Thursday, June 25, 2020

దార్శనికుడు, కార్యదక్షుడు : వనం జ్వాలా నరసింహారావు


దార్శనికుడు, కార్యదక్షుడు
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (26-06-2020)
            తత్త్వశాస్త్ర వేత్తలే సమాజానికి, దేశాలకు ఉత్తమమైన పాలకులు అని ప్రాచీన గ్రీకు తాత్త్వికుడు ప్లేటో ఉద్ఘాటించారు. తత్త్వవేత్తలే పాలనలో న్యాయాన్ని ధర్మాన్ని సమానంగా, సమతుల్యంగా స్వీకరిస్తారని ఆయన అంటారు. ఇతరులకు అది అంతగా చేతకాదు. అలాగే చాణక్యుడిగా ప్రసిద్దికెక్కిన అర్థశాస్త్ర రచయిత కౌటిల్యుడి అభిప్రాయం ప్రకారం, సానుకూల, ప్రతికూల భావోద్వేగాలను  అర్థం చేసుకుని తదనుగుణంగా పాలన చేసినప్పుడే ఎవరైనా మంచి నాయకుడు కాగలడు. ఒక వ్యక్తి మంచి, చెడు రెండింటినీ ఒకే సమయంలో, ఒకే కోణంలో చూసినప్పుడు, తనంతట తానుగా ఏకకాలంలో నిర్ణయానికి రాగలిగినప్పుడే మంచి నాయకుడు కాగలడు అని కూడా కౌటిల్యుడి విశ్వాసం.

దివంగత భారత ప్రధాని పివి నరసింహారావు ఈ లక్షణాలన్నీ పుణికి పుచ్చుకున్న ఏకైక వ్యక్తి అనడంలో అతిశయోక్తి లేదేమో! ఒక తత్త్వ వేత్త అయిన ప్రధానిగా, ఒక ఆర్ధిక వేత్త అయిన ప్రధానిగా, ఒక సామాజిక వేత్త అయిన ప్రధానిగా, ఒక ఒక రాజకీయవేత్త అయిన ప్రధానిగా, ఒక భాషావేత్త అయిన ప్రధానిగా, ఒక అభ్యుదయ వేత్త అయిన ప్రధానిగా, ఒక విద్యావేత్త అయిన ప్రధానిగా, అన్నింటినీ కలగలపిన ఒక బహుముఖ ప్రజ్ఞాశీలిగా  పీవీ చరిత్ర పుటల్లో నిలిచి పోయారు. 

భారత దేశం, ఆమాటకొస్తే, యావత్ ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రస్తుత వర్తమాన పరీక్షా కాలంలో, సామాన్య మానవుడి మనుగడే ప్రశ్నార్ధకమవుతున్న కరోనా సంక్షోభ సమయంలో, వ్యక్తిదీ, వ్యవస్థదీ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పుతున్న నేపధ్యంలో,  ప్రతి ఒక్కరికీ స్ఫురణకు వచ్చేది అలనాటి పివి నరసింహారావు రాజనీతిజ్ఞత, ఆర్ధిక సంస్కరణాభిలాష. ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి ఆర్ధిక సంక్షోభాన్ని, అత్యంత చాకచక్యంగా, దేశానికి బంగారు బాట వేసి, దిశా నిర్దేశం చేశారు. వాటి ఫలితాలు, ఫలాలు ఇటీవలి కాలం వరకు మనమంతా అనుభవిస్తూనే ఉన్నాము. వాటి నుండి పాఠాలు నేర్చుకోవడంలో మాత్రం ఒక అడుగు వెనక్కే వున్నామనాలి.

అందుకే పీవీని స్మరించు కోవటం సదా మన కర్తవ్యం, మన నైతిక బాధ్యత, మన కనీస ధర్మం. అత్యున్నత వ్యక్తిత్వం కలిగి ఉండటం పివి సొంతం. భారత రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవస్థ సుస్థిరతకు ఆయన అందించిన విలువైన నాయకత్వం సదా స్మరనీయం. ఈ ఏడాది జూన్ 28 నుండి (1921 లో జన్మించిన) పివి శత జయంతి ఆరంభ సందర్భంగా ఆయన చేసిన అసమానమైన సేవలను గుర్తుచేసుకోవడం మనం ఆయనకు అందించే గొప్ప నివాళి. ఆయన పట్ల కృతజ్ఞతా పూర్వకంగా దీక్షా దక్షుడు, చిరస్మరణీయుడు అయిన ఒక నాయకుడికి, రచయితకు, ఒక ఆలోచనాపరుడుకి ఏం చేసినా, ఎంత చేసినా తక్కువే!

