"మార్క్సిస్టు ఫోరం"
వనం జ్వాలా నరసింహారావు
(మాజీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సిపిఐ (ఎం) నాయకుడు, ప్రజా వైద్యుడుగా పేరు తెచ్చుకున్న డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తిగారి జీవితచరిత్రను "తీపి గుర్తులు-చేదు అనుభవాలు" గా గ్రంధస్థం చేసే అవకాశం కలిగింది నాకు. 39 అధ్యాయాల ఆ పుస్తకంలోని వివరాలలో తొమ్మిదవ అధ్యాయం ఇది).
భారత చైనా యుద్ధం నేపథ్యంలో చైనా వాదులుగా ముద్రపడి అరెస్ట్ అయినవారిలో, పోలిట్‌బ్యూరో సభ్యుల నుండి జిల్లా స్థాయి ముఖ్య నాయకుల వరకు ఉన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిణామాల ప్రభావం ఖమ్మం జిల్లా మీద కూడా తీవ్రంగా పడింది. తెలంగాణ సాయుధపోరాటం కాలం నుండే ఖమ్మం జిల్లాకు కమ్యూనిస్టుల కంచుకోటగా పేరుండడంతో ఆ జిల్లాలో ముఖ్యమైన కమ్యూనిస్ట్ నాయకులందరినీ నిర్భంధించింది నాటి ప్రభుత్వం పిడి చట్టం కింద.
ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో తీవ్ర స్థాయిలో సైద్ధాంతిక చర్చ సాగుతున్న రోజుల్లో, సహజంగా దాని ప్రభావం ఖమ్మం కమ్యూనిస్టుల పైన కూడా పడింది. చాలా కాలం వరకు, కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం కూడా తీసుకోక పోయినా పార్టీ నిర్ణయాలను, విధానాలను తు.చ. తప్పకుండా ఈనాటి దాకా అమలు జరుపుతుండే పేరుపొందిన స్థానిక డాక్టర్. యలమంచిలి రాధాకృష్ణమూర్తి (డాక్టర్ వై.ఆర్.కె.) ఇంటి ఆవరణలో ప్రతి ఆదివారం సాయంత్రం పలువురు పార్టీ సభ్యులు, సానుభూతి పరులు "మార్క్సిస్ట్ ఫోరం" అనే గొడుగు కింద సమావేశమై సిద్ధాంత పరమైన విషయాలపై చర్చించుకునే వారు.
1958 నుండి కృశ్చేవ్ నాయకత్వాన వున్న సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీకి, మావో సేటుంగ్ నాయకత్వాన వున్న చైనా పార్టీకి మధ్య విభేదాలు తలెత్తాయి. విస్తృతమైన బహిరంగ చర్చ జరిగింది. చైనా పార్టీ, నెహ్రూకు సంబంధించి, "నెహ్రూ మరికొంత", "టోగ్లియాటీ గురించి", "టోగ్లియాటీపై మరికొంత", "కృశ్చేవ్ రివిజనిజం", "లాంగ్ లివ్ లెనినిజం" అంశాలపై అనేక డాక్యుమెంట్లను రాసింది. వాటికి కొంత మేరకు సమాధానంగా సోవియట్ పార్టీ కూడా వ్యాసాలు రాసింది. చైనా పార్టీ చివరకు, "జనరల్ లైన్ ఫర్ ద ఇన్ టర్ నేషనల్ కమ్యూనిస్ట్ మూవ్ మెంట్" అనే పత్రం ఆ చర్చకు క్లైమాక్స్ గా విడుదల చేసింది. 1958లో యూరప్ దేశాల కమ్యూనిస్ట్ పార్టీలు సమావేశమై ఒక పత్రం విడుదల చేశాయి. తరువాత 1961లో ప్రపంచంలోని 81 దేశాల కమ్యూనిస్ట్ పార్టీలు సమావేశం, మాస్కోలో 30 రోజుల పాటు జరిగింది. చివరకు "81 దేశాల కమ్యూనిస్ట్ పార్టీల ప్రకటన" పేరుతో ఒక డాక్యుమెంట్ విడుదల చేశారు. అది ఈ రెండు పార్టీల భిన్న ధోరణులకు రాజీ మార్గంగా వచ్చిన ప్రకటన .
