Friday, December 9, 2011

గెలిచి ఓడిన కిరణ్ కాంగ్రెస్ - ఓడి గెలిచిన వై.ఎస్.ఆర్ కాంగ్రెస్: వనం జ్వాలా నరసింహారావు

గెలుపెవరిది ? ఓటమెవరిది?

నమస్తేతెలంగాణ (15-12-2011)

వనం జ్వాలా నరసింహారావు

లాంఛనప్రాయంగా ముగుస్తుందనుకున్న అవిశ్వాస తీర్మానం తతంగం, ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగింది. తీర్మానం వీగిపోయిందనేకన్నా, అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు ఎన్నో రకాల సందేశాలను పంపిందనాలి. బద్ధవైరత్వం వున్న తెలుగుదేశం పార్టీతో ఒకవైపు తెలంగాణ రాష్ట్ర సమితి, మరో పక్క వైఎస్‍ఆర్‍కాంగ్రెస్ పార్టీ కారణాలేవైనా చేతులు కలిపింది. సభలో ఒకరిని ఇంకొకరు తీవ్రంగా విమర్శించుకున్నప్పటికీ, ఈ మూడు పార్టీలు అవిశ్వాసంకు అనుకూలంగానే ఓటు వేశాయి. ప్రభుత్వాన్ని చమత్కారంగా విమర్శించిన ఎంఐఎం అవిశ్వాసానికి వ్యతిరేకంగా నిలిచింది. నిఖార్సుగా అసలు-సిసలు ప్రభుత్వ వ్యతిరేకత అణువణువునా కనిపించే రీతిలో మాట్లాడింది బహుశా తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులేనేమో! కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ ప్రాంత శాసనసభ సభ్యుడొకరు తన పార్టీ ప్రభుత్వాన్ని మనసులో మరో ఆలోచన వున్నా బలపర్చిన తీరు అమోఘం! చివరి క్షణం వరకూ విప్ జారీ చేయడానికి వెనుకాడిన పీ.ఆర్.పీకి చెందిన సభ్యుడు కాంగ్రెస్ పార్టీ సభ్యులకన్నా గట్టిగా ప్రభుత్వాన్ని సమర్థిస్తూ వాదన వినిపించారు. రాజశేఖరరెడ్డి సతీమణి విజయమ్మ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి తన భర్త పడిన కష్టాలను ఏకరవు పెట్టడానికి ఇంతకంటే తగిన సమయం లేదన్న తరహాలో వ్యవహరించడం గొప్ప విషయమే! ఇక సీఎం, ప్రతిపక్షనేతల మధ్య సవాళ్లు-ప్రతి సవాళ్లు సరే సరి. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తానే ముఖ్యమంత్రిని అన్న చందాన స్పందించారు ఒకటి రెండు సార్లు. అందరిది ఒక దారైతే, లోక సత్తా నేత జయప్రకాశ్ నారాయణది ఇంకో దారి అన్నట్లుగా ఆయన తటస్థంగా వుండిపోయారు. ది బెస్ట్ ఉపన్యాసాలెవరివంటే, వరుసక్రమంలో అక్బరుద్దీన్ ఒవైసీ, మంత్రి ధర్మాన ప్రసాదరావు, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయమ్మలవి అనాలి.

అవిశ్వాసం నెగ్గిందా-ఓడిందా అనేకంటే, ఎవరి పక్షాన, ఎవరి పార్టీ పక్షాన ఎంతమంది వున్నారనేది మాత్రం స్పష్టంగా తేలిపోయింది. ఫలితం, పైకి ప్రభుత్వం గెలుపు, అనిపించినా, జగన్ పార్టీకి ఓటమి అని అందరూ భావిస్తున్నా, శాసనసభలో జగన్ వర్గం కేవలం 18 మంది మాత్రమే అని తేలినా, కిరణ్ సర్కారు పార్టీపరంగా మైనారిటీలో పడిపోయిందనేది వాస్తవం. ఒకవ్యక్తి, అధికారంలో లేకపోయినప్పటికీ, ఆయన వెంట వెళ్తే తమకిప్పుడిప్పుడే ఏమీ ఒరగక పోయినప్పటికీ, 16 మంది అధికార పక్ష సభ్యులు, వైఎస్‍ఆర్‍కాంగ్రెస్ పార్టీతో వుండడం గ్రేట్! ఇది ఏ సంకేతాలను పంపుతున్నదనేదే అసలు విషయం. సోనియా గాంధి పుట్టినరోజు కానుకగా, ఆమె పార్టీకి దక్షిణ భారతదేశంలో అత్యంత బలం కలిగిన ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. అందుకే కిరణ్ సర్కారు గెలిచినా ఓటమితో సమానమే. జగన్ వెంట ఇంకా పద్దెనిమంది వుండడడం ఆయన ఓడినా గెలిచినట్లే. గెలుపు-ఓటములు చంద్రబాబు నాయుడి తెలుగుదేశానికి సరిసమానమనాలి. దీని పూర్వాపరాలు విశ్లేషణకు నోచుకోవాల్సిందే!

