Tuesday, February 9, 2010

ప్రాతఃస్మరణీయుడి ఆణిముత్యాలు (SREEMATH ANDHRA VALMIKI RAMAYANAM GENESIS-NEED, CONCEPT AND EVOLUTION

జ్వాలా మ్యూజింగ్స్-24

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం-గ్రంథోత్పత్తి
(SREEMATH ANDHRA VALMIKI RAMAYANAM
GENESIS-NEED, CONCEPT AND EVOLUTION-OF THE BOOK)

వనం జ్వాలా నరసింహారావు

1909 వ సంవత్సరంలో నాటి చెన్నపురి (నేటి చెన్నై) లోని "శ్రీ వైజయంతీ ముద్రా శాల" లో ముద్రించబడి, ఒక అజ్ఞాత మహానుభావుడి ద్వారా "కాలిఫోర్నియా (అమెరికా) విశ్వ విద్యాలయం" కు చెందిన "బర్క్ లీ" గ్రంథాలయంలో చేరుకుని, "గూగుల్ సంస్థ" డిజిటలైజ్ చేసి నందువల్ల నాకంట పడిన వాసు దాసు (వావిలికొలను సుబ్బరావు) గారి అలనాటి "శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం" మొదటి సంపుటి నుంచి సేకరించిన విషయాలను "అనువక్త-వాచవి" గా నేను రాసిన "ఆంధ్ర వాల్మీకి రామాయణం-బాల కాండ మందరం" లఘుకృతి "మందర మకరందం” లో పొందుపరుస్తున్నాను. అపురూపమైన అలనాటి గ్రంథకర్త అభిప్రాయాలు అక్షర లక్షలు చేసే ఆణిముత్యాలు. ఆ ఆణిముత్యాలను నా బ్లాగ్ ద్వారా సాహితీ ప్రియులకు తెలియచేసే ప్రయత్నమే ఇది. తొలుత గ్రంథాన్ని రాయడానికి ఆయనెందుకు పూనుకున్నారో "విజ్ఞాపన" రూపంలో, పాఠకులను "ఆర్యులారా" అని సంబోధిస్తూ ఇలా తెలియ చేశారు:

“అనంత కల్యాణ గుణ గణ విశిష్టుడు, స్మరణ మాత్ర సంతుష్టుడు, వినత శిష్టుడు, నిహిత దుష్టుడు, దళిత భక్త కష్టుడు, సర్వలోకేష్టుడు, కృపా పూర్ణుడు, సత్యవాక్యోదీర్ణుడు అయిన ఏ సాక్షాత్ భగవంతుడిని సేవించే కాంక్షతో వశిష్టుడు హేయమైన రాజ పౌరోహిత్యాన్ని అంగీకరించాడో; ఏ జగదీశ్వరుడి ఉత్తమ శాశ్వత మోక్ష సౌఖ్య ప్రదమైన దర్శనాన్ని కోరి శరభంగాది మహర్షులు తృణీకృత బ్రహ్మ లోకాది ఉత్తమ లోకులయ్యారో; ఏ మహామహుడి జన్మస్థలమైనందున అయోధ్య ప్రధమ ముక్తి క్షేత్రమైందో; ఏ వేదాంతైక వేద్యుడికి ధనుర్విద్యనిచ్చి అపర బ్రహ్మ కృతార్థుడయ్యాడో; ఏ పర బ్రహ్మ మూర్తిని సేవించి ఆంజనేయుడు భావి బ్రహ్మ అయ్యాడో; ఏ పురాణ పురుష నామాన్ని విష్ణు సహస్ర నామ తుల్యమని సర్వజ్ఞుడి ద్వారా నిజ అర్థాంగి లక్ష్మికి ఉపదేశించబడెనో; ఏ దేవాదిదేవుడి నామాన్ని జపించి వాల్మీకి బ్రహ్మర్షియై శాశ్వత కీర్తిధాముడయ్యాడో; ఏ అద్వితీయునాఖ్యకు తారకంబనే విఖ్యాతి కలిగిందో; ఏ సర్వతంత్ర స్వతంత్రుడి అభిధానం సర్వ మంత్రోత్తమ సారమని కీర్తి వహించిందో; ఏ అమృత స్వరూపుడి నామం అమృతంలా రుచికరమో; ఏ అతిలోకుడి చరిత్ర వేదమో; అట్టి భక్త జన చకోర చంద్రుడైన శ్రీ రామచంద్రుడి పవిత్ర చరిత్రను గుణ సంఖ్యాదుల అన్వర్థ నామధేయంగా, ఆది కావ్యంగా భగవంతుడైన వాల్మీకి మహాముని గీర్వాణ భాషలో, నారదుడు ఉపదేశించిన మార్గంలో, బ్రహ్మోక్తిని అనుసరించి, రచించి, రామచంద్ర తనూజులైన కుశలవులతో, రాముడి సన్నిధానంలో, పఠింపచేసి, ఆయనకే అర్పించి, జగత్తులో వెల్లడిచేసిన విషయం మీకందరికీ తెలిసిన విషయమే కదా. రామచంద్ర తనయుడైన ఈ గ్రంథకర్త కూడా, నిజ జ్యేష్ఠ పితృవైన లక్ష్మణాఖ్యుడు ఉపదేశించినట్లుగా, తప్పక పారాయణం ఆచరిస్తూ, తత్ సుకృత పరిపాక వశాన్న కుశలవుల మాదిరిగా అయ్యి, ఈ కృతిని రచించి, "శీతాంశో రమృతార్పణ" మన్న విధంగా శ్రీరామచంద్రుడికే అర్పిస్తున్నాను”. - - వావిలికొలను సుబ్బరావు

