Saturday, November 5, 2011

పౌరహక్కులను హరించి వేసేందుకు నాంది పలికిన ప్రభుత్వం: వనం జ్వాలా నరసింహారావు

ఈ అరెస్టులు సూచిస్తున్నదేమిటి?

ఆంధ్ర జ్యోతి దినపత్రిక (8-11-2011)

వనం జ్వాలా నరసింహారావు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో అధిష్టానంకు చెందిన ఒక్కో కాంగ్రెస్ నాయకుడు ఒకరోజొక మాట, మర్నాడొక మాట, ఒకదానికి మరొకటి పొంతన లేకుండా మాట్లాడడం పరిపాటిగా మారింది. ఒకానొక రోజుల్లో, రాజకీయ పార్టీల నాయకులు, "స్పష్టత" తో మాట్లాడడమే విశ్వసనీయతకు గీటు రాయిగా భావించేవారు. నాలుగు దశాబ్దాల క్రితం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం నేపధ్యంలో, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసేది లేదని (ఆమె నిర్ణయం మనకు నచ్చినా నచ్చకపోయినా) స్పష్టంగా తేల్చి చెప్పింది ఇందిరాగాంధి. ఈ రోజుల్లో, ఎంత "అస్పష్టత" వుంటే అంత విశ్వసనీయత అనుకుంటున్నారు (ముఖ్యంగా కాంగ్రెస్) రాజకీయ నాయకులు. ఆరంభంనుంచీ నేటి వరకూ ఒక్క మాట మీద నిలబడ్డ తెలంగాణ రాష్ట్ర సమితిని మినహాయిస్తే, ఏ రాజకీయ పార్టీలో కూడా తెలంగాణ ఏర్పాటు విషయంలో స్పష్టత అనేది నూటికి నూరుపాళ్లు వుందా అని ప్రశ్నిస్తే "లేదు" అనే సమాధానమే వస్తుంది. ఒక ఓటుకు రెండు రాష్ట్రాలని నినాదమిచ్చిన భారతీయ జనతా పార్టీకి "ఇచ్చే స్థితి లో వున్నప్పుడు స్పష్టమైన విధానం కొరవడినందున, "అడిగే స్థాయి" కి వచ్చిందాకా "స్పష్టత" రాలేదు. ఇక కమ్యూనిస్టులలో సగం మందికి ఒక రకమైన అస్పష్టత వుంటే, ఇంకో సగం మందికి వేరే విధమైన అస్పష్టత. అలానే మిగతా పార్టీలు కూడా.

డిసెంబర్ తొమ్మిది (2009) న చెప్పిన మాట మార్చిన "కాంగ్రెస్ పార్టీ-యూపీఏ కేంద్ర మంత్రి" చిదంబరం, బక్రీద్ తరువాత తెలంగాణపై ప్రకటన చేస్తామని చెప్పి రోజన్న తిరక్కుండానే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమకారులపై "పిడి" ని ప్రయోగించింది. ఇది శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని చీకటి అధ్యాయాన్ని అమలు చేయడానికా? ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారులను, తెలంగాణ కోసం పోరాడుతున్నవారిని అణగదొక్కే చర్యలకు శ్రీకారం చుట్టడానికా? ఇవేవీ కాకపోతే టిఆర్ఎస్ పొలిట్‌ బ్యూరో సభ్యుడిని అర్థ రాత్రి దాటిన తర్వాత పిడి చట్టం కింద అరెస్ట్ చేయాల్సిన ఆగత్యం ఏమిటి? అరెస్టు చేయబడిన వ్యక్తికి గతంలో మావోయిస్టు కార్యకర్తలతో సంబంధాలు వుండవచ్చు. జనశక్తి, మావోయిస్టు కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొని వుండవచ్చు. కానిప్పుడు అందరిమధ్యా, ప్రజాస్వామ్య ఉద్యమాల మధ్యా వుంటూ, గుర్తింపు పొందిన ఒక ప్రాముఖ్య తెలంగాణ రాజకీయ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడుగా వున్నాడే! అంటే నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష ఐన ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారులపై పిడి చట్టం ప్రయోగించడం, పౌరహక్కులను ఉల్లంఘించడం మొదలైందనుకోవాలా?

