Tuesday, February 23, 2010

వివాహబంధం-I: బాల కాండ మందర మకరందం-సీతా కల్యాణ ఘట్టం - వనం జ్వాలానరసింహారావు

జ్వాలానరసింహారావు-విజయలక్ష్మిల వివాహం-I

శ్రీ పప్పు లక్ష్మీ నరసింహమూర్తి చెప్పిన
"హిందూ సాంప్రదాయ వివాహ వేడుక"
వనం జ్వాలానరసింహారావు

శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం బాల కాండను, "బాల కాండ మందర మకరందం" గా రాస్తున్న సందర్భంలో, సీతా కల్యాణ ఘట్టం చదువుతున్నంతసేపూ, నలబై సంవత్సరాల క్రితం జరిగిన మా వివాహం పదే-పదే గుర్తుకొచ్చింది. నాకే కాదు అది చదివిన వారికెవరికైనా అలా గుర్తుకు రావడం సహజం. ఒక్క మా పెళ్ళి విషయాలే కాకుండా, మేం జరిపించిన మా ఇద్దరమ్మాయిల పెళ్లి, అబ్బాయి పెళ్లి కూడా గుర్తుకొచ్చాయి. హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక వివాహం జరగాలన్నా, జరిపించాలన్నా పెళ్ళికి ముందు, పెళ్ళిలో, పెళ్లైన తర్వాత చోటుచేసుకునే ప్రతి విషయానికి సంస్కృతీ-సాంప్రదాయ పరంగానే కాకుండా శాస్త్రీయ కోణంలో ఆలోచించినా ఎన్నో అర్థాలు స్ఫురిస్తాయి. నేను బాల కాండలో సీతా కల్యాణ ఘట్టం చదివి-రాసిన తర్వాత, హ్యూస్టన్ కు వెళ్ళినప్పుడు అక్కడ తెలుగు సాహితీ సమితివారు ఏర్పాటుచేసిన ఒక కార్యక్రమానికి హాజరయ్యాను. అందులో శ్రీయుత పప్పు నరసింహమూర్తి గారు "హిందూ సాంప్రదాయ వివాహ వేడుక" గురించి మాట్లాడినప్పుడు మరొక్క సారి మా పెళ్ళి నాటి సంగతులు జ్ఞప్తికొచ్చాయి. ఆయన చెప్పిన విషయాలను, సీతా కల్యాణ ఘట్టంలోని విషయాలను మా వివాహానికి అన్వయం చేసుకుంటూ, "వివాహబంధం" గురించి రాద్దామన్న ప్రయత్నమే ఇది.

విశ్వామిత్రుడి ఆదేశం ప్రకారం శ్రీరాముడు అవలీలగా జనక మహారాజు దగ్గరున్న శివ ధనుస్సు వింటిని అరచేత్తో పట్టుకొని, అల్లెతాటిని బిగువుగా లాగుతుంటేనే, విల్లు ఫెల్లుమని రెండుగా విరిగిపోతుంది. ఇది చూసిన జనకుడు, సీత దశరథ కుమారుడు శ్రీరామచంద్రుడిని భర్తగా పొందడంవల్ల తమ జనక కులానికి కీర్తి సంపాదించిపెట్టినట్లైందని అంటాడు విశ్వామిత్రుడితో. "నా కూతురు వీర్య శుల్క అని నేను చేసిన ప్రతిజ్ఞ ఫలించింది. నేనన్న మాట ప్రకారం, నా ప్రాణంకంటే ప్రియమైన భూపుత్రి సీతను గొప్ప గుణాలున్న శ్రీరామచంద్రమూర్తికిచ్చి వివాహం చేస్తాను" అని జనకుడు సీతను రాముడికి ధారాదత్తం చేసే ప్రయత్నం చేయగా, వివాహమాడడానికి తనకు తండ్రి ఆజ్ఞలేదని అంటాడు రాముడు. విశ్వామిత్రుడి ఆదేశం మేరకు, మిథిలకు రమ్మని ఆహ్వానిస్తూ, దశరథుడి దగ్గరకు దూతలను పంపాడు జనకుడు. దూతలు అందించిన వార్తను విన్న దశరథ మహారాజు వామదేవ-వశిష్ఠాదులను, మంత్రులను పిలిపించి "మన శ్రీరామచంద్రుడి బల పరాక్రమం చూసి-మెచ్చిన జనకుడు, తనకూతురునిచ్చి వివాహం చేయనున్నాడు. జనకుడు తలపెట్టిన కార్యం మీకు సమ్మతమైతే, ఆలస్యం చేయకుండా పయనమై పోదాం" అనగా మంత్రులందరు ఇది తగిన కార్యమేనని, మంచి సంబంధమేనని అన్నారు.

