Tuesday, November 15, 2011

వైజాగ్ లో డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తిగారి మెడిసిన్ (1945-50-52) చదువు: వనం జ్వాలా నరసింహారావు

తీపి గుర్తులు - చేదు అనుభవాలు: అధ్యాయం 2

డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తిగారి మెడిసిన్ (1945-50-52) చదువు

వనం జ్వాలా నరసింహారావు

(మాజీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సిపిఐ(ఎం) నాయకుడు, ప్రజా వైద్యుడుగా పేరు తెచ్చుకున్న డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తిగారి జీవితచరిత్రను "తీపి గుర్తులు-చేదు అనుభవాలు" గా గ్రంధస్థం చెసే అవకాశం కలిగింది నాకు. 36 అధ్యాయాల ఆ పుస్తకంలోని వివరాలలో రెండో అధ్యాయం ఇది)

ఆ రోజుల్లో ఐదున్నర సంవత్సరాల ఎంబిబిఎస్ కోర్సులో మొదటి ఆరునెలలు "ప్రీ రిజిస్ట్రేషన్" అనేవారు. ఆ ఆరు మాసాలు బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ (బి.ఎస్సీ వారికిచ్చే సబ్సిడియరీ బుక్స్ తో సహా) ఉండేవి. ఆరు నెలల తరువాత పబ్లిక్ పరీక్షలుండేవి. అందులో ఉత్తీర్ణులైన వారే ఫస్ట్ ఇయర్ కు వెళ్ళడానికి అర్హులు. చిత్రమేమిటంటే, డాక్టర్‍గారి బాచ్ లో, ఆ ఆరు నెలల పరీక్షల్లో గ్రాడ్యుయేషన్ చేసిన వారిలోనే సగం మందికి పైగా ఫెయిలయ్యారట. అనాటమీ, ఫిజియాలజీ సబ్జెక్టులకు రెండు పూర్తి సంవత్సాలుండేవి. రోజూ ఉదయం తొమ్మిది గంటల నుండి పన్నెండు వరకు అనాటమీ డి సెక్షన్ వుండేదట. సాయంకాలం లెక్చర్ క్లాసులుండేవి. ఆనాడున్న ప్రొఫెసర్ మాథ్యూస్‍గారిని, ఫిజియాలజీ ప్రొఫెసర్ మేడమ్‍గారిని, అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేసిన డాక్టర్ సీతారామారావుగారిని, డాక్టర్ బ్రహ్మయ్యశాస్త్రిగారిని ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు డాక్టర్‍గారు. "ఫస్ట్ ఎంబీ" పరీక్షల్లో రాధాకృష్ణమూర్తిగారు "ఫస్ట్ రాంక్" సాధించారు. వాస్తవానికి ఆ రాంక్ మిత్రులు బాల పరమేశ్వరరావుగారికి దక్కాల్సిందేనని, ఆయన ఆనాటమీ పేపర్ రాసేటప్పుడు, కాస్త కంగారుపడి "సెలినస్ ఏంటీరియర్" గురించి రాయడానికి బదులు "సెర్రేటస్ ఏంటీ రియర్" గురించి చక్కగా రాసేసి, బయటకు వచ్చి నాలుక కరుచుకున్నారట! ఆ చిన్న పొరపాటు చేయకపోతే, ఆ రాంక్ ఆయనకే దక్కేదని - దక్కి ఉండాల్సిందేనని అంటారు డాక్టర్ గారు. నిజానికి ఫైనల్ ఎంబిబిఎస్‍లో, ఆ రాంక్ ఆయనకే న్యాయంగా దక్కింది. మిత్రుడిని అభినందించారీయన.

