Thursday, December 8, 2011

మోసం...దగా..ధోఖా...మాటి మాటికీ మాట మార్పు...ఇదీ రాజకీయం!: వనం జ్వాలా నరసింహారావు

మోసం...దగా..ధోఖా...మాటి మాటికీ మాట మార్పు...ఇదీ రాజకీయం!

వనం జ్వాలా నరసింహారావు

తెలుగుదేశం అధ్యక్షుడు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం శాసనసభలో సంఖ్యాపరంగా బలాబలాల రీత్యా గెలుపొంది వుండవచ్చు. అంతమాత్రాన ఆయన సర్కారు మైనారిటీలో పడలేదని అనలేము. శాసనసభలోని మొత్తం సభ్యుల సంఖ్యను పరిగణలోకి తీసుకుంటే, 147 మంది వున్న పార్టీకే మెజారిటీ వున్నట్లు లెక్క. అలా కాకుండా, ఖాళీలను లెక్కలోకి తీసుకుని చూస్తే కనీసం 144 మంది సభ్యులున్నా వుంటేనే సర్కారుకు మెజారిటీ వుందని భావించాలి. కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతమున్న సభ్యుల సంఖ్య కేవలం 136 మాత్రమే. అలాంటప్పుడు, ఆయన ప్రభుత్వాన్ని మైనారిటీ ప్రభుత్వంగానన్నా పరిగణించాలి, లేదా, (ఇంకా విలీన తతంగం పూర్తికాని ప్రజారాజ్యం పార్టీతో కలిపి) సంకీర్ణ ప్రభుత్వంగానన్నా భావించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ప్రప్రధమ సంకీర్ణ ప్రభుత్వానికి (నేడో రేపో మంత్రివర్గ విస్తరణ చేయక తప్పదు) సారధిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ చరిత్రపుటల్లో స్థానం సంపాదించుకుంటున్నాడని ఘంటాపథంగా చెప్పొచ్చు.

అవిశ్వాస తీర్మానం పెట్టమని జగన్ సవాలు విసిరినప్పుడు, దానిని తాను స్వీకరించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు చంద్రబాబునాయుడు. ఎప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టాల్నో అనేది తమ పార్టీ నిర్ణయమని, తమకు ఇతర పార్టీ వారి సూచనలు అవసరంలేదని, ఆయన అనుయాయులందరూ ముక్తకంఠంతో జగన్‌కు ఎదురు జవాబిచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడేది చంద్రబాబునాయుడేనని, ఆ రెండు (తెలుగుదేశం, కాంగ్రెస్) పార్టీలు కుమ్ముక్కయ్యాయనీ, ఇద్దరికీ శత్రువు జగన్మోహన్ రెడ్డనీ, వైఎస్సార్ కాంగ్రెస్ ప్రచారం చేసింది. నమ్మిందెందరో, నమ్మనిదెందరో అనేది జవాబు దొరకని అంశం. అప్పట్లో జగన్ వెంట ముప్పై మందికి పైగా ఎమ్మెల్యేలున్నారనీ, అప్పటికింకా చిరంజీవి ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కాలేదనీ, ఆనాడే కనుక బాబు అవిశ్వాస తీర్మానం పెట్టినట్లయితే, కిరణ్ సర్కారు కూలిపోయేదనీ, వైఎస్సార్ కాంగ్రెస్ వారి వాదన. నిజంగా జగన్ వెంట ముప్పై మందే వుండి వుంటే, గవర్నర్ ముందు ప్రదర్శన చేయవచ్చు కదా అని బాబు వర్గం అభియోగం మోపింది. మొత్తం మీద అప్పట్లో అవిశ్వాస తీర్మానం పెట్టడం మాత్రం జరగలేదు. ఆ తరువాత జగన్ వెంట ఆయన చెప్పిన ఆ ముప్పై మందీ నిలవలేదు. ఎవరిది మోసమో, ఎవరిది దగానో, ఎవరు నిజం చెప్పారో, ఎవరు అబద్ధాలాడారో ప్రజలకు కూడా అర్థం కాని పరిస్థితులొచ్చాయనాలి. జగన్ మాట ఎలా వున్నా, అప్పట్లో, తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలందరూ ప్రభుత్వంపై ఇప్పటికంటే ఎక్కువ గుర్రుగా వున్నారనక తప్పదు. అవిశ్వాస తీర్మానం పెట్టింది తెలుగు దేశం పార్టీ కనుక, ఎలాగూ, ఆ పార్టీకి చెందిన అన్ని ప్రాంతాల వారు దానికి అనుకూలంగా ఓటువేయక తప్పదు. కాకపోతే, అప్పట్లో హాట్-హాట్‌గా వున్న తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ తప్పకుండా అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసేవారేమో! ఈ ఆర్నెల్ల తేడాలో, ఓడలు బండ్లయ్యాయి, బండ్లు ఓడలయ్యాయి. అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ఎవరు ఎవరిని దగా చేశారో, చేసినవారికి తప్ప ఇతరులెవరికీ తెలియనంత లౌక్యంగా జరిగిపోయింది.