ఇలా పౌరహక్కులను అణచి వేయడం గమనిస్తుంటే, గతం గుర్తుకొస్తోంది. భారత చైనా యుద్ధం నేపథ్యంలో కమ్యూనిస్టు పార్టీ చీలిపోవడం, పిడి చట్టం కింద చైనా వాదులుగా ముద్రపడిన సిపిఎం పోలిట్‌ బ్యూరో సభ్యుల నుండి జిల్లా స్థాయి ముఖ్య నాయకుల వరకు వేయి మందికి పైగా, అర్థరాత్రి అరెస్ట్ కావడం జరిగింది. అలనాటి కేంద్ర హోం శాఖ మంత్రి గుల్జారిలాల్ నందా పిడి చట్టానికి రూపకర్తంటారు. ఏదేమైనా అప్పుడు అరెస్టు కాబడింది కమ్యూనిస్టులే కాబట్టి, అందునా అతివాద గ్రూపుకు చెందిన (ఇంకా నక్సల్‍బరీ ఉద్యమం రాలేదు) వారు కాబట్టి, పిడి చట్టాన్ని కాని, అరెస్టులను కాని ఖండించిన రాజకీయ పార్టీలు ఒక్కటీ కూడా లేవు. చట్టాన్ని తమ పార్టీ కార్యకర్తలమీద ఉపయోగించలేదన్న సంతృప్తితో వున్నారు వారంతా!

దశాబ్దంన్నర తరువాత ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన దరిమిలా, అన్ని రాజకీయ పార్టీలకు అరెస్టులు స్వానుభవంలోకొచ్చ్చాయి. అప్పుడు గుర్తుకువచ్చింది వారందరికీ. భారత చైనా యుద్ధం నేపథ్యంలో చోటుచేసుకున్న సిపిఎం నాయకుల అరెస్టును అప్పుడే ఖండించి వుంటే, తమకీ గతి పట్టి వుండేది కాదని! వాస్తవానికి, ఆ రోజున సిపిఎం పట్ల ప్రభుత్వం అవలంబించిన పౌరహక్కుల ఉల్లంఘన, భవిష్యత్‌లో సిపిఐపై కానీ, ఇతర రాజకీయ పార్టీలపైన కానీ అవలంబించరన్న నమ్మకం లేదని దాసరి నాగభూషణం లాంటి రాష్ట్ర సిపిఐ నాయకులకు, ఇతర పార్టీ నాయకులకు, ఖమ్మం జిల్లాకు చెందిన అలనాటి పౌరహక్కుల ఉద్యమ ఆద్యులు-"మేధావి త్రయం" గా పేరు తెచ్చుకున్న డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి, అడ్వకేట్లు కె.వి.సుబ్బారావు, బోడేపూడి రాధాకృష్ణలు చెప్పారు. కలిసి ఉద్యమించడానికి ఉభయ కమ్యూనిస్టులు అంగీకరించినా, ఇతరులు తమకెందుకులే అని నిర్లిప్తతతో వున్నారు. ఆ నిర్లిప్తత పర్యవసానమే ఎమర్జెన్సీ అరెస్టులు, ఈనాటి తెలంగాణ ఉద్యమ నేతల పిడి అరెస్టులు.

