Wednesday, June 17, 2020

మంథరోపాఖ్యానం శ్రీరాముడి వనవాసానికి నాంది : వనం జ్వాలా నరసింహారావు


మంథరోపాఖ్యానం
శ్రీరాముడి వనవాసానికి నాంది
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రప్రభ, చింతన (18-06-2020) 
           రామపట్టాభిషేకం విషయంలో దశరథుడి నిర్ణయాన్ని హర్షిస్తూ ప్రజలు వాడవాడలా సంబురాలు జరుపుకుంటూ సంతోషంగా మాట్లాడుకోసాగారు. ఎక్కడ చూసినా కోలాహలమే. సందడే సందడి. అంతటా మంగళ వాద్యాలు మోగుతున్నాయి. ఈ నేపధ్యంలో, దశరథుడి ముద్దుల భార్య కైక దాసి మంథర, మర్నాడు పట్టాభిషేకమనగా, ఆ సాయంకాలం, ఆ హడావుడిని మేడ ఎక్కి చూసింది. శ్రీరామ పట్టాభిషేక వార్త వూరంతా తెలిసినప్పటికీ, కైకకు తానే స్వయంగా చెప్పదల్చిన దశరథుడు, ఆ విషయాన్ని ఆమెకు చేరకుండా జాగ్రత్త పడ్డాడు. ఇతరుల ద్వారా ఆమెకా వార్త తెలిస్తే, ఆమె మనస్సులో వికారం కలిగి, ఏదైనా విఘ్నం చేయవచ్చని ఆయన అనుమానం.

శ్రీరాముడి పట్టాభిషేకం తన సొంత కొడుకు పెళ్లిలాగా భావించి, పట్టు వస్త్రాలతో అలంకరించుకుని సంతోషంగా తిరుగుతున్న ఒక స్త్రీ మూర్తిని గమనించింది మంథర. విషయం తెలియని మంథర రాజేమన్నా గొప్ప కార్యం చేస్తున్నాడా అని ఆమెను అడిగింది. మంథర విషపు బుద్ధి తెలియని ఆ స్త్రీ మూర్తి, సంతోషంతో ఉప్పొంగి పోతూ, మంథరతో వున్న విషయం చెప్పింది. మర్నాడు ఉదయం శ్రీరాముడికి దశరథుడు యౌవరాజ్య పట్టాభిషేకం చేయనున్నాడని చెప్పింది. శ్రీరాముడి పట్టాభిషేక వార్త విన్న మంథర, మండిపడుతూ, బిరబిరా పోయి, కైకకు ఆ విషయం, తన మనసులో మాట, వక్ర భాష్యంతో చెప్పింది. 

కైకకు ఏమీ తెలియదని, అందువల్ల ఆమెకు చెడిపోయే కాలం వచ్చిందని, అలా వూరుకుంటే గంటల వ్యవధిలోనే ఆమెకు కీడు కలగవచ్చని అంటుంది. మంథర ఇంకా ఇలా అనసాగింది: "ఓ కైకా! నీ మగడు రేపే శ్రీరాముడిని యువరాజును చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. శ్రీరాముడి పట్టాభిషేకం నాకు ఎలా కీడు కలిగిస్తుందని నువ్వు అంటావేమో? నీకు దుఃఖం కలిగించే విషయం కాబట్టే నేనూ దుఃఖ పడుతున్నాను. ఇక్కడ నీతో అల్లి-బుల్లి మాటలు చెప్తూ, నీ మీదే ప్రాణాలన్నీ నిలిపినట్లు కనిపిస్తున్నాడు నీ మగడు దశరథుడు. అక్కడేమో, నీకు కీడు కలిగే విధంగా, నీ సవతి కౌసల్యకు అన్నీ ఇస్తున్నాడు. దశరథుడు మోసంతో, రాముడికి పట్టాభిషేకం జరిపిస్తే, నువ్వు నీ బంధువులు కూడా చెడిపోరా? నా మాట విను. నీ కొడుకును, నిన్ను, నన్ను రక్షించే ఉపాయం కనిపెట్టు. నీకు మేలైన పని జరగడానికి ఇదే సరైన సమయం. ఇది తప్పిపోతే మరో అవకాశం రాదు. పొరపాటు పడొద్దు" అని మంథర తీరు తీరుగా కైకకు బోధించింది.

