Thursday, December 31, 2015

బాలకాండ మందరమకరందం సర్గ-8 : పుత్ర హీనతకు విషాద పడిన దశరథుడికి అశ్వమేథ యాగం చేయాలన్న ఆలోచన : వనం జ్వాలా నరసింహారావు

బాలకాండ మందరమకరందం
సర్గ-8
పుత్ర హీనతకు విషాద పడిన దశరథుడికి
అశ్వమేథ యాగం చేయాలన్న ఆలోచన
వనం జ్వాలా నరసింహారావు

ధార్మికుడు, భగవదవతారానికి అన్ని అర్హతలున్న దశరథుడు, భగవదారాధన రూపకమైన యజ్ఞాన్ని మున్ముందు చేయబోతున్నాడనే విషయాన్ని వివరిస్తాడీ సర్గలో వాల్మీకి మహర్షి. విష్ణుమూర్తికి శ్రీదేవి-భూదేవి-నీళాదేవి లాగా, ధర్మ-అర్థ-కామాల లాగా, రాజస-సాత్విక-తామస గుణాలున్న ముగ్గురు భార్యలున్నారు దశరథ మహారాజుకు. ధర్మ బుద్ధిగల కౌసల్య, బంగారు కొండలాంటి సుమిత్ర, రూపమే ప్రధానమైన కైకేయి లే ఆ ముగ్గురు. కౌసల్యకు రజో గుణం, సుమిత్రకు తత్వ గుణం, కైకకు తమో గుణం ప్రధానంగా వున్నాయి. ముగ్గురిలో ఇలా మూడు రకాలైన గుణాలుండడం విశేషం. కౌసల్య కోసల రాజుకు, సుమిత్ర మగధ రాజుకు, కైక కేకయ రాజుకు కూతుళ్లు. భోగభాగ్యాలెన్ని వున్నా కొడుకులున్న సుఖం దశరథుడికి  గానీ, కన్నకొడుకులను ఎత్తుకునే అదృష్టం ముగ్గురు భార్యలకు గానీ లేదు. సంతానం లేదన్న కారణాన తపస్సు చేసినా ఫలితం దక్కలేదు. సుందర మందిరాలు-సువాసనలిచ్చు పూలతోటలు-ఏనుగు దంతాలతో, బంగారు రత్నాలతో కట్టిన అసమాన శాలలు-రాజ్య విలాస క్రీడలు-సుకుమారంలో రతీదేవిని మించిన సుందరమైన భార్యలు-అసమాన పరాక్రమం వున్నా, సంతానం లేనందున, సుఖాలెన్ని వున్నా-కుమారులవలన కలిగే భోగ భాగ్యాలతో సరితూగవని-తన తపస్సు వ్యర్థమనీ బాధపడేవాడు దశరథుడు.

(బ్రాహ్మణుడు పుట్టుకతోనే బ్రహ్మచర్యమైన ఋషుల రుణం, యజ్ఞాలైన దేవ రుణం, బిడ్డలను కనాల్సిన పితృ రుణం అనే మూడు రుణాలతో జన్మిస్తాడు. సుతులు లేనివారికి గతులు లేవంటారు. కొడుకులవల్ల జయం-మనుమల వల్ల సౌఖ్యం-ముని మనుమల వల్ల స్వర్గ సుఖం కలుగుతాయి. ఈ సుఖ సౌఖ్యాలన్నీ సత్ పుత్రులైతేనే. ఇదే మోతాదులో, దుష్ట పుత్రులవల్ల కీడు కలుగుతుంది. అందుకే, ఆజన్మాంతం భగవత్ భక్తి లేనివాడు తమ వంశంలో పుట్ట కూడదని, పుట్టినా వెంటనే చచ్చిపోవాలనీ పితృదేవతలు కోరుకుంటారు).