ప్రభుత్వ ఆదేశాలను-ఉత్తర్వులను విధేయతతో దేశ ప్రజలు పాటిస్తున్నంత వరకు పౌర హక్కుల సమస్యే తలెత్తదు. అలా ప్రజలు వాటిని పాటిస్తున్నారంటే అవి న్యాయ సమ్మతమైనవని, ధర్మసమ్మతమైనవని భావించాలి. దీనికి విరుద్ధంగా ప్రజలకు, ప్రభుత్వ వ్యవస్థకు మధ్య సంఘర్షణ తలఎత్తితే పౌర హక్కుల సమస్య తెర పైకొస్తుంది. అంటే ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే హక్కు ప్రజల కుందని, అదే పౌరులకు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ప్రసాదించిన ప్రాధమిక హక్కైన భావ స్వాతంత్య్రమని అందరూ గుర్తించాలి. అయితే అదే రాజ్యాంగంలో అవసర మైనప్పుడు ప్రభుత్వానికి అండగా ఉండే రీతిలో ముందు జాగ్రత్త చర్యగా పొందు పరిచిన కొన్ని నిబంధనలు ("పిడి", "మీసా", "ఎస్మా" లాంటివి) ఎమర్జెన్సీ లాంటి సమయాల్లో (ఇప్పుడు ఎమర్జెన్సీ కాకపోయినా-తెలంగాణ ఉద్యమ నేపధ్యంలో) పౌర హక్కులకు భంగం కలిగించే చర్యలు చేపట్టే అవకాశం కలిగిస్తోంది. బహుశా ప్రజాస్వామ్యంలో ఇవన్నీ మామూలేనేమో. అలానే వ్యతిరేకంగా ఉద్యమించడమూ సహజమేనేమో!

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజుల్లో దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు నాయకులను జెళ్ళలో నిర్బంధించిన నేపథ్యంలో వారిని విడుదల చేయించేందుకు, 1948లోనే ఆచార్య కె.పి.చటోపాధ్యాయ అధ్యక్షతన, పశ్చిమ బెంగాల్‌లో మొట్ట మొదటి ప్రయత్నంగా పౌర హక్కుల సంఘం స్థాపించడం జరిగింది. 1962 నాటి భారత-చైనా యుద్ధం ప్రభావంగా నాటి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన "ముందస్తు నిర్బంధ చట్టం" (పి.డి. యాక్ట్) అమలులో భాగంగా వేయి మందికి పైగా కమ్యూనిస్టుల నిర్బంధంతో ఆరంభమైన ఉద్యమకారుల నిర్బంధ చట్టాలు, ఎమర్జెన్సీ రోజుల నాటికి దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల నాయకుల నిర్బంధంతో పరాకాష్ఠకు చేరుకున్నాయనవచ్చు. ముఖ్యంగా ఎమర్జెన్సీ రోజుల నాటి చేదు అనుభవాల నేపథ్యంలో, ప్రజా స్వామ్య విలువల పరిరక్షణకు, పౌర హక్కుల సంఘాల ఆవిర్భావం జోరందుకుంది. వాటిలో ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల కమిటి, పి.యు.డి.ఆర్‌, పంజాబ్‌ ప్రజాస్వామ్య హక్కుల సంఘం, పి.యు.సి.ఎల్‌. లాంటి కొన్నింటిని ప్రధానంగా పేర్కొనవచ్చు. రాజకీయ ఖైదీల విడుదలకే మొదట్లో ఉద్యమించిన పౌర హక్కుల సంఘాలు, క్రమేపీ తమ పరిధిని విస్తృత పరచుకుంటూ పౌరహక్కుల అణచివేత వ్యతిరేక ఉద్యమాలు చేపడుతున్నాయి.