మర్నాడు దశరథుడు చతురంగ బలాలతో, వాసుదేవుడు-వశిష్టుడు-జాబాలి-కాశ్యపుడు- మార్కండేయుడు-కాత్యాయనుడు లాంటి పెద్దలతో కలిసి బయలుదేరి ఐదవ రోజు పగటిపూట కల్లా విదేహనగరం చేరుకుంటాడు. ఆయన రాకను తెలుసుకున్న జనకుడు స్వాగతం పలికి, "నా పుణ్యం మంచిదైనందున, సూర్య వంశపు రాజులతో వియ్య మాడే అవకాశం కలిగింది. మిక్కిలి బలవంతులైన మీతో బంధుత్వం కలుస్తున్నందువల్ల మా వంశం అతి పూజ్యమైంది" అంటాడు. వివాహానికి సన్నాహాలు మొదలయ్యాయి. మర్నాడుదయం, జనకుడి ఆహ్వానాన్ని అందుకుని దశరథుడు ఋషులతో బంధువులతో కలిసి జనకుడున్న చోటికి పోయి, ఆయనకు వశిష్టుడిని చూపించి, ఇక్ష్వాకువంశానికి ఆయన కులగురువనీ, తమ గురించి చెప్పాల్సిన విషయాలన్ని ఆయన చెప్తాడనీ అంటాడు.

హితులతో-మంత్రులతో-పురోహితులతో కూడి వున్న జనకుడితో వశిష్టుడు సూర్యవంశక్రమాన్ని వివరించాడు. "అవ్యక్తసంభవుడు-నిత్యుడు-అవ్యయుడైన చతుర్ముఖ బ్రహ్మకు మరీచి జన్మించాడు. మరీచికి కశ్యపుడు-ఆయనకు వివస్వంతుడు-ఆయనకు మనువు-ఆయనకు ఇక్ష్వాకుడు కలిగారు. ఇక్ష్వాకుడి రాజధాని అయోధ్య" అంటూ మొదలుపెట్టి, చివరలో అంబరీషుడుకి నహుషుడు, అతడికి యయాతి, అతడికి ఆభాగుడు, అతడికి అజుడు, అతడికి బలశాలైన దశరథుడు కొడుకులుగా పుట్టారు" అని సూర్యవంశ క్రమాన్ని సవివరంగా తెలియచేశాడు. దశరథుడి కుమారులే శ్రీరామ లక్ష్మణులనీ, వీరి వంశం ఆదినుండి పరిశుద్ధమైందనీ, వీరందరు అసమాన ధర్మరతులు-వీరులనీ, సత్యమంటే ప్రీతికలవారనీ అంటూ, శ్రీరామచంద్రుడికి-లక్ష్మణుడికి సరితూగే గుణగణాలుగల తన ఇరువురు పుత్రికలను ప్రేమపూర్వకంగా ఇచ్చి వివాహం చేయమని, ఇది తన మనవి అని కోరాడు జనకుడిని.

