Wednesday, December 23, 2015

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణ క్షీరార్ణవ - మందరం-అవతారిక : వనం జ్వాలా నరసింహారావు

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణ క్షీరార్ణవ - మందరం-అవతారిక
వనం జ్వాలా నరసింహారావు

          శ్రీ రామచంద్రాయ నమః - శ్రీ మతే రామానుజాయ నమః - శ్రీ హయగ్రీవ ప్రసన్న- శ్రీ శారదాంబాయై నమః -బాలకాండ - "మందర మకరందం"

త్రేతా యుగాంతంలో శ్రీ మహా లక్ష్మీదేవితోనూ, ఇతర భాగవతోత్తములతోనూ శ్రీ మన్నారాయణుడు, వైకుంఠంలో శిష్ట రక్షణ-దుష్ట శిక్షణ చేసేదెలా అని చర్చించడానికి కారణం రావణాసురుడనే రాక్షసుడు. శ్రీ మన్నారాయణుడు, పూర్వ జన్మలో తనను ఆరాధించి, తన దగ్గర నుండి వరం పొందిన దశరథుడి కోరిక తీర్చడానికి, ఆయన కుమారులుగా-శ్రీరామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్న- అనే పేర్లతో అవతరించాడు. ఇది భగవత్ సంకల్పం.

          జనులు అనుష్టించాల్సిన ధర్మాలు రెండు రకాలు. ఒకటి సామాన్య ధర్మం-మరొకటి విశేష ధర్మం. భగవంతుడు తన సంకల్పం ప్రకారం, దశరథుడికి నాలుగు రూపాలుగా-పుత్రుడిగా జన్మిస్తాడు. శ్రీరాముడి రూపంలో అవతరించి, పితృవాక్య పాలన చేసి, సత్యవ్రతుడై, రావణాది దుష్టులను సంహరించి, కర్మ యోగిగా, స్వధర్మ నిష్ఠయే అందరికీ శ్రేయస్కరమని తన నడవడి ద్వారా బోధించాడు. లక్ష్మణుడిగా అవతరించి ఎల్లవేళలా శ్రీరాముడినే సేవిస్తూ, ఆయన ఆజ్ఞానుసారం నడుచుకుంటూ, భగవచ్ఛేషత్వాన్ని విశేష ధర్మంగా ఆచరించాడు. భరతుడి అవతారంగా, శ్రీరామ సేవకుడిగా, భగవత్ పారతంత్ర్యమనే విశేష ధర్మాన్ని ఆచరించాడు. శత్రుఘ్నుడి అవతారంలో, భాగవతుడైన భరతుడిని చిన్నతనం నుంచే కొలిచి, భాగవత శేషత్వమనే విశేష ధర్మాన్ని ఆచరణ పూర్వకంగా లోకానికి ఉపదేశించాడు.

          వీరి చరిత్రను, వీరు ఆచరించిన ధర్మాలను అన్ని లోకాలకూ శాశ్వతంగా చెప్పేందుకు, శత కోటి గ్రంథాత్మకమైన ప్రబంధంగాఓ బృహత్ గ్రంథాన్ని రచించి నారదుడికి, ఇతర మహర్షులకు ఉపదేశించాడు బ్రహ్మదేవుడు. అంతటితో ఆగకుండా భూలోక వాసుల కొరకై శ్రీరామ భక్తుడైన వాల్మీకికి ఉపదేశించమని నారదుడిని ఆదేశించాడు. వాల్మీకి రచించిన రామాయణం బ్రహ్మ ప్రేరేపించినదే. రామాజ్ఞ ప్రకారం లక్ష్మణుడు సీతాదేవిని గంగాతీరానున్న వాల్మీకి ఆశ్రమం దగ్గర విడిచి అయోధ్యకు పోయాడు. తన ఆశ్రమం సమీపంలో సీతాదేవి దుఃఖిస్తున్నదని తెలుసుకున్న వాల్మీకి, ఆమె వద్దకు పోయి, ఓదార్చి, నిండుచూలాలైన ఆమెను మునిపత్నులకు అప్పగించాడు. ఆమెకు కుశ-లవులు అని ఇద్దరు కవలలు పుట్టారు. ఆమె పన్నెండేళ్లు వాల్మీకి ఆశ్రమంలో వుంది.

