Saturday, January 23, 2021

దుష్యంత, శకుంతల వృత్తాంతంలో అద్భుతమైన నన్నయ పద్యాలు (ఆస్వాదన-3) : వనం జ్వాలా నరసింహారావు

 

దుష్యంత, శకుంతల వృత్తాంతంలో అద్భుతమైన నన్నయ పద్యాలు

(ఆస్వాదన-3)

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (24-01-2021)

యయాతి కొడుకు పురూరవ వంశక్రమంలో, ఇలినుడికి-రథంతరికి అత్యంత సమర్థుడైన దుష్యంతుడు జన్మించాడు. అతడు చిన్నవయస్సులోనే దుర్గమ మైన అడవులలో తిరిగే పెద్ద పెద్ద మృగాలను పట్టుకుంటూ తన ధైర్యాన్ని చాటుకునేవాడు. ఆ తరువాత యౌవన గర్వంతో భూలోకంలో మిక్కిలి గొప్పవాడిగా అతిశయించాడు. భుజబలంతో ఓటమిని ఎరుగకుండా భూమిని పాలించాడు.

దుష్యంతుడు ఒకనాడు వేటాడుతూ, అనేక మృగాలను తరిమి తరిమి చంపుతూ, అందమైన ఒక వనాన్ని చూశాడు అడవిలో. దుష్యంతుడు ఆ వన సౌందర్యాన్ని మెచ్చుకుంటూ వచ్చి, ఆ వనంలో ప్రవేశించే సమయంలో ఆయన పొందిన అనుభూతిని చక్కటి పద్యంలో వర్ణించాడు నన్నయ ఈ విధంగా:

చ:       అతిరుచిరాగతుం డయిన యాతనికిన్‌ హృదయప్రమోద మా

తతముగ నవ్వనంబున లతాలలనల్‌ మృదులానిలాపవ

ర్జిత కుసుమాక్షతావళులు సేసలు వెట్టినయట్టిరైరి సం

పత దళినీనినాదమృదుభాషల దీవన లొప్ప నిచ్చుచున్

         (మిక్కిలి సముచితంగా వచ్చిన ఆ దుష్యంతుడికి మనస్సులోని ఆహ్లాదం అధికమయ్యే విధంగా ఆ వనంలోని లతలనే వనితలు అటూ ఇటూ ఎగురుతున్న ఆడు తుమ్మెదల ఝంకారధ్వనులనే మెత్తటి మాటలతో తగిన విధంగా ఆశీస్సులు ఇస్తూ, మెల్లటి గాలులతో రాల్పబడిన పూలనే అక్షతల సమూహాన్ని తలంబ్రాలుగా చల్లినట్లు భాసించారు). 

         ఈ సందర్భాన్ని, పద్యాన్ని విశ్లేషిస్తూ డాక్టర్ జివి సుబ్రహ్మణ్యం గారు ఇలా రాశారు: “ఈ వర్ణనం దుష్యంతుడికి కలగబోయే కల్యాణాన్ని సూచిస్తున్నది. ఈ పద్యం నన్నయగారి ప్రసన్నకథాకలితార్థయుక్తికి, రుచిరార్థసూక్తికీ చక్కటి ఉదాహరణ. సవర్ణదీర్ఘాక్షరాల సంయోజనం పద్యానికి గీతికామాధుర్యాన్ని కలిగిస్తున్నది. నన్నయ కవితా లక్షణాలన్నీ అమరిన అందమైన పద్యం ఇది”.

         దుష్యంతుడు ఆ వనంలో అలా వెళ్తూ, వెళ్తూ కణ్వమహాముని ఆశ్రమాన్ని చూశాడు. అక్కడ కలిసిమెలిసి తిరుగుతున్న పరస్పరం వైరి స్వభావం కల ఎలుకలు-పిల్లులను, ఏనుగులు-సింహాలను చూసి ముని మహిమకు ఆశ్చర్యపడ్డాడు. తన వెంట వచ్చిన అనుచరులను బయటనే ఆపుచేసి, దుష్యంతుడు ఒక్కడే కణ్వుడి నివాసంలోకి పోయి అక్కడ శకుంతల అనే కన్యను చూశాడు. శకుంతలను వర్ణిస్తూ నన్నయ, ఆమెను తామర రేకుల లాంటి విశాలమైన కళ్ళు కలదని, ఒత్తుగా గుమికూడిన తుమ్మెదలాగా నల్లగా వంకరలైన మెత్తటి ముంగురులు కలదని అన్నాడు. నన్నయ రాసిన పద్యాన్ని విశ్లేషిస్తూ డాక్టర్ జివి సుబ్రహ్మణ్యం గారు, శకుంతల మధురమూర్తిని వర్ణించడంలో నన్నయ మాధుర్యగుణం పోషించాడని అన్నారు. శకుంతల కూడా సౌందర్యవంతుడైన రాజును చూసి, అతిథి మర్యాదలు చేసింది.

