Sunday, January 31, 2021

సముద్రాన్ని హనుమంతుడే దాటగలడా? : వనం జ్వాలా నరసింహారావు

 సముద్రాన్ని హనుమంతుడే దాటగలడా?

వనం జ్వాలా నరసింహారావు

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఆదివారం (31-01-2021) ప్రసారం  

సంపాతి మాట ప్రకారం సముద్ర తీరం చేరిన వానరులకు ఆ సముద్రాన్ని ఎలా దాటాలో అర్థం కాలేదు. “ఈ సముద్రాన్ని దాటగల మహాతేజం కలవాడెవరో? నూరామడల సముద్రాన్ని దాటి ఆ వానరుల ప్రాణభయం పోగొట్టగల మహాబలవంతుడు ఎవరో? అలాంటి సామర్థ్యంకల వానర శ్రేష్టుడు, సముద్రాన్ని దాటగలవాడు వుంటే ఆయన వానరులందరికీ ప్రాణదానం చేయుగాక” అన్న అంగదుడి మాటలకు జవాబుగా గవయుడు, గవాక్షుడు, సుషేణుడు, ద్వివిదుడు, మైందుడు, గజుడు, జాంబవంతుడు, గంధమాదనుడు, శరభుడు ఇలా అన్నారు. గజుడు తాను పది ఆమడల సముద్రాన్ని దాటగలనన్నాడు. గవాక్షుడు ఇరవై, గవయుడు ముప్పై, శరభుడు నలబై, గంధమాదనుడు ఏబై, మైందుడు అరవై ఆమడలు దాటగలమని చెప్పారు. ద్వివిదుడు డెబ్బై ఆమడలు, సుషేణుడు ఎనబై ఆమడలు దాటగలమని అన్నారు. ఆ తరువాత జాంబవంతుడు ఇలా అన్నాడు.

“కపులారా! నాకు పూర్వం గమనశక్తి వుండేది. ఇప్పుడు చాలా ముసలివాడినయ్యాను. యౌవనం పోయింది. ఏదెలావున్నా, రామలక్ష్మణులు, సుగ్రీవుడు మనం ఎలాగైనా ఈ కార్యాన్ని సాధిస్తామని నమ్మారు. కాబట్టి దీన్ని ఉపేక్షించరాదు. కాబట్టి ఇప్పటి నా శక్తి ఆలోచిస్తే, తొంబై ఆమడ దాటగల భుజ శక్తి వుండవచ్చునేమో అనిపిస్తున్నది. నా శక్తి ఇంతేనా? అనవద్దు. మీలాగే నేను వయసులో వున్నప్పుడు అసమానబలం, వేగంకలవాడినై వుండేవాడిని. ఆ వయసు గడిచిపోయింది. ముసలితనం వచ్చింది. గమనం తగ్గిపోయింది. బలం కూడా తగ్గింది. కాబట్టి నేనెంత ఉత్సాహం చూపినా ఇంతకు మించి పోలేను. తొంబై ఆమడ పోవడం వల్ల కలిగే లాభం ఏదీ లేదు”.

తానూ నూరామడ పోగలను కాని మరలి రాగలనో, లేదో, సందేహమన్నాడు అంగదుడు. అప్పుడు జాంబవంతుడు, “నువ్వు నూరామడ కాదు వేయామడ కూడా పోగలవు. మరల రాగలవు. అయినా నువ్వాపని చేయకూడదు. రాజు సేవకులతో పని చేయించాలి. కాబట్టి సేవకులు వూరికే కూర్చుండి రాజుకు పనులు చెప్పకూడదు. ఈ వానర సేనకంతా నువ్వు స్వామివి. మేమంతా ఇక్కడ వుండి నిన్ను పంపడం మాకు మర్యాదకాదు. అదే కాకుండా ఈ కార్యానికంతా ఆధారం నువ్వే. మా ప్రభువు కుమారుడివైనందున నువ్వు మాకు ప్రభువువే. కాబట్టి నిన్ను ముందు వుంచుకుని కార్యం సఫలం చేస్తాం” అని చెప్పాడు.

