Friday, June 12, 2020

కరోనా పరీక్షలపై దురుద్దేశాలు, దుష్ప్రచారాలు : వనం జ్వాలా నరసింహారావు


కరోనా పరీక్షలపై దురుద్దేశాలు, దుష్ప్రచారాలు
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (13-06-2020)

దేశంలో కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్న వ్యవహారం పట్ల, అవలంభిస్తున్న విధి-విధానాల విషయంలో ఒకవైపు సామాజిక మాధ్యమాల్లోనూ, మరో వైపు సంప్రదాయ మీడియాలోనూ చర్చోపచర్చలు, విమర్శలు, ప్రతి విమర్శలు వినవస్తున్నాయి. కొందరైతే, పెద్ద మొత్తంలో ప్రజానీకానికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు తప్పనిసరిగా చేపట్టాలని, కరోనా వున్నా, లేకున్నా, యావత్ ప్రక్రియ సులభతరమైనది అయినా, కాకపోయినా, ప్రతి వ్యక్తికీ  నిర్ధారణ పరీక్షలు చేయించాల్సిందేనని బల్లగుద్ది మరీ చెప్తున్నారు. వారన్నట్లే, ఒకవేళ ఈ నిర్ధారణ పరీక్షలు చేయవలసి వస్తే, చేసి తీరాలంటే,  130 కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో, అందరికీ పూర్తిగా పరీక్షలు చేయాలంటే, ఎన్ని సంవత్సరాల పాటు, ఎన్ని దశాబ్దాల పాటు ఈ పరీక్షలు చేయవలసి వస్తుందో ఎవరైనా అఆలోచించారా? ఆలోచించడానికే ఇది విస్మయానికి గురిచేస్తుంది. అంటే అంత సుదీర్ఘకాలం పాటు మనం కరోనాతో సహజీవనం చేయాల్ననా వారి ఉద్దేశం? అలా, కరోనా కొనసాగాలనే కోరిక వారికి ఉందా? ఈ లోపుల మరోరకం కొత్త తరహా వైరసులు, బాక్టీరియాలు పుట్టుకు రావన్న నమ్మకాన్ని ఇలా మాట్లాడుతున్నవారు ఎవరన్నా కల్పించగలుగుతారా?

మనకు అందుబాటులో వున్న గణాంకాల ఆధారంగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ మన స్వంత భారత వైద్య పరిశోధన కౌన్సిల్ (ఐసీఎంఆర్) వారి నివేదికలు సూచిస్తున్నదేమిటంటే కరోనా వైరస్ సోకిన వారిలో  సుమారు 80 శాతం మంది ఎటువంటి లక్షణాలు కనిపించకుండా వారంతట వారే దాని  నుండి తట్టుకొని బాగు పడి, బతికి, బట్ట గట్ట గలుగుతున్నారని తేల్చారు. వీరిలో కేవలం 20 శాతం మంది, వారిలోనూ కేవలం 0.01  శాతం రోగులు తీవ్ర అనారోగ్యానికి గురైనప్పటికీ చాలావరకు ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో చనిపోవడం జరుగుతోందని తేలింది. పాజిటివ్ కేసుల్లో 98 శాతం మంది ఇంటి వద్దనే హోమ్ క్వారంటైన్ వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతుండగా కేవలం రెండు  శాతం మంది వైద్యం నిమిత్తం ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఈ రకంగా పాజిటివ్ వచ్చిన వారి సంఖ్యతో, చనిపోతున్న వారి సంఖ్యతో పోల్చుకుంటూ పోతే, అసలు కరోనా  వ్యాధి గురించి అంతగా  భయపడవలసిన అవసరం లేదనే చెప్పొచ్చు ఒక విధంగా. అంతమాత్రాన నిర్లక్ష్యంగా వుండమని కాదు. తగు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. లాక్ డౌన్లు, కర్ఫ్యూలు, తదితర నిబంధనలు స్వీయ నియంత్రణ కొరకు, స్వీయ క్రమశిక్షణ కొరకే.

