Sunday, January 10, 2021

శ్రీరాముడు వాలిని చంపడం అధర్మమా? : వనం జ్వాలా నరసింహారావు

 శ్రీరాముడు వాలిని చంపడం అధర్మమా?

వనం జ్వాలా నరసింహారావు

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఆదివారం (10-01-2021) ప్రసారం  

         శ్రీరాముడి బాణం దెబ్బకు వాలి నేలమీద పడిపోయినప్పుటికీ, ఆయన తేజం కాని, పరాక్రమం కానీ, ప్రాణాలు కానీ విడువలేదు. ఇంద్రుడు ఇచ్చిన ఆయన మెడలోని బంగారు సరం వాలి తేజస్సు, ప్రాణాలు, పరాక్రమం, కాంతి పోకుండా కాపాడాయి. బంగారు సరంతో, ప్రాణాలు తీస్తున్న బాణంతో, నిర్మలమైన శరీరంతో వాలి మూడురంగుల ప్రకాశించాడు. శత్రువులను సంహరించే శక్తికల వాలికి, స్వర్గానికి పంపే శక్తికల రామబాణం ముక్తిని కలిగించింది. తాను నేలపడేసినవాడెలాంటివాడో చూడాలనుకుని వాలిని సమీపించాడు శ్రీరాముడు. తనను సమీపించిన రామచంద్రుడిని చూసిన వాలి ధర్మంతో, వినయంతో కూడిన, కఠినమైన మాటలతో ఇలా అన్నాడు.

         “రామా! నువ్వు రాజకుమారుడివి. శాస్త్రజ్ఞానం చక్కగా తెలిసనవాడివి. గొప్పవంశంలో పుట్టావు. కీర్తికి నువ్వు నెలవైనవాడివి. ఇలాంటివాడివై వుండి కూడా యుద్ధభూమిలో నేను ఇతరులతో యుద్ధం చేస్తున్న సమయంలో, చాటున వుండి నా రొమ్ముమీద కొట్టడంలో ఏం గొప్ప వుందో చెప్పు. రామచంద్రా! రాముడు కరుణాజ్ఞానం కలవాడనీ, ప్రజల మేలు కోరేవాడనీ, దయాలక్ష్మికి స్థానమైనవాడనీ, ఉచితానుచితజ్ఞానం కలవాడనీ లోకులు నిన్ను పొగడుతుంటారు. తార నన్ను యుద్ధానికి పోవద్దని, సుగ్రీవుడికి సహాయంగా రాముడు వచ్చాడనీ, ఆయన నన్ను చంపుతాడనీ చెప్పినా వినకుండా వచ్చాను. రాజులకుండే ఉచితమైన సద్గుణాలు రాముడిలో లేకపోతాయా, నన్నేల నిరపరాధిని చంపుతాడని వచ్చాను. నీ చేతుల్లో చచ్చాను. నేను అంటున్న రాజగుణాల్లో ఒక్కటికూడా నీలో లేదు. నువ్వేం రాజువి? సుగ్రీవుడు చెప్పాడని తొందరపడి, కోపగించి, గుణదోషాల విచారణ చేయకుండా, ఇతరులతో యుద్ధం చేసేవాడిని ఎలా చంపాలి? అన్న ఆలోచన చేయక, ధర్మచింతన చేయక, ఎదురుపడి యుద్ధం చేసే ధైర్యం లేక, సత్యాసత్యాలు తెలుసుకోకుండా, పిరికివాడిలాగా దూరంగా మాటువేసి, నీకే అపకారం చేయని నన్ను దండించావు కదా? నువ్వు మోసగాడివి అని తార తెలుసుకుంది కాని నేను తెలుసుకోలేక పోయాను”.