క్లినికల్ సైడ్ వెళ్లాక సర్జరీ ప్రొఫెసర్ లెఫ్ట్ నెంట్ కల్నల్ రమణమూర్తి, ప్రొఫెసర్ కృష్ణస్వామి, మెడిసిన్‍లో ప్రొఫెసర్ టి.కె. రామన్, ప్రొఫెసర్ అనంతాచారి గార్లను గురించి చెప్పుకోవాల్సిందేనంటారు. ప్రొఫెసర్ భాస్కర మీనన్ పెథాలజీ అద్భుతంగా చెప్పేవారట. ఫార్మకాలజీ ప్రొఫెసర్ ఈశ్వరయ్య చాలా డ్రై సబ్జెక్టును ఎంతో ఆసక్తికరంగా, మధ్య మధ్య హాస్యంగా, చెణుకులతో చెప్పేవారట. ఆయన ప్రొఫెసర్ డేవిడ్‍తో కలిసి తరువాత ఎంతో పాపులర్ పుస్తకంగా పేరుతెచ్చుకున్న "ఫార్మకాలజీ టెక్స్ట్ బుక్" (డేవిడ్ అండ్ ఈశ్వరయ్య) రాశారట. అలాగే బాక్టీరియాలజీ ప్రొఫెసర్ - ప్రిన్సిపాల్ గా కూడా కొంతకాలం పనిచేసిన ఎన్.డి. పండాలే గారు మంచి లెక్చరర్ కాకపోయినా. చాలా లోతుగా సబ్జెక్ట్ వున్నవారంటారు. ఆయన కూడా బాక్టీరియాలజీ టెక్స్ట్ బుక్ అప్పటికే రాశారట. అలాంటి ఉద్దండులైన సీనియర్ ప్రొఫెసర్లు దొరకడం కూడా తన బాచ్ వైద్య విద్యార్థుల అదృష్టంగా చెప్పవచ్చు నంటారు.

ప్రొఫెసర్లతో పాటు అసిస్టెంటు సర్జన్లుగా పనిచేసిన డాక్టర్ పినాకపాణి ఎం.డి (తరువాత కాలంలో గొప్ప సంగీత విద్వాంసుడుగా పేరు తెచ్చుకున్నారు), డాక్టర్ కోదండ రామయ్య ఎం.డి (గుంటూరులో ప్రొఫెసర్‍గా, పాపులర్ ఫిజిషియన్‍గా పేరు సంపాదించుకున్నారు), ఎం.సి.ఐ చైర్మన్‍గా చాలా సంవత్సరాలు పనిచేసిన డాక్టర్ పిన్నమనేని నరసింహారావు ఎం.ఎస్ (.ఎన్.టి), డాక్టర్ లింగం సూర్యనారాయణ (తరువాత వైస్ ఛాన్సలర్‍గా పనిచేశారు), విద్యార్థులకు చాలా సహాయం చేసేవారట.

1947లో జరిగిన రెండు ముఖ్య సంఘటనలను డాక్టర్ వై.ఆర్.కే గుర్తు చేసుకున్నారు. ఆ ఏడాది మే నెల 4 న తన వివాహం జరిగిందని, అది తన స్వాతంత్ర్యం పోయిన రోజని చమత్కరించారు! రెండోది ఆగస్ట్ 15. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు. ఆ రోజుతో అంతకు ముందు విధిగా ధరించాల్సి వున్న సూటూ-బూటూ -నెక్ టై బాధ తీరిపోయిందన్నారు. స్టాఫ్ - స్టూడెంట్స్ కూడా ఎవరికిష్టమైన డ్రస్ వారు వేసుకునే వారట. 1949లో నాలుగో సంవత్సరం మెడిసిన్ చదువుతుండగా తనకు రెండు స్పీడ్ బ్రేకర్స్ వచ్చాయంటారు. ఒకటి జైలుకు వెళ్లి రావడం - కేసులు, రెండు ఆయన ఎంతగానో ప్రేమించే చెల్లెలు భీమేశ్వరి టైఫాయిడ్ జ్వరంతో చనిపోవడం - తనను పెంచిన తల్లితండ్రులకు గర్భ శోకం మిగల్చడం.

పాఠ్య గ్రంధాల చదువుతో పాటు, ఇతర గ్రంధాల పట్ల ఆసక్తి పెరగడంతో, ఆ కారణాన, ఫైనల్ ఎంబిబిఎస్ లో నాలుగో రాంక్ మాత్రమే పొందగలిగానంటారు. తనకన్నా ఎక్కువ రాంక్ వచ్చిన మిత్రులు తనకంటే ఏ మాత్రం తక్కువ వారు కాదని, అందరూ చాలా సమర్థులేనని అంటారాయన.

