Wednesday, June 10, 2020

పౌరులు కోరిన ఏలిక రాముడు : వనం జ్వాలా నరసింహారావు


పౌరులు కోరిన ఏలిక రాముడు
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రప్రభ దినపత్రిక, చింతన (11-06-2020)
అసమానమైన గుణాలతో సుసంపన్నుడైన శ్రీరాముడిని అయోధ్యా రాజ్యానికి ఎలా పట్టాభిషిక్తుడిని చేయాలా అని ఆలోచించాడు దశరథుడు. అప్పటికప్పుడే శ్రీరాముడిని రాజుగా చేయాలా? వద్దా? చేస్తే మంచిదా? చేయకుంటేనా? అని పదే-పదే ఆలోచించి, చేయడమే శ్రేయస్కరమని భావించాడు. రాజైన వాడికి ప్రజల అభివృద్ధి కావాలన్న కోరిక వుంటుంది. అలాంటి కోరిక శ్రీరాముడిలో వుందని దశరథుడి నమ్మకం. ప్రతి తండ్రికి, తన కొడుకు తనను మించినవాడైతే మంచిదను కుంటాడు. అలాగే దశరథుడు కూడా. ఇలా ఆలోచించిన దశరథుడు, శ్రీ రామచంద్రమూర్తిని యువరాజు చేయాలని,  మంత్రులతో ఆలోచించి నిశ్చయించుకుంటాడు.

రామ పట్టాభిషేకానికి దశరథుడు తొందరపడటానికి ఇంకో కారణముంది. దశరథుడికి మరణం ఆసన్నమవుతున్నదని సూచనగా కొన్ని అపశకునాలు గోచరించాయి. కాకపోతే, ఆయన అపశకునాలకు భయపడి తీసుకుంటున్న నిర్ణయం కాదు. తాను మిక్కిలి వృద్ధుడవడం, యోగ్యుడు, సమర్థుడు అయిన కుమారుడు, అందునా ఎదిగినవాడుండడం, ఇంకా రాజ్య భారం వహించడం ధర్మం కాదని భావించడం రామ పట్టాభిషేక ప్రయత్నాలను వేగవంతం చేయడానికి కారణాలు. మరణం సమీపంలోనే వున్నందున ఇంకా ఆలశ్యం చేసి ప్రయోజనం లేదనుకుంటాడు దశరథుడు. శ్రీరామచంద్రుడిపై ప్రజలకున్న అనురాగాన్ని గురించి కూడా ఆలోచన చేశాడు దశరథుడు. తనకు, ప్రజలకు ప్రీతి కలిగించే రామ పట్టాభిషేక కార్యాన్ని జరిపించడానికి సరైన సమయం ఆసన్నమైందని గుర్తించిన దశరథుడు, శుభస్య శీఘ్రం అని తలపోశాడు.

రాజైన వాడు, తన తదుపరి తన కొడుకును తన ఇష్ట ప్రకారం పట్టాభిషేకం చేసే అధికారం లేదు. రాజ్యం ప్రజలది. రాజ్యాన్ని పరిపాలించే శక్తి ఎవరికి కలదో, వానినే, పట్టాభిషిక్తుడిని చేసే అధికారం ప్రజల కుంది. ఆ భారం కూడా వారిదే. ప్రజల నిమిత్తం రాజుంటాడు కాని, రాజు కొరకు ప్రజలుండరు. అన్ని విధాలుగా శ్రీరామచంద్రుడు రాజ్యభారం వహించడానికి సమర్థుడని దశరథుడు భావించినప్పటికీ, ప్రజానురాగం వుందని ఆయన నమ్మినప్పటికీ, ప్రజల సమ్మతి లేకుండా అయనకు అలా చేసే అధికారం లేదు కాబట్టి, వారిని సంప్రదించే ఆ పని చేయాలనుకుంటాడు దశరథుడు.

ఆలోచన చేసేందుకు, సామంతరాజులను, ముఖ్య రాజులను, వివిధ దేశాలలో దూరంగా వుండేవారిని, గ్రామాలలో వుండేవారిని దశరథుడు పిలిపించాడు. అందరినీ ఒక్క రోజునే రమ్మని కబురు చేశాడు. తన మాట ప్రకారం అయోధ్యకు వచ్చిన వారందరికీ, వారి వారి యోగ్యతల ప్రకారం తగిన వసతి ఏర్పాట్లు చేశాడు దశరథుడు. రాజులందరు వచ్చిన తరువాత, వారివారి ఆసనములపై కూర్చుండిన తరువాత, దశరథుడు సభ తీరాడు. సభదీరిన దశరథుడు, అక్కడున్న వారందరినీ కలియ చూసి, ఇలా చెప్పసాగాడు.