         “రాముడు గొప్పవంశంలో పుట్టాడు కాబట్టి గొప్ప గుణాలు కలవాడై వుంటాడనీ, కళ్యాణ గుణాల మనోహరుడు కాబట్టి హేయ కార్యాలు ఎందుకు చేస్తాడనీ, నేను ఇతరులతో యుద్ధం చేస్తున్నప్పుడు నామీదకు ఎలా వస్తాడనీ, నన్నెందుకు చంపుతాడనీ, ఇలాంటి అకార్యం ఎందుకు చేస్తాడనీ భావించి, నీ ముఖం ఎన్నడూ చూడని కారణాన మోసపోయి ఈ విధంగా యుద్ధానికి వచ్చి నీచేతుల్లో ప్రాణాలు పోగొట్టుకున్నాను. రాజవేషం ధరించిన పాపపు నడవడికలవాడివి నువ్వు. మాయలమారివి. ఈ వాస్తవం తెలుసుకోలేక బుద్ధిహీనతవల్ల ఇలా అయిపోయాను. నీకు నామీద కలహకారణం లేదు. అడవుల్లో వుండి మా ఇష్టప్రకారం ఏదో ఆ వేళకు దొరికిన కాయకూరలు తింటూ బతికే కోతులం. కాబట్టి నీకూటికి అడ్డం రాలేదు. ఇలాంటి నన్ను యుద్ధం చేస్తున్న సమయంలో చంపడానికి కారణం ఏంటి? రాజుల వంశంలో పుట్టి వేదాలను అధ్యయనం చేశావే? ఎందుకీ విధంగా ధర్మాత్ములు ధరించాల్సిన వేషాలు వేసుకుని లోకులకు కీడైన క్రూర కార్యం చేయతలపెట్టావు?”.

         “మేం అడవుల్లో తిరిగేవాళ్ళం. మీరు నగరాల్లో తిరిగేవారు. మేం పండ్లు, కందమూలాలు తిని జీవించే మృగాలం. మీరు ఇష్ట మృష్టాన్నాలు తింటారు.  నేనేమో మృగాన్ని. నువ్వో మనుష్యుడివి. నేను నీ సేవకుడిని. నువ్వు రాజైనా బుద్ధిలేనివాడివయ్యావు. రాజులైనవారు ధర్మవశులై నడచుకోవాలికాని మేమే ప్రభువులం, మేమెలా చేసినా కాదనేవారెవరు? అని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించకూడదు. నువ్వేమో ఇంద్రియాల వల్ల కలతచెంది, కామమే సర్వకాల-సర్వావస్తలలో ముఖ్యమని భావిస్తూ, అది నెరవేరకపోతే కోప్పడుతూ, చెడు-మంచిరాజుల మిశ్రమ నడవడికలవాడివై ప్రవర్తిస్తున్నావు. దానివల్ల నువ్వు మంచివాడివో, చెడ్డవాడివో మాలాంటి వాళ్లకు అర్థం కావడం లేదు. నిన్ను శిష్టుడవని నమ్మలేం, దుష్టుడవని అనలేం. విల్లే ప్రధాన సాధనంగా తలచి, కలహానికి కాలుదువ్వుతూ, బలవంతుడినన్న గర్వంతో, ధర్మం విడిచి మర్యాద వదిలావు”.

         ”ధర్మం రక్షించడంలో నీకు విశ్వాసం లేదు. ధర్మరక్షణ వ్యర్థమని నీ అభిప్రాయం. కోరికల మీద మనసు పోనిచ్చి, ఇంద్రియాలకు వశపడి , అవి ఎలా ఈడుస్తే అలా పోతున్నావు. నీ విషయంలో నేను ఏ రకమైన దోషం చేయలేదు. ఇలాంటి నిరపరాధిని నన్ను నీ బాణంతో చంపావు. ఈ నింద పోవడానికి సజ్జనుల సభలో నువ్వేమని సమాధానం చెప్తావు? నువ్వు రాజవంశంలో పుట్టతగిన వాడివికాదు. రామచంద్రా! ఏం మగవాడివయ్యా? నీ మగతనం నీ భార్యను అపహరించిన వాడిమీద చూపలేకపోయావు కాని, నీజోలికి రాకుండా తటస్థుడిగా వున్న నామీద చూపావుకదా! రామా! నా కంటి ఎదురుగా నిలబడి నువ్వు నాతో యుద్ధం చేస్తే నిన్ను నేను నిమిషంలో రుద్రభూమికి పంపేవాడిని కదా? నేనెంత శౌర్యం కలవాడినైనా చాటుగా వుండి విడిచిన నీ బాణం వల్ల చావాల్సి వచ్చింది కదా?

