Monday, November 14, 2011

డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తిగారి బాల్యం-కుటుంబ నేపధ్యం: వనం జ్వాలా నరసింహారావు

తీపి గుర్తులు - చేదు అనుభవాలు: అధ్యాయం I

డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తిగారి బాల్యం-కుటుంబ నేపధ్యం

వనం జ్వాలా నరసింహారావు

మాజీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సిపిఐ(ఎం) నాయకుడు, ప్రజా వైద్యుడుగా పేరు తెచ్చుకున్న డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తిగారి జీవితచరిత్రను "తీపి గుర్తులు-చేదు అనుభవాలు" గా గ్రంధస్థం చెసే అవకాశం కలిగింది నాకు. 36 అధ్యాయాల ఆ పుస్తకంలోని వివరాలలో మొదటి అధ్యాయం ఇది.

డాక్టర్ గారి కుటుంబ సభ్యులంతా కలిసి వంద మంది పైన వుంటారు. అన్నలు-తమ్ములు, అక్కలు-చెల్లెళ్లు, తల్లి వైపు-తండ్రి వైపు సమీప బంధువులు, బావా-మరుదులు, వదినా-మరదళ్లు, మామయ్యలు, బాబాయిలు, చిన్నాయనలు-పెద నాన్నలు, కజిన్లు....అందరూ కలుస్తుంటారు అప్పుడప్పుడు. సందడే-సందడి. అంతా కలుపుగోలుగా వుంటారు. కలవడానికి సందర్భం కొరకు వేచి చూస్తుంటారు. పెళ్లిళ్లలో-పేరంటాలలో, ప్రత్యేక సందర్భాలలో కలవడానికి అదనంగా, అడపాదడపా కూడా కలుస్తుంటారు. కలిసినప్పుడు గతంలోకి పోతుంటారు. అలాంటి గత స్మృతులు డాక్టర్ వై ఆర్ కె వర్ణిస్తుంటే, వినేవారు పరాయివాళ్లైనా సరదాగా వుంటుంది. ప్రముఖ రచయిత బోడెలె చెప్పిన "బాల్యం అనుభవాలను (తెలిసిన వారంతా) కలిసినప్పుడల్లా స్మరించు కోవడమే మేలు" అన్న వాక్యాలను, ఇటీవల అనుపమ్ ఖేర్ చెప్పిన "The memories of our happy days work as powerful trigger" (ద మెమొరీస్ ఆఫ్ అవర్ హాపీ డేస్ వర్క్ యాజ్ పవర్ ఫుల్ ట్రిగ్గర్) అన్న వాక్యాలను జ్ఞప్తికి తెచ్చుకునే డాక్టర్ గారు, "Memories can also be painful" (మెమొరీస్ కెన్ ఆల్సొ బి పెయిన్ ఫుల్) అంటారు. చిన్నతనంలో చదువుకున్న మాధవపెద్ది గారి ఖండ కావ్యం "పంచవటి"లోని ఊహాజనిత సన్నివేశంలో, కవి లక్ష్మణుడుని ఉద్దేశించి "ఎప్పుడు ఒకే సుఖంబై యుండెడి దేవతలకన్న కష్ట సుఖముల కలగల్పు గల్గు మనుజులన్నచే ప్రీతి జనించు లక్ష్మణా!" అన్న పద్యభాగాన్ని ప్రస్తావించారు. రామ-లక్ష్మణులకు ఎలా కష్టాలు-సుఖాలు ప్రాప్తించాయో, ఆయన జీవితంలోనూ, అలానే కష్ట-సుఖాలు కలగాపులగంగా ఎదురయ్యాయన్న భావం ఆయన మాటల్లో వ్యక్తమైంది.

రాధాకృష్ణమూర్తి స్వగ్రామం, కృష్ణా జిల్లా, గుడివాడకు నాలుగైదు కిలోమీటర్ల దూరంలో వున్న "జమీ దింటకుర్రు". అదొక్కప్పుడు ఒక జమీందారుకు చెందిన వూరు. అక్కడి గ్రామ ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులను నూజివీడు జమీందారుకు పంపడం ఆనవాయితీగా వుండేది. కుగ్రామంలాంటి ఆ వూరి జనాభా వంద కుటుంబాలకు మించదు. అందులో చాలా వరకు కమ్మ కులానికి చెందిన వారే కావడం, ఒకరికొకరు బంధువులు కావడం విశేషం. ఇక పన్నులు వసూలు చేసుకుని తీసుకుపోయే జమీందారు, మేకా రంగయ్యప్పారావుగారి పూర్వీకులైన రాజా రంగయ్యప్పారావుగారు. ఆ వూరి సరిహద్దు గ్రామం పెదపారుపూడు ("ఈనాడు" అధినేత రామోజీరావు సొంత వూరు), మరోవైపు "వానపాముల" వుండేవి. చుట్టూ సారవంతమైన-నల్ల రేగడి వ్యవసాయ భూములు, మాగాణి భూములు వున్నాయి. పుష్కలంగా సాగు నీరు లభ్యమయ్యే వసతి కూడా వుంది. జమీ దింటకుర్రుకు చెందిన కొల్లి రామయ్య-నాగరత్నమ్మ దంపతుల పదకొండు మంది సంతానంలో రాధాకృష్ణమూర్తి రెండో వారు.

