2011 సంవత్సరంలో ఏం జరిగింది?
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (29-12-2011)
సూర్య దినపత్రిక (29-12-2011)
కిరణ్ వైపే మొగ్గిన అసంతృప్తి వాదులు; ఆధిపత్యాన్ని స్థిరపరచుకున్న కిరణ్; ఎటూ తేల్చని శ్రీకృష్ణ కమిటీ; మరో వివాదాన్ని తెచ్చిన బ్రజేష్ తీర్పు; న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్ ఆవిర్భావం; కేంద్రమంత్రివర్గ విస్తరణలో ఆంధ్రులకు అన్యాయం; అరబ్ ప్రపంచాన్ని కుదిపివేసిన తిరుగుబాట్లు - ఎడిటర్
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంతవరకు, అన్ని రంగాలలో కాకపోయినా, కనీసం రాజకీయ రంగంలోనైనా, గత ఏడాది కోడి కొంచెం ముందే కూసింది. తన రాజకీయ సుదీర్ఘ ప్రస్థానంలో, నిత్య "అసంతృప్తి వాది" గా ముద్రపడినప్పటికీ, ఏనాడూ, భారత జాతీయ కాంగ్రెస్‌ను వీడే సాహసం చేయని వైఎస్ రాజశేఖర రెడ్డి అకాల మరణంతో ఏర్పడిన రాజకీయ శూన్యం పూరించలేక పోయిన నేటి తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య స్థానంలో, గత ఏడాది (2010) చివరలో-నవంబర్ నెలాఖరులో కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా నియమించింది అధిష్టానం. నెల తిరిగే కల్లా 2011 సంవత్సరానికి స్వాగతం పలికాం. అప్పటివరకూ కనీసం మంత్రిగా ఒక్కసారైనా పనిచేయని కిరణ్ కుమార్ రెడ్డి ఎంపికను జీర్ణించుకోలేక పోయారు పలువురు కాంగ్రెస్ నాయకులు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి స్థానంలో నూట ఏబైమందికి పైగా ఎమ్మెల్యేల మద్దతుతో ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోదలిచిన ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరిక తీరలేదు. ఆయన కోరిక తీరనందుకు ఆయనకంటే ఎక్కువగా ఆయన వీర విధేయులు కలతచెందారు. అలా కలతచెందిన వారిలో, అలనాటి మంత్రివర్గంలోని అనేక మంది మంత్రులున్నారు కూడా. వారిలో కొందరు, రాజ్యాంగపరంగా చేయాల్సిన మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి కూడా హాజరవడానికి ఒకింత విముఖత చూపించారు కూడా. ఐతే, కాలం-కర్మం కలిసి రాకపోవడంతో, అలా విముఖత చూపిన వారే, తమ మంత్రి పదవికి ఎక్కడ ఎసరొస్తుందనే భయంతో, ఒక్కరొక్కరే, కిరణ్ కుమార్ రెడ్డి పంచన చేరడం మొదలెట్టారు. ఏ వీర విధేయతను వారంతా జగన్ పట్ల చూపించారో, అదే వీర విధేయతను, అంచలంచలుగా ముఖ్యమంత్రి పట్ల చూపించసాగారు. "తప్పటడుగులు" వేసి తమ గుప్పిట్లో చిక్కకపోతాడా ముఖ్యమంత్రి అని భావించిన పలువురికి ఆశాభంగం కలిగింది. కొంత "తడబడుతూ అడుగులు" వేసినప్పటికీ, రోజులు-నెలలు గడుస్తున్నా కొద్దీ, అత్యంత "ఆత్మవిశ్వాసం" తో అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తన ఆధిపత్యాన్ని అన్ని విధాలా నిలుపుకోవడం 2011 రాజకీయ సంవత్సరం ప్రత్యేకతగా చెప్పుకోవాలి.