Friday, November 18, 2011

మనం మరచిపోలేని మహా నేత: వనం జ్వాలా నరసింహారావు

వనం జ్వాలా నరసింహారావు
{తండ్రి జవహర్‌లాల్ కంటే మిన్నగా ప్రధానమంత్రి పదవికి వన్నె తెచ్చిన మహా నాయకురాలు ఇందిర. అధికారంలో ఉన్నా లేకపోయినా అత్యంత బలీయమైన శక్తిగా ఆమె గుర్తింపు పొందారు. తనకు తానే సాటి అనిపించుకున్న ఇందిరాగాంధీతో పోల్చ దగ్గ వారు చరిత్రలో చాలా అరుదుగా ఉంటారనడం అతిశయోక్తి కాదేమో! - ఎడిటర్, ఆంధ్ర జ్యోతి}
ఇందిరా గాంధీ మరణించి పాతికేళ్ళు గడిచిపోయాయి. జాతీయ అంతర్జాతీయ రంగాలలో ఆమె మిగిల్చిన గుర్తులు అజరామరంగా అశేష ప్రజానీకం గుండెల్లో గూడుకట్టుకున్నాయి. పదహారేళ్ళపాటు ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ ఆత్మ స్తైర్యం, నిరంకుశ ధోరణి, రాజీపడని మనస్తత్వం కలబోసిన అరుదైన వ్యక్తిత్వంతో, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశానికి సమర్థ పరిపాలనను అందించి చరిత్రలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. రాధాకృష్ణన్, జకీర్ హుస్సేన్, వివిగిరి, ఫకృద్దీన్ అలీ అహమ్మద్, నీలం సంజీవరెడ్డి. జైల్ సింగ్ రాష్ట్రపతులుగా ఉన్నప్పుడు ఆమె ప్రధానిగా పనిచేశారు. తనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న 'సిండికేట్' నాయకత్వాన్ని ధిక్కరించి, పార్టీని చీల్చి, భార జాతీయ కాంగ్రెస్ పార్టీని తన గుప్పిట్లో పెట్టుకున్న అసాధారణ నేత ఇందిర. ఎమర్జెన్సీ అనంతరం ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్‌ను మరో మారు చీల్చి ఇందిరాకాంగ్రెస్‌గా నామకరణం చేసి రెండేళ్ళకే మళ్ళీ అధికారంలోకి వచ్చి పాలనా పగ్గాలను పార్టీ పగ్గాలను తన చేతుల్లో ఉంచుకున్నారు. తనకు ఎదురులేకుండా, ఎదిరించిన వారికి పుట్టగతులు లేకుండా, ఏకచ్ఛత్రాధిపత్యంగా పాలించి నియంతృత్వ ప్రజాస్వామ్యమంటే ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పిన ధీర ఇందిర.
ప్రజాస్వామ్యాన్ని పటిష్టంగా మలిచే ప్రయత్నంలో అప్రయత్నంగానే నిరంకుశత్వం అలవరచుకున్నారు ఇందిరాగాంధీ. రాజ్యాంగ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా బలమైన కేంద్రం దిశగా ఆమె విధానాలు రూపుదిద్దు కోసాగాయి. పార్టీలో కూడా ఆమె నియంతృత్వ ధోరణులే అవలంభించారు. తమ పార్టీకి చెందిన ముఖ్య మంత్రులను ఇష్ట్టమొచ్చిన రీతిలో మార్చడం, ఇతర పార్టీలకు చెందిన ముఖ్య మంత్రులను ఇబ్బందులకు గురిచేయడం, అధికారాలను కేంద్రీకరించడం ఆనవాయితీగా మారిపోయింది. కమ్యూనిస్టు వ్యతిరేకతతో రాజకీయ ఆరంగేట్రం చేసిన ఇందిర, కాంగ్రెస్‌లోని సిండికేట్‌పై విజయం సాధించడానికి వామపక్షాలను కలుపుకున్నారు. 'కమ్యూనిజం' కంటే 'కమ్యూనలిజం' వల్లే ప్రమాదం అంటూ అలనాటి జనసంఘ్ లాంటి పార్టీలను ఎదగకుండా చేశారు.
