Saturday, January 30, 2021

సంపాతి వల్లే సీత జాడ తెలిసిందా? : వనం జ్వాలా నరసింహారావు

 సంపాతి వల్లే సీత జాడ తెలిసిందా?

వనం జ్వాలా నరసింహారావు

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శనివారం (30-01-2021) ప్రసారం

సీతాన్వేషణలో విఫలమై, నిరాశా నిస్పృహలతో  అంగదుడి ఆజ్ఞానుసారం ఏ ప్రదేశంలోనైతే వానరులు చావాలని నిర్ణయించారో, ఏ ప్రదేశంలోనైతే అంగదుడు దర్భల మీద పడుకుంటాడో, అక్కడే, దీర్ఘకాలం జీవించివున్న గద్దలకు రాజు, సంపాతి పర్వతగుహలో నుండి బయటకు వచ్చి, వానరులందరినీ సంతోషంగా చూశాడు. తానున్న చోటుకే దైవం కొత్త ఆహారాన్ని తెచ్చిందనుకున్నాడు. ఈ వానరులను దినానికి ఒకరిని వంతున వరుసగా చంపి తింటాను అనగా ఆ మాటలకు భయపడ్డ అంగదుడు హనుమంతుడితో ఇలా అన్నాడు.

         “ఆంజనేయా! ఆహారం మీద ఆశకల ఆ పక్షిని చూశావా? సీతనే నెపంతో యముడే వానరులను చంపడానికి ఈ రూపంలో వచ్చాడు. మనమేమో శ్రీరాముడి కార్యం నెరవేర్చలేకపోయాం. ఇంతలో తటాలున ఈ ఆపద సంభవించింది. సీతాదేవికి మేలుచేయాలనుకున్న జటాయువుకు ఏం జరిగిందో మనందరికీ తెలసుకదా! అలాంటి గతే మనకిప్పుడు తటస్థించింది. రామచంద్రమూర్తికి ఉపకారం చేయడానికే ధర్మం తెలిసిన జటాయువు శరీరాన్ని విడిచి కీర్తి గడించింది. రావణాసురుడి చేతుల్లో యుద్ధంలో నరకబడి పక్షిరాజు జటాయువు చనిపోయి పరమపదానికి పోయింది. కాబట్టి ఆయనే పుణ్యాత్ముడు. దశరథుడు చావడం, సీతను రావణుడు అపహరించడం వల్ల జటాయువు చావడం, వీటన్నిటివల్ల మనకు ప్రాణాపాయం సంభవించింది”. నేలమీద పడిన వానరులు అంగదుడు చెప్పిన వృత్తాంతం వింటుండగా సంపాతి మనస్సు చలించి, పరితాపం కలగడంతో, ఇలా అన్నాడు.

         “అయ్యో! ఎన్ని రోజులకు నా తమ్ముడి పేరు వినడం జరిగింది! నా ప్రాణాలకంటే వాడు నాకు ప్రియుడు. వాడి మరణవార్త వినడంతో నా హృదయం చలించింది. దండకలో రావణాసురుడికి, వాడికి యుద్ధం ఎందుకు జరిగింది? ఆ యుద్ధంలో వాడు ఎలా చనిపోయాడు? వానరా! ఆ కథంతా చెప్పే నువ్వెవరివి? మీరు గొప్ప మనస్సుతో నన్ను కొండ మీదనుండి కిందకు దింపమని వేడుకుంటున్నాను. నా తమ్ముడు మిక్కిలి బలశాలి. ఎన్నో సుగుణాలను తెలిసినవాడు. అతడిని మీరు పొగుడుతుంటే ఇన్నాళ్లకు ఇక్కడ వినగలిగాను. రామచంద్రమూర్తి తండ్రైన దశరథమహారాజుకు నా తమ్ముడు స్నేహితుడెలా అయ్యాడు? వానరులారా అదంతా వినాలని వుంది. వానర శ్రేష్టులారా! సూర్యకిరణాలతో నారెక్కలు కాలిపోవడంవల్ల నేను కొండ దిగలేను. నామీద కనికరం చూపి నన్ను మీదగ్గరకు తీసుకుపోండి”. వానరులలో కొందరు పోయి దాన్ని కొండమీదనుండి కిందకు దింపారు. అప్పుడు అంగదుడు దాంతో ఇలా అన్నాడు.