         శ్రీరామ పట్టాభిషేకం గురించి మంథర చెప్పిన మాటలకు కైక సంతోషించింది. తన దేహం మీదున్న ఆభరణాలలో శ్రేష్టమైన దానిని ఒకటి తీసి అలాంటి సంతోష వార్త తెలిపిన మంథరకు బహుమానంగా ఇచ్చింది. ఇంతకంటే తనకిష్టమైన వార్త లేదని అంటుంది. రాముడికి పట్టాభిషేకం జరగడం తన కిష్టమైన వార్త అని అన్న కైక మాటలు మంథరకు రుచించలేదు. తన మాట కైక వినడం లేదని కోపమొచ్చింది. ఆమె తనకు ఇచ్చిన సొమ్మును విసిరి పారవేసింది. కైక సంతోషించాల్సిన సమయం కాదు అంటుంది. కైక మనస్సు చీకాకు పడే మాటలు మళ్లీ చెప్పసాగింది మంథర. కైకకు ఎన్నోవిదాలుగా దుర్బోధ చేసింది. ఆమె మనసు మార్చింది. 

మంథర చెప్పింది సబబుగానే అనిపించింది కైకకు. తన కొడుకు రాజు కావడానికి మంచి ఆలోచన, ఉపాయం చెప్పమని అంటుంది. తన కొడుకుకు రాజ్యం రావాలని, రాముడికి పట్టాభిషేకం కాకూడదని అంటుంది. ఉపాయం చెప్తే తప్పక అమలు చేస్తానంటుంది. అలా అడిగిన కైకకు మంథర ఉపాయం చెపుతుందిలా.

"దేవతలు రాక్షసులతో యుద్ధం చేసే సమయంలో, ఇంద్రుడు నీ భర్తను తనకు తోడు రమ్మని అడిగాడు కదా! అప్పుడు దక్షిణ దిక్కున వున్న దండకారణ్యంలో పగవాడైన శంబరుడి పట్టణమైన వైజయంతం మీదకు నీ భర్త దండయాత్రకు పోయేటప్పుడు ఆయన వెంట నువ్వు కూడా వెళ్లావు కదా! ఆ యుద్ధంలో దశరథుడు రాక్షసుల వల్ల గాయపడి, రథం మీద మూర్ఛపోయిన సంగతి గుర్తుంది కదా! మూర్ఛ పోయిన నీ భర్తను, రథాన్ని, ఆపద నుంచి తొలగించి, యుద్ధ భూమి నుంచి దూరంగా తీసుకుని పోయావు నువ్వు. అక్కడికి కూడా తరుముకుంటూ వచ్చిన రాక్షసుల బారిన పడకుండా వేరొక రహస్య ప్రదేశానికి రథాన్ని తోలుకు పోయావు. అలా రెండు సార్లు ప్రాణాపాయం నుంచి కాపాడిన నీకు దశరథుడు రెండు వరాలిచ్చాడు. నువ్వు ఆ వరాలను అప్పుడు కోరలేదు. అక్కరపడి ఇష్టం వచ్చినప్పుడు అడుగుతానంటే, అలాగే కానిమ్మని దశరథుడు అన్నాడు".

          "నీ భర్త నీకు రెండు వరాలిస్తానన్నాడు కదా! అవెలాగ అడగాలో చెప్తా విను. పట్టాభిషేకం కొరకు ప్రస్తుతం రాముడికి చేస్తున్న కార్యక్రమాలన్నిటినీ రద్దు చేసి, అవి భరతుడికి చేయమని అడగడం ఒకటి. రెండోది, పద్నాలుగు సంవత్సరాలు రాముడు అడవులకు వెళ్లాలని కోరడం. ఈ రెండు వరాలు కోరుకో. రాముడు అరణ్యాలకు పోతే, రాజ్యం నిరాటంకంగా భరతుడిదే. కోపం వచ్చిన దాని వలె నటించుతూ, కోప గృహానికి పోయి, నేలమీద చినిగిన గుడ్డ వేసుకుని పడుకో. నీ భర్త నీ దగ్గరకు వచ్చే సమయానికి వగలమారి ఏడుపు మొదలెట్టు. జాగ్రత్తగా నాటక మాడు. మనస్సు దృఢంగా వుంచుకో. వరాలు ఇస్తానని వాగ్దానం తీసుకో. ప్రమాణం చేయించుకుని అడగాల్సిన రెండు వరాలు అడుగు". ఇలా చెప్పిన మంథర తెలివికి ఆశ్చర్యపడి సంతోషంతో ఆమెను మెచ్చుకుంది కైక.


