Friday, February 12, 2010

1909 లో ముద్రించబడిన శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం పీఠిక-వనం జ్వాలానరసింహా రావు

SREEMATH ANDHRA VALMIKI RAMAYANAM
PREFACE TO 1909 PUBLICATION
రామాయణంలో ఏముంది-ఆంధ్ర వాల్మీకి రామాయణం ఎందుకు చదవాలి?
WHY VALMIKI RAMAYANAM IS GREAT?
QUINTESSENCE OF ANDHRA VALMIKI RAMAYANAM
వనం జ్వాలానరసింహా రావు

శ్రీ రామాయణం, భారతం, భాగవతం అద్వితీయమైన గీర్వాణ భాషా గ్రంథాలు. వేద వేదాంత అర్థోపబృంహితంబులు. ఈ మూడింటి లో ఆద్యమైంది శ్రీ రామాయణ కావ్యం. కావ్యాలలోకెల్లా ప్రధమంగా ఉత్పన్నమైంది కావడంతో ఆదికావ్యమైంది. శ్రీమద్రామాయణం-ఉత్తర కాండ 94వ సర్గలో చెప్పినట్లు రామాయణాన్ని చక్కగా తెలిసినవారు-అర్థం చేసుకోగలిగిన వారు మాత్రమే లోకానికి అందలి విషయాలను వివరించ సమర్థులు. అందరికీ అది సాధ్యమయ్యేది కాదు. (రామాయణ తత్వాన్ని తనకు తెలిసినంత వరకు ఆంధ్ర వాల్మీకంలో చెప్ప సాహసించానని, తన ఆ సాహసానికి క్షమించమని వాసు దాసు గారు పాఠకులకు విజ్ఞప్తి చేశారు).

మన పూర్వీకులకు తెలియని నాగరికతలు లేవు. మన పూర్వులు ఏ కారణం వల్ల ఆర్యులయ్యారు? వారు ఎటువంటి గుణాలు కలిగి, ఎటువంటి మహోన్నత స్థితిలో వుండే వారు? వారి నాగరికత విధానం ఎటువంటిది? వారి కులా చార ప్రవర్తనలెలావుండేవి? రాజుకు-ప్రజలకు మధ్య ఐకమత్యం ఎలా వుండేది? భార్యా-భర్తలు, సోదరులు, తల్లి తండ్రులు, పుత్రులు పరస్పరం ఎలా ప్రవర్తించేవారు? సుఖ-దుఃఖాల విషయంలో స్త్రీ-పురుషులు ఏ విధమైన నడవడి గలవారు? వారికి దేవుడంటే ఎలాంటి ఆలోచన వుండేది? దైవాన్ని వారెలా ఆరాధిస్తుండే వారు? ఇలాంటి లౌకిక విషయాలను తెలుసుకోవాలనుకునే వారికి శ్రీ రామాయణాన్ని మించి తెలిపే గ్రంథం ఎక్కడా లేదు.

జనన మరణ చక్ర బంధంలో ఇరుక్కొని, పరిభ్రమిస్తూ, ఆ బాధ తొలగించుకునేందుకు పారలౌకిక చింత కలిగి, నిరామయమై-నిత్యమై-నిర్మలమైన పరమపదానికి పోవాలనుకునే కోరికగల వారికి, కరతలామలకంగా సుఖమైన మార్గాన్ని బోధించగల గ్రంథం శ్రీ రామాయణం తప్ప మరొకటి లేదు. కాలక్షేపానికి చదవడానికైనా శ్రీ రామాయణం లాంటి పుస్తకం ఇంకోటి లేదు. ఏ విధంగా చదివినా, చదివిన తర్వాత, సమయాన్ని సద్వినియోగం చేశామన్న తృప్తినిచ్చేది రామాయణమే. శ్రద్ధా భక్తులతో చదివినవారికి కల్పవృక్షంలా కోరిన కోరికలు తీర్చేదీ రామాయణమే. కాబట్టి, ఇహ-పర లోకాల్లో సుఖపడాలనుకునేవారికి, శ్రీ రామాయణ పఠనం అవశ్య కర్తవ్యం.

భరత ఖండంలో శైవులని, వైష్ణవులని, శాక్తేయులని భిన్న మతాల వారున్నారు. అయితే వీరిలో కొందరు వైష్ణవులకు శైవుడంటే ఇష్టం లేకపోవడం, అలానే నారాయణుడి పేరంటే నే ముఖం చిట్లించుకునే శైవులుండడం అందరికీ తెలిసిందే. ఐనప్పటికీ, శ్రీ సీతారాముల పేరు విన్న ప్రతి ఆర్యుడు మనస్సులోనైనా భక్తితో నమస్కారం చేసుకోవాల్సిందే. ఇలా సీతారాములు సార్వజనీన సం పూజ్యులు కావడానికి కారణమేంటి? హరిశ్చంద్రుడి లాంటి సత్యాత్ములు, ధర్మరాజు లాంటి ధర్మాత్ములు, దమయంతి-సావిత్రి లాంటి పతివ్రతలు లేరా? వారి మీద ఎంత గౌరవం వున్నా లోకులు వారిని పూజించడం లేదే? మరి, సీతారాములలో విశేషమేమిటంటే, వారు అవతార మూర్తులు కావడమే ! ఎవరెవరు-ఏ ఏ పేరుతో పిలిచినా, భగవంతుడనేవాడు ఒక్కడే అని ఆర్యుల నమ్మకం. భిన్న-భిన్న రూపాల్లో దర్శనమీయుడం భవత్కలళా విశేషం. అలాంటి భగవంతుడే, శ్రీరాముడుగా, లోక రక్షణార్థం జన్మించాడన్న నమ్మకమే, లోకులందరు ఒకేవిధంగా శ్రీ సీతారాములను అర్చన చేయడానికి కారణమైంది. ప్రత్యక్షానుభవమున్న భక్తులే దానిలోని గూడార్థాన్ని వెల్లడిచేయగల సమర్థులు-శక్తిమంతులు. అలాంటివాడైన వాల్మీకి మహర్షి ఆ అవతార రహస్యాన్ని, తాను గ్రంథస్థం చేసిన శ్రీ రామాయణంలో, "కంఠోక్తి ఘోషించినాడు".

"శ్రీ రామాయణం" అంటే, లక్ష్మీరమణుడైన శ్రీమన్నారాయణుడి మాయా మానుషావతారమైన శ్రీరామ చరిత్రనీ, శ్రీ లక్ష్మీదేవి అవతారమైన సీతాదేవి చరిత్రనీ అర్థం. దంపతుల మాదిరిగా, వారి "అభిధానంబులు అనపాయంగా" వుండినట్లే, తత్త్వమెరిగిన మహాత్ముడు వాల్మీకి మహర్షి, తను రచించిన ఆది కావ్యానికి శ్రీ రామాయణం అని పేరు పెట్టాడు. ఇందులో సీతాదేవి మహాత్మ్యాన్ని విశేషించి చెప్పడంవల్ల వాల్మీకి మహర్షే, శ్రీ రామాయణాన్ని "సీతాయాశ్చరితం మహత్తు" అని వెల్లడిచేశాడు. ఈ చిత్రం గ్రంథం పేరులోనే కాకుండా, గ్రంథమంతా కనపడుతుంది. శ్రీరామచంద్రుడు మనుష్యుడివలె నటిస్తుంటే, వాల్మీకే మో వాస్థవార్థం చెప్తూ, ఆయన సాక్షాత్తు భగవంతుడే అంటాడు. రాముడి చర్యల ద్వారా, రాముడి వాక్కుల ద్వారా తాను చెప్పదల్చుకున్న దాన్ని సిద్ధాంతీకరించాడు వాల్మీకి. శ్రీరాముడు భగవంతుడేనన్న అర్థం, హారంలోని సూత్రంలాగా, రామాయణంలోని ఏడు కాండల్లోనూ వ్యాపించి వుంది. రామాయణాన్ని చదివేవారందరు, ఈ అర్థాన్ని మనస్సులో పెట్టుకొని, ఇందులోని ప్రతి అంశాన్ని-ప్రతి వాక్యాన్ని హెచ్చరికతో శోధించాలి. ఇలా ఆసక్తిగా శోధించిన వారికి-పరీక్షించిన వారికి మాత్రమే, వాల్మీకి రామాయణానికి-ఇతర రామాయణాలకు (ఆ మాటకొస్తే, ఏ భాషలో వున్న ఏ గ్రంథాలకు) గల తారతమ్యం, వాల్మీకి రామాయణంలోని గొప్పదనం తెలుస్తుంది. కవి హృదయాన్ని తెలుసు కోకుండా, ఆయన శైలిని అనుసరించకుండా చదివినవారికి, అందులోని సారాన్ని అర్థంచేసుకోలేక , ఆ శక్తి హీనతను వాల్మీకి దోషంగా భ్రమించి సంతోష పడవచ్చు.

శ్రీ రామాయణం మహాకావ్యం. పుట్టుకతోనే కాకుండా గుణంలో కూడ అదే మొదటిది. దానిలోని గుణాలు, రహస్యాలు తెలుసుకోవాలంటే వాల్మీకికి గాని, సర్వజ్ఞుడికి గాని మాత్రమే సాధ్యమవుతుంది. అనంత కల్యాణ గుణ విశిష్టుడైన భగవంతుడిని, దయావంతుడని-సర్వజ్ఞుడని-సర్వ శక్తిమంతుడని, ఏవో కొన్ని గుణాలు వర్ణించి సంతసించడానికి, రామాయణం చదివిన వారు, వారి వారి శక్తికొలది కొన్ని గుణాల వరకు అర్థంచేసుకోవచ్చు. వాస్తవానికి, అర్థం చేసుకునే ప్రయత్నం చేసినా కొద్దీ, శ్రీమద్రామాయణంలో ఉత్తమోత్తమ మహాకావ్య లక్షణాలెన్నో వున్నాయి. వర్ణనలెన్నో వున్నాయి. రామాయణం గానం చేసినా, పఠించినా మనోహరంగా వుంటుంది. లోకంలో కొన్ని కృతులను పాడుతుంటే శ్రావ్యంగా వుంటాయి గాని, మామూలుగా చదువుతుంటే, నీరసంగా అనిపిస్తాయి. కొన్నేమో, చదవడానికి ఇంపుగా వున్నా, రాగానికి-తాళానికి అనువుగా వుండవు. రామాయణం అలాంటి కోవకు చెందింది కాదు. చదివినా, పాడినా మధురమే. ఆ విషయం గ్రంథంలోనే వుంది. ఆ ప్రకారమే కుశ లవులు పాడారు కూడా.