జమీ దింటకుర్రులో చిన్న రామాలయం వుంది. అందుకేనేమో, ఆ వూళ్లో చాలా మంది రామయ్యలున్నారు. వాళ్లను పిలవాల్సి వచ్చినప్పుడు, పేరు ముందర గుర్తుగా, ఇంటి పేరో-తండ్రి పేరో-అలవాట్లో... ఏదో ఒకటి కలిపేవారు. డాక్టర్‍గారిది మధ్య తరగతి కుటుంబం. అన్నదమ్ములు ఎనిమిది మంది, అక్కచెల్లెళ్లు ముగ్గురు. వారికున్న చిన్న మామిడి తోట, ఏడెనిమిది ఎకరాల మాగాణిపై వచ్చే ఆదాయంపైనే కుటుంబ జీవనాధారం. తల్లి పెద్దమ్మ అచ్చమ్మగారు-భర్త సీతారామయ్యగారు, రాధాకృష్ణమూర్తిని తొమ్మిది (9) మాసాల పిల్లవాడుగా దత్తత తీసుకుని పెంచుకున్నారు. ఆమెను అచ్చమ్మగారని కొందరు, లక్ష్మీ నర్సమ్మగారని మరి కొందరు సంబోధించే వారు. వారిది కూడా అదే గ్రామం. వారింటి పేరు "యలమంచిలి" కావడంతో, డాక్టర్‍గారి పేరు యలమంచిలి రాధాకృష్ణమూర్తి అయింది. సీతారామయ్య దంపతులు ఆయనను కన్న బిడ్డకంటే ఎక్కువగా చూసుకుని, పెంచి పెద్ద చేశారు. పెంచుకున్న వారిని అమ్మ-నాన్నని పిలవడం అలవాటై, సొంత తలిదండ్రులను చిన్నమ్మ-చిన్నాన్న అని పిలిచే వారు.

తీపి గుర్తులు - చేదు అనుభవాలు

జన్మనిచ్చిన తండ్రికి ఆత్మాభిమానం, ఆత్మగౌరవం మెండుగా వుండేది. ముక్కు సూటిగా మాట్లాడే మనస్తత్వం. పొదుపరి. బంధు ప్రీతి-దాతృత్వ హృదయం కలవాడు. స్వయంకృషి ఆయన నినాదం. రైతుగా స్వయానా కృషీవలుడైన కొల్లి రామయ్యగారు ఆ రోజుల్లోనే వరి నారు మడిని వాణిజ్యపరంగా మార్కెట్ చేసిన వ్యవసాయదారుడు. సమీప బంధువులందరూ ఆయనను "పెద్ద మనిషి" గా పిలిచే వారు. తన ఇంటికి వచ్చిన వారందరి ముందు తన పని తాను చేసుకుంటూ, వారిని కూడా పని చేయమని పురమాయించేవాడు. అదొక తరహా క్రమశిక్షణకు ఆయన పర్యాయపదం అనాలి. "రామయ్యగారు పందిరి గుంజకు కూడా పని చెబుతాడు" అనేవారు! సొంత తలితండ్రులిద్దరికీ భూదేవికున్న సహనం-ఓర్పు వుండేది.

దత్తత తీసుకున్న తండ్రి మరో రకమైన గొప్పవాడు. అయన తరహా, శైలి నిరుపమానమైందనాలి. బాగా చదువుకున్న వ్యక్తి. పండితుడు. స్వచ్చమైన భాష ఆయన సొంతం. స్వామి దయానంద సరస్వతి సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడైనారు. ఆర్య సమాజం ప్రభావం కూడా అయన మీద పడింది. త్రిపురనేని రామస్వామి చౌదరి ప్రభావం వుంది. "స్వసంఘ పౌరోహిత్యం" అలవరచుకుని, షోడశ కర్మలతో సహా, పౌరోహిత్యం చేసేవారాయన. బ్రాహ్మణ వేషధారణతో, కమ్మ బ్రాహ్మణుడుగా పేరు తెచ్చుకున్నారు. ఆయనతో పౌరోహిత్యం చేయించుకోవడానికి ఎక్కడెక్కడివారో తీసుకెళ్లేవారు. ఒక అధ్యాపకుడుగా పక్కనున్న వేంట్రప్రగడ గ్రామంలో, ఘంటశాల గ్రామంలో చాలామందికి వేద పాఠాలు నేర్పేవారు. గొట్టిపాటి బ్రహ్మయ్య లాంటి రాజకీయ మిత్రులు, గొర్రెపాటి వెంకట సుబ్బయ్యగారి లాంటి సాహితీ మితృలతో పరిచయాలుండేవి. ఘంటసాలలోని శివాలయంలో అర్చకత్వం కూడా రెండు సంవత్సరాల పాటు చేశారు. ఆయన చనిపోయేంతవరకు ఘంటసాల గ్రామంతో, గ్రామస్తులతో సంబంధాలు పెట్టుకున్నారు.

