Tuesday, December 15, 2015

బాల కాండ మందర మకరందం ఎందుకు చదవాలి? ఏం తెలుసుకోవచ్చు?-4 : వనం జ్వాలా నరసింహారావు

బాల కాండ మందర మకరందం
ఎందుకు చదవాలి? ఏం తెలుసుకోవచ్చు?-4
వనం జ్వాలా నరసింహారావు

బాల కాండతో రామాయణ కథ ప్రారంభమవుతుంది. అయోధ్యా పుర వర్ణనతో మొదలవుతుంది. భగవంతుడు అక్కడ పుట్టినందువల్లే, ఆ పుణ్య నగరం "అయోధ్య" గా కీర్తించబడింది. భగవంతుడైన విష్ణువు ఎక్కడుంటాడో, అదే పరమ పదం-ఆయన సేవే మోక్షం-అదే సర్వ కర్మలను ధ్వంసం చేస్తుంది. అయోధ్యలో మహా విష్ణువు పుట్టినందువల్లే మనుష్యులందరు ముక్తులయ్యారని శివుడు పార్వతికి చెప్పాడు.

అయోధ్యా పుర జనులను గురించి రాస్తూ, అక్కడి బ్రాహ్మణులను గురించి చెప్పబడింది. వారు ఆరంగాల వేదాధ్యయనం (శిక్షవ్యాకరణంఛందస్సునిరుక్తంజ్యోతిష్యం - కల్పం) చేసినవారు. బ్రాహ్మణులను ద్విజాతులని - వేదషడంగ పారగోత్తములనిఅహితాగ్నులనిసహస్రదులనిమహామతులనిసత్యవచస్కులని - హిమకరమిత్ర తేజులనిఋషులని - హృష్ఠ మానసులని - శాస్త్ర చింతన పరాయణులని స్వస్వతుష్టులని త్యాగశీలురని - భూరి సంచయులని పోలుస్తూ వర్ణించబడింది.

అదేవిధంగా పూర్వ కాలంలో అన్ని జాతుల వారు కూడా విద్య నేర్చుకునేందుకు అర్హులనే విషయం అయోధ్య నగర వాసుల గురించి వర్ణించినప్పుడు చెప్పబడింది. ఒకానొకప్పుడు శూద్రులని పిలువబడే వారికి విద్యార్హతలుండవని వాదనుండేది. అయితే అది తప్పుడు వాదనేనని స్పష్ఠంగా చెప్పబడింది.

సంతానం లేనందున, సుఖాలెన్ని వున్నా, కుమారులవలన కలిగే భోగ భాగ్యాలతో సరితూగవని బాధపడిన దశరథుడి విషయాన్ని ప్రస్తావిస్తూ, బ్రాహ్మణుడు పుట్టుకతోనే బ్రహ్మచర్యమైన ఋషుల రుణం, యజ్ఞాలైన దేవ రుణం, బిడ్డలను కనాల్సిన పితృ రుణం అనే మూడు రుణాలతో జన్మిస్తాడనీ, సుతులు లేనివారికి గతులు లేవంటాయని, కొడుకులవల్ల జయం-మనుమల వల్ల సౌఖ్యం-ముని మనుమల వల్ల స్వర్గ సుఖం కలుగుతాయని, ఈ సుఖ సౌఖ్యాలన్నీ సత్ పుత్రులైతేనేననీ, ఇదే మోతాదులో, దుష్ట పుత్రులవల్ల కీడు కలుగుతుందనీ, అందుకే, ఆజన్మాంతం భగవత్ భక్తి లేనివాడు తమ వంశంలో పుట్ట కూడదని, పుట్టినా వెంటనే చచ్చిపోవాలనీ పితృదేవతలు కోరుకుంటారని చెప్పబడిందిందులో.