డిసెంబర్ 1950లో పరీక్షలు అయిపోయాయి. జనవరి 1951 నుండి హౌస్ సర్జన్‍గా పని చేశారు. ఆ రోజుల్లో అందరికీ స్టయి ఫండ్ దొరికేది కాదు. మొదటి 10 రాంకులు వచ్చిన వాళ్లకే ఇచ్చేవారు. వారిలో రాధాకృష్ణమూర్తిగారు కూడా వుండడంతో ఆయనకు కూడా రు. 90లు దొరికేవి. సంవత్సరం పూర్తయిన తరువాత ఇంకా కొన్ని స్పెషాలిటీల్లో అనుభవం కోసం స్టయిఫండ్ లేకుండానే సీనియర్ హౌజ్ మెన్‍గా మరొక ఆరు మాసాలు పనిచేశారు. ఆ అనుభవం తనకు ప్రయివేట్ ప్రాక్టీసులో బాగా ఉపయోగపడిందంటారు.

ఆయన వైద్య విద్య సాగుతున్నప్పుడే వీర తెలంగాణ రైతాంగ విప్లవ సాయుధ పోరాటం సాగింది. జరిగింది తెలంగాణ ప్రాంతంలోనే అయినప్పటికి, పుచ్చలపల్లి సుందరయ్య, మాకినేని బసవ పున్నయ్య లాంటి ఆంధ్ర ప్రాంతం వారి సహాయ సహకారాలతో పాటు నాయకత్వం కూడా దానికుండేది. పోరాటం చేసే వారికి ఆయుధాలు-ఆయుధ సామగ్రి సమకూర్చడానికి, పోరాటంలో గాయపడిన వారికి చికిత్స చేయడానికి ఆంధ్ర ప్రాంతం వారి అవసరమొచ్చేది. రాధాకృష్ణమూర్తికి అప్పటికే కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధాలున్నాయి. వైజాగ్ జిల్లా కమిటీ నాయకుడు వై. విజయ కుమార్ (హైదరాబాద్ లోని స్వప్న నర్సింగ్ హోం డాక్టర్ సబిత నాన్నగారు) తో, అనకాపల్లి చెరకు రైతు ఉద్యమ నాయకుడు గోవిందరావుతో, కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతకర్తగా-అధ్యయనకర్తగా పేరున్న ఏటుకూరి బలరామ మూర్తితో, విజయనగరానికి చెందిన డాక్టర్ లక్ష్మి భర్త వల్లభరావుతో, వైజాగ్ లోని పార్టీ కార్యాలయంలో వుండే జొన్నలగడ్డ రామలింగయ్యతో, ట్రేడ్ యూనియన్ నాయకుడు ఎం.వి భద్రంతో, మరి కొంత మందితో, వై ఆర్ కెకు పరిచయాలుండేవి.

పార్టీ మీద నిషేధం వున్నప్పుడు, విజయ కుమార్ ఆయన రూమ్‍లోనే వుండే వారు. ఏటుకూరి బలరామ మూర్తిని గురువుతో సమానంగా భావించే వారు యలమంచిలి. ఆయనే పార్టీ సాహిత్యాన్ని చదవడం అలవాటు చేసిందీయనకు. ఇతర స్థానిక నాయకులతో పాటు, ఒక సంవత్సరం సీనియర్ విద్యార్థి అయిన కె. పున్నయ్య చౌదరి (తెనాలి) తో పరిచయం పెంచుకున్నారు. ఆయన కంటె నాలుగేళ్లు సీనియర్, డాక్టర్ సూరి భగవంతం అల్లుడైన డాక్టర్ సూర్యనారాయణ (కాకినాడ)తో సహా చాలామంది రాధాకృష్ణమూర్తిని నమ్మకస్తుడైన కామ్రేడ్‍గా భావించేవారు. తెలంగాణ నుంచి కామ్రేడ్స్ వచ్చి, ఆయన గదిలో రహస్యంగా వుండి, దొరికినంత మందుగుండు సామగ్రిని పోగు చేసుకుని వెళ్లేవారు. జబ్బున పడ్డవారు కూడా ఆయన గదిలో వుండి చికిత్స చేయించుకుని వెళ్లేవారు. అవి తెలంగాణ సాయుధ పోరాటం ఉధృతంగా జరుగుతున్న రోజులు. వై ఆర్ కెకు నేరుగా తెలంగాణ సాయుధ పోరాట నాయకులతో సంబంధాలు లేకపోయినా ఉద్యమానికి తన వంతు సేవ చేస్తుండేవారు.