ఆ విధంగా రాధాకృష్ణమూర్తి చదువు-సంస్కారం పెంపకపు తండ్రి దగ్గర నేర్చుకుంటే, శారీరక కష్టం చేయడం, వ్యవసాయం పనులు చేయడం సొంత తండ్రి దగ్గర నేర్చుకున్నారు. సమాజంలో ఆయన ఉన్నత స్థితికి చేరుకోవడానికి, తలిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు ఎంతో సహాయం చేశారంటూ, ఘంటసాలలోని లక్ష్మయ్య మాస్టారును జ్ఞప్తికి తెచ్చుకున్నారు. ఆయన ప్రేమాభిమానాలను కూడా గుర్తుచేసుకున్నారు. దయాకరరావు, వెంకటేశ్వర్లుగార్లు తమతో నాటకాలు వేయించిన విషయం గుర్తు చేసుకున్నారు. చింతామణిలో చిన్ని కృష్ణుడు వేషం, బొబ్బిలి యుద్ధంలో రంగారావు కుమారుడు వేషం వేసారాయన చిన్నతనంలో . పెంచిన తండ్రికి చదువు విలువ బాగా తెలుసు. అందుకే రాధాకృష్ణమూర్తిని బాగా చదివించారు. ఇంగ్లీష్ విద్యతో పాటు భారతీయ ప్రాచీన గ్రంధాలలోని అంశాలను నేర్పించారు. బాల్యంలో గుండెలమీద పడుకోబెట్టుకుని, సుమతీ శతకంతో అనేక శతకాలను, మంత్ర పుష్పాన్ని కంఠతా పాఠం చేయించారు. పుస్తక పఠనం అలవాటు ఆయన చలవే. చిన్నతనంలోనే గోరా రచించిన "దేవుడు లేడు", త్రిపురనేని రాసిన "శంభుక వధ", "సూత పురాణం" లాంటివి చదవ గలిగారు.

విద్య:

వై.ఆర్.కె మూడు-నాలుగు తరగతుల వరకు ఘంటసాలలో పూర్తి చేసి, వానపాములలో మాధ్యమిక విద్యనభ్యసించారు. శెలవుల్లో, తీరిక సమయాల్లో సొంత తండ్రి పురమాయించుటతో వ్యవసాయ పనులు చేయడంలో ఆయనకు తోడ్పడే వారు. నాట్లు వేయడం, కోతలు కోయడం, ఎరువులు చల్లడం, నారు మళ్లు తడపడం, పశువులకు మేత వేయడం అలవాటైంది. కుప్పనూర్పుళ్లకు వెళ్లేవారు. ఎండాకాలం తాటి ముంజలు తినడం సరదాగా వుండేదని, తాటికాయ పండ్లు వేరుకుని, ఇంటికి తెచ్చుకుని వుడకబెట్టుకుని తింటుంటే మహదానందంగా వుండేదని రాధాకృష్ణమూర్తిగారు చెప్పారు. కుటుంబ వ్యవసాయ కార్మిక పనుల్లో చేదోడుగా-వాదోడుగా వుండడం ఆయనకు చాలా ఇష్టంగా వుండేది. వాస్తవానికి, అందులో భాగంగా, వరి పొలానికి "యాతాంతో నీళ్లు తోడి పారిస్తుంటే" తనకు మెడికల్ కాలేజీలో సీటొచ్చిన సంగతి తెలిసిందని గర్వంగా తెలిపారాయన.

జన్మస్థలమైన జమీదింటకుర్రు నుండి, రెండు మైళ్ల దూరంలో ఉండే ఎస్.ఆర్.ఆర్. మిడిల్ స్కూల్లోనే 5 నుండి 8 తరగతుల వరకు చదువు సాగింది. ఆ పాఠశాల చుట్టుపక్కల 4-5 గ్రామాల నుండి (పెద పారుపుడి, దింటకుర్రు, వానపాముల, వెంట్రప్రగడ, అప్పికట్ల, ముదునూరు) పిల్లలు వస్తుండేవారు. మంచి స్కూల్ అని పేరుండేది. పగలు స్కూల్, సాయంకాలం (శెలవుల్లో రోజంతా) పొలం పని. రాత్రిళ్లు కిరసనాయిలు లాంతరుతో చదువు. ట్యూషన్లు అంటూ లేవుకాని, ఆ వూరిలోనే వుండే, జాస్తి పున్నయ్య గారింటికి వెళ్ళి ఇంకా మరికొందరితోపాటు చదువు చెప్పించుకునేవారు. ఆయన అప్పటికే స్కూల్ ఫైనల్ పాసయ్యారు.

బంధువులు:

