Sunday, February 28, 2010

వివాహబంధం-XII : స్థాళీపాకం-సప్తపది-నాగవల్లి-సదశ్యం-అప్పగింతలు-గృహ ప్రవేశం : వనం జ్వాలానరసింహారావు

జ్వాలానరసింహారావు-విజయలక్ష్మిల వివాహం-XII
శ్రీ పప్పు లక్ష్మీ నరసింహమూర్తి చెప్పిన
"హిందూ సాంప్రదాయ వివాహ వేడుక"

వివాహానంతరం జరగాల్సిన కార్యక్రమాలు
వనం జ్వాలానరసింహారావు

తలంబ్రాల కార్య క్రమం, బ్రహ్మ ముడి వేయడంతో ఇక వధూవరులను వివాహ వేదిక పైనుంచి కిందికి దింపుతారు. సాధారణంగా గౌరీ పూజ జరిపించిన చోటనో, లేకుంటే మరో అనువైన స్థలంలోనో, హోమం ఏర్పాటు చేసి స్థాళీపాకం వేడుక జరిపిస్తాడు పురోహితుడు. ఇందులో భాగంగా మాకు గుర్తున్నంతవరకు హోమం దగ్గర అన్నం వండించే పని చేయించారు. ఇక ఆ తర్వాత సప్తపది చేపట్టారు.

వివాహంలో సప్తపది అతి ముఖ్యమైన ఘట్టం. పరమ పావన మూర్తి అగ్నిహోత్రుడి సాక్షిగా, అగ్నిహోత్రుడి చుట్టూ, పాణి గ్రహణం తర్వాత వధూవరులిద్దరు, వధువు కుడి కాలి అడుగుతో ఆరంభించి, ఏడు అడుగులు వేయిస్తారు. దీనిని సప్తపది అని అంటారు. వధువుతో కలిసి ఏడడుగులు వేస్తూ వరుడు, ఏడు కోరికలను వివరిస్తాడు. అనంతరం వధువు తన అంగీకారాన్ని తెలియ పరుస్తుంది. ఇది గృహస్థా శ్రమ స్వీకారానికి పరమావధి. సప్తపది పూర్తైన తర్వాతనే, వధువు గోత్రం-ప్రవర-ఇంటి పేరు, వరుడి గోత్రం-ప్రవర-ఇంటి పేరు గా మారుతుంది. వధూవరులు కలిసి అడుగులు వేస్తున్నప్పుడు, భారతీయ-హిందూ సాంప్రదాయ వివాహ విధానాన్ని, అందులోని గొప్పదనాన్ని విశదపరిచే మంత్రాన్ని చదువుతారు. అందులో, "ఓ చిన్నదానా ! నీవు నన్ను అనుసరించి నడువు. నీవు నడిచేటప్పుడు శ్రీ మహా విష్ణువు, మొదటి అడుగులో అన్నాన్ని-ఐశ్వర్యాన్ని, రెండవ అడుగులో శారీరక-మానసిక బలాన్ని, మూడవ అడుగులో మంచి పనులు చేయాలన్న సంకల్పాన్ని-ఉత్తమ కర్మనూ-శ్రద్ధనూ, నాలుగవ అడుగులో కర్మ ఫలాన్నీ-సుఖాన్నీ-ఆనందాన్నీ, ఐదవ అడుగులో పశు సమృద్ధినీ-ధన ధాన్యాలనూ, ఆరవ అడుగులో మంచి సంతానాన్నీ, ఏడవ అడుగులో ఇద్దరి ఆధ్యాత్మిక చింతనకు తగు రక్షణను మనకు కలిగించుగాక" అన్న అర్థం స్ఫురిస్తుంది.