ఐతే ఎన్ని రకాల పౌరహక్కుల సంఘాలు ఆవిర్భవించినా, ఎన్ని ఉద్యమాలు నడిచినా, జరిగే నష్టం జరుగుతూనే వుంది. పౌరహక్కుల ఉల్లంఘన జరుగుతుందనీ, భవిష్యత్‍లో జరగదన్న నమ్మకం లేదనీ, సాక్షాత్తు భారతదేశ అత్యున్నత న్యాయస్థానమే అభిప్రాయపడిందంటే అంతకంటే ఆశ్చర్యపడాల్సిన అంశం ఏముంటుంది? కంచే చేనును మేసిందని, పౌరుల ప్రాధమిక హక్కులను పరిరక్షించాల్సిన అత్యున్నత న్యాయస్థానమే(సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా) వాటి ఉల్లంఘనకు మార్గం సుగమం చేసిందని, దాదాపు పాతికేళ్ల విరామం తర్వాత, అదే అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. ఈ ఏడాది, జనవరి 2011 మొదటి వారంలో, ఒక రివ్యూ పిటీషన్లో ఇచ్చిన తీర్పులో, అస్సాంకు చెందిన చౌహాన్ అనే వ్యక్తికి సుప్రీం కోర్టు విధించిన మరణ శిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మారుస్తూ, పౌరుల ప్రాధమిక హక్కుల ఉల్లంఘన అరుదుగా జరిగే వీలున్నప్పటికీ, భవిష్యత్ లో అసలే జరుగదనే నమ్మకం లేదన్న అభిప్రాయం వెలిబుచ్చింది అత్యున్నత న్యాయస్థానం . 1976 లో, ఎమర్జెన్సీ విధించిన సందర్భంలో, అత్యున్నత న్యాయస్థానం ముందుకొచ్చిన ఒక "హెబియస్ కార్పస్ కేసు" లో తీర్పిచ్చిన నలుగురు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, "ఎమర్జెన్సీ అమల్లో వున్నప్పుడు పౌరుడి జీవించే హక్కు కూడా రద్దుచేయవచ్చు" అని అప్పటి (ఇందిరాగాంధీ) కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించిన విషయం జస్టిస్ ఆలం, జస్టిస్ గంగూలీలు ఈ సందర్భంగా పేర్కొనడం గమనించాల్సిన విషయం.

అలనాటి అత్యున్నత న్యాయస్థానం బెంచిలోని ఐదుగురు న్యాయమూర్తుల్లో ఒకరైన జస్టిస్ ఖన్నా, మిగిలిన నలుగురు సహచర న్యాయమూర్తుల మెజారిటీ తీర్పుతో ఏకీభవించకుండా వెలిబుచ్చిన అభిప్రాయాన్ని కూడా జస్టిస్ ఆలం, జస్టిస్ గంగూలీలు పేర్కొన్నారు. "హెబియస్ కార్పస్ ఆదేశం" అనేది రాజ్యాంగంలో ప్రధానమైన అంతర్భాగమని, అలాంటి ఆదేశాలను ఇచ్చే రాజ్యాంగపరమైన హైకోర్టుల అధికారాన్ని రద్దుచేసే నిర్ణయాధికారం ఎమర్జెన్సీ విధించినప్పుడు కూడా, రాజ్యాంగం ఎవరికీ దఖలు చేయలేదని, ఖన్నా వెలిబుచ్చిన అభిప్రాయాన్ని న్యాయమూర్తులు పేర్కొన్నారు. సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం ఎన్ వెంకటచలయ్య ఫిబ్రవరి 25, 2009 , ఖన్నా స్మారకోపన్యాసం చేస్తూ, ఎమర్జెన్సీ రోజుల నాటి మెజారిటీ నిర్ణయాన్ని "చరిత్ర పుటల్లో పనికిరాని పేజీలకు పరిమితం" చేయాలని చేసిన వ్యాఖ్యను కూడా న్యాయమూర్తులు గుర్తుచేసుకున్నారు. అలనాటి సుప్రీం కోర్టు నిర్ణయం పౌరహక్కుల అమలును త్రికరణ శుద్ధిగా కోరుకునే వారిపై ఎటువంటి ప్రభావం చూపిందో అర్థం చేసుకోవడానికి ఇదొక ఉదాహరణగా భావించాలి.