         “రామా! నీ కథ నాకు కొంచెమైనా చెప్పలేదు. చెప్పినట్లయితే, నువ్వే కారణాన సుగ్రీవుడు కోరిక తీర్చడానికి నన్ను చంపావో, ఆ కపటచిత్తుడైన రావణుడిని యుద్ధంలో కొట్టి, మెడలు వంచి పట్టుకుని, ఇక్కడికి ఈడ్చుకుంటూ తీసుకొచ్చేవాడినికదా? సీతను ఒక్కపూటలో తీసుకునిరానా? గోటితో పోయేదానికి గొడ్డలిని వెతికావుకదా? నా మరణానంతరం తండ్రి రాజ్యభాగంలో అర్హుడైన సుగ్రీవుడు నన్ను ఆ రాజ్యం కొరకు చంపడం న్యాయమే. కాని, ఏ సంబంధంలేని నువ్వు వక్రమార్గంలో నన్ను చంపావు. ఇది తమస్సుతో చేసింది. అధర్మమైనది”.

         అని, నోరు ఎండుతుంటే, బాణం బాధతో శరీరమంతా మండుతుంటే, బాధ సహించలేక శ్రీరాముడిని వూరికే చూసుకుంటూ తేజోహీనుడై వాలి పడిపోయాడు.  వాలి తనను దూషించిన వాక్యాలకు శ్రీరామచంద్రుడు సమాధానం చెప్పాడు. దీనికొరకే వాలి వెంటనే మరణించే విధంగా బాణం వేయకుండా కొన ఉపిరి వుండేట్లు వేశాడు రాముడు. వాలి చనిపోయేట్లు బాణం వదులుతే రామచంద్రమూర్తి వాలిని వధించడానికి కారణం తెలియక లోకులు ఆయన్ను పలురకాలుగా నిందించి వుండేవారు. రాముడు తగిన సమాధానం చెప్పినప్పటికీ కొందరు దుష్టులు ఇప్పటికీ ఆయన్ను నిందిస్తూనే వున్నారు కదా!

         ధర్మార్థయుతంగా, హితంగా, కఠినంగా, అవివేకంగా వాలి పలికిన మాటలకు, ధర్మార్థ గుణ సహితంగా రామచంద్రమూర్తి ఇలా అన్నాడు. “ఓయీ! ధర్మమని, అర్థమని పలికావు. సంతోషమేకాని ధర్మం ఏవిధంగా ఆచరిస్తే పురుషార్థమవుతుంది? ఎప్పుడు అది పురుషార్థం కాదు? అర్థం, కామం ధర్మంతో కూడి వుండేట్లు చేయాల్నా? ఈ విషయం నువ్వు ఆలోచించావా? పోనీ కుల సంప్రదాయం అంటావా? శాస్త్ర విషయంలో సందేహం వస్తే శిష్టాచారం కదా ప్రమాణం? అది ఎలా వుందో ఆలోచించావా? ఏ ఆలోచన చేయకుండా పిల్లతనంగా నన్ను దూషిస్తే నీకు కలిగే లాభం ఏమిటి? పోనీ నువ్వు అడవిలో వుండేవాడివు కాబట్టి నీకు ధర్మశాస్త్రం ఎలా తెలుస్తుందంటావా? తెలుసుకోక పోవడం నీ తప్పు. (ignorance of law no excuse). నువ్వు కులగురువులనో, కులంలో పెద్దలనో, శాస్త్రం తెలసిన పండితులనో, ఆచార శుద్ధులనో అడిగావా? ఎందుకు అడగలేదు? ఇదంతా ఆలోచించకుండా నన్ను దూషిస్తే లాభం ఏంటి?”.