దురదృష్టవశాత్తు కొందరు కొన్ని అసమంజసమైన కారణాలతోనో, లేదా వ్యక్తిగత స్వార్థాలతోనో ప్రజల్లో భయాన్ని పెంపొందిస్తున్నారు. ఈ వైరస్ పట్ల దురుద్దేశంతో భయం కలిగించడం అనేది సమస్య పరిష్కారానికి మార్గం కాకపోయినా జీవితాలను, ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయదానికి ప్రేరకమవుతుంది. రోజూవారి చూసినట్లయితే దేశంలో రోడ్లపై జరిగే ప్రమాదాల్లో వందల సంఖ్యలో జనం చనిపోవడం జరుగుతోంది. దీనికి అర్థం జనం బయటకి రాకూడదు, ప్రయాణాలు చేయకూడదు అని కాదు కదా! అలాగే వివిధ కారణాలతో అనేకమంది చనిపోయినంత మాత్రాన కారణం వెతకాలి కాని, ఏమీ చేయొద్దు అంటే ఎలా? ప్రతిదానికీ తగ్గ నివారణ చర్యలు తీసుకోవడంలో వివేచన, వివేకం ఉంటుంది. భయంతో బిక్కుబిక్కుమంటుంటే రాదు. తగు జాగ్రత్తలతో ముందుకుసాగడం ఉత్తమం.

మానవాళికి జ్ఞాపకం లేనప్పటి నుంచీ, గడిచిన వేలాది సంవత్సరాలలో, తర-తరాల ప్రజలు ఎన్నో రకాల వ్యాధుల నుండి; సంక్రమిత వ్యాధులనుండి; (సహజ) వాతావరణ సంబంధిత వైపరీత్యాల నుండి; మహమ్మారుల నుండి తమని తాము నియంత్రించుకుంటూ, రక్షించుకుంటూ, నయం చేసుకుంటూ వస్తున్నారు.  కాలానుగునంగా వీటన్నింటిని వారు అధిగమిస్తూనే ఉన్నారు. ప్రతి ఆరోగ్య సమస్యకు పరిష్కారం కనుక్కుంటూనే వున్నారు. భగవంతుడు ఇచ్చిన  వరంగా వాటినుండి తట్టుకునే సహజ శక్తిని వారు  పొందుతూనే ఉన్నారు. ఆధునిక పరిభాషలో దీనినే మూకుమ్మడి శక్తి (హెర్డ్ ఇమ్యూనిటీ) గా చెప్పవచ్చు. అలాగే ఎక్కువ శాతం ప్రజల్లో కరోనా  వ్యాధిని తట్టుకునే శక్తి కలిగి ఉండటంతో వారు సహజీవనం కొనసాగించ గలుగుతున్నారు. ఇది కేవలం తట్టుకునే శక్తి లేని  కొందరు ఆరోగ్యరీత్యా బలహీనమైన వారితోనే. వారే దీనిని  ఎదుర్కోనలేకపోతున్నారు. వారి కోసంగా, ప్రభుత్వం వైద్యపరంగా ఆసుపత్రులు, ఇళ్ల వద్దనే కావాల్సిన సేవలను అన్నిరకాలుగా అందిస్తోంది. ఎక్కడా ఏ లోపం లేకుండా చూస్తున్నది.


