Monday, December 5, 2011

సీపీఎం ఆవిర్భావం - Part Two: వనం జ్వాలా నరసింహారావు

తీపి గుర్తులు - చేదు అనుభవాలు: అధ్యాయం – 8

సీపీఎం ఆవిర్భావం - Part Two

వనం జ్వాలా నరసింహారావు

(మాజీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సిపిఐ (ఎం) నాయకుడు, ప్రజా వైద్యుడుగా పేరు తెచ్చుకున్న డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తిగారి జీవితచరిత్రను "తీపి గుర్తులు-చేదు అనుభవాలు" గా గ్రంధస్థం చేసే అవకాశం కలిగింది నాకు. 39 అధ్యాయాల ఆ పుస్తకంలోని వివరాలలో ఎనిమిదవ అధ్యాయం ఇది).

భూస్వాములకు-జమీందారులకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనను, వ్యవసాయ కూలీల సమ్మెను, కౌలు దార్ల హక్కుల పోరాటాన్ని, మిగులు భూముల ఆక్రమణను కమ్యూనిస్టుల ఉద్యమంలో భాగం కావాలని చెప్పాడు. కార్మికుల హక్కుల కొరకు కూడా పోరాడాలని అంటాడు. అలా కార్మిక-కర్షక వర్గాలను సమీకరించి పోరాటాలు సలపాలిగాని, "అంతర్యుద్ధం" చేయడానికి సమయం ఆసన్నమైందని భ్రమ పడవద్దని హెచ్చరించాడు. తెలంగాణా సాయుధ పోరాట ఫలితాలను కార్మిక-కర్షక వర్గాలు అనుభవించేందుకు నిరంతర పోరాటం సలపాలని సలహా ఇచ్చాడు. కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుల పార్టీ వ్యతిరేక కలాపాలకు మరణ దండన విధించడం సరైన పద్ధతి కాదని స్పష్టం చేశాడు. వ్యక్తిగత హింసను కూడా ఆయన వ్యతిరేకించాడు.

అంతర్గతంగా వుండిపోయిన భారత కమ్యూనిస్ట్ పార్టీలోని విధానపరమైన అభిప్రాయ భేదాలు, భారత-చైనా యుద్ధం జరిగినప్పుడు బహిర్గతమయ్యాయి. డాంగే, ఆ సమయంలో పార్లమెంట్ లోక్‍సభలో కమ్యూనిస్ట్ పక్షం నాయకుడు. చైనా పట్ల అవలంబించాల్సిన వైఖరి విషయంలో, పార్టీ నాయకత్వంలో తీవ్రమైన చర్చలు జరిగాయి. డాంగే ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూకు ఇచ్చిన మద్దతును తీవ్రంగా వ్యతిరేకించారు జోషి నాయకత్వంలోని మరో వర్గం. ప్రారంభ దశలో డాంగే వాదనకే మెజారిటీ సభ్యుల ఆమోదం లభించింది. ఎప్పుడైతే, "అంతర్జాతీయ కమ్యూనిజం" విషయంలో, డాంగే తనదైన నిర్వచనం చెప్పాడో, మౌలిక పరమైన కమ్యూనిజం విధానాలను వ్యతిరేకించడం ఇష్టపడని పలువురు, ఆయనకు తొలుత మద్దతిచ్చినప్పటికీ, క్రమేపీ ఆయనకు దూరమయ్యారు. సీపీఐ సెక్రెటేరియట్ లోని సభ్యుల్లో రణదివే-జోషి లు చైనా అనుకూలురైన "అతివాదులుగా", డాంగే నెహ్రూకు అనుకూలుడైన "నిరోధక వాద శక్తుల ప్రతినిధి"గా, అజయ్ ఘోష్-జ్యోతి బసులు మధ్యే వాదులుగా, భూపేష్ గుప్త ఎటూ తేల్చుకోని వాడిగా బయట పడ్డారు. చైనా ఏకపక్షంగా యుద్ధ విరమణ చేసిన తర్వాత, రాజీ మార్గంలో నడిచిన కమ్యూనిస్ట్ నాయకత్వం, మితవాద వర్గానికి చెందిన డాంగేను పార్టీ చైర్మన్(అంతకు ముందు లేని పదవి)గా, మితవాద-అతివాద వర్గాలకు సమాన దూరంలో వున్న ఇఎంఎస్ నంబూద్రిపాద్ ను సెక్రెటరీ జనరల్‍గా నియమించింది.

