Saturday, March 23, 2019

రాముడి దగ్గరకు పోయిన లక్ష్మణుడు, యతివేషం ధరించిన రావణుడు ....శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-53 : వనం జ్వాలా నరసింహారావు


రాముడి దగ్గరకు పోయిన లక్ష్మణుడు, యతివేషం ధరించిన రావణుడు
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-53
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (24-03-2019)
వినడానికి కూడా యోగ్యంకాని మాటలను జానకి లాంటిది పలకగా, జితేంద్రియుడైన లక్ష్మణుడు శరీరం గగ్గురపడగా, రెండు చేతులు జోడించి సీతవైపు తిరిగి, ఆమెకు బదులు చెప్పడానికి తన మనస్సు అంగీకరించడం లేదంటాడు. ఇంకా ఇలా అంటాడు. “నువ్వు నాపాలిట దేవతవని నా అభిప్రాయం. యోగ్యా-యోగ్య విచారం చేయకుండా నోటికి వచ్చినట్లు కఠినంగా మాట్లాడడం స్త్ర్రేలకు కొత్త కాదు. చెడు విషయంలోనూ, మంచి విషయంలోనూ వారి ఇష్టప్రకారం నడచుకోకపోతే పురుషులను నోటికి వచ్చినట్లు తిట్తారు. స్త్రీలకందరికీ లోకంలో ఇలా పరుషంగా అనుచిత భాషణం చేయడం స్వభావంగా వచ్చింది. స్త్రీలు ధర్మజ్ఞానం లేనివారు. చపలచిత్తులు. ఎంత క్రూరకార్యం చేయడానికైనా వెనుదీయరు. దయాదాక్షిణ్యాలు లేవు. అన్నదమ్ములు, తండ్రిబిడ్డలు, ఒకరితో ఒకరు కలిసి వుండకుండా కొంపలు విడదీయగల నేర్పరులు. మదించినదానా! నీమాటలు కొర్రు కాల్చి గుచ్చినట్లు అయింది”.

“న్యాయం చెప్పేవాడినైన నేను న్యాయం పలుకుతుంటే, నీ దుష్టవాక్యాలను ఈ వనదేవతలందరూ వివరంగా సాక్షులై విందురుగాక. చీ! సహజంగా స్త్రీత్వమే పాపాత్మకం. కోపస్వభావంగలదానా! పెద్దవాడు తండ్రితో సమానమైన అన్న ఆజ్ఞ పాలిస్తున్న నన్ను ఈ విధంగా సందేహించినందున నువ్వు ఇప్పుడే పాడైపో. అబలా! ఇప్పుడే పోతాను రాముడున్న దగ్గరికి. ఇప్పుడు నీకు స్వస్తి కలుగుకాక. వనదేవాతలు రక్షించెదరుగాక. నాకు చెడు సూచించే అపశకునాలు కనిపిస్తున్నాయి. రామచంద్రుడితో తిరిగి వచ్చిన తరువాత నిన్ను చూడగలనో? లేదో?

ఇలా ఎప్పుడైతే లక్ష్మణుడు అన్నాడో, జానకి కన్నీళ్లు కారుస్తూ, ఏడుస్తూ, కర్ణశూలాల లాంటి మాటలన్నది. “నేను విషం తిని చస్తాను. గోదావరిలో దూకుతాను. ఉరిపోసుకుంటాను. మంటల్లో పడి చస్తాను. ఇతరులను కాలి వేలితోనైనా తాకుతానా?” అని అంటూ గట్టిగా ఏడుస్తూ, రెండు చేతులతో దబ-దబా అని కడుపుమీద కొట్టుకుంది. లక్ష్మణుడు ఓదార్చినా వినలేదు, ఆగలేదు. ఆ తరువాత లక్ష్మణుడు ఇంకా ఇక్కడే వుంటే ఏమవుతుందోనని భయపడి, సీతకు నమస్కారం చేసి, రుజుత్వమే మేలని భావించి, రాముడి దగ్గరకు పోయాడు.

         లక్ష్మణుడు అలా వెళ్లిపోగానే అవకాశం దొరికిందని రావణుడు సీతను చేరదల్చుకున్నాడు. సన్న్యాసి వేషం వేసుకుని, సన్న కాషాయ వస్త్రం కట్టుకుని, ఎడమ భుజం మీద త్రిదండం పట్టుకుని, చేత కమండలం వుంచుకుని, గొడుగు పట్టుకుని, శిఖ కలిగి, పావుకోళ్లు తొడుక్కుని, అన్నదమ్ములిద్దరూ లేకపోవడంతో సీతదగ్గరకు పోయాడు రావణుడు. వాడికి భయపడి చెట్లా ఆకులూ కదలలేదు. గాలి ఆగిపోయింది. వేగంగా పారే గోదావరినది వాడి భయంతో మెల్లమెల్లగా నడిచింది. దుష్టుడైన రావణుడు మగడు సమీపంలో లేడని వ్యధపడుతున్న సీతను సమీపించబోయాడు. ఆవేశించిన కామంతో, మోసబుద్ధితో, వేదఘోష చేస్తూ, సీతదగ్గరకు పోయి సవినయంగా ఆమెతో ఇలా అన్నాడు.