రామాయణంలో శృంగారం లాంటి నవ రసాలున్నాయి. అందులో శృంగార రసం "సంభోగ శృంగారం". సీతారాముల కల్యాణం తర్వాత అయోధ్యలో వారు అనేక ఋతువులు ప్రియంగా గడిపిన వర్ణన ఉదాహరణగా తీసుకోవచ్చు. భార్యా భర్తల పరస్పర అనురాగం ఇంతకన్నా మించి వర్ణించడం ఎవరితరం కాదు. వాల్మీకి శ్లోకాల (ఆంధ్ర వాల్మీకి పద్యాల) భావం మాత్రమే కాకుండా, అందులోని కొన్ని పదాలు ఎంత అర్థ గాంభీర్యం గలవిగా-రసవంతంగా వుంటాయో చెప్పలేము. వాల్మీకి వాక్యామృత రసాన్ని నిరంతరం ఆస్వాదన చేసిన భవభూతి వర్ణించినట్లు ఇందులో హాస్యం (శూర్పణఖ-త్రిజటల వృత్తాంతం), కరుణ (ఇష్ట వియోగం వల్ల అనిష్ట సంభవం, దశరథుడి చావు), వీర (లక్ష్మణుడి వృత్తాంతం), రౌద్రం (రావణుడి వృత్తాంతం), భయానక (మారీచాది వృత్తాంతం), బీభత్సం (కబంధ-విరాధుల వర్ణన), అద్భుతం (రావణ యుద్ధంలో), శాంతం (శబరి వృత్తాంతం) రసాలను కనుగొన వచ్చు.

ఇక అలంకారాల విషయానికొస్తే, శబ్దాలంకారాలని, అర్థాలంకారాలని రెండు రకాలున్నాయి. రామాయణంలో శబ్దాలంకారాలు తరచుగా కనబడవు. అంత్యానుప్రాసలు కొన్ని చోట్ల వున్నాయి. శ్రీమద్రామాయణం స్వభావోక్త్యలంకారాలకు పుట్టిల్లు. స్వభావోక్తులు దేశకాలవక్తృ స్వభావాలను అనుసరించి చెప్పబడ్డాయి. వర్షాన్ని వర్ణన చేసిన సందర్భంలో మన ఎదుట వర్షం కురుస్తున్నట్లే వుంటుంది. హేమంతాన్ని వర్ణిస్తుంటే, మనకు మంచులో తడుస్తున్నామా అనిపిస్తుంది. అడవులలో జరిగినవి, మనమెప్పుడూ చూడనివి-విననివి చదువుతుంటే, మన కళ్లకు కట్టినట్లే వుంటుంది. తన వర్ణనా చాతుర్యంతో వాల్మీకి, పాఠకులను, తన చేతిలో బొమ్మలా చేసి, ఇష్టమొచ్చినట్లు ఆడుకుంటాడు. ఆయన ఏ విషయాన్ని వర్ణించినా అది మన కళ్ల ఎదుట జరిగిన భావం కలుగుతుంది. ఇక ఉపమాన అలంకారాల విషయానికొస్తే, వాల్మీకి కాళిదాసుకే గురువనిపిస్తాడు. రావణ వధానంతరం రాముడు సీతతో అన్న మాటలకు అర్థం వెతుకుతే, ఆ ఉపమానంలో, సీత నిర్దోషురాలనీ-శంక అనే దోషంతో బాధ పడినవాడు రాముడనీ స్పష్టంగా తెలుస్తుంది. అలానే, రావణుడు సీతను అపహరిస్తున్నప్పుడు రాసిన శ్లోకం కూడా. దానర్థం: సీత లోకమాత అయినందున ఆమెను రావణుడు పట్టుకోవడం తల్లిని పట్టుకోవడమంత మహా ఘోరమైన కార్యమని. ఇంద్రజిత్తు మరణం తర్వాత వాడి సేనలకు పట్టిన గతిని వర్ణిస్తూ రాసిన శ్లోకం మరో చక్కటి ఉదాహరణ.

వాల్మీకి మరో ప్రత్యేకత "ఉత్ప్రేక్ష". లంకలో- అశోక వనంలో ఒక "వంక" పారుతుంటుంది. దాని తీరంలో వున్న చెట్ల కొమ్మలు నీళ్లలో వేలాడుతుండడం వల్ల, నీరు వెనక్కు పోతుంటుంది. ఈ సామాన్య విషయాన్ని వాల్మీకి (ఆంధ్ర వాల్మీకి) ఎలా ఉత్ప్రేక్షించినాడో చదివి తీరాల్సిందే. "ఆ పర్వతం పైనుండి కిందకు పారుతున్న సెలయేరు, చూడడానికి, మగడి తొడపై నుండి కోపంతో దిగిపోతున్న స్త్రీలా వుంది. వేలాడుతున్న కొమ్మలు ప్రవాహాన్ని అడ్డగించడంతో, వెనుదిరుగుతున్న నీటి కదలిక సన్నివేశం, బంధువుల బుజ్జగింపులకు సమాధానపడి-శాంతించి, మగడి వద్దకు మరలిపోతున్న ఆడదానిలా వుంది" అన్న అర్థం వస్తుంది ఆ శ్లోకానికి-పద్యానికి. అలానే ఆయన వాడిన శ్లేషాలంకారాలు.

శ్లేషాలంకారానికి చక్కటి ఉదాహరణ వాల్మీకి నోట వెలువడిన ప్రథమ శ్లోకం.

"మానిషాద ప్రతిష్ఠాం త్వ! మగ మ శ్శాశ్వతీ స్సమాః
యత్క్రౌంచ మిథునాదేక! మవధీః కామమోహితం"

వేదాన్య విషయంలో కలిగిన ఈ ఆదిమ శ్లోకానికే నిషాద పరంగా ఒక అర్థం, భగవత్ పరంగా రెండో అర్థం వున్నాయి. ఆంధ్ర వాల్మీకంలో దీన్ని ఇలా పద్యంగా మలిచారు కవి.

"తెలియు మా నిషాదుండ ప్రతిష్ఠ నీక
ప్రాప్తమయ్యెడు శాశ్వతహాయనముల
గ్రౌంచ మిథునంబునందు నొక్కండు నీవు
కామమోహిత ముం జంపు కారణమున"

"ఒక బోయవాడు క్రౌంచ మిథునంలో వున్న మగ పక్షిని చంపడం, ఆడ పక్షి అది చూసి దుఃఖించడం, పరమ దయామయుడైన వాల్మీకి అది చూసి, బోయవాడు చేసిన అధర్మ కార్యానికి కోపగించి అతడిని ఈ శ్లోకంలో శపించడం జరిగింది. ఇదే రామాయణ ఉత్పత్తికి కారణమైన శ్లోకం కావడంతో నాంది శ్లోకం అయింది. కాబట్టి దీనికి భగవత్ పరంగా ఒక అర్థం వుంది. రామాయణంలోని ఏడు కాండల అర్థం-కథ ఇందులో సూక్ష్మంగా సమర్థించబడింది.

లక్ష్మణుడు రాముడితో అరణ్యాలకు వెళ్లే ముందర తల్లికి నమస్కారం చేసినప్పుడు, సుమిత్రా దేవి కుమారుడికి చేసిన బోధనను తెలియచేసే శ్లోకానికి పండితులు అనేక అర్థాలను చెప్పారు. అందులో సార్వజనీన సమ్మతమైనవి-ప్రధానమైనవి మూడర్థాలు. సంగ్రహంగా అవి:

మొదటిది: "ఇదివరకు నీవు రాముడికి కుడిచేతిలా, వెలుపల ప్రాణంలా వుండేవాడివి. ఆ భక్తితోనే ఇప్పుడు ఆయన వెంట అడవులకు పోతున్నావు. ఇదివరకు రాముడు మహారాజ కుమారుడు. పట్టణంలో అనేక భోగాలను అనుభవిస్తుండే వాడు. నువ్వూ అలానే సుఖానికి హాని లేకుండా అన్నను కొలుస్తుండే వాడివి. ఇక మీద అలా కాదు. చేయబోయేది సకల దుఃఖ నిలయ కాననవాసం. అదికూడా ఒక రోజు కాదు. 14సంవత్సరాలు. పరివారంతో కాదు-ఒంటరిగా. నువ్వే పరిచారకుడవు. అలాంటి కష్ట కాలంలో నీకు విసుగు కలగవచ్చు. జ్ఞాత వెంట నేనెందుకు కష్టాల పాలు కావాలని అనుకుంటావేమో. అలా భావించ వద్దు. అడవిలో వున్నా, పట్టణంలో వున్నా, ధనికుడైనా, దరిద్రుడైనా తండ్రి ఎలా పూజనీయుడో, పితృసమానుడైన రాముడలానే. తండ్రిమీద ఎలాంటి గౌరవం వుంచాలో అలాంటిదే శ్రీరాముడి మీదుంచు. అలానే, నామీద నీకెలాంటి గౌరవం వుందో అలాంటిదే సీత మీదుంచు. అడవిని దుఃఖాలయంగా భావించ వద్దు. సుఖమైన అయోధ్యగా భావించు. సుఖ దుఃఖాలు మనఃకల్పితాలు. నీ మనస్సు నీ వశంలో వుంటే ఎక్కడున్నా నీకు సుఖ దుఃఖాలు సమానమే"