ఇక్ష్వాకుల వంశ క్రమం వివరించిన వశిష్టుడితో జనక మహారాజు తనవంశక్రమాన్ని కూడా వినిపించాడు. తమ వంశానికి పూర్వీకుడు ధర్మాత్ముడైన "నిమి" అనీ, అతడి కొడుకు మిథి అనే మహాత్ముడే ఈ మిథిలా పురాన్ని కట్టించాడనీ, ఆయనే మొదటి జనకుడనీ, ఆ పేరే తమ వంశంలో "జనకుడు" అని రాసాగిందనీ, అదే వంశ నామం అయిందనీ అంటాడు. మిథి కొడుకు దగ్గరనుంచి మొదలెట్టి, మహారోముడికి స్వర్ణరోముడు, అతడికి హ్రస్వరోముడు , హ్రస్వరోముడికి తను తన తమ్ముడు కుశధ్వజుడు కొడుకులమని వంశ క్రమాన్ని వివరించిన జనకుడు దశరథుడితో, ముమ్మాటికి తన ఇద్దరు కూతుళ్లను ఆయన ఇద్దరు కుమారులకిస్తానని చెప్పాడు. మూడు రోజుల తర్వాత ఉత్తర ఫల్గుని నక్షత్రం వస్తుందనీ, ఆ రోజున వివాహం చేద్దామనీ అంటాడు.

ఆ రాత్రి కొడుకులతో వినోదంగా గడిపి దశరథుడు, మర్నాడు ఉదయం తూర్పు తెల్లవారుతుండగానే, కాల కృత్యాలు తీర్చుకొని పెళ్లిజరిపించేందుకై ఏర్పాటుచేసిన ఉత్సవ శాలకు చేరుకున్నాడు. అందమైన ఆభరణాలను ధరించి, కంకణం కట్టుకొని, రామచంద్రమూర్తి మంచి ముహూర్తంలో తమ్ములతో కలిసి వచ్చాడక్కడకు. వశిష్టుడు-ఇతర మునీంద్రులు ముందుండి తమ వెంట వస్తుంటే అందరూ కలిసి లోపలికి వెళ్లారు. అలా ప్రవేశిస్తుండగానే వశిష్టుడు జనక రాజును చూసి, దాత కొరకు దశరథుడు వేచి వున్నాడని చెప్పాడు. ఇచ్చేవాడు-పుచ్చుకునేవాడు ఒకచోట వున్నప్పుడే తదుపరి తతంగం జరుగుతుందని అంటూ, ఆయన స్వధర్మమైన-దాత చేయాల్సిన కార్యమైన పెళ్లి జరిపించమని వశిష్టుడు జనకుడికి తెలియచేశాడు.

వశిష్టుడితో జనకుడు, ఇతర ఋశీష్వరులతో కలిసి త్రిలోకాభిరాముడైన రామచంద్రమూర్తికి శీఘ్రంగా-సంతోషంగా వివాహ సంబంధమైన కార్యాలన్నీ జరిపించమని అన్నాడు. అలానే జరిపిస్తామన్న వశిష్టుడు, తనకు సహాయంగా విశ్వామిత్రుడు, శతానందుడు (జనకుడి పురోహితుడు) తోడుండగా వివాహ సంబంధమైన కార్యక్రమం చేపట్టాడు. చలువ పందిరిలో శాస్త్ర ప్రకారం వేదిని తీర్చి, పూలతో-పరిమళ ద్రవ్యాలతో దానిని అలంకరించి, మెరుస్తున్న బంగారు పాలికలతో-మొలకెత్తిన శుభకరమైన అడుగులేని పాత్రలతో-జిగుళ్లుగల మూకుళ్లతో-ధూపమున్న ధూప పాత్రలతో-స్రుక్కులు, స్రువాలు, అర్ఘ్యం పేలాలతో నిండిన స్వచ్ఛ పాత్రలతో-పచ్చని అక్షతలతో వేదిని నింపాడు వశిష్టుడు. మంత్రాలు పఠిస్తూ, పరిశుద్ధమైన దర్భలను పరిచి, శాస్త్రోక్తంగా వేదిలో అగ్నిని వుంచి, వశిష్టుడు హోమం చేశాడు.