పీవీ జీవిత కాలంలో అనేక సందర్భాలలో, ఆయనను, అత్యంత తక్కువగా అంచనా వేశారు కొందరు మహనీయులు. అయితే అదే పీవీ, భారతదేశాన్ని ఒక ప్రధాన సమాచార సాంకేతిక భాండాగారంగా పరివర్తన చెందడానికి,  దేశాన్ని బంగారం తాకట్టు పెట్టాల్సిన స్థితి నుంచి తప్పించడానికి, దరిమిలా అభివృద్ధి పథంలో నడిపించడానికి, ఒక సూపర పవర్ గా తీర్చి దిద్దడానికి   కారణభూతుడైన ధీశాలి అయ్యాడు. దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు,  ఆర్థిక ప్రపంచంలో విశ్వసనీయత కోల్పోతున్నప్పుడు, అసమానమైన, మునుపెన్నడూ కనీ-వినీ ఎరుగని రీతిలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి, మార్కెట్ సరళీకరణ విధానాన్ని రూపొందించాడు. దురదృష్టవశాత్తూ పివి ఆశయాలకు చేరువగా ఆయన రూపకల్పన చేసిన  ప్రైవేటీకరణ, ఆర్థిక సరళీకరణ తదనంతర ప్రభుత్వాలు కొనసాగించలేకపోయాయి. కొంతలో కొంత అయితే అమలు చేశాయి.

పివి జీవితాన్ని, అతని భవిష్యత్ దర్శినిని, రాజకీయ జీవితాన్ని గురించి విపులంగా, ఆయనను అనుసరించిన వారందరికీ తెలుసు. అతను సమాజం గురించి ఎప్పుడూ ఆలోచించే దార్శనికుడని, స్వార్థపూరిత ఆలోచనలను ఎప్పుడూ చేయలేదని అందరికీ తెలుసు. ఉమ్మడి అంధ్రప్రదేశ్ రాష్ట్రం లో విద్యాశాఖ మంత్రిగా సేవలు అందించినప్పుడు, పేదలకు రెసిడెన్షియల్ విద్యావ్యవస్థను తొలిసారిగా పరిచయం చేసిన ఘనత ఆయనదే. కేంద్రంలో మానవ వనరుల మంత్రిగా ఉన్నప్పుడు ఇదే ఆలోచనను నవోదయ విద్యాలయాల రూపంలో జాతీయ స్థాయిలో ప్రవేశ పెట్టిన ఘనత కూడా ఆయనదే. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రులుగా ఉన్న రోజుల్లో జాతీయ విద్యా విధానం  రూపొందించిన వ్యక్తి విద్యావేత్త పీవీ నరసింహారావు.

సమైక్య ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, యాభై సంవత్సరాల క్రితం, ఆగస్టు 30, 1972, శాసనసభలో ప్రసిద్ధ భూసంస్కరణల బిల్లు ప్రవేశపెట్టిన ఘనత పీవీ సొంతం. ఇది తొలిసారిగా వినూత్నమైన భూ సంస్కరణల బిల్లు. దేశంలో ఎక్కడైనా ఇదే మొదటిది. పివి అప్పుడు తీసుకువచ్చిన భూసంస్కరణలు భూస్వామ్య జమీందార్ వ్యవస్థను సమూలంగా నిర్మూలించదానికి బాటలు వేశాయి, భూమిలేని పేదలను చిన్న-చిన్న కమతాల యజమానులుగా మారడానికి సహాయపడ్డాయి. పేద వారికి సమాజంలో గౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. పివి తరువాత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు రాష్ట్రంలో భూ రికార్డులను సరిదిద్దడం, శుద్ధి చేయడం, నవీకరించడం చేపట్టి అమలుపర్చారు.