సరే...తొల్లి గతించె! చర్చకు స్వీకరించరనుకున్న తీర్మానాన్ని చట్టసభల సాంప్రదాయాలకు అనుగుణంగా శాసన సభాపతి నాదెండ్ల మనోహర్ ప్రతిపక్షాల ఊహలను తారుమారు చేస్తూ, అనుకున్నదానికంటే ముందుగానే అనుమతిని ఇస్తున్నట్లు ప్రకటించారు. వాస్తవానికి ఈ మొత్తం వ్యవహారంలో, ఎవరిది గెలుపో-ఎవరిది ఓటమో అని చర్చించే కన్న అసలు విజయం స్పీకర్ తీసుకున్న నిర్ణయానికే అనడం సబబే మో! శాసనసభ కార్యకలాపాల మొదటి రోజునే, సంప్రదాయబద్ధంగా చేపట్టాల్సిన సంతాప తీర్మానాలను కూడా ప్రవేశపెట్టక పూర్వమే, ఒకవైపు తెలుగుదేశం వారు అవిశ్వాస తీర్మానం విషయంలో, మరోవైపు తెలంగాణ రాష్ట్ర సమితి వారు ప్రత్యేక తెలంగాణ విషయంలో చర్చకు పట్టుబట్టడం సమంజసంగా లేదు. స్పీకర్‌కు ఆ ఒక్కరోజన్నా సమయం ఇవ్వకుండా అలా పట్టుబట్టి వుండాల్సింది కాదు. అవిశ్వాస తీర్మానం చర్చకు చేపట్టుతున్నట్లు సభాపతి తెలియచేయడం జరిగింది. లాంఛనప్రాయంగా ముగుస్తుందనుకున్న అవిశ్వాస తీర్మానం తతంగం, ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగింది. తీర్మానం వీగిపోయిందనేకన్నా, అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు ఎన్నో రకాల సందేశాలను పంపిందనాలి. బద్ధవైరత్వం వున్న తెలుగుదేశం పార్టీతో ఒకవైపు తెలంగాణ రాష్ట్ర సమితి, మరో పక్క వైఎస్‍ఆర్‍కాంగ్రెస్ పార్టీ కారణాలేవైనా చేతులు కలిపింది. సభలో ఒకరిని ఇంకొకరు తీవ్రంగా విమర్శించుకున్నప్పటికీ, ఈ మూడు పార్టీలు అవిశ్వాసంకు అనుకూలంగానే ఓటు వేశాయి. ప్రభుత్వాన్ని చమత్కారంగా విమర్శించిన ఎంఐఎం అవిశ్వాసానికి వ్యతిరేకంగా నిలిచింది. నిఖార్సుగా అసలు-సిసలు ప్రభుత్వ వ్యతిరేకత అణువణువునా కనిపించే రీతిలో మాట్లాడింది బహుశా తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులేనేమో! కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ ప్రాంత శాసనసభ సభ్యుడొకరు (తన పార్టీకి చెందిన) ప్రభుత్వాన్ని మనసులో మరో ఆలోచన వున్నా బయటకు మాత్రం బలపర్చిన తీరు అమోఘం! చివరి క్షణం వరకూ విప్ జారీ చేయడానికి వెనుకాడిన పీ.ఆర్.పీకి చెందిన సభ్యుడు కాంగ్రెస్ పార్టీ సభ్యులకన్నా గట్టిగా ప్రభుత్వాన్ని సమర్థిస్తూ వాదన వినిపించారు. రాజశేఖరరెడ్డి సతీమణి విజయమ్మ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి తన భర్త పడిన కష్టాలను ఏకరవు పెట్టడానికి ఇంతకంటే తగిన సమయం లేదన్న తరహాలో వ్యవహరించడం గొప్ప విషయమే! ఇక సీఎం, ప్రతిపక్షనేతల మధ్య సవాళ్లు-ప్రతి సవాళ్లు సరే సరి. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తానే ముఖ్యమంత్రిని అన్న చందాన స్పందించారు ఒకటి రెండు సార్లు. అందరిది ఒక దారైతే, లోక సత్తా నేత జయప్రకాశ్ నారాయణది ఇంకో దారి అన్నట్లుగా ఆయన తటస్థంగా వుండిపోయారు. ది బెస్ట్ ఉపన్యాసాలెవరివంటే, వరుసక్రమంలో అక్బరుద్దీన్ ఒవైసీ, మంత్రి ధర్మాన ప్రసాదరావు, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయమ్మలవి అనాలి.