వరుసగా నాలుగో పర్యాయం అఖిలభారత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికైన సోనియాగాంధి పన్నెండేళ్లకు పైగా రికార్డు స్థాయిలో అధ్యక్ష పీఠాన్ని అధిష్టించిన వ్యక్తిగా గుర్తింపు పొందినప్పటికీ, తన పార్టీలోని అసంతృప్తిని ఎంతవరకు పసికట్టగలుగుతున్నదో ప్రశ్నార్థకమే! ఒక విధంగా, సోనియా గాంధీ అత్తగారి తరహా పార్టీ దిద్దుబాటలో పయనించి, మరో చీలికకు శ్రీకారం చుట్టి, సమూల ప్రక్షాలణ చేసి, అసలు-సిసలైన వీర విధేయులను మాత్రమే తన వెంట వుంచుకుని, వారసత్వానికి మార్గం సుగమం చేయగలుగుతుందా? నూట పాతికేళ్ల భారత జాతీయ కాంగ్రెస్ ప్రస్థానంలో, ధిక్కరించి పార్టీ వీడిన ప్రముఖులకే ప్రధాని, ఉప ప్రధాని, రాష్ట్రపతి లాంటి అత్యున్నత పదవులు దక్కాయి. విధేయత, వీర విధేయత ప్రదర్శించిన వారంతా తాము అనుభవిస్తున్న పదవులను కాపాడుకోవడానికే పరిమితమయ్యారే కాని ఉన్నత శిఖరాలకు చేరుకోలేక పోయారు. ఎత్తుకు పై ఎత్తులు వేయగల కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధ్యమే... ఏదీ అసాధ్యం కాదు! వై. ఎస్. జగన్మోహనరెడ్డి కూడా అదే బాటలో పయనించనున్నారా? ఆయన వెంట నడుస్తున్న, రేపో-మాపో సభ్యత్వం కోల్పోనున్న పద్ధెనిమిదిమంది రాష్ట్ర శాసనసభ సభ్యులకు భవిష్యత్ బంగారుదవుతుందా? లేక, పార్టీని ధిక్కరించి కష్టాలపాలైన కొందరి లాగా అంధకారమవుతుందా? సమాధానం ఇదమిద్ధంగా రాని ప్రశ్నే!

