Sunday, January 31, 2021

అయోధ్యా నగరంలోని ప్రజలందరు సద్గుణవంతులే ..... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-42 : వనం జ్వాలా నరసింహారావు

 అయోధ్యా నగరంలోని ప్రజలందరు సద్గుణవంతులే

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-42

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (01-02-2021)

దశరథ మహారాజు మంత్రులు బుద్ధిమంతులు-ప్రసిద్ధికెక్కిన వారు-ఇతరుల అభిప్రాయాన్ని వారిని చూస్తుండగానే తెలుసుకొనే శక్తిగలవారు-సదాచార సంపత్తిగలవారు-ధర్మమంటే ఆసక్తిగలవారు-లోకానికి మేలుచేసే ఆలోచనలున్న వారు-న్యాయాన్ని నమ్మేవారు-అపరాధాలు చేయనివారు-ఆలోచనలు చేయడంలో, చేసిన ఆలోచనలను కార్యరూపంలో పెట్టగల సామర్థ్యమున్న వారు-ప్రజల దగ్గరనుండి లంచాలు పుచ్చుకోవాలని గాని, రాజ ద్రవ్యం అపహరించాలని గాని అనుకునేవారు కాదు. మిక్కిలి రాజభక్తిగలవారు. మొత్తం ఎనిమిది మంది మంత్రులు దశరథుడి కొలువులో వుండేవారు-వారి పేర్లు: అర్థసాధకుడు, విజయుడు, సిద్దార్థుడు, ధృష్టి, జయంతుడు, మంత్రపాలుడు, అశోకుడు, సుమంత్రుడు. సుమంత్రుడు తప్ప మిగిలి ఏడుగురు మంత్రులంతా ఒక ఎత్తు-సుమంత్రుడు ఒక ఎత్తు. దశరథుడికి చాలా ముఖ్యుడైన సుమంత్రుడికి అంతఃపురం ప్రవేశించే అధికారం వుంది. వశిష్ఠుడు, వాసుదేవుడు అనే ఇద్దరు దశరథుడి రాజ పురోహితులుగా వుండేవారు. ఇద్దరూ సూర్య వంశ పురోహితులుగా వుంటూ, రాజుల మేలుకోరి-వారు అభివృద్ధి చెందేందుకు అవసరమైన శుభకార్యాలు చేయించేవారు.

అన్వీక్షకి, త్రయి, వార్త, దండనీతి అని పిలువబడే నాలుగు రకాలైన రాజ విద్యలను క్షుణ్ణంగా నేర్చుకున్న దశరథ మహారాజు మంత్రులు, చేయకూడని పనులు చేసేందుకు సిగ్గుపడేవారై- ఇంద్రియ చపలత్వం లేకుండా మంచి నీతి మార్గం తెలిసినవారై-బుద్ధి సూక్ష్మత గల వారై- శాస్త్ర జ్ఞానాన్ని మంచిగా కలిగుండి-పరాక్రమంలో ఎదురులేని వీరులై-మంచి కీర్తిని సంపాదించి, రాజ కార్యాలను మనో వాక్కాయ కర్మలతో నెరవేరుస్తూ, తమను చూసేందుకు వచ్చినవారిని సంతోషంగా తామే ముందుగా పలుకరిస్తూ, బల సంపదలతో, దురాశనేది లేకుండా, ప్రాణాపాయ స్థితిలో కూడా నియమం తప్పకుండా ప్రవర్తించేవారు. దేశ విదేశాల్లో జరిగిన-జరుగుతున్న-జరగబోయే వార్తా విశేషాలను, వేగులవారి నుండి తెప్పించుకుని, విశ్లేషించి, ఏ విషయంలో ఎలా ప్రవర్తించాల్నో అలానే చేసేవారు. వ్యవహారం నడపడంలో సమర్థులు. వీరిలో నీతి-నిజాయితీ ఎంత మోతాదులో వుందోనని తెలుసుకోదల్చిన దశరథ మహారాజు, రహస్యంగా వీరిని చేసిన పరీక్షలన్నిటి లోనూ, వారు నిష్కళంక పరిశుద్ధులని తేలింది. దోషం చేసారని తెలిస్తే, తమ కొడుకులనైనా దండించకుండా విడవని పరిశుద్ధ మనస్కులు దశరథుడి మంత్రులు. దోషం చేయని శత్రువునైనా దండించరు. మంత్రులకు తెలియకుండా ఏ వ్యవహారం జరగదు. రాజుకు-రాజ్యానికి అవసరమైన ధనార్జన విషయంలోగాని, సేనలకు జీతాలు-బహుమానాలు ఇచ్చే విషయంలోగాని, సంపాదించిన ధనం వ్యర్థం కాకుండా రక్షించే విషయంలోగాని మంత్రులంతా కడు సమర్థతతో వుంటారు. దశరథ మహారాజు సభలో వుండి మంచి ఆలోచనలు ఇవ్వడంతోపాటు, యుద్ధ సమయంలోనూ వీరులై, తమ ప్రతాపాన్ని ప్రదర్శించేవారు. శత్రువులను జయించడంలోను, మిత్రులను రక్షించడంలోను ఉత్సాహం కనబరుస్తారు. రాజనీతి శాస్త్రాన్ని క్షుణ్ణంగా చదివినందున, శుచులై-పురజనులను ధర్మ పద్ధతిలో రక్షించే ఔదార్యం కలిగిన ధైర్యవంతులనిపించుకున్నారు.

