Wednesday, March 20, 2019

పార్టీల మార్పు- నాణేనికి అటూ ఇటూ


పార్టీల మార్పు- నాణేనికి అటూ ఇటూ
జ్వాలాంత‌రంగం
సూర్య దినపత్రిక (20-03-2019)
రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లో భాగంగానో, పున‌రేకీక‌ర‌ణ‌లో భాగంగానో ఇటీవ‌ల కాలంలో కింత‌మంది వ్య‌క్తులు, వివిధ రాజ‌కీయ పార్టీల‌నుంచి ఎన్నికైన ప్ర‌జా ప్ర‌తినిధులు తెలంగాణ రాష్ట్ర స‌మితిలో చేరుతున్నారు. ఇలా పార్టీలు మార‌డాన్ని కొంత‌మంది నీతిబాహ్య‌మైన‌దిగా భావిస్తే, అవ‌స‌రాన్ని బ‌ట్టి ఇలా మార‌డం స‌బ‌బేన‌నే వారు లేక‌పోలేదు, బంగారు తెలంగాణ సాధించాల‌న్న ముఖ్య‌మంత్రి ప‌ట్ట‌ద‌ల‌, ల‌క్ష్య సాధ‌న‌కు ప్ర‌భుత్వం, ముఖ్య‌మంత్రి  చేస్తున్న కృషి, సంక్షేమ ప‌థ‌కాల, ప్ర‌భుత్వం చేప‌డుతున్న అభివృద్ధి కార్య‌క్ర‌మాల ప‌ట్ల అక‌ర్షితులై ప‌లువురు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నార‌న్న‌ది వాస్త‌వం. ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో నిబ‌ద్ద‌త‌తో  కూడిన ప్ర‌తిప‌క్షంగా ప్ర‌తిప‌క్ష పార్టీ వ్య‌వ‌హ‌రించ‌డంలో వైఫ‌ల్యం చెంద‌డం కూడా ప్ర‌జాప్ర‌తినిధులు టీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధ‌ప‌డేందుకు మ‌రో కార‌ణం. టీఆర్ఎస్‌లో ఉన్న‌వాళ్ళు ఏదో కార‌ణంగా ప్ర‌తిప‌క్ష పార్టీలో చేరేందుకు ఆస్త‌కి చూపితే ఆ పార్టీలు బేష‌ర‌తుగా చేర్చుకోవ‌డం కూడా అసాధార‌ణ‌మేమి కాదు. అంటే స‌భ‌లో ఒక పార్టీ నుంచి మ‌రో పార్టీలో చేరడం  స‌ర్వ సాధార‌ణం అయిన త‌రుణంలో ఎదురయ్యే విమ‌ర్శ‌ల‌ను పెద్ద‌గా ప‌రిగ‌ణించ‌న‌వ‌స‌రం లేదు.

తెలంగాణ‌లో ప్ర‌తిప‌క్ష పార్టీలు ఫిరాయింపు వ్య‌తిరేక చ‌ట్టం ముసుగులో అసెంబ్లీకి ఎన్నికై, పార్టీ మారిన శాస‌న స‌భ్యుల స‌భ్య‌త్వాన్ని ర‌ద్దుచేయించేలా చూసేందుకు కోర్టుల‌ను ఆశ్ర‌యిస్తున్నాయి, ఆ శాస‌న స‌భ్యులు మాత్రం రాష్ట్ర అభివృద్ధి, త‌మ నియోజ‌క‌వ‌ర్గాల అభివృద్ధి దృష్ట్యా తాము ముఖ్య‌మంత్రి కేసీఆర్ నాయ‌క‌త్వం కింద ప‌నిచేయాల‌ని కోరుకుంటున్నామ‌నీ, ఎన్నిక‌ల సంద‌ర్భంగా త‌మ‌త‌మ నియోజ‌క‌వ‌ర్గంలో వోట‌ర్లుక ఇచ్చిన వాగ్ధానాల‌ను నెర‌వేర్చాలంటే టీఆర్ఎస్‌లో చేర‌డం త‌ప్ప మ‌రో ప్ర‌త్యామ్నాయంలేద‌నీ, అందుకే పార్టీ మారాల్సి వ‌చ్చింద‌నీ నిర్ధ్వంద్వంగా చెబుతున్నారు. భార‌త‌దేశంలో ఫిరాయింపు వ్య‌తిరేక చ‌ట్టంలోని అంశాల‌ను ఏ విధంగా వ్యాఖ్యానించినా, స్ప‌ష్ట‌మైన సంప్ర‌దాయాలు లోపించిన మాట వాస్త‌వం. అందువ‌ల్ల పార్ల‌మెంట‌రీ ప్ర‌జాస్వామ్యం చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన సూత్రాల ప్ర‌కారం కాలానుగుణంగా వ‌స్తున్న ఆచార వ్య‌వ‌హారాల‌పైనే ఎక్కువ అధార‌ప‌డి సాగుతుంది.

