Friday, December 25, 2015

బాలకాండ మందరమకరందం సర్గ-2 తమసాతీరంలో విహరించిన వాల్మీకి మహర్షి : వనం జ్వాలా నరసింహారావు

బాలకాండ మందరమకరందం
సర్గ-2
తమసాతీరంలో విహరించిన వాల్మీకి మహర్షి
వనం జ్వాలా నరసింహారావు

(నారదుడు చెప్పిన రామ చరిత్రను విన్న వాల్మీకి సంతోషంతో ఆయన్ను పూజించాడు. నారదుడు పోయింతర్వాత, వాల్మీకి, శిష్యుడితో తమసాతీరంలో తిరుగుతూ, ఒక క్రౌంచమిధునాన్ని చూశాడు. ఆయన చూస్తుండగానే, బోయవాడొకడు, జంటలోని మగపక్షిని బాణంతో కొట్టి చంపుతాడు. ఆడ పక్షి ఏడుపు విన్న వాల్మీకి, ఎంతో జాలిపడి, బోయవాడిని శపించాడు. ఇలా ఆదికవి నోటినుండి వెలువడిన వాక్యాలు సమాక్షరాలైన నాలుగు పాదాల (శ్లోకం) పద్యమయింది. అదే విషయం గురించి ఆలోచిస్తూ, శిష్యుడు భరద్వాజుడితో ఆశ్రమానికి వచ్చాడు. అక్కడికి బ్రహ్మదేవుడు వచ్చి, రామాయణం రాయమని ఉపదేశించి, సర్వం ఆయనకు తెలిసేట్లు వరమిచ్చి పోయాడు. వాల్మీకి రామాయణాన్ని రచించాలని నిశ్చయించుకున్నాడు.సంక్షిప్తంగా నారదుడు చెప్పిన రామ చరిత్రను, వాల్మీకి వివరంగా చెప్పాలనుకున్నాడు.
(గ్రంథాన్ని చదవాలనుకునేవారు మూడు విషయాలు అవశ్యంగా తెలుసుకోవాలి. గ్రంథం చెప్పిందెవరు? అతడి నడవడి ఎలాంటిది? లోకులకతడు ఆప్తుడా? అని విచారించాలి. దీన్నే వక్తృ విశేషం అంటారు. మేలుకోరి మంచే చెప్తాడన్న విశ్వాసానికి పాత్రుడైన వాడే ఆప్తుడు. వీడి వాక్యమే ఆప్త వాక్యం. ఆప్త వాక్యం తోసివేయలేనటువంటిది. మొదటి ఆప్తుడు భగవంతుడు. వేదం ఆప్తవాక్యం. ఫ్రజల మేలుకోరి, వేదార్థాలను, పురాణ-ఇతిహాస శాస్త్రాలను, లోకానికి తెలిపినవారు ఆప్తులు. వారి రచనలు ఆప్త వాక్యాలు. యధార్థాన్ని తను తెలుసుకుని, కామ-క్రోధ-లోభాలకు లోనుకాకుండా, తనెరిగిన ఆ యధార్థ విషయాన్నే, ఇతరుల మేలుకోరి చెప్పడమే ఆప్త లక్షణం. అలాంటిదే వాల్మీకికి బ్రహ్మానుగ్రహంవల్ల కలిగింది. కాబట్టి ఆయన పరమాప్తుడు).
బ్రహ్మ ఆజ్ఞ ప్రకారం లోకులు తరించేందుకొరకై వాల్మీకి ఈ కృతి రచించాడు. ఈ వక్తృ విశేషం మొదలు చెప్పుకుంటున్నాం. తనడిగిన విషయమంతా తన హితం-శ్రేయస్సు కోరి, వింటానికింపైన అమృత బిందువుల లాంటి వాక్యాలను చెప్పి, తనను కృతకృత్యుడిని చేసి, తన సందేహం తీర్చిన నారదుడిని, మనోహరమైన మాటలతో వాల్మీకి సంతోష పరిచాడు. వాల్మీకి చేసిన ప్రదక్షిణ నమస్కార పూజలనందుకున్న నారదుడు, ఆయన దగ్గర శలవు తీసుకుని ఆకాశమార్గాన బ్రహ్మ లోకానికి పోయాడు.