దశరథుడి పుత్రకామేష్టి యాగానికి వచ్చిన విష్ణుమూర్తి, శరణాగతులైన బ్రహ్మాది దేవతలందరికీ అభయహస్తమిచ్చి, తాను మనుష్యుడిగా ఎవరికి జన్మించాలనీ-ఆ యోగ్యత ఎవరికున్నదనీ ఆలోచించాడు. తామరాకులలాంటి విశాలమైన నేత్రములున్న వాడు, పాప సంహారుడు, నమస్కారం చేసే ప్రజలను రక్షించాలన్న ఆసక్తిగలవాడు, వంచన లేనివాడైన భగవంతుడు తనకు తండ్రి కాగల అర్హుడు అయోధ్యాపురాధిపతైన దశరథుడేనని తలచాడు. దీనికి కారణముంది. స్వాయంభువ మనువు, పూర్వం గోమతీ తీరాన వున్న నైమిశారణ్యంలో, వాసుదేవ ద్వాదశాక్షరీ మంత్రాన్ని జపించాడు. శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మనగా, మూడు జన్మల్లో నారాయణుడు తనకు పుత్రుడుగా వుండాలని అడుగుతాడు. అంగీకరించిన భగవంతుడు, ఆయన దశరథుడిగా పుట్టినప్పుడు "శ్రీరాముడు" గా పుత్రుడయ్యాడు. యదువంశంలో వసుదేవుడిగా మనువు పుట్టినప్పుడు "శ్రీకృష్ణుడు" గా ఆయనకు పుత్రుడయ్యాడు. మూడోజన్మలో "శంబళ గ్రామం" లో-కలియుగంలో-నాలుగోపాదంలో, హరివ్రతుడనే బ్రాహ్మణుడికి "కల్కి" గా పుట్టగలడు. మనువు భార్య సుశీల, కౌసల్య పేరుతో దశరథుడికి, దేవకి పేరుతో వసుదేవుడికి, దేవప్రభ పేరుతో హరివ్రతుడికి భార్యగా వుండి, మూడు జన్మల్లో విష్ణుమూర్తికి తల్లి అవుతుంది. శంబళ-సంబళ-శంభళ-సంభల అనే రూపాంతరాలు కూడా శంబళ గ్రామానికున్నాయి. భారతంలో హరివ్రతుడికి విష్ణుశర్మ అన్న పేరుంది.


దేవతల ప్రార్థన ప్రకారం దశరథ పుత్రుడై వున్నప్పుడు, దైవం లాగా వుండాల్నా-మనుష్యరూపంలో వుండాల్నా అన్న ప్రశ్నను దేవతలనే అడిగాడు నారాయణుడు. అది వారికి ఆయన ఇచ్చిన గౌరవం. వారు చెప్పబోయేది తాను అప్పటికే నిశ్చయించుకున్నప్పటికీ, ఎదుటివారి గౌరవార్థం, వారి మనస్సును పరీక్షించేందుకు, ఆవిధంగా ప్రశ్నించడం రామావతారంలో ఒక విశేష గుణం. ఇదే లక్ష్మణ-భరత-విభీషణుల రక్షా విషయంలో కనిపిస్తుంది. లోకులందరూ ఈవిషయాలు తెలుసుకోవాలి. నారాయణుడు సర్వాంతర్యామి-సర్వాధారుడు. ఇంతటి గొప్పవాడు దేవతల ఇష్టానుసారం చేయడమంటే, ఆశ్రిత పారతంత్ర్య గుణం అర్థమవుతోందిక్కడ. అదేవిధంగా, తమనొక పెద్దను చేసి, అడిగినపుడు, తగిన రీతి తమకు తోచినది తప్పో-ఒప్పో చెప్పకపోతే, ఆదరించినవారిని నిరాకరించినట్లవుతుంది కాబట్టి, తమకు తోచింది చెప్పదలచారు-చెప్పారు.

కొడుకులకోసం యజ్ఞం చేస్తున్న దశరథుడికి ప్రాజాపత్య పురుషుడిచ్చిన పాయసం, క్షీరసాగరమధనంలో ఉద్భవించిన ఇంద్రుడి స్వాధీనంలో వున్నటువంటి అమృతం కాదు. భగవంతుడి తేజస్సు మనుష్య స్త్రీ గర్భంలో ప్రవేశించేందుకు మంత్రవంతమైన హవిస్సులాంటి - నిమిత్తమాత్రమైన పదార్థం ఒకటి కావాలి. అదే, భగవత్తేజః పూరితమైన పాయసాన్నం. అదే అమృతమైతే, తాగిన స్త్రీలకు మరణం రాదు కదా! అందుకే, శ్రీరామాది జననములు "రేతస్సర్గం" కారణం కాదనీ-వారి దేహాలు అప్రాకృతాలనీ తెలుసుకోవాలి. అదే దశరథుడు కనుక తాగుంటే, వచ్చిన గర్భాలకు రేతస్సంబంధం కలపొచ్చు. అలాంటిది జరగలేదు. శుక్ల రక్త సంయోగాలవలన ఏర్పడే దేహాలకు స్త్రీ గర్భవసతి అవశ్యంకాని, దివ్య తేజస్సుతో ఏర్పడేవాటికి స్త్ర్రీ గర్భవసతితో పనిలేదు. దీనికి ఉదాహరణలుగా, మాంధాతృ జననం, కుంభజులైన అగస్త్య-వశిష్ఠ-ద్రోణాచార్య జననం, ధృష్ట్యద్యుమ్న-ద్రౌపది జననం చెప్పుకోవాలి. ఇందు క్షేత్రం ప్రధానం కాదు-గర్భస్థజీవుడే తన తపో బలంతో, స్వేచ్ఛాత్తశరీరుడవుతాడు. వీరి దేహాలు తల్లి తినే ఆహారంతో కాని-తల్లి సంకల్పంతో కాని సంబంధం లేదు. అంటే, తల్లిదండ్రుల జాతికి, బిడ్డల జాతికి సంబంధం లేదిక్కడ. కట్టెల్లో పుట్టిన అగ్నిహోత్రుడిది ఏజాతి? తాను లోగడ ఇచ్చిన వరం తీర్చేందుకు-కౌసల్యా దశరథులకు పుత్రమోహం కలిగించేందుకు, భగవంతుడు పన్నిన పన్నాగమే ఇది. అందుకే, ఈ రహస్యాన్ని తెలిసిన విశ్వామిత్రుడు శ్రీరాముడిని సంబోధిస్తూ, "దశరథ పుత్రా" అని కాని-"కౌసల్యా పుత్రా" అనికాని అనకుండా, "కౌసల్యా సుప్రజారామ" అన్నాడు. స్వేచ్చానుసారం-స్వతంత్రంగా-కారణాంతరాలవల్ల, తపోబలంతో కారణజన్ములైన మహాత్ముల జన్మలకు, పామరుల జన్మలకు పోలికేలేదు. వాల్మీకి చెప్పినట్లు, శ్రీరాముడిని "సాక్షాత్తు విష్ణువు" అని మునులందరు నమస్కరించారు కాని, క్షత్రియుడని జాతి వివక్షత చూపినట్లైతే నమస్కరించక పోయేవారు.