అంగదుడు జవాబుగా, “తాతా! నన్ను పోవద్దంటున్నావు. వేరేవారెవరూ పోవడానికి సిద్ధంగా లేరు. కాబట్టి మళ్లీ ప్రాయోపవేశమే మార్గమా? చావడం ఎందుకు వూరికి పోదామంటావా? సుగ్రీవుడి ఆజ్ఞ నెరవేర్చకుండా అక్కడికి పోతే మన ప్రాణాలుండవు. సుగ్రీవుడు దండించడానికి, రక్షించడానికి సమర్థుడు. కాబట్టి ఏం చేయాలో చెప్పు” అన్నాడు. అప్పుడు జాంబవంతుడు, హనుమంతుడిని కార్యోన్ముఖుడిని చేయడానికి ప్రోత్సహించసాగాడు. హనుమంతుడితో ఇలా అన్నాడు.

         “సర్వశాస్త్రాలలో ప్రసిద్ధమైన పాండిత్య కల వానరవీర శ్రేష్టుడా! పవననందనా! ఎందుకిలా ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా కూచున్నావు? రామకార్యంతో నీకు పనిలేదా? నువ్వు బలంలో, పరాక్రమంలో, తేజంలో, రామలక్ష్మణ సుగ్రీవులు ముగ్గురికీ సమానమైనవాడివి కదా? ఆ ముగ్గురు ఒక ఎత్తు, నువ్వొక్కడివే ఒక ఎత్తు కదా! పక్షిరాజైన గరుత్మంతుడి రెక్కలకు ఎంత బలం, వేగం వుందో నీ బాహువులకు కూడా అంతే వుంది. లోకంలో వుండే అందరికంటే తేజంలో, బుద్ధిబలంలో, ధైర్యంలో నువ్వే అధికుడివి. నీ శక్తి సామర్థ్యాలు నువ్వేల తెలుసుకోలేవు? దానికి కారణం ఏమిటో ఆలోచించు”.

         “అప్సరసలలో శ్రేష్టురాలైన ఒక ప్రసిద్ధ సుందరి శాపవశం వల్ల వానరస్త్రీగా అంజనాదేవి అనే పేరుతో  పుట్టింది. ఆమె కేసరి అనే వానర వల్లభుడికి భార్య అయింది. అత్యంత సౌందర్యవతైన ఆ వానర స్త్రీ ఒకానొక రోజున సంతోషంగా మనుష్యస్త్రీ  స్వరూపం ధరించి, అలంకరించుకుని, మెడలో పూల పూలదండలు వేసుకుని, మృదువైన సన్నటి చీర కట్టుకుని, పర్వత ప్రదేశంలో తిరుగుతున్నది. అప్పుడామె కట్టుకున్న ఎర్రటి అంచుకల పచ్చని దువ్వలువ కొండగాలికి మెల్లగా జారిపోయింది. ఆమె అందమైన ఆకారం చూసిన వాయుదేవుడు, ఆమె భుజాలను పట్టుకుని గట్టిగా కౌగలించుకున్నాడు”.

“ఆమె అప్పుడు భయపడి ‘ఎవ్వడు నా పాతివ్రత్యానికి హానికలిగించాలని చూస్తున్నాడు?’ అని అంది. వాయుదేవుడప్పుడు ‘నీమీద మనస్సు కలిగి నేను కౌగలించుకున్నాను. అంతమాత్రాన నీ పాతివ్రత్యానికి హానిలేదు. నువ్వు భయపడవద్దు. నేను నిన్ను ఎప్పుడూ తాకే వాయుదేవుడిని. నీకు దీనివల్ల కీర్తి కలుగుతుంది. ఈదడంలో, దాటడంలో నాకు సమానమైన కొడుకు, మిక్కిలి వేగంగా పోయేవాడు, పరాక్రమవంతుడు, బుద్ధిబలం కలవాడు నీకు పుట్టుతాడు’. అని చెప్పగా నీ తల్లి మనసులో సంతోషించి అక్కడినుండి వెళ్లిపోయి, ఒక కొండ గుహలో వానర శ్రేష్టుడివైన నిన్ను కనింది”.

