Monday, December 28, 2015

అందరికీ అందుబాటులో ఆరోగ్య వైద్యం : వనం జ్వాలా నరసింహారావు

అందరికీ అందుబాటులో ఆరోగ్య వైద్యం
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి (23-12-2015)

భారత దేశంలోలా కాకుండా సింగపూర్‌లో అమల్లో వున్న ఆరోగ్య వైద్య విధానం కింద, ఆ దేశంలోని ప్రతి వ్యక్తికీ, ప్రాధమిక ఆరోగ్య సంరక్షణ, ఆసుపత్రి వైద్యం, దీర్ఘకాలిక ఆరోగ్య పరిరక్షణ, తదితర సంబంధిత కార్యక్రమాలు ఒక క్రమ పద్ధతి ప్రకారం చేపట్టి అమలు చేస్తారు. ప్రభుత్వ-ప్రయివేట్ రంగంలో అనేక ఔట్ పేషంట్-ఇన్ పేషంట్ క్లినిక్‌లు, పాలీ క్లినిక్‌లు, ఆసుపత్రులు, సింగపూర్‌లోని పౌరులకు-విదేశీయులకు వారి-వారి అవసరాలకు అనుగుణంగా, నాణ్యమైన వైద్య సౌకర్యం కలిగిస్తాయి. సింగపూర్‌లో నూటికి ఎనభై శాతం మేర ప్రాధమిక వైద్య సౌకర్యం సుమారు 2000 వరకూ వున్న ప్రయివేట్  ఆసుపత్రులలో లభ్యమవుతుంది. ప్రభుత్వ పరమైన పాలీ క్లినిక్‌లు కేవలం 18 మాత్రమే. భారతదేశంలో ప్రయివేట్ రంగంలో ఎక్కువగా స్పెషాలిటీస్-సూపర్ స్పెషాలిటీస్ సౌకర్యం మాత్రమే వుంటుంది. ప్రాధమిక వైద్య సౌకర్యం దాదాపు లేనట్లే. సింగపూర్ ప్రభుత్వ ఆసుపత్రులలో 80% స్పెషాలిటీస్-సూపర్ స్పెషాలిటీస్ సౌకర్యం దొరుకుతుంది. ఆసుపత్రి పడకల సంఖ్య- సుమారు 80% పైగా, కూడా ప్రభుత్వ రంగంలోనే అధికం. ప్రయివేట్ ఆసుపత్రులలో కేవలం 20% మాత్రమే! డాక్టర్ల సంఖ్య కూడా అంతే. ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేసేవారి సంఖ్య 80% కాగా, ప్రయివేట్ రంగంలో 20% మంది మాత్రమే వున్నారు.

భారత దేశంలోని పలు రాష్ట్రాలలో మరో పెద్ద సమస్య, అందునా ముఖ్యంగా మధ్యతరగతి ప్రజానీకం ఎదుర్కుంటున్న సమస్య అందుబాటులో లేని రోగ నిర్ధారణ పరీక్షల చార్జీలు. ఈ పరీక్షలన్నీ ప్రయివేట్ రంగంలోనే లభిస్తాయి. ఏవో ఒకటీ-అర తప్ప అన్నింటికీ ప్రయివేట్ కేంద్రాలకు వెళ్లాల్సిందే. కొన్ని పరీక్షల కయ్యే ఖర్చు మరీ ఎక్కువ. ఉదాహరణకు "పెట్" స్కాన్ అనే రోగ నిర్ధారణ టెస్ట్ కు రు. 20, 000 కు పైగా అవుతుంది. అలానే ఎంఆర్‍ఐ పరీక్షకు రు. 10, 000 అవుతుంది. ఇలాంటివన్నీ ప్రభుత్వమే సరసమైన ధరలకు చేసేలా చర్యలు చేపట్టాలి. అలానే పెద్ద సంఖ్యలో వీలైనన్ని ప్రదేశాలలో ప్రభుత్వమే పాలీ క్లినిక్‌లను ఏర్పాటు చేసి, లేదా, ప్రయివేట్ డాక్టర్లు నడుపుతున్న వారి సహకారం తీసుకుని పౌరులకు వైద్య-ఆరోగ్య సేవలందిస్తే బాగుంటుంది. ఈ నేపధ్యంలో, సింగపూర్ వైద్య-ఆరోగ్య వ్యవస్థ నుంచి కొన్ని విషయాలు తెలుసుకుని అమలు చేస్తే మంచిదేమో.