రెండోది: అదే "రాముడ యెరుంగుమీ దశరథుడు నిజము" అన్న సుమిత్ర మాటలకు మరో అర్థం రాముడు అడవులకు పోయిన తర్వాత ఆయన తండ్రి జీవించడని-అది నిజమని. "నీ తండ్రి ఎప్పుడు మరణించునో అప్పుడు నా గతేంటి? ఇక్కడే మో కైక ప్రభుత్వం. ఆమెకు నా మీద ద్వేషమన్న సంగతి నీకు తెలిసిందే. నీ తండ్రి లేకుండా, రాముడు లేకుండా, నువ్వూ లేకుండా నన్ను కైక ఇక్కడ వుండనిస్తుందా? కాబట్టి నేను పుట్టిల్లు చేరాల్సినదాన్నే. అక్కడ నాకు ప్రతిష్టేముంటుంది? దశరథుడి భార్య అన్న గౌరవం నశించింది. అక్కడివారు మన రాజు కూతురు పుట్టింటికి వచ్చిందని నన్ను-నా తండ్రిని చులకనగా అంటారు. అలాంటప్పుడు అయోధ్య గతి ఏమందువా? అయోధ్యే అడవి కాగలదు"

మూడోది: "కుమారా-నేనెందుకు జ్ఞాతైన రాముడి వెంట అడవికి పోయి ప్రాణాపాయానికి లోనుకావాలనీ, నన్నెవ్వరు పొమ్మన్నారనీ, నాకై నేను చెట్టు కొట్టి మీద వేసుకొనడమెందుకనీ, నేను పోతే కలిగే లాభమేమిటనీ, పోకపోతే నష్టమేంటనీ సందేహిస్తున్నావేమో ! అలాంటి ఆలోచనలు చేయవద్దు. లక్ష్మీనారాయణులుండే స్థలమే వైకుంఠం. అడవియే వైకుంఠం. అలాంటి ఏకాంత సేవ దొరకడం దుర్లభం. కాబట్టి-నాయనా, తదేక ధ్యానంతో భగవత్ సేవను అరణ్యంలో చేసుకో" అని బోధించెను.

ఇలా నానార్థాల పద్యాలను అన్వయించేందుకు ఆంధ్ర వ్యాకరణ సూత్రాలను సమయోచితంగా అనుసంధానం చేసుకోవాలి.

అలంకార శాస్త్రంలో ఎన్ని అలంకారాలు చెప్పబడ్డాయో, అవన్నీ వాల్మీకి (ఆంధ్ర వాల్మీకి)రామాయణంలో వున్నాయి. వాల్మీకి అసమాన కవితా చాతురి వర్ణనాతీతం. మరొక్క ఉదాహరణ చిత్రాలంకార ఉపయోగం. రావణుడు సీతాదేవిని అపహరించిన తర్వాత, శ్రీరాముడు ప్రియా వియోగానికి దుఃఖిస్తూ, అడవిలో జనులెవ్వరూ వుండకపోవడంతో, కళ్లకు కనిపించే పక్షి-వృక్ష-మృగాలను సంబోధించుకుంటూ పోతూ-పోతూ, రావణుడు జటాయువుతో యుద్ధం చేసిన స్థలానికి సమీపంలో వున్న ప్రస్రవణగిరిని చూస్తాడు. చూసి " ఓ పర్వత రాజా ! నా వల్ల ఒంటరిగా, రమ్యమైన ప్రదేశంలో విడువబడిన సర్వాంగ సుందరైన సీత నీ చేత చూడబడెనా" అన్న ప్రశ్న వేసిన శ్లోకం (పద్యం) చక్కటి చిత్రాలంకారం. వృక్షాలకు-నదులకు వలె కాకుండా, కొండలకు ప్రతిధ్వని ఇచ్చే గుణం వుంది. దీన్ని మనస్సులో పెట్టుకున్న కవి ఈ శ్లోకాన్ని (పద్యాన్ని) రచించారు. ప్రతిధ్వనిలో మనం అన్న మాటలే మనకు తిరిగి వినపడ్తాయి. "నీవు చూశావా?" అంటే "నీవు చూశావా?" అని ప్రతిధ్వని వస్తుంది. అలా వినబడిందని రాస్తే సారస్యం లేదనుకున్న వాల్మీకి ప్రతిధ్వనిగా వినపడిన శ్లోకాన్ని " ఓ రాజ శ్రేష్టుడా ! రమ్యవనదేశమందు నీ చేత ఒంటరిగా విడువబడిన సర్వాంగ సుందరి నా చేత చూడబడె" అని అర్థం వచ్చే ట్లు రాశారు. ఇలా ప్రశ్న-జవాబు ఒక్క వాక్యంగానే వుంటే చిత్రాలంకారం అవుతుంది. ఇంత దీర్ఘంగా ఊహించి రాసిన కవి ఇంతవరకూ ఒక్క వాల్మీకే. అలంకారాల వరకెందుకు? సాధారణ విషయాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా ఏదో ఒక చమత్కారాన్ని కనబరిచేవాడు.

వాల్మీకి రామాయణంలోని పాత్రలు-పాత్రధారుల వాక్కులు, ఆయా పాత్రల చిత్త వృత్తి గుణాలను తెలియచేసేవిగా, సందర్భోచితంగా, వారున్న అప్పటి స్థితికి అర్హమైనవిగా వుంటాయి. దశరథుడి మృతి గురించి కైక భరతుడికి చెప్తూ, "ఎల్ల భూతములకు నెయ్యదిగతి నీదు తండ్రి యట్టిగతికి దనయ యరిగె" అని అంటుంది. తానేదో ఘనకార్యం సాధించినట్లు కైక చెప్పిన పద్ధతిలో, తన భర్త చావు గురించి, తన కుమారుడితో ఏ తల్లైనా చెప్తుందా? ఇదే వాల్మీకిలోని ప్రత్యేకత. ఇదే వార్తను భరతుడు శ్రీరాముడితో మరోలా చెప్తాడు. "నిను దలంచియ యేడ్చుచున్.... ..... నీదు దర్శన కాంక్షియై..... ..... జనకు డక్కట యస్తమించెను జాల నిన్నె స్మరించుచున్" అని దీనోక్తిగా అంటాడు. వినాశ కాలానికి నోటినుంచి విపరీత వాక్యాలే వస్తాయి. శుభ వాక్యాలు, అశుభ వాక్యాలుగా అవుతాయి.

మరో సందర్భంలో, మొట్టమొదట వానరుల మీదకు యుద్ధానికి పొమ్మని ధూమ్రాక్షుడుని ఆజ్ఞాపించాడు రావణాసురుడు. ఆజ్ఞాపిస్తూ, "నీవు వధార్థమై మదవ నేచరయుక్తుడు రాముమీదికిన్" అంటాడు. రావణుడి కోరిక రామాదులను చంపటానికే అయినా, "నువ్వు చావడానికి" అన్న విపరీతార్థం వచ్చింది ఆయన మాటల్లో. శ్రీరామచంద్రుడు ఎలా "ఆత్మవంతుడో" అలానే కుంభకర్ణుడు "వపుష్మంతుడు". అతడిది సహజ శక్తి. వరబలం కాదు. కేవలం దేహం మీదే దృష్టి నిలిపేవాడి కుండే పెద్దదేహముందతడికి. బలం, తాగుబోతు దనం, నిద్దురబోతుదనం, తిండిబోతుదనం లాంటి గుణాలన్నీ పరిపక్వదశకొచ్చి వాడిలో నిలిచాయి. ఇలాంటి వాడు, తను రాముడి మీదకు యుద్ధానికి పోతానని రావణుడితో అంటాడు. ఆయన చెప్పిన మాటల్లోనూ విపరీతార్థం స్పష్టంగా స్ఫురిస్తుంది. ".... బోదు హతుడుగాగ, రామవిభు డక్షయంబుగ రమణి సీత బొంద గలుగును..." అని కుంభకర్ణుడుతో అనిపించాడు వాల్మీకి.
పాత్ర గుణ మహాత్మ్యానికి అసంగతమైన వాక్యాలు ఆయా పాత్రల నోటినుంచి వెలువడవు. శ్రీరాముడు భగవంతుడన్న అభిప్రాయం వాల్మీకి పదే పదే చెప్పుకుంటూ పోయాడు రామాయణంలో. అలాంటప్పుడు, ఆయన భగవంతుడే అయితే, తనకు జరగాల్సిన పట్టాభిషేకం ఆఖరు క్షణంలో విఘ్నమైనప్పుడు సీతతో "... చెలియ యువరాజు నన్నిప్డ చేయురేడు" (... "ధ్రువ మద్యైవ మాం రాజా, యౌవరాజ్యే భీషేక్ష్యతి") అని ఎందుకు చెప్పాడన్న సందేహం కలగొచ్చు. వాల్మీకి ఆ సందర్భంలో రాసిన శ్లోకార్థాన్ని పరిశీలించడానికి ముందు, అదే విషయం ప్రస్తావిస్తూ, అంతకు పూర్వం జాగ్రత్తగా చెప్పిన రామ వాక్యాలను అర్థం చేసుకోవాలి. శ్లోకంలో బాహ్యార్థం స్పష్టంగా తెలుస్తూనే వుంది. అంతరార్థంలో రాముడు చెప్పిందేంటి? తన పట్టాభిషేకం గురించి తల్లి-తండ్రి ఆలోచిస్తున్నారని అంటాడు. ఇది వాస్తవం. ఏమని ఆలోచిస్తున్నది-పట్టాభిషేకం చేయాలనా? వద్దనా?- అనేది విశదపర్చచలేదు. అలానే మిగతా సందర్భాలలో చెప్పిన రామ వాక్యాలన్నీ పరిశీలించుకుంటూ పోతే-అర్థం చేసుకుంటూ పోతే ఆయన అవతార ప్రయోజనం గురించి తెలుసుకోవచ్చు. ఉదాహరణకు సీతతో అన్న " .. నా యర్థవృద్ధికై తొందరపెట్టు బతిని.." అన్న రామ వాక్యాలనే తీసుకోవచ్చు. అర్థ వృద్ధి అంటే లోకాభిప్రాయం ప్రకారం "పట్టాభిషేకం-ధన వృద్ధి". అయితే రాముడి అభిప్రాయం వేరు. "నా ప్రయోజనం గురించి" అంటే, తాను రావణవధాది కార్యాలు చేసే ప్రయోజనం గురించి అని అర్థం. ఇదే అర్థాన్ని వచ్చేటట్లు శ్రీరాముడు మునులతో కూడా అంటాడు తన మనస్సులో మాటగా.