నారదుడు వెళ్లిన తర్వాత, గంగా తీరం దగ్గరున్న తమసానది దగ్గరకు వచ్చాడు వాల్మీకి. సువాసనలు వెదజల్లే, పూ తీగల పొదరిండ్లున్న ప్రదేశమది. బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించే ఆ మహర్షివెంట ఆయన ప్రియ శిష్యుడు భరద్వాజుడున్నాడు. వీరిరువురు కలిసి, మధ్యాహ్నిక కర్మానుష్ఠానానికి స్నానం చేద్దామని, తమసానదిలో దిగుతారు. తేటగా-నిర్మలంగా నదిలో వున్న నీళ్లను చూసి వాల్మీకి శిష్యుడు భరద్వాజుడితో: "చూసావుకదా భరద్వాజా, ఈ నదీజలాల అడుగున కాని-పైన కాని, బురదలేదు. లోన పాపపు అలోచన లేకుండా, బైట పాపపు చర్య చేయకుండా, శుద్ధాంతఃకరణగల సత్పురుషుడి మనస్సులాగా తేటగా కనిపిస్తుంది కదా. దీన్ని మనం ఎన్నోసార్లు చూసాంగాని, ఎప్పటికప్పుడు కొత్తగా-మనోహరంగా కనపడుతూ ఎంతో సంతోషం కలిగిస్తుంది కదా. నార గుడ్డలివ్వు-కమండలాలను పదిలంగా ఒక చోట వుంచు. ఈ పుణ్య నదీ తీర్థంలో నేను స్నానం చేయాలి, తొందరగా రా" అంటాడు.
అని చెప్తూ, తనపై నున్న భక్తితో శిష్యుడిచ్చిన నార బట్టలు తీసుకున్నాడు వాల్మీకి. నారద ఉపదేశం విస్తరించి లోకాన్నెలా బాగుపర్చాలా అని ఆలోచిస్తూ, మధ్యాహ్నం మించిపోతున్న సంగతి కూడా గమనించకుండా, వన సౌందర్యం తిలకిస్తూ, సంచారం చేయసాగాడు. అప్పుడాయన కంటికి సమీపంలో, మనోహరంగా కూస్తూ, వియోగం సహించలేని క్రౌంచ పక్షుల జంట కనిపించింది. ఆసమయంలో, తాను చూస్తున్నానన్న లక్ష్యం కూడా లేకుండా, సహజంగా జంతువులను హింసించే స్వభావమున్న బోయవాడొకడు, రెండు పక్షులలో మగదాన్ని బాణంతో చంపి నేల కూల్చాడు.
నేల పైనబడి, నెత్తుటిమడుగులో, తన సమీపంలోనే కొట్టుకుంటూ చావడానికి చేరువలో వున్న మగపక్షిని చూశాడు వాల్మీకి. ఆహార-నిద్ర-విహార సమయాలలో, రేయింబవళ్లు, స్నేహంగా తన వెంటే వున్న మగపక్షితో, సమీపంలో బోయవాడున్నసంగతి కూడా గమనించకుండా, ఆనందంతో మైమరిచి కలిసున్న తమ జంటలో ఒకరు ప్రాణాలు పోగొట్టుకుంటూ విలవిలా తన్నుకుంటుంటే, భరించలేక