“అసమాన కీర్తికలవాడా! ఒకనాడు నువ్వాఅడవిలో ఉదయిస్తున్న సూర్యుడిని చూశావు. అది పండు అనుకున్నావు. నువ్వు ఆకాశానికి ఎగిరి మూడొందల యోజనాలు పోగా సూర్య కిరణాల వేడికి నీ దేహం తపించినప్పటికీ లక్ష్యం చేయకుండా సూర్యుడిని సమీపించగా ఇంద్రుడు కోపంతో నీమీద తన వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. వజ్రాయుధం దెబ్బకు నీ ఎడమ చెంప గాయపడ్డది. అప్పటినుండి నీకు హనుమంతుడు అనే పేరు వచ్చింది. నీకు కలిగిన బాధ చూసి కోపంతో వాయుదేవుడు కొంచెం కూడా సంచరించకుండా స్తంబించి వుండిపోయాడు. దేవతలు కలతచెంది వచ్చి, వాయుదేవుడిని సమాదానపర్చడానికి ప్రయత్నించారు. అప్పుడు వానరేంద్రా! నిన్ను చూసిన బ్రహ్మ నీకు శస్త్రాలతో మరణం లేకుండా వరాలిచ్చాడు. ఇంద్రుడు నువ్వు కోరేవరకూ నీకు మరణం రాకుండా వరం ఇచ్చాడు. నువ్వు కేసిరికి క్షేత్రజుడివి. వాయుదేవుడికి ఔరసుడివి. కాబట్టి గొప్ప తేజస్సుతో దాటులు వేయడంలో నీ తండ్రైన వాయుదేవుడికి సరితూగుతావు”.

“నాయనా! మాకు ప్రాణదానం చేసి మమ్మల్ని రక్షించు. నువ్వీ సమయంలో రక్షించకపోతే మేమంతా చస్తాం. రామలక్ష్మణులు కూడా చనిపోతారు. వారికొరకు విలపిస్తూ అయోధ్యలోని అందరూ చస్తారు. ఇంతమంది ప్రాణాలు నీచేతిలో వున్నాయి. నువ్వు ధైర్యంలో, కార్యసాధనలో, సామర్థ్యంలో రెండో గరుత్మంతుడివి. కొండలు, అడవులతో సహా వున్న ఈ భూమండలాన్ని త్రివిక్రమావతార సమయంలో ఇరవైఒక్క సార్లు ప్రదక్షిణగా తిరిగావు. నువ్విప్పుడు సమస్త సద్గుణాలు కలవాడివి. భూమ్మీద ఉన్నవారిలో బలంలో, దూరం పోవడంలో నువ్వే గొప్పవాడివి. నిన్ను మించినవాడు లేడు. ఏదీ నీ విజృంభణం, పరాక్రమం చూపించు. మా హనుమంతుడు ఇంతటివాడు కదా అని ప్రత్యక్షంగా చూసి సంతోషిస్తాం. వానరోత్తమా లెమ్ము. ఈ సముద్రాన్ని దాటు. ఈ వానరసేనలు నీ వేగాన్ని, పరాక్రమాన్ని చూడడానికి ఆశతో వున్నారు. వీరి కోరిక తీర్చు. నీ శక్తి చూడడానికి కోరికగా వున్నారు వానరులు కాబట్టి నువ్వు ఉపేక్షించ వచ్చా?

(ఉత్తిష్ఠ హరి శార్దూల లంఘ యస్వ మహార్ణవమ్....అనే వాల్మీకి రామాయణంలోని ఈ మాటల ఆధారంగా వాసుదాసు ఆంధ్రవాల్మీకి రామాయణ రచనకు పూనుకున్నారు)

జాంబవంతుడు ఇలా ప్రోత్సహించగా, ప్రేరేపించగా ఆ క్షణంలోనే హనుమంతుడు విజృంభించాడు. వానరులు సంతోషంగా చూస్తుంటే తన దేహాన్ని పెంచాడు.

         నూరామడల వెడల్పుకల సముద్రాన్ని దాటడానికి బలం పెంచుకుని, విజృంభిస్తిన్న హనుమంతుడిని వానరులు చూసి తమ దుఃఖాన్ని వదిలి, సంతోషంచి కిల-కిలమని చప్పుడు చేస్తూ ఆంజనేయుడిని పొగిడారు. ఆంజనేయుడు దేహాన్ని పెంచి విజృంభించగా వానర శ్రేష్ఠులు మేలు-మేలని పొగిడారు. హనుమంతుడు వానరుల మధ్యనుండి లేచి, వానరులలో పెద్దవారికందరికీ నమస్కారం చేశాడు.

