Tuesday, March 12, 2019

“హా! లక్ష్మణా! హా! సీతా” అని అరచి చనిపోయిన మారీచుడు ..... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-51 : వనం జ్వాలా నరసింహారావు


“హా! లక్ష్మణా! హా! సీతా” అని అరచి చనిపోయిన మారీచుడు
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-51
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (10-03-2019)
         మూడువంకరల విల్లు, బంగారు పిడికల బాకు, అంబుల పొదులు రెండు ధరించి శ్రీరాముడు ఆ మృగాన్ని పట్టుకోవడానికి వెంటనే బయల్దేరాడు. చేతిలో ధనుస్సు ధరించి వస్తున్న రాముడిని చూసి తనను చంపడానికి వస్తున్నాడని నిర్ణయించుకున్న మాయామృగం పారిపోతే రావణుడు చంపుతాడని భయపడింది. కాసేపు దూరంగా, కాసేపు చెట్లగుంపులో దాక్కుంటూ రాముడికి కనిపించీ-కనిపించకుండా తిరగసాగింది. జింక దొరికిందికదా అని పట్టుకోవడానికి సిద్ధంకాగా, చెంగున నాలుగు కాళ్లతో ఎగిరి ఆవలవైపు దూకేది. కాసేపు దగ్గరికి, కాసేపు దూరంగా, కాసేపు పచ్చిక మేస్తూ, కాసేపు వినోదంగా తిరుగుతూ, కాసేపు రామచంద్రమూర్తికి కాంతులీనుతూ మెరుస్తూ కనిపించేది. శ్రీరాముడు విల్లు ఎక్కు పెట్టగానే, దానిమీదే దృష్టి వుంచి ఆయనకు చిక్కకుండా దూరంగా పరుగేత్తేది. భయపడుతున్నట్లు నటించి ఆకాశంలో గంతులు పెడ్తూ ఆడేది.

         తనను చూసి భయపడిందని భావించిన శ్రీరాముడు విల్లు వెనుకవైపు వుంచుకుని దగ్గరగా పోతే, అది కూడా అంతే మెల్లగా ముందు-ముందు పోయేది. ఇది ఎలాగూ చిక్కదు....దీన్ని చంపుదామని విల్లుతీయగానే బెదిరినదానిలాగా గుప్పించి ఎగిరేది. తనవెంట వచ్చే రామచంద్రుడిని చూడనట్లే పచ్చికల్లో ఆడేది. ఒక్కోసారి రాముడిని ఓర కంటితో చూసేది. కొంతసేపు చాటుగా పోయేది. ఇలా రామచంద్రుడిని ఆశ్రమానికి చాలా దూరంగా తీసుకుపోయింది. అలా చాలా దూరం పోయిన శ్రీరాముడు కోపంతో, బడలికతో ఒక చెట్టు నీడలో నిలుచున్నాడు. అప్పుడా జింక ఒక ఇరుకైన స్థలంలోకి పోయి రామచంద్రమూర్తికి కనిపించింది. చిక్కిందని రాముడు పట్టుకోపోతే, భయంతో విల-విలా తన్నుకుని పరుగెత్తింది. మళ్లీ అది చెట్ల గుంపుల్లో కనిపిస్తే రామచంద్రుడు కోపగించుకుని దీన్ని చంపాలని నిర్ణయించుకుని, సూర్యకాంతిగల బ్రహ్మాస్త్రాన్ని సంధించి, ఆ మృగ రూపంలో వున్న రాక్షసుడికి గురి చూసి కొట్టాడు.

         శ్రీరాముడు వేసిన బాణం జింక రూపంలో వున్న రాక్షసుడి శరీరంలో దూరి, ఆయన గుండెను చీల్చగా, ఆ రాక్షసుడు ఆ దెబ్బకు తాటిచెట్టు పొడవుగా భయంకరమైన ధ్వనితో ఎగిరి పడ్డాడు. అప్పుడు తన మాయా శరీరం వదలిన మారీచుడు ఏం చేస్తే సీత లక్ష్మణుడిని దూరంగా పంపుతుందనీ, రావణుడు ఎలా సీతను అపహరించగలడనీ, ఆలోచించాడు. రాముడి గొంతును అనుకరిస్తూ “హా! సీతా! హా! లక్ష్మణా!” అని అరిచి జింక రూపం వదలి నిజరూపం దాల్చి  భూమ్మీద పడి ప్రాణాలను విడిచాడు. అలా పడిపోయిన రాక్షసుడిని చూసిన రాముడికి లక్ష్మణుడి మాటలు స్మరణకొచ్చాయి. సీత మీద మనస్సు పోయింది. లక్ష్మణుడు చెప్పినట్లు ఇది మారీచుడి మాయేనని నిశ్చయించాడు. తన బాణంతో చచ్చినవాడు మారీచుడే అని అనుకున్నాడు. తన గొంతుతో “హా! సీతా! హా! లక్ష్మణా!” అని అరచినది విని సీతాలక్ష్మణులు ఏమని అనుకున్నారో అని ఆలోచిస్తూ, భయంతో, దేహమంతా గగ్గురుమనగా శీఘ్రంగా ఆశ్రమానికి బయల్దేరాడు.