మనస్సులో పరితపిస్తున్న దశరథుడు సభా మందిరానికి వచ్చి, మంత్రులతో సమాలోచనలు చేస్తాడు. పుత్రులు కలిగేందుకు అశ్వమేథ యాగం చేస్తాననీ-అలా చేస్తే సంతానం కలగొచ్చనీ అంటాడు. అలా నిశ్చయించుకున్న వెంటనే, ఆ కార్యక్రమం గురించి ఆలోచించేందుకు, గురువులను-పురోహితులను తీసుకుని రావాలని, మంత్రులలో శ్రేష్టుడైన సుమంత్రుడిని కోరతాడు దశరథుడు. రాజాజ్ఞ ప్రకారం సుమంత్రుడు ఏమాత్రం ఆలశ్యం చేయకుండా, వేదాధ్యయనం చేసే వాసుదేవుడిని-సుయజ్ఞుడిని-జాబాలిని-కాశ్యపుడిని, ముఖ్య గురువైన వశిష్ఠుడిని, ఇంకొందరు ప్రముఖులను స్వయంగా వెళ్ళి తోడుకొని వస్తాడు. దశరథుడు వారినుద్దేశించి, ఇంతమంది తపస్సంపన్నులు తనకు సహాయం చేస్తున్నప్పటికీ, క్రూర గ్రహాలు తనకు కొడుకులు పుట్టకుండా ఎలా చేయగలుగుతున్నాయని ప్రశ్నిస్తాడు. సూర్యుడు మొదలు తన తరం వరకూ, అవిచ్ఛిన్నంగా వస్తున్న తమ వంశం, తన తదనంతరం ఆగిపోతే, రాజ్యం పరుల పాలై తనకు అపకీర్తి వస్తుందని వారితో అంటాడు దశరథుడు. సంతానం కలగలేదని చింతా సాగరంలో మునిగి బాధపడుతున్న తనకేదన్నా దారి చూపమని వారిని అడుగుతాడు. పుత్రులకొరకు అశ్వమేథ యాగం చేద్దామన్న తన కోరిక నెరవేరే ఉపాయం ఆలోచించమని కోరుతాడు. దశరథుడి ఆలోచన సక్రమంగానే వుందనీ-దానికవసరమైన పనులు ప్రారంభించమనీ వశిష్ఠుడితో సహా అందరు సలహా ఇస్తారు దశరథుడికి.


సందేహం మాని గుర్రాన్ని దేశ సంచారం కొరకు పంపాలనీ, పుత్రులు అవశ్యం కలుగుతారని, ధర్మబుద్ధిగల దశరథుడికి నీతిమంతులైన పుత్రులే పుడతారని వారంటారు. బ్రాహ్మణ వాక్యం వ్యర్థం కాదని నమ్మిన దశరథుడు, తన కప్పుడే పుత్రులు కలిగిన ఆనందంతో ఉప్పొంగి పోతాడు. యజ్ఞానికి కావల్సిన సమస్త సామాగ్రిని సమృద్ధిగా సమకూర్చాలని మంత్రులను ఆజ్ఞాపిస్తాడు. గురువులు చెప్పినట్లే గుర్రాన్ని విడవాలని-దానికి రక్షణగా ఒక పురోహితుడిని పంపాలని-సరయూనదీ తీరాన యజ్ఞశాల నిర్మించాలని-శాస్త్ర ప్రకారం జరగాల్సిన విధులన్నీ నిర్వహించాలని, దశరథుడు ఆదేశిస్తాడు. ఇలాంటి యజ్ఞాన్ని అందరు రాజులకు చేయాలన్న కోరికున్నప్పటికీ, మంత్రలోపమో-తంత్రలోపమో-శ్రద్ధాలోపమో-దక్షిణాలోపమో జరిగితే, ఇబ్బందులెదురైతాయనీ, అందుకే చేయడానికి భయపడుతారనీ అంటూ, అవేమీ లేకుండా చూడమని మంత్రులకు చెప్తాడు దశరథుడు.

యజ్ఞం నిర్వహణలో ఎక్కడో అక్కడ ఏదన్నా లోపం జరుగకపోతుందానని కాచుక్కూచుండే బ్రహ్మ రాక్షసులు దాన్ని విఘ్నం చేసేందుకు సకల ప్రయత్నాలు చేస్తారనీ-అదే జరిగితే కర్తకు కీడు కలుగుతుందనీ-అందువల్ల ఎలా చేస్తే విఘ్నాలు లేకుండా కొనసాగుతుందో అలానే సమర్థవంతంగా చేయాలని అంటాడు దశరథుడు. (పతితులతో కలిసిమెలిసి వుండేవాడు, పర స్త్రీ సాంగత్యం చేసేవాడు, బ్రాహ్మణుడి సొమ్ము అపహరించేవాడు, బ్రహ్మ రాక్షసుడిగా పుట్తాడు. రాక్షసుల్లో బ్రాహ్మణులు బ్రహ్మ రాక్షసులు. రావణాసురుడు క్షత్రియ రాక్షసుడు).


దశరథుడి లాంటి గొప్పవారు, సత్యాత్ములు పూనుకొని చేసే కార్యక్రమాలు విఘ్నం లేకుండా జరుగుతాయని చెప్తూ, పనులన్నీ చక్కగా నెరవేరుస్తామని హామీ ఇస్తారు మంత్రులు. మంత్రులు-పురోహితులు మినహా మిగతావారందరు అప్పటికింక దశరథుడిని దీవించి, శలవు తీసుకుంటారు. యజ్ఞం కొరత లేకుండా జరగడానికి కావలసినవన్నీ సమకూర్చమని మంత్రులను మళ్లీ ఆజ్ఞాపించి, దశరథుడు అంతఃపురానికి వెళ్తాడు. పుత్రులు కలగడానికి కారణమైన యజ్ఞాన్ని చేయబోతున్నానని, అంతఃపురంలోని తన భార్యలతో అంటూ, ఆ రోజునుండి వారుకూడా దీక్షతో వుండాలని కోరతాడు దశరథుడు. 

No comments:

Post a Comment