ఊరిలో కమ్యూనిస్ట్ కార్యకర్తలుండేవారు. మిక్కిలినేని వెంకటేశ్వరరావు, కొల్లి (అంజయ్యగారి)సుబ్బారావు, జాస్తి పున్నయ్య, ఎన్.వీ.ఎస్.ప్రసాదరావు వీరిలో ముఖ్యులు. "స్వతంత్ర భారత్" అనే సైక్లో పత్రిక రహస్యంగా పంచేవారు. ఆసక్తి కొద్దీ దాచుకుని చదువుతుంటే (ఏమీ అర్థం అయ్యేది కాదు) తండ్రిగారు చూసి, "నీకవన్నీ ఎందుకు? పుస్తకాలు చదువుకో" అని మందలించేవారట. ఆ సమయంలో జిల్లా బోర్డు ఎన్నికలు వచ్చాయి. జస్టిస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి మధ్య పోటీ వుండేదని, అభ్యర్థులెవరో మాత్రం గుర్తు లేదనీ అన్నారు డాక్టర్‍గారు. ఆ రోజుల్లో జస్టిస్ పార్టీ అంటే చల్లపల్లి రాజావారు. ఆ ప్రాంత కాంగ్రెస్ నాయకుల్లో ముదునూరు గ్రామానికి చెందిన అన్నె అంజయ్యగారి పేరు చెప్పుకునేవారు. (ఆయనగారి కుమార్తే, "అన్నే రాజ్యం సిన్హా". భగత్ సింగ్ సహచరుడు విజయ్‍కుమార్ సిన్హాను వివాహం చేసుకుని రాజ్యం సిన్హా అయ్యారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో సమాచార పౌర సంబంధాల డైరెక్టర్‍గా పనిచేశారు). అలానే, పక్క వూరు - పెద పారుపూడిలోని మాలపల్లెకు చెందిన వేముల కూర్మయ్యగారి పేరు ప్రముఖంగా వినపడేది. (ఆయన తర్వాత మంత్రిగా కూడా పనిచేశారు. ఐనా ఆయన నివాసమైన గుడిసెలో ఏ మార్పు కనిపించలేదు). ఓటింగ్‍కు రెండు పెట్టెలుండేవి. ఒకదానికి ఎర్ర కాగితం అంటించి వుండేది. అది జస్టిస్ పార్టీ రంగు. రెండో దానికి పసుపు రంగు కాగితం వుండేది. అది కాంగ్రెస్ గుర్తు. ఎక్కువమంది పసుపు రంగు కాగితం వున్న పెట్టెలోనే వేసినట్లు చెప్పుకునేవారు.

స్కూల్‍లో మంచి ఉపాధ్యాయులుండేవారు. ప్రధాన ఉపాధ్యాయులు చెన్నుంబొట్ల గోపాలరావుగారు, దింటకుర్రులోనే తాత్కాలికంగా వుండేవారట. అలాగే తెలుగు మాస్టారు, డ్రిల్లు, డ్రాయింగ్ మాస్టార్లు కూడా వుండేవారు. లెక్కలు "పొట్టి వెంకటేశ్వర్లుగారు" చెప్పేవారు. రాధాకృష్ణమూర్తిగారికి లెక్కల్లో 30-35 శాతం మించి మార్కులు ఎన్నడూ వచ్చేవి కాదట. ఆ పంతులు గారు ఆయనను, "ఏరా కమ్మ బ్రాహ్మడూ!" అని సరదాగా పిలిచేవారట. అది కోపంతో కాదు, బహుశా వేళాకోళమేమో అంటారు డాక్టరుగారు.

పక్క వూరు ముదునూరు - గోపరాజు రామచంద్ర రావు (గోరా) గారి స్వగ్రామం. ఒకటి రెండు సార్లు ఆయన బందరు కాలేజీ నుండి డిస్మిస్ అయిన తరువాత, ఆ స్కూల్‍లో మీటింగ్ పెట్టారట.

పాఠశాలకు రెండొందల గజాల దూరంలో కాలవ గట్టు మీద, ఒక పొట్టి తాటి చెట్టుండేదట. దాని కింద కూర్చొని, కొందరు పిల్లలు, మధ్యాహ్నం పూట అన్నాలు తిని, కాలవలో చేతులు కడుక్కునేవారు. ప్రత్యేకత ఏమిటంటే, ఆ చెట్టుకు తలలో ఎన్నో మొవ్వులుండేవట. దానిని "నూరు మొవ్వుల తాడి" అనేవారు. కొన్నాళ్లకు పక్క పొలంలో ఆసామి, దానికి దైవత్వం వుందని ప్రచారం చేసి, పూజలు మొదలు పెట్టారు. జనం విరివిగా రావడం మొదలైంది. ఒక రాత్రి ఎవరో (గోరా గారి శిష్యుల పనే అని చెప్పుకునేవారట!) ఆ చెట్టును నరికేశారు.

మరొక విశేషం - స్కూల్ కు ఒకటి-రెండు మైళ్ల దూరంలో, ఒక చెట్టేదో, పగలు సగం వంఘి వుండి, రాత్రికి నిలువుగా వుండేదని, ప్రచారం సాగి, దానికి దైవత్వం ఆపాదించడం మొదలెట్టారు కొందరు. గోరాగారు దానికి శాస్త్రీయమైన కారణం చెప్పి, వరసగా కొన్నాళ్లు నీళ్లు పోయించిన తరువాత, అది ఎప్పుడూ తిన్నగా నిలబడే వుండేదని చెప్పుకునేవారట!

ఎన్.వీ.ఎస్ ప్రసాదరావును (కారణం తెలియదు) కమ్యూనిస్ట్ పార్టీ బహిష్కరిస్తే, కాంగ్రెస్‍లో చేరి, మరో ఇద్దరితో సహా (భూపతి రావు, రాజ్యం) యువజన కాంగ్రెస్ నేతలుగా - మంచి ఉపన్యాసకులుగా పేరు తెచ్చుకున్న విషయం చెప్పారు డాక్టర్‍గారు. ఆయన తరువాత కాలంలో, గోపాలరెడ్డిగారి ప్రాపకంతో, కొంతకాలం రేడియో కేంద్రంలో పనిచేసి, కొన్నాళ్లు రవీంద్రభారతి మేనేజరుగా పని చేశారట.