విదేశీయుడైన అలన్ ఆక్టేవియన్ హ్యూమ్, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ స్థాపనకు కారకుడై తే...... మరో విదేశీ, ఇటలీ దేశానికి చెందిన భారతీయురాలు సోనియా గాంధి, చిక్కుల్లో పడ్డ పార్టీని, ప్రక్షాలణచేసి-పునర్నిర్మించి-పూర్వ వైభవాన్ని సమకూర్చి, కేంద్రంలో అధికారంలోకి రావడానికి కారకురాలైంది. రాజీవ్ గాంధి మరణానంతరం, సోనియా నిరాకరించిన కాంగ్రెస్ పార్టీ పగ్గాలను చేపట్టిన పీవీ నరసింహారావు 1996 ఎన్నికలలో పార్టీ ఓటమి పాలవడంతో, సోనియా విశ్వాసాన్ని కోల్పోయి పార్టీ అధ్యక్షుడిగా, పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా రాజీనామా చేయక తప్పలేదు. జిత్తులమారి వృద్ధ నాయకుడు సీతారాం కేసరికి ఆ రెండు పదవులు దక్కాయి. సీతారాం కేసరికి వ్యతిరేకంగా పలువురు సీనియర్ నాయకులు ధ్వజం ఎత్తడంతో, పార్టీ ఛిన్నాభిన్నం కాకుండా "రక్షించమని" కొందరు నాయకులు చేసిన "అభ్యర్థన" మేరకు, నెహ్రూ-గాంధి వారసత్వ పరంపరలో ఐదో తరం ప్రతినిధిగా, సోనియా గాంధి తొలుత పార్టీ "ప్రాధమిక సభ్యత్వం" స్వీకరించారు. అచిర కాలంలోనే, "రెండు నెలల అపారమైన అనుభవంతో", పార్టీ శ్రేయోభిలాషులు కోరడంతో కాదనలేక, 1998 లో, కొందరు ఆమె "జాతీయత" ను ప్రశ్నించినప్పటికీ, అధ్యక్ష పదవిని చేపట్టి, గత పన్నెండేళ్లకు పైగా పార్టీకి తిరుగులేని నాయకురాలిగా, నెహ్రూ-గాంధి వారసత్వాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. పార్టీలో ఆమె తీసుకున్న నిర్ణయమే, "ఏక వ్యక్తి అభిప్రాయమే" చివరకు "ఏకాభిప్రాయం" గా అవుతోంది.

నెహ్రూ-గాంధి కుటుంబీకుల అనుకూల, ప్రతికూల శక్తుల-వ్యక్తుల, మధ్య జరుగుతున్న ఆధిపత్య సమరమే, భారత జాతీయ కాంగ్రెస్ చరిత్ర. మొరార్జీ దేశాయ్, విశ్వనాథ ప్రతాప సింగ్, చంద్రశేఖర్, గుజ్రాల్ ఎదురు తిరిగి పార్టీని వీడక పోయినట్లయితే, ఎప్పటికీ "ప్రధాన మంత్రి" అయ్యేవారు కానే కాదు. జగ్జీవన్ రాంకు ఉప ప్రధాన మంత్రి దక్కే అవకాశమే వుండకపోయేది. నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతి కాగలిగింది కాంగ్రెస్ పార్టీని వీడినందునే. వారే కనుక వీర విధేయతతో పార్టీలో కొనసాగినట్లైతే, ఒక ప్రణబ్ ముఖర్జీ లాగా, ఒక గులాం నబీ ఆజాద్ లాగా, ఒక చిదంబరం లాగా మంత్రివర్గంలో (ఎక్కువలో ఎక్కువ సీనియర్‌గా) స్థానంతో సరిపుచ్చుకోవాల్సిందే.

భారత జాతీయ కాంగ్రెస్ లో ఎదురు తిరగడమైనా, చీలిక రావడమైనా-తేవడమైనా, మోతీలాల్ నెహ్రూ దగ్గర్నుంచి, ఆ వారసత్వ పరంపరలోని అందరూ, తమ మాట చెల్లని ప్రతిసారీ పార్టీని ప్రత్యక్షంగానో పరోక్షంగానో వీడడమో, చీల్చడమో, "మనస్సాక్షి చెప్పినట్లు" నడచుకోమని తమ వారిని ప్రోత్సహించడమో, పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటేయమని సూచించడమో, వ్యతిరేకులు పార్టీని వదలి వెళ్లే పరిస్థితులు కలిపించడమో చరిత్ర చెప్పిన వాస్తవం. అలా జరిగిన ప్రతిసారీ ఆ కుటుంబీకులు పార్టీలో తమ ఆధిపత్యాన్ని పదిల పరచుకున్న విషయమూ జగమెరిగిన సత్యం. దాని వల్ల దేశానికి మేలు జరిగి వుండొచ్చు. సుస్థిర ప్రభుత్వం ఏర్పాటై వుండొచ్చు. ఆ క్రమంలోనే వారి నాయకత్వం మినహా గత్యంతరం లేని పరిస్థితులు నెలకొని ఇప్పటికీ కొనసాగుతోంది. భవిష్యత్‍లో కూడా లానే జరగదన్న నమ్మకం లేదు.