          కణ్వుడిని దర్శించుకుని పోదామని వచ్చానని, వారు ఎక్కడికి పోయారని అడిగాడు దుష్యంతుడు. పండ్లు తేవడానికి అడవికి పోయారని జవాబిచ్చింది శకుంతల. కణ్వమహాముని అడవి నుండి వచ్చేవరకు వుండమని కోరింది దుష్యంతుడిని. శకుంతల ఎవరని, ఎవరి కూతురని, అపురూప సౌందర్యంకల ఆమె ఏ కారణాన ఆశ్రమానికి వచ్చిందని ప్రశ్నించాడు రాజు. కణ్వమహాముని కూతురునని జవాబిచ్చింది. ఆమె ముని కన్య అయితే ఆ కోమలిమీద తన మనసు ఎందుకు గాఢంగా లగ్నమైంది అనుకున్న దుష్యంతుడు ఆమె మాటలను నమ్మలేకపోతున్నానని అన్నాడు. ఇక్కడ నన్నయ ఒక చక్కటి పద్యం రాశాడు ఇలా:

         చ:       ఇది మునికన్య యేని మఱి యేలొకొ యీలలితాంగియందు నా

హృదయము దద్దయుం దవిలె; నిప్పలు కింకను నమ్మనేర న

య్యెద; విజితేంద్రియుం డనఁగ నిమ్మునిఁ బాయక విందు’ నంచుఁ దా

నిది కలరూ పెఱుంగ నవనీపతి యుత్సుకుఁ డయ్యె నాత్మలోన్

         తన తండ్రి కణ్వమహాముని తన జన్మ వృత్తాంతాన్ని ఒక మునికి తాను వినేట్లు చెప్పాడనీ, ఆ వివరాలు దుష్యంతుడికి వివరిస్తాననీ అన్నది శకుంతల. రాజర్షిగా వున్న విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావడానికి తపస్సు చేస్తున్నప్పుడు ఆయన తపస్సు భంగం చేయడాని మేనక వచ్చింది. విశ్వామిత్రుడు ఆమె పొందు కోరుకున్నాడు. వారిద్దరికి బిడ్డ పుట్టింది. ఆ బిడ్డని మేనక మాలినీ నది తీరాన ఉంచి దేవలోకానికి వెళ్లిపోయింది. విశ్వామిత్రుడు తపోవనానికి పోయాడు. ఆ పసిబిడ్డను పక్షులు కాపాడాయి. ఏడుస్తున్న అ అపసిపాపను కణ్వమహాముని చూశాడు. చూసి తన ఆశ్రమానికి తీసుకువచ్చి పెంచాడు. శకుంతలాల వల్ల రక్షించబడింది కాబట్టి శకుంతల అని నామకరణం చేశాడు. తానే ఆ శకుంతలను అని చెప్పింది.

         అప్పుడు దుష్యంతుడు తనలో తాను ఇలా ఆలోచించాడు. ఇక్కడ నన్నయ రాసిన పద్యం ‘ఇది మునినాథ కన్యయని’ మొదలవుతుంది. లోగడ ‘ఇది మునికన్య యేని’ అని రాసిన పద్యం దీంతో అన్వయించుకుని చదవాలి. శకుంతల ముని కన్య యేమో అని మిక్కలి నిరాశతో వున్న దుష్యంతుడి హృదయం ఆమె రాజపుత్రి అని చెప్పడంతో ఎంతో సంతోషించాడు దుష్యంతుడు. నన్నయ రాసిన ఆ పద్యం:

         చ:       ఇది మునినాథ కన్య యని యెంతయు నిస్పృహవృత్తి నున్ననా

హృదయము రాజపుత్త్రి నని యిక్కమలాక్షి నిజాభిజాత్య సం

పద నెఱిఁగించినన్‌ మదనబాణపరంపర కిప్పు డుండ నా

స్పద మయి సంచలించె నళిపాత వికంపిత పంకజాకృతిన్‌

           నన్నయ రాసిన ఈ పద్యాన్ని గతంలో రాసిన పద్యాన్ని కలిపి విశ్లేషిస్తూ డాక్టర్ జివి సుబ్రహ్మణ్యం గారు ‘ఇది మునికన్య యేని’ అనే పద్యం,ఇది మునినాథ కన్య యని’  అనే ఈ పద్యం రెండూ నన్నయ ఈ కథకు పెట్టిన రెండు వెన్నెలలు. దుష్యంతుడి ఉత్తమ చిట్టా వృత్తికి ఉదాహరణలు. ఈ రెండు పద్యాలు నాయకగతమైన స్థాయి పోషణలో రెండు బలమైన బిందువులు”.