ఈ మొత్తాన్ని ఆ రోజుల్లో "గ్రేట్ డిబేట్" అనే వారు. "మార్క్సిస్టు ఫోరం" వైఖరి చైనా పార్టీ వాదనకు దగ్గరగా వుండేదనేది వాస్తవం. చైనా పార్టీలో 1968-1978 మధ్య "సాంస్కృతిక విప్లవం" పేరుతో జరిగిన అశాస్త్రీయ, అరాచక చర్యలకు చైనా పార్టీతో పాటు భారత కమ్యూనిస్ట్ (మార్క్సిస్టు) పార్టీ కూడా తన అసమ్మతిని తెలియ చేసిందన్నది తరువాత కథ. 1961వ సంవత్సరంలో ప్రారంభమై క్రమం తప్పకుండా జరుగుతుండే ఆ సమావేశాలకు, జిల్లా సీనియర్ నాయకులైన చిర్రావూరి లక్ష్మినరసయ్య (ఎన్నో మార్లు ఖమ్మం మునిసిపల్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు), మంచికంటి రాంకిషన్‌రావు (1983లో ఖమ్మం ఎమ్మెల్యే) లతో సహా 25-30 మంది ప్రముఖులతో సహా పలువురు విద్యార్థి నాయకులు, యువకులు హాజరయ్యేవారు. వారందరూ చైనా కమ్యూనిస్ట్ పార్టీ పంథాకు అనుకూలురే కాకుండా, పార్టీ చీలిపోయిన తర్వాత సిపిఎంలోనే వుండిపోయారు. స్థానిక కాలేజీ విద్యార్ధి నాయకులు కూడా వస్తుండడంతో ఆ వేదిక కింద మార్క్సిజం-లెనినిజం అధ్యయన తరగతులు నిర్వహించడం కూడా జరిగేది.
డాక్టర్ వై.ఆర్.కె తో పాటు స్థానిక ప్రముఖ అడ్వకేట్లు కె.వి సుబ్బారావు, బోడేపూడి రాధాకృష్ణ గార్లు ఫోరం నిర్వహణలో చురుకైన పాత్ర నిర్వహించేవారు. ఆ నాటి రాజకీయ తరగతులలో పాల్గొన్న విద్యార్థి నాయకుల్లో చాలామంది చురుకైన పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా అభివృద్ధి చెందారు. వారిలో కొందరిని: కర్నాటి రామ్మోహనరావు, మాటూరి రామచంద్రరావు, వాశిరెడ్డి మల్లిఖార్జునరావు, గండ్లూరి కిషన్‍రావు, వనం నరసింగరావు, లాయర్ బోడేపూడి వెంకటేశ్వరరావు, సిద్ధి వెంకటేశ్వర్లు, రాయల బోసు, చింతలపూడి రాజారావు, బత్తుల వెంకటేశ్వరరావు, ఖాదర్ అలీ (తరువాత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు) మొదలైన వారిని డాక్టర్‍గారు గుర్తుకు తెచ్చుకున్నారు.
ఈ నేపధ్యంలో పార్టీ చీలిపోవడం, సిపిఎం నాయకులందరూ నిర్బంధానికి గురికావడం జరిగాయి. ఇంట్లో తను స్థాపించిన మార్క్సిస్ట్ ఫోరం కింద నిర్వహించిన చర్చల్లో పాల్గొన్న వారంతా సిపిఎం పక్షాన చేరడంతో అది తనకో నైతిక విజయంగా భావించారు డాక్టర్ రాధాకృష్ణమూర్తి. పార్టీ పట్ల సిద్ధాంతాల పట్ల సంపూర్ణ విశ్వాసమున్న డాక్టర్ వై.ఆర్.కె. తాను నమ్ముకున్న సిద్ధాంతానికి అనుకూలురైన ఖమ్మం జిల్లా కమ్యూనిస్టు నాయకులందరూ అరెస్ట్ కావడంతో వారంతా విడుదలయ్యే వరకూ పార్టీని ఏకతాటిపై నడిపిస్తూనే, ఏ విధంగా బలోపేతం చెయ్యాలన్న ఆలోచనలో పడ్డారు. వారి విడుదలకెలా ప్రయత్నం చెయ్యాలన్న ఆలోచనలో భాగంగా స్థానిక అడ్వొకేట్లయిన బోడేపూడి రాధాకృష్ణ, కె.వి. సుబ్బారావుల మద్దతు పొందారు. ఆ ముగ్గురి (మేధావుల) కలయికే భవిష్యత్ "భారత పౌర హక్కుల ఉద్యమానికి" నాంది అవుతుందని బహుశ ఆనాడు వారూ ఊహించి ఉండరు. ఆశ్చర్యకరమైన విషయం అప్పటికి, ఈ ముగ్గురు కూడా పార్టీ సానుభూతి పరులే కానీ సభ్యులు కాకపోవడం.