         “మనోహరమైన దానా! పచ్చని వస్త్రం ధరించిన దానా! అందమైన బంగారు వన్నె కలదానా! చంద్రుడి లాంటి ముఖంకలదానా! కమలంతో కలసిన తామరతీగె లాగా ఉన్నదానా! సుందరీ! నువ్వెవరు? నువ్వు భూదేవతవా? కీర్తివా? లక్ష్మీదేవివా? స్వతంత్రించి తిరిగే రతీదేవివా? దేవతాస్త్రీవా? ఆడ ఏనుగు లాంటి నడకగల దానా! నా మనస్సు హరిస్తున్నావు. నువ్వెవరివి? వాస్తవం చెప్పు. మొల్ల మొగ్గల్లాంటి దంతాలు కలదానా! నీ దంతాలు నిర్మలంగా, నున్నగా, సమంగా, మొగ్గల్లాంటి కొనలతో వున్నాయి. వెడల్పాటి కళ్ళదానా! నీ కళ్ళు చివర్లో ఎర్రగా, నిర్మలంగా, దీర్ఘంగా నల్లని గుడ్లు కలిగి వున్నాయి. నీ మొల అందంగా బలిసి విశాలంగా వుంది. నీతొడలు ఏనుగు తొండాలలాగా వున్నాయి. అబలా! నీ స్తనాలు వుబ్బి గుండ్రంగా ఎత్తుపల్లాలు లేకుండా, ఒకే విధంగా ఒకదానిని మరొకటి రాసుకుంటూ తాటిపళ్ళలాగా మనోహరంగా బలిసి వున్నాయి. చూసేవారి హృదయాలను హరిస్తున్నాయి”.

         “అందమైన చిరునవ్వు, అందమైన దంతాలు, అందమైన కళ్ళు, అందమైన వెంట్రుకలదానా! శృంగార చేష్టలకు సముద్రమైన దానా! పిడికిట పట్టే నడుం కలదానా! హృదయానికి ఇంపైనదానా! ఒకదానికొకటి రాసుకునే తొడలదానా! కఠినమైన కుచాలుకలదానా! ఏటి ప్రవాహం అడ్డం లేకుండా తీరాన్ని కోసి లోపలికి తీసుకున్నట్లు కమలాల లాంటి కళ్ళుకల చిన్నదానా! నీ చూపులతో నా మనస్సును కరిగించి హరించావుకదా? నేను దేవతా స్త్రీలను, యక్షస్త్రీలను, కిన్నర స్త్రీలను, కన్నులకు సంతోషం కలిగించే ఎందరినో చూశాను కాని, సౌందర్య సంపదలో నీలాంటి దాన్ని భూలోకంలో చూడలేదు. సుందరీ! నీ వయస్సు, నీ సౌకుమార్యం, నీ చక్కదనం, ఆలోచించగా నువ్వు వంటరిదానివై ఈ అడవిలో వుండడం నాకు వెర్రి కలిగిస్తున్నది. లతాంగీ! నువ్వు ఇంటికి పో. భయంకరమైన రాక్షసులు ఇక్కడ తిరుగుతుంటారు. కాబట్టి నువ్వు ఇక్కడ వంటరిగా వుండకూడదు. నీకు తగినవిధంగా త్వరగా పోయి బంగారుమేడలను, ఉద్యానవనాలను అలంకరించడానికి పో. నువ్వు అక్కడ వుండడమే వాటికి అలంకారం”.

         “కమలాల లాంటి కళ్ళదానా! శ్రేష్టమైన పూడండలు, శ్రేష్టమైన భోజనం, శ్రేష్టమైన వస్త్రం, శ్రేష్టుడైన మగడు నీకు కావాలి. ఇది నా అభిప్రాయం. అల్పుడు, సామాన్య పురుషుడు నీకు తగిన మగడు కాదు. మనుష్య స్త్రీలలో ఇలాంటి అందగత్తె లేదు. కాబట్టి నువ్వు దేవకాంతవని నమ్ముతున్నాను. అలా అయితే వాళ్లలో నువ్వెవరివి? ఏకాదశ రుద్రులకు సంబంధించిన దానివా? నిజంగా మరుత్తులకు చెందినదానివా? ప్రేమతో చెప్పు. దేవతా స్త్రీలు, కిన్నర స్త్రీలు ఇది రాక్షస భూమి కాబట్టి ఇక్కడికి రారు. నువ్వెక్కడిదానివి? వంటరిగా ఇక్కడ ఎందుకున్నావు? చెప్పు”.

         “నీలాంటి సుందరి మనుష్యులలో లేరు. కాబట్టి నువ్వు మనుష్య స్త్రీవి కాదు. దేవతా స్త్రీవే అయ్యుండాలి. ఇది రాక్షస భూమికాబట్టి దేవతా స్త్రీలు, కిన్నర స్త్రీలు ఇక్కడికి రారు. అయినా నువ్వు వచ్చావు. రాక్షసులకు ఇష్ట దేవత రుద్రుడు కాబట్టి ఆ రుద్రులకు సంబంధించిన దానివా? లేక, వాయువు ఇక్కడ తిరుగుతుంటాడు కాబట్టి వాయువులకు చెందిన దానివా? నిజం చెప్పు. ఇక్కడ పులులు, సింహాలు, కోతులు, చిరుతపులులు, ఎలుగులు, పెద్దగద్దలు, విస్తారంగా ఇక్కడ తిరుగుతున్నాయే? నువ్వెలా భయం లేకుండా ఇక్కడ వున్నావు? మదిరాక్షీ! నీ భర్త ఎవడు? నీ కులం ఏది? నీ జాతి ఏది? వయసుదానివి కదా, ఇక్కడ ఎందుకు వున్నావు? ఇది రాక్షసుల గుంపులు తిరిగే స్థలం” అని రావణుడు అడిగాడు. బ్రాహ్మణ సన్న్యాసి వేషం వేసుకున్న వాడిని సీతాదేవి శీఘ్రంగా, యతులను పూజించే విధంగా పూజచేసి సత్కరించింది.

No comments:

Post a Comment