         “ఓయీ! కొండలతో, అడవులతో, తోటలతో, తోపులతో కూడిన ఈ భూమంతా ఇక్ష్వాకుల కాలం మొదలు ఇప్పటిదాకా మా వంశంలో పుట్టిన రాజులదని నీకు తెలుసా? ఈ కారణాన నువ్వు ఇక్ష్వాకు వంశంవారికి సామంతరాజువేకాని స్వతంత్ర ప్రభువువు కాదు. ఇలా వాళ్లు సార్వభౌములైనందువల్ల వారి రాజ్యంలోని సమస్త జనులను, మృగాలను, పక్షులను కూడా రక్షించడానికి, శిక్షించడానికి వారికి అధికారం వుందని తెల్సుకో. ధర్మరక్షణ కొరకు తిరిగే మేం స్వధర్మాన్ని తప్పకుండా భూమ్మీదకల అధర్మాత్ములను భరతుడి ఆజ్ఞమేరకు దండిస్తాం. నువ్వు ధర్మాన్ని వదిలి కఠినమైన, నింద్యమైన కార్యం చేస్తూ అధర్మయుక్తమైన కామాన్నే ప్రధానంగా స్వీకరించి రాజధర్మాన్ని తప్పావు. ఇది నీకు తగునా? నిన్ను చంపిన కారణం చెప్తా విను. సజ్జనులు శ్లాఘించే సనాతన ధర్మాన్ని వదిలి నీ తమ్ముడు బతికుండగా అతడి భార్యను, నీ కోడలి లాంటి రుమను నువ్వు పాపమార్గంలో దుష్కామంతో పొందావు. నీతమ్ముడి భార్యను నువ్వు చెరిచిన కారణాన నిన్నీవిధంగా చంపాల్సి వచ్చింది”.

“నిన్ను దండించడానికి నేనెవర్ని అంటావేమో? చెప్తా విను. నేను క్షత్రియుడుగా పుట్టాను. సనాతన ధర్మాన్ని ‘క్షతమ్’ (చెడి పోకుండా) కాకుండా రక్షించే వాడే క్షత్రియుడు. కాబట్టి ధర్మరక్షణ అనేది నాకు పుట్టుకతో వచ్చిన అధికారం. నేను సింహాసనం అధిష్టించినా, అధిష్టించకున్నా ఈ కార్యం నాకు తప్పదు. అది తప్పితే నేను నా స్వధర్మాన్ని తప్పినట్లే. ధర్మరక్షణ విషయంలో నాకెక్కువ అధికారం వుంది. రాజకుమారుడినైన నేను ధర్మాన్ని లక్ష్యం చేయకుండా కామమే ప్రధానంగా చేసుకుని అతిపాపం చేస్తున్న నిన్ను ఎలా క్షమిస్తాను? ఎలా సహిస్తాను? ఇది సాధ్యమా? నా భార్యను రావణుడు ఎత్తుకుని పోవడం అధర్మమని కదా నువ్వు వాడిని కొట్టి తెస్తానన్నావు. అలాగే పరుడి భార్యను, అదీ తమ్ముడి భార్యను, కోడలులాంటి దానిని పూర్తిగా చెరిచిన నిన్ను ఏం చేయాలో నువ్వే చెప్పు?”.