  ఆయారాం గ‌యారాంల వ‌ల్ల‌, రాజ‌కీయ ఫిరాయింపుల వ‌ల్ల ఎదురవుతున్న దుష్ప‌రిణామాల‌కు చెక్ పెట్టేందుకు రాజీవ్ గాంధీ హయాంలో 1985లో రాజ్యాంగం 52వ అధిక‌ర‌ణాన్ని స‌వ‌రించ‌డం ద్వారా ఫిరాయింపు వ్య‌తిరేక  చ‌ట్టాన్ని రాజ్యాంగం 10వ షెడ్యూల కింద చేర్చారు. నిజానికి మ‌న దేశంలో 1973లోనూ, 1985లోనూ, 2003లోనూ వేర్పేరుగా ఫిరాయింపు వ్య‌తిరేక చ‌ట్టాల‌ని చేశారు.

2003 చ‌ట్టం ప్ర‌కారం ఓ వ్య‌క్తి తాను ఎన్నికైన పార్టీ స‌భ్య‌త్వాన్ని స్వ‌చ్ఛందంగా వ‌దులుకుంటే పార్ల‌మెంటులో కొన‌సాగే అర్హ‌త కోల్పోతాడు. అంతేకాదు. ఒక స‌భ్యుడు త‌న‌కు సంబంధించిన రాజ‌కీయ పార్టీ అదేశాల‌కు భిన్నంగా వ్య‌వ‌హ‌రించినా, పార్టీ ఆదేశాన్ని ఉల్లంఘించి ఓటింగ్‌లో పాల్టొన్నా లేదా ఓటింగ్ ఫ‌రాయింపు వ్య‌తిరేక‌త పేరుతో రాజ‌కీయ పార్టీలో అస‌మ్మ‌తి గ‌ళం వినిపించ‌కుండా ఈ చ‌ట్టం అణ‌చివేత‌కు గురిచేసేందుకు దారితీయ‌వ‌చ్చ‌నీ వాద‌న లేక‌పోతేదు. ప్ర‌జ‌లు ఎన్నుకొన్న స‌భ్యుడు తాను ప్ర‌జ‌ల‌కు చేసిన ఎన్నిక‌ల వాగ్డానాల‌ను అమ‌లు చేసే ప‌రిస్థితి పార్టీలో లేద‌ని భావించిన ప‌క్షంలో ఆ పార్టీని విడిచి పెట్ట‌డం త‌ప్ప అత‌డికి మ‌రో ప్ర‌త్యామ్నాయం లేద. ఈ నేప‌థ్యంలో త‌న‌కు చెందిన అధికార పార్టీకి వ్య‌తిరేకంగా స‌భ్యుడు మాట్లాడేందుకు, త‌న ఓట‌ర్ల మ‌నోభావాల‌ను ఆందోళ‌న‌ల‌ను వ్య‌క్తం చేసేందుకు ఫిరాయింపు వ్య‌తిరేక చ‌ట్టం అడ్డంకిగా మారుతుంది.