         “ఓ పక్షి శ్రేష్టమా! విను. దశరథమహారాజు కొడుకు, రామచంద్రమూర్తి, తండ్రి ఆజ్ఞానుసారం తన భార్యతో, తమ్ముడితో దండకారణ్యంలో ప్రవేశించాడు. ఆ సమయంలో రావణాసురుడు ఆ ముగ్గురూ జనస్థానంలో తిరుగుతున్నప్పుడు రామచంద్రమూర్తి భార్య సీతాదేవిని అపహరించుకుని పోయాడు. అలా తీసుకెళ్తున్న సమయంలో శ్రీరామచంద్రమూర్తి తండ్రికి స్నేహితుడైన జటాయువు జానకీదేవిని చూశాడు. ఆమెను విడిపించాలని ఆకాశంలో పోతున్న రావణుడిని ఎదుర్కుని వాడి రథాన్ని విరిచి ఆమెను భూమ్మీదకు దించాడు. అంతటితో ఆగకుండా రావణుడితో యుద్ధానికి దిగాడు. పక్షిరాజు రెక్కలను, యుద్ధంలో రావణుడు నరికాడు. అంతట జటాయువు మరణించాడు. రామచంద్రమూర్తి అతడికి అగ్ని సంస్కారాలు చేసి ఉత్తమలోకాలు ప్రసాదించాడు. ఆ తరువాత నా పినతండ్రి సుగ్రీవుడితో స్నేహం చేసి నా తండ్రి వాలిని చంపాడు. ఆ తరువాత సీతను వెతకడానికి మమ్మల్ని దక్షిణ దిక్కుకు పంపాడు సుగ్రీవుడు. ఆమెకోసం మేం వెతికాం కాని ఆమె మాకు కనబడలేదు. కార్యం సాధించకుండా వెనక్కు తిరిగిపోతే మా ప్రాణాలు దక్కవు. కాబట్టి ఇక్కడే మరణిద్దామని నిశ్చయించుకున్నాం. ఈ మాట నిజం”. అని చెప్పాడు.

         మరణానికి సిద్ధమైన వానరులు కన్నీళ్లు కారుతుంటే దుఃఖపడుతూ తమ చరిత్రను తెలపగా సంపాతి వారితో ఇలా అన్నాడు. “రావణుడి చేతిలో చనిపోయిన జటాయువు నా తమ్ముడు. అతడి మరణ వార్త తెలిసికూడా రెక్కలు కాలిపోవడం వల్ల, ముసలివాడినైనందున, పగ తీర్చుకునే బలం లేనందున, ఏమీ చేయలేక ఇలా అనాథలాగా పడి సహించి వూరికే వున్నాను. పూర్వం వృత్రుడికి, ఇంద్రుడికి యుద్ధం జరుగుతున్న సమయంలో మేమిద్దరం మా వేగం తెలుసుకోవడానికి, ఒకరినొకరు గెలవాలన్న కోరికతో ఆకాశానికి ఎగిరి, సూర్యమండలం సమీపించడానికి పోవడానికి ప్రయత్నించాం. చక్రాకారంలో గాలిలో తిరుగుతూ, ఆకాశాన మేం పోతున్నప్పుడు సూర్యుడు నడినెత్తికి వచ్చాడు. అప్పుడు తమ్ముడు ఆ ఎండ వేడిని సహించలేక బాధపడ్డాడు. నేనప్పుడు ప్రేమతో అతడికి ఎండ తగలకుండా రెక్కలతో కప్పాను. ఫలితంగా నా రెక్కలు కాలిపోవడం, నేను వింధ్యపర్వతం మీద పడడం జరిగింది. నేనిక్కడ వుండడం వల్ల నా తమ్ముడి గురించిన వార్తలు వినలేకపోయాను”.