         “వాలీ! నా మనసులో లక్ష్మణుడు ఎలాగో స్నేహం విషయంలో సుగ్రీవుడు అలాంటివాడే. నావల్ల సుగ్రీవుడికి కలిగే లాభం ఏంటి అంటావా? లక్ష్మి, భూమి, భార్య. అతడి వల్ల నాకు కలిగే లాభం సీతను వెతకడం. ఆ పని అతడు చేయగలడు. మా స్నేహంవల్ల నాక్కావలసింది నాకవుతుంది, అతడికి కావాల్సింది అతడికి దక్కుతుంది. ఇలాంటి స్నేహాన్ని ఏ కారణాన ఉపేక్ష చేసి నీతో స్నేహం చేయమంటావు? ఇంతకంటే ఎక్కువ మేలు నువ్వేం చేస్తావు నాకు? నీ భార్యను హరించిన వాలిని చంపుతానని, వానర రాజ్యాన్ని, ఆయన భార్యను ఆయనకు అప్పగిస్తానని సుగ్రీవుడికి మాట ఇచ్చాను. ఈ మేరకు వానరుల సమక్షంలో ప్రతిజ్ఞ చేసాను. అలా నిండు మనస్సుతో ప్రమాణం చేసి మాట తప్పవచ్చా? కాబట్టి నా స్నేహితుడి కార్యసాధన కొరకు కూడా నిన్ను చంపాను. నువ్వు నిర్దోషివైనా, నా స్నేహితుడుకి విరోధివైనందున నాకు కూడా నువ్వు విరోధివే. నిన్ను చంపడానికి అనేక కారణాలున్నాయి. నువ్వు తనకు విరోధివని సుగ్రీవుడు చెప్పినంత మాత్రానే నేను నమ్మి నిన్ను చంపలేదు. నా కళ్లముందర నా స్నేహితుడు, నా ఆశ్రితుడు, నాకు శరణాగతుడు వేరేవాళ్ల చేతిలో చంపబడడం నేను అలా చూస్తూ సాక్షిగా వుండడం ధర్మమా?”.

ఇలా వాలికి అనేక రకాలుగా ధర్మ శాస్త్ర వాక్యాలను చెప్పాడు శ్రీరాముడు. శ్రీరాముడి మాటలకు సమాధానపడి తనను క్షమించమని కోరాడు వాలి. చెప్పినదంతా సత్యమనీ, దాంట్లో కొంచెమైనా సందేహం లేనేలేదనీ, జ్ఞానం లేకపోవడంతో తానేదేదో అన్నాననీ,  తన్ను క్షమించమనీ,  తానూ ఆయన చేతిలో యుద్ధంలో చనిపోయి ఉత్తమలోకాలకు పోతున్నాననీ,  తన మరణానికి నేను చింతించననీ,  సుగ్రీవుడి మీద ఏ ప్రేమ వుంచాడో ఆ ప్రేమ అంగదుడిమీద కూడా వుంచమనీ అన్నాడు.

         ఇలా చెప్పిన వాలిని సమాదానపర్చాడు రాముడు. “నువ్వు  పాపకార్యం చేశావు కాబట్టి నేను నిన్ను దండించాను. దానివల్ల నువ్వు పాపరహితుడివై ఈ దేహాన్ని విడిచి నిర్మలమైన దేవతాస్వరూపాన్ని ధర్మ మార్గంలో పొందేవాడివయ్యావు. నిన్ను దండించకపోతే నువ్వు నరకానికి పోయేవాడివి. నేను నిన్ను చంపడం ఏమాత్రం అధర్మం కాదు” అన్నాడు. “రామచంద్రా! మహానుభావా! నువ్వు ప్రయోగించిన వాడి బాణం నిప్పులాగా నన్ను కాలుస్తుంటే, ఆ బాధతో తెలివిహీనుడనై నిన్ను తిట్టాను. రామచంద్రా! నన్ను క్షమించు” అన్నాడు వాలి. అలా అంటూనే కొన ఊపిరితో నేలకొరిగాడు. (వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)

No comments:

Post a Comment