ఎప్పుడైతే ఎమర్జెన్సీ విధింపునకు వ్యతిరేకంగా కాంగ్రేసేతర పార్టీలన్నీ ఏకమయ్యాయో, వారూ వీరూ అనే తేడా లేకుండా తన విధానాలను వ్యతిరేకించిన అందరినీ జైళ్ళకు పంపడానికి వెనుకాడలేదు. ఇరవై సూత్రాల ఆర్థిక ప్రణాళికైనా, గరీబీ హటావో పథకమైనా బ్యాంకుల జాతీయకరణైనా, గ్రామీణ బ్యాంకుల స్థాపనైనా, రాజ్యాంగ సవరణలైనా, సవరణలలో భాగంగా అవతారికలో 'సామ్యవాదం, లౌకిక వాదం' అన్న పదాలను చేర్చడమైనా, రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు ప్రాథమిక హక్కుల కంటే ముఖ్యమైనవని చెప్పడమైనా మరేదైనా ఏమి చెప్పినా చేసినా ఇందిర మనసులో మాట ఒకటే. భారతదేశానికి నాయకత్వం వహించగలిగేది తానే అని, తాను దానికోసమే జన్మించానని ఆమె నమ్మకం. నమ్మకంతోనే ఆమె అనుకున్న కార్యం సాధించడానికి దేనికైనా వెనుకాడక పోయేరు. నమ్మకమే ఆమె గెలుపునకు సోపానాలయ్యాయి. ఓటమికి కారణాలయ్యాయి.
1955లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యురాలిగా, నాలుగేళ్ళ అనంతరం, నాలుగు పదుల వయస్సులో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా ఇందిర ఎన్నికయ్యారు. అధ్యక్షురాలిగా ఏడాది కాలంలోనే ఆమె తన రాజకీయ దక్షతను చూపారు. దానితో పాటే కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ప్రపంచ చరిత్రలో ప్రప్రథమంగా బ్యాలెట్ ద్వారా అధికారంలోకి వచ్చిన కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని రద్దుచేయించడంలో ఇందిర కీలక పాత్ర వహించారు. తరువాత జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు విజయం సమకూర్చారు. అయినా మరో సారి కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి ఆమె సుముఖత చూపలేదు. తండ్రి మరణాంతరం లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వంలో ఇందిర సమాచార శాఖను నిర్వహించారు. శాస్త్రి హఠాన్మరణం దరిమిలా కాంగ్రెస్ అధిష్ఠానం, ఇష్టం ఉన్నా లేకపోయినా ఇందిరను ప్రధాన మంత్రిని చేశారు.
తమ ధోరణికి అనుకూలించడనుకున్న మొరార్జీ ప్రధాన మంత్రి కాకూడదనే ఆలోచనతో, తమ అదుపు ఆజ్ఞల్లో కనుసన్నల్లో నడుచుకుంటుందన్న ధీమాతో కామరాజ్ నాడార్, నిజలింగప్ప, నీలం సంజీవరెడ్డి లాంటి వారు ఇందిర వైపు మొగ్గు చూపారు. అయితే భవిష్యత్తులో ఆమె నుంచి తమ రాజకీయ అస్తిత్వానికి పొంచి వున్న ప్రమాదాన్ని పసికట్ట లేకపోయారు.