         ఇలా అంటున్న సంపాతితో అంగదుడు ఇలా అన్నాడు. “నువ్వు జటాయువు అన్నవే అయితే, నేను చెప్పినదంతా విన్నావు కదా! నీకు తెలిసుంటే, రావణుడు వుండే చోటు ఇక్కడికి దగ్గరలో వుందా? దూరంలో వుందా? చెప్పు”.

         అంగదుడి మాటలకు జవాబుగా వానరులకు సంతోషం కలిగించే మాటలు చెప్పాడు సంపాతి. “నేనిప్పుడు శౌర్యం లేనివాడిని. కాబట్టి నేను విశేష సహాయం మాత్రం చేయలేను. మాట సహాయం తప్పకుండా చేస్తాను. నాకు రావణాసురుడి విషయమే కాదు. రావణుడు తీసుకుని పోతుంటే నిడుపాటి కళ్ళుకల యౌవనవతిని, సమస్త భూషణాలతో ప్రకాశించే దానిని, కన్నీరు కారుస్తూ శరీరం మీద ఆభరణాలను ఒక్కటొక్కటే పారవేస్తూ బాధపడుతున్న ఒక స్త్రీని చూశాను. ఆమె పట్టుచీర రావణాసురుడి మీద పడుతుంటే గమనించాను. ఆమె రామా! లక్ష్మణా! అని ఏడిచింది. కాబట్టి ఆమె సీతాదేవి అని భావిస్తాను. ఆ రాక్షసుడు వుండే చోటు చెప్తా విను”.

         “రావణాసురుడు లంకాపురంలో వుంటాడు. సముద్రానికి ఇక్కడి నుండి నూరామడల దూరంలో ఒక ద్వీపం వుంది. అదే రావణుడు వుండే పురం. ఆ పురంలో, రావణాసురుడి అంతఃపురంలో, రాక్షస స్త్రీల కాపలాలో సీత దుఃఖిస్తున్నది. సముద్రం మీద నుండి దక్షిణ దిక్కుగా మీరు నూరామడలు పోతే, అక్కడ సముద్రమే అగడ్తగా కల లంక వుంటుంది. అక్కడికి పోయి రావణాసురుడిని చూసి, ఫలసిద్ధి పొంది రండి. మీ విస్తార పరాక్రమం చూపడానికి తొందరపడండి. ఆలశ్యం చేయవద్దు. నా జ్ఞాన దృష్టితో చూశాను. మీరు కార్యం సఫలం చేసుకుని రాగలరు”.

“మాకు స్వభావంగా ఇలాంటి దృష్టి కలగడానికి కారణం మేమేమో దూరంగా వున్న ఆహారం తినడానికి పోవాల్సి వుంటుంది. మాకు కావాల్సిన ఆహారం సమీపంలో దొరకదు. ఆ కారణాన భగవంతుడు మాకు దూరదృష్టి ఇచ్చాడు. రాక్షసుడు లోకం నిందించే పని చేశాడు. వానరులారా! దానికి తగ్గ విధంగా మీరు చేయబోయే కార్యం నా తమ్ముడిని చంపినడానికి బదులు కావాలి. సముద్రాన్ని దాటే ఉపాయం వెతకండి. సముద్రం దాటి లంకలో వున్న సీతను చూసి ధన్యులై జై అంటూ కిష్కింధకు మరలి పొండి. చనిపోయిన నా తమ్ముడికి సముద్ర జలంతో తర్పణం చేయాలి. కాబట్టి మీరు నన్ను సముద్రం దగ్గరికి తీసుకుని పొండి”. సంపాతి చెప్పిన విధంగానే వానరులు అలానే చేశారు. మళ్లీ ఆయన వున్న చోటుకు తెచ్చి దింపారు. సీతాదేవి వార్త తెలియడం వల్ల వానరులు సంతోషించారు.

