Thursday, March 14, 2019

ఆర్ధిక పరపతి గుణాత్మకం కావాలి


ఆర్ధిక పరపతి గుణాత్మకం కావాలి
తెలంగాణ సమగ్ర ఆర్ధిక, అభివృద్ధి ప్రస్తానం -2
సూర్యదినపత్రిక (15-03-2019)

         సీఎం కేసీఆర్ నిర్భయంగా చాలా విషయాలను ప్రధాని మోడీ దృష్టికి తెచ్చారు. మోడీ సమాఖ్య వ్యవస్థ (ఫెడరలిజం) గురించి పదే-పదే చాలా గొప్పగా చెపుతుంటారు. అసలు కో-ఆపరేటివ్ ఫెడరలిజం (సహకార సమాఖ్య) అనేది భారత దేశంలో వున్నదా అనే విషయం ప్రధాని మోడీని సూటిగా ప్రశ్నించారు కేసీఆర్. పరిస్థితులు మారేకొద్దీ పాలకుల విధానాలు కూడా మారాలి. అవి డైనమిక్ గా వుండాలి. ఆ స్థాయిని నిలబెట్టాలి. మార్పుకు అనుగుణంగా పరిపాలకులు మారకపోతే మనదేశంలో ఎప్పటికీ అవే పరిస్థితులు నెలకొని వుంటాయి. ఉదాహరణకు కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా దళితులు ఎందుకు బాధలు అనుభవిస్తున్నారు ఇంకా? స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు దాటినా ఎందుకు గిరిజనులు ఇంకా లబో-దిబో అంటున్నారు? రోజులు గడుస్తున్న కొద్దీ రెడ్డి వాళ్ళు, వైశ్యులు కూడా ప్రత్యేక కార్పోరేషన్ కావాలంటున్నారు. ఎందుకు? వెలమలు వచ్చి తమను ఎస్సీలలో కలపమంటున్నారెందుకు? ఈ పరిస్థితికి కారణం ఏమిటి? దీనికి మూలాలు ఎక్కడున్నాయి?

         మన పొరుగున వున్న చైనా దేశం హిమాలయాలకు అటువైపు వుంది. మనం ఇటువైపు వున్నాం. 1980 సంవత్సరం దాకా మనకంటే వాళ్ల జీఎస్డీపీ తక్కువగానే వుండేది. గతంలో వాళ్ళు కూడా మనకంటే పరమ దరిద్రంలో వుండేవారు. మావో అధినేతగా వున్నప్పుడు ఒకసారి కరువు వచ్చి మూడు లక్షల మంది, మరొకసారి కరువు వచ్చి మరో ఏడు లక్షల మంది చనిపోయారు. భారతదేశం కంటే మూడింతలు ఎక్కువ భూభాగం వుంది చైనాకు. ఎక్కువ భాగం కొండలు, గుట్టలు వుండి ప్రతికూల భౌగోళిక పరిస్థితులున్నాయి. వ్యవసాయ భూమి భారత దేశానికంటే చాలా తక్కువగా వుండేది. పశ్చిమ చైనా భాగమంతా భయంకరమైన ఎడారులుంటాయి. అలా ఎన్నో రకాల అననుకూలతలు, ప్రతికూలతలు మధ్య, దాదాపు 1980 సంవత్సరం దాకా మనకంటే పేదరికంలో వున్నప్పటికీ, ఇప్పుడు ఆర్థికంగా ప్రపంచంలోనే అగ్రస్థానంలో వున్న దేశం చైనా. అంత శక్తివంతమైన దేశంగా కేవలం రెండు-మూడు దశాబ్దాలలో ఎదగ గలిగారు.