ఉన్నత పాఠశాల (1941-43) - గుడివాడ:

వానపాములలో ఎనిమిదో తరగతి వరకే వుంది. హైస్కూల్ చదువుకు గుడివాడ వెళ్లాలి. తండ్రి సీతారామయ్యగారు, దత్తుడుని ఒంటరిగా పంపడం ఇష్టం లేక, కాపురం గుడివాడకే మార్చారు. ’పాటిమీదకొల్లి కోటయ్య గారి ఇళ్ల కాంప్లెక్స్‍లో ఒక ఇంట్లో అద్దెకు చేరారు. కోటయ్యగారు ధరణికోట ఆశ్రమం నిర్వహిస్తూ, వేదాంతిగా పేరు తెచ్చుకున్నారు. కాని అక్కడంతా కమ్యూనిస్ట్ వాతావరణం. వారి పెద్దబ్బాయి డాక్టర్ గురునాధరావు, రెండొతను ప్రత్యగాత్మ, మూడవవాడు హేమాంబరం. (ప్రత్యగాత్మ, హేమాంబరం తరువాత సినీరంగంలో డైరెక్టర్లుగా పేరు తెచ్చుకున్నారు). అల్లుడు మల్లిఖార్జునరావు. అందరూ పార్టీ వారే! వారి మధ్యనే మూడు సంవత్సరాలు గడిపారు డాక్టర్‍గారు. గుడివాడలో చదువుతున్నప్పుడు జరిగిన రెండు-మూడు ముఖ్య ఘటనలను కూడా గుర్తు చేసుకున్నారాయన.

మొదటిది, 1942, 8 ఆగస్టున మొదలైన క్విట్ ఇండియా ఉద్యమం. పట్టణమంతా గొడవలు - అల్లర్లు జరుగుతుండేవి. వీళ్లను బయటకు వెళ్లకుండా ఇంట్లో కట్టడి చేశారు పెద్ద వాళ్లు. అప్పుడు గుడివాడలో కాంగ్రెస్ నాయకులుగా వినిపించే పేర్లలో ముఖ్యమైనవి లాయర్ కేతవరపు నర్సింహంగారిది, ఫొటో స్టూడియో స్వామి (తరువాత ఖమ్మంలో "మెట్రో స్టూడియో"గా అభివృద్ధి చేసుకున్నారు)గారిది, హోమియో డాక్టర్ గుర్రాజు (గుడివాడ హోమియో కళాశాల స్థాపకులు) గారిది. రెండో సంఘటన, రవీంద్రనాథ్ టాగోర్ మరణం ( ఆగస్ట్ 7, 1941) నాడు తమ హైస్కూల్ లో జరిగిన సంతాప సభ. ఉపాధ్యాయులు కొందరు ఆయనను గురించి చాలా గొప్పగా చెప్పడంతో, టాగోర్ రచనలను ఎప్పుడైనా చదవాలన్న ఆలోచన తన మనసులో పడిందంటారు. మూడవది, కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరిగారి గజారోహణ ఉత్సవం. వారి రచనలను విరివిగా అందుబాటులోకి తెచ్చారు. రాధాకృష్ణమూర్తిగారి తండ్రి ఆయన అభిమాని కావడంతో, ఆ పుస్తకాలన్నీ తమ ఇంట్లో వుండేవట. అప్పట్లో కొన్ని, తరువాత చాలా వరకు చదివినట్లు చెప్పారు డాక్టర్‍గారు.

హైస్కూల్ ఉపాధ్యాయులలో కొందరిని మర్చిపోలేమన్నారు. ముందుగా తెలుగు పండితులు బసవ కోటిలింగంగారి ప్రస్తావన తెచ్చారు. ఈయన తన మీద ప్రత్యేక శ్రద్ధ చూపించే వారట. ఆయన శైవుడు (మెడలో జంగాలకు వుండే లింగం వుండేది). కాని బుద్ధుడి మీద చాలా అభిమానం. వీలున్నప్పుడల్లా బౌద్ధ మత విశేషాలు వివరించేవారట. తెలుగు భాషపై శ్రద్ధ కలగడానికి ఆయన మొదటి కారణంగా చెపుతారు. తరువాత ఎస్.ఎస్.ఎల్.సీ లో "ఇంగ్లీషు చెప్పిన మాస్టారు" గురించి చెప్పారు. ఆయన భాషతో పాటు "రెన్ అండ్ మార్టిన్" ఇంగ్లీష్ గ్రామర్‍తో పూర్తి కసరత్తు చేయించేవారట. ఇక లెక్కల మాస్టారు ఆచారిగారు చక్కగా బోధించడంతో తనకు 30% అత్తెసరు మార్కుల నుండి 70% మార్కులు రావడంమొదలైందట. ఎస్.ఎస్.ఎల్.సీలో అప్పుడొక ఐఛ్చిక (Optional) సబ్జెక్ట్ కూడా వుండేది. డాక్టర్‍గారు కెమిస్ట్రీ తీసుకున్నారు. దాన్ని మాణిక్యాలరావు మాస్టారు ఎంతో బాగా చెప్పేవారు. రసాయన శాస్త్ర ప్రయోగాలు చేసి చూపించేవారట. వారికిఈ ఈనంటే చాలా ఆప్యాయత. ట్యూషన్ అంటే ఎరుగరట. గొప్ప ఉపాధ్యాయుల పుణ్యం కావచ్చు, ఆయన శ్రమ కావచ్చు.... ఎస్.ఎస్.ఎల్.సీ లో హైస్కూల్ లో ప్రధముడుగా ఉత్తీర్ణుడయ్యానని, ఆనాడది ఒక సంతృప్తిగా వుండేదని చెప్పారు.