దోషం చేసినవాడు బ్రాహ్మణుడైనా-క్షత్రియుడైనా-ఇంకెవరైనా, చేసిన నేరానికి-దోషి యోగ్యతను బట్టి ధర్మశాస్త్రం ప్రకారం శిక్ష అమలుపర్చేవారు. మంచిమాటలు చెప్పడంలోను, ఆలోచన చేయడంలోను మంత్రులందరూ ఐకమత్యంతో మెలిగేవారు. రాజు ఎంత సమర్థుడైనప్పటికీ, పురోహితులతోనూ-మంత్రులతోనూ ఆలోచించే రాజ్యపాలన చేసే విధంగా మసులుకునేవారా మంత్రులు-పురోహితులు.

వీరు-వారు అనే భేదం లేకుండా అయోధ్యా నగరంలోని ప్రజలందరు సద్గుణవంతులే. దేహ పుష్ఠికలవారే. అసత్యాలాడనివారే. రాజు మేలుకోరేవారే. అధికారులందరు రాజ్యంలో తాముచేయాల్సిన-చేయాలనుకున్న పనులను కార్యరూపంలో పెట్టి చూపించేవారే కాని, ముందుగానే రహస్యాలు వెల్లడించి కార్యభంగం చేయరు. ఇలా యావన్మంది తనను సేవిస్తుంటే, వేగులవారి ద్వారా లోకంలో జరుగుతున్న విషయాలను కళ్లార చూసినట్లు తెలుసుకుని, తదనుగుణంగా భవిష్యత్ కార్యక్రమాన్ని, మంత్రుల-పురోహితుల సూచనలతో-సలహాలతో రూపొందించే వాడు దశరథ మహారాజు. ఇలా పరిపాలన చేస్తూ, బాలసూర్యుడు కిరణాలతో ప్రకాశించే విధంగా, దశరథ మహారాజు కూడా ప్రకాశించేవాడు.

(సూర్య బింబం కనిపించిన ఏడు నిమిషాల తర్వాత, సూర్య కిరణాలు భూమిని తాకుతాయి. సూర్య బింబం కంటే, సూర్య కిరణాల మూలంగానే, లోకానికి ప్రయోజనం చేకూరుతుంది. అదే విధంగా, రానున్న కాలంలో, అవతరించనున్న రామ-లక్ష్మణ-భరత-శత్రుఘ్నలు, దశరథుడికి సూర్య కిరణాల లాంటివారు. ఉదయాన ఎరుపు రంగులో వుండే సూర్యుడు దర్శనానికి పనికి రాడు. ఎండ వ్యాపించి-బింబం తెల్లగా మారిన తర్వాతే దర్శించడానికి యోగ్యుడు. అలాగే, రామాదుల వలనే దశరథుడు లోకమాన్యుడయ్యాడు. జాయానామ పూర్వుడు, స్వనామ పూర్వుడు, పుత్రనామ పూర్వుడు అనే మూడురకాల పురుషులుంటారు. మొదటి వాడికంటే రెండోవాడు-వాడికంటే మూడోవాడు శ్రేష్ఠుడు. దశరథుడు మూడో రకం వాడు).

No comments:

Post a Comment