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను పరిశీలించడానికి, కేంద్రప్రభుత్వం నియమించిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను పాత్రికేయుల సమక్షంలో, హోం మంత్రి చిదంబరానికి అందచేసి, తదుపరి ప్రక్రియ జనవరి 6, 2011 న రాష్ట్రానికి చెందిన ఎనిమిది గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో సంప్రదించిన తర్వాతే ప్రారంభిస్తామని చిదంబరం ప్రకటన చేయడం వల్ల 2010 సంవత్సరానికి సంబంధించినంతవరకు, ఆందోళనలకు తావులేకుండా వీడ్కోలు పలికే అవకాశం కలిగిందనాలి. నివేదిక ఇస్తూ శ్రీకృష్ణ కమిటీ సభ్యులు తమకు “అప్పజెప్పిన పని సులభమైంది కాదని” అన్నారు. పదకొండు నెలలుగా చేసిన విస్తృత సంప్రదింపులు, బృహత్తర పరిశోధనలు చివరకు ఏమైనా తేల్చిందా? అనేది ప్రశ్నార్థకం. ఒక విధంగా చెప్పాలంటే, శాశ్వత ప్రతిష్ఠంభన దిశగా సూచనలివ్వడం జరిగింది. కమిటీ చేసిన "బెస్ట్" లేదా "సెకండ్ బెస్ట్" సూచనలలో ఏ ఒక్క దాన్ని ప్రభుత్వం అంగీకరించినా, ఆ నిర్ణయం, నిజంగా శ్రీకృష్ణ కమిటీ చెప్పినట్లు "ఎవరికీ పరాజయం లేకుండా అందరికీ సమానంగా విజయం చేకూరినట్లు" అవుతుందా? జవహర్లాల్ నెహ్రూ చెప్పిన బుద్ధుడి ప్రవచనాలను శ్రీకృష్ణ కమిటీ నిజంగా గౌరవించిందా? న్యాయమూర్తి అనేవారెవరైనా "ధర్మ సమ్మతమైన న్యాయం" చెప్పి సమస్యను పరిష్కరించే సూచనలివ్వాలి కాని, సమస్యను మరింత జటిలం చేయొచ్చా? పైగా అందరికీ విజయం చే కూరుస్తున్నామని చెప్పడం తగునా? నివేదికలో ఏం చెప్పినా ఇష్టంగానో-అయిష్టంగా నో, మనసులో మాట మాత్రం దాచుకోలేక పోయారు శ్రీకృష్ణ కమిటీ సభ్యులు. ఆధునిక మహాభారత యుద్ధానికి తెరలేపింది శ్రీకృష్ణ కమిటీ "కృష్ణ రాయభారం తరహా నివేదిక". నాటి శ్రీకృష్ణుడు పాండవ పక్షం-ధర్మం పక్షం వహిస్తే, నేటి శ్రీకృష్ణుడి నివేదిక సమైక్యానికి మొగ్గు చూపినట్లు భావన కలిగించినా, ఆసాంతం, మనసులో వున్న మాటగా, విభజన పలుకులే పలకడం విశేషం.
"కృష్ణా జలాలపై" బ్రజేష్ ట్రిబ్యునల్ తీర్పు మరో వివాదానికి తెర లేపి, శాశ్వతంగా పొరుగు రాష్ట్రాలకు, మనకు మధ్య విరోధానికి నాంది పలికిందని అనక తప్పదు. రాష్ట్రానికి, ఒక వైపు నికర జలాల వాటా పెంచుతూనే, గతంలో బచావత్ తీర్పు నిష్పత్తిలో కాకుండా తగ్గింపు కోటా ఇవ్వడం, మరో వైపు అదనపు జలాల కోటా పూర్తిగా తగ్గించడం వల్ల, రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని అన్ని రాజకీయ పార్టీలు ఆందోళన చేసేందుకు అవకాశాలను కలిగించింది ట్రిబ్యునల్. ఇలా ఆరంభమయింది 2011 సంవత్సరం.
ఈ నేపధ్యంలో గత ఏడాది సంఘటనలను ఒక్క సారి మననం చేసుకుంటే ఎలా వుంటుంది?