ఇక మన విషయానికొస్తే, మనవన్నీ విచిత్రపు పోకడలు. మన దేశంలో ఎకానమీ (ఆర్ధిక) లెవరేజ్ (పరపతి) చేసే ఆలోచన లేదు. ఎకానమీ లెవరేజ్ చేయడానికి అవసరమైన చర్యలు అసలే చేపట్టలేదు. అలా చేయనందువల్ల దేశం ఇబ్బందులు పడుతున్నదని మోడీకి చెప్పారు కేసీఆర్. అనేక దేశాలు వాళ్ల ఎకానమీ లెవరేజ్ చేసుకోవడానికి చాలా నూతన మార్గాలు అవలంభించాయి. ఉదాహరణకు, ఆదాయపు పన్ను ఎగవేతదార్ల సంగతే తీసుకుందాం. దాంట్లో సిగ్గుపడేది ఏమీ లేదు. దాచేది కూడా లేదు. అంతా బహిరంగమే. మన దేశంలో ఇప్పటికి చాలా సార్లు అమ్నెస్టీ పథకం ప్రకటించారు. స్వచ్చందంగా దాచుకున్న ధనం (నల్ల ధనం) వివరాలు చెప్పమని, రాయితీలు ఇస్తామని అన్నారు. ఇందిరాగాంధీ కాలం నుండి చాలా మంది ప్రధాన మంత్రులు ఈ పని చేశారు. మోడీ కూడా ఇచ్చారు. కానీ అవేవీ సరిగ్గా పనిచేయలేదు. అనుకున్న ఫలితాలు సాధించలేదు. కారణాలున్నాయి. ఉదాహరణకు, మనకన్నా చిన్న దేశమైన ఇండోనేషియా అమ్నెస్టీ ప్రకటిస్తే రు.24,00,000 కోట్లు మార్కెట్లోకి వచ్చాయి. ఇది దాదాపు మన కేంద్ర వార్షిక బడ్జెట్ తో సమానం. వాళ్ల నిబంధన...దాచుకున్న డబ్బు మీద కేవలం 5% పన్ను కట్టమనే. మన దేశంలో అమ్నెస్టీ అంటే 70% కట్టమంటారు. ఎవరు కడతారు? ఇది విచిత్రమైన ఆలోచనా ధోరణి. ఇలాంటి పెడ ధోరణి వల్ల ఎకానమీ లెవరేజ్ కాదు.

చాలా సార్లు ప్రతిపక్షాలు చేసే ఒకే ప్రధానమైన విమర్శ ప్రభుత్వం అదేపనిగా అప్పులు చేస్తున్నదని. వాళ్ళు తమ విన్యాసాన్ని మార్చుకోవాలి. అప్పుచేయడం అంటే ఎకానమీ లెవరేజ్ చేయడం అని అర్థం చేసుకోవాలి. వీటిని కేవలం అప్పులుగా భావించవద్దు. మంచిగా పనిచేసే రాష్ట్రానికి దాని ద్రవ్య విధానంలో పెరుగుదల వుంటుంది. ఆ పెరుగుదల 14% అని లెక్క కట్టితే, సరిగ్గా ఐదేళ్లలో వాళ్ల బడ్జెట్ రెట్టింపు అవుతుంది. తెలంగాణా రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పుడు చాలా భయపడాల్సి వచ్చింది. కారణం, ఇప్పటి తెలంగాణ రాష్ట్రం మునుపెన్నడూ ఇలాగ లేదు. ఈ భౌగోళిక పరిస్థితులతో ఎప్పుడూ లేదు. రాష్ట్రం ఏర్పాటైన కొత్తల్లో అన్నీ శాపాలే...రకరకాల వ్యాఖ్యానాలు కూడా. సుమారు రు. 4.75 లక్షల కోట్ల నుండి రు. 5 లక్షల కోట్ల మధ్య రాష్ట్రం బడ్జెట్, వ్యయం వుండేది. రాబోయే ఐదేళ్ళలో ఇది రెట్టింపు అయింది. ఏటేటా పెరుగుతున్నది. రాబోయే ఐదేళ్లలో రు.10 లక్షల కోట్లు అవుతుంది. 2028 కల్లా, అంటే, పదేళ్లు ముగిసేసరికి రాష్ట్రం వ్యయం చేయబోయే మొత్తం రు.30 లక్షల కోట్లు వుంటుంది. అంటే, ఈ ఐదేళ్లలో (2019-24) పెట్టబోయే ఖర్చు రు.10 లక్షల కోట్లు కాగా, ఆ తరువాత ఐదేళ్లలో (2024-29) పెట్టబోయే రు.20 లక్షలు కలిపి మొత్తం రు.30 లక్షల కోట్లు అవుతుంది. ఈ అవగాహన పరిపాలకులకు వుండాలి. ఆ విజన్-దూరదృష్టి వుండాలి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, దేశానికి దేశం అర్థం చేసుకుని ప్రజలకు వివరించాలి.