అకస్మాత్తుగా మరణించిన రాష్ట్రపతి జకీర్ హుస్సేన్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో పార్టీలోని విభేదాలు స్పష్టంగా బయటపడ్డాయి. ఇందిరను విమర్శించే సంజీవరెడ్డిని కాంగ్రె స్ అధిష్ఠాన వర్గం పార్టీ అభ్యర్థిగా నిర్ణయించింది. తొలుత ఆయననే ప్రతిపాదించిన ఇందిర ఓటింగులో స్వతంత్ర అభ్యర్థి వివిగిరికి మద్దతును బహిరంగంగానే ప్రకటించారు. తన వారందరినీ ఆయనకే ఓటేయ్యమని సూచించారు. ఆమె మాటే నెగ్గింది. నీలం ఓటమిపాలయ్యారు. అగ్నికి ఆజ్యం పోసినట్టు తన వ్యతిరేక వర్గానికి చెందిన మొరార్జీ ని మంత్రి వర్గంలోంచి వెళ్లి పోయే పరిస్థితులను ఇందిర కల్పించారు. క్రమశిక్షణను ఉల్లంఘించారన్న ఆరోపణపై వృద్ధ నాయకత్వం ఆమెను పార్టీనుంచి తొలగించింది. దీంతో 'సిండికేట్'గాచెలామణీ అవుతున్న నాయకులందరూ అభివృద్ధి నిరోధక శక్తులుగాను, సామ్యవాద పథకాలను అడ్డుకునే వారుగాను చిత్రించారు ఇందిర. పార్లమెంటరీ పార్టీ ఇందిర నాయకత్వంలో విశ్వాసం ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ పార్టీ చీలిపోయింది. ఇందిర ఏడాదిముందే 1971లో ఎన్నికలు నిర్వహించారు. అఖండ విజయం సాధించారు.
తర్వాత కొద్ది నెలలకు జరిగిన రాష్ట్ర శాసనసభల ఎన్నికలలో, కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన విజయం సాధించింది. ఆమె ప్రభ వెలగ సాగింది. ఆమె ఆరోహణ పర్వం కొనసాగుతుండగానే, అవినీతి ఆరోపణలను కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితులొచ్చాయి. అలహాబాద్ హైకోర్టు, లోక్‌సభకు ఆమె ఎన్నిక చెల్లదని తీర్పుచెప్పింది. ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హురాలిగా ప్రకటించింది. తక్షణమే ఆమె రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి. రాజీనామా ప్రసక్తే లేదని తేల్చి చెప్పడమే కాకుండా, యోధాన యోధులైన రాజకీయ నాయకులను నిర్బంధించి, ఇందిర అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అంతర్గత భద్రత చట్టం కింద వందల, వేల సంఖ్యలో అరెస్టులు చేయించారు. స్వతంత్ర భారత దేశంలో చీకటి రోజులకు తెరలేపారు ఇందిరాగాంధీ. రాజ్యాంగాన్ని తిరగ రాయించారు. తనకు వ్యతిరేకంగా వచ్చిన అలహాబాద్ హైకోర్టు తీర్పు నుంచి ఊరట పొందారు.
సార్వత్రిక ఎన్నికలను ఒక ఏడాది వాయిదా వేశారు. మీడియాపై ఆంక్షలు విధించారు. అరెస్టు చేసిన రాజకీయ ఖైదీలను విచారణ లేకుండా జైళ్లలో నిర్బంధించడానికి తీసుకున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అత్యున్నత న్యాయస్థానం సమర్థించడంతో ఇందిరకు మరింత బలం చేకూరింది. రాజ్యాంగ సవరణల ద్వారా, అవధులు లేని అధికారాలను ఇందిరా గాంధీ తన సొంతం చేసుకున్నారు. అసాధారణ రాజ్యాంగ సవరణలకు పార్లమెంటు ఆమోదం లభించింది. జనవరి 1977లో ఎన్నికల నిర్ణయం ప్రకటించి, మార్చి నెలలో ప్రజల నిర్ణయం కొరకు ఎన్నికలు జరుగుతాయని చెప్పి, జైళ్ళలో నిర్బంధించిన వారందరినీ విడుదల చేయించారు. భారతదేశం బలీయమైన శక్తిగా ఎదగడానికి బలమైన కేంద్ర ప్రభుత్వం, సుస్థిరమైన కేంద్ర ప్రభుత్వం అవసరమని స్పష్టం చేశారు. ఎమర్జెన్సీ కాలం నుండి ప్రోత్సహిస్తూ వస్తున్న చిన్న కొడుకు సంజయ్ గాంధీని రాజ్యాంగేతర శక్తిగా ఎదగడానికి ఇందిర ఎంతైనా తోడ్పడ్డారు.
ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి. ఆమె అనుంగ సహచరుడు జగ్జీవన్ రాం వారితో చేయి కలిపారు. లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ నాయకత్వంలో జనతా పార్టీ ఆవిర్భవించింది. కాంగ్రెస్‌లోని యంగ్ టర్క్స్ కూడా వారితో జత కట్టారు. నియంతృత్వ పాలనకు స్వస్తి చెప్పాలని, మకుటంలేని మహారాణిని ఓడించాలని జనతా పార్టీ ఎన్నికల్లో పిలుపునిచ్చింది. నియంతృత్వానికి, ప్రజాస్వామ్యానికి మధ్య పోరాటంగా, జనతా పార్టీ ఓటర్ల ముందుకు పోయింది. మార్చి 20, 1977 జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఇందిరాగాంధీని ఆమె నియోజకవర్గంలోను, ఆమె సారధ్యంలోని కాంగ్రెస్ పార్టీని దేశంలోను దారుణంగా ఓడించారు. కలగాపులగం లాంటి కాంగ్రెసేతర పార్టీల కలయికతో ఏర్పడిన జనతా ప్రభుత్వానికి, ఇందిరాగాంధీ మంత్రి వర్గంలో ఉప ప్రధాన మంత్రిగా చేసిన మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా సారధ్యం వహించారు. ప్రజల తీర్పును శిరసావహిస్తానని, ప్రజల సేవలోనే గడుపుతానని అంటూ పదవికి రాజీనామా చేసింది ఇందిరా గాంధీ.
ఎమర్జెన్సీ అక్రమాలపై విచారణ చేయడానికి జనతా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ ముందు హాజరవడానికి ఇందిర నిరాకరించారు. అది తన వ్యక్తిగత నిర్ణయం కాదని, రాజ్యాంగ బద్ధంగా, మంత్రివర్గం సిఫార్సుపై, పార్లమెంటు ఆమోదం లభించిన చర్య అని ఆమె స్పష్టం చేశారు. కమిషన్ ఏర్పాటుకు చట్టబద్ధత లేదన్నది. అవినీతి ఆరోపణలపై జనతా ప్రభుత్వం ఆమెను అరెస్ట్ చేసింది. బెయిలు తీసుకోమని ప్రభుత్వం ఇచ్చిన సలహాను ఆమె నిరాకరించారు. ఆమె అరెస్టుకు తగిన కారణాలు ప్రభుత్వం చూపలేకపోయిందని, ఆమెను విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. ప్రజలతో మమేకం అయ్యేందుకు ఇందిర ప్రయత్నాలు తిరిగి ప్రారంభించారు. తన పార్టీలో తనకు వ్యతిరేకంగా వున్న వారితో బంధాలు తెంచుకుని, మరో మారు పార్టీని చీల్చి, కాంగ్రెస్ ()ని స్థాపించారు.
