Wednesday, March 13, 2019

జిల్లా కలెక్టర్ల వ్యవస్థ : నాడు, నేడు ..... వనం జ్వాలా నరసింహారావు


జిల్లా కలెక్టర్ల వ్యవస్థ : నాడు, నేడు
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (14-03-2019)
         ఇటీవల, కొత్తగా ఏర్పాటైన మూడు జిల్లాల కలెక్టర్లగా, నాన్-కాడర్ అధికారులను నియమించడం పట్ల కొందరు ఐఏఎస్ అధికారులు అసంతృప్తి చెందినట్లు, ఆక్షేపించినట్లు, విమర్శించినట్లు వార్తా కథనాలొచ్చాయి. ఇందులో నిజా-నిజాలెంత వున్నా బహుశా ఆ విమర్శలను పెద్దగా పట్టించుకోనక్కర్లేదని పలువురు పాలనారంగ అనుభవజ్ఞులు భావిస్తున్నారు. జిల్లా యంత్రాంగ వ్యవస్థలో అనునిత్యం మార్పులు చోటుచేసుకుంటున్న వర్తమాన కాలంలో, నేరుగా ఐఏఎస్ కు ఎంపికైన వారైనా, కన్ఫర్డ్ వారైనా, లేదా, నాన్-కాడర్ వారైనా జిల్లా కలెక్టర్లుగా నియమించవచ్చు. అదెవరైనా కానీ, పెద్దగా తేడా వుండదు. ఇంకా చెప్పుకోవాలంటే, పదోన్నతిపైన నియమించబడ్డ నాన్-కాడర్ అధికారులు కానీ, కన్ఫర్డ్ ఐఏఎస్ లు కానీ, నేరుగా ఎంపికైన వారికంటే వయసు రీత్యా చూసినా, అనుభవం రీత్యా చూసినా, పనిచేసిన పదవుల రీత్యా చూసినా ఎక్కువ పరిణితి చెందిన వారని చెప్పాలి.

కొత్త జిల్లాల ఏర్పాటుతో అతి పిన్న వయసులోనే, సాధారణంగా రావడానికి ముందే, చాలామంది ఐఏఎస్ అధికారులకి కలెక్టర్లుగా బాధ్యతలు చేపట్టే అవకాశం కలిగింది. వీరిలో కనీసం కొందరైనా తమకప్పచెప్పిన బాధ్యతలను అనుకున్న స్థాయిలో నిర్వహించలేక పోవడమో, లేదా, ఆశించిన ఫలితాలు సాధించలేకపోవడమో జరుగుతున్నదన్న వార్తలు ఆనోటా-ఈ నోటా వినపడుతున్నాయి. వీటిలో నిజా-నిజాలు బేరీజువేసుకోవాల్సిన అవసరమైతే వుంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు పురోగతిపై సమీక్ష-సర్వే చేసుకోవాల్సిన అవసరం కూడా వుంది. విధి నిర్వహణలో వీరు ఏ మేరకు చిత్తశుద్ధి, నిబద్ధత కనపరుస్తున్నారో కూడా నిర్ధారించాల్సిన అవసరం వుంది. సామాజిక స్థితిగతులు, రాజకీయ ఎత్తుగడలపై కొంతమంది జూనియర్ ఐఏఎస్ అధికారులకు అనుభవరాహిత్యం వల్ల అవగాహన అంత ఎక్కువగా లేదన్న ఆరోపణలు కూడా వినవస్తున్నాయి. ఇదిలా వుంటే, సీనియర్ ఐఏఎస్ అధికారులు పాలనాపరమైన అవసరాల దృష్ట్యా రాజధాని హైదరాబాద్ కు పరిమితమై, వివిధ శాఖాధిపతులుగా తమకప్పచెప్పిన బాధ్యతలు నిర్వర్తించాల్సి వున్నందున వాళ్ళను కలెక్టర్లుగా నియమించడానికి ఆస్కారం లేదు. అందుకే, అనుభవం కలిగిన, పరిణితి చెందిన, వయసురీత్యా పెద్దవారైన నాన్-కాడర్ లేదా కన్ఫర్డ్ ఐఏఎస్ లను జిల్లా కలెక్టర్లుగా నియమించాల్సిన అవసరం ఏర్పడింది. దీంట్లో ఆక్షేపించడానికి, విమర్శించడానికి కారణం ఏముంది?