అప్పుడు జాంబవంతుడు లేచి నిలబడి సంపాతితో ఇలా అన్నాడు. “సీత ఎక్కడ వుంది? ఎవరైనా చూశారా? ఆమెను అపహరించిన రాక్షసుడు ఎక్కడివాడు? పక్షిరాజా! అంతా చెప్పి వానరులను రక్షించు. వజ్రసమానమైన రామచంద్రమూర్తి బాణాలను ఆ మూఢుడు లక్ష్యం చేయడం లేదు”.          జాంబవంతుడి ప్రశ్నకు ఇంతకు ముందే సమాధానం చెప్పిన సంపాతి, సీతాపహరణం గురించి తాను విన్నది, కన్నది, సీత వుండే ప్రదేశం గురించి మళ్లీ చెప్పాడు.

         “వానరులారా! వినండి. రెక్కలు విరిగినవాడినైనందున నేనీకొండమీదే వుంటాను. ఇలాంటి నా మీద పితృ భక్తివల్ల నా కొడుకు సుపార్శ్వుడు ఆహారం తెచ్చి ఇచ్చేవాడు. ఒకనాడు ఆకలి వేసి ఆహారానికి ఎదురు చూస్తుండగా సూర్యాస్తమానమైన తరువాత ఆహారం తేకుండానే నా దగ్గరికి వచ్చాడు. ముసలివాడికి కోపం ఎక్కువ కాబట్టి దప్పికతో వాడిని నిందించాను. నన్నాతడు శాంతపరచి ఏమన్నాడంటే, తాను మహేంద్ర పర్వతం దగ్గర వున్న సమయంలో ఎవరో ఒక స్త్రీని తీసుకు పోవడం చూశాడట. వాడు రావణుడనే రాక్షస రాజని సిద్దులు అంటుంటే విన్నాడు నా కొడుకు. ఆ సిద్దులే, దుర్నీతిపరుడైన రావణుడు రాముడి భార్య సీతను బలవంతంగా అపహరించుకుని పోతున్నాడని, రామా! లక్ష్మణా! అని ఏడుస్తున్న ఆ స్త్రీ సీతేనని అన్నారట. ఇలా వారన్నారని నా కొడుకు నాకు చెప్పాడు. వానరులారా! ఏది రామకార్యమో, అది నా సొంత కార్యమే! ఇది సత్యం. ఇందులో సందేహం లేదు. మీరు సుగ్రీవుడు పంపగా వచ్చారు. దేవతలకైనా మీరు అసాధ్యులు. మీకు అసాధ్యం లేదు. కాబట్టి ఆలశ్యం చేయవద్దు”.

తనకు రెక్కలు పోయిన విషయం చెప్పి అవి మళ్ళా ఎలా వస్తాయో నికాశరుడు అనే మునీశ్వరుడు తనతోఅన్న మాటలు చెప్పాడు. “ఇక్ష్వాకు వంశంలో దశరథరాజు పుట్తాడనీ, అతడికి రామభద్రుడు అనే కొడుకు కలుగుతాడనీ, ఆయన తండ్రి మాట ప్రకారం తమ్ముడు లక్ష్మణుడితో కలిసి అరణ్యాలకు వస్తాడనీ, ఆ రామచంద్రుడి భార్య సీతాదేవిని రాక్షసరాజు రావణాసురుడు అపహరిస్తాడనీ, రామదూతలైన వానరులు సీతాదేవిని వెతుకుతూ తను వుండే ప్రదేశానికి వస్తారనీ, వారికి సీతాదేవి వృత్తాతం తెలిపితే నాకు మేలవుతుందనీ, నేను ఈ ప్రదేశం వదిలి ఎక్కడికీ పోవద్దనీ, ఇక్కడే వుండాలనీ నిశాకరుడు నాకు చెప్పాడు. విస్తార కీర్తికల రామచంద్రుడిని చూడాలని ఆశ వుందికాని, అంతకాలం బతకడానికి మనస్సంగీకరించడం లేదు. కాబట్టి దేహాన్ని వదులుతాను” అంటాడు సంపాతి.