వధువును అగ్నికి తూర్పునకుగానీ, ఉత్తరం నకుగానీ, ఏడు మంత్రాలతో, ఏడు అడుగులు నడిపించుతున్న వరుడితో జపం చేయించారు. హోమం కూడా చేయించారు. ఇక్కడే (నేను అన్నట్లుగా) చెప్పిన మరో మంత్రంద్వారా మేమిద్దరం ఇకనుంచి స్నేహితులం అన్న అర్థం కూడా వుంది. "మన ఇద్దరం స్నేహితులం. నీవు నాతో ఏడడుగులు నడవడంతో మన ఉభయులకు మైత్రి కలిగింది. నీ చేతిని నేనెప్పుడూ విడవను-నన్ను నీవు కూడా విడవవద్దు. మంచి మనస్సుతో అన్నోదకాలను స్వీకరించి ఆరోగ్యంగా ఐశ్వర్యాన్ని అనుభవించుదాం. పరస్పరం చర్చించుకొని కుటుంబ పనులను నెరవేరుద్దాం. అనుకూల దంపతులమై సంసార యాత్ర కొనసాగించుదాం. నువ్వు భూమివి-నేను ఆకాశాన్ని. నువ్వు వాక్కువు-నేను మనస్సును. నేను చేసే ధర్మ కార్యాలకు నీ సహకారం కావాలి. యోగ్యమైన సంతానాన్ని-సంపదను మనం ఇద్దరం కలిసి అనుభవించుదాం" అని దానర్థం.

ఇంకా మంత్రోచ్ఛారణ ద్వారా ఇలా చెప్పించారు: " రాత్రి గాని, పగలు గాని, ఎల్ల వేళలా సుఖ సంతోషాలతో నువ్వుండాలి నీకు ఎటువంటి ఇబ్బందీ కలగరాదు. సుమంగళివై-సత్ సంతానంతో గృహలక్ష్మివై, అభివృద్ధి చెందాలి" అని రక రకాలుగా అనునయించే మాటలివి. ఆ మంత్రాలెంతవరకు అర్థమయ్యాయో-ఆ క్షణాన గుర్తు లేకపోయినా, అందులోని సారాన్ని మటుకు తు.చ తప్పకుండా పాటిస్తున్నాం మేము. ఇంతవరకూ, కుటుంబానికి సంబంధించిన ఏ విషయాన్నైనా-ముఖ్యంగా సంతానానికి సంబంధించిన ఏ విషయమైనా, ఇరువురం క్షుణ్నంగా చర్చించుకోకుండా ఒక్క అడుగుకూడా ముందుకు వేయలేదు-వేయడం లేదింతవరకు. బహుశా అది "సప్తపది" మహిమేనేమో !

సప్తపది తర్వాత మరో ముఖ్యమైన వివాహ వేడుకలు, నాగవల్లి-సదశ్యం. ఆ తర్వాత అప్పగింతల కార్యక్రమం. సదశ్యంలో బ్రాహ్మణులకు కానుకలు, వధూవరులకు బట్టలు పెట్టే కార్యక్రమం వుంటుంది. నాగవల్లిలో పెళ్లి కూతురుకు భర్తతో కాలి మెట్టెలు తొడిగించే కార్యక్రమం, గుచ్చిన నల్లపూసల తాడును వధువు మెడలో కట్టించే కార్యక్రమం జరిపించారు. నల్ల పూసలతాడును కూడా మూడు ముళ్లు వేయించారు. ఇక వధూవరులతో కలిసి సమీప బంధుమితృల కోలాహలం మధ్య "భుజం బంతి భోజనాల" హడావిడి జరిగింది. వధూవరులిద్దరిని పక్క-పక్కన కూచోబెట్టి, వెండి కంచాలలో ఇరువురికీ భోజనాలు వడ్డించి, వరుసకు బావా-మరదళ్లలాంటి వారి వేళా-కోళాల మధ్య భోజన చేయడం ఆరంభించుతారు అందరూ. మధ్యలో పాటలు, వధూవరులు ఒకరి కంచంలోది మరొకరి కంచంలో వుంచడం, పక్క వారందరూ తినమని బలవంతం చేయడం అక్కడ జరిగే వేడుక. మా ఆవిడ అక్క కూతుళ్లు సత్యవతి (చినపాప), రాణి చిన్నపిల్లలైనా, వాళ్ల పాటలతో సందడిగా సాగిందా కార్యక్రమం.

ఆ సాయంత్రం డిన్నర్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటుచేశారు మా మామగారు తన ఇంట్లో ఆరుబయట. ఖమ్మం పట్టణానికి చెందిన పెద్దలనేకమందిని ఆహ్వానించరాయన దానికి. నేను ఆరోజున సూటు-బూటు వేసుకోలేదని, ధోవతి ధరించే వున్నానని ఇప్పటికీ మా శ్రీమతి నన్ను వేళాకోళం చేస్తుంటుంది. డిన్నర్ కంటే ముందు కాసేపు జరిపించాలనుకున్న "మేజువాణి" వేడుక సమయాభావం వల్ల మా ఇంట్లో చేసేందుకు నిర్ణయించారు బంధువులు.