అప్పటివరకూ జాతీయ కాంగ్రెస్‍లో అంతర్భాగంగా, ఒక గ్రూపుగా, కమ్యూనిస్టులుండేవారు. 1941 జూన్ నెలలో నాజీ హిట్లర్ సైన్యాలు సోవియట్ యూనియన్ లోకి ప్రవేశించిన సందర్భంగా, రెండవ ప్రపంచ యుద్ధ స్వభావం మారిందని భావించిన కమ్యూనిస్టులు, దాన్ని "ప్రజా యుద్ధం"(పీపుల్స్ వార్)గా ప్రకటించింది. ఫాసిజానికి వ్యతిరేకంగా మిత్రకూటమిని బలపర్చాలని పిలుపునిచ్చింది. ఆ అవగాహనతో, 1942 క్విట్ ఇండియా ఉద్యమానికి దూరంగా వున్నారు. యుద్ధానంతరం, జైళ్ల నుంచి బయట కొచ్చిన కాంగ్రెస్ నాయకత్వం, కమ్యూనిస్టులను కాంగ్రెస్ సంస్థనుండి బహిష్కరించింది. ఫాసిస్ట్ జపాన్ సాయంతో తూర్పు ఆసియాలో సైన్యాన్ని నిర్వహిస్తున్న నేతాజీ సుభాస్ చంద్ర బోసును విమర్శించారు కూడా. వీటన్నిటి ఫలితంగా కమ్యూనిస్టులను దేశద్రోహులుగా ముద్రవేసి, దేశంలో కమ్యూనిస్టుల సమావేశాలపై, కాంగ్రెస్ కార్యకర్తలు దాడులు చేయసాగారు. దానిలో భాగంగా ఆనాటి పార్టీ కార్యదర్శి పి.సి. జోషి, సుందరయ్యగార్లు నాటి ఒరిస్సా రాజధాని కటక్‍లో మీటింగ్ పెడితే, దాన్ని విచ్చిన్నం చేసి, కార్యకర్తలను చావబాదారు. అక్కడ నుండి, వారిద్దరూ విశాఖపట్నం చేరారు. బీచ్‍లో, మీటింగ్ ఏర్పాట్లకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం కలిగింది. మీటింగు చుట్టూ, వాలంటీర్లు తలా ఒక పెద్ద బాణా కర్ర పుచ్చుకుని నిలుచోవాలన్నది నిర్ణయం. వారిలో ఒక వాలంటీరుగా తానున్నానని డాక్టర్‍గారు గుర్తుచేసుకున్నారు.

వేదిక కింద అదనంగా కర్రల కట్ట వుంచుకున్నారట. వేదిక కింద కర్రలెందుకు పెట్టారని మధ్యలో ఒక ప్రేక్షకుడు చీటీ పంపాడట. "అవును నిజమే - కర్రలుంచిన మాట వాస్తవమే! మీరు మాపై దాడి చేయనంతవరకు, మా వాళ్లు వాటికి పని చెప్పరు" అని సుందరయ్య గారు సమాధానం ఇచ్చారట. పి.సి. జోషి గారిని, సుందరయ్య గారిని మొదటిసారిగా అప్పుడే చూశానని చెప్పారు డాక్టర్ రాధాకృష్ణమూర్తి. విశాఖపట్నంలో వుండగానే (1947-1949 మధ్యలో కావచ్చు) జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యాన "ముందడుగు" నాటకం ప్రదర్శన ఏర్పాటు చేశారు. గారిసన్ థియేటర్ (రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో సైనికుల కొరకు నిర్మించిన) లో, ఆ నాటకం చూడడానికి, మెడికల్ కాలేజీ నుంచి చాలామంది విద్యార్థులు వెళ్లారు. కోడూరి అచ్చయ్య, వి. (విక్టరీ) మధుసూధన రావు పాల్గొన్న ఆ ప్రదర్శన, పార్టీయే తరులను కూడా మంత్రముగ్దులను చేసిందన్నారు డాక్టర్. ఒక్కొక్క సన్నివేశం ప్రదర్శిస్తుంటే హాలు దద్దరిల్లిందట. ఆ నాటి ఉమ్మడి మద్రాస్ ప్రభుత్వం, ఆ ప్రదర్శన తరువాత కొన్నాళ్లకు, ఆ నాటకాన్ని నిషేధించింది.