ప్రప్రధమ ప్రధానమంత్రి స్వర్గీయ జవహర్‌లాల్‌నెహ్రూ చైనా పర్యటించి పంచశీల సూత్రం పఠిస్తూనే, సోవియట్‌యూనియన్‌తో మైత్రీ సంబంధాలు పెంపొందించుకుంటూ వచ్చారు. చైనా-సోవియట్‌దేశాలతో భారత దేశం కొనసాగిస్తున్న సత్సంబంధాలతో నిమిత్తం లేకుండానే (ఉమ్మడి) భారత కమ్యూనిస్ట్ పార్టీ, ప్రభుత్వ విధానాలను కొన్నింటిని ఘాటుగా వ్యతిరేకించేది. సోవియట్‌యూనియన్‌, చైనా కమ్యూనిస్ట్ పార్టీల మధ్య తలెత్తిన సైద్ధాంతిక విబేధాల దరిమిలా కారణాలు ఏవైనా చైనా- భారత సరిహద్దు వివాదం మొదలైంది. ఆ వివాదంలో తటస్థ వైఖరిని అవలంబిస్తున్నట్టు నాటి సోవియట్‌ప్రభుత్వం ప్రకటించడం విశేషం. సరిహద్దు తగాదా పర్యవసానంగా భారత చైనా దేశాల మధ్య 1962లో యుద్ధం జరిగింది. అప్పట్లో ఉమ్మడి భారత కమ్యూనిస్ట్ పార్టీలోని ఒక వర్గం భారత ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు ప్రకటించగా, మరో వర్గం (భవిష్యత్ లో సీపీఐ-ఎంగా పిలువబడ్డ)ఆ యుద్ధాన్ని "ఇంతకు పూర్వం ఖచ్చితంగాలేని సరిహద్దు విషయంలో ఏర్పడ్డ వివాదంతో ఏర్పడ్డ సంఘర్షణగా పేర్కొనడంతో, పరోక్షంగా చైనా సానుభూతిపరులుగా ముద్రపడ్డది.

1961 ముందు నుంచే ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో అంతర్గతంగా తలెత్తిన సైద్ధాంతిక అభిప్రాయ భేదాలు, పరస్పర వ్యతిరేక భావ ప్రకటనలు, పార్టీలో చీలికకు దారి తీసేంతవరకూ వెళ్లాయి. భారత చైనా దేశాల మధ్య యుద్ధం జరిగిన తర్వాత కమ్యూనిస్ట్ ఉద్యమంలో చీలిక రావడంతో సోవియట్ యూనియన్-చైనాల రాజకీయ ప్రభావం వల్లో, ఉమ్మడి పార్టీలోని కొందరి మధ్య తలెత్తిన వ్యక్తిగత అభిప్రాయ భేదాల వల్లో పార్టీ చీలిందన్న ప్రచారం అప్పటి నుంచీ ఇప్పటి దాకా జరుగుతూనే ఉంది. అందులో నిజానిజాలు ఎలా ఉన్నా పార్టీలో 50వ దశకం నుండే కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల-పార్టీ పట్ల, దాని వర్గ స్వభావం పట్ల అనుసరించాల్సిన వ్యూహం గురించిన చర్చ చాలా కాలం కొనసాగి, పరాకాష్ఠగా సైద్ధాంతిక విభేదాల ప్రాతిపదికపై చీలిక అనివార్యమయింది. సిపిఐ-సిపిఎంలుగా చీలి పోయింది పార్టీ. ఏప్రిల్ 11, 1964 న నంబూద్రిపాద్, జ్యోతిబసులతో సహా ముప్పై రెండు మంది డాంగే విధానాలను వ్యతిరేకిస్తూ, జాతీయ కౌన్సిల్ సమావేశాలనుంచి నిష్క్రమించడంతో, వారందరినీ పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది పార్టీ. దరిమిలా ఆంధ్ర ప్రదేశ్ లోని తెనాలిలో బహిష్కృత అతివాద వర్గం సమావేశమవడం, కలకత్తాలో జాతీయ కౌన్సిల్ సమావేశం జరపాలని తీర్మానించడం జరిగింది. అక్టోబర్-నవంబర్ 1964లో కలకత్తాలో ఏడవ కాంగ్రెస్ పేరుతో అతివాద వర్గం, సమాంతరంగా బాంబేలో డాంగే నాయకత్వంలోని మితవాద వర్గం సమావేశాలు జరుపుకున్నాయి. కలకత్తాలో సమావేశమైన వారు భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) గా అవతరించగా, బాంబేలో సమావేశమైన వారు భారత కమ్యూనిస్ట్ పార్టీ గా వుండిపోయారు. కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) తొలి ప్రధాన కార్యదర్శిగా పుచ్చలపల్లి సుందరయ్యను ఎన్నుకున్నారు సమావేశంలో. డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి సుందరయ్య నాయకత్వంలోని కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) అభిమానిగా, ఆచరణీయుడుగా వుండిపోయారు. ఆ నాడు (1964) ఖమ్మం జిల్లాలో గిరి ప్రసాద్ నాయకత్వంలో సిపిఐతో వెళ్లిన వారు చాలా కొద్దిమంది మాత్రమే!

