Thursday, February 25, 2010

వివాహబంధం-V: నిశ్చితార్థం-లగ్న నిశ్చయం-శుభ లేఖలు-పెళ్లిపనుల ఆరంభం: వనం జ్వాలానరసింహారావు

జ్వాలానరసింహారావు-విజయలక్ష్మిల వివాహం-V
శ్రీ పప్పు లక్ష్మీనరసింహమూర్తి చెప్పిన
"హిందూ సాంప్రదాయ వివాహ వేడుక"

పెళ్లినాటి ప్రమాణాలు అమలుకు ముహూర్త బలం ముఖ్యం
వనం జ్వాలానరసింహారావు

ఖమ్మం మామిళ్ళగూడెంలోని మా ఇంట్లో మాటా-మంతీ అయిపోయి, ఒకరి వంశ క్రమం గురించి మరొకరు అవగాహన కొచ్చిన తర్వాత, ఆచారం ప్రకారం తర్వాత జరగవలసిన కార్యక్రమాన్ని ఖరారు చేసుకున్నారు. రెండు నెలల తర్వాత మార్చ్ 30, 1969న ఆడపిల్ల వారింట్లో కలిసి, ముహూర్తాలు పెట్టుకోవాలని, నిర్ణయించుకున్నారు. బ్రాహ్మణుడిని సంప్రదించి పెళ్లి ఎన్నడు జరుగుతే మంచిగుంటుందో అనే విషయంలో తుది నిర్ణయం తీసుకోవాలనుకున్నారు. వివాహంలో ముఖ్యమైన ఘట్టాలలో మొదటిది వాగ్ధానం. అంటే: పెళ్ళి ఖాయపరచుకోవడం (నిశ్చితార్థం) తర్వాత వర-వరణం. అంటే: వరుడిని లాంఛనప్రాయంగా అంగీకరించడం. నిశ్చితార్థానికే మరోపేరు "నిశ్చయ తాంబూలం". వైదిక మంత్రాల మధ్య వివాహ ప్రక్రియకు పెద్దల ఆశీస్సులు తీసుకోవడానికే ఈ కార్యక్రమం. అందరికీ ఆమోదయోగ్యమైన శుభ ముహూర్తంలో పురోహితుడు బంధుమిత్రుల సమక్షంలో పెళ్ళి ముహూర్తాన్ని లగ్న పత్రికగా రాయించిన తదుపరి, వధూవరుల తల్లి-తండ్రులు లగ్న పత్రికలు, తాంబూలాలు మార్చుకుంటారు. పెళ్ళి ఒప్పందం లాంటి ఈ వేడుక వధువు ఇంటిలోగాని, వారేర్పాటుచేసుకున్న వసతి గృహంలోగాని జరుగుతుంది. దీన్నే ఇప్పుడు "ఎంగేజ్ మెంట్" అంటున్నారు. కొందరు ఇటీవలి కాలంలో ఈ తంతును పెళ్లికంటే ఘనంగా జరుపుకుంటున్నారు. నిశ్చితార్థం రోజున అమ్మాయి, అబ్బాయి ఉంగరాలు మార్చుకోవటంతో సగం పెళ్ళి జరిగినట్టు గానే భావిస్తారు.

సాంప్రదాయ బద్ధంగా, వధూవరుల తలిదండ్రుల మధ్యన ఇచ్చి-పుచ్చుకోవడాలు అందరి ఇళ్లల్లో ఒకే రకంగా వుంటాయి. తాహతును బట్టి కొంచెం మార్పులు-చేర్పులు వుండొచ్చు. ఇరుపక్షాల వాళ్ళు మరిచిపోవడానికి ఆస్కారం లేకుండా, అరమరికలు లేకుండా, ఒక కాగితం మీద ఇచ్చి-పుచ్చుకోవడాలకు సంబంధించిన వివరాలన్నీ రాసుకోవడం కూడా సంప్రదాయమే.