శాసనసభలో భూసంస్కరణల బిల్లును ప్రవేశపెట్టుతూ, పివి చేసిన ప్రసంగం చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. భూసంస్కరణల ఆవశ్యకత, పెద్ద కమతాలు ప్రజలను ఎలా అహంకారపూరితులను చేస్తాయి, కొద్దిపాటి భూమి వున్న పేదరైతు సమాజంలో గౌరవంగా నిలబడేలా ఎలా చేస్తాయి, భూమిలేని నిరుపేదలను జాగ్రత్తగా చూసుకోవలసిన అవసరం, భూమి ఎందుకు దున్నేవారికే ఇవ్వాలి అన్న అంశాలను పీవీ సమయోచితంగా ప్రస్తావించారు. మహిళల హక్కుల గురించి, భారతీయ చట్టం ప్రకారం హిందూ అవిభక్త కుటుంబం యొక్క వారసత్వ చట్టాన్ని పరిపాలించే రెండు న్యాయ పరమైన అంశాల గురించి అనర్గళంగా మాట్లాడాడు. భూస్వాములు తమ పెంపుడు కుక్కలు, పిల్లులు మొదలైన వాటిపై తమ భూములను బదిలీ చేయడానికి దోహద పడే విధంగా, బిల్లు ఆమోదం ఆలస్యం చేయవద్దని ఆయన సభను కోరారు.

దురదృష్టవశాత్తు, భూసంస్కరణల లాంటి అభివృద్ధి చర్య గిట్టని ఆయన సొంత పార్టీకి చెందిన ప్రగతిశీల వ్యతిరేక ముఠా ఆయన కుర్చీని లాగివేయటం జరిగింది. బహుశా అప్పుడు వారికి తెలియదు కాబోలు, ఒక రోజు పీవీ దేశాన్ని నడిపించడానికి అంచెలంచలుగా నాయకత్వ నిచ్చెన ఎక్కుతాడని, ప్రధాన మంత్రి అవుతాడని.

రాజకీయాల నుండి దాదాపు విరమణ చేసిన నేపధ్యంలో,  పీవీ అడగకుండానే ప్రధాని అయ్యారు. పివి తన ప్రత్యేక శైలి, మార్క్ తో దేశాన్ని పరిపాలించే అవకాశాన్ని పొందారు. నెహ్రూ-గాంధీల కుటుంబానికి చెందని వ్యక్తిగా, పూర్తి అయిదు సంవత్సరాల పాటు ప్రధానిగా పనిచేసిన మొదటి వ్యక్తి పివి. దేశంలో పివి బాధ్యతలు స్వీకరించిన నాటి పరిస్థితి దారుణంగా వుండేది. బాలెన్స్ ఆఫ్ పేమెంట్స్  ప్రమాదకరమైన స్థితిలో ఉంది. ఇది చాలా తీవ్రమైనది. అంతర్జాతీయ ద్రవ్య నిధికి  రుణం కోసం 47 టన్నుల బంగారు నిల్వలను విమానంలో దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. భారతదేశం ఎప్పటికైనా కోలుకుంటుందని అప్పట్లో ఎవరూ అనుకోలేదు! కానీ అది అద్భుతంగా , సమర్థవంతంగా, యావత్ ప్రపంచం అబ్బురపడే విధంగా పీవీ హయాంలో  జరిగింది.

ప్రభుత్వ రంగంలో కొంత భాగం ప్రైవేటీకరించబడింది, వ్యవస్థాపిత పోటీకి దారితీసే లైసెన్స్ రాజ్ రద్దు చేయబడింది, రాష్ట్ర నియంత్రణ, అధికార నిత్య కృత్య పద్దతి తగ్గించబడ్డాయి. ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించడానికి విదేశీ పెట్టుబడులపై విధానాలు సవరించబడ్డాయి. బహుభాషా కోవిదుడుగా పివి స్వయంగా ఒక చేయితిరిగిన రచయిత గా తన జ్ఞాపకాలను ‘ది ఇన్సైడర్’ పుస్తకంలో పొందుపరచారు. అంతకు చాలా సంవత్సరాల క్రితమే, జ్ఞానపీఠ ఆవార్డు గ్రహీత విశ్వనాధ సత్యనారాయణ రచించిన “వేయిపడగలు” తెలుగు పుస్తకాన్ని హిందీలోకి “సహస్రఫన్” గా అనువదించారు. ఎడతెగని, క్షణమైనా తీరికలేని రాజకీయ కార్యకలాపాలు ఉన్నప్పటికీ,  అన్ని భాషలలోని ప్రముఖ రచయితలతో పీవీ క్రమం తప్పకుండా సంబంధాలు కొనసాగించారు. పివి 17 భాషలలో నిష్ణాతులు కావడంతో పాటు ఆర్థికశాస్త్రం, చట్టం, చరిత్ర, రాజకీయాలు, కళలలో కూడా ప్రావీణ్యం ఉంది.