తెనాలిలో జరిగిన సమావేశాల వివరాలకు సంబంధించి "ప్రజాశక్తి" పత్రిక "మార్క్సిస్ట్" మాగజైన్ లో వచ్చిన వ్యాసాన్ని జలై 12, 2009 రోజున ప్రచురించింది. ఆ వివరాలు:

"భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) నాయకత్వంలోని ఒక సెక్షన్‌లో తెలంగాణా పోరాట కాలంలోనే రివిజనిస్టు పోకడలు పొడచూపాయి. రివిజనిజానికి వ్యతిరేకంగా ప్రారంభమైన ఆంతరంగిక పోరాటం 1955- 56 నాటికి తీవ్రస్థాయికి చేరుకుంది. ఉమ్మడి పార్టీలోని రివిజనిస్టు నాయకత్వం అనుసరిస్తున్న వర్గసంకర విధానాన్ని పార్టీలోని పెద్ద సెక్షన్‌ (తరువాత మార్క్సిస్టు పార్టీగా పునర్నిర్మాణం చెందింది) తీవ్రంగా వ్యతిరేకించింది. పార్టీ కార్యక్రమం, ఎత్తుగడల విషయంలో ఆంతరంగి కంగా పార్టీ నిలువునా చీలిపోయింది. 1961 లో విజయవాడలో జరిగిన ఉమ్మడి పార్టీ చివరి మహాసభ ఈ విభేదాలను పరిష్కరించలేక పోయింది. కమ్యూనిస్టు ఉద్యమం ఐక్యంగా ఉండాలంటే పార్టీలో కిందినుండి పైస్థాయివరకు కార్యక్రమం, ఎత్తుగడలపై కూలంకషమైన చర్చ కేంద్రీకృత ప్రజాస్వామ్య పద్దతుల్లో జరగాలని పార్టీలోని ఒక భాగం డిమాండ్‌చేసింది. కాని నాటి పార్టీ నాయకత్వంలోని మెజారిటీ సభ్యులు రివిజనిస్టు ప్రభావానికి గురైఉన్నందున ఇటువంటి చర్చకు ఆస్కారం ఇవ్వలేదు సరికదా కాంగ్రెస్‌ప్రభుత్వంతో చేతులు కలిపి అలా డిమాండ్‌ చేసినవారిని అరెస్టు చేయించడం ప్రారంభించింది”.