రాముడి మనస్సులో వున్న అర్థం రావణవధాదికమే. సర్వసముడగు భగవంతుడని పేరుపొందిన రాముడు, తల్లిదండ్రులమీద ద్వేష బుద్ధిగలవాడు ఎలా అవుతాడు? కాడు. కాబట్టి వారిపై నున్న సదభిప్రాయంతోనే ఒకచోట "సభ యెట్టిదో దూత యట్టివాడ" ని చెప్ప బడింది ఆయన మాటలుగా సీతకు. ఆయన అవతార ప్రయోజనం నెరవేరాలంటే, పట్టాభిషేకం చేసుకుని రాజుగా అయోధ్యలో వుండకూడదు. అరణ్యాలకు పోవాలి. ఆ పని జరగాలంటే పట్టాభిషేకం విఘ్న కారి. కాబట్టి జరగబోయేదేంటటే, "... చెలియ యువరాజు నన్నిప్డ చేయురేడు" (... "ధ్రువ మద్యైవ మాం రాజా, యౌవరాజ్యే భీషేక్ష్యతి"). దానర్థం "రాజు ఇప్పుడు నన్ను యువరాజు చేయడు" అని.

వాల్మీకి రామాయణమనే "కలశార్ణవం" లో రత్నాలను వెదికేవారు, మొట్టమొదటగా తెలుసుకోవాల్సింది వాల్మీకి శైలి-విధానం. అది తెలుసుకోలేక వెతకడం మొదలుపెట్టితే, చీకట్లో తారాడినట్లే. ఒక విషయం గురించి చెప్పాల్సిందంతా ఒకచోట చెప్పడు. కొన్ని సందర్భాలలో ఆ విషయానికి సంబంధించిన ప్రస్తావనే వుండదు. అదే విషయం మరెక్కడో సూచన ప్రాయంగా వుండొచ్చు. ఒక్కోసారి విపులంగా విశదీకరించబడి వుండొచ్చు. ఆయన చేసిన వర్ణనలను బట్టి, ప్రయోగించిన పదజాలాన్ని బట్టి, పాఠకులు ఊహించుకోవచ్చు. ఒకే విషయం, ఒకటి కంటె ఎక్కువ సార్లు చెప్పితే, ఒక్కోసారి ఒక్కోరకమైన విశేషంతో చెప్పబడుతుంది. ఇలాంటి చిత్రాలు అనేకం వుంటాయి.

సుందర కాండలో సీతాదేవి హనుమంతుడిని ప్రశ్నించిన వాక్యాలు ఇంకో ఉదాహరణ. "కౌసల్యయు సుమిత్ర కపివరా! భరతుండు, కుశలులే? .. భరతుండు.. యక్షౌహిణీసేన నంపునయ్య?" అని అడుగుతుంది సీత హనుమంతుడిని. ఎక్కడి పంప? ఎక్కడి పంచవటి? ఎక్కడి అయోధ్య? ఎక్కడి క్షేమ సమాచారం? ఎక్కడి సేన రావడం? ఈ సందేహాలన్నీ పాఠకులకు కలగొచ్చు. అయితే ఉత్తర కాండ చదివినవారికి, భాతృవత్సలుడైన భరతుడు, దూతలద్వారా శ్రీరామాదుల సమాచారాన్నంతా, వారు పంచవటి విడిచి పోయిందనక తెలుసుకుంటుండేవాడని స్పష్టంగా తెలుస్తుంది.

వాల్మీకి (ఆంధ్ర వాల్మీకి) రామాయణం "ధ్వని కావ్యం". కావ్యానికి ప్రధానమైంది ధ్వని. కావ్యానికి ప్రాణం ధ్వని. ధ్వని లేని కావ్యం శవంతో సమానం. రామాయణంలో ధ్వని విశేషంగా వుంది. కావ్యమంతా ధ్వన్యర్థం వుండడమే కాకుండా, పలు శ్లోకాలకు విడిగా ధ్వన్యర్థం వుంది. రుతు వర్ణనలలో ధ్వని స్ఫురిస్తుంది. ఉదాహరణకు, సుందర కాండలోని "తతో రావణ నీతాయాః సీతాయా..." (తరువాత రావణాసుర, వరనీత ధరాత్మజాత...") అన్న శ్లోకానికి ఆచార్య పరమైన అర్థం ధ్వని. అలానే మరో శ్లోకంలో గురువు ఎలాంటివాడై వుండాలో ఆ లక్షణాలను వివరించబడింది. ఇలాంటి అర్థ బాహుళ్యం గల శ్లోకాలు వందల కొద్దీ వున్నాయి.

శ్రీ రామాయణ అంతరార్థాన్ని పెద్దలు ఇలా చెప్పుకుంటారు: భగవంతుడు ఒక్కడే పురుషుడు. తక్కిన దంతా స్త్రీ మయం అన్న నియమం ప్రకారం, సీతే జీవుడు. ఆ జీవుడు భగవంతుడిని ఆశ్రయించి వున్నంతవరకు ఎలాంటి ఆపదా కలగదు. కర్మవశాన దుర్భుద్ధితో, మాయా మయమైన ప్రకృతి పదార్థాల (మాయ జింక) మీద ఆసక్తి కలిగితే, మోక్ష సాధనానికి విరుద్ధమైన అలాంటి బుద్ధి మళ్లీ పుట్టకుండా చేయడానికి భగవద్వియోగం కలుగుతుంది. వెంటనే దేహ ప్రాప్తి (లంక) కలుగుతుంది. అందులోని రావణ-కుంభకర్ణులు అహంకార-మమకారాలు. ఏకాక్షి ప్రభృతులు ఇంద్రియాలు. అనుభవంతో బుద్ధిమంతులు కావల్సినవారు, వాటికి చిక్కి అవస్థ పడుతున్నప్పుడు, జీవుడికి వివేకం కలిగి-పరితపించడం ప్రారంభించి, తన మీద భగవంతుడికి దయ కలుగుతోందా-తన దగ్గరకు చేర్చుకుంటాడా, అని విలపిస్తారు (సీతా విలాపం). తనను ఆశ్రయించిన జీవుడు ఇలా అజ్ఞానం వల్ల కష్ట దశలో పడిపోయెగదా అని అత్యంత దయాళుడైన భగవంతుడు బిడ్డకొరకు తండ్రి దుఃఖించినట్లు, జీవుడికంటే ఎక్కువగా పరితపిస్తాడు (రామ విలాపం). జీవుడికి ధైర్యం కలగడానికి, భగవంతుడికి తనపై అనురాగం వుందని చెప్పి భయపడ వద్దని తెలియచేయడానికి ఆచార్యుడిని (హనుమంతుడు) పంపుతాడు. ఆచార్యుడు అక్కడకు (లంకకు) పోయి అతడి చేష్టలన్నీ తెలుసుకొని, ధైర్యం చెప్పి, మరల భగవంతుడితో జీవుడు అనన్య భక్తుడనీ-ఆయనే దిక్కని నమ్మినాడనీ (నియత-యక్షత), కాబట్టి భగవంతుడే కాపాడాలనీ వేడుకుంటాడు. భగవంతుడు ప్రతిబంధకాలను అణచివేసి, చిత్తశుద్ధి పరీక్షించి (సీత అగ్ని ప్రవేశం) మరల తన దగ్గర చేర్చుకుంటాడు. దానర్థం: అనన్యాసక్తుడై, దృఢ నిశ్చయంతో, జీవుడు భగవంతుడిని సేవిస్తుంటే, అతడికి కావల్సిందంతా భగవంతుడే నెరవేరుస్తాడు. సుందర కాండ చదివేటప్పుడు పాఠకులు తమను సీత గాను, శ్రీరాముడిని భగవంతుడి గాను భావిస్తే ఈ అర్థం స్పష్టంగా తెలుసుకోవచ్చు.