అవిశ్వాసం నెగ్గిందా-ఓడిందా అనేకంటే, ఎవరి పక్షాన, ఎవరి పార్టీ పక్షాన ఎంతమంది వున్నారనేది మాత్రం స్పష్టంగా తేలిపోయింది. ఫలితం, పైకి ప్రభుత్వం గెలుపు, అనిపించినా, జగన్ పార్టీకి ఓటమి అని అందరూ భావిస్తున్నా, శాసనసభలో జగన్ వర్గం కేవలం 18 మంది మాత్రమే అని తేలినా, కిరణ్ సర్కారు పార్టీపరంగా మైనారిటీలో పడిపోయిందనేది వాస్తవం. ఒకవ్యక్తి, అధికారంలో లేకపోయినప్పటికీ, ఆయన వెంట వెళ్తే తమకిప్పుడిప్పుడే ఏమీ ఒరగక పోయినప్పటికీ, 16 మంది అధికార పక్ష సభ్యులు, వైఎస్‍ఆర్‍కాంగ్రెస్ పార్టీతో వుండడం గ్రేట్! ఇది ఏ సంకేతాలను పంపుతున్నదనేదే అసలు విషయం. సోనియా గాంధి పుట్టినరోజు కానుకగా, ఆమె పార్టీకి దక్షిణ భారతదేశంలో అత్యంత బలం కలిగిన ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. అందుకే కిరణ్ సర్కారు గెలిచినా ఓటమితో సమానమే. జగన్ వెంట ఇంకా పద్దెనిమంది వుండడం ఆయన ఓడినా గెలిచినట్లే. గెలుపు-ఓటములు చంద్రబాబు నాయుడి తెలుగుదేశానికి సరిసమాన మనాలి.

తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తాము చేసింది తప్పా? ఒప్పా? అని ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఒకవైపు తమ సహచర పార్టీ సభ్యులైన పార్లమెంటు సభ్యులు ఎన్ని విధాల వీలుంటే అన్ని విధాలుగా బాహాటంగా తమ నిరసనను అధిష్టానానికి తెలియ చేస్తున్నారు. ప్రణబ్ ముఖర్జీ సూచనలను కూడా తిరస్కరించి ధైర్యంగా పార్లమెంట్ వెలుపలా, లోపలా తమ గళం వినిపిస్తున్నారు. కాకపోతే ఓటింగుకు వచ్చినప్పుడు ఏం చేస్తారనే విషయం అలాంటిది జరిగినప్పుడే బయటపడుతుంది. ఇక ఎమ్మెల్యేల విషయానికొస్తే బయటకు చెప్పేదొకటి, లోపల చేసేదొకటీ అన్న చందాన వుంది. తమ శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు కదా! అవి తిరస్కరించినప్పుడు సభాపతిని విమర్శించారు కదా! మళ్ళీ - మళ్లీ రాజీనామాలిస్తామన్నారు కదా! ప్రభుత్వం తెలంగాణ విషయంలో తీసుకుంటున్న అనేక చర్యలను బాహాటంగానే తప్పుపట్టుతున్నారుకదా! సకలజనుల సమ్మె విషయంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటనలను ఖండించారు కదా! ఎస్సై రాత పరీక్షల అంశంలో ప్రభుత్వాన్ని తప్పుపట్టారు కదా! అలాంటప్పుడు ఈ ప్రభుత్వంపై ఎలా విశ్వాసం ప్రకటించారు? చర్చలో పాల్గొన్న తెలంగాణ ప్రాంత శాసనసభ సభ్యుడు, ఆద్యంతం కిరణ్ కుమార్ రెడ్డి సర్కారును భుజాన ఎత్తుకుని మోశారనాలి. అలా చేయడం తప్పని కాదు. ప్రభుత్వాన్ని సమర్థించనన్నా సమర్థించాలి, లేదా, విమర్శించనన్నా విమర్శించాలి. ఒకవైపు తెలంగాణ రాష్ట్రం అంశం వచ్చినప్పుడు తీవ్రంగా విమర్శించడం, అదే అంశంపై సహచర తెరాస సభ్యులు ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడు వీరేమో వేరే విధంగా మాట్లాడడం సరైందికాదు. ఒక వ్యక్తి కోసం- కేవలం ఒకే ఒక వ్యక్తి కోసం, ఏ ప్రయోజనం ఆశించకుండా పదహారు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, తమ పదవులను కూడా లెక్క చేయకుండా, అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారే! ప్రత్యేక రాష్ట్రం కోసం ఆ మాత్రం త్యాగం కూడా వీరు చేయలేక పోయారే! ఏం పదవులు శాశ్వతమా? ఎలాగూ రాజీనామాలకు సిద్ధపడ్డారు కదా! ఎక్కువలో ఎక్కువ అనర్హత వేటు పడేదేమో! ఎంత మోసం...ఎంత దగా...ఎంత దోఖా...వీరిని తెలంగాణ ప్రాంత ప్రజలెలా నమ్ముతారు?