ఉంగరాలు తీయడమనే "ప్రధానాంగుళీయకం" వేడుకను కూడా మధ్యలో జరిపించారు. మూత కురుచగా ఉండే చిన్న బిందెలో పాలూ, నీళ్ళూ పోసి, దానిలో మెట్టెలు, ఒక బంగారు ఉంగరాన్ని వేసి పురోహితుడు చెప్పగానే గభాలున దానిని తీయడానికి వధూవరులు ప్రయత్నించే తంతు అది. దొరికిన వారు వేరొకరికి తొడుగుతారు. చూడటానికి సరదాగా కన్పించే ఇది కేవలం అప్పటిదాకా పరిచయం లేని వదూవరులకు స్పర్శ తాలూకు సాన్నిహిత్యాన్ని తెలియచేయడానికి ఉద్దేశించబడిన కార్యక్రమం. ఇక్కడా బంధుమితృల కోలాహలం చోటుచేసుకుంటుంది. ఆ కాసేపు అది ఇరు పక్షాల వారి మధ్య ఒక నిజమైన పోటీలా జరుగుతుంది. మేమైతే దాన్నొక సరదాగానే తీసుకున్నాం. బహుశా మూడు పర్యాయాలు వుంగరం నా చేతికే చిక్కినట్లు జ్ఞాపకం. వెండి దొరికినవారికి దక్కాల్సిన గౌరవం మా అవిడకు కలిగింది.

కన్యా దాత ఇంట్లో జరిగే వేడుకల్లో "అప్పగింతలు" కార్యక్రమం అన్నింటిలోకి చివరిది-ఉద్వేగ భరితమైంది. సాధారణంగా పెళ్లి జరిగిన రోజున అర్థరాత్రి దాటింతర్వాత అప్పగింతల మంత్రంతో మొదలవుతుంది కార్యక్రమం. అయితే ఇటీవలి కాలంలో, వసతి గృహాల్లో పెళ్ళిళ్లు జరుపుకోవాల్సిన పరిస్థితుల్లో, వాళ్లిచ్చిన వేళకు మించి అక్కడ వుండడం కుదరనందున, అన్నీ ఆ టైంలోపల జరిపిస్తున్నారు. వధూవరులకు చూపాల్సిన "అరుంధతి" నక్షత్రాన్ని కూడా పట్ట పగలు చూపించి "కనబడిందా?" అని అడుగుతున్నాడు పురోహితుడు. కనబడిందని జవాబిస్తున్నారు వధూవరులు. మా విషయంలో అలా జరగలేదు. అప్పగింతలు అర్థరాత్రే జరిగాయి. అరుంధతి నక్షత్రాన్ని కూడా రాత్రివేళే చూపించారు.

భజంత్రీలు అప్పగింతల పాట పాడుతున్నారు. పెళ్ళి పీటపై వధువును మధ్యలో కూర్చుండ బెట్టి, పాలలో చేతిని ముంచిన తర్వాత అప్పగింతల తంతు జరుగుతుంది. అప్పగించిన పెద్దలందరికీ బట్టలు పెట్టే తంతుంటుంది. వధువు రెండు చేతులను పాలలో ముంచి వరుని చేతిలో పెట్టి అప్పగించాలి. అప్పగించుతూ: "అష్టవర్షాభవేత్ కన్యా, పుత్రవత్ పాలితా మయా, ఇదానీం తవ దాస్యామి, దత్తా స్నేహేన పాలయా" అంటాడు కన్యా దాత. అంటే, "పుత్రుడితో సమానంగా పెంచిన ఎనిమిది సంవత్సరాల వయసున్న ఈ కన్యను నీకిస్తున్నాను. నీవు ఈమెను ప్రేమాభిమానాలతో కాపాడు." అని దాని అర్థం. అదే మంత్రం చదువుతుంటే, అదే అర్థం వచ్చేలా, అత్తమామలు వరుడి ప్రక్కన కూర్చుని వుంటే, వారికి కూడా వధువు రెండు చేతులు పాలలో ముంచి వారి చేతులో అద్ది, "మీ పుత్రిక వలె కాపాడాలి" అని అప్పగిస్తారు. బహుశా అప్పగింతల ద్వారా, పెళ్లికూతురును అత్తవారింటి వైపు బంధువులందరికీ పరిచయం చేయడం కొరకు, ఈ వేడుకను జరిపిస్తుండవచ్చు.