         ఆ తరువాత ఆంజనేయుడు తన పరాక్రమం గురించి ఇలా అన్నాడు.“ సముద్రాన్ని దాటడానికి నాకు సమానమైన వారు లేరు. నా తండ్రికి నేనే సమానమైన వాడిని. మేరు పర్వతానికి వెయ్యి సార్లు ప్రదక్షిణ చేసి రావాల్నా? సముద్రంలోని నీళ్లు చేతులతో ఎగజల్లి, కొండలతో, అడవులతో, మడుగులతో నిండిన భూమిని ముంచాల్నా? నేను పొయ్యేటప్పుడు నా పిక్కల వల్ల కలిగిన గాలితో మొసళ్లతో కూడిన సముద్రాన్ని ఆకాశానికి ఎగజిమ్మాల్నా? ఆకాశంలో వేగంగా తిరుగుతున్న గరుత్మంతుడిని వెయ్యి సార్లు ప్రదక్షిణ చేయాల్నా? ఇక్కడి నుండి ఎగిరిపోయి పొడుస్తున్న సూర్యుడిని సమీపించి ఆయన పడమటి కొండ చేరే లోపల నేను ఆకడికి పోయి ఆయన నెత్తిమీద వున్నప్పుడు ఎదురు రావాల్నా? అక్కడి నుండి భూమ్మీద దిగకుండా ఇక్కడికి రాగలను”.

“నా బలవేగంతో ఆకాశాన సంచరించే వాటినన్నిటినీ దాటి పోగలను. నువ్వు గింజంత తునకలయ్యేట్లు భూమిని చీల్చాలా? సముద్రాన్ని ఎండబెట్టాలా? పర్వతాలను చేతులతో పిండి-పిండిగా దంచాలా? తొడల వేగంతో భయంకరమైన సముద్రాన్ని నావెంట వచ్చేట్లు చేయాల్నా? భయంకరమైన దేహం కల ఆంజనేయుడిని ఏమని అనుకుంటున్నారు? రివ్వున నేను ఆకాశంలో పోతుంటే, తీగల్లో, చెట్లలో, వున్న పూలు ఆ వేగానికి తటాలున తెగి నా వెంట వస్తున్నప్పుడు నేను పోయే మార్గం నక్షత్రాలతో దీర్ఘమైన ఆకాశంలాగా చూసేవారికి కనిపిస్తుంది. ఆకాశంలో పైకి ఎగురుతూ, కిందికి దిగుతూ నేను పోయేటప్పుడు ప్రాణికోటులన్నీ ఆశ్చర్యంతో స్పష్టంగా నన్ను చూడగలవు. సముద్ర జలాలను సల-సల వుడికేట్లు చేస్తూ, మహా వేగంగా మేఘాలను అదరగొట్టుతూ వానరులారా! నేను సముద్రాన్ని దాటుతాను. మీరు చూస్తూ వుండండి”.

“బలంలో, వేగంలో వాయువుకు, గరుత్మంతుడికి సమానుమైన వాడిని. నా వెంట పక్షిరాజైన గరుత్మంతుడు, వాయువు తప్ప మరెవ్వరూ రాలేరు. నేను నిమిషంలో ఆకాశానికి ఎగిరి నిరాధారంగా సముద్రాన్ని దాటేటప్పుడు త్రివిక్రమావతారుడైన విష్ణుమూర్తి లాగా ప్రకాశిస్తాను. సీతాదేవిని చూడలేక పోయామే అన్న విచారాన్ని వదలండి. అపాయం లేదు. సంతోషంగా వుండండి. నా అంతఃకరణం ఉత్సాహంగా వుంది. అంతఃకరణం నిర్మలంగా వుంది, ఉత్సాహపూరితంగా కార్యం అవుతుందని చెప్పితే తప్పక జరుగుతుంది. వాయువేగ, గరుడవేగాలకంటే అధికమైన వేగంతో వెయ్యి యోజనాల సముద్రాన్నైనా దాటగలనని భావిస్తున్నాను. అలాంటప్పుడు నూరు యోజనాలు ఒక లెక్కా? పునాదితో సహా లంకానగారాన్ని కూడా పెరికి ఈడ్చుకుని రాగలనని సందేహం లేకుండా తోస్తున్నది”.

ఈ విధంగా మేఘగంభీరధ్వనితో చెప్తున్న వానరాదిపతిని, మహాతేజుడిని చూసి, వానరులంతా ఆశ్చర్యపడి చాలా సంతోషించారు. అప్పుడు జాంబవంతుడు హనుమంతుడిని చూసి, “ఈ వానర మండలమంతా నీకు కార్యసాధనకై, నీకు మంచి దీవెనలు ఇస్తున్నది. మునుల అనుగ్రహ ప్రభావం వల్ల, వానర వృద్ధుల అభిప్రాయం వల్ల, గురువుల దయ చేత, కపిశ్రేష్టా! నువ్వీ మహాసముద్రాన్ని దాటి కీర్తితో ప్రకాశిస్తావు. నువ్వు చేయబోయే కార్యం తపస్వులకు, సాధువులకు సంతోషమైనది. కాబట్టి వారు నిన్ననుగ్రహిస్తారు. కులానికి కీర్తి తేబోతున్నావు కాబట్టి కులవృద్ధులు నిన్నుగ్రహిస్తారు. ఇలాంటి మహాత్ముడు మనకు శిష్యుడయ్యాడు కాబట్టి గురువులు నీమీద దయ చూపుతారు. ఈ బలంతో నువ్వు సముద్రాన్ని దాటుతావు. కీర్తి సంపాదిస్తావు”.