మెడికల్ కాలేజీ నుంచి (బహుశా 1946 లో కావచ్చు) కాకినాడలో జరిగిన విద్యార్థి ఫెడరేషన్ మహాసభలకు మిత్రుడు రాజరత్నంతో కలిసి ప్రతినిధిగా వెళ్లారట. అందులో ఆయనొక తీర్మానంపై మాట్లాడినట్లు గుర్తుకు తెచ్చుకున్నారు. ఊరేగింపులో కూడా పాల్గొన్నారు. అప్పటి ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన ఎస్. వి. నరసయ్య ప్రస్తుతం బెంగళూరులో పరిశ్రమ నిర్వహిస్తున్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ సభ్యులుగా కూడా వున్నారు. 1946-1947 ప్రాంతంలో గుంటూరులో జరిగిన అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ మహాసభలకు కూడా హాజరయ్యారట. ఆనాటి అఖిల భారత ఫెడరేషన్ కార్యదర్శి, నర్గీస్ బాట్లావాలా (ఆమె భర్త బాట్లావాలా పార్టీ పోలిట్ బ్యూరో నుండి బహిష్కృతుడై కాంగ్రెస్ లో చేరాడు. ఆయనతో కాంగ్రెస్ వారు అదే సమయంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు). మహాసభలకు ప్రముఖ మార్క్సిస్టు చరిత్ర కారుడు దేవీ ప్రసాద్ చటోపాధ్యాయ ప్రత్యేక ఆహ్వానితుడుగా వచ్చారు. ఆయన కుమారుడు గౌతమ్ చటోపాధ్యాయ, ఫెడరేషన్‍లో ముఖ్య నాయకుడు. ఆ సందర్భంలోనే శ్రీపాద అమృత డాంగేతో గుంటూరు గాంధీ పార్కులో బహిరంగసభ జరిగింది.