రెండు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిమోతీలాల్ నెహ్రూ, కుమారుడు జవహర్లాల్ నెహ్రూకు, తన తర్వాత "అధ్యక్ష బాధ్యత" అప్ప చెప్పారు. ఆ కుటుంబానికి రాజకీయ పరంగా మద్దతిచ్చిన మహాత్మా గాంధి, నెహ్రూను వ్యతిరేకించిన, వ్యతిరేకించగల సామర్థ్యం వుందని భావించిన వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్ర బోస్, టాండన్, పట్టాభి సీతారామయ్యలను ఎదగకుండా చేశారు. స్వాతంత్ర్యం లభించిన తర్వాత అలనాటి కాంగ్రెస్ అధ్యక్షుడు ఆచార్య కృపలానీకి తరచుగ ఎదురుతిరుగుతూ, తన ఆధిపత్యాన్ని నెహ్రూ ప్రదర్శించడం కూడా తిరుగుబాటు లాంటిదే. ముగ్గురు ప్రధాన మంత్రులను దేశానికిచ్చి, నాలుగో తరం త్వరలో ఆ పదవిని చేపట్టడానికి సిద్ధంగా వున్న ఆ కుటుంబం వారే నాలుగు దశాబ్దాలు వివిధ దశల్లో, పాతిక పర్యాయాలు కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టారు.

నెహ్రూ వారసురాలిగా ఇందిరా గాంధి తొలుత పార్టీ పగ్గాలను 1959-60 లో చేపట్టింది. తండ్రి మరణానంతరం, లాల్ బహదూర్ శాస్త్రి తర్వాత, 1966 లో ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించింది. ఇందిర అనుయాయులైన "సామ్యవాదులు", మొరార్జీ-తదితరుల నాయకత్వంలోని "సంప్రదాయ వాదులు" ఆధిపత్యం కొరకు బహిరంగంగానే పోటీపడేవారు. బాంకుల జాతీయం, రాజా భరణాల రద్దు లాంటి విధాన పరమైన నిర్ణయాల నేపధ్యంలో, మొరార్జీ దేశాయ్‍తో సహా, "సంప్రదాయ వాదులందరినీ" బయటకు పంపేందుకు, 1969 లో పార్టీని చీల్చింది ఇందిర. ఆమెతో విభేదించి, తమదే అసలైన పార్టీగా ప్రకటించి, దానికి సారధ్యం వహించి, ఆ తర్వాత జనతా పార్టీలో విలీనం చేసిన మొరార్జీ దేశాయ్ ప్రప్రధమ కాంగ్రేసేతర ప్రభుత్వ ప్రధాన మంత్రి కాగలిగారు. నెహ్రూ-గాంధి కుటుంబ వారసత్వాన్ని వ్యతిరేకించగలిగిన వారే, ప్రధాన మంత్రి స్థాయికి ఎదగ గలుగుతారని నిరూపించారాయన.

ఇందిర వర్గం కాంగ్రేసేతర సోషలిస్టుల, వామ పక్షాల మద్దతు పొంది విప్లవాత్మక సంస్కరణలతో బలమైన నాయకురాలిగా ఎదగసాగింది. 1971 ఎన్నికల్లో మంచి మెజారిటీ సాధించి, కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని నాయకురాలయ్యారు. పార్టీని అంటిపెట్టుకున్న విధేయుల్లో కొందరు క్రమేపీ ఆమెను అంతర్లీనంగా వ్యతిరేకించసాగారు. పార్టీని వీడిన "యంగ్ టర్క్స్" ఎస్ చంద్రశేఖర్ ప్రధాన మంత్రి స్థాయికి, కృష్ణకాంత్ ఉప రాష్ట్రపతి స్థాయికి ఎదిగారు. ఇందిర మరో విమర్శకుడు, ఐ కె గుజ్రాల్ కూడా రాజీనామా చేసి ప్రధాన మంత్రి కాగలిగారు. ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల పూర్వ రంగంలో, ఆమెకు అత్యంత విధేయుడుగా వున్న జగ్జీవన్ రాం ఆమెను ఎదిరించి పార్టీని వదిలి, "కాంగ్రెస్ ఫర్ డెమాక్రసీ" ని స్థాపించి, జనతా కూటమితో కలిసి పోటీ చేయడం వల్లనే ఉప ప్రధాన మంత్రి కాగలిగారు. 1977 ఎన్నికలలో ఘోర పరాజయం పొందిన తర్వాత పార్టీలో తన వీర విధేయులకు తప్ప ఇతరులకు స్థానం లేకుండా చేసి, పార్టీని చీల్చి, ఇందిరా కాంగ్రెస్ పేరుతో పునర్నిర్మించి, ఎవరినీ నమ్మలేని పరిస్థితుల్లో 1978 లో తానే అధ్యక్ష పదవిని చేపట్టింది. అనతి కాలంలోనే అఖండ విజయం సాధించి ప్రధాని కాగలిగింది. ఆమె వారసుడిగా ఎదుగుతున్న చిన్న కొడుకు సంజయ్ గాంధి దుర్మరణం పాలవడంతో, పెద్దకొడుకు రాజీవ్ గాంధిని నెహ్రూ-గాంధి కుటుంబ పాలనను కొనసాగించడానికి రాజకీయ తెరమీదికి తీసుకొచ్చింది. "వీర విధేయులు" దానికి మద్దతీయగా, "నిశ్సబ్ద వ్యతిరేకులు" మౌనం పాటించారు. సమయం కొరకు వేచి చూడ సాగారు. హత్యకు గురయ్యేంతవరకూ పార్టీ పగ్గాలు ఇందిరా గాంధి తన చేతుల్లోనే వుంచుకుని, తదనంతరం రాజీవ్ గాంధీని వారసుడిని చేసింది. భారత జాతీయ కాంగ్రెస్‌-ఏఐసీసీ () తెర పైకొచ్చింది. అదే ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ.