దుఃఖంతో కూయ సాగింది ఆడ పక్షి. కీచుకీచుమనే సన్నని ధ్వనితో, ఎడతెరిపి లేకుండా కూస్తూ, సమీపంలో వాలి, ముక్కుతో గీరుతూ, బోయవాడు దగ్గరకు రాగానే భయపడి ఎగిరిపోయి, దగ్గర లోని చెట్టు కొమ్మపై వాలి, చనిపోయిన మగడిని చూస్తూ ఏడుస్తున్న ఆడ పక్షిని తదేక ధ్యానంతో చూశాడు వాల్మీకి. నేలమీద పడి వున్న మగపక్షినీ చూశాడు మళ్ళీ. వేటాడడాన్నీ, జీవహింస కులవృత్తిగా వుండే వేటగాళ్లు అనుసరించాల్సిన ధర్మాన్నీ తెలిసిన వాల్మీకి, జంటగా పక్షులు కలిసున్న సమయంలో, ఒకదాన్ని కొట్టి చంపడం ధర్మం కాదని నిశ్చయించుకుంటాడు. కనుబొమలు ముడిపడగా, కళ్లెర్రపడగా, క్రూరుడైన బోయవాడిపై దయ వీడి ఇలా శపించాడు:
"ఓరీ నిషాదుడా, క్రౌంచ పక్షుల జంట కలిసున్నప్పుడు, కామ క్రీడలు సలుపుతున్నప్పుడు, ఆ మత్తులో తేలుతున్నప్పుడు, జంటలో ఒక పక్షిని చంపావు కనుక, నీవు దీర్ఘకాలం బ్రతకవు". శపించిన తర్వాత సర్వ శాస్త్రజ్ఞాన సంపన్నుడైన వాల్మీకి మహర్షి, ఎంతగానో దుఃఖిస్తున్న క్రౌంచ పక్షి దురవస్థ చూడలేనందువల్లే బోయవాడినుద్దేశించి ఇలా అంటినికదా అనుకుంటాడు. అయితే తానన్న మాటలు ఎలా పరిణమించాయో నని ఆలోచించిన వాల్మీకి, శిష్యుడు భరద్వాజుడితో :"ఇప్పుడొక వింత జరిగింది. గమనించావా? దుష్టుడైన బోయవాడు చేసిన తప్పుడు పనికి బాధపడ్డ నేను, కోపంగా బోయవాడినన్న మాటలు, ఛందోశాస్త్ర విధుల ప్రకారం ఓ (శ్లోకం) పద్యమై వర్ధిల్లుతున్నది. ఏమి ఆశ్చర్యం? నాలుగు పాదాలతో, సమాన సంఖ్యగల అక్షరాలతో, మనోహరమై, వీణపై వాయించేందుకు అనువుగా, తాళానికి-లయకు సరిపడే (శ్లోకం) పద్యమైంది చూసావా?" అని అంటాడు. ఇలా వాల్మీకి ప్రేమతో చెప్పిన తర్వాత భరద్వాజుడు, గురువు చెప్పిన మాటలను గ్రహించి, (శ్లోక) పద్యరూప వాక్యాలకు చాలా ఆశ్చర్యపడి, దానిని కంఠస్తమయ్యేట్లు వల్లెవేస్తాడు. ఆ శిష్యుడి నడవడి చూసిన వాల్మీకికి ఎంతో సంతోష మేస్తుంది. తాను చెప్పింది లోకం మెచ్చుకోవడమే కవికి కావాల్సింది.