      ప్రభుత్వ బాధ్యతల్లో ముఖ్యమైనది మెరుగైన ప్రజా వైద్య సేవలు అందించటం. అందుకు కావాల్సినవన్నీ సమకూర్చుకోవాలి. ప్రభుత్వం ఈ విషయం అనునిత్యం చెబుతూనే ఉంది. వారి వద్ద తగిన మందులు, వైద్యులు, మంచాలు, వెంటిలేటర్లు వంటి పరికరాలు అందుబాటులో ఉన్నాయని,  వైద్యం అందించడానికి కావాల్సిన సిబ్బంది, వారికి అవసరమయ్యే మాస్కులు ఎంతమందికి కావాలన్నా ఉన్నాయని చెప్తున్నది. ఇంతేకాకుండా ఆరోగ్య పరిరక్షణ అన్నది ప్రజల వ్యక్తిగత బాధ్యత కూడా. వారికి ఉన్న హక్కులతో పాటు వారి వారి బాధ్యతలను కూడా వారు విస్మరించకూడదు. ఎప్పటికప్పుడు ప్రభుత్వం అందించే సలహాలను, సూచనలను తుచ తప్పక పాటించడం అనివార్యం.

చనిపోయినవారికి కూడా కరోనా  నిర్ధారణ పరీక్షలు చేయటం పట్ల ఏ మాత్రమైనా ప్రయోజనం వున్నదా? లేదా? అన్న విషయం వైద్య రంగ నిపుణులు తేల్చి చెప్పాలి. ఒక అంచనా ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 380 ట్రిలియన్ల వైరస్ లు ఉన్నాయి. దీనినే వైద్య పరిభాషలో "హ్యూమన్ వైరోమ్" అని పిలుస్తారు. ఈ హ్యూమన్ వైరోమ్ అన్నది సమూహంగా  శరీరం లోపల, బయట వ్యాపించి ఉంటుంది. ఈ వైరస్ ల వల్ల మానవ శరీరపు కణాలకు, ఇతర మైక్రోబ్స్ కు చెరుపు చేస్తూ ఉంటాయి. తద్వారా బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. కొన్ని వైరస్ ల వల్ల వ్యాధిగ్రస్తులు కావటం, కొన్నిoటికి స్పందించక పోవడం అన్నది ఒక నిరంతర ప్రక్రియ.  

         అయితే ఈ వైరస్ లు కొన్ని ప్రమాదకరం, ప్రాణాంతకం కాదు. ఇవి కేవలం ఫ్లూ, సాధారణ జలుబు,  లేదా ఎబోలా, డెంగ్యూ, కరోనాకు దారి తీయవచ్చు. మన శరీరంలో నిరోధక శక్తి తగ్గినప్పుడు మాత్రమే దాడిచేస్తాయి. వైరస్ లు అన్నీ కూడా ప్రాణం లేని శరీరంలో జీవించవు. కాబట్టి చనిపోయినవారికి అటాప్సీ ద్వారా కరోనా నిర్ధారణ చేయడం వల్ల ఫలితం మృగ్యం. దీనినే ప్రతిసారి అనుభవజ్ఞులు, నిపుణులు చెబుతూ వస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకానొక కరోనా  సమీక్షా సమావేశంలో చెప్పినట్టుగా రాష్ట్ర మొత్తం మీద రోజుకు తొమ్మిది వందల నుండి 1000 మంది వరకు వివిధ కారణాల రీత్యా ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. వీరందరికీ అటాప్సీ చేయడం హాస్యాస్పదం.

రాష్ట్రంలో ఏదో ఒక మూల రోజుకు ఎవరో ఒకరు చనిపోవటం సహజం. వీరందరికీ కరోనా పరీక్షలు చేయటం అసాధ్యం. ఈ పని మీదే వైద్యులను వినియోగించినట్లయితే ఇతర రోగులను చూసేందుకు వారికి సమయం ఉండదు. అనేక ఇతర కారణాలతో రోగులు వస్తూ ఉంటారు వారిలో గర్భిణీలు కూడా ఉంటారు. కరోనా  బాధితులు ఉంటారు. వారందరినీ కాదని మృతులకు  పరీక్షలు నిర్వర్తిస్తూ కూర్చోవటం అసమంజసం, అసంభవం.  ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కానీ, ఐసీఎంఆర్ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ చనిపోయినవారికి పరీక్షలు నిర్వర్తించాలని ఏనాడూ కోరలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో హైకోర్టు ఇచ్చిన మార్గాదర్శకాల మీద సుప్రీంకోర్టును ఆశ్రయించే దిశగా అడుగులు వేస్తోంది.

