగుప్తుడు, భద్రచారువు, చారుభద్రుడు, విచారువు, చారువు అనే పదిమంది కొడుకులు జన్మించారు.

అలాగే సత్యభామకు, జాంబవతికి, నాగ్నజితికి, కాళిందికి, లక్షణకు, మిత్రవిందకు, భద్రకు ఒక్కొక్కరికి పదిమంది చొప్పున కొడుకులు పుట్టారు. పదహారువేల మంది భార్యలకు ఒక్కొక్కరికి పదిమంది చొప్పున పుట్టడంతో శ్రీకృష్ణుడి వంశం అభివృద్ధి చెందింది. ఆ విధంగా యాదవ వంశం యదు, వృష్టి, భోజ, అంధక మొదలైన పేర్లతో నూట ఒక్క శాఖలుగా విస్తరిల్లి వర్ధిల్లింది. ఆ రాజకుమారులకు మూడుకోట్ల ఎనభై ఎనిమిది వేల మంది గురువులు విద్య నేర్పారు. ఆ బాలుర విద్యా వివేకాలను, విభాగాన్ని వర్ణించడం బ్రహ్మాదులకు కూడా సాధ్యం కాదు. ఆ రాజకుమారులలో రుక్మిణీ కృష్ణుల పుత్రుడైన ప్రద్యుమ్నుడు రుక్మి కుమార్తె రుక్మవతిని వివాహమాడాడు. వారికి అనిరుద్ధుడు అనే కుమారుడు కలిగాడు. రుక్మి మనుమరాలైన రుక్మలోచనను అనిరుద్ధుడు వివాహమాడాడు.

అనిరుద్ధుడు, రుక్మిలోచనల వివాహ సమయంలో చోటు చేసుకున్న స్వల్ప బాధాకర సంఘటనలలో, జూదం ఆట పుణ్యమా అని, తనను ఆక్షేపించిన రుక్మిని బలరాముడు చితకబాది లేవకుండా చేశాడు. బలరాముడి ధాటికి రుక్మి చనిపోయాడు. శ్రీకృష్ణుడు తన బావ మరణం చూసి కూడా మౌనం దాల్చాడు. ఆ తరువాత యాదవులు తిరుగు ప్రయాణం కట్టారు. ద్వారకా నగరంలోకి పోయారంతా.                  

(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

No comments:

Post a Comment