“1962 భారత్‌-చైనా యుద్ధాన్ని రివిజనిస్టు నాయకత్వం దీనికోసం ఉపయో గించుకుంది. చైనాతో యుద్ధాన్ని బలపరుస్తూ రివిజనిస్టు నాయకత్వం జాతీయ కౌన్సిల్‌లో చేసిన తీర్మానాన్ని వ్యతిరేకించిన వారందరినీ కాంగ్రెస్‌ ప్రభుత్వం అరెస్టు చేయడం ప్రారంభిం చింది. నాయకులు జైళ్లలో ఉన్న సమయంలో మొత్తం పార్టీ కార్యాలయాలనూ, పత్రికలనూ రివిజనిస్టు నాయకత్వం స్వాధీనం చేసుకోవడం ప్రారంభించింది. ప్రజాతంత్ర విరుద్ధంగా జరుగుతున్న ఇటువంటి కార్యకలాపాలకు ఫుల్‌స్టాప్‌పెట్టాలనీ, పార్టీలో ఐక్యత పాదుకొల్పేం దుకు అన్ని స్థాయిల్లో చర్చలజరగాలని జాతీయ కౌన్సిల్‌కు కొందరు సభ్యులు ఇచ్చిన నోటీసును నాయకత్వం తిరస్కరించడంతో ఇంక చేసేది లేక 32 మంది జాతీయ కౌన్సిల్‌సభ్యులు వాకౌట్‌చేసి బయటకు వచ్చేశారు. పార్టీని విప్లవ పంథాలో పునర్నిర్మించాలని ఆ 32 మంది సభ్యులు తీసుకున్న నిర్ణయం ప్రకారమే తెనాలిలో 1964 జులైలో మూడురోజుల జాతీయ సదస్సు జరిగింది. అదే ఏడాది నవంబర్‌లో కలకత్తాలో జరిగిన భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఏడవ మహాసభకు సన్నాహంగా తెనాలి సదస్సు జరిగింది. ఈ సదస్సులోనే పార్టీ కార్యక్రమం, ఎత్తుగడల పత్రం రూపుదిద్దుకుంది. కలకత్తా మహాసభ దీన్ని ఆమోదించింది".

"సన్నాహక సదస్సును విజయవాడలో నిర్వహించాలని తొలుత భావించారు. కాని ప్రభుత్వం దానికి ఆటంకం కల్పించింది. ఆ సమయంలో విజయవాడ నగరంలో భారీ స్థాయిలో సాగిన గృహదహనాల కారణంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినాయి. కాంగ్రెస్‌వాళ్లు పార్టీపై దుష్ప్రచారానికీ, దాడులకూ పాల్పడ్డారు. పాత జైహింద్‌టాకీస్‌వద్ద ఏర్పాటుచేసుకున్న పార్టీ కార్యాలయంపై కూడా దుండగులు దాడులకు పాల్పడే పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో దేశంలోని వివిధ ప్రాంతాలనుండి వచ్చే ప్రతినిధులు ఒక చోట కూర్చుని చర్చించే వాతావర ణమూ లేదు, పోలీసులు కూడా అనుమతులు ఇవ్వకుండా అడ్డుపడ్డారు. దాంతో సమావేశ స్థలాన్ని అక్కడకు దగ్గరలోనే ఉన్న గుంటూరు జిల్లా తెనాలికి మార్చారు".

"తెనాలిలో నాడు పార్టీకి మంచి పట్టుండేది. ప్రతినిధులకు కావలసిన వసతులు సమకూర్చ డానికి కావలసిన ప్రాంగణాలు కూడా అక్కడ ఉన్నాయి. దాంతో తక్కువ సమయంలోనే సదస్సు నిర్వహణకు అక్కడ ఏర్పాట్లు జరిగాయి. తెనాలిలో సదస్సు జరపాలని పార్టీ జాతీయ కౌన్సిల్‌నుండి వాకౌట్‌ చేసినవారు నిర్ణ యించుకున్నట్లు సాయంత్రం ఏడు గంటలకు రేడియో వార్త వెలువడింది. అంతే రాత్రి ఎనిమిది గంటల సమయానికి పట్టణంలోని లాడ్జీ లన్నిటినీ ప్రభుత్వాధికారులే బుక్ చేశారు. దాంతో ప్రతినిధులకుగాని, నాయకులకు గాని ఎక్కడా వసతి దొరకని పరిస్థితి. దాంతో చెంచుపేటలో రైల్వేస్టేషన్‌దగ్గరలోనే కోనేరు పక్కన పాడుపడిన రైసు మిల్లును శుభ్రం చేసి సదస్సు ప్రధాన ప్రాంగణంగా ఉపయోగించారు. ఈదర శివరామకృష్ణయ్య అనే పార్టీ సానుభూతిపరుడు ఆ రైసుమిల్లును అద్దెకు తీసుకుని నడిపాడు. కాని కొన్నాళ్లు నడిచి ఆగిపోయింది. దానిపేరు రాజ రాజేశ్వరీ రైస్‌మిల్లు. రైసుమిల్లు ఒక ఇనుప రేకుల షెడ్డు. దానికి ప్రక్కనే ఒక తాటాకు పాక వేశారు. అదే ప్రతినిధుల భోజనశాల. సదస్సు ప్రాంగణానికి కోటేశ్వరనగర్‌అని పేరుపెట్టారు. సదస్సు ఏర్పాట్లలో రావి హైమారావు పూర్తికాలం పనిచేయగా ఆయన కుటుంబం సహకరించింది".