వాల్మీకి రామాయణంలో, సాధారణంగా, సర్గ మొదట్లో- చివర్లో, మొదలు చెప్పిన కథనే సంగ్రహంగా తిరిగి చెప్పడం జరిగింది. ఇది కాకుండా, యజ్ఞాలు-శకునాల లాంటివి చెప్పవలసి వచ్చినప్పుడు, వర్ణించిన విషయాన్నే మరల వర్ణించాల్సి వస్తే, పూర్వోక్త శ్లోకాలనే మళ్లీ చెప్పడం జరిగింది. వీటినే పునరుక్తులు అనవచ్చు. ఇలాంటిది ఆ కవి కవితా విశేషమే గాని మరొకటి కాదు. రావణుడు రాముడిని గురించి అనుకున్న శ్లోక పాదంలో, రాముడు తనను అదే విషయం గురించి అనుకున్న శ్లోకంలో ".. .. మానుషం మన్యే రామం దశరథాత్మజం" అన్న పదాలుంటాయి. "విదితం", "ఆత్మానం" అన్న పదాలు మారతాయి. రావణుడు మనుష్యుడి చేతిలో చావడం విధి. కాబట్టి తన విరోధి (రాముడు) మనిషి అని అనుకోకుండా భగవంతుడని నమ్మితే చావు రాదు. ఇక సమర్థుడైన నర్తకుడు తాను ధరిస్తున్న పాత్రను ఉచిత రీతిగా నటించడానికి, తన్ను-తాను మరిచినట్లు, మనుష్య వేషం వేసి నటిస్తున్న రాముడు చేయాల్సిన పనిమీదున్న ఆసక్తితో తనను తాను మరిచి పోయాడు. ఉభయుల అభిప్రాయం ఒకటే కావడంతో రాముడి చేతిలో రావణుడు చచ్చాడు-రాముడు రావణుడిని చంపగలిగాడు. ఇలాంటివే ఒకే తరహాలో వున్న, సుగ్రీవుడు రాముడితో-లక్ష్మణుడితో చెప్పిన వాక్యాలు.

కొన ఊపిరితో వున్న జటాయువుని, శ్రీరాముడు సీతాదేవి వార్తను అడుగుతుండగానే అతడు ప్రాణాలను విడిచాడు. ఇలాంటి సందర్భంలో ఎవరికైనా, బతికుంటే ఏం చెప్పేవాడో కదా అనిపిస్తుంది. ఇలాంటిది నివారించేందుకు, సంపాతి అంగదాదులతో, రావణుడి వృత్తాంతాన్ని చెప్పే సందర్భాన్ని ఎంచుకున్నాడు వాల్మీకి. అక్కడా-ఇక్కడా ఉమ్మడి వాక్యాలున్నాయి. అర్థం మారింది. జటాయువు చెప్పని రావణుడి వూరు-పేరు ఇక్కడ సంపాతితో చెప్పించాడు కవి. వాల్మీకి మహర్షి "కవితౌత్కృష్ట్యానికి" వేరే దృష్టాంతం అవసరమా? శ్రీరాముడు శరభంగుడితోను, సుతీక్ష్ణుడితోను ".. నీ వనమున వాసయోగ్య మగు పట్టెది చెప్పుము" అని భగవంతుడిలా పలికి, వెంటనే మనుష్య భావంతో మాట్లాడే చమత్కారం వాల్మీకి రామాయణం ప్రత్యేకత. ఇలాంటివెన్నో వున్నాయిందులో. చదివే పాఠకులు, ఈ అద్భుత విశేషాలను స్వయంగా ఆస్వాదించవచ్చు.

శ్రీ రామాయణంలోని కవితా చమత్కృతిని విశదీకరించాలంటే, ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇంతెందుకు ! కాళిదాసు, భవభూతి అంత గొప్ప వాళ్లు కావడానికి రామాయణమే కారణం. వాళ్లు రామాయణాన్ని ఎన్ని సార్లు చదివారో గాని, వారి కవితా వల్లి "వాల్మీకి వాక్సుధాసేచనం" లో జీవించి, వృద్ధి పొందిందనడం నిర్వివాదం. శ్రీ విశిష్టాద్వైతం మతోద్ధారకుడైన శ్రీ రామానుజాచార్యులు పద్దెనిమిది పర్యాయాలు గురు ముఖంగా రామాయణాన్ని పఠించి వ్యాఖ్య రాశారు. ఒక్కసారి కూడా గ్రంథమంతా చదవకుండా, సంస్కృత భాష తెలియకపోయినా, "పూర్వ పక్షం" రాసేవారెందరో వున్నారు ! వారెలాంటి ప్రాజ్ఞులో కదా !

"ఒక్క ఏరునో-నదినో చూసిన మాత్రాన అదెంత గొప్పగా వుందో అనుకుంటాం. అలానే కాళిదాసు లాంటి వారిని గొప్ప కవులంటాం. అలాంటప్పుడు అన్ని నదులకు ఆధారమైన సముద్రాన్ని ఏమనాలి? అలానే, కాళిదాసాదులకు జీవనదమైన రామాయణాన్ని ఏమని వర్ణించాలి? మన మతంలో వున్న ఏదో ఒక సుగుణాన్ని గ్రహించి, దాన్నే విస్తరించి చెప్పుతూ, అన్య మతాలు ప్రసిద్ధికెక్కినట్లే, ఉపమా విషయం, కాళిదాసుని వలె ఇతర కవుల ఇతర గుణాలను ఒక్కొక్కదానిని ఇందుండి గ్రహించి, దానిని తమ చిన్న కావ్యాలలో విశేషంగా చొప్పించి ప్రసిద్ధులయ్యారు". ఆర్య మతంలా, వాల్మీకి రామాయణం గొప్పదై, పామరులకు ఇందులోని అన్ని విషయాలను అర్థం చేసుకోవడం దుస్సాధ్యం కావడంతో, పిల్ల మతాల లాగా ఇతర గ్రంథాలు ప్రసిద్ధికెక్కాయి. మహర్షైన-మహా యోగైన వాల్మీకెక్కడ? ఇప్పటి (అప్పటి) కవులెక్కడ?

కాళిదాసు రచనలోని "అస్మాన్ సాధు విచిం త్యేత్యాది" శ్లోకాలలోని విశేషాలను, వాల్మీకి రామాయణం "అహం వేద్మి మహాత్మానం...., ఇయం సీతా మమ సుతా...." (ఏ నెరుంగుదు రాజేంద్ర !......, ఈ సీత నాదుకూతురు, నీ సహధర్మచరి, దీనినిం గైకొనుమా....") శ్లోకాలలోని, ప్రతి పద సారస్యాన్ని నిశితంగా పరిశీలించితే, కాళిదాసు వాల్మీకి శిష్యుడని తెలియడమే కాకుండా, గురు శిష్యుల తారతమ్యం స్పష్టంగా బయట పడుతుంది. కాళిదాసు "విక్రమోర్వశీయం" నాలుగో అంకం శ్లోకంలోని ఒక్క పదం తప్ప మిగతా దంతా, వాల్మీకి రామాయణంలో ఇంతకుముందు రాసిందే. ఇరువురి శ్లోకాలలోని ఉమ్మడి వాక్యాలిలా వున్నాయి: "... .... క్షితిభృతాంనాథ ! దృష్టా సర్వాంగసుందరీ రామా! రమ్యవనోద్దేశే, మయా విరహితా త్వయా". "కచ్చిత్" కు బదులుగా "సర్వక్షితి" అన్న ఒక్క పదాన్ని చొప్పించాడు కాళిదాసు. ఇలా వాల్మీకి రామాయణం నుంచి కాళిదాసు లాంటి వారు గ్రహించినవి ఎన్నో వున్నాయి. వేదవ్యాసుడంతటి వాడు వాల్మీకి శ్లోకాలను అనువదించగా లేంది, వేరేవారి సంగతి చెప్పాలా !

ఎవరికైనా సత్కవి కావాలని కోరికుంటే, వారు వాల్మీకి రామాయణాన్ని అనేక పర్యాయాలు, శ్రద్ధగా-భక్తితో పఠించాల్సిందే.
శ్రీమద్రామాయణం గొప్ప ధర్మ శాస్త్రం. ఇందులో సర్వ విధాలైన, అన్ని రకాల ధర్మాల గురించి వివరంగా చెప్పబడింది. రాజ ధర్మం, ప్రజా ధర్మం, పతి ధర్మం, సతీ ధర్మం, భాతృ ధర్మం, పుత్ర ధర్మం, భృత్యు ధర్మం, మిత్ర ధర్మం లాంటి అన్ని ధర్మాలను గురించి చక్కగా తెలుపబడి వుంది. లాభ-లోభ-పక్షపాత బుద్ధి లేకుండా, న్యాయం మీదే దృష్టి నిలిపి వాదించే న్యాయవాది ధర్మం కూడా చెప్పబడింది. వీటితో పాటు కథా సందర్భానుసారంగా, అంతరాంతరాలలో ఎన్నో నీతులు చెప్పబడ్డాయి.

సత్ ప్రభు లక్షణం తెలుసుకోవాలంటే, రామ-దశరథుల రాజ్య పాలనా విధానంలో దొరుకుతుంది. ఆర్య ప్రభువులు ఏ పని చేసినా ప్రజల అనుమతి లేకుండా చేయలేదు. తాము ప్రభుత్వం నడిపేది ప్రజలకొరకేనని, వారిని సుఖ పెట్టడానికేనని వారు భావించేవారు. ప్రత్యక్షంగానైనా-పరోక్షంగానైనా ప్రజలకు హాని కలిగించే పనేదీ చేయరు. శ్రీరాముడి పట్టాభిషేకం గురించి దశరథుడు చేసిన (అయోధ్య కాండ) ఉపన్యాసం ఇందుకో ఉదాహరణ. ప్రజల దగ్గర పన్నులు తీసుకుంటూ, వారి కష్టాలు తొలగించకపోతే నరకంలోకి పోతామని వారి నమ్మకం (అరణ్య కాండ).

ప్రభువైన వాడు ధర్మాన్ని ఆధారంగా చేసుకొని, వేగులవారి ద్వారా, ప్రజల కష్ట సుఖాలను తెలుసుకోవాలి. ప్రజలు ఇష్టపడని గుణాలు తనలో వుంటే, ఎంత నష్టమైనా-కష్టమైనా అవి మానుకోవాలి. ఆ విషయంలో రాజు అంతఃకరణం చెప్పింది ముఖ్యం కాదు. ఇతరులను సంతోష పెట్టడానికి తనెందుకు దుఃఖపడాలని అనకూడదు. ఈ విషయంలో రాముడే ప్రమాణం.