పాయసం పంచడంలో దశరథుడు, భార్యలలో పెద్ద-పిన్న తరం ఆలోచించాడు. అందరికన్నా పెద్దభార్య-పట్టపు దేవి కౌసల్య. రెండోది సుమిత్ర. మూడవ భార్య కైకేయి. కాబట్టి పాయసంలో సగభాగం కౌసల్యకిచ్చాడు మొదలే. తక్కిన సగభాగంలో రెండవ భార్య సుమిత్రకు సగం తొలుత ఇచ్చాడు. ఇంకో సగం కైకేయికిస్తే, సుమిత్రను-కైకేయిని సమానంగా చూసినట్లవుతుందనీ-అది ధర్మంకాదనీ, నయజ్ఞుడైన దశరథుడు ఆలోచించి, మిగిలిన పాతిక భాగంలో సగం కైకేయికి-సగం తిరిగి సుమిత్రకు ఇచ్చాడు. కైకేయి అందరికన్నా చిన్నదైనందున "పరక" పాలిచ్చాడు. ఆవిధంగా, సగం కౌసల్యకు-పాతిక ఒకసారి, పరక ఒకసారి సుమిత్రకు-పరక కైకేయికి ఇచ్చాడు. కైకేయి సంభోగ విషయంలో ప్రియురాలు కాని న్యాయంగా భాగంలో కాదు దశరథుడికి. ఇలా తారతమ్యం లేకపోయినట్లైతే, పెద్ద-చిన్న గౌరవం పాటించనట్లు అవుతుంది. ధర్మ దృష్టి చేసిన భాగ పరిష్కారం కనుకనే, రాజపత్నులు సమ్మతితో స్వీకరించారు. దశరథుడికి ధర్మాత్ముడని పేరొచ్చింది అందుకే. ఇకపోతే: రామచంద్రమూర్తి విష్ణువు అర్థాంశం. లక్ష్మణుడు పాదాంశం. భరత-శత్రుఘ్నులు ఇరువురుకలసి పాదాంశం. తనకు న్యాయంగా రావలసిన భాగం దశరథుడు తనకీయగానే కౌసల్య పాయసాన్ని తాగింది-ఆకారణం వల్ల ఆమె కొడుకు తొలుత జన్మించి జ్యేష్టుడయ్యాడు. సుమిత్ర తాగకుండా మొదలు ఊరుకుంది. తనకు న్యాయంగా భాగమొచ్చిందనుకున్న కైకేయి కూడా వెంటనే తాగడంతో, ఆమె కొడుకు రెండవవాడు గా పుట్టాడు. పాతిక-పరక వేర్వేరుగా ఆఖరున తాగిన సుమిత్రకు కవలలు చివరలో జన్మించారు.