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం-గ్రంథోత్పత్తిని గురించి వివరిస్తూ: “నా తండ్రి రామచంద్ర రావుగారి గ్రంథాలలో అముద్రితమైన ఒక వచన రామాయణ గ్రంథముండేది. దాన్ని నేను బాల్యంలో చాలా పర్యాయాలు చదివాను. అప్పటినుంచి నాకు రామాయణ కథంటే బాగా అభిరుచి ఏర్పడింది. ఇదిలా వుండగా 1882 వ సంవత్సరంలో, మా బాబాయి లక్ష్మణరావు గారు, కమలాపురంలో డిప్యూటీ తహసీల్దారుగా పనిచేస్తుండే వారు. ఆయన గారికి నిరంతరం రామాయణ పారాయణం చేసే అలవాటుండడంతో, నా పూర్వ పుణ్య సుకృతం వల్లో- వారికి నాపైన కరుణ కలగడం వల్లో, నన్ను కూడా శ్రీ రామాయణాన్ని పారాయణం చేయమని ప్రోత్సహించి, చేసే విధానాన్ని ఉపదేశించారు. నేను పారాయణం చేస్తూ-గ్రంథాన్ని ఒక్కసారి పూర్తిగా చదివేసరికల్లా, దానిమీద భక్తి-శ్రద్ధలు పెరగడం మొదలైంది. ఇలా ఏళ్లు గడిచాయి”.

“కొంతకాలానికి నేను అనారోగ్యానికి గురైనందున, చేస్తున్న రాజకీయ ఉద్యోగాన్ని వదిలి ఉప వేతనం పై ఆధారపడి, నెల్లూరులో వుంటుండేవాడిని. ఆ సమయంలో, ఒక నాడు, బమ్మెర పోతన పలికిన "చెనకి చెరిచినాడు భాస్కరుడు గాకుండిన రామాయణము బండ్ల కెక్కింపనా" అన్న వాక్యాలు నా మనస్సులో జొరబడ్డాయి. ప్రతిరోజు ఎంతో సమయాన్ని వృధా చేస్తున్నాననిపించింది. నేనెందుకు (మా) బమ్మెర పోతన సంకల్పాన్ని నెరవేర్చ రాదన్న భావన కలిగింది. మిత్రుడు బ్రహ్మ శ్రీ లంకల పల్లె వేంకట సుబ్బార్యులు గారి సలహా తీసుకున్నాను. వారు నా ఆలోచనకు మద్దతిచ్చి, నేననుకున్నట్లే చేయమని ప్రోత్సహించి, కంబ రామాయణంతో సహా, ఇతర భాషల్లోని రామాయణ గ్రంథాల్లోని ఉత్తమ పద్యాల సారాంశాన్ని సందర్భోచితంగా, ఆయన సహాయంతో, నేను రాయదల్చుకున్న రామాయణంలో చేర్చమని బోధించాడు”.