"మూడు రోజుల సదస్సు నిర్వహణలో దాదాపు 20 మంది కార్యకర్తలు ఆహోరాత్రులు కష్టపడ్డారు. నాలుగో రోజు బహిరంగ సభ జరిగింది. కామ్రేడ్స్ లావు బాలగంగాధరరావు, కొరటాల సత్యనారాయణ, పర్చూరు నాగేశ్వరరావు, సదస్సు ఏర్పాట్లు పర్యవేక్షించారు. అయితే సదస్సు సమయంలో మాత్రం కామ్రేడ్ లావు బాలగంగాధరరావు అక్కడ లేరు. పార్టీ అగ్రనాయకులు మాకినేని బసవ పున్నయ్య సతీమణి, బాల గంగాధరరావు సోదరి జగదాంబగారు తీవ్ర అస్వస్థతతో ఉండడమే దీనికి కారణం. ఆ సదస్సులో ఖరారు చేసిన పార్టీ కార్యక్రమ పత్రాలు తయారు చేయడంలో బసవ పున్నయ్య తలమునకలయ్యారు. దాని వల్ల జగదాంబగారి దగ్గర గంగాధరరావు ఉండాల్సి వచ్చింది. బసవపున్నయ్య కూడా సదస్సులో ప్రవేశపెట్టే పత్రాలను చాలావరకు ఇంటివద్దనే ఉండి తయారుచేశారు. ఈ సమస్య వల్లనేనేమో తెనాలి సదస్సు సందర్భంగా తీసిన ఏ ఫోటోలో కూడా బసవపున్నయ్య కనిపించరు. తరవాత జరిగిన పార్టీ రాష్ట్ర మహాసభలో కూడా బసవ పున్నయ్య లేరు. సదస్సులో వాలంటీర్స్‌గా పనిచేసినవారిలో గడ్డిపాటి కోటేశ్వరరావు, కొండ్రగుంట వెంకటేశ్వర్లు, రాశాబత్తుని నాగేశ్వర రావు, గుదిబండి శివబసివిరెడ్డి, దేవా సీతారామయ్య, దొడ్డపనేని వెంకటేశ్వరరావు, సింహాద్రి శివారెడ్డి తదితరులున్నారు".