సంస్కృత రామాయణంలో ఆ శ్లోకం ఇలా వచ్చింది వాల్మీకి నోట:
"మానిషాద ప్రతిష్ఠాం త్వ! మగ మ శ్శాశ్వతీ స్సమాః
యత్క్రౌంచ మిథునాదేక! మవధీః కామమోహితం"

ఆంధ్ర వాల్మీకి రామాయణంలో వాసుదాసుగారిలా తెనిగించారు ఆ శ్లోకాన్ని:
"తెలియు మా నిషాదుండ ప్రతిష్ఠ నీక
ప్రాప్తమయ్యెడు శాశ్వతహాయనముల
గ్రౌంచ మిథునంబునందు నొక్కండు నీవు
కామమోహిత ముం జంపు కారణమున"
(రామాయణం రాద్దామని సంకల్పించిన వాల్మీకి నోట వెలువడిన ప్రథమ శ్లోకమిది. ఆంధ్ర వాల్మీకి రామాయణ రచనలో వాసుదాసుగారు మొట్టమొదట రాసిన పద్యమూ ఇదే. "మానిశాద" శ్లోకం అంతవరకు తెనిగించినవారు లేరంటారు కవి. వ్యాఖ్యాతలు రాసిన అన్ని అర్థాలు వచ్చే ట్లు రాయడం కష్టమనీ, దీన్ని తెనిగించగలిగితే మిగిలిందంతా తెనిగించడం తేలికవుతుందనీ భావించి, తనను తాను పరీక్షించుకోదల్చి, తొలుత ఆ పద్యాన్ని రాసానంటారు వాసుదాసుగారు. ఈ పద్యానికి నాలుగు పాదాలు.పాదానికి 13 అక్షరాలు.సాంఖ్యశాస్త్రంప్రకారం 13 ప్రణవాన్ని బోధిస్తుంది. ఎందుకంటే, వర్ణసమామ్నాయంలో 13వ అక్షరం "ఓ" విష్ణు అనే అర్థమున్న "మానిషాద" శబ్దం "అ" కారాన్ని సూచిస్తుంది. "అకారోర్థో విష్ణు" వని ప్రమాణం."ప్రతిష్ఠస్త్రీ లింగం.ఇక్కడ స్త్రీ వాచకం ప్రకృష్టమైంది. ప్రతిష్ఠ అనేది లక్ష్మీ వాచకమైన "ఉ" కారాన్ని బోధిస్తుంది."నీక" అనేది "ఉ" కార మొక్క అవథారణార్థకాన్ని తెలుపుతుంది. "క్రౌంచ మిథునంబునందు నొక్కండు", ప్రకృతి పురుషుల్లో కుటిల గతి కలది ప్రకృతి అనీ, దాని సంబంధంవల్ల అల్పమైన జ్ఞానమున్నవాడు (బద్ధ జీవుడు) పురుషుడని అర్థం చేసుకోవాలి. ఇది "మ" కారాన్ని బోధిస్తుంది).
బ్రహ్మ అనుగ్రహంతో రామాయణానికి మొట్ట మొదలు బీజ రూపంలో వెలువడ్డ ఆ శ్లోకం కేవలం శాపంగానే భావించకూడదని, అది శ్రీరామచంద్రుడి మంగళా శాసనం కావచ్చునని పూర్వులు ఆ శ్లోకానికి ఎన్నో అర్థాలు చెప్పుకున్నారు. క్రౌంచ మిథునాన్ని మండోదరి-రావణుల కలయికగానూ, క్రౌంచమంటే కుటిల స్వభావంగల రావణుడిగా అన్వయించి, అట్టి రావణుడిని చంపి లోకాలను రక్షించినందున తప్పక శాశ్వతంగా జయం కలుగుతుందని అర్థం చెప్పుకున్నారు కొందరు. మరో వ్యాఖ్యానంలో, రాముడు వాల్మీకిచే శపించబడాలని కోరుకుంటాడట. కోరుకుని బోయవాడయ్యాడట. దీనికి కారణం, శోకరసపూరితమైన తన చరిత్ర రాయడానికి సరిపోయినంత శోక రసం వాల్మీకి మనస్సులో వుందో-లేదోనని పరీక్షించేందుకేనట.
(ఈ పద్యం రామాయణార్థాన్ని సంపూర్ణంగా సూచిస్తుంది. "మానిషాదుండ... ... అంటే లక్ష్మికి నివాస స్థానమయిన శ్రీనివాసుడా, శ్రీరాముడా"  అనే పదం బాలకాండ అర్థాన్ని సూచిస్తుంది. "ప్రతిష్ఠ నీక శాశ్వతంబగు" అనే పదం పితృవాక్య పరిపాలన, రాముడి ప్రతిష్ఠను తెలియచెప్పే అయోధ్య కాండ అర్థాన్ని సూచిస్తుంది."శాశ్వతహాయనముల" అనే పదంలో రాముడు దండకారణ్యంలో ఋషులకు చేసిన ప్రతిజ్ఞలు నెరవేర్చినందువల్ల ఆయనకు కలిగిన ప్రతిష్ఠను తెలియచేసే అరణ్య కాండ అర్థాన్ని సూచిస్తుంది. దాని ఉత్తరార్థంలో కిష్కింధ కాండార్థాన్ని సూచిస్తుంది. క్రౌంచ దుఃఖం సీతా విరహతాపాన్ని తెలియచేసే సుందర కాండ అర్థాన్ని సూచిస్తుంది. ఇలా రకరకాలుగా రామాయణార్థం సూచించబడిందీ శ్లోకం- పద్యంలో).