"ఆర్యులారా! ఇక్ష్వాకుల వంశంలో పుట్టిన నేను, మా పెద్దలు ఏ ప్రకారం ప్రజలకు మేలైన పనులను చేశారో, అలాగే, ఆ మార్గంలోనే నేను కూడా మిక్కిలి హెచ్చరికతో ప్రమాదం లేకుండా, నా శక్తివంచనలేకుండా ప్రజలను రక్షించాను. ఈ విషయం మీ అందరి మనస్సులకు తెల్సిందే! ఎల్లప్పుడూ ప్రజలకు మేలైన పనులే చేయాలని కోరుకునే నా శరీరం, వార్ధక్యానికి గురైంది. నాకు అరవై వేల వయస్సు కొరతలేకుండా గడిచింది. దేహం దుర్బలమైంది. జ్ఞాపకశక్తి క్షీణించకముందే, మతి మరుపు రాక ముందే, కర్తవ్యాన్ని మరిచి ఒకదానికి బదులు ఇంకొక టి చేయడానికి ముందే, అలాంటి స్థితి రాక ముందే, ఈ రాజ్య భారాన్ని వదిలించుకుని సుఖపడాలని కోరుకుంటున్నాను".

"రాజ్య భారాన్ని దీర్ఘకాలం మోసి-మోసి, ఇక ఈ భారాన్ని తొలగించుకొని సుఖపడాలని ఆశతో వున్నాను. అలా చేయడానికి మీ అందరి అనుమతి కావాలి. అలాంటప్పుడు ఈ రాజ్యం గతి ఏంటి? ప్రజలందరిని ఏం చేసి పోతావు అని అంటారేమో? నాకు తోచిన రీతిలో దానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తాను. మీ కిష్టమైతే దానికి మీ అంగీకారం తెలపండి. అదేంటని అంటారా? ఇక్కడున్న ద్విజులందరికీ సమ్మతమైతే, మీరందరూ ఒక్క మాటతో, నిండు మనస్సుతో, అంగీకరించి సరైనదే అంటే, నా పెద్ద కుమారుడు, శ్రీరాముడిని, మీ అభిప్రాయం తెలుసుకుని, యువరాజుగా చేయాలనుకుంటున్నాను".


"వాస్తవానికి రాముడు మూడు లోకాలను ఏల తగినవాడే. ఇక మీ సమ్మతి తెలపడమే ఆలస్యం. శీఘ్రంగా నేను ఈ భూ భారాన్ని శ్రీరాముడికి అప్పగించి, సుఖపడతాను. నేను చెప్పిన ఈ ఆలోచన సమంజసమని మీకు అనిపించితే, దానికి మీ సమ్మతి తెలపండి. ఒక వేళ నా ఆలోచన మీకు నచ్చకపోతే, ఇంతకంటే మేలైన ఆలోచన తెలపండి. నేను చెప్పిన ఆలోచన కాబట్టి, అంగీకరించకపోతే నేను నొచ్చుకుంటానని భావించవలదు. రాముడు నా కొడుకు కాబట్టి, పుత్ర వాత్సల్యంతో చెప్పాను. కార్యాలోచనలో అయినవారి ఆలోచన పక్షపాతంతో కూడి వుండవచ్చు. మధ్యవర్తుల ఆలోచన మేలైందిగా వుంటుంది. ఉదాసీన మనుష్యుల ఆలోచన పనికిరాదు. రాముడి రాజ్యంలో సుఖపడవలసిన వారు మీరు. రామ పక్షపాతంతో నేను చెప్పిన ఆలోచనకంటే మధ్యవర్తులైన మీ ఆలోచనే మేలు".

ఇలా దశరథుడు చెప్పడంతో, రాజులందరూ, మేలు-మేలు అని, బాగు-బాగు అని కేకలు వేశారు. దశరథుడిని శ్లాఘించారు. బ్రాహ్మణ శ్రేష్టులు, పౌరులు, గ్రామజనులందరు, కలిసి మాట్లాడుకుని, ఏకాభిప్రాయానికి వచ్చారు. దశరథుడు ఎన్నో వేల సంవత్సరాలనుండి రాజ్యాన్ని పాలించుతున్నాడని, ముసలివాడైనాడని అంటూ, రాజ్యపాలనకు శ్రీరామచంద్రుడిని యువరాజుగా చేయమని కోరారు. సభలో వున్న ప్రముఖులందరూ, ఒకే మాటగా చెప్పడంతో, వారి వుద్దేశం రాముడి మీద ప్రేమా? తన మీద కోపమా? తెలుసుకోవాలని భావించాడు దశరథుడు.