ఇదిలా వుంటే, భూయాజమాన్యానికి, నిర్వహణకు చెందిన బాధ్యతలనుండి కలెక్టర్లను తప్పించే ఆలోచన కనుక ప్రభుత్వం చేస్తుంటే, అసలా వ్యవస్థ అవసరం అంత పెద్దగా వుంటుందా? రైతుబందు పథకం ద్వారా వ్యవసాయానికి పెట్టుబడి ఇవ్వడంతో భూమి శిస్తు పూర్తిగా రద్దైనట్లే. రెవెన్యూ కోర్టులను తీసేస్తామంటున్నారు. వ్యవసాయాదికారులను ఎమ్మార్వోల బదులు భూమి రిజిస్ట్రేషన్ అధికారులుగా నియమించాలన్న ఆలోచనలో వుంది ప్రభుత్వమని వార్తలొచ్చాయి. ఈ నేపధ్యంలో, కలెక్టర్ల వ్యవస్థ పూర్వాపరాలను, మూలాలను, అవసరాన్ని, భావనను, పరిణామక్రమాన్ని, వృద్ధిని, ప్రాముఖ్యతను గమనిస్తే, ఆ వ్యవస్థ ప్రాధాన్యత ఏ విధంగా కాలక్రమేనా తగ్గుముఖంలో వుందో స్పష్టంగా అర్థమవుతుంది. ఒకప్పుడు జిల్లాకు రారాజైన కలెక్టర్ ఇప్పుడు అందరిలాగా ఒక జిల్లా పాలనాధికారి.

రక-రకాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు బాధ్యత గతంలో కలెక్టర్ దే పూర్తిగా కాగా, మారుతున్న పరిస్థితుల్లో, సంబంధిత శాఖ రాష్ట్ర స్థాయి అధికారుల నుండి, క్షేత్ర స్థాయి అధికారుల దాకా వాటిని నిర్వర్తించడం అందరికీ తెలసిన విషయమే. ఉదాహరణకు ఆసరా పించన్ల అమలు నేరుగా రాష్ట్ర స్థాయి సంక్షేమ శాఖే చూసుకుంటున్నది. అలాగే మంచినీటి పథకాన్ని మిషన్ భగీరథ అధికారులు చూసుకుంటున్నారు. నీటి పారుదల ప్రాజెక్టులు కానీ, విద్యుత్ సరఫరా కానీ, వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలు కానీ, ఆ మాటకొస్తే ఏ పథకమైనా ఒకప్పుడులాగా కలెక్టర్ నియంత్రణలో లేదు....ఎక్కువలో ఎక్కువ పర్యవేక్షణలో వుండవచ్చు. అందుకే బహుశా, ఒక పూర్తి స్థాయి ఐఏఎస్ అధికారి బదులు, అనుభవజ్ఞుడైన కాడర్ లేదా నాన్-కాడర్ అధికారి కలెక్టర్ గా ఆ బాధ్యతలు నెరవేర్చడం అంత కష్టమేమీ కాకపోవచ్చు. ఆ దిశగా ఆలోచించి ప్రభుత్వం కొందరు కన్ఫర్డ్ ఐఏఎస్ అధికారులను కలెక్టర్లుగా నియమించింది. ఇప్పుడు అదనంగా ముగ్గురు నాన్-కాడర్ అధికారులను జిల్లా కలెక్టర్లుగా నియమించి వుండవచ్చు. ఇందులో తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. కన్ఫర్డ్ ఐఏఎస్ అధికారులను, నాన్-కాడర్ అధికారులను జిల్లా కలెక్టర్లుగా నియమించడం ఒక్క తెలంగాణాకే పరిమితం కాదు. చాలా రాష్ట్రాల్లో జరుగుతున్నా వ్యవహారమే ఇది.