కంచే చేనును మేసిందని, పౌరుల ప్రాధమిక హక్కులను పరిరక్షించాల్సిన అత్యున్నత న్యాయస్థానమే వాటి ఉల్లంఘనకు మార్గం సుగమం చేసిందని, దాదాపు పాతికేళ్ల విరామం తర్వాత, అదే అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. అస్సాంకు చెందిన చౌహాన్ అనే వ్యక్తికి సుప్రీం కోర్టు విధించిన మరణ శిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మారుస్తూ, పౌరుల ప్రాధమిక హక్కుల ఉల్లంఘన అరుదుగా జరిగే వీలున్నప్పటికీ, భవిష్యత్ లో అసలే జరుగదనే నమ్మకం లేదన్న అభిప్రాయం వెలిబుచ్చింది అత్యున్నత న్యాయస్థానం 2011 జనవరి మొదటి వారంలో ఒక రివ్యూ పిటీషన్లో ఇచ్చిన తీర్పులో. ఎమర్జెన్సీ విధించిన సందర్భంలో 1976 లో అత్యున్నత న్యాయస్థానం ముందుకొచ్చిన ఒక "హెబియస్ కార్పస్ కేసు" లో తీర్పిచ్చిన నలుగురు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, "ఎమర్జెన్సీ అమల్లో వున్నప్పుడు పౌరుడి జీవించే హక్కు కూడా రద్దుచేయవచ్చు" అని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించిన విషయం జస్టిస్ ఆలం, జస్టిస్ గంగూలీలు ఈ సందర్భంగా పేర్కొనడం గమనించాల్సిన విషయం.
మీడియాపై ఆంక్షలు ఎత్తివేయాలన్న డిమాండుతో, “తెలుగు న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్” ఆవిర్భవించడం, ఆ సంస్థకు రాష్ట్రంలోని ప్రధాన వార్తా ఛానళ్ల ప్రముఖుల మద్దతుండడం గమనించ దగ్గ విషయం. ఈ సంస్థ మార్గదర్శకాలకు, ఇంతవరకూ జాతీయ స్థాయిలో పనిచేస్తున్న ’ఎన్‌బీయే’ సంస్థ ఆదేశాలకు వ్యత్యాసం ఏమేరకుంటుందో చూడాలి. భారత రాజ్యాంగం భావ స్వేచ్ఛ ప్రసాదించినప్పటికీ, ఆ స్వేచ్ఛ "నిష్పాక్షికంగా, బాధ్యతాయుతంగా" వినియోగించుకోవడానికి, ప్రభుత్వ పరమైన నియంత్రణలకంటే స్వయం సంయమనం పాటించడమే మేలు. మన రాష్ట్రంలో ఆవిర్భవించిన “తెలుగు న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్” స్వయం సంయమనం పాటించే దిశగా చర్యలు తీసుకుంటే అభినందించాల్సిందే. వ్యక్తి భావ ప్రకటనా స్వేఛ్చకుండాల్సిన పరిమితులు-హద్దులు రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఆ బాధ్యతను, రాష్ట్రంలోని ప్రధాన వార్తా ఛానళ్ల ప్రముఖుల చొరవతో ఆవిర్భవించిన “తెలుగు న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్” చేపడ్తుందని ఆశించుదాం.
జనవరి 19, 2011 న చేసిన కేంద్ర మంత్రి మండలి విస్తరణలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మళ్లీ అన్యాయం జరిగింది. ఢిల్లీ స్థాయిలో కీలక పదవుల పంపకంలో ఆది నుంచీ తెలుగు వారికి అన్యాయం జరుగుతూనే వుంది. ఢిల్లీ స్థాయిలో పెత్తనం సాగించే కీలకమైన రాజకీయ నాయకులకు "చేదోడు-వాదోడుగా" వుండడంలో అగ్రభాగాన వుండే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, కేంద్రంలో పలుకుబడి ఉపయోగించడానికి దోహదపడే కీలక స్థాయికి ఎదగడంలో మాత్రం వెనుకబడే వుంటూ వస్తుంది. కేంద్ర స్థాయిలో పాలనలో సరైన భాగస్వామ్యం లభించకపోవడంతో, అక్కడినుంచి నిధులను పొందడంలో కూడా విఫలమవుతూనే వుంది. అదే మరో మారు జరిగింది 2011లో కూడా. ఒకసారి కాదు, రెండు సార్లు.