         ఆశ్రమంలో వున్న సీత తన భర్త గొంతుతో “హా! సీతా! హా! లక్ష్మణా!” అని దుఃఖంతో వినిపించగా లక్ష్మణుడిని చూసి, “అయ్యో లక్ష్మణా! ఇదేం విపరీతం? రామచంద్రుడిని చూడడానికి త్వరగా పరుగెత్తు. ఆ ధ్వని వినగానే గుండెలు ఝల్లుమంటున్నాయి. ప్రాణం చలిస్తున్నది. రామచంద్రమూర్తి ఒంటరిగా వున్నాడు. ఎక్కడ ఎవరి చేతులకు చిక్కాడో, లేక, మరేమైనా ఆపద కలిగిందో? నేనేమి చేయాలి? లక్ష్మణా! మీ అన్న అరుస్తున్నాడు. త్వరగా ఆయనను కాపాడడానికి పోవయ్యా. నా తమ్ముడు చాలా పరాక్రమవంతుడు, నాకు సహాయపడతాడు, అని ఎంతా ఆశ పెట్టుకున్నాడో? రాక్షసులు, సింహాల గుంపులు చుట్టుకుంటే వుండే కోడిలాగా ఎంత దుఃఖపడుతున్నాడో?” అని అనింది. లక్ష్మణుడు సీతను కాపాడమని తనకు అన్న చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుని సీత చెప్పినట్లు పోకుండా అక్కడే నిలిచి వున్నాడు. అది చూసి సీత లక్ష్మణుడితో కోపంగా మాట్లాడింది.

         (పద్నాలుగువేల మంది యోధులను ఒక్కడే తన కళ్ళ ఎదుటే చంపగా చూసినప్పటికీ, ఆయనకు ఏదో ఆపద కలిగిందని అనుకోవడం కర్మబలిష్టమే! స్త్రీలకు సంతోషం వచ్చినా, దేహం తెలవదు....శోకం కలిగినా దేహం తెలవదు. ఉన్న తెలివి ఊడిపోతుంది).

         తన మాట ప్రకారం అన్నాను కాపాడడానికి వెళ్ళకుండా నిల్చున్న లక్ష్మణుడితో సీత పరుషంగా మాట్లాడింది. ఇలా. “సుమిత్రపుత్రా! మీ అన్నకు కష్టం కలిగిన ఈ సమయంలో కొంచెమైనా సహాయం చేద్దామని నువ్వు అనుకోవడం లేదు. ఆ కారణాన నిన్ను స్నేహితుడి వేషం వేసుకుని తిరుగుతున్న గొప్ప శత్రువు అని భావిస్తాను. దుష్టకామం కలవాడా! ఓరీ వంచకుడా! నీకు రామచంద్రమూర్తి ఏం చెడు చేశాడు? లక్ష్మణా! నీ వ్యవహారం, నీ ఆలోచన తెలుసుకున్నాను. పాపపు మనస్సు కలవాడా! ఆయన ఆర్తధ్వని స్పష్టంగా విన్నా, నామీద వున్న మోహంతో నన్ను చేపట్టాలని అక్కడికి పోవడానికి ఒక్క అడుగైనా వేయడం లేదు. స్థిరంగా నిల్చున్నావు. అన్నకు ఆపద కలిగినప్పుడు మంచివాడైతే పోకుండా ఇలా నిల్చుంటాడా?

         “అన్నకు కీడుకలగడం నీకు ఇష్టం కాబట్టి ఇంకా నిల్చునే వున్నావు. నీకు అన్న మీద స్నేహం సున్నా. ఇది నిజం. నువ్వు అడవులకు వచ్చిన ఉద్దేశం ఏంటి? నీ తల్లి నీకేం చెప్పింది? ముఖ్యంగా రామచంద్రుడి సేవకే కదా వచ్చావు? రాముడిని సేవించమని కదా నీ తల్లి నీకు చెప్పింది. అలాంటప్పుడు నీ విషయంలో ఏ పాపం ఎంచని రామచంద్రుడికి ప్రాణాపాయం వస్తే అక్కడికి పోకుండా నన్ను రక్షిస్తానని అంటావేమిటి? ఇంత చెప్పినా లక్ష్యం లేకుండా మనస్సులో కొంచెమైనా భయపడవేంటి? రాముడిని రక్షిస్తే నా ప్రాణాలు రక్షించినట్లు అవుతుంది కాని రాముడు లేకుండా నువ్వు నా ప్రాణాలు కాపాడినా దానికి విలువ వుందా?

         సీత ఇలా భయపడుతూ, కన్నీళ్లు కారుతుంటే మాట్లాడడం చూసిన లక్ష్మణుడు ఆమెకు జవాబు చెప్పాడు.

No comments:

Post a Comment