భార‌త పార్ల‌మెంటు మాజీ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ జిసి మ‌ల్హోత్రా విశ్లేష‌ణ ప్ర‌కారం కామ‌న్వెల్త్ లో  చేర‌ని 25 దేశాల్లో ఏడింటిలోనే ఫిరాయింపు వ్య‌తిరేక చ‌ట్టాలు ఉన్నాయి. ఆ దేశాల‌లోనూ త‌మ పార్టీకి వ్య‌తిరేకంగా ఓటింగ్ వేసినందుకు స‌భ్య‌త్వం కోల్ప‌యిన‌వారు ఎవ‌రూ లేరు. వ్య‌వ‌స్థీకృత ప్ర‌జాస్వామిక దేశాల్లో ఫిరాయింపు వ్య‌తిరేక చ‌ట్టాలు బ‌హు అరుదు, తాజాగా  ప్ర‌జాస్వామ్యం అనుస‌రిస్తున్న దేశాల్లో ఇది సాధార‌ణ‌మే. ప్ర‌జాస్వామ్యంలో రాజ‌కీయ పార్టీల‌పై అంక్ష‌లు ఉండ‌డం స‌హ‌జ‌మే అన్న భావ‌న కొంత‌వ‌ర‌కూ ఉంది. వ్య‌వ‌స్థీకృత ప్ర‌జాస్వామిక దేశాల్లో పార్టీల‌పై కొన్ని అంక్ష‌లు ఉంటాయి.ఇత‌ర దేశాల్లో అవి మ‌రికాస్త ఎక్కువ‌గా ఉంటాయి. చాలా దేశాల్లో ఒక పార్టీ నుంచి మ‌రో పార్టీకి మార‌డం అరుదు.ద‌క్షిణాఫ్రికా, జ‌పాన్‌, జోలీవియా, ఈక్వెడార్‌, నేపాల్‌, ర‌ష్యా, ఫిలిఫైన్స్‌, ఫ్రాన్స్‌, ఇట‌లీ, బ్రెజిల్ వంటి దేశాల్లో ఇది చాలా స‌హ‌జం. రెండు పార్టీల వ్య‌వ‌స్థ ఉన్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో సెనెట్ లోనూ, ప్ర‌తినిదుల స‌భ‌లోనూ ప‌నిచేసిన స‌భ్యులు అప్ప‌డ‌ప్పుడు పార్టీలు మారిన దాఖ‌లాలు లేక‌పోలేదు.

భార‌తీయ ఫిరాయింపు వ్య‌తిరేక చ‌ట్టం వ‌ల్ల కొన్ని ప్ర‌యోజ‌నాలు, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఈ చ‌ట్టం పార్టీల‌లో  క్ర‌మ‌శిక్ష‌ణ పెరిగేలా చేస్తుంది. ఒక పార్టీ నుంచి మ‌రో పార్టీకి మార‌డాన్ని నిరోధించ‌డం ద్వారా ప్ర‌భుత్వ సుస్థిర‌త‌కు తోడ్ప‌డుతుంది, పార్టీ మ‌ద్ద‌తుతో ఎన్నికైన అభ్య‌ర్ధ‌లు పార్టీ మేనిఫెస్టోల ప్రాతిప‌దిక‌న పార్టీ విధానాల‌కు అనుగుణంగా త‌మ రాజ‌కీయ పార్టీకి విదేయుడై ఉండేలా చూస్తుంది. పార్ల‌మెంటు స‌భ్యులు త‌ర‌చు పార్టీల మార‌కుండా చూడ‌డం ద్వారా పార్ల‌మెంటుకు, ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వం జ‌వాబుదారీగా ఉండేలా చేస్తుంది. పార్టీకి వ్య‌తిరేకంగా స‌భ్యుల భావ‌ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ‌కు, పార్టీ విధానాల‌పై స‌భ్యులు అస‌మ్మ‌తిగ‌ళం వినిపించకుండా ఉండేలా క‌ళ్లేం వేస్తుంది.