ఇక్కడ గమనించాల్సిందిల్లా మహమ్మారులు మానవ శరీరంలోని వైరస్ ల మీద ఏ రకమైన సూచనలు ఇవ్వకుండా  దాడి చేస్తాయి. ఏ ప్రభుత్వానికి ఈ వైరస్ లను ఆపే శక్తి సామర్థ్యాలు వందశాతం ఉండవు. వాటిని నివారించనూ లేవు. వాక్సిన్లు వచ్చేదాకా ఆగాల్సిందే. వ్యక్తిగతంగా ఎవరికి వారు నివారించుకోవాలిసిందే తప్ప ఇతరులు ఎవరూ ఏమీ చేయలేరు. గతంలో కుటుంబ వైద్యులు ముఖ్య భూమిక వహిస్తు ఉండేవారు. ఆ వైద్యుడే వైరస్ దాడిని గుర్తించి తగు నివారణ చర్యలు సూచించి అందుకు వైద్యం చేస్తూ సహాయపడేవారు. ఇప్పుడు కూడా అంతకంటే వేరు మార్గం లేదు.

         ఇప్పటివరకు కరోనా నివారణకు ఏ రకమైన టీకామందు నిర్దేశించబడక పోయిన నేపథ్యంలో ప్రభుత్వాలు చేయాల్సిందల్లా తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన విధంగా ఎంత పెద్ద ఎత్తున, ఎంతమందికి కరోనా సోకినప్పటికీ, ఆ రోగులను పరీక్షించేందుకు సన్నద్దులను చేయటం, వారికి సరైన సమయంలో, సరైన చికిత్స అందచేయడమే. రాష్ట్రంలో ఉన్న వైద్యుల బృందం, అధికారులు కూడా ఇదే విషయం సుస్పష్టంగా చెప్పారు. తాము సన్నద్ధంగా  ఉన్నట్లు ఆ సామర్థ్యం  వారికే ఉన్నట్లు కూడా చెప్పారు. కాకపొతే ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతులు, కరోనా రోగులకు చికిత్స చేయడానికి వెసులు బాటు కల్పించవచ్చు ఇతర రోగాల మాదిరిగా.

కేవలం పుకార్ల మీద, గోరంతను కొండంత చేసి ఆనంద పడే వ్యక్తుల సంకుచిత ఆలోచనల మీద బ్రతికే వారు మాత్రమే గాంధీ ఆసుపత్రిలో రోగులు, కరోనా రోగులు లెక్కకు మించి ఉన్నారు అనే మాటల్ని వ్యాప్తి చేస్తున్నారు. అలాగే వైద్యులు ఇతర సిబ్బంది కరోనా  వ్యాప్తి చేస్తున్నారనీ దుష్ప్రచారం చేస్తూ ప్రజల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా  వైద్యం అందించే వారికి ఈ వ్యాధి సోకే ఆస్కారం ఉంది. కేవలం తెలంగాణకు మాత్రమే ఇది పరిమితమై లేదు. ఐసిఎంఆర్ అంచనాల ప్రకారం దేశంలో 10,000 మందికి, అమెరికాలో 68,000 మందికి, UKలో వ్యాధిగ్రస్తులలో ఇలాంటి 15 శాతం మందికి కరోనా సంక్రమించింది. అలాగే ఇప్పటి వరకు తెలంగాణలో 153 మంది వైద్య సిబ్బందికి మాత్రమే వైరస్ సంక్రమించింది. అయితే ఏ ఒక్కరూ విషమ పరిస్థితిలో లేరు. కేవలం తెలంగాణలోనే ఇలా జరిగింది అన్న ప్రచారం సరైంది కానేకాదు. భయపడటం, భయపెట్టడం, రెండింటికి అర్థం లేదు. సాధించేదీ శూన్యమే.

No comments:

Post a Comment