(శ్లోక-పద్య రూపంలో శాపం ఇవ్వాలన్న తలంపు వాల్మీకికి లేదు. ఆయనా, తను వూరికే దూషించిన వాక్యం శాపంగా మారిందేనని, వాల్మీకి ఆశ్చర్యపడ్డాడు. దీని యదార్థ భావాన్ని వివిధ రకాలుగా విశ్లేషించవచ్చు. వాల్మీకి నారదుడిద్వారా రామ కథనంతా-సర్వం తెలుసుకుంటాడు. కరుణ రస భూరితంగా ఆ చరిత్రను గ్రంథస్థం చేయాలనుకుంటాడు. అందుకు ఆయనకి కరుణ రసం తగినంత పాళ్లలో వుండాలికదా! ఆ విషయాన్ని పరీక్షించగోరి, గతంలో భృగుమహర్షి ఇచ్చిన శాపాన్ని స్థిర పరిచేందుకు, శ్రీరాముడు బోయవాడి వేషంలో రాక్షసుడైన క్రౌంచపక్షిని చంపాడట. దీనినే శ్రీరాముడు-సీత అనే భార్యా-భర్తల ఎడబాటుగా అన్వయించుకోవచ్చు కూడా. ఏదేమైనా, వాల్మీకి రామాయణంలో చెప్పిన దానికి అర్థం వెతికేటప్పుడు, వాల్మీకి రామాయణమే ప్రమాణం కాని, ఇతర గ్రంథాలు ప్రమాణం కావు.


అలాంటప్పుడు, వాల్మీకి రామాయణం సత్యచరిత్రమనీ, అందులోని అనేక విషయాలు జరిగినవి-జరిగినట్లే, తెలుపబడ్డాయనీ చదువరులు మనస్సులో వుంచుకోవాలి. తక్కిన రామాయణాలన్నీ స్వమతాభిమానాన్ని, స్వమతాన్ని వుద్ధరించాలన్న ఆలోచనను తెలియబర్చేవి మాత్రమే. తన ఏడుపు కథను రాసేందుకు వాల్మీకికి తగినంత మోతాదులో ఏడుపు గొట్టుందానని శ్రీరాముడు పరీక్షించాడనడం విడ్డూరమనే అనాలి. ఇంతకూ, వాల్మీకి రామాయణాన్ని శృంగార ప్రబంధంగా వ్యాఖ్యాతలందరు అంగీకరించారు కాని, కరుణ ప్రబంధంగా అంగీకరించలేదు. సీతా వియోగం కూడా విప్రలంభ శృంగారమే.
వాల్మీకి బోయవాడిని రామచంద్రమూర్తి అని అనుకుని శపించలేదనేది పూర్తి యదార్థం. ఆయన రాముడి భార్య సీత తన ఆశ్రమంలో వుందన్న విషయం, ఆమె దుఃఖంతో పరితపిస్తున్న విషయం ఎరిగిన వాల్మీకి, ఆమె దుఃఖాన్ని మరింత పెంచడు కదా! తను శ్లోక (పద్య) రూపంలో అన్నది శాపంగా పరిణమిస్తుందని ఆయనకూ తెలియదప్పుడు. ఆయన మనస్సు లోని ఉద్దేశం తిట్టు రూపంలో శ్లోకం (పద్యం)గా రావడానికి కారణం, ఆయన నాలుకపై సరస్వతి వుండడమే. పలికించింది బ్రహ్మ పనుపున రామకథ వాల్మీకితో చెప్పించాలని వచ్చిన సరస్వతి. అంటే, కవి అనుకోకున్నప్పటికీ, సరస్వతి ఆయన నోట అలా పలికించిందనాలి).