శ్రీరాముడు పట్టాభిషేకం జరిగిన తర్వాత ఒక నాడు వేగులవాడైన భద్రుడిని నగరంలో- పల్లెల్లో వార్తలేంటని, తమను గురించి ప్రజలేమనుకుంటున్నారని అడిగాడు. జవాబుగా వాడు, తనను లోకులందరూ ప్రశంసిస్తున్నారని చెప్తే, అంతటితో తృప్తి పడలేదాయన. ఉన్నదున్నట్లు-విన్నది విన్నట్లు అసలు విషయాలన్నీ చెప్పమంటాడు రాముడు. భద్రుడప్పుడు లోకుల పొగడ్తల మాటలు ముందు చెప్పి తర్వాత, "తామసుడగు రాక్షసు గృహసీమను జిరకాల మట్లు చెరబడిన సతిన్, రాముడు రోయక కూడెడి, గాముకులగు వారి కెందు గన్నులు గలవే" అని ప్రజలు వారికి తోచినట్లనుకుంటూన్నారని అంటాడు. అతడు చెప్పిన మాట సత్యమని ఇతరులతో దృఢపర్చుకొని, భరతాదులను పిలిపించి, లక్ష్మణుడితో లంకలో జరిగిన సంగతంతా చెప్పి, ".. అపవాదము దుస్సహమై, తపియింపగ జేసె నన్ను.... .... విడిచెద మిమ్మెల్లర, నే విడిచెద నా ప్రాణమేని, విమల యశము కై...." అంటూ, సీతను వాల్మీకాశ్రమానికి పంపాడు రాముడు. ఒకడిపైన ఇంతకంటే అసత్యమైన అపవాదం పడుతుందా? అలాంటి అపవాదాన్ని పోగొట్టుకోవడానికి ఇంతకంటే స్వార్థ పరిత్యాగం చేసిన వాడుంటాడా? కాబట్టి, ప్రతి మనిషి, తనను చూసి ఇతరులు తప్పు తోవలో ప్రవర్తించకుండేట్లు, లోకోపకారమైన మార్గాన్నే అనుసరించాలి.

సత్ ప్రభువు ప్రజల సుఖ దుఃఖాలను అనుదినం విచారించాలి. సీతా వియోగానంతరం, లక్ష్మణుడు తిరిగొచ్చేంతవరకు, నాలుగు రోజులు, కొలువు దీర్చలేదు రాముడు. దానికి "మర్మనికృంతన మైన బాధ" పడుతూ లక్ష్మణుడితో వెంటనే కొలువు తీర్చమని చెప్పి పరితపించాడు.

అలాంటి అనురాగం గల ప్రభువు విషయంలో, ప్రజలు కూడా అలానే వుండేవారు. అతడితో అడవులకు పోవడానికి, ప్రాణాలైనా పరిత్యజించడానికి అంగీకరించారు. ప్రభువు తానెంత గొప్పవాడైనా, తక్కువ వారితో కూడా కలిసి-మెలిసి వుండాలి. దీన్నే సౌశీల్యం అంటారు. గుహుడికి రాముడిని చూడగానే తటాలున కౌగలించు కోవడానికి వాళ్లిద్దరి మధ్య ఎంత స్నేహం వుండాలో కదా? అలానే రాజు ఎంత తెలిసినవాడైనా, మంత్రుల ఆలోచనలను-సలహాలను తిరస్కరించకూడదు. వారు చెప్పింది విని, వారితో తాను చేయదల్చుకుంది, సరైందని నమ్మే విధంగా సమాధానం ఇవ్వాలి. విభీషణుడు శరణు చొచ్చినప్పుడు జరిగిన సంగతి ఇందుకొక ఉదాహరణ. ఇంతెందుకు? రాముడి గుణగణాలను చక్కగ అర్థం చేసుకుంటే, రాజుకుండవలసిన సద్గుణాలే కాకుండా, సాధారణంగా ప్రతి పురుషుడికి వుండాల్సిన, సత్యం-దయ-ఇంద్రియ నిగ్రహం-పితృభక్తి-ఏక పత్నీనియమం-సౌభ్రాత్రం-దైవ భక్తి-దేవతారాధనం-నిత్య కర్మానుష్ఠానం విపులంగా ఆయనలో వున్నాయని తెలుసుకోవచ్చు.

ఇక ఉత్తమ స్త్రీల లక్షణాలన్నీ కలిగున్నవారిగా సీత, కౌసల్య, సుమిత్రల గుణాలను బట్టి, నీచ స్త్రీల లక్షణాలున్న వారిగా కైకేయి, శూర్పణఖల గుణాలను బట్టి తెలుసుకోవచ్చు. రావణాసురుడు చెడిపోవడానికి ఎన్నో కారణాలు కనిపిస్తాయి రామాయణంలో. ఇంద్రియాలను జయించ లేకపోవడం, అసత్యాలు పలకడం, వేగుల వారు లేకపోవడం-వున్న వారికి సరైన జీతాలు ఇవ్వక పోవడం, తన పరిసరాలో జరుగుతున్న వృత్తాంతాలను తెలుసుకోలేక పోవడం, విన్న ప్రతి విషయాన్నీ నమ్మడం-నిజా, నిజాలు మంత్రులపైన పడవేయడం, తన మేలుకోరి చెప్పగలవారికి-జ్ఞాన హీనతతో చెప్పేవారికి మధ్య తేడా తెలుసుకోలేక పోవడం, ఎవరినీ నమ్మక పోవడం, మూర్ఖత్వం లాంటి పలు దుర్గుణాలు వున్న రావణుడు సమూలంగా నాశనమయ్యాడు. పైన పేర్కొన్న విషయాలన్నీ, శూర్పణక, మారీచుడు, విభీషణుడు చెప్పిన మాటల్లో బయట పడుతుంది. రాముడితో యుద్ధమెందుకు చేయవలసి వచ్చిందో-యుద్ధ కారణమేంటో తన భటులకే తెలియనీయక వంచన చేసి, వారి ప్రాణాలను తీసిన (రావణాసురుడి లాంటి) ప్రభువు ఎలాంటి వాడో రామాయణం చదువుతే అర్థమవుతుంది.

ఇలాగే, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల చర్యల వలన భాతృ ధర్మం, సుగ్రీవుడి చర్యల వలన మిత్ర ధర్మం, హనుమంతుడి చర్యల వలన భృత్యు ధర్మం తెలియ చేయబడ్డాయి రామాయణంలో. అరణ్య వాసానికి పోయేటప్పుడు శ్రీరాముడు తల్లి కౌసల్యతో (అయోధ్య కాండ) అన్న మాటల్లో సతీ ధర్మం ఏమిటో తెలుసుకోవచ్చు. ఆ విషయం "... ... వారిజనేత్రకు భర్తృసేవ సద్గతి సమకూర్చు దల్లి........, ....... భర్తృహిత కారిణివై చరియింపు మంగనా..." అన్న ఆంధ్ర వాల్మీకి పద్యాల్లో స్పష్టంగా తెలుస్తుంది. అలానే అనసూయ సీతకు హితోపదేశం చేసిన ఘట్టం చదివితే సతీ ధర్మం గురించి తెలుసుకోవచ్చు.

పితృ భక్తిని తెలుసుకోవాలంటే, అయోధ్య కాండలోని "....... పుత్ర లబ్దికై పనిగొని తల్లి తండ్రి పడు పాటులకుం బ్రతి సేయ నౌనె? యింపున దల జూచి నీళ్లు కడుపుంగని యన్నము పోసిపెట్టి యెండను జడి గాలి బ్రోతురు దినంబును వారల తుల్యులే యొరుల్" అన్న రాముడి వాక్యాలను చదవాలి.

మిత్ర ధర్మాన్ని గురించి "సులభము మిత్రుల జేర్చుట, కలసిన మరి మైత్రి చెడక కాపాడుటయే బలితపు గష్టము మది చం, చల మగుటను బ్రీతి చెడును స్వల్పంబున కేన్" అన్న సుగ్రీవుడి మాటల్లో తెలియచేయబడింది. న్యాయవాది ధర్మాన్ని హనుమంతుడి వాక్యాలలోను, కన్యాజనకత్వాన్ని" జననీ వంశమువారిని, జనకు కులమువారి స్వపతి సంతతి వారిన్ దనయా ! కన్యక సంశయ, మున ద్రోయు సదా యకీర్తి ముంచునొ యనుచున్" అన్న ఉత్తర కాండ పద్యాలలోను తెలుసుకోవచ్చు. సుందర కాండలోని "కోపి తునుము గురువులనేన్, గోపి కడుం గరకులాడు గుణవంతులనేన్, గోపి యొనర్పగజాలని, పాపం బేదైన గలదే భావింపగన్" అన్న పద్యంలో కోపి లక్షణం ఏంటో తెలుసుకోవచ్చు.

రామాయణంలో సకల ధర్మాలున్నాయి. ఇందులో వున్న ధర్మాలే మిగిలిన అన్ని గ్రంథాలలోనూ కనబడతాయి. ఇందులో లేని ధర్మాలు మరింకేదాంట్లోను కనిపించవు. రామాయణంలో సూత్రప్రాయంగా చెప్పిన ఎన్నో విషయాలను వ్యాసమహర్షి తన గ్రంథాలలో పేర్కొన్నాడు. ఉదాహరణకు "నాళీక జంఘుని" కథ. ఇలానే రామాయణంలో సూక్ష్మంగా చెప్పబడిన ధర్మాలను, కథలు-కథలుగా కల్పించి వ్యాస భగవానుడు ఇంతకు నాలుగింతలు గ్రంథాన్ని తయారు చేశాడు. భగవద్గీతంతా కూడా రామాయణ సారమేనని గ్రహించాలి.