సీతా కల్యాణ ఘట్టం

" సీతను సర్వాభరణో, పేతను దా నిలిపి నగ్ని కెదురుగ గౌస
ల్యా తనయున కభిముఖముగ, క్ష్మాతలనాథుండు రామచంద్రున కనియెన్ "

అన్ని విధాలైన అలంకారాలతో ప్రకాశిస్తున్న సీతను, అగ్నికి ఎదురుగా-శ్రీరామచంద్రమూర్తికి అభిముఖంగా, నిలువ బెట్టి, జనక మహారాజు శ్రీరామచంద్రమూర్తితో:

“ఈ సీత నాదుకూతురు, నీ సహధర్మచరి దీని నిం గై కొనుమా
కౌసల్యాసుత, నీకును భాసురశుభ మగు గ్రహింపు పాణిం బాణిన్ "

" కౌసల్యా కుమారా, ఈ సీత నా కూతురు. నీ సహధర్మచారిణి. ఈమెను పాణి గ్రహణం చేసుకో. నీకు జగత్ ప్రసిద్ధమైన మేలు కలుగుతుంది. నీకు శుభం కలుగుతుంది. మంత్రపూర్వకంగా ఈమె చేతిని నీ చేత్తో పట్టుకో. రామచంద్రా, పతివ్రత-మహా భాగ్యవతి అయిన నీ సీత, నీ నీడలా ఒక్కసారైనా నిన్ను విడిచి వుండదు" అని అంటూ, మంత్రోచ్ఛారణతో పవిత్రవంతములైన జలధారలను రామచంద్రమూర్తి చేతుల్లో జనక మహారాజు ధారపోశాడు.

తర్వాత, జనక మహారాజు లక్ష్మణుడివైపు చూసి, "లక్ష్మణా ఇటు రా. దానంగా ఊర్మిళను స్వీకరించు. ప్రీతిపూర్వకంగా ఇస్తున్నాను. ఈమె చేతిని ప్రేమతో గ్రహించు" మని కోరాడు. ఊర్మిళను లక్ష్మణుడికిచ్చిన తర్వాత, భరతుడిని మాండవి చేతిని, శత్రుఘ్నుడిని శ్రుతకీర్తి చేతిని గ్రహించమని ప్రేమతో పలికాడు జనకుడు. ఇలా నలుగురు కన్యలను దశరథుడి నలుగురు కొడుకులకు ధారపోసి, జనకుడు రాజకుమారులతో, దోష రహితమైన మనసున్న వారందరు సుందరులైన భార్యలతో కలిసి, సౌమ్య గుణంగలవారిగానూ-సదాచార సంపన్నులుగానూ కమ్మని అంటాడు. జనక మహారాజు మాటలను విన్న దశరథుడి కుమారులు-రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు, తండ్రి అనుమతితో భార్యల చేతులను తమ చేతుల్లో వుంచుకొని, సంతోషాతిషయంతో, మలినంలేని భక్తితో, అగ్నికి-వేదికి-మౌనీశ్వరులందరికి-రాజులకు భార్యలతో కలిసి ప్రదక్షిణ చేసారు. వివాహం శాస్త్ర ప్రకారం ప్రసిద్ధంగా జరిగింది. పూలవాన కురిసింది. ఆకాశంలో దేవ దుందుభులు ధ్వనించాయి. దేవతా స్త్రీలు నాట్యం చేసారు. గంధర్వ కాంతలు పాడారు. మంగళ వాద్యాలు మోగుతుంటే, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అగ్నికి మూడుసార్లు ప్రదక్షిణ చేయడంతో పెళ్లి తంతు ముగిసింది. తమ భార్యలతో దశరథ కుమారులు విడిది ఇళ్లకు పోవడంతో, వారివెంట దశరథుడు, వశిష్ఠ విశ్వామిత్రాది మునీశ్వరులతో, బందువులతో విడిదికి పోయారు.

వివాహమైన మర్నాటి ఉదయం, అయోధ్యకు పోయేందుకు తమకు అనుమతినివ్వమని జనకుడిని కోరాడు దశరథుడు. సరేనన్న జనకుడు, దశరథ మహారాజుతో కలిసి, తాను కొంతదూరం ప్రయాణంచేసి-వారందరిని సాగనంపి, ఆయన అనుమతితో తన ఇంటికి తిరుగు ప్రయాణమై పోయాడు.(Part II Next)

No comments:

Post a Comment