         రాజ్యాంగం ప‌ద‌వ అధిక‌ర‌ణం స‌భ్యుల అన‌ర్హ‌త‌ల‌కు సంబంధించి సుప్రీంకోర్టు ప‌లు సంద‌ర్భాల్లో త‌న తీర్పుల‌ను వెల్ల‌డించింది.ప‌ద‌వ షెడ్యూల్ భావ‌వ్య‌క్తీక‌ర‌ణ స్వేచ్ఛ మ‌క్కును హ‌రిస్తుందా అన్న సంద‌ర్భంలో పార్ల‌మెంటుకు శాస‌న‌స‌భ‌ల‌కు ఎన్నికైన ప్ర‌జా ప్ర‌తినిధుల ప్ర‌జాస్వామిక హ‌క్కుల‌ను ఈ నిబంధ‌న‌లు అడ్డుకోలేవ‌ని సుప్రీంకోర్టు పేర్కొంది. రాజ్యాంగం  105,194 అధిక‌ర‌ణ‌ల ప్ర‌కారం భావ ప్ర‌క‌ట‌న‌, స్వేచ్ఛ హ‌క్కుల‌కు ఏ నిభంధ‌న ప్ర‌కారం కూడా అడ్డంకులు ఉండ‌బోవ‌ని పేర్కొంది. ఓ స‌భ్యుడు రాజ‌కీయ‌పార్టీ స‌భ్య‌త్వానికి రాజీనామా చేయ‌డం వ‌ల్ల స్వ‌చ్ఛందంగా స‌భ్య‌త్వం వ‌దులుకోవ‌డం అన్న ప‌దానికి విస్తృత అర్థం ఉంటుంద‌ని, స‌భ్యుడి ప్ర‌వ‌ర్త‌న‌, అత‌డు స్వ‌చ్ఛందంగా పార్టీ స‌భ్య‌త్వాన్ని వ‌దులుకోవ‌డానికి దారితీసిన అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి  తీసుకోవ‌ల్సి ఉంటుంద‌ని కోర్టు పేర్కొంది. ఈ సంద‌ర్భంలో కోర్టు ప‌లు ఇత‌ర అంశాల‌ను కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంది. ఒక పార్టీ స‌భ్యుడిని బ‌హిష్య‌రిస్తే అత‌డిని స‌భ‌లో ఏ పార్టీకి చెంద‌ని వ్య‌క్తిగా ప‌రిగ‌ణించ‌వ‌చ్చు.అయినా అత‌డు 10వ షెడ్యూల్ ప్ర‌కారం పాత పార్టీ స‌భ్యుడిగానే కొన‌సాగుతాడు. అత‌డు త‌న పాత పార్టీ స‌భ్య‌త్వానికి స్వ‌చ్ఛందంగానే స్వ‌స్తి చెప్పిన‌ట్లు భావించ‌వ‌చ్చు. ఈ విష‌యంలో స్పీక‌ర్‌దే  తుదినిర్ణ‌యం అని కోర్టు పేర్కొంది. స్పీక‌ర్ తుది నిర్ణ‌యం ప్ర‌క‌టించే వ‌ర‌కూ చ‌ట్టం ప్ర‌కారం నిబంధ‌న‌లు వ‌ర్తిస్తాయి, రాజ్యాంగం ప్ర‌కారం సుప్రీంకోర్టు, హైకోర్టులు న్యాయం ప‌ర‌మైన స‌మీక్ష‌లు చేయ‌వ‌చ్చు. స్పీక‌ర్ల నిర్ణ‌యాల‌కు ముందు ఏ ద‌శ‌లోనూ ఈ స‌మీక్ష‌లు వ‌ర్తించ‌వ‌ని కోర్టు వ్యాఖ్యానించింది.

         పార్టీ పిరాయించిన స‌భ్యుడిని అన‌ర్హుడుగా నిర్ణ‌యించే అధికారాల‌ను శాస‌న స‌భ‌ల స్పీక‌ర్ల‌కో లేదా, చైర్మ‌న్ల‌కో కాకుండా ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు క‌ల్పించాల‌ని రాజ్యాంగం ప‌నితీరును స‌మీక్షించే జాతీయ క‌మిష‌న్ గ‌తంలో సిఫార్సు చేసింది. స‌భ్యుడి అన‌ర్హ‌త‌కు సంబంధించిన అంశం విష‌యంలో స్పీక‌ర్ నిర్ణ‌యంపై అధార‌ప‌డ‌కుండా ఎన్నిక‌ల క‌మిష‌న్ సూచ‌న మేర‌కు రాష్ట్ర‌ప‌తి లేదా, ఆయా రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్లు ఫిరాయింపుదారును అన‌ర్హుడిగా ప్ర‌క‌టించ‌వ‌చ్చ‌ని ఎన్నిక‌ల క‌మిష‌న్‌, ఎథిక్స్ ఇన్  గ‌వ‌ర్నెన్స్ సంస్థ కూడా సిఫార్సులు చేశాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుత ప‌రిణామాల క్ర‌మంలో ఈ అన్ని సూత్రాలు రాష్ట్రం అభివృద్ధికి దోహ‌ద‌ప‌డే అంశాల‌నే సూచిస్తున్నాయి. అంద‌రూ ఏక‌మై దేశ సంక్షేమ‌కోసం ప‌ని చేయాల‌నే సూచిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఇప్ప‌టికే రాజ‌కీయ‌ప‌ర‌మైన‌, అర్థిక  ప‌ర‌మైన సుస్థిర‌త‌ను సాధించింది.ఈ క్ర‌మంలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు అనివార్య‌మ‌య్యాయి. ప్ర‌స్తుత త‌రుణంలో అవి అవ‌స‌రం కూడా.

No comments:

Post a Comment