"రాజులారా! రాముడిని యువరాజుని చేస్తానని నా నోటి వెంట మాట వచ్చినదే తడవుగా, మీరు పూర్తిగా వినీ-వినకుండానే దానికి సమ్మతించి ఆయనను ప్రభువుగా వుండాలని కోరుతున్నారు. ఇదంతా చూస్తుంటే నాకేదో సందేహంగా వుంది. నా పరిపాలనలో ఏదో లోపం వుందని మీరు భావిస్తున్నట్లు అర్థమవుతోంది. నా పాలన తొలగిపోతే మంచిదని మీరు అనుకుంటున్నట్లుగా వుంది. ఇది వాస్తవమేనా? లేక నిజంగా రాముడి మీద ప్రేమా? నిజం చెప్పండి. వాస్తవంగా మీ అభిప్రాయం వెల్లడించండి". అని వారిని ఒకవైపు ప్రశ్నించినప్పటికీ, లోలోన మాత్రం తన అభిప్రాయాన్ని సర్వజనులు ఆమోదించినందుకు, సంతోషించాడు దశరథుడు.

దశరథుడి ప్రశ్నలకు సమాధానంగా, అక్కడున్న వారందరు పండిత, పామర అనే భేదం లేకుండా, ఒకే మాటగా ఇలా చెప్పారు: "రాజా! దేవుడితో సమానుడైన రాముడిలో ఆనందకరమైన అనేక కల్యాణ గుణాలున్నాయి కాని, హేయ గుణం ఒక్కటి కూడా కానరాదు. రాముడు నీ కొడుకైనందున ఆయన మహిమ నీకు తెలిసి వుండకపోవచ్చు. శ్రీరాముడికి సత్యమే శౌర్యం. శౌర్యం ద్వారా నెరవేరాల్సిన పనులు కూడా ఆయన విషయంలో శౌర్యంతో సంబంధం లేకుండానే, సత్యం వల్ల కలుగుతాయి. శౌర్యం చూపాల్సి వచ్చినప్పుడు సత్యం తప్పడు. సాక్షాత్తు నారాయణుడితో సమానుడు. ఇక్ష్వాకుడి వంశంలో పుట్టిన గొప్పవారిలో శ్రేష్టుడు. ధర్మానికి ప్రతీక. రాముడిని శత్రువులు, మిత్రులు కూడా పొగుడుతారు. రాముడే లేకపోతే లోకంలో ధర్మం లేనే లేదు".

"రాజా! నీ కొడుకు సమస్త ప్రజలను సంతోష పెట్తాడు. నిష్కల్మషమైన ఓర్పులో భూమికి సమానుడు. అసమానమైన బుద్ధిలో దేవతల గురువైన బృహస్పతికి సమానుడు. సామాన్య ధర్మాలు, విశిష్ట ధర్మాలు, సకల ధర్మాలు తెలిసినవాడు. తప్పు చేసినవారిని కూడా ఆదరించే గుణం కలవాడు. కాఠిన్యం కనబరచడు. వెన్నలాంటి మనసున్న దయామయుడు. దేవతలకు, మనుష్యులకు, రాక్షసులకు తెలియని అనేక శస్త్రాస్త్రాలను సమ ధర్మంగా తెలిసిన పండితుడు. వేద-వేదాంగాలను అర్థ సహితంగా తెలుసుకున్నవారిలో సమర్థుడు. శాస్త్ర పాండిత్యంలో రాముడిని మించినవారు లేరు. ఇలాంటి గొప్ప గుణాలు, గొప్ప బుద్ధి కలగడానికి కారణం, గొప్ప వారైన తల్లిదండ్రుల వంశంలో పుట్టినందువల్లే! బంగారానికి మెరుగుపెట్టినట్లే, రాముడు స్వసద్గుణాలవల్ల మిక్కిలి గొప్పవాడయ్యాడు. సర్వకాలాలోను నిర్మలమైన మనసున్నవాడయ్యాడు. శరణు కోరితే వారెంత కీడు చేసినా దయతో రక్షించే గుణం కలవాడు".

"ఎన్ని కష్టాలు కలిగినా, సత్యం తప్పితే కష్టాలు తొలగుతాయన్న భావనకు దూరంగా సత్యం తప్పని సమర్థుడు. ఎవరి విషయంలోనైనా సంతోషిస్తే మేలు చేయడం, కోపగిస్తే కీడు చేయడం ఆయన నైజం. రాముడిని ఆశ్రయించినవారికి మేలు తప్పక కలుగుతుంది. ఆయన వున్న చోట జనన-మరణ-శత్రు-దారిద్ర్యాది భయాలు దరికి రావు. శ్రీమన్నారాయణుడుకి ఎలాంటి చిహ్నాలున్నాయని శాస్త్రాలు చెవ్తున్నాయో అలాంటి చిహ్నాలే శ్రీరాముడికి వుండడం వల్ల ఆయనను చూసినవారు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే తమకు ప్రత్యక్షమైనాడని భావించే లాంటి సౌందర్యవంతుడు రాముడు. రామబాణం ఎప్పుడూ గురితప్పలేదు. మనుష్యులలో కనిపించని గొప్ప మహిమ కలవాడు".