ఇంటర్ (1943-45) - బందరు:

అప్పట్లో కృష్ణా జిల్లాలో రెండే కాలేజీలుండేవి. ఒకటి బందరులోని హిందూ కాలేజీ, రెండోది బెజవాడలోని ఎస్ ఆర్ ఆర్ కాలేజీ. హిందూ కాలేజీకి మంచి క్రమ శిక్షణ, మంచి అధ్యాపక-ఇతర సిబ్బంది కలదన్న పేరుండేది. అది పూర్తిగా "వైదికుల" కాలేజీ అనేవారు. దానికి తగినట్లే, బందరు కాలేజీలో పనిచేసే ఒక్క లెక్చరర్ కూడా మీసాలుండేవి కాదట. ఒకే ఒక మినహాయింపు పువ్వాడ శేషగిరిరావుగారని చెప్పారు. అంతకు ముందు కొంత కాలంగా ఒక వెలుగు వెలిగిన క్రిస్టియన్స్ నోబుల్ కాలేజీ, జాతీయోద్యమంలో పుట్టిన నేషనల్ కాలేజీ మూతపడి వున్నాయి. ఆ కాలేజీలో ఇంటర్ లో చేరడంతో, రాధాకృష్ణమూర్తిగారి తల్లితండ్రులు తమ కాపురం కూడా - ఆయన కోసం- బందరుకు మార్చారు. "ఇంగ్లీషు పాలెం" లో, కాలేజీకి దగ్గరలో, ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నారు.

బందరు చాలా చరిత్ర కలిగిన పురాతన పట్టణం. అంతటా ఇసుక మైదానాలు, సరివి తోటలు, సముద్ర తీరం. ఓడ రేవున్నందున మొదలు డచ్చివారు, తరువాత ఫ్రెంచ్ వారు, ఆ తరువాత ఆంగ్లేయులు ఆ ఓడ రేవులతో వ్యాపారాలు కొనసాగించేవారు. అందుకే ఇప్పటికీ డచ్చి పేట, ఫ్రెంచి పేట, ఇంగ్లీషు పాలెంలు వున్నాయి. దానికి మఛిలీ పట్నం (మఛిలీ అంటే "చేప") అని పేరుంది. ఇంగ్లీషులో "మసులీపటం" గా పిలిచారు. ఉప్పు తయారీకి బందరు ఒక పెద్ద కేంద్రం. ఆప్పటికే ఆంధ్ర సైంటిఫిక్ కంపెనీ వుండేది. చాలా స్వచ్చమైన, కాలుష్యం లేని బీచుల్లో మంగినపూడి బీచ్ ఒకటి. ఆ ఊరిలోనే వున్న "చిలకల పూడి" రోల్డ్ గోల్డ్ ఆభరణాలకు ప్రసిద్ధి. "బందరు లడ్డూ" ఆంధ్ర దేశపు స్పెషాలిటీలలో ఒకటి! విశాఖ మెడికల్ కాలేజీలో, బందరు విద్యార్థులను, కొత్తలో చేరినప్పుడు, "బందరు లడ్డూ" అని రాగింగ్ చేసేవారట. అది జాతీయోద్యమ అగ్రనాయకులలో ఒకరైన డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్యగారి ఊరు. జాతీయోద్యమ పాత్రికేయులు మట్నూరి కృష్ణారావుగారు అక్కడ నుండే ప్రసిద్ధ "కృష్ణాపత్రిక" నడుపుతుండేవారు. ఆ పేర్లు, ఆ చరిత్ర, ఆనాడు వినడమే కాని, వారిని చూసే అవకాశం తనకు కలగలేదంటారు డాక్టర్ గారు.

ఇక కాలేజీ విషయానికొస్తే, ప్రిన్సిపాల్ శివరామకృష్ణయ్య గారంటే పిల్లలందరికీ హడల్. ఆయన క్రమశిక్షణకు మారుపేరని, కాస్తంత కోపంగా విద్యార్థులు ఆయనకు "అత్తరు సాయిబు" అని నిక్ నేమ్ పెట్టారని చెప్పారు డాక్టర్‍గారు. ఆయనకు మంచి స్ఫూర్తినిచ్చిన మరికొంతమంది లెక్చరర్లను గుర్తుచేసుకున్నారు. ముందుగా షేక్ స్పియర్ పాఠాలు చెప్పిన ముత్తు అయ్యర్ గారి విషయం చెప్పారు. ఆయన నల్లగా, పొట్టిగా, బొద్దుగా వుండేవారు. తల పాగా, ధోవతి లోకి చొక్కా, పైన బెల్టు, ఆపైన నల్ల కోటు వేసుకునే వారు. వేషం ఎలా వున్నా, ఆయన పాఠం చెప్పే తీరు మాత్రం అద్భుతం అంటారు డాక్టర్‍గారు. ఆయనకు షేక్‍స్పియర్ (Shakespeare) రచనలు - నలభై - నాటకాలు కంఠతా వచ్చట. ఇంటర్ పాఠ్య గ్రంధం "As You Like It" నాటకం కాని, "Othello", "Macbeth", "Merchant of Venice", కాని Extensive గా Quote చేస్తూ, ఆయా పాత్రలకు అనుగుణంగా స్వరం, Accent మార్చి నాటకీయంగా తరగతి నడిపేవారట. అలాగే శివకామయ్య మాస్టారు విషయం చెప్పారు. ఆయన ఇంగ్లీషు గద్య భాగం చెప్పేవారు. అతి కష్టంగా వుండే RL Stevenson రచనలను, పండు వలిచినట్లు చెప్పేవారట. ఆ ఇద్దరి పాఠాలు వింటుంటే, ఏ విద్యార్థికైనా ఇంగ్లీషు భాషపై ఆసక్తి కలగాల్సిందేనట!