అంత మహా పతివ్రతకు నిష్కారణ నింద, అపకీర్తి, కష్టం, కలగడం సరికాదనుకున్నాడు వాల్మీకి మహర్షి. ఏం చేస్తే ఆమె పైనబడిన నింద తొలగిపోతుందని, ఈ విషయంలో తనకు సరైన తోవ చూపే మహానుభావులెవరు అని ఆలోచిస్తున్న సమయంలో బ్రహ్మ పంపిన నారద మహర్షి వచ్చాడు ఆయన దగ్గరకు. తనకు సరైన గురువు లభించాడని సంతోషపడ్డాడు వాల్మీకి. వాల్మీకి ఆలోచన మేరకే, ఆయన అభిప్రాయం తెలుసుకుని, శ్రీ సీతారామ చరిత్రను గాయత్రి సంపుటితంగా ఆయనకు ఉపదేశించి బ్రహ్మదేవుడికి ఆ వార్త తెలిపాడు నారదుడు. బ్రహ్మ సరస్వతిని వాల్మీకి నాలుకపై నిలిపి, నారదుడిని స్వయంగా పంపి ఉపదేశించిన రీతిలోనే, శ్రీమద్రామాయణం రచించమని ఆదేశించిన రీతిలోనే, దానిని గ్రంథ రూపంలో రచించే శక్తినీ ఇచ్చాడు. బ్రహ్మ వర బలంతో శ్రీమద్రామాయణం రచించడం కొనసాగించాడాయన. ఇది వాచ్యార్థ ప్రధానంగా ఇతిహాస రూపంలోనూ, వ్యంగార్థ ప్రధానంగా మహా కావ్యరూపంలోనూ రూపుదిద్దుకుంది. అందుకే, అదో ఇతిహాసం. మహాకావ్యం. సంస్కృత భాషలో వున్న దానిని కొందరు తెలుగులో అనువదించారు. అయితే కథను మాత్రం తీసుకొని స్వేచ్ఛానువాదం చేసారు వారందరూ. అర్థ పూర్తి కలిగి, కావ్య-ఇతిహాస గౌరవ పాత్రమై, సర్వజన పఠనీయమై, ప్రామాణికమై, మూలానుసారమైన రామాయణాన్ని లోకానికి అందిద్దామన్న ఉద్దేశ్యంతోనే శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం రచించబడింది.


          ఆ ఆంధ్ర వాల్మీకి రామాయణానికి, తెలుగులోనే వ్యాఖ్యానం వుంటే బాగుంటుందనీ, అలా చేస్తే సంస్కృతం రాని ఆంధ్రులకు ఉపకారంగా వుంటుదని కొందరు మిత్రులు సూచించారు. మూల గ్రంథం రాయడం కంటే వ్యాఖ్యానం రాయడం కష్టమైన పని అని తెలిసీ ఆ పనికి పూనుకున్నారు వాసుదాసస్వామి. తొలుత మిత్రుడు గోవిందాచార్యులతో కలిసి ఆపనిని మొదలు పెట్టినప్పటికీ, ఆతర్వాత కలిసి చేసినదానిని సహాయంగా వుంచుకుని, నూతనంగా రాసారీ వ్యాఖ్యానం. ఈ వ్యాఖ్యానం అందరికీ సుబోధంగా వుండాలన్నదే ఆయన ప్రథమోద్దేశం. ప్రతి పద్యానికీ ప్రతి పదార్థ తాత్పర్యం ఇచ్చారు. కేవలం తాత్పర్యమే చదువుకుంటూ పోతే అది వచన రామాయణంగా పఠించినట్లవుతుంది. ఎక్కడెక్కడ, ఎట్లా చెప్తే సుబోధంగా వుంటుందని ఆయన భావించారో అట్లానే రాసారు. పూర్వ వ్యాఖ్యాతల అభిప్రాయంతో ఏకీభవించినప్పుడు వారు రాసినట్లే రాసారు. ఆయన అభిప్రాయం చెప్పదల్చుకున్నప్పుడు అలానే చేసారు. ఈ వ్యాఖ్యానం నెపంతో ఏదో ఖండిద్దామనో, వుద్ధరిద్దామనోనన్న అభిప్రాయం ఆయనకు లేదు. గ్రంథంలో వున్నదున్నట్లు చెప్పడమే ఆయన చేసిన పని. లోకులందరికీ, అన్ని వర్ణాశ్రమాల వారికీ, సరైన రీతిలో ఉపదేశించేది శ్రీరామావతారం. ఇదే సరైన ధర్మ సంస్థాపనం. ఇది తెలియచేయాలనేదే ఆయన అభిప్రాయం. భగవత్ తత్వం తర్కభేద్యం కాదు. దానికదే ప్రమాణం. రామాయణంలో చెప్పబడిన ధర్మాలను స్థాపించడానికి వేరే ప్రమాణాలు చూపాల్సిన అవసరం లేదు.