అలనాటి పరిస్థితులకు అనుగుణంగా, సుమారు 250 సంవత్సరాల పూర్వం ప్రస్తుతమున్న  కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ వ్యవస్థ రూపుదిద్దుకుంది. స్వతంత్ర భారత దేశానికి, దేశ పాలనా యంత్రాంగానికి, బ్రిటీష్ వలసపాలకులు అప్పచెప్పిన అత్యంత ప్రాముఖ్యత కల వ్యవస్థ కలెక్టర్ వ్యవస్థే అనాలి. భారత దేశంలో జిల్లా పాలనా యంత్రాంగంలో అత్యున్నతమైన కార్యనిర్వాహక వ్యవస్థ కూడా కలెక్టర్ వ్యవస్థే. ఒకనాటి ఓరియంటల్ వ్యవస్థ పునాదులమీదే బ్రిటీష్ వారు దీన్ని మెరుగుపర్చారు. ఒక సుస్థిర పాలనా పద్ధతికి శ్రీకారం చుట్టింది కూడా కలెక్టర్ వ్యవస్థే. యావత్ పాలనా కేంద్ర యూనిట్ గా జిల్లాను ఏర్పాటు చేసి, కలెక్టర్ కు దాని బాధ్యతలు అప్పగించింది బ్రిటీష్ ప్రభుత్వం. అదే నేటికీ కాలక్రమేణా, కాలానుగుణంగా వస్తున్న మార్పులతో కొనసాగుతున్నది.

మాజీ కేబినేట్ కార్యదర్శి, విశ్రాంత ఐసీఎస్ అధికారి ఎస్ఎస్ ఖేరా కలెక్టర్ వ్యవస్థ అవసరం, భావన, పరిణామక్రమం, పుట్టుక గురించి వివరంగా డాక్యుమెంట్ చేశారు. ఆ వ్యవస్థది ఒక ఎడతెగని చరిత్ర అనాలి. మౌర్యుల కాలంలో, గుప్తుల కాలంలో, మొఘలుల కాలంలో, ఆంగ్లేయుల కాలంలో, వివిధ పేర్లతో పిలవబడ్డప్పటికీ కలెక్టర్ వ్యవస్థ అనేది మాత్రం నిలకడగా వుంటూ వస్తున్నది. మనుధర్మ శాస్త్రంలో గ్రామాన్ని స్వయంప్రతిపత్తికల ఒక యూనిట్ గా అభివర్ణించడం జరిగింది. అలాంటి వేయి గ్రామాలను ఒక సమూహంగా భావించి, ఒక జిల్లాగా పిలిచేవారు. వాస్తవానికి ప్రస్తుతం దేశంలో వున్న సుమారు 642,000 గ్రామాలను మొత్తం జిల్లాల సంఖ్య 723 తో భాగిస్తే (సగటున సుమారు 890) ఇంచుమించుగా మనుధర్మశాస్త్రం ప్రకారమే వేయి గ్రామాలకు ఒక జిల్లా వుంటుంది. తెలంగాణ రాష్ట్రం లాంటి కొన్ని రాష్ట్రాలలో, చిన్న జిల్లాల ఏర్పాటు కారణాన ఈ నిష్పత్తిలో కొంత తేడా వుండవచ్చు.   

ఎప్పుడైతే ఈస్ట్ ఇండియా కంపెనీ లండన్ లోని బ్రిటీష్ ప్రభుత్వ పాలనా సంస్థగా (గవర్నింగ్ ఏజన్సీ) గుర్తింపు పొందిందో, అప్పట్లో సూపర్వైజర్ గా పిలవబడే కంపెనీ జిల్లా ప్రధాన ప్రతినిధి భూమిశిస్తు వసూలు చేయడానికి “కలెక్టర్” గా రూపాంతరం చెందాడు. ప్రభుత్వ ఏజంటుగా కూడా పిలిచేవారాయనను. వారన్ హేస్టింగ్స్ కలెక్టర్ వ్యవస్థను 1772 లో ఏర్పాటు చేశాడు. భూమి శిస్తు వసూలుచేయడమే కలెక్టర్ ప్రధాన కర్తవ్యం. బ్రిటీష్ స్థానిక పరిపాలనా వ్యవస్థలో కూడా కలెక్టర్ ది కీలక పాత్ర అయింది. ఇక అప్పటినుండి ఆ వ్యవస్థలో అనేక మార్పులు-చేర్పులు చోటు చేసుకుంటూ వస్తున్నాయి. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చేసరికల్లా జిల్లా కలెక్టర్ అత్యంత ప్రాముఖ్యతకల అధికారిగా గుర్తింపు వచ్చింది. భారత రాజ్యాంగంలో మాత్రం ఎక్కడా కూడా జిల్లా పాలన యూనిట్ అనే విషయం కానీ, కలెక్టర్ ప్రస్తావన కానీ లేనే లేదు. కేవలం జిల్లా జడ్జీల గురించిన ప్రస్తావన పరోక్షంగా కనిపిస్తుంది.