1965 లో సింగపూర్‌కు స్వాతంత్ర్యం లభించిన కొద్ది రోజుల్లోనే, అప్పటికే దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న అంటువ్యాధులను ముందస్తుగానే అరికట్టే ప్రక్రియ ఆరంభమైంది. పెద్ద ఎత్తున ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. దరిమిలా, భవిష్యత్‍లో ఎటువంటి ఇబ్బందులు తలఎత్తకుండా జాగ్రత్త పడేందుకు 1983 లో జాతీయ ఆరోగ్య విధానాన్ని రూపొందించింది. రాబోయే 20 సంవత్సరాలలో చేపట్టి అమలుపర్చాల్సిన ఆరోగ్యరంగంలో మౌలిక సదుపాయాల కల్పన గురించి ఒక నిర్దుష్ట కార్యక్రమాన్ని రూపొందించింది. ఏటేటా ఆ కార్యక్రమాన్ని సమీక్షించి తప్పులను సరి దిద్దుకుంటూ ముందుకు సాగుతోంది.

సింగపూర్ ఆరోగ్య వైద్య విధానంలో అత్యంత కీలకమైన "మెడి సేవ్"-వైద్య పొదుపు పధకానికి నాంది పలికింది. సింగపూర్‌లో మూడు విభాగాల ఆరోగ్య వైద్య నియంత్రణ వ్యవస్థలున్నాయి. మొదటిది ఆరోగ్య మంత్రిత్వ శాఖ, రెండోది కేంద్రీయ భవిష్యత్ నిధి, మూడోది సింగపూర్ మానిటరీ అథారిటీ. ఆరోగ్య సంరక్షణ సేవల పూర్తి పర్యవేక్షణ బాధ్యత మంత్రిత్వ శాఖదే. పొదుపు పధకాన్ని అమలు పర్చాల్సిన బాధ్యత భవిష్యత్ నిధిది. సింగపూర్ పౌరులందరూ-శాశ్వత నివాసీయులందరూ, వర్తమానంలోను, భవిష్యత్‍లో పదవీ విరమణ చేసిన తరువాత ముసలితనంలోను, తమ పోషణ బాధ్యత-ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాలలో, తామే విజయవంతంగా తమపై వేసుకునే విధంగా భవిష్యత్ నిధి చర్యలు తీసుకుంటుంది. బీమా రంగానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను క్రమబద్ధీకరించి, భీమాదారులెలాంటి ఇబ్బందులకు గురి కాకుండా-వారి ప్రయోజనాలను కాపాడే బాధ్యతను, సింగపూర్ కేంద్రీయ బాంక్ లాగా, మానిటరీ అథారిటీ వ్యవహరిస్తుంది. ఈ మూడు వ్యవస్థలు ఒకదానికి మరొకటి సరైన సహాయ సహకారాలు అందించుకుంటుంది.

సింగపూర్ మొత్తంలో, పదమూడు ప్రయివేట్ ఆసుపత్రులు, పది ప్రభుత్వ ఆసుపత్రులు, అనేక స్పెషలిస్ట్ క్లినిక్‌లు వున్నాయి. ఒక్కో చోట ఒక్కో రకమైన చార్జీలు అమల్లో వున్నాయి. పేషంట్లు తమకిష్టమైన సౌకర్యాన్ని ఎంచుకోవచ్చు. ఎప్పుడంటే అప్పుడు, తాను వెళ్లదల్చుకున్న ప్రభుత్వ-లేదా-ప్రయివేట్ ఆసుపత్రికి కాని, పాలీ క్లినిక్‌కు కాని వెళ్లవచ్చు. ఎమర్జెన్సీ సేవలైతే 24 గంటలు అందుబాటులో వుంటాయి. ప్రభుత్వ-ప్రయివేట్ ఆసుపత్రులన్నీ కూడా అధునాతన వైద్య సదుపాయాలను కలిగి వుంటాయి. అక్కడా-ఇక్కడా కూడా అత్యున్నత వైద్య ప్రమాణాలను పాటిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం, ఎప్పుడో, 2000 సంవత్సరం నాటికే సింగపూర్ ఆరవ రాంకు సంపాదించింది. శిశు మరణాల విషయంలో అత్యంత తక్కువ శాతం సింగపూర్‌లోనే. ప్రసూతి మరణాలు దాదాపు లేనట్టే.

ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణా విధానంలో మూడు రకాలున్నాయి. మొదటిది "మెడిఫండ్". దీని ద్వారా, తమంతట తాము ఎలాంటి పద్ధతిలోను వైద్య ఖర్చులు భరించలేని వారికి ఆరోగ్య సంరక్షణ ప్రభుత్వమే కలిగిస్తుంది. ఇదొక రకమైన శాశ్వత నిధి. రెండోదైన "మెడిసేవ్" ద్వారా, దాదాపు 85% మంది జనాభాకు ప్రయోజనం చేకూరుతుంది. ఇదొక రకమైన నిర్బంధ పొదుపు విధానం. మూడొదైన "మెడిషీల్డ్" కింద ప్రభుత్వమే ఒకరకమైన ఆరోగ్య భీమా పథకం అమలు పరుస్తుంది. నిర్బంధ పొదుపు ద్వారా, సబ్సిడీ విధానం ద్వారా, ధరలు అదుపు చేయడం ద్వారా, మెడిషీల్డ్ అమలు సులభతరమవుతుంది. అన్నింటిలోకి ప్రధానమైంది "మెడి సేవ్". ఇది మరొక రకమైన జాతీయ ఆరోగ్య భీమా ప్రణాళిక. మెడిసేవ్ పథకాన్ని ఏప్రిల్ 1984 లో, జాతీయ వైద్య పొదుపు గణాంక పద్ధతిన, ప్రవేశ పెట్టింది ప్రభుత్వం. తక్షణం ఆసుపత్రిలో చేరడానికి, ఔట్ పేషంట్ విభాగంలో చికిత్స పొందడానికి, డే సర్జరీకి ఈ పొదుపు ఖాతాను ఉపయోగించవచ్చు. ప్రతి ఉద్యోగి తమ ఆదాయంలో, వారి-వారి వయసుకు అనుగుణంగా, 6.5-9.0% మేరకుతమ వ్యక్తిగత మెడిసేవ్ అకౌంట్‍‍లో జమ చేస్తారు. అలా పొదుపు చేసిన డబ్బు నుంచి, వైద్య-ఆరోగ్య బిల్లులు చెల్లించవచ్చు. సింగపూర్‌లో నిరుద్యోగం కేవలం రెండు శాతం లోపే. అంటే, దాదాపు అందరికీ పొదుపు చేసే వీలుంటుంది. ఒక కుటుంబంలో ఒకరికంటే ఎక్కువమంది పొదుపు ఖాతాదారులైతే, వారందరిదీ పూల్ చేసి కుటుంబ అవసరాలకు వాడుకోవచ్చు. ప్రతి వ్యక్తికీ, వారు చికిత్స పొందే సమయంలో, వారు ఎంపిక చేసుకునే మూడు రకాల సబ్సిడీలలో ఒకటి వర్తిస్తుంది.

ప్రభుత్వ పరంగా కాని, ప్రయివేట్ పరంగా కాని, ఏ స్థాయి సబ్సిడీ పొందుతున్న వారికి కాని, సింగపూర్ జాతీయ ఆరోగ్య ప్రణాళిక ప్రాధమిక సూత్రం ప్రకారం, "ఉచితం" అనే మాట వారి నిఘంటువులో అసలే కనిపించదు. ఏదీ-ఎవరికీ ఉచితం కానే కాదు. అలాగే, ఎవరికీ-ఎట్టి పరిస్థితుల్లోను, ఆరోగ్య వైద్య సేవలను నిరాకరించే ప్రసక్తే లేదు. రోగి ఫీజు కట్టాడా-లేదా అనే విషయాన్ని వైద్య సేవలను అందించడానికి ముడి పెట్టే సమస్యే లేదు. భారత దేశంలో వున్న ప్రయివేట్-ప్రభుత్వ ఆసుపత్రిలో-పాలీ క్లినిక్‌లలో మాదిరిగా కాకుండా, పేషంటు దగ్గర ఫీజు మొత్తాన్ని, మందులతో సహా, డిశ్చార్జ్ చేసేంతవరకు వసూలు చేయరు. వాళ్లు బిల్లు చెల్లించినా, చెల్లించ లేకపోయినా డిశ్చార్జ్ నిలుపుదల చేయరు. ఫీజు చెల్లించకుండా వెళ్లిన వారి విషయంలో, అది రాబట్టుకొనేందుకు వేరే యంత్రాంగం తరువాత కృషి చేస్తుంది కాని కట్టేంతవరకు డిశ్చార్జ్ చేయమని అనరు. ఫీజు కట్టకుండా వెళ్లి పోయే వారు ఒక శాతం లోపే. వారు కూడా సాధారణంగా కట్టలేని విదేశీయులే! ఏదీ ఉచితం లేకపోవడానికి కారణం, అనవసరంగా ఎవరూ వైద్య సేవలను దుర్వినియోగం చేయకూడదనే. వైద్య ఖర్చులు వారి-వారి స్థాయి సబ్సిడీని పట్టి వున్నప్పటికీ, "ఔట్-ఆఫ్-పాకెట్" వ్యయం మాత్ర్తం స్థాయిని బట్టి మారుతుంటుంది. ఎక్కువ స్థాయి సబ్సిడీ లభించే వారికి "ఔట్-ఆఫ్-పాకెట్" ఖర్చులు కూడా ఎక్కువగానే వుంటాయి. తక్కువ వారికి అంతగా వుండవు. మొత్తం మీద వారికీ-వీరికీ చివరకు పడేది దాదాపు ఒకే రకం భారం. క్రమేపీ పెరుగుతున్న ప్రయివేట్ రంగం వైద్య సేవలను ఎక్కువగా, ప్రయివేట్‌గా భీమా చేయించుకున్నవారు, విదేశీయులు, ఖర్చు భరించగల శక్తి వున్నవారు, "ఔట్-ఆఫ్-పాకెట్" ఖర్చుకు భయపడని వారు, ఉపయోగించుకుంటున్నారు. ఎంతగా ప్రయివేట్ రంగం విస్తరిస్తున్నప్పటికీ, ఇప్పటికీ, 70-80% మంది సింగపూర్ దేశీయులు ప్రభుత్వ పరంగానే వైద్య సేవలను పొందుతున్నారు.