సాధారణంగా ఆడ పెళ్లివారిచ్చేవి-విధిగా ఇవ్వాల్సినవి: స్నాతక ద్రవ్యాలు, వరుడి ధోవతులు, మధు-పర్కాలు (వరుడుకి ఇవ్వాల్సిన బట్టలు), ఉత్తర జంధ్యాలు, భటువు, కాళ్లుగడిగే పళ్లెం-బిందెలు, కల్యాణ వేదికపై వరుడిని కూచోబెట్టే చిన్న బల్ల, వివాహంలో వివిధ సందర్భాలలో (స్థాళీపాకం, నాగవల్లి, సదశ్యం, అప్పగింపులు, మేజువాణి లాంటివి) వరుడికి పెట్టాల్సిన బట్టలు (ధోవతులు, పట్టు బట్టలు, సూట్, పాంట్-షర్ట్ లు లాంటివి), వరుడివైపు బంధువులకు పెట్టాల్సిన బట్టలు, అప్పగింతల బట్టలు, పెళ్ళైన తర్వాత మగ పెళ్ళివారింట్లో గృహప్రవేశం సందర్భంగా-సత్యనారాయణ వ్రతమప్పుడు వధూ-వరులకు పెట్టవలసిన బట్టలు, ఆడ బిడ్డలకు-అత్తగారికి ఇవ్వదల్చుకున్న లాంఛనాలు, పెళ్ళి కూతురుకు ఇచ్చే సారె (సారె పెట్టెలో పెట్టాల్సిన వస్తువులు-ఏభై ఒక్క కొబ్బరి చిప్పలు, ఐదు రవికె గుడ్డలు, రెండుంపావు కిలోల శనగ-సున్నిపిండి, కిలోంబావు పసుపు-అందులో సగం కుంకుమ, చీరె-ధోవతులు, ఐదు రకాల తీపి పదార్థాలు) ముఖ్యమైనవి.

సాధారణంగా మగ పెళ్లివారిచ్చేవి-విధిగా ఇవ్వాల్సినవి: స్నాతకంలో బావమరిదికి పెట్టాల్సిన బట్టలు, పెళ్ళి కూతురుకు పెట్టాల్సిన పట్టు చీరెలు-ఇతర చీరెలు, నగలు-ఆభరణాలు, నల్లపూసలు, పుస్తె (ఒకటి పుట్టింటి వారు, ఇంకొకటి అత్తగారింటి వారు ఇవ్వాలి), మెట్టెలు, ముత్తవుతల్లి (వధువు అమ్మమ్మ) కిచ్చే కట్నం, వధువు తల్లి కడుపు చీరె-తండ్రికి బట్టలు, ప్రధానపు వుంగరం లాంటివి.

వధూవరుల తారా బలం-చంద్ర బలం చూసి ముహూర్తం నిశ్చయిస్తారు. "పెళ్లినాటి ప్రమాణాలు" భవిష్యత్ లో దంపతులు తు. చ తప్పకుండా అమలు చేయాలంటే "ముహూర్త బలం" ముఖ్యమని హిందువుల నమ్మకం. నిశ్చితార్థంలో ప్రధానంగా విఘ్నేశ్వరుడి పూజ వుంటుంది. వివాహ ప్రక్రియ ఆసాంతం విఘ్నాలు లేకుండా చూడమని ఆయన్ను పూజించడం ఆనవాయితి. నిశ్చితార్థానికి ముందు బంధువుల సమక్షంలో-పరోక్షంలో వధూవరుల తల్లి-తండ్రుల మధ్య కుదిరిన ఇచ్చి-పుచ్చుకునే ప్రతి చిన్న అంశం ఒక కాగితం మీద రాసుకోవడం కూడా సాంప్రదాయంలో భాగమే. ఇదంతా "ఆచారం-పద్ధతి". అనుకున్నట్లే బంధు-మిత్రుల సమక్షంలో, ఖమ్మం-మామిళ్లగూడెంలోని అయితరాజు రాంరావు గారింట్లో మార్చ్ 30, 1969న మా పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవడం జరిగింది. వధూ-వరుల తారా బలం, చంద్ర బలం ఆధారంగా, మా పురోహితుడు (లంకా సిద్ధాంతి గారు) వారి పురోహితుడిని సంప్రదించి ఏప్రిల్ 30, 1969 న, ఉదయం 9-58 కి లగ్నం నిశ్చయించారు. వాస్తవానికి మా నాన్నగారు నా పుట్టిన తేదీ-తిథి, వార, నక్షత్రాల వివరాలను రాసిపెట్టారు గాని, మా మామ గారు మా అవిడ పుట్టిన తేదీ-తిథి, వివరాలను ఇవ్వలేకపోయారు. అయితే, ఆయన డైరీలో రాసుకున్న తేదీ ఆధారంగా, కూతురు పుట్టినరోజు నవంబర్ 2, 1954 అని చెప్పడంతో దాని ప్రకారమే లగ్న నిశ్చయం చేశారు పురోహితులు.