ఆ తర్వాత వాల్మీకి శాస్త్రం చెప్పిన రీతిలో నదిలో స్నానం చేసి, సమీపంలో వున్న జల పూర్ణ కమండలాలను తీసుకుని, శిష్యుడు వెంటరాగా, తాను చెప్పిన (శ్లోకం) పద్యం గురించే ఆలోచిస్తూ ఆశ్రమం వేపు వెళ్తుంటాడు. వెళ్తూ, తను వూరికే శపిస్తే అది పద్యమెలా అయిందానని అనుకుంటూ, ఆ పద్యమే శాపానికి బదులుగా ఆశీర్వాదమయిందికదా అని ఆశ్చర్య పోతుంటాడు. ఆశ్రమం చేరి భగవద్విషయాలను తలచుకుంటుంటాడు.

వాల్మీకిని చూసేందుకు వచ్చిన బ్రహ్మ

బోయవాడు చేసిన పనికి కలిగిన దుఃఖంతో బాధపడ్డ వాల్మీకి, వాడిని దూషిస్తూ చెప్పిన పద్యం గురించి, తదేక ధ్యానంతో ఆలోచిస్తున్న సమయంలో, ఆయన్ను చూడడానికి వచ్చాడు బ్రహ్మదేవుడు. పది దిక్కులకు తన తేజస్సును వ్యాపింపచేస్తూ, యోగి శ్రేష్ఠులు చేతులు జోడించి వెంబడి వస్తుంటే, వేలాది సంవత్సరాలు తపస్సు చేసినా కానరాని బ్రహ్మదేవుడు, తనంతట తానే, దేవతా సమూహం చుట్టూ చేరి సేవిస్తుండగా వచ్చాడు. ఇలా బ్రహ్మ తన ఇష్టులతో, శిష్టులతో రావడంతో, వాల్మీకి తటాలున లేచి, మిక్కిలి భక్తితో మ్రొక్కి, నిలబడి ఈయనెందుకొచ్చాడా అని కారణం వెతకసాగాడు. "ఇదేదో వింతలాగుందే. నారదుడే స్వయంగా వచ్చి, రామ చరిత్ర ఉపదేశించడం మొదటి వింత. శాపోక్తులు భగవత్ మంగళా శాసనం కావడం మరో వింత. ఏళ్ల కొద్దీ తపస్సు చేసినా ప్రత్యక్షం కాని బ్రహ్మ తనంతట తానే నా గుడిసెలోకి రావడం ఆశ్చర్యంగా వుంది" అని, తనలో అనుకుంటూ,వినయంగా బ్రహ్మకు అర్ఘ్య-పాద్యాలిచ్చి, ప్రదక్షిణ నమస్కారాలు చేసి, సాష్టాంగ పడ్డాడు వాల్మీకి. తదుపరి, బ్రహ్మదేవుడు, ఉన్నతాసనంలో కూర్చొని, వాల్మీకిని కుశల ప్రశ్నలడిగి, ఆయన్నూ కూర్చోమని చెప్పాడు. సమీపంలో కూర్చొన్నప్పటికీ, బోయవాడి సంగతి మాత్రం మనస్సులో ధ్యానిస్తూనే వున్నాడు వాల్మీకి."అయ్యో, బోయవాడెంత దయలేనివాడు. ఏ కారణం లేకుండానే, పగబట్టినవాడిలా, పాపమని కూడా అనుకోకుండా, మనోహరంగా కూస్తున్న క్రౌంచ పక్షిని చంపాడు కదా" అని ఆలోచిస్తూ, పక్షి పడిన దుఃఖాన్ని తలచుకుంటూ, శోకం కలుగుతుంటే, తాను చెప్పిన పద్యం గురించే, ఎదుట బ్రహ్మ వున్న విషయం కూడా మరిచి వ్యాకుల పడుతున్న వాల్మీకిని గమనిస్తాడు బ్రహ్మ.