"తెనాలి సదస్సు పార్టీలో తీవ్రమైన ఆంతరంగిక పోరాటానికి పరాకాష్టగా జరిగింది. అందువల్ల పత్రికల్లో ఈ సదస్సు గురించి తీవ్రమైన చర్చోపచర్చలు జరిగేవి. ముఖ్యంగా మార్క్సిస్టు పార్టీగా ఏర్పడిన నాయకులపైనా, వారి వైఖరిపైనా దుష్ప్రచారం చేయడమే పనిగా పెట్టుకుని పత్రికలు విషప్రచారం గావించాయి. సదస్సు జరిగినంత కాలం కామ్రేడ్‌ హరేకృష్ణ కోనార్‌ పత్రికా గోష్టి పెట్టి వివరణ ఇచ్చేవారు. సదస్సు ఏర్పాట్లలో భాగంగా కార్యకర్తలు ప్రాంగణంలోని అయిదు స్థంభాలకు అయిదుగురు అంతర్జాతీయ కమ్యూనిస్టు నేతల ఫోటోలు తగిలించారు. మార్క్స్‌, ఎంగెల్స్‌, లెనిన్‌, స్టాలిన్‌, మావోల ఫోటోలు. ఆర్ట్ పెయింట్‌ తో వేసిన ఆ ఫోటోలను మంచికలపూడికి చెందిన కొండపనేని రంగారావు జెకోస్లోవేకియా నుండి తెచ్చారు. ఆ ఫోటోలలో మావో బొమ్మ ఉండడం, అప్పుడు చైనాకు వ్యతిరేకంగా దేశంలో ప్రచారం జరుగుతుండడంతో పత్రికల్లో పెద్ద దుమారం రేపారు. ఇండియన్‌ ఎక్సప్రెస్‌ లో "మావో పార్టీ" అని సంభోదిస్తూ సదస్సు గురించి వార్త రాశారు. అప్పటికి ఉమ్మడి పార్టీనుండి చీలిపోయిన వారు పార్టీకి పేరుపెట్టలేదు. చైనా అనుకూలురుగా ముద్రవేస్తూ పత్రికలు పెద్ద ఎత్తున వ్యతిరేక వార్తలు రాసేవి. తెనాలి సదస్సు మూడు రోజులు పాటు జరగగా నాలుగో రోజున బహిరంగ సభ జరిగింది. తెనాలి మున్సిపల్‌ ఆఫీసు ప్రాంతాన్ని అప్పట్లో గాడిబావి సెంటర్‌ అనేవాళ్లు. అక్కడ బహిరంగ సభ నిర్వహించారు. సుమారు పదివేల మంది హాజరైన సభనుద్ధేశించి బసవ పున్నయ్య, సుందరయ్య, ప్రమోద్‌ దాస్‌ గుప్త తదితరులు ప్రసంగించారు. వేదిక నిర్మాణం, బహిరంగ సభ ఏర్పాట్లను స్థానిక కార్మిక సంఘం కార్యకర్తలు నిర్వహించారు".

"తెనాలి సదస్సుకు సంబంధించి లభించిన ఫోటోల ప్రకారం దేశవ్యాపితంగా సుమారు 140 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఆంధ్ర ప్రదేశ్‌నుండి 24 మంది, బెంగాల్‌ 22, తమిళనాడు 20, కేరళ 19, ఉత్తర ప్రదేశ్‌10, రాజస్థాన్‌7 మంది హజరవగా పంజాబ్‌, అస్సాం ఇతర రాష్ట్రాలనుండి సుమారు 40 మంది ప్రతినిధులు హాజరైనారు. సిపిఐ జాతీయ కౌన్సిల్‌నుండి వాకౌట్‌చేసిన 32 మంది సభ్యులు ఈ సదస్సుకు హాజరైనారు. అయితే సదస్సు సందర్భంగా దిగిన ఫోటోలో 30 మంది మాత్రమే ఉన్నారు. బసవపున్నయ్య, మరొకరు ఫోటోలో లేరు. వాకౌట్‌ చేసిన వారిలో తరువాత మార్క్సిస్టు పార్టీ తొలి పొలిట్‌బ్యూరోకు ఎన్నుకోబడిన పుచ్చలపల్లి సుందరయ్య, మాకినేని బసవపున్నయ్య, ఎకె గోపాలన్‌, ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌, జ్యోతి బాసు, ప్రమోద్‌ దాస్‌ గుప్త, హరికిషన్‌ సింగ్‌ సూర్జిత్‌, పి. రామమూర్తి ఉన్నారు. సిపిఐ(ఎం) తొలి పొలిట్‌ బూరోలో సభ్యుడైన బిటి రణదివే జైలులో ఉన్నందున సదస్సుకు హాజరు కాలేదు. వీరితో బాటు పంజాబ్‌ నుండి జగ్‌ జిత్‌ సింగ్‌ లాయల్‌పురి, బెంగాల్‌ నుండి ముజఫర్‌ అహ్మద్‌, హరేకృష్ణ కోనార్‌, తమిళ నాడు నుండి ఎంఆర్‌ వెంకటరా మన్‌, శంకరయ్య, కేరళ నుండి ఇకె నయనార్‌‌, కనరన్‌, రాజస్థాన్‌ నుండి మోహన్‌ పునామియా తదితరులున్నారు".

