Sunday, December 27, 2015

శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-IV : వనం జ్వాలా నరసింహారావు

శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-IV
వనం జ్వాలా నరసింహారావు

         ధర్మపురి క్షేత్ర నరసింహ స్వామికి మహా భక్తుడైన శేషప్ప కవి రచించిన నరసింహ శతకంలోని పద్యాలను యధాతధంగా నా బ్లాగ్ పాఠకులకు అందించే ప్రయత్నం ఇది. పదిరోజులకొకసారి పది పద్యాల చొప్పున వంద రోజులయ్యేసరికి వీటన్నింటినె నా బ్లాగ్ లో చదవ వచ్చు. (ఇవి నాలుగో విడత పది పద్యాలు)

శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-31

సీII       అతివిద్య నేర్చుట యన్న వస్త్రములకే,
పనుల నార్జించుట పాడికొరకె,
సతిని బెండ్లాడుట సంసార సుఖముకే,
సుతుల బోషించుట గతులకొరకె,
సైన్యమున్ గూర్చుట శత్రు భయంబుకె,
సాము నేర్చుటలెల్ల జావుకొరకె,
దానమిచ్చుటయు ముందటి సంచితమునకె,
ఘనముగా జదువుట కడుపుకొరకె,
తేII       యితర కామంబు గోరక సతతముగను
భక్తి నీయందు నిలుపుట ముక్తికొరకె,
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస !
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర !

శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-32

సీII       ధరణిలో వెయ్యేండ్లు తనువు నిల్వగబోదు,
ధనమెప్పటికి శాశ్వతంబు గాదు,
దార సుతాదులు తనవెంట రాలేరు,
భృత్యులు మృతిని దప్పింపలేరు,
బంధుజాలము తన్ను బ్రతికించుకొనలేరు,
బలపరాక్రమ మేమి పనికిరాదు,
ఘనమైన సకల భాగ్యంబెంత గల్గియు,
గోచిమాత్రంబైన గొంచుబోడు,
తేII       వెర్రికుక్కల భ్రమలన్ని విడిచి నిన్ను
భజన జేసెడివారికి బరమ సుఖము;
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస !
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర !



శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-33

సీII       నరసింహ! నాకు దుర్జయములే మెండాయె
సుగుణ మొక్కటి లేదు జూడబోవ;
                             నన్యకాంతలమీద నాశమానగలేను;                
ఒరుల క్షేమము జూచి యోర్వలేను;
ఇటువంటి దుర్భుద్ధులన్ని నాకున్నవి,
నేను జేసెడివన్ని నీచకృతులు;
నావంటి పాపిష్టి నరుని భూలోకాన
బుట్ట చేసితివేల? భోగిశయన!
తేII       అబ్జదళనేత్ర! నా తండ్రివైన ఫలము
నేరములు కాచి రక్షించు నీవె దిక్కు;
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస !
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర !

శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-34

సీII       ధీరతబరుల నిందింప నేర్చితిగాని
తిన్నగా నిను బ్రస్తుతింపనైతి;
బొరుగు కామినులందు బుద్ధినిల్పితిగాని
నిన్ను సతతము ధ్యానింపనైతి;
బొరుగు ముచ్చటలైన మురిసి వింటినిగాని
యెంచి నీకథ లాలకించనైతి
గౌతుకంబున బాతకము గడించితిగాని
హెచ్చు పుణ్యము సంగ్రహింపనైతి,
తేII       నవనిలో నేను జన్మించినందుకేమి
సార్థకము కానరాదేయె స్వల్పమైన;
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస !
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర !



శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-35

సీII       అంత్యకాలమందు నాయాసమున నిన్ను
దలతునో తలపనో? తలతు నిపుడె;
నరసింహ! నరసింహ! నరసింహ! లక్ష్మీశ!
దానవాంతక! కోటి భానుతేజ!
గోవింద! గోవింద! గోవింద! సర్వేశ!
పనాగాధిపశాయి! పద్మనాభ
మధువైరి! మదువైరి! మదువైరి! లోకేశ!
నీలమేఘ శరీర! నిగమ వినుత!
తేII       ఈ విధంబున నీనామ మిష్టముగను
భజన సేయుచునుందు నా భావమందు;
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస !
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర !


శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-36

సీII       ఆయురారోగ్య పుత్రార్థ సంపదలన్ని
కలుగజేసెడి భారకర్తవీవె;
చదువు లెస్సగ నేర్పి సభలో గరిష్ఠాది
కార మొందించెడి ఘనుడ వీవె
నడక మంచిది పెట్టి నరులు మెచ్చెడినట్టి
పేరు రప్పించెడి పెద్దవీవె;
బలువైన వైరాగ్య భక్తి జ్ఞానములిచ్చి
ముక్తి బొందించెడు మూర్తినీవె;
తేII       అవనిలో మానవుల కన్ని యాసలిచ్చి
వ్యర్థులను జేసి తెలిపెడివాడ వీవె;
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస !
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర !



శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-37

సీII       కాయమెంత భయాన గాపాడినంగాని
ధాత్రిలో నది చూడ దక్కబోదు,
ఏవేళ నేరోగ మేమరించునొ? సత్త్వ
మొందగ జేయు మే చందమునను,
ఔషదంబులు మంచి వనిభవించిన గాని
కర్మ క్షీణంబైనగాని విడదు,
కోటి వైద్యులు గుంపు గూడివచ్చిన గాని
మరణ మయ్యెడు వ్యాధి మాన్పలేరు,
తేII       జీవుని ప్రయాణ కాలంబు సిద్ధమైన
నిలుచునా దేహ మిందొక్క నిమిషమైన?
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస !
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర !

శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-38

సీII       జందెమింపుగ వేసి సంధ్య వార్చిన నేమి
బ్రహ్మమందక కాడు బ్రాహ్మణుండు;
తిరుమణి శ్రీచూర్ణ గురు రేఖ లిడినను
విష్ణు నొందక కాడు వైష్ణవుండు;
బూదిని నుదుటను బూసికొనిన నేమి
శంభు నొందక కాడు శైవజనుడు;
కాషాయ వస్త్రాలు కట్టి కప్పిన నేమి
యాశ పోవక కాడు యతివరుండు
తేII       ఇట్టి లౌకిక వేషాలు గట్టుకొనిన
గురుని జెందక సన్ముక్తి దొరకబోదు;
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస !
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర !



శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-39

సీII       నరసింహ! నే నిన్ను నమ్మినందుకు జాల
నెనరు నాయందుంచు నెమ్మనమున,
నన్ని వస్తువులు నిన్నడిగి వేసటపుట్టె
నింకనైన గటాక్ష మియ్యవయ్య!
సంతసంబున నన్ను స్వర్గమందే యుంచు,
భూమియందే యుంచు, భోగిశయన!
నయముగా వైకుంఠ నగరమందేయుంచు,
నగరమందేయుంచు నళిననాభ!
తేII       ఎచట నన్నుంచినంగాని యెపుడు నిన్ను
మరచిపోకుండ నామస్మరణ నొసగు;
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస !
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర !

శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-40

సీII       దేహ మున్నవరకు మోహ సాగరమందు
మునుగుచుందురు శుద్ధ మూఢజనులు;
సలలితైశ్వర్యముల్ శాశ్వతంబనుకొని
షడ్భ్రమలను మాన జాలలెవరు,
సర్వకాలము మాయ సంసారబద్ధులై
గురుని కారుణ్యంబు గోరుకొనరు;
జ్ఞానభక్తి విరక్తులైన పెద్దలజూచి
                              నింద జేయక తాము నిలువలేరు;                                    
తేII       మత్తులైనట్టి దుర్జాతి మనుజులెల్ల
నిన్ను గనలేరు మొదటికే నీరజాక్ష!
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస !

దుష్టసంహార ! నరసింహ ! దురితదూర !

No comments:

Post a Comment