దేవతల క్షేమం కోరి శ్రీమహావిష్ణువు భూలోకంలో జన్మించేందుకు సంకల్పించాడు కనుక, ఆయనకు సహాయపడేందుకు, బలవంతులను-కామరూపులను-గోళ్ళు,కోరలు ఆయుధాలుగా కలవారిని-అసహాయశూరులను సృజించమని, దేవతలను ఆదేశించాడు బ్రహ్మ. దేవతలు-సిద్ధులు-సాధ్యులు-కిన్నరులు-కింపురుషులు-ఋషులు-చారణులు-ఖేచరులు మొదలైన వారందరూ వానర వీరులను, భల్లూక శూరులను విస్తారంగా పుట్టించారు. వారందరూ, కానల్లో-కోనల్లో-పర్వతాలలో సంచరించసాగారు. భూమిపై వ్యాపించి, రాళ్లు - చెట్లు - గోళ్ళు - కోరలు, ఆయుధాలుగా చేసుకొని, నానా శస్త్రాస్త్ర ప్రయోగాలను తెలుసుకున్నారు. దేవతల పుత్రులు కనుక స్వయంగానే శస్త్రాస్త్రజ్ఞానం కలవారే. కాకపోతే వాటితో యుద్ధంచేయరు-చేయలేదు కూడా. వారి ఆయుధాలు నఖ-వృక్ష-శిలలు. శస్త్రాస్త్ర జ్ఞానం పరులనుండి తమను రక్షించుకోవడానికే గాని, ఇతరులపై ప్రయోగించడానికి కాదు. రామ రావణ యుద్ధంలో, రామలక్ష్మణులు తప్ప వారి పక్షంలో అస్త్ర యుద్ధం చేసిన వారెవరూ లేరు. శస్త్రాస్త్రాలు వానరులు ప్రయోగించడం స్వభావ విరుద్ధం. వారలా చేసుంటే, వానరులను రావణుడు స్వభావవానరులుకాదనీ - దేవతలనీ తెలుసుకొనేవాడు. అప్పుడు వారివల్ల రావణుడికి బాధలేదు. దేవతలు పశుపక్ష్యాదులతో కొక్కోక శాస్త్రం ప్రకారం, ఆంతర సంభోగం ద్వారా సంతానం పొందారని భావించరాదు. తమ సంకల్ప బలంతోనే - తామే ఆయా జాతి స్త్రీులయందు, ఆయా ఆకారాలు ధరించి, జన్మించారని అనుకోవాలి. కొంతకాలం పూర్వం, స్త్రీ - పురుష సంభోగం లేకుండానే, సంతానం దృష్టి - స్పర్శ - సంకల్పంతో కలిగేదని విష్ణుపురాణంలో వుంది. రామచంద్రమూర్తి వధించిన వాలి ఆయనకెలా సహాయపడ్డాడని సందేహం కలగొచ్చు. వాలి-సుగ్రీవులిరువురూ రామకార్యార్థమే పుట్టారు. ఇదొక రకమైన ఏర్పాటు. దీనినే "సమయ" మని అని పేరు. వాలి రావణవధకొరకు శ్రీరాముడికి సహాయపడేందుకు బదులు, రావణుడితో స్నేహం చేసాడు. భవిష్యత్ లో రామ కార్యానికి ఉపయోగ పడబోయే సుగ్రీవుడికి హానిచేసి, అతడిని చంపే ప్రయత్నం చేసి, రామ కార్యాన్ని భంగపరచ తలపెట్టాడు. ఈ కారణాన వాలి రాముడి చేతిలో వధించబడ్డాడు. వాలి వధానంతరం సుగ్రీవుడితో: "వాలివలె నీవుకూడా సమయం పాటించకపోతే వాడి గతే నీకూ పట్తుంది"అని రాముడు అంటాడు.ఈ సమయమనేది రామసుగ్రీవులకు ఋశ్యమూకంలోనే జరిగిందికాదనీ-వాలి సుగ్రీవుల జనన కాలంలోనే జరిగిందనీ మరో కథ వుంది.ఈ విషయం అంగదుడి ద్వారా తెలిసిందంటారు. వాలి పుట్టకపోతే-పుట్టినా సుగ్రీవుడితో విరోధించకపోతే-విరోధించినా రాముడి చేతిలో చావకపోతే, రావణాసురుడి వధే జరుగకపోయేది. వాలి జన్మించి సుగ్రీవుడితో విరోధించడం వల్లే సుగ్రీవుడికి-రాముడికి స్నేహం కలిగింది. అదే, వాలికి-రాముడికి స్నేహమయినట్లైతే ప్రయోజనంలేకపోయేది.వాలి భయంతో, రావణుడు సీతను రాముడికి అప్పచెప్పేవాడే. అంటే, లోకోపద్రవం తగ్గేదికాదు. అపరాధికి శిక్షపడకపోయేది. వాలి జననం-సుగ్రీవుడితో విరోధం-రాముడి చేతిలో చావు, రామ కార్యమే.


(ఇంకా వుంది...ఈ శీర్షికే ఏడు భాగాలుగా వస్తుంది..ఇది 4 భాగం)

1 comment:

  1. Great information share chesaaru sir. mee dedication ki naa pranaamaalu. meeru ee vidham gaane maaku gnyana bodha cheyyalani korukuntoo

    Yaddhanapuri Bharadwaj Sharma.

    ReplyDelete