           కైక కోప గృహంలో ప్రవేశించింది. జడను విప్పి విరబోసుకుంటుంది. కటిక నేలమీద పడుకుంటుంది. ఆభరణాలు తీసేస్తుంది. తీసిన ఆభరణాలను ఇంటి నిండా వెదజల్లుతుంది కైక. నేలపై పడుకుని నిట్టూర్పులు విడవడం కొనసాగిస్తుంటుంది.

ఇదిలా వుండగా, శ్రీరాముడి పట్టాభిషేక వార్త కైకకు చెప్పాలనుకుంటాడు దశరథుడు. కైక ఇంటిలోని అంతఃపురంలోకి ప్రవేశించాడు. పడకటింటిలో కైక కొరకు వెతికితే ఆమె కనబడలేదు. తన ప్రియురాలు ఎక్కడి పోయిందో కదా అని వ్యాకుల పడ్డాడు. కైక కోప గృహం చేరిందని కావలి కత్తె వినయంగా జవాబిస్తుంది. ఆమె కోప గృహం చేరిందన్న వార్త విని ఆయన కూడా కోప గృహానికి వెళ్తాడు. కైక కోపానికి కారణం అడిగాడు. ఇలా దశరథుడు పలుకుతుంటే, అతడిని మరింత దుఃఖపడేట్లు చేద్దామనుకుంది కైక. తన కోరిక తీరుస్తానని ప్రమాణం చేస్తే చెప్తాను అంటుంది. ఆమె ఏది కోరితే అదివ్వడానికి సిద్ధం అంటాడు. ఆమె కోరికేంటో త్వరగా చెప్పమంటాడు.

          ప్రమాణం నెపంతో దశరథుడిని కట్టి పడేసిన కైక, లోగడ ఆయన తనకు ఇచ్చిన వరాల విషయాన్ని జ్ఞాపకం చేసుకోమంటుంది. పూర్వం ఒకసారి దేవతలు, రాక్షసులు యుద్ధం చేస్తున్న సందర్భంలో దశరథుడు తనకు ఇచ్చిన రెండు వరాల విషయమూ గుర్తుచేస్తుంది. అవి ఇప్పుడు కావాలని అంటుంది. దశరథుడు, వెనుకా, ముందూ ఆలోచించకుండా, కోరుకొమ్మంటాడు. మొదటి వరంగా, శ్రీరాముడికి దశరథుడు చేస్తున్న పట్టాభిషేక ప్రయత్నం నిలిపి, దానికి బదులుగా, తన కొడుకు భరతుడికి పట్టాభిషేకం చేయమని కోరుతుంది. శ్రీ రామచంద్రుడు నార చీరెలు కట్టుకుని, పద్నాలుగు సంవత్సరాలు దండకారణ్యంలో తిరగాలని, తన మనసులోని కోరికను రెండో వరంగా బయట పెడ్తుంది.