అప్పగింతల ముందర "వడి కట్టు" వధువుకు కట్టు తారు. వడి కట్టులో శేరుంబావు బియ్యం, వెండి గిన్నె, కొబ్బరి చిప్ప వుంచుతారు. అప్పగింతల కార్యక్రమంలో వధువును అప్పగించే ముందర, "బొమ్మ"ను అప్పగించడమనే, చిన్న వేడుక జరిపారు. ఒక మంచం మీద జంఫఖానా పరిచి, జాకెట్ గుడ్డతో ఊయలలాగా చేసి, అందులో ఈ చెక్క బొమ్మను నిదురిస్తున్న భంగిమలో వుంచుతారు. వధూవరుల కొంగులను కలిపి, అందులో ఎర్ర నీరు ఊయలలోంచి పడే విధంగా పోస్తారు. వధువుతో వరుడికి ఆ బొమ్మనిప్పించి, తాను పనిమీద వున్నాననీ, బొమ్మ రూపంలో వున్న వాళ్ల పాప-బాబును జాగ్రత్తగా చూస్తుండమనీ అనిపిస్తారు. అలా మూడు సార్లనిపించిన తర్వాత, ఆడబిడ్డకు ఆ పనిని అప్పగించుతారు. ఆడ బిడ్డకు బొట్టు పెట్టి, చీరె ఇచ్చి, బొమ్మను చేతిలో వుంచుతారు. ఇదయిన పిదప, అయిదుగురు దంపతులకు వధూవరులతో, (దంపత) తాంబూలాలు ఇప్పించుతారు. పెద్దలందరికీ వీరిరువురితో దండాలు పెట్టిస్తారు.

ఈ అప్పగింతలు చేసేవారికి, చూసే వారిలో చాలామందికి కంట తడిపెట్టిస్తుందనడంలో అతిశయోక్తి కాదు. ఇన్నాళ్లుగా పెంచి పోషించిన కూతురు తమను విడిచి అత్త వారింటికి వెళుతుందని ఆమెను వదలి వుండాలే అనే బాధ కన్నవారికి కలగడం సహజం. అప్పగింతల కార్యక్రమం అనంతరం, పెళ్ళికూతురును లోపటికి తీసుకునిపోయి, పెరుగు అన్నం పెట్టి, దేవుడికి దండం పెట్టించి, బయట ఇంటి సింహద్వారం దగ్గర తల్లి కడుపుపై మజ్జిగతో అద్దించి, గడపకు చేతులతో కొట్టించుతారు. ఇవన్నీఅయ్యాక విడిది గృహ ప్రవేశానికి పంపుతారు. ఇక అంతటితో కన్యా దాత ఇంటినుంచి ముందు జరగాల్సిన వేడుక, విడిదికి-అక్కడినుంచి పెళ్లికొడుకు ఇంటికి మారుతుంది. అదే జరిగింది మా విషయంలోనూ. ఇంగ్లాండులో వున్న మా శ్రీమతి పెద్ద అన్నగారు డాక్టర్ రంగారావు పెళ్ళి సందర్భంగా రాసిన వుత్తరాల్లో, అప్పగింతల గురించి రాశాడని ఇప్పటికీ చెపుతుంటుంది మా ఆవిడ.

పెళ్ళి మొత్తం కార్యక్రమాలలోను, ప్రధాన పాత్ర పోషించడంలోను, మా ఆవిడ రెండో అన్నయ్య డాక్టర్ వేణు మనోహర రావు ఎక్కడ చూసిన తానే అన్నట్లు వ్యవరించారు. ఇక "అప్పగింతల సీన్" ను తల్చుకున్నప్పుడల్లా, "నభూతో న భవిష్యత్" అనిపించింది !(Part XIII Next Follows)

No comments:

Post a Comment