          పూర్వ వ్యాఖ్యాతలు రాసిన విషయాలను కొన్ని చెప్పినప్పటికీ, చెప్పని విశేషాలు కూడా ఎన్నో వున్నాయి. అంత మాత్రాన ఇదే పర్యాప్తమని ఆయన అనలేదు. ఈ గ్రంథ రచనకు కారణం హిత బోధ శిరసావహించి ఆంధ్ర లోకానికి సేవ చేయాలనే తలంపేనంటారు. యుగ-యుగాల్లో భగవంతుడు అవతరించడానికి కారణాలు మూడు. సాధు రక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సంస్థాపన. వీటిలో పూర్వ వ్యాఖ్యాతలెందుకో  ధర్మ సంస్థాపనకు ప్రాముఖ్యమీయలేదు. ధర్మం రెండు రకాలు. సామాన్య ధర్మం, విశేష ధర్మం. శాస్త్రీయ సదాచారం సామాన్య ధర్మం. కేవల మోక్ష ధర్మం విశేష ధర్మం. మొదటిది ప్రథమ సోపానం. రెండోది ద్వితీయ సోపానం. మొదటిది లేకపోతే రెండోది కష్టం. బుద్ధిమంతుడు వైదికాచారాన్ని ఆలోచనల్లో కూడా ఉల్లంఘించకూడదు. ఎందుకంటే శ్రుతి-స్మృతి తన ఆజ్ఞా స్వరూపాలేనని భగవత్ వచనం కాబట్టి, భాగవుతుడనేవాడు సదాచారాన్ని పాటించాల్సిందే. అన్ని వేదాల్లో ఆచారమే శ్రేష్టమని చెప్పబడింది. ఆచారమంటే చక్కని నడవడే. శ్రీమద్రామాయణంలో పైన చెప్పిన రెండు ధర్మాలూ విపులంగా, ఆచరణ రూపంలో విశదీకరించబడ్డాయని వాసుదాసుగారి అభిప్రాయం. ఎలా అంటే శ్రీరాముడే స్వయంగా ఆచరించి చూపాడు కాబట్టి. శాస్త్రాలు చదివి, ఆప్రకారం తాను నడిచి, ఇతరులు నడిచేటట్లు చేసేవాడే ఆచార్యుడు. శ్రీరామచంద్రమూర్తిలో ఈ మూడు గుణాలు సంపూర్ణంగా వున్నాయి. శ్రీరామచంద్రమూర్తి ఇట్లాంటివాడని శ్రీమద్రామాయణమే నిరూపిస్తున్నది. శ్రీరాముడు ధర్మాత్ముడనీ,ధర్మ నిష్టుడనీ,ధర్మ మూర్తనీ,ధర్మ అనుష్టాన పరుడనీ, ధర్మ స్థాపకుడనీ రామాయణంలో ఎన్నో చోట్ల, ఎన్నో రీతులుగా చెప్పబడింది. కాబట్టి రాముడి ధర్మ అచార్యత్వానికి ప్రాముఖ్యం ఇవ్వని వ్యాఖ్యానం సరైంది కాదని ఆయన (వాసుదాసుగారి) అభిప్రాయం.

          ధర్మా-ధర్మ  లక్షణ జ్ఞానం విషయంలో రెండు రకాలవారున్నారు. మొదటివారు, శాస్త్ర జ్ఞానం పరిపూర్ణంగా సంపాదించి, ప్రతి పని దాని ప్రకారం వుందా-లేదా అని పరిశోధించేవారు. రెండో రకం వారు, పూర్వపు మహాత్ములీప్రకారం ఆచరించారు కాబట్టి మనం కూడా అలానే చేద్దామనేవారు. తల్లి తండ్రులనూ, గురువులనూ అనుకరించేవారు ఈ కోవకు చెందినవారు. అంటే, మనం ఎవరినైతే అనుకరిస్తామో వారు కూడా నిర్దుష్టులై వుంటేనే మనం చెడిపోం. ఈవిధంగా ఉభయ విధమైన ధర్మానుష్టానాన్ని రామాయణంలో నేర్చుకోవచ్చు. యుగధర్మాలు మారుతూ వస్తున్నాయి.