ఇప్పటికీ, ఎప్పటికీ, ఆ మాటకొస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంతవరకూ, డిసెంబర్ 9, 2009 న చిదంబరం చేసిన ప్రకటనే రాష్ట్ర ఏర్పాటు విషయంలో వేదవాక్కుగా పరిగణించాలి. ఏవేవో కారణాలు చెప్పి, చిదంబరం, ఆయన సహచర కాంగ్రెస్ నాయకులు, ప్రభుత్వ పెద్దలు రాష్ట్ర ఏర్పాటును మరికొంతకాలం ఆలశ్యం చేయవచ్చేమో! సోనియాగాంధీ ప్రమేయం లేకుండా చిదంబరం ఆ ప్రకటన చేసే ఆస్కారం లేనేలేదు. కాకపోతే, దరిమిలా ఆమె చుట్టూ తిరుగుతూ-ఆమెకు దగ్గరగా వున్నట్లు భావించే కొందరు, ఆమెను తప్పుదోవ పట్టిస్తున్నారే మో అనిపిస్తోంది. ఆ తప్పు దోవలో రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులు కూడా పయనిస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా, వీరిని తెలంగాణ ప్రాంతంలో, వారి-వారి స్వగ్రామాలకు వెళ్లినప్పుడు, అక్కడి ప్రజలు వెలివేసే ప్రమాదం పొంచి వున్న సంగతిని గుర్తుపెట్టుకుంటే మంచిదేమో!

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం, అందునా, సామాజిక తెలంగాణ కావాలని-రావాలని కోరుకునే బడుగు-బలహీన-వెనుకబడిన వర్గాల వారు, షెడ్యూల్డు కులాల-జాతుల వారు, ఇలాంటి కాంగ్రెస్ నాయకులను ఇక ఏ మాత్రం సహించే పరిస్థితులలో లేరు. వీరిలాగా దగా- మోసం- దోఖా చేయడం, చీటికి-మాటికీ మాట మార్చడం నచ్చని వీరంతా తమను ముందుకు నెట్టి వెనుక తమాషా చూస్తున్న ఈ నాయకులను క్షమించేందుకు ఇక ఎంతమాత్రం సిద్ధంగా లేరు. అందుకే వీరు ఏదో ఒక నిర్ణయానికి రాక తప్పదు. తెలంగాణ-సామాజిక తెలంగాణ కావాల్నా, వద్దా తేల్చుకోమంటున్నారు. కావాలంటే, ఆ మాటమీద నిలబడాలని గట్టిగా కోరుతున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు విషయంలో కావాలనే తనను తప్పుదోవ పట్టిస్తున్న ప్రణబ్ ముఖర్జీ లాంటి వారి నుంచి సోనియా అప్రమత్తంగా వుంటే మంచిది. తెలంగాణ ఏర్పాటు నిర్ణయం తీసుకుంటే మంచిది.

2 comments:

  1. I don't agree with this analysis.
    Aviswasam munde kanuka petti unte, appudu Govt padi poyi undedi, kani state kukkalu chimpina visthari ayyaedi.. pranthala Sentiments tho...
    Inka Vijayamma speech ite Sentimente kosam tappite inka emi vere vishayam kanapadaledu, Akbaruddin tappa migatha speech lu nenu chudaledu..

    And ninnati daka TDP-Cong laluchi anna jagan stmt inka use undadu... so jagan is the looser as per me.

    ReplyDelete
  2. కిరణ్ గాడి ప్రభుత్వం కూలితేనే తెలంగాణా వస్తుంది. తెరాస లాభపడిపోతుందనే తెలుగు దేశం ఆలస్యంగా అవిశ్వాసం ప్రవేశపెట్టింది.

    ReplyDelete