రామాయణం చెప్పేందుకు వాల్మీకిని నియమించిన బ్రహ్మ

వాల్మీకి నోట వచ్చిన పద్యానికి (శ్లోకానికి) కారణం తానేనని తెలియక తికమక పడుతున్నాడని చిరునవ్వుతో, బ్రహ్మ, సార్ధక జన్ముడైన వాల్మీకితో ప్రేమగా ఇలా అంటాడు:
"మునీశ్వరా, ఎందుకంత దూరమాలోచిస్తున్నావు? సందేహం వదులుకో.నీ నోటినుండి వచ్చింది (శ్లోకమే) పద్యమే. అది యాదృచ్ఛికంగా వచ్చింది కాదు. నా పనుపున సరస్వతీ దేవి నీ నోటినుండి పలికించింది. ఇది నేను తలపెట్టిన కార్యం. సరస్వతీ దేవికి నీ నోటినుండి పద్యం (శ్లోకం) పలికించాల్సిన పనేం కలిగిందని అనుకుంటున్నావా? నారదుడు ఉపదేశించిన ప్రకారంగా, శ్రీరామ చరిత్రంతా, ఇప్పుడు నువ్వు చెప్పిన (శ్లోకాల) పద్యాల లాంటివే చెప్పి, మిక్కిలి భక్తితో గొప్ప కావ్యంగా రచించాలి. ఆయన చరిత్ర నేనెందుకు చెప్పాలంటావా? బ్రాహ్మణోత్తమా, సమస్త కళ్యాణ గుణాలున్న వాడు, హేయ గుణాలేవీ లేనివాడు, సమస్త ధర్మాలకు నిలువనీడ శ్రీరాముడే. బుద్ధిమంతుడా, లోకంలో ఏ విషయాలు బహిరంగంగా చెప్పొచ్చు-ఏవి చెప్పకూడదు అని వివరించే శ్రీరాముడి చరిత్రలోని రహస్యాలు-రహస్యం కాని విషయాలు, సీతారామ లక్ష్మణ, రావణ చరిత్ర, అంతా నీ మనస్సుకు స్పష్టంగా గోచరిస్తుంది. లోక పూజ్యమయిన నీ కావ్యంలో, ఏ విషయంలోనైనా, జరిగినదానికి విరుద్ధంగా కాని, పూర్వోత్తర విరుద్ధమయిందికాని, ఒక అర్థానికి మరో అర్థం వచ్చే మాటకాని, వాక్యంకాని ఒక్కటికూడా వుండదు. ఇక నువ్వు సందేహించకుండా, కీడును తొలగించి-మేలుచేసే రామ కథను మంచి-మంచి (శ్లోకాలతో) పద్యాలతో, శీఘ్రంగా-కావ్యంగా రచించు నాయనా. నా లోకంలో నేను చేసినట్లే, భూ లోకంలో దీన్ని ప్రచారంలోకి తేవాలి నువ్వు".
"నువ్వంటే దేవతా శ్రేష్టుడివి. లోకపూజ్యుడివి. అందుకే నువ్వు పలికిన రామాయణం నీ లోకంలో శాశ్వతంగా నిలిచిపోయింది. అట్టి మహిమ నాలో లేదు కదా-నేను చెప్పింది నా కాలం వారైనా వింటారా-నా కాలంలోనైనా ప్రచారంలోకి వస్తుందా? అసూయాపరులెక్కువగా వున్న ఈ లోకంలో ఎలాంటి విఘ్నాలొస్తాయో-ఏమో? కొంతకాలమే వుండి, కొంతమేరకే ప్రచారంలోకి వచ్చే దానికొరకై నేనెందుకు శ్రమపడాలి అని అంటావేమో. నీకావిచారంతో పనిలేదు. ఎంతవరకు కుల పర్వతాలు, నదీ-నదాలు, భూమిపై వుంటాయో అంతవరకు నువ్వు రచించిన రామ చరిత్ర శాశ్వతంగా వుంటుంది. నీ రామాయణం శాశ్వతంగా లోకంలో నిలిచి పోతుందనుకో. దాని వల్ల ఏం లాభమంటావా? ఎంతవరకు నీ రామాయణ కావ్యం  భూలోకంలో ప్రచారంలో వుంటుందో, అంతవరకు, నువ్వు పూర్ణమైన యశస్సుతో జీవించి, ఆ తర్వాత మా లోకానికొస్తావు. బ్రహ్మ లోకంతో సహా అన్ని లోకాలకు పునరావర్తి వుంటుందికదా- అలాంటప్పుడు మోక్షానికై తపస్సు చేస్తున్న నువ్వు పరమపదానికి పోకుండా, నా లోకానికొస్తే, నీ కోరికెట్లా నెరవేరుతుందంటావేమో. నా లోకానికొచ్చిన నీకు ముక్తి హాని లేదు. అది ఎప్పటికైనా నా సొత్తే. నా లోకం వారుకూడా నీ రామాయణం వినేందుకు కుతూహలపడుతున్నారు. నువ్వు మా లోకానికొచ్చి, నేనున్నంతవరకుండి, నాతోనే ముక్తుడవుకా".