ఇవన్నీ చెప్పకుండా ప్రతిపక్షాలు అప్పులు చేసింది ప్రభుత్వమని విమర్శిస్తుంటారు. ప్రభుత్వం అప్పులు తెచ్చి తింటుందా? కాళేశ్వరం ప్రాజెక్టుకు ఖర్చు పెట్తున్నారని మరో విమర్శ. తప్పకుండా పెట్టాలి. అందులో తప్పేంటి? నీటిపారుదల ప్రాజెక్టులకు పెట్టకూడదా? మూలధన (కాపిటల్ వ్యయం) వ్యయం చేయవద్డా? గతంలో ప్రాజెక్టులు కట్టితే దశాబ్దాల తరబడి పనులు కాకపోయేవి. ప్రాజెక్టులు, నీళ్లకు సంబంధించిన విషయాలను ప్రధాని మోడీ దృష్టికి తీసుకువచ్చిన సీఎం కేసీఆర్ కొన్ని విషయాలు ఆయనకు చెప్పారు. అందులో 2004 లో ఏర్పాటైన ట్రిబ్యునల్ గురించి కూడా వుంది. ఇంతవరకూ ఆ ట్రిబ్యునల్ అవార్డు ఇవ్వలేదు. ఒక ట్రిబ్యునల్ అవార్డు ఇవ్వడానికి 15 సంవత్సరాలు కావాల్నా? తెలంగాణ కొత్తగా ఏర్పాటైన రాష్ట్రం కాబట్టి నదీజలాలలో దాని వాటా తేల్చాలి. నదీ జలాల వాటా తేల్చడానికి భారత రాజ్యాంగంలో రెండు పద్ధతులున్నాయి. సంబంధిత రాష్ట్రాలు వాటాల విషయంలో ఇచ్చిపుచ్చుకునే పద్ధతిలో పరస్పర అవగాహనకు రావచ్చు. లేదా, సెక్షన్ 3 కింద కేంద్రానికి దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్రానికి దరఖాస్తు చేసుకుంటే అది ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి దానికి పంపుతుంది. తీర్పు కేంద్రం ఇవ్వదు. ఇచ్చే అధికారం కూడాలేదు.

తెలంగాణ ఏర్పాటై ఐదేళ్లు గడుస్తున్నది. దేశ ప్రధాన మంత్రికి రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా వంద లేఖలు సమర్పించారు. సెక్షన్ 3 కింద దరఖాస్తు చేసున్నాం, పరిష్కరించమని కోరింది రాష్ట్ర ప్రభుత్వం, దాని అధినేత సీఎం కేసీఆర్. ఐదేళ్ళు గడిచినా ట్రిబ్యునల్ కు పంపలేదు. ఇన్ని ప్రతికూలతలను అధిగమించి రాష్ట్రం ప్రాజెక్టుల నిర్మాణం చేస్తున్నది. రు.20,000 నుండి రు.30,000 కోట్లు అప్పు తెచ్చి మరీ నిర్మాణం చేస్తున్నది. కానీ దేనికోదానికి నిర్దాక్షిణ్యంగా స్టే ఉత్తర్వులు వస్తాయి. అక్కడ పనిచేస్తున్న కాంట్రాక్టర్లు, అనేక వేలమంది కూలీలు, ఏంకావాలి? వాళ్లకు పని ఆగిపోతే ఎక్కడికి పోతారు? పని ఆగిపోతే మళ్లీ మొదలు కావడం చాలా కష్టం. ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది, పన్నులు వస్తాయి, రైతులు బాగుపడతారు, లక్ష్యం నెరవేరుతుంది. అలాంటప్పుడు ఇంత నిర్దాక్షిణ్యంగా స్టే ఎందుకిస్తారని సీఎం కేసీఆర్ ఎన్నిమార్లు అడిగినా జవాబు రాదు. కేంద్రానికి ఆయన అనేక సూచనలు చేశారు. వాటినేవీ వాళ్ళు పరిగణలోకి తీసుకోరు. రాబోయే రోజుల్లో రాష్ట్రాల అధికారాలు పెరుగుతే మంచి జరగవచ్చు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో ప్రాజెక్టుల నిర్మాణం సాగుతున్నది.