అదే అసలు సిసలైన భారత జాతీయ కాంగ్రెస్‌గా ప్రకటించారు. కర్నాటకలోని చిక్ మగలూర్ నుంచి ఇందిరా గాంధీ లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్() అఖండ విజయం సాధించడంతో ప్రజలు ఆమెకు తిరిగి బ్రహ్మరధం పట్టసాగారు. లోక్‌సభలో సుదీర్ఘచర్చ అనంతరం, ఇందిరా గాంధీ సభ్యత్వం రద్దుచేయాలని, సమావేశాలు ముగిసేవరకు అరెస్ట్ చేయాలని, ప్రధాని మొరార్జీ ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. పార్లమెంట్ హాలును వదిలి వెళ్లనని, తననక్కడే అరెస్ట్ చేయమని డిమాండ్ చేస్తూ భీష్మించుకుని కూచున్నారు ఇందిరా గాంధీ. అరెస్ట్ చేయడానికి వచ్చిన అధికారులకు నమస్తే చెపుతూ వారి వెంట వెళ్లింది. ఆమె అరెస్టుకు నిరసనగా లక్షలాది మంది అభిమానులు ఆందోళన చేశారు. అరెస్టయ్యారు. పార్లమెంటు సమావేశాలు ముగిసిన వెంటనే ఆమెను విడుదల చేసింది ఫ్రభుత్వం. ఆమెను వదిలి వెళ్లిన కాంగ్రెస్ నేతలు, ప్రజల నుండి లభిస్తున్న అభిమానాన్ని గమనించి తిరిగి ఆమె పంచన చేరారు. ఇంతలో అంతర్గత వైరుధ్యాల మధ్య జనతా ప్రభుత్వం కూలిపోయే దశకు చేరుకుంది.
1979 జూలైలో మొరార్జీ దేశాయ్ రాజీనామా చేశారు. దానికి కారణభూతుడైన చరణ్‌సింగ్‌కు మద్దతు పలికి, వ్యూహాత్మకంగా ఆయన ప్రధాన మంత్రి కావడానికి తోడ్పడ్డారు ఇందిరాగాంధీ. తనపై మొరార్జీ ప్రభుత్వం చేసిన అవినీతి ఆరోపణలను ఉపసంహరించుకోవడానికి నిరాకరించిన చరణ్‌సింగ్ ప్రభుత్వాన్ని విశ్మాస తీర్మానంలో ఓటమి పాలు చేసింది. ఆపద్ధర్మ ప్రధాన మంత్రిగా ఉన్న చరణ్ సింగ్ ఆచరణలో ఇందిర ప్రతినిధిగా పాలన చేశాడనాలి. జనవరి 1980లో జరిగిన మధ్యంతర ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ (), మూడింట రెండు వంతుల మెజారిటీతో అఖండ విజయం సాధించింది. సుస్థిరతా అస్థిరతా అన్న నినాదంతో ఇందిరా గాంధీ ఎన్నికల బరిలో దిగి గెలిచారు. సుస్థిరతే ముఖ్యమని భారత దేశ ఓటర్లు స్పష్టం చేశారు. అస్థిర పాలన కంటే, నియంతృత్వ ప్రజాస్వామ్యమే మెరుగైందని ఓటర్లు తీర్పిచ్చారు. దాని రూపకర్త ఇందిరను మరో మారు ప్రధానిని చేశారు. ప్రధానిగా ఉండగానే ఇందిర హత్యకు గురయ్యారు.
రాజకీయాలకు నిలయమైన కుటుంబంలో జన్మించిన ఇందిర, తండ్రి జవహర్లాల్ కంటే మిన్నగా ప్రధానమంత్రి పదవికి వన్నెతెచ్చిన మహానాయకురాలు. అధికారంలో ఉన్నా లేకపోయినా అత్యంత బలీయమైన శక్తిగా గుర్తింపు పొందారు. వైరివర్గాలను నామరూపాలు లేకుండా చేయగలిగే స్థాయికెదిగి, తనకు తానే సాటి అనిపించుకున్న ఇందిరాగాంధీతో పోల్చ దగ్గ వారు చరిత్రలో చాలా అరుదుగా ఉంటారనడం అతిశయోక్తి కాదేమో! వారసత్వ అధికారాన్ని వంశపారంర్యంగా తమ కుటుంబీకులకే దక్కే విధంగా వ్యూహం పన్నిన ఇందిర నవ భారత వర్తమాన చరిత్రలో వేరెవరూ సాధించలని దాన్ని అవలీలగా సాధించగలిగిన వ్యక్తిగా ఇందిర చిరస్థాయిగా మిగిలిపోతారు.

No comments:

Post a Comment