         దుష్యంతుడు, శకుంతల ఇరువురు అంగీకరించి గాంధర్వ పద్ధతిలో వివాహం చేసుకుంటారు. ఆయన వల్ల తనకు కలిగిన పుత్రుడిని ఆయన విశాల సామ్రాజ్యానికి యౌవరాజ్య పదవిలో అభిషేకం చేయమని శకుంతల కోరింది. దానికి దుష్యంతుడు అంగీకరించాడు. ఇరువురూ ఇష్ట సుఖాలను అనుభవించారు. దుష్యంతుడు ఆ తరువాత తన నగరానికి వెళ్లిపోయాడు.

         అడవికి వెళ్లిన కణ్వమహాముని తిరిగి వచ్చి జరిగినదంతా తన దివ్య జ్ఞానంతో తెలుసుకున్నాడు. క్షత్రియులకు గాంధర్వ వివాహం శాస్త్ర సమ్మతమే అన్నాడు. శకుంతల గర్భవతి అయ్యి, మూడేళ్లు నిండిన తరువాత కుమారుడు పుట్టాడు. అతడు కూడా తండ్రిలాగా అమోఘమైన బలవంతుడు. తన బాల్యక్రీడాలను అనేక విధాలుగా ప్రదర్శించే వాడు. కొన్నాళ్ల తరువాత కణ్వమహాముని శకుంతలతో కుమారుడిని తీసుకుని ఆమె భర్త దగ్గరికి పొమ్మని చెప్పాడు. ఆమె అలాగే వెళ్లి రాజును సభలో చూసింది. కాని, రాజు ఆమెను గుర్తు బట్టనట్లు చేశాడు. ఆమె హృదయం వికలమై పోయింది. తమ ఇద్దరి మధ్య జరిగినదంతా చెప్పింది. అయినా స్పందన లేకపోవడంతో ధర్మప్రబోధన చేసింది. ఇక్కడ నన్నయ రాసిన రెండు పద్యాలు అద్భుతంగా వున్నాయి. అవి:

         మ:      విపరీత ప్రతిభాష లేమిటికి నుర్వీనాథ! యీ పుత్త్రగా

త్ర పరిష్వంగ సుఖంబు సేకొనుము ముక్తాహార కర్పూర సాం

ద్రవరాగ ప్రసరంబుఁ జందనముఁ జంద్రజ్యోత్న్స యుం బుత్త్రగా

త్ర పరిష్వంగమునట్లు జీవులకు హృద్యంబే కడున్ శీతమే         

           చ:       నుతజలపూరితంబు లగు నూతులు నూఱిటికంటె సూనృత

వ్రత! యొక బావి మేలు; మఱి బావులు నూఱిటికంటె నొక్కస

త్క్రతువది మేలు; తత్క్రతుశతంబునకంటె సుతుండు మేలు;

త్సుత శతకంబుకంటె నొక సూనృతవాక్యము మేలు సూడఁగన్

         దుష్యంతుడు ఇన్ని చెప్పినా అంగీకరించలేదు. ఆమెను ఇంతకు పూర్వం అసలే చూడలేదన్నాడు. ఏడుస్తూ ఆమె తిరిగిపోతున్న సమయంలో ‘ఈ భరతుడు శకుంతల, దుష్యంతులకు పుట్టిన ముద్దు బిడ్డడని, అతడిని స్వీకరించమని దుష్యంతుడికి ఆకాశవాణి అంతా వినేట్లు చెప్పింది. అప్పుడు దుష్యంతుడు జరిగిన విషయాన్ని అందరికీ చెప్పి భార్యను, కొడుకు స్వీకరించాడు. భరతుడు అపారమైన సామ్రాజ్యాన్ని వహించి, లోకంలో ప్రసిద్ధికెక్కి  అనేక సంవత్సరాలు పాలన చేశాడు.

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, ఆదిపర్వం, చతుర్థాశ్వాసం  

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

No comments:

Post a Comment