తెలుగు అధ్యాపకుల ప్రస్తావన తెచ్చారు. సర్వా శేషయ్యగారు సంస్కృతం, తెలుగు రెండింటిలో ఎం.ఏ చేశారట. మనిషి వేష ధారణ పేద బ్రాహ్మణుడిలా వుండేది. మొహాన విభూతి రేఖలు, మధ్య కుంకుమ బొట్టు! ఆయన "గిరిజా కల్యాణం" పుస్తక పాఠం చెపుతుంటే, సాధారణంగా తరగతులు ఎగ్గొట్టే విద్యార్థులు కూడా తప్పకుండా హాజరయ్యేవారట. హాస్యం, వ్యంగ్యం, శృంగారం - సకల రసాలు ఆయన కంఠంలో అలవోకగా వచ్చేవంటారు. మరొక గొప్ప తెలుగు దిగ్గజం పువ్వాడ శేషగిరి రావు గారి గురించీ చెప్పారు. ఆయన వేషం సంప్రదాయ, ఆధునికతలు కల బోసి వుండేదట. అందమైన వ్యక్తి. "తిక్కన"పై ఆయనకు చెప్పలేనంత అభిమానం. తన కుమారుడి పేరు కూడా తిక్కన అని పెట్టుకున్నారు. స్వయంగా ఆయనొక కవి. అప్పటికే "గోవత్సం", "ముంతాజ్ మహల్" అనే ఖండ కావ్యాలు రాశారు. మొదటిది బి.. పాఠ్య గ్రంథంగా కూడా పెట్టారు. "పంచవటి" కావ్యాన్ని ఆయన శ్రావ్యంగా - రాగ యుక్తంగా వినిపిస్తూ, అద్భుతంగా చెబుతూనే, మధ్య - మధ్య తిక్కన గారి భారత పద్యాలు వినిపించి, వాటి విశిష్టత వివరించేవారు. నిజంగా అలాంటి మహానుభావుల నుండి పాఠాలు వినడం తనకు లభించిన గొప్ప అదృష్టంగా చెప్పారు డాక్టర్ గారు.

సైన్స్ సబ్జెక్ట్స్ - బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ - బోధించిన మాస్టర్లు కూడా గుర్తుంచుకోదగిన వారే నంటారు. వారి అధ్యాపక నైపుణ్యం వల్లే, తనకు ఇంటర్ పబ్లిక్ పరీక్షలలో, ఆ మూడు సబ్జెక్ట్స్ ‍లో డిస్టింక్షన్ మార్కులు వచ్చాయన్నారు. అప్పటికి "ట్రిపుల్ డిస్టింక్షన్" ఒక గొప్పగా వుండేదట. ఐతే, తనకిష్టమైన తెలుగులో డిస్టింక్షన్ రెండు మార్కులతో మిస్ కావడం ఆ రోజుల్లో ఆయనను కాస్త బాధించిందట! తనకు పరీక్షల విషయంలో, తల్లిదండ్రుల నుండి ఎలాంటి వత్తిడి వుండేది కాదన్నారు. ట్యూషన్ల ప్రమేయమే లేదట. పాఠాలు శ్రద్ధగా వినడం, బుద్ధిగా చదువుకోవడం చేసేవారట! ఇంటర్‍లో మిత్రులుగా వుండి, ఆ తరువాత, వివిధ వృత్తులలో స్థిరపడిన ఆర్.వి. కృష్ణారావు, పోలవరపు వెంకటేశ్వరరావు, నాంచారయ్యలతో పాటు పలువురు స్నేహితుల పేర్లను గుర్తు చేసుకున్నారు డాక్టర్‍గారు.

1944 లో, ఆయన ఇంటర్ రెండో సంవత్సరంలో వున్నప్పుడు, పెద్ద ఎత్తున జరిగిన ఆ నాటి "బెజవాడ" అఖిల భారత రైతు మహా సభలను జ్ఞాపకం చేసుకున్నారు. అవి ఈ నాటికీ, కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రలో ముఖ్య ఘట్టాలుగా చెప్పుకుంటారన్నారు. ఆ సందర్భంగా బందరు నుండి తన మిత్రులతో కలిసి, ఆ మహా సభలకు ప్రేక్షకులుగా వెళ్లడం, చండ్ర రాజేశ్వరరావు, సుందరయ్య, చలసాని వాసుదేవరావుగార్లతో పాటు, బీహారుకు చెందిన ప్రసిద్ధ రైతు నాయకుడు స్వామీ సహజానందను (కాషాయ వస్త్రాలతో) వేదిక మీద చూసినట్లు గుర్తుచేసుకున్నారు. ఇంటర్ చదువుతున్నప్పుడే, ఆనాటి విద్యార్థి ఫెడరేషన్ (AISF) తో సంబంధాలుండేవి డాక్టర్‍గారికి. పార్టీతో పెద్దగా సంబంధాలు లేకపోయినా, పట్టణ విద్యార్థి ఫెడరేషన్ కమిటీలో తీసుకున్నారు డాక్టర్‍గారిని. అప్పటినుంచే, దాసరి నాగభూషణరావు (ఆ తరువాత ఆయన భారత కమ్యూనిస్ట్ పార్టీ ముఖ్య నాయకుడుగా, రాజ్య సభ సభ్యుడుగా వున్నారు) గారితో పరిచయం ఏర్పడింది. ఆయన ఇంటర్‍లో హ్యుమానిటీస్ సెక్షన్‍లో చదువుతుండేవారట.