ముగ్గురూ వారి వారి వృత్తుల్లో నిరంతరం బిజీగా ఉండే వారు కావడంతో పార్టీపరమైన పనికి ఎక్కువగా రాత్రి వేళలు కేటాయించేవారు. ఆపాటికే ఆదరణ పొందిన "మార్క్సిస్ట్ ఫోరం" వేదిక కార్యకలాపాలు ముమ్మరం చేసారు. అప్పట్లో వారికదో పెను సవాల్. ఒకవైపు సిపిఐ నాయకత్వమంతా (ఆ పక్షాన ఖమ్మం జిల్లాలో చేరింది అతి కొద్ది మందే అయినప్పటికీ కూడా) ఏకతాటిపై పని చేస్తూ, సిపిఎం కార్యకర్తలను తమ వైపుకు ఆకర్షించుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. సిపిఐ పక్షాన జిల్లా అగ్రనాయకుల్లో ఒకరైన ఎన్. గిరిప్రసాద్ ఉండడంతో అది మరో సవాలుగా మారింది. నిజానికి చీలికొచ్చేంత వరకూ గిరిప్రసాద్ సిపిఎం పంథాకు అను కూలంగా ఉండేవారని అనుకునేవారు. మొత్తం మీద రెండో స్థాయి నాయకత్వం, మేధావిత్రయం మార్గదర్శకంలో చేసిన కృషి ఫలితంగా పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూ పార్టీని పటిష్ట పరచగలిగారు.
1964లో ఉమ్మడి పార్టీ చీలినప్పుడు అత్యధిక భాగం మార్క్సిస్టు పార్టీవైపు రాగా, కొద్ది మంది మాత్రం గిరిప్రసాద్ గారి నాయకత్వాన సిపిఐ పక్షాన వుండిపోయారు. వారిలో బోడేపూడి రామకోటేశ్వరరావు(పండితాపురం), సింగరేణి కార్మిక నాయకులు కొమరయ్య, రాజేశ్వరరావు, రావెళ్ల జానకిరామయ్య(చిరు నోముల), చుండూరు నరసింహారావు, తమ్మారపు గోవిందు, తాళ్లపల్లి రాములు, భద్రాచలం నుండి భూపతిరావు, తహశీల్, వాసిరెడ్డి వెంకటపతి(మధిర) గార్లు ముఖ్యులని అంటారు. కొద్ది మాసాల తరువాత రేగళ్ల చెన్నారెడ్డి, నల్లమల పిచ్చయ్య గార్లు కూడా సిపిఐ లోకి వెళ్లారు. వారిద్దరూ 1964 లో కలకత్తాలో జరిగిన సిపిఐ (ఎం) సభకు కూడా హాజరై వచ్చాక ఆ నిర్ణయం తీసుకున్నారు.
ఎవరు పెట్టారో, ఎందుకు పెట్టారో కాని ఖమ్మంలో మార్క్సిస్ట్ ఫోరం ప్రతి ఆదివారం నిర్వహిస్తుండే సమావేశాలకు హాజరయ్యే వారిని “ఆదివారం సంఘం” గా-"సండే సిండికేట్" గా ఎద్దేవా చేస్తూ, పిలవడం జరిగేది ఓ రకమైన హేళనతో అప్పట్లో. ఇప్పటికీ ఆదివారం సంఘంతో అనుబంధమున్న వారు ఆ జిల్లాలో పలువురున్నారు.
No comments:
Post a Comment