"రాజా! శ్రీరామచంద్రమూర్తి ఈ రాజ్యాన్ని పాలించడానికి యోగ్యుడా? అని మా అభిప్రాయం అడిగావు. తుచ్చమైన ఈ లోకాన్నే కాదు. మూడు లోకాలను పాలింప సమర్థుడు. దుష్ట శిక్షణకు కావాల్సిన ధైర్య-శౌర్య-వీర్య-పరాక్రమాలను, సాధు రక్షణకు అవసరమైన శాంతి-దాంతి లాంటి సద్గుణాలను, ధర్మ సంస్థాపనకు కావాల్సిన సత్య గుణాలను కలిగిన రాముడిని ఇక్కడున్న మేం నలుగురం మాత్రమేకాదు, భూ ప్రజలందరు ఆయననే ఏకగ్రీవంగా తమ పతిగా వరించారు. వారందరి అభిప్రాయమే మేం తెలుపుతున్నాం. ఈ విషయంలో భిన్నాభిప్రాయం లేనే లేదు. రాజా నీవు చాలా పుణ్యవంతుడివి. పుత్ర శబ్దాన్ని సార్ధకం చేస్తూ, పున్నామ నరకాన్నుంచి తప్పించడం మాత్రమే కాకుండా, తక్కిన పుణ్యాలను చెడకుండా రక్షించుతూ, రాజులు అవశ్యం పోవాల్సిన నరకానికి నిన్ను పోకుండా రక్షించగలవాడిని-రాముడిని కొడుకుగా కన్నావు. ఇంకొకరు కొడుకై పుట్తే, కాముకుడవైన నిన్ను, నరకానికి పోకుండా కాపాడగలిగేవాడు కాదు. నువ్వు కూడా యోగ్యుడవైనందునే మరీచికి కశ్యపుడు కొడుకైనట్లు మహర్షి తుల్యుడైన రాముడు నీ కుమారుడైనాడు. ఆయన తండ్రిగా స్వీకరించడానికి నీవే తగినవాడివి".

"రాజా! రాముడికి ఎల్లప్పుడూ సుఖమే కలగాలి. ’రాముడు దీర్ఘకాలం జీవించాలి. రాముడికి వ్యాధులవల్ల బాధలు కలగకుండా వుండాలి. రాముడి దేహబలం వర్ధిల్లాలి’. ఈ విధంగా దేవతలు, గంధర్వులు, ఋషులు, పన్నగులు దేశ-దేశాల్లోనే కాక గ్రామాల నుంచి పట్టణాల దాకా సర్వకాలాలోను కోరుకుంటున్నారు. రామచంద్రుడి విషయంలో వీరూ-వారూ అనే భేదం లేకుండా, సర్వదా అందరూ ఆయనను తప్ప ఇతరులను తలచడం లేదు. నల్ల కలువల లాంటి నీలమైన దేహ కాంతి కలవాడిని, పగ వారి పొగరు అణచువాడిని, సర్వజనులు సర్వ వేళల ఉచ్చరించే నామం కలవాడిని, దయా గుణం కలవాడిని, అందమైన చెక్కిళ్లు కలవాడిని, కొత్త యవ్వనమందుండువాడిని, యశస్సు వల్ల నిండిన లోకం కలవాడిని, సముద్రం లాగానే లోతు తెలియని వాడిని, పర్వతంలాగా చలించని వాడిని, సజ్జనులందు-సాజ్యంలోను అదే శక్తిగల సత్యాన్ని-ధర్మాన్ని కలిగివుండిన వాడిని, ఇంపుగా-మెత్తగా మాట్లాడువాడిని, దోష రహితుడిని, దేవాది దేవుడితో సమానుడైన వాడిని, శ్రీరామచంద్రమూర్తిని యువరాజుగా కళ్లారా చూసి సంతోషించాలని వుంది రాజా! కాబట్టి, మా మేలును కోరి, మా కోరిక నెరవేర్చు" అని అంటారు.

ఈ విధంగా పౌరుల సమ్మతి తీసుకుని శ్రీరాముడికి పట్టాభిషేకం చేయాలన్న నిర్ణయానికి వచ్చాడు దశరథుడు. కాకపొతే, విధి వక్రించి, కైకేయి వరాల మూలాన ఆయన వనవాసానికి పోవాల్సి వచ్చింది. అది వేరే విషయం.

వాస్తవానికి, శ్రీరాముడిపై ఘాటు ప్రేమ, భక్తి కలిగిన వారందరికీ, శ్రీరాముడి నిర్యాణ కాలంలో ముక్తి లభించింది.
(వాసుదాసు గారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)

No comments:

Post a Comment