ఇలా చెప్పి బ్రహ్మ వెళ్లిపోతాడు. ఆయన చెప్పిన మంచిమాటలకు సంతోషించిన వాల్మీకి, జరిగిన వృత్తాంతమంతా శిష్యులతో చెప్పి, ఆలోచించి, సంతోషంతో తేలిపోతాడు. ఆయన శిష్యులుకూడా అంతే సంతోషంతో, అదే విషయాన్ని మళ్లీ-మళ్లీ తల్చుకుంటూ, ఎంత వింత జరిగిందే అనుకుంటారు. "స్పష్టంగా, సమాన సంఖ్యగల అక్షరాలున్న నాలుగు పాదాలతో-అందంగా-మన గురువుగారి శోకమే శ్లోకంగా (పద్యంగా)-భగవద్విషయం భావ గర్భితంగా వెలిసిందే! ఏమి ఆశ్చర్యం! ఇలాంటి వింత వుంటుందా?“అని శిష్యులు ఆనందంతో చర్చించుకుంటుంటారు. వాల్మీకి మహర్షి భగవంతుడిని ధ్యానిస్తూ, పరమాత్మ విషయం చెప్పాలని తల్చుకుంటూ, బోయవాడి విషయంలో ఆశువుగా తను చెప్పిన రీతిలోనే, పూర్తి శ్లోకాలతో (పద్యాలతో)-నిర్వచనంగా రామాయణాన్ని రచించాలని నిర్ణయించుకుంటాడు.

రసవంతంగా, వింటానికింపుగా, మననం చేయడానికి అమృత సమానంగా, రహస్యార్థాలకు ఆధారంగా, పఠించేవారికి-వినే వారికి నిర్మలమైన కీర్తినిచ్చేదిగా, భగవత్ ప్రాప్తికి విరుద్ధమైన పాపాలను హరించేదిగా వాల్మీకి రామాయణం వుండాలనుకుంటాడు మహర్షి. రసవత్తరమైన సమాసాలతో, సుకరమైన సంధులతో ప్రకాశించేదిగా-సజ్జనులతో స్తోత్రం చేయబడేదిగా-సమత్వం, మాధుర్యం,అర్థ వ్యక్తి లాంటి గుణాలు కలబోసి వాక్య బద్ధమైన కావ్యంగా-యోగం, రూడ్యార్థాలతో కూడినదిగా-రావణాసురుడి వధను అధికరించి చెప్పేదిగా-మనస్సుకు సుఖమిచ్చేదిగా-పామర కవులకు బదులుగా మునీశ్వరుడు చెప్పిందిగా-చక్కటి కావ్య గుణాలతో అలంకరించినదిగా, తాను రచించ బోయే రామాయణాన్ని-అందులోని శ్రీరామ చరిత్రను దర్శన సమానమైన ధ్యానంతో శ్రద్ధగా లోకులందరినీ వినమని కోరతాడు వాల్మీకి. 

No comments:

Post a Comment