కైకేయి చెప్పిన ములుకుల్లాంటి మాటలను విన్న దశరథుడు, నోట మాట రాక, తత్తర పడి, మూర్ఛపోయాడు కాసేపు. మళ్లీ అతి కష్టం మీద తెలివి తెచ్చుకుని గుండెలు చెదిరేలా దుఃఖించాడు. కైకను పరిపరి విధాలుగా దూషించాడు. రఘు వంశాన్ని నాశనం చేయడానికే వచ్చిందనీ,   చెడ్డ పని తలపెట్టిందనీ, ఎలా తాను అత్యంత ప్రియమైన గారాబు కొడుకు శ్రీరామచంద్రుడిని అడవులకు పొమ్మని ఆజ్ఞాపించగలననీ, రాముడిని విడిచి ఒక్క నిమిషం కూడా బతకలేనేననీ,  శ్రీరాముడిని విడవడం అంటే ప్రాణాలను విడవడమేననీ, ఆమె కాళ్ల మీద పడి సాష్టాంగ నమస్కారం చేస్తాననీ, వరాలు ఉపసంహరించుకోమనీ అంటాడు. ఆ తరువాత, శ్రీరాముడు అడవులకు పోదగిన వాడు కాదని తెలపడానికి ఆయన గుణగణాలను వర్ణించసాగాడు దశరథుడు. ఇలా అంటూ దశరథుడు కైకను వేడుకోవడం మొదలెట్టాడు.

దశరథుడి మాటలకు కోపం అతిశయించగా, కైక, రాజుతో అనసాగింది. "ఏమోయ్ రాజా! వరాలు కోరుకో, నేను ఇస్తానని ప్రమాణం చేసి, నన్ను నమ్మించి, నేను రెండు వరాలు కోరితే, అవి ఇవ్వడానికి ఏడుస్తున్నావు? ఇది నీకు తగిన పనేనా? వగలమారి ఏడుపులతో నన్ను మోసగిద్దామనుకుంటున్నావా? నేను చేసిన ఉపకారానికి ప్రత్యుపకారంగా నా కోరిక తీరుస్తానని నువ్వు ప్రమాణం చేశావు. మరి, ఇవ్వడానికి ఎందుకు ఏడుస్తున్నావు?". ఆ మాటలు విన్న దశరథుడు కైకతో న్యాయ నిష్టూరాలు ఆడాడు.

ఇంకా ఇలా అంటాడు దశరథుడు. "శ్రీరాముడు అరణ్యానికి పోవడంతో నా మరణం సంభవించడం తథ్యం. నా వెంటనే కౌసల్య మరణిస్తుంది. లక్ష్మణుడు అన్నను వదిలి వుండడు. శ్రీరాముడి వెంట అడవులకు పోతాడు. శత్రుఘ్నుడు భరతుడి వెంట మొదలే వెళ్లిపోయాడు. భర్త, ఇద్దరు కొడుకులు తన వెంట లేకపోవడంతో, సుమిత్ర శోక సముద్రంలో మునిగి ఆమే మరణిస్తుంది. పాపాత్మురాలా! నన్ను, కౌసల్యను, సుమిత్రను, న్యాయ వంతులైన రామలక్ష్మణ శత్రుఘ్నలను, దుఃఖంలో ముంచి నువ్వు మాత్రం సర్వ సుఖాలు అనుభవించు. శ్రీరాముడిని విడిచి వుండడం నీ కొడుకుకు ఇష్టమైతే, అలాంటి అధర్మ చరిత్రుడు విడిచే తిలోదకాలు, తండ్రికి చెందవు. మరణించిన నాకు అతడు ఊర్ధ్వలోక క్రియలు చేయకూడదు. నేను మరణిస్తే, శ్రీరాముడు అడవికి పోతే, నువ్వు విధవవై, నీ ఇష్టం వచ్చినట్లు నీ కొడుకుతో సహా నీవే రాజ్యాన్ని ఏలుకో".

దశరథుడు ఇలా తనలోని కోపాన్ని అణచుకోలేక, అనదల్చుకున్న మాటలన్నీ అని, తిట్టదల్చుకున్న వన్నీ తిట్టి, మళ్లీ మెత్తని మాటలతో కైకను బతిమిలాడాడు.

          అప్పుడు భర్తను చూసి కైక ఇలా అన్నది. "ఓ రాజా! నాకు వరాలిస్తానని ప్రమాణం చేశావు కదా! నాకిచ్చిన వరాలను నెరవేర్చు. ధర్మమేంటో ఆలోచించు. చేసిన ప్రమాణం తీర్చడం ధర్మమో, తీర్చకుండుట ధర్మమో ఆలోచించు. ఎందుకు సత్యం తప్పుతావు? ధర్మం విడుస్తావో, శ్రీరాముడిని విడుస్తావో తేల్చుకో. శ్రీరాముడిని ఇవ్వాళే అడవికి పంపు. నువ్వు చేసిన ప్రమాణం తక్షణమే నెరవేర్చకపోతే నీ సాక్షిగా, నీ పాదాల మీద పడి, ప్రాణాలు తీసుకుంటాను". ఇలా తనను బెదిరిస్తున్న కైకను గురించి ఆలోచించసాగాడు దశరథుడు. ఏం చేయాలో తోచక కలత చెందాడు.