19వ శతాబ్దం చివరివరకూ కూడా భారతీయులెవరూ కలెక్టర్ బాధ్యతలు నిర్వహించలేదు. వారికి అర్హత కూడా కలిగించలేదు. ఇండియన్ సివిల్ సర్వీస్ పోటీ పరీక్షలు రాయడానికి భారతీయులకు అవకాశం ఇవ్వడంతో కలెక్టర్ అయ్యే అవకాశాలు వారికి కూడా వచ్చాయి. అలనాటి అస్సాం ఐసీఎస్ అధికారి ఆనందరాం బారువాను, మొట్టమొదటి జిల్లా కలెక్టర్ గా నియమించింది బ్రిటీష్ ప్రభుత్వం. ఐసీఎస్ పాసైన ఆరవ వ్యక్తి అతను.

తెలంగాణాకు సంబంధించినంతవరకు, 1864 సంవత్సరంలో సాలార్జంగ్ సంస్కరణలు తెచ్చేవరకు కలెక్టర్ వ్యవస్థ లేదనాలి. సంస్కరణల ఫలితంగా హైదరాబాద్ స్టేట్ (సంస్థానం) లో తొలుత నాలుగు సుబాలను ఏర్పాటుచేయడం జరిగింది. అవి, ఔరంగాబాద్, గుల్బర్గా, మెదక్, వరంగల్. వీటికి అధిపతిగా సుబేదార్లు వుండేవారు. ఆ తర్వాతనే సుబాలను జిల్లాలుగా చేసి, జిల్లాకు ఒక తాలూక్దార్ ను నియమించింది నిజాం ప్రభుత్వం. జిల్లాల అధికారులను అవ్వల్ తాలూక్దార్ అనీ, ఆర్డీవో స్థాయి అధికారిని దువ్వం తాలూక్దార్ అనీ, కింది అధికారులను తాసీల్దార్, గిర్దావర్ అనీ పిలిచేవారు. ఆ ఏర్పాటంతా పన్నుల ద్వారా రాబడికోసమే. వీళ్లంతా డబ్బులు వసూల్ చేసి ఎప్పటికప్పుడు జమ చేయకుండా, రాజుగారికి అవసరమైనప్పుడు ఇచ్చేవారు.

రెవెన్యూ సంబంధిత పాలన, పోలీస్ సంబంధిత పాలన, జిల్లా పాలనకు సంబంధించిన బాధ్యతలతో సహా కలెక్టర్ ప్రభుత్వ ఏజంటుగా వ్యవహరించేవాడు. స్వాతంత్ర్యానంతరం రెవెన్యూ పాలన ప్రాధాన్యత తగ్గి అభివృద్ధి కార్యక్రమాలవైపు దృష్టి సారించడం కలెక్టర్ ప్రధాన బాధ్యతగా మారింది. ఆయనకు పాలనలో సహాయకారులుగా ఆర్డీవో, తహసీల్దార్ (ఎమ్మార్వో), రెవెన్యూ ఇన్స్పెక్టర్, గ్రామాధికారులు వుంటారు. పంచాయితీరాజ్ వ్యవస్థ వచ్చిన తరువాత స్థానిక స్వపరిపాలనకు ప్రాధాన్యత పెరిగి, కలెక్టర్ పాత్ర సమన్వయ ఏజన్సీగా మారింది.

బ్రిటీష్ కాలంలో ఐసీఎస్ అధికారులను కలెక్టర్లగా నియమిస్తే, స్వతంత్రం వచ్చిన తరువాత ఐఏఎస్ అధికారులను నియమించడం జరిగింది. క్రమేపీ నేరుగా ఐఏఎస్ కు ఎంపికైన వారినే కాకుండా కన్ఫర్డ్ ఐఏఎస్ లను నియమించడం ఆనవాయితీ అయింది. ఆ తరువాత నాన్-కాడర్ అధికారులను నియమించడం కూడా జరుగుతున్నది. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో, ప్రజల ఆశయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే కలెక్టర్ కావాలి కాని, వారు ఏ కాడర్ కు చెందినవారనేది అంతగా ఆలోచన చేయక్కరలేదేమో!!!

No comments:

Post a Comment