శ్రీమద్వాల్మీకి రామాయణం మంత్రనిధానం. ఇందులో అనేకానేక మంత్రాలు ఉద్ధరించబడి వున్నాయి. అందువల్లే, వాల్మీకి రామాయణం పారాయణం చేసేవారు, "అంగన్యాస కరన్యాసాదులతో" యథావిధిగా చదివి, వారి వారి కోరికలు నెరవేర్చుకుంటారు. సద్భావంతో సుందర కాండ పారాయణం చేసి కార్య సిద్ధిని పొందనివారు ఇంతవరకు లేరు. ఉత్తర కాండలో చెప్పినట్లు, రామాయణమంతా గాయత్రీ స్వరూపమే. గాయత్రిలోని 24 అక్షరాలను, ప్రతి వేయి శ్లోకాలకు ఒక అక్షరం చొప్పున శ్లోకం ఆరంభంలో చెప్పబడింది. ఏడు కాండలలో ఏడు వ్యాహృతులు వివరించడం జరిగింది. ఈ గాయత్రీ విధానాన్ని నారదుడే స్వయంగా వాల్మీకి మహర్షికి, రామాయణంతో పాటే ఉపదేశించాడు. " తప స్స్వాధ్యాయ నిరతం, తపస్వీ వాగ్విదాంవరమ్, నారదం పరిపప్రఛ్చ, వాల్మీకిర్మునిపుంగవమ్" అని గాయత్రిలోని మొదటి అక్షరంతో శ్లోకాన్ని ప్రారంభించి, "జనశ్చ శూద్రోపి మహత్త్వ మీయాత్" అని గాయత్రి కడపటి అక్షరంతో సర్గను ముగించాడు వాల్మీకి. అంధ్ర వాల్మీకంలో, మూలంలో వున్నట్లు "తపమున స్వాధ్యాయంబున, నిపుణుని... ..... తమి గావించెన్" అన్న పద్యంతో ప్రారంభించి, "యథావిధి విన్న బఠింప నారయన్" అని ముగించబడింది.

సంస్కృత మూలంలో మాదిరిగానే, ఆంధ్ర వాల్మీకంలో, ప్రణవం-ప్రణవార్థం సముద్ధరించబడి వున్నాయి. ఉదాహరణకు, ఆంధ్ర వాల్మీకంలోని, "అగ్రవర్తియై శ్రీరాము... నువిద తను మధ్య..... మహిత కోదండ..... డోలి....ప్రేమ" అన్న పద్యంలోని మొదటి మూడు పాదాల ప్రథమాక్షరాలు (అవుమ) కలిపితే, నాల్గవ పాదం ప్రథమ-అంత్య అక్షర (ఓమ) స్వరూపం వస్తుంది. ఇలా మంత్రార్థమంతా మూలంలో వలె వుంటుంది. ఇలా, షడక్షరి, అష్టాక్షరి, ద్వయము లాంటి మంత్రాలు కూర్చబడ్డాయి. పరిశోధకులకు ఇవి కనుగొనడం తేలిక.

ఆంధ్ర వాల్మీకంలోని ఈ పద్యం చదువుతే సాంఖ్య శాస్త్ర రహస్యం గురించి కూడా తెలుసుకోవచ్చు.


"శ్రీమహిజాధవుండు జడ చేతనజీవనధాత సద్గరీ
యో మరభూరుహంబు సమ దారివిదారణశీలి భక్తవా
రామృతదాత సంభృతశ రాసకరాంబుజు డొంటిమిట్టశ్రీ
రాము డమాయవర్తనుడు రక్తి గ్రహించుత మన్నమస్కృతుల్

చివరి పాదంలోని మొదటి అక్షరం "రా" అంటే సంఖ్యా శాస్త్రం ప్రకారం 2కు సమానం. ఈ అక్షరం తర్వాత రెండు అక్షరాలను వదిలి చదివితే "మాయ" వుంటుంది. సాంఖ్య శాస్త్రం ప్రకారం మాయ 15కు సమానం. మొదటి అక్షరం తర్వాత 15 అక్షరాలు వదిలి చదివితే "నమః" వుంటుంది. ఇలా అన్నీ కలిపి చదివితే "రామాయనమః" ఏర్పడుతుంది. ఇలాగే కాండాది పద్యాలలో ద్వయము, షడక్షర నియమం కనిపిస్తాయి. కాండాంత పద్యాలలో "రామషడక్షరి" చొప్పించబడి వుంది. వాస్తవానికి సంస్కృత మూలంలో కొన్ని శ్లోకాలు అభేద్యంగా, వాటి స్వరూపాలు ఊహకందకుండా వుండడంతో తెనిగించడం అంత తేలికైన విషయంగా కనిపించలేదు.

ఇంద్రజిత్తును లక్ష్మణుడు సంహరించేటప్పుడు "సారధర్మాత్ముడును సత్యసంధుడేని, రామచంద్రుండు దశరథ రాజసుతుడు పౌరుషమునను నప్రతి ద్వంద్వు డేని, శరమ ! ఈ రావణాత్మజు సంహరింపు" అని రాయబడింది. ఇదొక మహా మంత్రం. దీనికి ప్రతి మంత్రం లేదు. దానితోనే, సర్వాస్త్రవేదియై ఏ అస్త్రంతోనూ చావని ఇంద్రజిత్తును లక్ష్మణుడు చంపగలిగాడు. "రామ" అన్న రెండక్షరాలే "తారక మంత్రం" కదా ! దానినే సర్వజ్ఞుడు శివుడు పార్వతికి ఉపదేశించాడు.
కామ్యార్థమైనా, మోక్షార్థమైనా, రామాయణం పారాయణం చేసినవారి కోరికలు నెరవేర్చే శక్తి, రామాయణానికి వుండడానికి కారణం, అది భగవత్ కథ కావడానికి అదనంగా సర్వజ్ఞుడైన వాల్మీకి (ఆంధ్ర వాల్మీకి) కూర్చిన బీజాక్షరాల మహాత్మ్యమే. ఉదాహరణకు ఒక దృష్టాంతం తీసుకుందాం. సుందర కాండను అందరు పారాయణం చేస్తారు కదా ! అలా చేసినవారి కోరికలు నెరవేరడం కూడా సహజమే కదా ! ఆ కాండంలో ప్రథమాక్షరం "త". చివరి అక్షరం కూడా "త". "తరువాత రావణాసుర...." తో మొదలయ్యి, "తత భవద్దుఃఖమునకు....శాంతి సీత" తో ముగుస్తుంది. సుందర కాండలో ప్రతి సర్గ మొదటి అక్షరం "స" కారంతోనో, "త" కారంతోనో వుంటుంది. అలా కాకపోతే ఆ శ్లోకంలో "సీత" అన్న శబ్దంకాని, దాని పర్యాయ పదం కాని వుంటుంది. అది కూడా కుదరనప్పుడు, రెండో శ్లోకం మొదటి అక్షరం "స" కాని, "త" కాని తప్పకుండా వుంటుంది. ఈ "స", "త" లు "సీత" అన్న పదాన్ని సూచించడం స్పష్టంగా తెలుస్తోంది. సుందర కాండకు అధిష్టాన దేవత సీత. ఈ సకార-తకార మహిమ ప్రకారం సీత అంటే "ఓం" అని అర్థం కూడా. బీజాక్షర మహిమ కూడా వుంది. ఇప్పుడు చెప్పిన దాని కంతా పారాయణం చేస్తున్న వారే సాక్షులు. హనుమంతుడు ఆమె పేరు చెప్పాల్సి వచ్చినప్పుడల్లా, ఆమె వున్న దిక్కుకు నమస్కరించి మరీ ప్రస్తావించేవాడు. ఇలా రామాయణంలో ఎన్ని రహస్యాలున్నాయన్న సంగతి ఎవరికన్నా తెలుసునా?

శ్రీమద్రామాయణం వేదంతో సమానమైందే కాకుండా వేదమే అనాలి. వేదమే అయినప్పుడు, వేదంతో సమానమైందని ఎలా అనవచ్చునంటే, వేదంలోని వర్ణాలనే, అనులోమ-విలోమాలుగా మార్చి, వేద ప్రసిద్ధమైన రామ కథను చెప్పడంవల్ల ఇది వేదమే అయింది. వేదాల్లోని అర్థాలున్నందువల్ల వేదంతో సమానమైంది. అందువల్లనే, వేద పఠనం అవశ్యంగా చేయాల్సిన కార్యక్రమాల్లో, రామాయణ పఠనం నియమితమైంది. "రామాయణం వేదసమం, శ్రాద్ధేషు శ్రావయే ద్బుధః" అని రామాయణంలోనే చెప్పబడింది.

శత కోటి, అంటే 24 గాయత్రీ బీజాక్షరాలతో కూడిన 24,000 గ్రంథాల రామాయణంలోని ప్రతి అక్షరానికి మహా పాతకాలను నాశనం చేయగల శక్తిగలదని కొందరంటారు. కొందరేమో, శత కోటి రామాయణాన్ని వాల్మీకి సంగ్రహంగా చెప్పాడంటారు. ఇలాంటి మహిమ రామాయణంలో వుండడానికి కారణమేంటో ఆలోచించాలి. వాల్మీకి సూత్రాన్ననుసరించి, రామాయణం వేద స్వర సముద్ధృతంగా-సర్వశ్రుతులందున్నట్లుగా తెలుస్తోంది. వాల్మీకి రచించిన 24,000 శ్లోకాలలో, యజుర్వేదంలోని 1 29 290 పదాలే కాకుండా, రుగ్వేదం, సామవేదం, అధర్వ వేదాలలోని పదాలు కూడా అనులోమ-విలోమంగా కూర్చబడిందన్న రహస్యం తెలుసుకోవచ్చు. యజుర్వేదానికి ప్రాముఖ్యం ఇవ్వడానికి కారణం, శ్రీరాముడు యజుర్వేది కావడమే.