పెళ్ళి ముహూర్తం దగ్గర పడుతోంది. పెళ్లి సరంజామా కొనడం అనేది ఇరు పక్షాల వారికి కూడా పెద్దపని. పట్టుచీరలు, బంగారు ఆభరణాలు, నూతన వస్తువులు.. .. ఎన్నో కొంటారు. ఇవన్నీ మా వాళ్లూ, వాళ్ల వాళ్లూ నిశ్చితార్థం జరిగిన మర్నాటినుంచి మొదలు పెట్టారు. అప్పట్లో పెళ్లికి అవసరమైన వస్తువులను కొనేందుకు ఖమ్మం జిల్లా వారంతా సాధారణంగా విజయవాడకు వెళ్ళి కొనుగోలుచేసేవారు. అక్కడ వెరైటీలు ఎక్కువే కాకుండా, ధరలు కూడా కొంచెం తక్కువగా వుండేది. నాకు గుర్తున్నంతవరకు, మా నాన్న-అమ్మలు విజయవాడలోను, ఖమ్మం "గెల్లా లక్ష్మినారాయణ-కుంచకర్ర భక్తవత్సల రావు" బట్టల దుకాణంలోను పెళ్ళి బట్టలు కొన్నారు. "కంసాలి బ్రహ్మయ్య" అనే బంగారం వస్తువులు తయారుచేసే వ్యక్తితో పెళ్ళి ఆభరణాలన్నీ తయారు చేయించారు. హైదరాబాద్‌లో పెళ్లికూతురు ఆభరణంలోకి కావాల్సిన "ముత్యాలు" కొన్నాం. పెళ్ళిలో మా ఇంట్లోవాళ్లందరం వివిధ సందర్భాల్లో ధరించే దుస్తులను ఇంట్లోనే ఒక టైలర్‌ను పెట్టి కుట్టించాం.

నిర్ణయించబడిన ముహూర్తానికి వరుని తరపువారూ, వధువు తరపువారూ వారి వారి కులాచారానుసారం "శుభ లేఖలు"గా పిలువబడే ఆహ్వానపత్రికలు ముద్రించుకుంటారు. మంగళ సూచకంగా లేఖకు నాలుగు వైపులా పసుపు పూస్తారు. బంధుగణాన్ని పిలుచు కోవడం పెళ్లిళ్లలో సర్వ సాధారణం. ఎక్కడెక్కడో ఉంటూ, అరుదుగా కలిసే చుట్టపక్కాలతో సహా బంధువులందరూ కలుసుకోగలిగే "సామాజిక ఏర్పాటు" పెళ్ళిళ్లు. ఆ కలయికలకు వేదికగా పెళ్ళి వారి ఇల్లు (కల్యాణ మంటపం) మారిపోతుంది. మా పెళ్లి శుభలేఖలను ఖమ్మం వై.ఎన్. ప్రెస్లోక వేయించాం. బంధు-మిత్రులకు పోస్టులో పంపించినవాటికంటే కూడా, ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వ్యక్తి చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లి పంచినవే ఎక్కువ. ముహూర్తానికి కనీసం పది-పదిహేను రోజులముందునుంచే ఈ కార్యక్రమం ఆరంభమయింది. ఎంత శ్రద్ధ తీసుకుని, అందరికీ పంపించే ఏర్పాటుచేసినప్పటికీ, ఆఖరు నిమిషంలో, ఒక్కోసారి ముఖ్యమైన వారితో సహా కొందరిని మరిచిపోవడం సహజంగా జరుగుతుంది. వాళ్లకు కోప-తాపాలు కూడా వస్తాయి. కాకపోతే వచ్చినంత త్వరగా తగ్గిపోతాయి కూడ. ఇవన్నీ సర్వసాధారణంగా ప్రతి పెళ్లిలోనూ-ప్రతివారింటిలోనూ జరిగే మామూలు విషయాలే. ఆ చిరు కోపాలు రాకుంటే పెళ్ళి శోభ రానట్లే. ఇవన్నీ మా పెళ్ళిలోనూ జరిగాయి-సర్దుకున్నాయి.(Part VI Next Follows)

No comments:

Post a Comment