నియంతృత్వానికి వ్యతిరేకంగా, ఈజిప్ట్ ప్రజల, అందునా యువకుల, పద్దెనిమిది రోజుల సుదీర్ఘ ప్రజాస్వామ్య పోరాటం, ఆ దేశాధ్యక్షుడిని పదవీచ్యుతుడిని చేసింది. ముప్పై సంవత్సరాల హోస్నీ ముబారక్ పాలనకు చరమ గీతం పాడిన దేశ పౌరులకు, వారి చిరకాల వాంఛైన ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటు సాధ్యపడే విషయమా, లేక, మరికొంత కాలం సైనిక పాలనే కొనసాగనున్నదా అనేది ఇప్పటికీ చెప్పడం కష్టమే. తిరుగుబాటు అనంతరం పాలనను చేపట్టిన ఈజిప్ట్ మిలిటరీ నాయకులు, త్వరలోనే రాజ్యాంగాన్ని సవరించి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిపించుతామని, ప్రజల న్యాయమైన హక్కులకు భంగం వాటిల్లకుండా చూస్తామని, ముబారక్ కాలం నుండి అమల్లో వున్న "అత్యవసర చట్టాన్ని" తొలగించుతామని బహిరంగంగా ప్రకటించి కూడా ఏడాది కావస్తోంది. పౌర పాలన స్థాపనకు శ్రీకారం చుట్టి, ప్రజలెన్నుకున్న నాయకుల కింద పనిచేసేందుకు సైన్యం అంగీకరించుతుందా, లేక, మరో మిలిటరీ నియంత పాలనకు కనీసం ప్రయోగాత్మకంగానన్నా దోహదపడుతుందా అనే విషయం ఇంకా తేలాల్సి వుంది.
లిబియాలో అధికారంలో ఉన్న గడాఫికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 17, 2011 న మొదలైన ఉద్యమం రోజురోజుకు ఊపందుకుంది. ఇరవై మూడేళ్ల పాటు అధికారాన్ని అనుభవించిన తునీషియా అధ్యక్షుడు జినే బెన్ అలీ ప్రజల ఆగ్రహాన్ని చవిచూసి పదవీచ్యుతుడు కాక తప్పలేదు. బహరైన్ లోనూ పరిస్థితి తీవ్రతరమయింది. యెమెన్ లో కూడా ప్రభుత్వ మార్పిడి కోరుతూ ప్రజలు పెద్ద యెత్తున ఆందోళనలు చేపట్టారు. ఆ మార్గాన్నే 41 సంవత్సరాల కల్నల్ గడాఫి నియంతృత్వ పాలనకు చరమగీతం పాడారు. పెట్రోలియం నిల్వలతో-ఉత్పత్తులతో సంపన్న దేశాల జాబితాలో చేరిన లిబియా దేశాన్ని తన ఉక్కు పిడికిలిలో బంధించిన గడాఫి, చివరకు అమెరికా కుట్రలో భాగంగా అసువులు కోల్పోయాడు. ఇటీవలి కాలంలో అరబ్ ప్రపంచంలో చోటు చేసుకుంటున్న తిరుగుబాటులకు, గతంలో సైనిక తిరుగుబాటులకు తేడా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే, తిరుగుబాటుల వల్ల నియంతృత్వం పోయి ప్రజాస్వామ్యం వచ్చే అవకాశాలు అప్పూడూ-ఇప్పుడూ లేవు. ఆ దేశాల్లో సైనికులు ప్రభుత్వాలను పడగొట్టడానికి నూతన మార్గాలను ఎంచుకున్నట్లు కనబడుతున్నది. ఉన్న నియంతకు వ్యతిరేకంగా ప్రజలను పురికొల్పి, వారిని గద్దె దింపి, ఆ స్థానంలో అధికారం పొందడమనే వ్యూహం వుందా అన్న ధోరణిలో అక్కడి తిరుగుబాటులు గోచరిస్తున్నాయి. ప్రజాస్వామ్యం నెలకొననంత వరకు తిరుగుబాటు చేసిన ప్రజలకు వారు కోరుకున్నది లభించనట్లే. ఇదిలా వుండగా, అరబ్ ప్రపంచాన్ని అస్థిర పరచడానికి, అమెరికా పన్నిన కుట్రలో భాగంగానే, ఆయా దేశాల్లో తిరుగుబాటులు చోటుచేసుకుంటున్నాయని, ప్రజాస్వామ్యమైనా-నియంతృత్వమైనా, రాబోయే ప్రభుత్వాలు తన కనుసన్నలలో మెలగాలని అమెరికా పన్నాగమని విశ్లేషకులనుకుంటున్నారు.
(మరిన్ని మిగిలాయింకా)
No comments:
Post a Comment