దురదృష్టవశాత్తు, కారణాలేవైనా, పీవీని, ఆయన అభిమానించిన, ఆరాధించిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, ఒక  సమర్థ నాయకుడిగా పరిగణించలేదు. పోనీ, గుర్తించలేదు. బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో పీవీ పోషించిన పాత్రపై అర్జున్ సింగ్ వంటి నాయకులు ఆయన మరణానంతరం అతని గురించి అనేక రకమైన విమర్శలు చేశారు. ఏవేవో రాశారు. మధు లిమాయే వంటి సోషలిస్టు నాయకులు, కుల్దీప్ నాయర్ వంటి ప్రముఖ జర్నలిస్టులు కూడా ఆయన్ను అనేక రకాలుగా విమర్శించారు. అవన్నీ తప్పని పీవీతో కలిసి పనిచేసిన ప్రముఖులు ఎందరో పత్రికా ముఖంగా చెప్పారు కూడా.

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు, అప్పటి యుపిఎ చైర్పర్సన్ సోనియా గాంధీ, ఏ కారణం చేతనో, పీవీ మరణానంతరం ఆయన పార్థివ దేహాన్ని ఎఐసిసి ప్రధాన కార్యాలయంలోకి తీసుకుపోవడానికి అంగీకరించ లేదు. అంత్యక్రియలకు హైదరాబాద్ తీసుకువచ్చినప్పుడు, అప్పటి కాంగ్రెస్ పాలనలో కూడా అంత గొప్ప వ్యక్తికి తగిన గౌరవం లభించలేదు అనే చెప్పాలి.  ఆయన మరణించిన తరువాత కూడా ఆయనకు జరిగిన అవమానాన్ని గురించి ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ పలు బహిరంగ సభలలో బహిరంగంగా మాట్లాడారు కూడా.

స్థితప్రజ్ఞతకి, మూర్తీభవించిన వ్యక్తిత్వానికి నిలువెత్తు నిదర్శనం పీవీ. రాజకీయ జీవితంలో పీవీ ఎల్లప్పుడూ స్థిరత్వాన్ని కొనసాగించారు. జెఎంఎం లంచాల కుంభకోణంలో మేజిస్ట్రేట్ కోర్టు అతనికి మూడు సంవత్సరాల శిక్ష విధించినప్పుడు, తీర్పు ఇస్తూ, మేజిస్ట్రేట్ అజిత్ భరిహోక్ పివిపై పలు వ్యాఖ్యలు చేసినప్పుడు, ఆయన్నొక నేరస్థుడిలాగా ముద్ర వేసినప్పుడు, అదే విషయానికి మీడియాలో బహుళ ప్రచారం జరిగినప్పుడు, పీవీ స్పందన పరిపూర్ణ నిశ్శబ్దం. ఈ కేసులన్నిటిలోనూ ఆయన నిర్దోషి అని తేలినప్పుడు అదే మీడియా తగు రీతిలో స్పందించలేదు.

తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ, పీవీ జయంతి, వర్ధంతి ఉత్సవాలను ఘనంగా, అధికారికంగా ఏటేటా నిర్వహిస్తున్నారు. ఆయన శతజయంతి ఉత్సవాలను ఏడాదిపాటు ఘనంగా నిర్వహించడానికి రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కేశవరావు అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేశారు సీఎం. వాస్తవానికి ఈ ఉత్సవాలు జాతీయ స్థాయిలో, అన్ని రాష్ట్రాలలో నిర్వహించాలి. అందుకు అనుగుణంగా ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అలానే తెలంగాణ బాటలో ఇతర రాష్ట్రాలు కూడా శత జయంతి ఉత్సవాలను నిర్వహించాలి. ఆర్ధిక సంస్కరణల రూప శిల్పి, ఈ మిల్లీనియం నాయకుడు స్వర్గీయ పీవీ నరసింహారావుకు అదే భారత ప్రజల ఘనమైన నివాళి.
(పివి నరసింహారావు శత జయంతి సంవత్సరం ఉత్సవాల నేపధ్యంలో) 

No comments:

Post a Comment