Thursday, December 22, 2011

రైల్వే సమ్మె: వనం జ్వాలా నరసింహారావు


తీపి గుర్తులు - చేదు అనుభవాలు: అధ్యాయం – 15
రైల్వే సమ్మె
వనం జ్వాలా నరసింహారావు
(మాజీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సిపిఐ (ఎం) నాయకుడు, ప్రజా వైద్యుడుగా పేరు తెచ్చుకున్న డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తిగారి జీవితచరిత్రను "తీపి గుర్తులు-చేదు అనుభవాలు" గా గ్రంధస్థం చేసే అవకాశం కలిగింది నాకు. 39 అధ్యాయాల ఆ పుస్తకంలోని వివరాలలో పదిహేనవ అధ్యాయం ఇది).
డాక్టర్ వై.ఆర్.కె ని మరో మారు కూడా జైలుకు పంపింది ప్రభుత్వం. అఖిల భారత స్థాయిలో జార్జ్ ఫెర్నాండెజ్ నాయకత్వంలో పెద్ద ఎత్తున రైల్వే కార్మికుల సమ్మె జరిగింది 1974లో. కమ్యూనిస్ట్ (మార్క్సిస్ట్) పార్టీకి ఆ సమ్మెతో పెద్దగా సంబంధం లేకపోయినప్పటికీ, ఆ పార్టీ కార్యకర్తలను కూడా అరెస్ట్ చేసింది ప్రభుత్వం. కాకపోతే సిపిఎంకు, ఖమ్మం జిల్లాలోని డోర్నకల్ రైల్వే యూనియన్‍తో సంబంధాలుండేవి. ఆ సాకు చూపించి, అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి జలగం వెంగళరావు, సహజంగా ఎప్పటినుంచో ఆయనకు డాక్టర్ వై.ఆర్.కె పై వున్న ద్వేషంతో, ఆయనను అరెస్ట్ చేయించాడు. వాస్తవానికి వెంగళరావుకు ఆయనపై వ్యక్తిగతంగా ద్వేషం పెంచుకోవడానికి కారణంలేకపోగా, కృతజ్ఞతతో వుండాల్సిన అవసరం కూడా వుంది. ఆయన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడుగా వున్నప్పుడు ఒక పర్యాయం, ఆ తర్వాత ఒకటి-రెండు పర్యాయాలు డాక్టర్ వై.ఆర్.కె ఆయన కుటుంబ సభ్యులకు చికిత్స కూడా చేశారు. కాంగ్రెస్ కార్యాలయం ఇప్పటి వినోద్ మహల్ సినిమా హాలు సమీపంలో, "రాంనారాయణ కాంపౌండ్" లో వున్నప్పుడు, జలగం వెంగళరావు తీవ్రమైన జ్వరంతో బాధ పడుతూ, ఆఫీసులోనే పడుకుంటే, ఎదురింటిలో వున్న కొల్లి పిచ్చయ్యగారు అనే బంధువొకరు చూసి, డాక్టర్ వై.ఆర్.కెకు కబురు చేస్తే ఆయనొచ్చి చూసి మందులిస్తే నయమైంది. చినిగిన చాప మీద, తల కింద చేతి సంచి పెట్టుకుని పడుకున్న వెంగళరావుకు వైద్యం చేసారు. ఆనాటి వెంగళరావు ఆర్థిక స్థితి అలాంటిది. మర్నాడు పిచ్చయ్య గారింట్లో, ఆ మర్నాడు తూము హైమావతమ్మ గారింట్లో వుండగా కూడా వెంగళరావుకు చికిత్స చేశారు డాక్టర్ వై.ఆర్.కె . ఆయన ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్‌గా వున్నప్పుడు కూడా, అత్తగారు డాక్టర్ వై.ఆర్.కె దవాఖానాకు పిల్లలను తీసుకొచ్చే ది.

జలగం వెంగళరావుకు సిపిఎం అంటే కోపం-భయం. ఆ పార్టీని ఖమ్మంలో ప్రధాన శత్రువుగా భావించేవాడు. డాక్టర్ వై.ఆర్.కె ను ఆ పార్టీ వెన్నెముకగా అనుమానించేవాడు. ఆయనగారి ఆర్థిక మూలాలను దెబ్బతీయాలనీ, నిర్బంధాలతో పిరికిపర్చాలనీ, ఆత్మస్థయిర్యాన్నిసడలగొట్టాలనీ అప్రయత్నంగా ఆయన నోటివెంటే వచ్చిన మాటలు ఉమ్మడి మిత్రుల ద్వారా తెలిసింది! డాక్టర్ వై.ఆర్.కె గారిని, ఆయన కుటుంబ సభ్యులను సాధ్యమైనంత వేధించే ప్రయత్నం చేశాడు. ఖమ్మం జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న ఆయన సోదరుడు రంగారావుని, 2 సంవత్సరాలలో 10 చోట్లకు బదిలీ చేసినప్పుడు, ఆ బదిలీ ఆపమని కోరడానికి డాక్టర్ రావాలని భావించాడు వెంగళరావు. అది చేయక, సోదరుడిని రాజీనామా చేయించడంతో, ఆ కుటుంబం మీద మరింత కోపం పెంచుకున్నారు వెంగళరావు. ఆ నేపధ్యంలో, ఇంకా రైల్వే సమ్మె ప్రారంభం కాక ముందే, డాక్టర్ వై.ఆర్.కె గారిని, బోడేపూడి రాధాకృష్ణను, బోడేపూడి వెంకటేశ్వరరావును అరెస్ట్ చేశారు. మరో మారు హైదరాబాద్ ముషీరాబాద్ జైలుకు తరలించి, నెల రోజులపాటు నిర్బంధంలో వుంచారు. అక్కడున్న రైల్వే యూనియన్‍కు చెందిన సుమారు ఎనభై మంది డిటెన్యూలకు రాజకీయ పాఠాలు తీసుకునేవారు డాక్టర్ వై.ఆర్.కె. వారందరితో ఆత్మీయ పరిచయాలు ఏర్పడ్డాయి. తర్వాత  కూడా కొందరు స్నేహపూర్వకంగా ఉత్తరాలు రాసేవారు. అందరికంటే ముందు డాక్టర్ వై.ఆర్.కె ను అరెస్ట్ చేసిన ప్రభుత్వం, అందరికంటే చివరకు ఆయనను విడుదల చేసింది. రాజకీయ ద్వేషానికి, వ్యక్తిగత ప్రతీకారానికి పరాకాష్టకు, చక్కటి ఉదాహరణగా దీనిని పేర్కొన వచ్చు. ఏదేమైనా, రైల్వే యూనియన్ కు, సిపిఎం కు సంబంధం లేకపోయినా అరెస్ట్ కు గురికాబడిన డాక్టర్ వై.ఆర్.కె కి, ఆయన ద్వారా పార్టీకి, ఆ తర్వాత రైల్వే యూనియన్ తో సంబంధం ఏర్పడింది. అలా ఆయన మూడో పర్యాయం జైలు జీవితం గడిచింది.

No comments:

Post a Comment