ఆ సందర్భంగా మరొక సంఘటన గుర్తుచేసుకున్నారు. కాంగ్రెస్ నాయకుడు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యుడుగా వున్న కాట్రగడ్డ నారాయణరావుగారిని, ఉపన్యాసకుడుగా, ఒక విద్యార్థి బహిరంగసభకు ఆహ్వానించారట. బెజవాడకు చెందిన కాట్రగడ్డవారి కుటుంబం (సోదరులు మధుసూధనరావు, నారాయణరావు, "నవయుగ" శ్రీనివాసరావుగార్లు)కాంగ్రెస్ పార్టీలో వున్నప్పటికీ, వామపక్ష అభిప్రాయాలతో ఏకీభవించుతూ, సుందరయ్య-రాజేశ్వరరావుగార్లతో సన్నిహిత సంబంధాలు కలిగుండేవారు. కాంగ్రెస్ అంతర్గత విభేదాలతో, నారాయణరావుగారు బహిరంగంగానే కమ్యూనిస్టులకు అనుకూలంగా మాట్లాడేవారు. ఆనాటి నారాయణరావుగారి ప్రసంగం తనకు కొంత స్ఫూర్తినిచ్చిందంటారు డాక్టర్‍గారు.

మంచి మార్కులతో ఇంటర్ పాసైన తరువాత, ఏం చేయాలో - ఏం చదువుతే భవిష్యత్ బాగుంటుందో గైడ్ చేసేవారు ఎవరూ లేరట అప్పుడు. స్నేహితులతో సంప్రదించి, ఆంధ్రా యూనివర్సిటీకి ఒక అప్లికేషన్, ఆంధ్రా మెడికల్ కాలేజీకి మరొక అప్లికేషన్, మార్కుల జాబితా జతపర్చి పంపించారట. కొన్ని రోజుల తరువాత ఆంధ్రా యూనివర్సిటీ నుండి వుత్తరం వచ్చింది. (అప్పుడు ఆంధ్రా యూనివర్సిటీ గుంటూరు నుండి పనిచేసేది. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో జపాన్ యుద్ధ విమానాలు విశాఖ హార్బర్ మీద బాంబులు వేశాయి. ఆ భయంతో యూనివర్సిటీ గుంటూరుకు మార్చారు). బీ.ఎస్సీ. (ఆనర్స్), జియో ఫిజిక్స్ లో సీట్లు వచ్చినట్లు తెలవడంతో, ఏదో ఒకటి అనుకుని వెళ్లి ఫీజు కట్టి వచ్చారట. ఇంకా తరగతులు ప్రారంభం కాకముందే, మరో వారం లోపున, మెడికల్ కాలేజీనుండి సీటు వచ్చినట్లు ఉత్తరం వచ్చింది.

మెడికల్ కాలేజీలో సీటు రావడం ఇప్పట్లో చాలా కష్టమనీ, ఆ రోజుల్లో తేలిగ్గా వచ్చేదన్న కొందరి అభిప్రాయం సరైంది కాదన్నారు డాక్టర్ గారు. అది నిజం కాదని అంటూ, అప్పుడు సర్కారు - సీమ జిల్లాలకు కలిపి ఒకే ఒక్క మెడికల్ కాలేజీ వుండేదని, సీట్లు మొత్తం 54 మాత్రమే వుండేవని, వాటిలో ఎంపీసి (లెక్కలు, ఫిజిక్స్, కెమిస్ట్రీ) సబ్జెక్టులు తీసుకున్న వారికి - సైన్స్ లో బి., బి.ఎస్సీ చేసిన వారికి కూడా అవకాశం వుండేదని అన్నారు. రాధాకృష్ణమూర్తిగారి బాచ్ లో 54 మందికి గాను, 28 మంది గ్రాడ్యుయేట్లే. అందులో ఇద్దరు ఎమ్మెస్సీ చేసిన వారున్నారు. ఒకరు (విజయనగరానికి చెందిన రామ మోహన రావు గారు) పూనాలో ఇంటర్ + ఎల్ ఎల్ బి చేసి వచ్చారు.

· Marx to L. Krugman (9th October, 1866: Selected Works – Volume-I):

“In desperate situations, every human being feels the need of unburdening himself to somebody. But he does that only to persons in whom he places particular and exceptional confidence”

· Engles on Marx at his funeral:

“He may have many opponents – but he had hardly one enemy”

2 comments:

  1. He was 2years senior to me in AndhraMedical college.He was once arrested for participating in banned communist activities.He was a bright student.After M.B.B.S. he started practice in Khammam.Iknow only that much about him.

    ReplyDelete
  2. Dear Dr Ramana Rao Garu,
    I conveyed your comments to Dr.YRK. He recollected you and felt very happy. Chapter after chapter I will be keeping in my blog almost on daily basis. The next is on his medicine course in Vizag in which he recollected several of his classmates and professors' names. You may find it interesting. Jwala

    ReplyDelete