రాజీవ్ గాంధి నాయకత్వంలో, 1984 సార్వత్రిక ఎన్నికల్లో, పార్టీ భారీ మెజారిటీ సాధించి, 1985 లో, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. విశ్వనాధ్ ప్రతాప్ సింగ్ ను, మంత్రివర్గంలో తీసుకుని ఆర్థిక శాఖను కేటాయించి, సింగ్ "ధిక్కార ధోరణి" ని సహించలేక శాఖలో మార్పులు చేసి రక్షణ శాఖకు మార్చాడు. "బోఫోర్స్" సమాచారం వెలుగులో తేవడానికి సింగ్ సిద్ధపడుతున్నాడని అనుమానం వచ్చిందో, ఆ శాఖనుంచి కూడా తప్పించారు. పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి, పార్లమెంటు స్థానానికి రాజీనామా చేసిన వీపీ సింగ్, 1989 లో జరిగిన ఎన్నికల్లో జనతా దళ్ అభ్యర్థిగా లోక్ సభకు ఎన్నికై, "నేషనల్ ఫ్రంట్" ప్రభుత్వానికి సారధ్యం వహించి ప్రధాన మంత్రి అయ్యారు. ఆయనే కనుక రాజీవ్ గాంధీకి "వీర విధేయుడి" గా వుండి పోయినట్లయితే, ప్రధాన మంత్రి స్థాయికి ఎదిగేవాడు కానే కాదు. 1991 లో రాజీవ్ గాంధి హత్యకు గురికావడంతో, పీవీ నరసింహారావు "ఏకాభిప్రాయ అభ్యర్థి" గా పార్టీ పదవిని చేపట్టి, ఎన్నికల తర్వాత ప్రధాన మంత్రి అయ్యారు.

పీవీ సొంత నిర్ణయాలు తీసుకోవడం, ఆర్థిక సంస్కరణల ఆద్యుడిగా అంతర్జాతీయ మన్ననలందుకోవడం సోనియాకు మింగుడు పడలేదు. రాజకీయాలతో సంబంధం లేని మన్మోహన్ సింగ్‌ను ఆర్థిక మంత్రిగా తెచ్చి, భవిష్యత్ ప్రధాని కావడానికి పునాదులు వేశారాయన. ఐదేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందిన పార్టీ నాయకత్వ బాధ్యతలనుంచి దయనీయంగా తొలగించారాయనను. ఆయన స్థానంలో వచ్చిన కేసరికి అదే పరిస్థితి ఎదురైంది తర్వాత. సోనియా శకం మొదలైంది. ఐదో తరం వ్యక్తిగా పార్టీ అధ్యక్షురాలైంది. ఇంతలో 2004 ఎన్నికల సంరంభం మొదలైంది. రద్దయిన లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించిన శరద్ పవార్ ధిక్కార స్వరం వినిపించాడు. నెహ్రూ-గాంధి వారసురాలిగా సోనియా ప్రధాని కాకూడదన్న భావం ఆయనకే కాకుండా మరి కొందరిలో కూడా ప్రస్ఫుటంగా కనిపించింది. మాట నెగ్గించుకోలేని పవార్, మాజీ లోక్ సభ సభాపతి సంగ్మాతో కలిసి "నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ" ని నెలకొల్పారు. స్థైర్యం కోల్పోని సోనియా, చాకచక్యంగా మన్మోహన్ సింగ్ ను తెర పైకి తెచ్చి ఆయనను ప్రధానిని చేసింది.