యజుర్వేద సంహితా ప్రమాణం ఆధారంగా, రామాయణంలోని ఏడు కాండలంటే, సౌమ్యము, ప్రాజాపత్యము, వైశ్వదేవము, ఆగ్నేయము, ఆగ్నేయ బ్రాహ్మణము, సౌమ్య బ్రాహ్మణము, కామ్యకము. అదే విధంగా ప్రశ్నలు 44. అందులో మొదటి కాండలో 8, రెండులో 6, మూడులో 5, నాలుగులో 7, ఐదులో 7, ఆరులో 6, ఏడవ కాండలో 5 ప్రశ్నలున్నాయి. అనువాకాలు 651, పనసలు 2198, పదాలు 129290, అక్షరాలు 253868 వున్నాయి. ఈ విధంగా యజుర్వేదంలోని కాండల, ప్రశ్నల, అనువాకాల, పదాక్షరాల నిర్ణయం జరిగింది. శ్రీమద్రామాయణంలోని కాండలలో వేదాక్షరాలు ఎలా వున్నాయో పరిశీలించితే, బాల కాండ ప్రధమ సర్గ నుంచి ఐదో సర్గ వరకు రెండో శ్లోకం దాకా, నారదుడు ఉపదేశించిన విధానం రాసి, తర్వాతనే బ్రహ్మ ప్రత్యక్షం కావడంతో కథా భాగం వుంది. బాల కాండ 5 సర్గ 3 వ శ్లోకం నుంచి, అయోధ్య కాండ 115 వ సర్గ వరకు యజుర్వేదం. అయోధ్య కాండ 116 వ సర్గ మొదలు, అరణ్య కాండ 74 వ సర్గ వరకు ఋగ్వేదం. అరణ్య కాండ 75 వ సర్గ మొదలు సుందరకాండ 48 వ సర్గ వరకు సామవేదం. సుందర కాండ 49 వ సర్గ మొదలు ఉత్తర కాండ 36 వ సర్గ వరకు అథర్వ వేదం. ఉత్తర కాండ 37వ సర్గ మొదలు చివర వరకు ఉపనిషత్తు-అంటే శాంతి. ఈ విధంగా 647 సర్గలలో 23635 శ్లోకాలు, 776794 అక్షరాలున్నాయి. అక్షరాల సంఖ్యలో కొంచెం తేడా రావడానికి కారణం వేదాలలో వర్ణముల పదాలు విశేషంగా వుండడం వల్ల ఇవి సరి చూసుకుంటే, వేద వర్ణాల లెక్కకు, రామాయణ వర్ణాల లెక్కకు సరిపోతాయి. రామాయణం వేదం కాబట్టే, నిరంతర అధ్యాయనపరుడైన వాల్మీకి, కొన్ని చోట్ల వేద పరిభాషా పదాలను, వేద సంజ్ఞలను ప్రయోగించాడు. ఈ సంకేతాలన్నింటినీ తెలుసుకోగలిగితే సందేహాలకు తావులేకుండా వాల్మీకి రామాయణ సారాన్ని గ్రహించగలుగుతారు.

రామాయణం ఒక మహత్తరమైన సాంఖ్య శాస్త్రం. "కాదినవాది సూత్రాల" ప్రకారం అక్షరాల కొచ్చే సంఖ్యలను బట్టి చూస్తే, రామాయణంలో కొన్ని చిత్రాలు కనిపిస్తాయి.

రా + మ = 2+5 = 7
అవతార సంఖ్య 7
రామాయణ కాండ సంఖ్య 7
యుద్ధం జరిగిన రోజుల సంఖ్య 7
రామాయణ యుద్ధంలో ముఖ్య మైన పురుషుల సంఖ్య 7
(రామ, లక్ష్మణ, హనుమ, విభీషణ, రావణ, కుంభకర్ణ, ఇంద్రజిత్తులు)

పారాయణం చేసే వారికి ముఖ్యంగా నియమిత మైన సర్గల సంఖ్య 7. వ్యాహృతులు 7. ఇలా ఈ ఏడవ సంఖ్య మహిమ అద్భుతం. "శ్లోక శతై" అని వాల్మీకి చెప్పినట్లు, బాల కాండం మొదటి సర్గ మొదటి శ్లోకం (తప స్స్వాధ్యాయ...) లోని అక్షరాల కొచ్చే సంఖ్యలను కూడితే 100 వస్తుంది. ఈ 100 సంఖ్య ప్రథమ సర్గలోని శ్లోకాల సంఖ్య.

రామాయణంలోని సప్త సంఖ్యా నియమాన్ని గ్రహించిన వ్యాస భగవానులు నిజ రచిత గ్రంథానికి "జయ" అని పేరు పెట్టాడు. "జయ" అంటే 18. భారతంలోని పర్వాలు 18. యుద్ధం జరిగింది 18 రోజులు. రణ శూరులు 18 మంది. భగవద్గీతలో 18 అధ్యాయాలున్నాయి. ఇలా ఆలోచిస్తే, మహర్షులందరి మార్గాలు ఒక్కటేననిపిస్తుంది.

సీతారాముల వియోగం గురించి, కలిసి వుండడం గురించి అయోధ్యా కాండలో చెప్ప బడింది. మిగిలిన కాండలలో కొంత కాలమన్నా వియోగం గురించి చెప్పబడింది. కాబట్టి "సీత, రామ" నామాల సంఖ్యలు కలిపితే (సీత=67 + రామ=52) 119 వస్తుంది. అయోధ్య కాండలో 119 సర్గలున్నాయి. ఇలాంటి చిత్రాలు ఎన్నెన్నో వాల్మీకి రామాయణంలో నిక్షేపం చేశాడు.

శ్రీరాముడు సామాన్య ధర్మాలన్నీ ఎలా అనుష్టించింది, కష్ట కాలంలో ఎలా ప్రవర్తించింది, సుఖ కాలంలో ఎలా నడచుకుంది, ఎలాంటెలాంటి వారి మీద ఏ విధమైన అభిప్రాయంతో మెలిగేవాడనేదీ, వీటి కారణాలేంటి అన్న విషయాలన్నీ చర్చించాల్సినవే. రాముడి పైనా, ఆయన తమ్ములపైనా ఏక పత్నీవ్రతం విషయంలో కూడా విరుద్ధాభిప్రాయాలను వెలిబుచ్చిన వారున్నారు. అసలా మాటకొస్తే " దుష్టులు వెలిచవి (జారత్వం) మరగిన భ్రష్టులు లేరప్పురమున రాష్ట్రమునందున్" అని బాలకాండలో చెప్పినట్లు, దశరథుడు పాలించిన అయోధ్యలో ప్రతి మనుష్యుడు ఏక పత్నీవ్రతుడే. అలాంటప్పుడు రాముడు అనేక పత్నీకుడని ఎలా చెప్పారు? అలాంటి రాముడు వాల్మీకి వర్ణించిన శ్రీరాముడు మాత్రం కాడు. ఒక్క వాల్మీకే యథార్థ చరిత్రను వర్ణించాడు. మిగిలిన వారందరూ, రాముడి పరత్వాన్ని వర్ణించినవారే. ఇలానే వాలి వధ విషయంలో కూడా రాముడి గుణం దోషరహితమే. శ్రీరాముడు సంధ్యావందనం, దేవతార్చన, విగ్రహారాధన, వ్రతానుష్టానం లాంటి నిత్య కర్మలన్నీ శ్రద్ధగా చేసేవాడు.

రామాయణ గ్రంథమేమో చాలా గొప్పది. రాసిన కవేమో బ్రహ్మర్షి. ఇందులోని మర్మాలేమో మెండుగా వున్నాయి. రాసిందేమో సంస్కృత భాషలో. చదివినా కొద్దీ విశేషాలు కనిపిస్తాయి. నేనా కించిజ్ఞుడను-చంచల చిత్తుడను-శక్తి హీనుడను. అందుకే దోషాలు దండిగా వుంటాయి. పాఠకులు ఆంధ్ర వాల్మీకి రామాయణాన్ని దయతో చదివి నన్ను ధన్యుడిని చేయండి. భగవద్ధ్యానంలో ఆసక్తిగల భక్తులందరూ దీన్ని భగవంతుడికి నివేదించబడిన ప్రసాదంలా ఈ కృతిని భావించమని ప్రార్థన.

చివరగా:

"తప్పైనను నొప్పైనను, దెప్పుచునో మెచ్చుకొనుచొ, దీనిన్ శ్రద్ధన్
దప్పక సకలము జదివెడు, నప్పుణ్యాత్ముల కొనర్తు సాష్టాంగనతుల్"

--వావిలికొలను సుబ్బరావు
కీలక సంవత్సరం, మాఖ శుద్ధ ౧౧
తిరువళిక్కేణి

(ఒక అజ్ఞాత మహానుభావుడి ద్వారా "కాలిఫోర్నియా (అమెరికా) విశ్వ విద్యాలయం" కు చెందిన "బర్క్ లీ" గ్రంథాలయంలో చేరుకుని, "గూగుల్ సంస్థ" డిజిటలైజ్ చేసి నందువల్ల నాకంట పడిన వాసు దాసు-వావిలికొలను సుబ్బరావు- గారి అలనాటి "శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం" మొదటి సంపుటి- బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ కాండలు మూలం-చదివి అద్భుతమైన మానవాళి జనన-మరణ చక్రబంధం గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయమని ప్రార్థన)

No comments:

Post a Comment