“ఇలా ప్రోత్సాహం లభించడంతో, (వాల్మీకి సంస్కృత రామాయణం) మూలంలోని 24, 000 శ్లోకాలకు, శ్లోకానికి ఒకటి చొప్పున, తెలుగులో 24,000 పద్యాలను రాయాలని సంకల్పించుకున్నాను. అయితే "శ్రేయాంసి బహువిఘ్నాని" అన్నట్లు నేనెక్కడ? నా ఆరోగ్య మెక్కడ? రామాయణ రచనెక్కడ? అనుకొని, వూరి మధ్యలో నున్న శ్రీరామచంద్రుడే ఇక నాకు శరణ్యం అన్న నిర్ణయానికొచ్చాను. ఆయన ఆదేశం ప్రకారం నడుచుకోవాలనుకొని, ఒకనాడు పారాయణం ముగిసిన తర్వాత, భగవత్ సన్నిధానంలో కూర్చొని, ఏం చెయ్యాలనుకుంటూ, శ్రీమద్రామాయణం పుస్తకం ముందుంచుకుని, ప్రశ్న వేసుకున్నాను. ఆశ్చర్యకరంగా వచ్చిన సమాధానం "ఉత్తిష్ఠ హరి శార్దూల, లంఘయస్వ మహార్ణవమ్" ("లెమ్మా హరిశార్దూలా, యిమ్మహితార్ణవము దాటుమీ") అన్న శ్లోక రూపంలో సమాధానం లభించింది. భగవత్ కటాక్షానికి పాత్రుడనయ్యానని, ఆ రోజునే, గ్రంథాన్నంతా రాసానని సంతోషంతో భావించాను. ఆ విషయాన్ని స్నేహితులకు తెలియచేసి, 1900వ సంవత్సరంలో, ఆశ్వయుజ శుద్ధ దశమి నాడు, గ్రంథ రచన ఆరంభించాను”.

“భద్రాద్రి రామభద్రుడికి అంకితమిచ్చిన నా రచన శ్రీకౌసల్యాపరిణయం నేటికీ (అప్పటికి) ఆయనకు అర్పించలేకపోయినందువల్ల, "ఒంటిమిట్ట" నేను పుట్టిన మండలంలోనే వుండడం వల్ల, శ్రీమదాంధ్ర భాగవతానికి ఇది జన్మస్థలం కావడంవల్ల, పోతనామాత్యుడు ఒకవేళ రామాయణం రాసి వుంటే ఆ రామభద్రుడికే అంకితం ఇచ్చి వుండేవాడైనందువల్ల, ఆయన సంకల్పం నెరవేరుస్తున్న నేను ఆయన ఉద్దేశం నెరవేర్చడం అభిలషణీయమై నందువల్ల, "ఇంటి ముందరున్న పారిజాతం" ఒంటిమిట్ట కోదండ రాముడికే ఈ కృతిని అంకితం చేశాను. గ్రంథ రచనను కొనసాగిస్తూ, కొంచెం-కొంచెం రాసుకుంటూ పోతూ, ఆ వూళ్ళో వుండగానే, 20-12-1900 కల్లా 29 సర్గలు తెలిగించాను. ఇందులో మూలంలో వున్నదంతా వుంచడమే కాకుండా, వర్ణనలు మరింత పెంచడంతో, మూలాతిక్రమణం జరిగిపోయి, వందల సంఖ్యలో ఎక్కువ పద్యాలు రాశాను. 1901వ సంవత్సరం-ఫిబ్రవరి నెలలో చెన్నపురికి (చెన్నై) వచ్చిన తర్వాత 11-10-1902 వరకు, అనారోగ్యంతో బాధపడుతున్నందువల్ల రచన సాగలేదు. కోలుకున్న తర్వాత మరల గ్రంథ రచనకు పూనుకుంటుండగా, స్నేహితుడు బ్రహ్మ శ్రీ క్రొత్తపల్లె పద్మనాభ శాస్త్రుల వారు ఒక సలహా ఇచ్చారు. వాల్మీకి రామాయణానికి "యథా మూలం” గా వున్న గ్రంథం ఇంతవరకు (అప్పటి వరకు) లేదనీ, మూలాన్ని అనుసరించి గ్రంథముంటే ఎక్కువ పూజించబడుతుందనీ, సాధ్యమైనంత వరకు మూల గ్రంథాన్ని అతిక్రమించకుండా-విషయం లోపించకుండా రచించమని సూచించారు. సంస్కృతంలో "వాల్మీకి రామాయణం" ఎలాగో, తెలుగులో నా రచన అలానే వుండేలా-అనుకునేలా, దీనికి "ఆంధ్ర వాల్మీకి రామాయణం" అని పేరు పెట్టమని కూడా చెప్పారు. గతంలో అనుభవంలోకి వచ్చిన విఘ్నాలను, నా ఆరోగ్య పరిస్థితిని, బ్రహ్మ శ్రీ వేంకట సుబ్బార్యుల సహాయం దుర్లభం అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, క్రొత్తపల్లె వారి సూచనను అంగీకరించి రచనను కొనసాగించాను”.