రిజర్వ్ బాంక్ గవర్నర్‍గా మన్మోహన్ సింగ్ పనిచేసిన రోజుల్లో, ఆర్థిక మంత్రిత్వ శాఖను నిర్వహించిన ప్రణబ్ కుమార్ ముఖర్జీ ఇప్పుడు మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో పనిచేయక తప్పలేదు. కాంగ్రెస్ సీనియారిటీ సోనియా నిర్ణయం ముందు పనికి రాలేదు. ఆయనకు ప్రధాని కావాలన్న ఆశా చావలేదు. ఎదురు తిరిగే ధైర్యం అప్పట్లో లేదు. కాని, అవకాశం వస్తే, ధిక్కరించగలిగితే, వదులుకుంటాడా? గతంలో రాజీవ్ గాంధి హయాంలో, ఒకసారి, నిర్లక్ష్యానికి గురై పార్టీని వీడి సొంత కుంపటి కూడా పెట్టుకుని, తిరిగి పీవీ హయాంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా స్వగృహ ప్రవేశం చేసి, పార్టీకి-సోనియాకు (పైకి వీర)విధేయుడిగా ఇప్పుడు కొనసాగుతున్నారు. ఆయనలోని అలనాటి రాజీవ్ (నెహ్రూ-గాంధి) వ్యతిరేకత దేనికైనా, ఎప్పుడైనా దారితీయవచ్చు! శరద్ పవార్ మనసు మార్చుకుని, సోనియా సారధ్యంలోకి పరోక్షంగా చేరినప్పటికీ ప్రధాని కావాలన్న ఆశ చావలేదింకా.

తనకు మద్దతు ఇస్తూనే-ఇస్తున్నట్లు నటిస్తూనే, పరోక్షంగా, అవకాశం కొరకు ఎదురుచూస్తున్న పార్టీ లోని సొంత మనుషుల వ్యవహారం సోనియాకు తెలియకుండా వుంటుందా? ప్రతిభా పాటిల్ పదవీ కాలం ముగియగానే, ఆమె స్థానంలో కాంగ్రెస్ రాష్ట్రపతి అభ్యర్థిగా మన్మోహన్‌ను ప్రతిపాదించి, ప్రధాని పీఠంపై తనయుడు రాహుల్ గాంధీని కూచోబెట్టాలంటే, నామ మాత్రం వ్యతిరేకత కూడా లేకుండా జాగ్రత్త పడాలి. బయటపడి ఏదో ఒక కారణం చూపించి, సోనియా సూచనను పాటించని వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్లు ఆమెకు అసలైన శత్రువులు కారని ఆమెకూ తెలుసు. జగన్ లాంటి వారు జాతీయ స్థాయిలో సోనియాని అస్థిరపరిచలేరని కూడా అమెకు తెలుసు. వచ్చిన చిక్కల్లా "కంట్లో నలుసుల" తోనే. సోనియాకు కాంగ్రెస్ పార్టీని మరో మారు ఏదో ఒక రకంగా, అత్తగారి తరహాలో చీలిస్తేనో, లేక, ఏదో కారణాన జాతీయ స్థాయిలో ఆమెను వ్యతిరేకించేవారు చీలిపోతేనే మంచిది. నెహ్రు-గాంధీ వారసత్వం చెక్కు చెదరకుండా వుండాలంటే కాంగ్రెస్ పార్టీలో మరో ప్రక్షాళన జరగాల్సిందే.