వైజాగ్ మెడికల్ కాలేజీలో మిత్రుల గురించి మరికొంత వివరంగా చెప్పాలంటారు డాక్టర్ వై.ఆర్.కె. ఆయన, ఎస్. బాలపరమేశ్వరరావు, ఎన్. సత్యనారాయణ-ముగ్గురు కలిసి, మెడికల్ కాలేజీ హాస్టల్ (మూడు సంవత్సరాలు) లోను, చెంగల్‍రావు పేటలో కాలేజీ బిల్డింగ్ కు ఎదురుగా వున్న పాత మేడ(ఏడాదిన్నర)లోను, టర్నర్ సత్రం దగ్గర మిలిటరీ వాళ్లు ఖాళీ చేసిపోయిన "లాస్ట్ హొరైజన్స్" పేరుతో పిలిచే బారక్స్ లోను, చివరగా కలెక్టర్ కార్యాలయం పక్కనే వున్న "లాడ్జ్ మెడికో" డాబాలోను, మొత్తం ఆరు సంవత్సరాలు ఒకే గదిలో వుంటూ వచ్చారు. వారి ముగ్గురుది ఒక వూరు కాదు-ఒక ప్రాంతం కాదు-ఒక బంధుత్వమూ కాదు. ఐనా, స్నేహం అలా కుదిరింది. ముగ్గురివీ భిన్నాభిప్రాయాలంటారు డాక్టర్ గారు. బాల పరమేశ్వరరావు సాయిబాబా (ఒరిజినల్) భక్తుడట. అల్మరాలో ఆయన ఫొటో పక్కనే విభూతి వుండేది. రోజూ ఉదయం స్నానం చేసి, దణ్ణం పెట్టుకుని, తేలికగా విభూతి రాసుకునేవాడు. కొన్నిసార్లు సాయంకాలం టెన్నిస్ ఆడడానికి వెళ్లేవాడు. రాజకీయాలపై బొత్తిగా ఆసక్తి లేదట. ఇక, సత్యనారాయణ గోడకు లక్ష్మీదేవి ఫ్రేం కట్టిన ఫొటో వేలాడ తీసుకునే వాడు. ఉదయం ప్రార్థనలు చేసేవాడట. పెందరాళే లేచి దండీలు (బిస్కీలు) తీసేవాడు. ఆయన మైలు రన్నర్. బహుమతులూ వచ్చాయి. ఒక సారి ఎన్. జి. రంగా విశాఖపట్నం వస్తే ఆయన వెంట వెళ్లాడు. మళ్లీ ఎన్నడూ ఆ గొడవలేదు. డాక్టర్ వై.ఆర్.కె నేమో నిరీశ్వర వాది. ఏ రకమైన పూజలూ చేసేవాడు కాదు. వ్యాయామం, ఆటలూ బొత్తిగా లేవు. పార్టీ సాహిత్యం, ఇతర పుస్తకాలు చదవడం, పార్టీ ఆఫీసుకు-యూనివర్సిటీలో సమావేశాలకు వెళ్లడం, రాజకీయాలపై ఆసక్తి పెంచుకోవడం ఆయన పని. ఎప్పుడైనా సరదాగా చిన్నచిన్న జోకులు విసురుకోవడం, వాటిని నవ్వుకుంటూ స్వీకరించడం మినహా, వారి మధ్య ఏనాడూ ఎటువంటి ఘర్షణ చోటుచేసుకోలేదట. ఆ స్నేహం కాలేజీ వదిలిన తరువాత కూడా, నేటికీ కొనసాగుతూనే వుందంటారు. వేర్వేరు చోట్ల భిన్న రంగాలలో సెటిల్ ఐనా, వారిది కుటుంబ స్నేహంగా మిగిలింది. దురదృష్ట వశాత్తు ఎంతో శరీర కసరత్తు చేసే మిత్రుడు సత్యనారాయణ ఇటీవలే కాలం చేశారని బాధపడ్డారు డాక్టర్‍గారు. ఆయన ఒక సంవత్సరం ఐ.ఎం.ఏ జాతీయ అధ్యక్షుడుగా కూడా పనిచేశారు. బాల పరమేశ్వర రావు, నిజాం ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్"(నిమ్స్)లో న్యూరో సర్జరీ విభాగాన్ని అభివృద్ధి చేసినందుకు బిసీ రాయ్ ఆవార్డును అందుకున్నారు. ఇది తనకు గర్వంగా అనిపిస్తుందంటారు డాక్టర్ వై.ఆర్.కె.

మరొక సహాధ్యాయుడు, మిత్రుడు పి. సుబ్బారాయుడు(పాలకొల్లు)తో డాక్టర్‍గారిది సాహిత్యానుబంధం. దానితో వారిద్దరి మధ్య మంచి దోస్తీ కుదిరింది. ఇద్దరూ కలిసి వ్యాసాలు రాసి, "రాధాకృష్ణ-సుబ్రాయుడు" పేరుతో, ఆ రోజుల్లో మద్రాసు నుండి వచ్చే ఆనంద వాణి, రూప వాణి పత్రికలకు కొంతకాలం పంపేవారట. వాటి లోతు-విలువ ఎంతో తనకు తెలియదు కాని, పంపినవన్నీ అచ్చయ్యాయట! రాధాకృష్ణమూర్తిగారు వేరుగా తన పేరు మీద కాలేజీ మాగజైన్‍కు అడపాదడపా, కథో, వ్యాసమో సంపాదకుని కోరిక మీదట ఇచ్చేవారు. అలాంటి వాటి కాపీలేవీ జాగ్రత్త పరచుకోవాలని అప్పుడనిపించలేదట. సుబ్బారాయుడుకు సినిమాలపై ఆసక్తి మెండు. మొదటి రోజున, మొదటి ఆటకు టికెట్లను ఇద్దరికీ తెప్పించేవాడు. అతను "జీవితం" (వైజయంతిమాల + తమిళ హాస్య నటుడు) సినిమాను కనీసం పదిహేను సార్లు చూశాడట. అలాగే "నందా ఔర్ నీరా" (శ్రీ శ్రీ తెలుగు డబ్బింగ్) కూడా ఐదారు సార్లు చూశాడట. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమేనని, నిష్కపటమైన స్నేహాభిమానాలు చూపిన ఆ మిత్రుడిని ఎన్నడూ మర్చిపోలేనని అంటారు డాక్టర్ గారు.

No comments:

Post a Comment