“లోగడ రాసిన పద్యాలలో వందల కొలది తొలగించి, అతి-గణ-ప్రాస-భాష నియమాల్లో నాకు స్వాతంత్ర్యం కలిగిన రీతిలో-నా శక్తి కొలది యధా మూలంగా రచన చేయసాగాను. "మూలచ్ఛేదం" కలిగించిన ప్రక్షిప్తాలను తొలగించాల్సిన చోట తొలగించాను. రచనాకాలంలో మధ్య-మధ్య మూడు-నాలుగు సంవత్సరాల పాటు ఆనారోగ్యంవలన-అనివార్య కారణాల వలన వ్యర్థమైంది. దీర్ఘ విఘ్నాలకు భయపడి నిరుత్సాహం పొందినప్పుడు, "హేత్వంతరముల" విసుగు చెందినప్పుడు, శ్రీరామచంద్రుడే నాకు ఉత్సాహం కలిగించడంతో, శాలివాహన శకం ౧౮౩౦ (1830) అంటే 1908వ సంవత్సరంలో, శ్రావణ పౌర్ణమి నాడు, భగవదనుగ్రహం వల్ల కావ్యం పూర్తయింది. నాతో రామాయణ రచనను పూర్తి చేయించి, శ్రీ రామచంద్రుడే తన సత్య సంధత్వాన్ని ప్రపంచానికి తెలియపర్చాడు”.

“సంస్కృతం నుంచి తెలుగుకు భాషాంతరీకరణం చేస్తున్నప్పుడు, మూలంలోని ప్రతి అక్షరానికి అలాంటి మారక్షరం వేయాలన్న ఉద్దేశం నాకు లేదు. అలా రాయడమంటే, గ్రంథం తెలుగులో వున్నా, రాసేవాడికి-చదివేవాడికి సులభంగా వుండదు. మూలాన్ని వదిలిపెట్టి, "శాఖాచంక్రమణం" కూడా చేయలేదు. "పరికర-పరికరాంకురాది" అలంకారాలను, నాకు చేతనైనంతవరకు తత్ సమానమైన అక్షరాలతో పోషిస్తూ, తెనిగించాను. అక్కడక్కడ, అర్థం చేసుకోలేక పోతేనో, మతి హీనత వల్లో, సారస్యం తెలుసుకోలేనప్పుడు కొన్ని సరైన పదాలలో లోపముండవచ్చు. శ్లోక భావాన్ని మించి పద్యం మిగిలిపోయిన సందర్భంలో, పాదాన్ని పూర్తిచేయడానికి కొన్ని పదాలను ఎక్కువగా ఉపయోగించి వుండవచ్చు కూడా. శ్లేషాలంకారాలున్న శ్లోకాలను తెనిగించేటప్పుడు, వాటికున్న అర్థాలన్నీ, ఒకే పద్యంలో వచ్చేట్లు వీలైనంతవరకు ప్రయత్నం చేశాను. "తే వనేన వనం గత్వా" లాంటి వాటిలోని శ్లేషాన్ని పోషించడం కష్టమని భావించి ఆ ప్రయత్నం మానుకున్నాను. ఒక్కోసారి, శ్లోకానికి పద్యం కాకుండా, రెండు-మూడు శ్లోకాల భావాన్ని ఒక్క పద్యంలోనే చొప్పించే ప్రయత్నం కూడా చేశాను. రాసేది లోకోపకారమైన గ్రంథం కాబట్టి సార్వజనీనంగా వుండాలన్నదే నా అభిప్రాయం. ఈ కారణం వల్ల, మూలంలో గూఢంగా వున్న సందర్భాలలో, దాని అర్థాన్ని విడమర్చి కొంచెం పెంచి రాసాను. ఏ కారణం వల్ల వాల్మీకి తన కావ్యాన్ని "నిర్వచనం" గా రాసారో, అదే కారణం వల్ల నేనుకూడా తొలుత దీన్ని నిర్వచనంగానే రచించాను. నేను సర్వజ్ఞుడను కానందున, అల్పజ్ఞుడైనందున, శక్తిహీనుడను కూడా అయినందున, మీరు ఆలోచించి, నా సాహసానికి క్షమించి, మీ పిల్లల మాటలలాగా నా రచనను అనుగ్రహించి నన్ను ధన్యుడిని చేయమని ప్రార్థిస్తున్నాను. నా దోషాలను మన్నింతురుగాక” !-- వావిలికొలను సుబ్బరావు

(ఒక అజ్ఞాత మహానుభావుడి ద్వారా "కాలిఫోర్నియా (అమెరికా) విశ్వ విద్యాలయం" కు చెందిన "బర్క్ లీ" గ్రంథాలయంలో చేరుకుని, "గూగుల్ సంస్థ" డిజిటలైజ్ చేసి నందువల్ల నాకంట పడిన వాసు దాసు-వావిలికొలను సుబ్బరావు- గారి అలనాటి "శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం" మొదటి సంపుటి- బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ కాండలు మూలం-చదివి అద్భుతమైన మానవాళి జనన-మరణ చక్రబంధం గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయమని ప్రార్థన)

No comments:

Post a Comment