ఇదంతా జరిగిన తరువాత, ఇవేమీ తెలియని వశిష్ఠుడు, రాజు వుండే అంతఃపురం సమీపానికి వచ్చాడు. మంత్రి సుమంత్రుడిని చూసి, తన రాక విషయాన్ని వెంటనే దశరథుడికి తెలియచేయమని అడిగాడు వశిష్ఠుడు. మంత్రి సుమంత్రుడు రాజు వద్దకు వెళ్లి, వశిష్ఠుడు ఆయన రాక కొరకై సభా మందిరంలో ఎదురు చూస్తున్నాడనీ, వచ్చి శ్రీరామ పట్టాభిషేక కార్యం నెరవేర్చమనీ అంటాడు.  

అప్పుడు కైక మంత్రి సుమంత్రుడితో, రాజుగారు రమ్మంటున్నారని చెప్పి శ్రీరామచంద్రుడిని పిలుచుకురమ్మంటుంది. శ్రీరాముడిని దర్శించుకున్న సుమంత్రుడు కైకేయి దగ్గరున్న దశరధ మహారాజు, ఆయన్ను చూడాలనుకుని, తన దగ్గరకు తీసుకు రమ్మని తనను పంపాడనీ, అక్కడి రాముడిని రమ్మనీ అంటాడు.

లక్ష్మణ సహితంగా బయల్దేరి, తమ్ముడు తోడు రాగా, అంతఃపురంలోకి వెళ్లాడు శ్రీరాముడు. దశరథుడి పరిస్థితి చూసి విచారపడ్డాడు. అప్పుడు రాముడికి కైక తన వరాల సంగతిని చెప్పింది. తండ్రి మాట పాలించదల్చుకుంటే, వాటిని నెరవేర్చమనీ, పద్నాలుగేండ్లు అరణ్యాలలో సంచరించడానికి తక్షణమే బయల్దేరాలనీ, ఆయన అభిషేకానికై తయారు చేయబడిన సామాగ్రి అంతా భరతుడికి ఇవ్వాలనీ చెప్పింది. వెంటనే రాముడు, తక్షణమే తాను జడలు ధరించి, నార వస్త్రాలు కట్టుకుని, భయంకరమైన అడవులకు పోయి, తండ్రి మాటలు యథార్థం చేస్తానన్నాడు.  

శ్రీరాముడు కైకతో ఇలా అంటాడు: "అడవులకు పోవడం నాకొక కష్ట కార్యమని నువ్వు అనుకుంటున్నావు కదా? అదెంతటి పని? అది నాకొక లక్ష్యమా? భరతుడు వచ్చే దాకా నేనిక్కడ వుంటానని అనుకోవద్దు. నాకు తండ్రి ఆజ్ఞ ఎలాంటిదో తల్లి ఆజ్ఞ కూడా అలాంటిదే. నువ్వు చెప్పినట్లే పద్నాలుగేండ్లు అడవులకు పోతాను. నీ కోరిక నెరవేరుస్తాను. కాకపోతే, నా తల్లికి ఈ విషయం చెప్పి, ఆమె ఆజ్ఞ తీసుకుని, నా భార్యకు చెప్పేంతవరకు ఓపిక పట్టు".

ఇక ఆ తరువాత తల్లి కౌసల్య ఆజ్ఞ, సమ్మతి తీసుకుని సీతా లక్ష్మణ సమేతంగా పద్నాలుగేళ్ల వనవాసానికి పోయాడు శ్రీరాముడు. 
(వాసుదాసు గారి ఆంధ్రవాల్మీకి రామాయణం ఆధారంగా)

No comments:

Post a Comment