సీఎం కేసీఆర్ చొరవతో, ఆయనకు రాష్ట్రం పట్ల వున్న తపనతో, ప్రోటోకాల్ ఆలోచించకుండా,  అవసరం వున్న వారందరినీ కలిసి ఒప్పించే ప్రయత్నం చేశారు. ఫలితంగా రాష్ట్రంలో ప్రధానమైన నీటిపారుదల ప్రాజెక్టులన్నిటికీ అనుమతులన్నీ వచ్చాయి. కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులకు వందశాతం అనుమతులు రాగా, పాలమూరుకు ఒక్కటే పెండింగులో వుంది. బహుశా అదికూడా త్వరలోనే వస్తుంది. ఈ ఐదేళ్లలోపే పాలమూరు ఎత్తిపోతల పథకం నూటికి నూరు శాతం పూర్తవుతుంది. ఈ నేపధ్యంలో ఇకనైనా గుణాత్మకమైన ప్రభుత్వం రావాలని, ఎకానమీ లెవరేజ్ చేసే ప్రభుత్వం రావాలని ఆశిద్దాం.

అప్పులు అదేపనిగా చేస్తున్నదీ ప్రభుత్వమని, అదేదో తప్పుచేస్తున్నట్లుగా చిత్రీకరిస్తూ, మళ్లీ-మళ్లీ ఆరోపణలు చేస్తున్నారు ప్రతిపక్షాలవారు. వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే...అప్పులు అందరికీ దొరకవనే విషయం. ఆర్ధిక వినయం వుంటేనే అప్పులు దొరుకుతాయి. లేకపోతే రావు. వాళ్లు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. వాళ్ల ఆలోచన ఓల్డ్ కల్చర్. ఈరోజు జపాన్ వాళ్లు తమ జిఎస్డీపి ఆధారంగా 300 శాతం ఋణాలు తీసుకుంటున్నారు. ఇవ్వాళ భూమండలం మీద అందరికంటే అత్యంత ధనిక దేశం అమెరికా. అత్యధిక అప్పులు తీసుకుంటున్న దేశం కూడా అమెరికానే. మరి వాళ్లు తెలివి తక్కువ వారా? వాళ్ల జిఎస్డిపిలో ఎక్కువ శాతం రుణాలు వుంటాయి. మనం అనవసరమైన భయాలకు గురవుతున్నాం. చైనా వాళ్లు కన్జర్వేటివ్ గా వుండేవారు కాని, 1980 దశకంలో డింగ్ జియోపింగ్ నాయకత్వంలో అద్భుతమైన, క్రాంతివంతమైన నిర్ణయం తీసుకున్నారు. మొత్తం పరివర్తన చెంది, పాతిక ఏళ్లలో మనం నమ్మలేని ప్రపంచాన్ని వాళ్లు సృష్టించారు. అటువంటి సంపద సృష్టి మన దేశంలో కూడా జరగాలని మనం కూడా కోరుకుంటున్నాం. ఎలా ఉంటుందో చూద్దాం. అంతా భగవంతుడి దయ. నేను స్పష్టంగా మనవి చేస్తున్నాను. దీంట్లో దాచనక్కర లేదు.

కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి ఉన్న రు.70,000 కోట్లు, లేదా, రు.80,000 కోట్ల అప్పులు కావచ్చు, వచ్చిన తర్వాత తీసుకున్న అప్పులు కావచ్చు, ఎఫ్ఆర్బియం కావచ్చు, నాన్ ఎఫ్ఆర్బియం కావచ్చు. వీటి రీ పేమెంటును చాలా పక్కాగా చేస్తున్నది ప్రభుత్వం. ఒక్కరోజు, ఒక్క రూపాయి కూడా డీఫాల్ట్ కాలేదు. అదేవిధంగా ఈ టెర్మ్ లో సుమారుగా రు.2,30,000 కోట్ల డెట్ సర్వీసు చేస్తున్నది. తెలంగాణ ఏర్పడే నాటికి వారసత్వంగా వచ్చిన అప్పులు కావచ్చు, తెలంగాణ ఏర్పడిన తర్వాత తీసుకున్న అప్పులు కావచ్చు, అన్నీ కలిపి ఈ ఐదేళ్లలో క్రమం తప్పకుండా ప్రభుత్వం రు.2,30,000 కోట్ల రుణాలకు డెట్ సర్వీసు చేయబోతున్నది ప్రభుత్వం. అందుకే ఈ బడ్జెట్ లో కూడా పెట్టారు. రీ పేయింగ్ కెపాసిటీ ఈ ప్రభుత్వానికి వుంది.

         రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఒక్క తెలంగాణాకే కాదు, దేశవ్యాప్తంగా ఉండే సంస్థలకు రుణాల రీ షెడ్యూల్ కు రిజర్వు బ్యాంకు అవకాశం ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అన్ని లోన్లను రీషెడ్యూల్ చేయించండని సీఎం సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కారణం ప్రభుత్వానికి చాలా కుషన్ ఉంది కాబట్టి అలా చేయమని చెప్పారు సీఎం. దాంతో కొంత ప్రభుత్వానికి కలసి వస్తుంది. ఋణాల స్ర్టెచ్ పెరుగుతుంది. ఏడేళ్లు ఉన్నది 15 ఏళ్లకి పోతుంది. 15 ఏళ్లు ఉన్నది 25 ఏళ్లకి పోతుంది. డబ్బులు మిగిలే ఆస్కారం ఉంది. తద్వారా ఎక్కువ కేపిటల్ వ్యయం చేసే ఆస్కారం ఉంటుంది. ఎక్కువ ప్రగతి సాధించే ఆస్కారం కూడా ఉంటుంది. భగవంతుడు ఇచ్చిన విజ్ఞతతో విషయాన్ని సంపూర్ణంగా అర్ధం చేసుకని, కేంద్ర ప్రభుత్వం కొంత నియంతృత్వ దృక్పథంతో ఉన్నప్పటికీ, ఆ వచ్చే కొద్ది వెసులుబాటుతో పూర్థిస్థాయిలో చేసే ప్రయత్నం చేస్తున్నది ప్రభుత్వం. ఈ విషయాలు అందరూ తెలుసుకోవాల్సిన అవసరం వుంది.

         ఈ టెర్మ్ లో ప్రభుత్వానికి రు.2,30,000 కోట్ల అప్పుకు అదనంగా మళ్లీ ప్రభుత్వానికి రు. 1,18,000 కోట్ల అర్హత వస్తుంది. తప్పకుండా ఆ ఆర్హత మేరకు రు. 1,18,000 కోట్ల అప్పులు తీసుకుంటుంది ప్రభుత్వం.  రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అప్పులు తీసుకోవాలి. కానీ వాటితో కేపిటల్ ఎక్స్ వ్యయం చేయాలి. ప్రజల అభివృద్ధి కోసం చేయాలి. ఉదాహరణకు ప్రభుత్వం గురుకులాలు పెట్టింది....వాటికి భవనాలు కావాలి. ఇంకా కొత్త గురుకులాలు కట్టాలి. పిల్లలకు బుద్ధి రావాలి. ఇంకా రాష్ట్రం వెనుకబాటుతనంలో ఉండకూడదు. బస్తీ దవాఖానాలు పెట్టాలని సూచన వచ్చింది. పెట్టడం మాటలతో అవుతుందా? పైసలు కావాలి కదా? డాక్టర్లు కావాలి కదా? వాళ్ల నియామకం చేయాలి కదా? చేస్తే వాళ్లకి జీతాలు ఇవ్వాలి కదా? అవసరమైన మందులు కూడా కొనాలి కదా? ఇది జరగాలంటే వికాసం అన్నది ఎక్కడికక్కడ రావాలి.

(ఇంకా వుంది...వచ్చే వారం)
--సీఎం కేసీఆర్ శాసనసభలో బడ్జెట్ సమావేశాల చర్చల ప్రసంగం ఆధారంగా

No comments:

Post a Comment