         అప్పుడు ఆంజనేయుడు వానరులతో సహా మహేంద్ర పరవటం కొండ మీదికి పోయాడు. పోయాడు. అక్కడ నానారకాల చెట్లతో, పొదలతో, సకల రకాల మృగాలతో, ఫల-పుష్పాల చెట్లతో, జల ప్రవాహాలతో, సింహాలు, పులులు తిరుగుతూ వున్న, పక్షుల కోలాహలంతో నిండిన, మదించిన ఏనుగులున్న గొప్ప ప్రదేశంలో హనుమంతుడు సంచరించాడు. ఆంజనేయుడి పదఘట్టనతో పీడించబడి, సింహంతో కొట్టబడ్డ ఏనుగులాగా, ఆ పర్వతం వుంది. ఆ పర్వతం తారుమారై, చెదిరిన రాలుగలదై, నీటి వంకలను కక్కింది. భయపడిన మృగాలు, కదులుతున్న చెట్లు, ఎగిరిపోయే పక్షులు, మధుపానసక్తులైన గంధర్వ నాగ దంపతులు, బొక్కల్లో దూరే పాములు కలిగి, దొర్లుతున్న రాళ్లు ఒకదానితో ఒకటి  తగులుతుంటే అవి చాలా బాధపడి నిట్టూర్పులు విదిచాయి. ఆ పర్వతం ధ్వజంతో కూడిన దానిలాగా భయం కలిగించాయి. ఆ పర్వతాలు ఒంటరిగా చిక్కిన బాటసారిలాగా వున్నాయి. అప్పుడు వానరశ్రేష్టుడైన హనుమంతుడు లంకకు పోవాలని నిశ్చయించుకున్నాడు.

         (వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)

 

2 comments:

  1. నమస్కారం నరసింహ రావు గారు!! మీ వ్యాసాలు చాలా బాగుంటాయండీ. నేను గత 5 సం.ల నుంచి చదువుతున్నాను. ముఖ్యంగా శ్రీ వావికొలను సుబ్బారావు గురించి వారి రామాయణ వ్యాఖ్య "మందరం" గురించి మీ ద్వారానే తెలుసుకున్నాను. ధన్యవాదాలు. అయితే ఈ వ్యాసంలో ఈ క్రింది పేరాలో
    “నాయనా! మాకు ప్రాణదానం చేసి మమ్మల్ని రక్షించు. నువ్వీ సమయంలో రక్షించకపోతే మేమంతా చస్తాం. రామలక్ష్మణులు కూడా చనిపోతారు. వారికొరకు విలపిస్తూ అయోధ్యలోని అందరూ చస్తారు. ఇంతమంది ప్రాణాలు నీచేతిలో వున్నాయి. నువ్వు ధైర్యంలో, కార్యసాధనలో, సామర్థ్యంలో రెండో గరుత్మంతుడివి. కొండలు, అడవులతో సహా వున్న ఈ భూమండలాన్ని త్రివిక్రమావతార సమయంలో ఇరవైఒక్క సార్లు ప్రదక్షిణగా తిరిగావు.....

    ఇక్కడ హనుమస్వామి వానావతార సమయంలో భూమండల ప్రదక్షిణ గురించి ఉటంకించారు. వాస్తవానికి అది జాంబవంతుడు కదండీ.

    దయచేసి సవరించగలరు లేదా నా అవగాహననైనా సవరించమని మనవి

    భవదీయుడు
    - శశికుమార్

    ReplyDelete
    Replies
    1. వాసుదాసుగారి మందరంలో వున్నా దాన్ని యధాతథంగా శిష్ట వ్యావహారిక భాషలో గాథలుగా రాయడం తప్ప నేను స్వంతంగా ఏదీ చేర్చలేడండీ. అందులో ఈ విధంగానే వున్నది. ధన్యవాదాలు. జ్వాలా

      Delete