         ఇలా సంపాతి చెప్తుండగానే వానరులు చూస్తుంటే సంపాతికి రెక్కలు మొలిచాయి. తన రెక్కలను చూసుకుని సంపాతి సంతోషించాడు. “ఏవిధంగానైనే సరే, ఎంత కష్టపడైనా సరే మీరు సీతాదేవిని వెతకండి. నాకు రెక్కలు వచ్చిన వ్యవహారం చూస్తుంటే మీరు ఆయన చెప్పినట్లు సీతను చూడగలరని నమ్మకం కలుగుతున్నది. నాకు ఆజ్ఞ ఇస్తే నేను ఆకాశమార్గాన పోతాను”. అని చెప్పి సంపాతి వెళ్లిపోగా వానరులు మళ్లీ పౌరుషం తెచ్చుకుని సీతాదేవిని వెతకడానికి అభిజిత్ ముహూర్తానికి ఎదురు చూస్తూ ఆమె వున్న దిక్కుకు పయనించారు.

         రావణుడు వుండే స్థలాన్ని సంపాతి చెప్పడంతో, వానరులు సంతోషంగా విజృంభించి, పొంగిపోతూ, గంతులేస్తూ, పుణ్యాత్మురాలు సీతను చూడాలన్న కోరికతో సముద్ర తీరాన్ని చేరారు. అక్కడ దక్షిణ సముద్రాన్ని తేరిపార చూశారు. వానరుల దేహాలు పులకరించాయి. వివిధ రకాల వికార జంతు సమూహాలతో నిండిన గగుర్పాటు కలిగించే ఆసముద్రాన్ని చూసి, విచారపడి, ఇక ఏం చేయాలి అని, ఎలా దాన్ని దాటాలా అని భయపడ్డారు. అలా భయంతో, దుఃఖంతో, వానర సమూహాలు బాధపడుతుంటే వారిని చూసిన అంగదుడు వారికి ధైర్యం కలిగేట్లు ఇలా చెప్పాడు.

         “ఈ సముద్రాన్ని దాటగల మహాతేజం కలవాడెవరో? నూరామడల సముద్రాన్ని దాటి ఆ వానరుల ప్రాణభయం పోగొట్టగల మహాబలవంతుడు ఎవరో? అలాంటి సామర్థ్యంకల వానర శ్రేష్టుడు, సముద్రాన్ని దాటగలవాడు వుంటే ఆయన వానరులందరికీ ప్రాణదానం చేయుగాక. వానరులారా! మీరు బలవంతులలో ఉత్తములు. అధిక పరాక్రమం వల్ల పొగడబడిన వారు. గొప్ప వంశంలో పుట్టినవారు. ఇలాంటి మీకు ఎలా పోయినా, ఏసమయంలో పోయినా, పోలేని స్థలం లేదు. ఇదివరకు లాగానే ఇప్పుడు కూడా అందరం కలిసి దాటిపోదామా? అని అనుకుంటే, అంతా పోలేరేమోనని అనిపిస్తోంది. అంతా దాటగలిగితే అందరం కలిసే పోదాం. ఈ సముద్రాన్ని ఎవరెవరు వారి-వారి శక్తికొలది ఎంతమేరకు దాటగాలరో ఆలోచించి చెప్పండి” అని అన్నాడు.

         అంగదుడి మాటలకు వానర వీరులు ఎవరికీ వారే ఆ అవకాశం తీసుకోవాలని ముందుకు రాసాగారు. (వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)

No comments:

Post a Comment