"వాకౌట్‌చేసిన కౌన్సిల్‌సభ్యుల్లో మన రాష్ట్రం నుండి పుచ్చలపల్లి సుందరయ్య, బసవపున్నయ్యలతోబాటు నండూరి ప్రసాదరావు, మోటూరు హనుమంతరావు, తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, గుంటూరు బాపనయ్య, ఉద్దంరాజు రామం ఉన్నారు".

"ఆంధ్రప్రదేశ్‌ నుండి హాజరైన ప్రతినిధుల్లో పైన పేర్కొన్న ఎనిమిది మంది సభ్యులతోబాటు గుంటూరు జిల్లానుండి కొల్లా వెంకయ్య, కృష్ణా జిల్లా నుండి సనకా బుచ్చికోటయ్య, మానికొండ సుబ్బారావు, పశ్చిమ గోదావరి జిల్లా నుండి అన్నే వెంకటేశ్వరరావు, నెక్కల పూడి రామారావు, ఖమ్మం జిల్లా నుండి పర్సా సత్యనారాయణ, చిర్రావూరి లక్ష్మీనర్సయ్య, నల్గొండ జిల్లా నుండి భీమిరెడ్డి నర్శింహారెడ్డి, తూర్పు గోదావరి జిల్లా నుండి కానేటి మోహన రావు, జి. ఎస్‌. బాలాజీ దాస్‌, వరంగల్‌ జిల్లా నుండి ఎం. ఓంకార్‌, విశాఖ జిల్లా నుండి కోడుగంటి గోవిందరావు, చిత్తూరు జిల్లా నుండి వజ్రవేలు చెట్టి, శ్రీకాకుళం జిల్లానుండి రామలింగాచారి ఉన్నారు. వీరు కాకుండా నిజామాబాద్‌ నుండి ఒక కామ్రేడ్‌ పాల్గొన్నారు".

"తెనాలి సదస్సుకు హజరైన ఆంధ్రప్రదేశ్‌ ప్రతినిధుల్లో అత్యధికులు చివరివరకు మార్క్సిస్టు పార్టీలో పనిచేశారు. కొందరు 1967-68 నక్సలైట్‌ చీలికలో వెళ్లి పోయారు. అలా నక్సలైట్‌ల వైపుకు పోయిన వారిలో తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, సనకా బుచ్చికోటయ్య, వజ్రవేలు చెట్టి, అన్నే వెంకటేశ్వరరావు, నెక్కల పూడి రామారావు, కొల్లా వెంకయ్య, రామలింగాచారిలు ఉన్నారు. అన్నే వెంకటేశ్వరరావు తరువాత తిరిగి మార్క్సిస్టు పార్టీలోకి వచ్చారు. కానేటి మోహన రావు తరువాతి కాలంలో పార్టీ పనిలో చురుకుగా లేరు. ఓంకార్‌, భీమిరెడ్డి నర్సింహారెడ్డి కొంతకాలం మార్క్సిస్టు పార్టీ నాయకత్వంలో ఉండి పార్టీని విడిచిపెట్టారు. కోడుగంటి గోవిందరావు ఎక్కువ కాలం మార్క్సిస్టు పార్టీలో లేరు. ఆయన తరువాత సిపిఐలో చేరారు. తెనాలి సదస్సుకు హజరైన ప్రతినిధులు అందరూ కలిసి, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంగా విడివిడిగా ఫోటోలు దిగారు. ఉత్తర ప్రదేశ్‌ప్రతినిధుల్లో భగత్‌ సింగ్‌ సహచరుడైన శివవర్మ, పశ్చిమ బెంగాల్‌ ప్రతినిధుల్లో, సరోజ్‌ ముఖర్జీ, వినయకృష్ణ చౌదరి, కేరళ ప్రతినిధుల్లో సుశీలా గోపాలన్‌ తదితరులు కూడా ఉన్నారు".

No comments:

Post a Comment