          ధర్మం, అధర్మం సమ బలంగా వున్నప్పుడు, ఏది ధర్మమో, ఏది అధర్మమో తెలియ చెప్పేవాడుండాలి. అదే జరిగింది కృష్ణావతారంలో. అదే భగవద్గీత. ఇది కలికాలం-కలహకాలం. ఈ రోజుల్లో రాముడైనా, కృష్ణుడైనా చెప్తే వినే వాళ్ళు తక్కువ. నువ్వు చెప్పేదేంది, నేను వినేదేంది అనేవాళ్లే ఎక్కువ. ఇలాంటివారిని చక్కపెట్ట గలిగేది కల్క్యావతారమేనేమో. కాబట్టి శ్రీరామావతారం అనుష్టానావతారం. శ్రీకృష్ణావతారం ఉపదేశావతారం. శ్రీరాముడు దేనిని అనుష్టానంతో ధర్మమని నిరూపించాడో, దాన్నే శ్రీకృష్ణుడు ఉపదేశంతో స్థాపించాడు. రామాయణం లక్ష్య గ్రంథమైతే, భగవద్గీత లక్షణ గ్రంథం. తక్కిన శాస్త్రాలు చదివినా చదవకున్నా ఈరెండూ చదివితే చాలంటారు అందుకేనేమో.

          వాసుదాసస్వామి రామాయణ రచనా కాలంలో, ఒంటిమిట్టకు చేరడానికి ముందు, అక్కడున్న రామాలయంలో ఒక వింత జరిగింది. దేవుడి ఉయ్యాల పీటకు కావాల్సిన గొలుసులు కొనేందుకు చందాలు వసూలుచేయడానికి, గ్రామస్తులు సమావేశమయ్యారు. ఏ ఒక్క పెద్దమనిషికూడా చందా ఇచ్చేందుకు ముందుకు రాకపోవడంతో, ఒక దళితుడు అందరికంటే ముందుగా తన వంతు చందాగా పది రూపాయలు ప్రకటించాడు. తనిచ్చే చందా పనికొస్తుందనుకుంటే తీసుకోమని అన్నాడు. గ్రామస్తులు ఆక్షేపణ చేయనందున తను ఇస్తానన్న చందా తెచ్చేందుకు ఇంటికి పోయాడు. అతడొచ్చేలోపున సిగ్గుపడిన ఇతరులు కూడా తమవంతు చందాలను ప్రకటించి ఇచ్చారు. " సమ్మారజనీధ్వజుడైన" తనూ, మాల దాసుడననే, ప్రకటించుకున్నారు వాసుదాసుగారు. తనపై స్పర్థతోనన్నా, తన వ్యాఖ్యానానికి మించిన వ్యాఖ్యానాన్ని పండితుడైన వాడు రాయాలని ఆయన కోరిక. వారికిది మార్గదర్శి అవ్వాలనీ విజ్ఞప్తిచేశాడు. గోడంటూ కట్టితే బొమ్మలేసేవారెందరో దొరకక పోతారా అనేదే ఆయన అభిలాష.

          సామాన్య ధర్మం విషయంలో శ్రీమద్రామాయణానికి వ్యాఖ్యానమే శ్రీ మహాభారతం. మోక్ష ధర్మం విషయంలో శ్రీ భాగవతం వ్యాఖ్యానం. గ్రంథ రచన పూర్తయ్యేవరకు తనకు ఆరోగ్యం-ఆయుష్షు ఇచ్చి శ్రీరామచంద్రమూర్తి తన వద్దకు రమ్మని పిలవకపోతే యథా శక్తితో పైన చెప్పిన విషయాలను వివరిస్తానంటారు. లోపాలను మహాజనులు క్షమించాలనీ, ఇదే దాసుడైన తన ప్రార్థన అనీ, తన అవతారికలో కోరుతారు వాసుదాసుగారు.
యత్ర రామో భయం నాత్ర,
నాస్తి తత్ర పరాభవః

శ్రీ సీతారామ ప్రసాద సిద్ధి రస్తు 

No comments:

Post a Comment