క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడిగా వున్న ఏకె ఆంటోనీ ఒకప్పుడు పార్టీని వీడిన వాడే. ప్రణబ్ ముఖర్జీ పార్టీని వీడిన వాడే. ఇందిరకు వ్యతిరేకంగా కాంగ్రెస్ () నుంచి బయటికొచ్చి, భారత జాతీయ కాంగ్రెస్ (అర్స్) స్థాపించినప్పుడు అందులో చేరిన ప్రముఖుల్లో ఆంటోనీ ఒకరు. సోనియాకు సన్నిహితుడైన ప్రియరంజన్ దాస్ మున్షీ కూడా ఒకరు. ఆంటోనీ అంతటితో ఆగకుండా, కాంగ్రెస్ () ను స్థాపించి, 1982 లో స్వగృహ ప్రవేశం చేసి, పార్టీలో క్రమశిక్షణను కాపాడే పనిలో వున్నాడు! సోనియా ఆదేశాలిచ్చిందన్న సాకుతో, మొయిలీలు-అహ్మద్ పటేల్లు-ప్రణబ్ ముఖర్జీలు, వారు చెప్పారని ఆంధ్రా నాయకులు, జగన్ కు మంచిచెపుతున్నట్లు నటిస్తూనే, ఆమెకు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నారు. అలాంటి వారిని గుర్తించే ప్రయత్నం జరుగుతుండొచ్చు. అందుకే పార్టీలో చీలిక తప్పకపోవచ్చు.

భారత జాతీయ కాంగ్రెస్(ఆర్) కాని, భారత జాతీయ కాంగ్రెస్ (ఎస్) కాని ఆవిర్భవించవచ్చు. అనూహ్యంగా తెర పైకి ప్రియాంక గాంధీని తీసుకొచ్చి కాంగ్రెస్ (పి) స్థాపన జరిగినా ఆశ్చర్యం లేదు. అలా జరగాలంటే, జగన్ లాంటి యువ నాయకులను వెంట వుంచుకోవాల్నా? వదిలించుకోవాల్నా? అన్న ఆలోచన చేయకుండా వుంటుందా సోనియా? అంటే, జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన పదహారు మంది కాంగ్రెస్ పార్టీ శాసనసభ సభ్యులకు సోనియా నుంచో, సోనియాను అంతర్లీనంగా వ్యతిరేకిస్తున్న ఆమె కోటరీలోని ఆమె మనుషులుగా నటిస్తున్న వారినించో, సలహాలు-సూచనలు అందుతున్నాయనడంలో అనుమానం లేదు. ఈ నేపధ్యంలోనే, తన పార్టీ వారు కాకపోయినా తనకు ఎప్పుడో అప్పుడు విధేయులుగా వుండకపోతారా అన్న నమ్మకంతో, తెలంగాణ రాష్ట్ర సమితి లాంటి పార్టీలను కలుపుకుని పోయేందుకు, తన తనయుడు రాహుల్‍ని (లేదా కూతురు ప్రియాంకను) ప్రధాన మంత్రి పీఠం పై కూర్చొబెట్టడానికి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించినా ఆశ్చర్యపోనక్కరలేదు! ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు విషయంలో కావాలనే తనను తప్పుదోవ పట్టిస్తున్న ప్రణబ్ ముఖర్జీ లాంటి వారి నుంచి సోనియా అప్రమత్తంగా వుంటే మంచిది. పుట్టిన రోజు కానుకగా తెలంగాణ ఏర్పాటు నిర్ణయం తీసుకుని వుంటే బాగుండేది!

5 comments:

  1. Jagan is a big stupid..16 people or MLA'a are with him, just because some relationships and of course the money factor.. this is very simple to understand..jagan tries to imitate his father ..nothing more...As a MP he did not pose a single question in parliament..how u r thinking he has won indirectly...you better change the way of ur thinking...such a bad analysis..

    ReplyDelete
  2. You analysis is amusing and biased. At best it can be termed as the height of wishful thinking. I am sad that the standard of the journalism in Telugu media has come down to this level.

    ReplyDelete
  3. I never came across more ridiculous analysis than this for years. It is hilarious,dumb and biased.

    ReplyDelete
  4. నాకు సందేహం, ఈ రచయిత కి కూడా మహా నేత హయాం లో బాగానే మేళ్ళు జరిగాయేమో అని.

    ReplyDelete
  5. I agree to disagree. I respect youe views.
    Regards, Jwala

    ReplyDelete