సింగపూర్ జనరల్ ఆసుపత్రి-ఎస్.జి.హెచ్, ఆదేశం మొత్తంలో, అతి పెద్ద-పురాతనమైన ఆసుపత్రి. దాని పునాదులు 1821 లో వేయడం జరిగింది. "సింగ్ హెల్త్" అనే పేరుతో, ఆ గొడుగు కింద, ప్రభుత్వ రంగంలోని అనేక స్పెషలిస్టు ఆసుపత్రులు నడుస్తున్నాయి. చిన్న పిల్లల ఆసుపత్రి, కాన్సర్ ఆసుపత్రి, హృద్రోగ ప్రత్యేక ఆసుపత్రి, కంటి ఆసుపత్రి, డెంటల్ ఆసుపత్రి, న్యూరో ఆసుపత్రి ఆ గొడుగు కింద పనిచేస్తాయి. ఎస్.జి.హెచ్ లో సుమారు 600 మందికి పైగా వైద్యులు, 29 క్లినికల్ స్పెషాలిటీల్లో పని చేస్తున్నారు. ప్రతి పేషంటుకు వ్యక్తిగతంగా వారి-వారి వైద్య అవసరాలకు అనుగుణంగా, నిబద్ధతతో పనిచేస్తారీ డాక్టర్లు. ఎమర్జెన్సీ కేసుల విషయంలో తప్ప, మామూలు పరిస్థితుల్లో పేషంటును ఆసుపత్రిలో చేర్చుకోవాలంటే, ఆ అవసరం వున్నదని, ఎవరో ఒక స్పెషలిస్ట్ సూచించాలి. అడ్మిషన్ డేట్ తేలిన తరువాత, ముందస్తు జాగ్రత్తలెన్నో పేషంటుకు వివరిస్తారు. వాళ్లకు ఏ రకం సబ్సిడీ లబిస్తుందో, ఆ స్థాయికి తగ్గ గదులనే కేటాయిస్తారు. డార్మెటరీ కూడా కావచ్చు. అడ్మిషన్‌కు ముందుగానే, ఫీజు చెల్లించే విధానం, అవసరమైన డాక్యుమెంట్ల విషయం, అందాజాగా ఫీజు మొత్తం వివరించడం జరుగుతుంది. అడ్మిషన్ కంటే ముందే, ఎక్స్-రే, రక్త పరీక్షలు, ఇ.సి.జి లాంటి అవసరమైన పరీక్షలను నిర్వహిస్తారు.

సింగపూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో కాని, ప్రభుత్వ స్పెషలిస్ట్ కేంద్రాలలో కాని, పాలీ క్లినిక్‌లో కాని, చికిత్సకు వెళ్లిన వారి క్లినికల్ పరీక్షల వివరాలను, "నేషనల్ ఎలెక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ సిస్టం" అనే పేరుతో, ఒక సెంట్రలైజ్డ్ డాటా బేస్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. పేషంట్ మెడికల్ హిస్టరీ మొత్తం ఒకే చోట బధ్ర పరిచి, కంప్యూటర్‌కు అనుసంధానం చేశారు. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న అన్ని రకాల ఆరోగ్య కేంద్రాలు ఒకే గొడుగు కింద పనిచేసే ఈ విధానం వల్ల, ఒక సారి ఒకచోట క్లినికల్ టెస్టులు చేయించుకున్న పేషంటు, ఇంకో స్పెషలిస్ట్ దగ్గరకు వెళ్లినప్పుడు, ఆయన దగ్గర కంప్యూటర్లో ఇవి చూసే వీలుంటుంది. మళ్లీ-మళ్ళీ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదు. దీనివల్ల డబ్బు ఆదా కావడమే కాకుండా, సమయం వృధా కాదు. 

సింగపూర్ జనరల్ ఆసుపత్రిలో ఇరవై నాలుగు గంటలు పనిచేసే ఎమర్జెన్సీ శాఖలో, ప్రతి షిఫ్ట్ లోను, ఒక సీనియర్ ఎమర్జెన్సీ ఫిజిషియన్ తప్పనిసరిగా పనిచేస్తుంటారు. పేషంట్ రోగ తీవ్రతను బట్టి, అవసరానికి అనుగుణంగా, ప్రాధాన్యతా స్థాయిని ఎంపిక చేస్తారు. ఫలానా చోట వారికి అవసరమైన చికిత్స జరుగుతుందంటూ, వారిని, అక్కడకు వెంట తీసుకెళ్తుంది ఆసుపత్రి సిబ్బంది. నాలుగు రకాల ప్రాధాన్యతా పరమైన వెయిటింగ్ ప్రదేశాలుంటాయి. తీవ్రంగా బాధ పడుతున్న పేషంట్లకు ఒక విధంగా, మేజర్ ఎమర్జెన్సీకి ఇంకో విధంగా, మైనర్ ఎమర్జెన్సీలకు మరో విధంగా, ఎమర్జెన్సీ కాదని భావించిన వాటికి వేరే విధంగా చికిత్స ప్రారంభమవుతుందక్కడ. జ్వరాలతో బాధపడుతూ వచ్చే పేషంట్లను, వారి ఇన్‌ఫెక్షన్ ఇతరులకు తగలకుండా, మరో ప్రత్యేకమైన ప్రదేశానికి తరలిస్తారు.

సింగపూర్లో అత్యవసర వైద్య సహాయ సేవలను, "ఎమర్జెన్సీ అంబులెన్స్ సర్వీస్" పేరుతో, "సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్" నిర్వహిస్తుంది. ఆంధ్ర ప్రదేశ్‌లో 108 సేవల వలనే, ఇక్కడ 995 నంబర్‌కు ఫోన్ చేసి ఈ సేవలను పొందవచ్చు. జీవన్మరణ సమస్య తలఎత్తినప్పుడు మాత్రమే 995 నంబర్‌కు ఫోన్ చేసి సహాయం కోరాలి. ఫోన్ చేసిన వెంటనే 108-అంబులెన్స్ తరహాలోనే ఇక్కడా అంబులెన్స్ వస్తుంది. వైద్య సహాయం కావాలని కోరుకునే నాన్-ఎమర్జెన్సీ పేషంట్ సౌకర్యం కొరకు, వారికి అంబులెన్స్ పంపేందుకు 1777 అనే మరో నంబర్ కేటాయించింది ప్రభుత్వం. ఎమర్జెన్సీ కేసు కాదని తేలితే, 995 నంబర్‌కు ఫోన్ చేసి అంబులెన్స్ కోరినవారి దగ్గర నుంచి 180 సింగపూర్ డాలర్లు ఫీజు కింద వసూలు చేస్తారు. లేకపోతే ఈ సౌకర్యం ఉచితమే. అంబులెన్సులలో పేషంట్లను ప్రమాద స్థలానికి అతి సమీపంలో వున్న ప్రభుత్వ ఆసుపత్రికి చేరుస్తారు.


ప్రయోగాత్మకంగా, కనీసం, దేశంలోని ఆరు పెద్ద మెట్రోపాలిటన్ నగరాలైన న్యూ ఢిల్లీ, ముంబై, కోల్‌కత, హైదరాబాద్, చెన్నై, బెంగుళూర్ లలో సింగపూర్ విధానాన్ని ప్రవేశ పెట్టి, ఆ తరువాత ఫలితాలను బట్టి ఇతర ప్రాంతాలకు విస్తరిస్తే మంచిదేమో. End

No comments:

Post a Comment