భారత రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత, రాజ్యాంగంలో పొందుపరచిన విధానం ప్రకారం, దేశంలోని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టుది. న్యాయం కొరకు పౌరుడు చివరి పోరాటం చేసే న్యాయ వ్యవస్థ కూడా సుప్రీం కోర్టే. దురదృష్టవశాత్తు, ఇందిరా గాంధి విధించిన ఎమర్జెన్సీ పుణ్యమా అని, 1975-1977 మధ్య కాలంలో, న్యాయ వ్యవస్థకున్న స్వతంత్ర అధికారాలకు భంగం వాటిల్లింది. "ముందస్తు నిర్బంధ చట్టాల" కు అనుగుణంగా అరెస్టు చేయబడి జైళ్లలో నిర్బంధించిన పౌరుల రాజ్యాంగ పరమైన హక్కులు కాల రాయబడ్డాయి. జబల్పూర్ అదనపు మెజిస్ట్రేట్-శివ కాంత్ శుక్లాల హెబియస్ కార్పస్ కేసు సుప్రీం కోర్టు ముందుకు విచారణకొచ్చింది. తీర్పిచ్చిన ఐదుగురిలో, నలుగురు న్యాయమూర్తులు ఏఎన్ రే, పిఎన్ భగవత్, వైవి చంద్రాచూడ్, ఎంహెచ్ బెగ్ ప్రభుత్వ సర్వాధికారాలను సమర్థించారు. ఎమర్జెన్సీ అమల్లో వున్నప్పుడు పౌరహక్కుల ఉల్లంఘన జరిగినా తప్పులేదన్న రీతిలో తీర్పిచ్చారు. జస్టిస్ ఖన్నా మాత్రం, విచారణ జరపకుండా నిర్బంధంలో వుంచడం పౌరుల వ్యకి స్వేచ్ఛ పై ఆంక్షలు విధించడమేనని తన తీర్పులో చెప్పారు. రాజ్యాంగ స్ఫూర్తికి, చట్ట ప్రాధాన్యత తెలియ చేయడానికి, భవిష్యత్ రోజుల విజ్ఞతకు, మెజారిటీ నిర్ణయం భవిష్యత్ లో సరిదిద్దడానికి, తన భిన్నాభిప్రాయం ఉపయోగపడుతుందని ఖన్నా అన్నారు ఆ రోజున. అదే జరిగిందిప్పుడు.

ఎమర్జెన్సీ విధించి పలువురిని నిర్బంధించి జైళ్లలో నిర్బంధించిన దరిమిలా, హెబియస్ కార్పస్ పిటీషన్ల రూపంలో చాలా మంది డిటెన్యూలు రాష్ట్ర హైకోర్టులను ఆశ్రయించారు. రాజ్యాంగం పౌరుడికి ప్రసాదించిన హక్కులకు భంగం కలిగిందని, తమ హక్కులను పునరుద్ధరించి విడుదలకు ఆదేశాలిప్పించాలని వారు కోరారు. అయితే, ఎమర్జెన్సీ విధించు తూ, రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులో, రాజ్యాంగం ప్రసాదించిన హక్కులన్నీ, తాత్కాలికంగా రద్దుచేస్తున్నట్లు పేర్కొనడంతో, వివిధ హైకోర్టులు, భిన్నాభిప్రాయాలను వెల్లడించాయి. ఎమర్జెన్సీ ఉత్తర్వులున్నప్పటికీ పౌరుడు కి వున్న రాజ్యాంగపరమైన హక్కుల ఉల్లంఘన జరగడానికి అంగీకరించని కొన్ని హైకోర్టులు, నిర్బంధాన్ని న్యాయస్థానాల్లో డిటెన్యూలు సవాలు చేయవచ్చని అభిప్రాయ పడ్డాయి. రాజ్యాంగపరమైన మౌలిక అంశం ఇమిడి వున్నందున సమస్య సుప్రీం కోర్టుకు చేరింది. మెజారిటీ న్యాయమూర్తులు ప్రభుత్వ ఉత్తర్వులకు అనుకూలంగా తీర్పు ఇస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎమర్జెన్సీ అమల్లో వున్నప్పుడు "కార్యనిర్వాహక వ్యవస్థ" దేశాన్ని కాపాడే బాధ్యత స్వీకరిస్తుందని, ఆ వ్యవస్థ చేపట్టిన చర్యలు, వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగాయనో, మరేదో కారణానో సవాలు చేయడం సరికాదని, "వ్యక్తి స్వేచ్ఛ చట్ట పరిధికి లోబడి, నియంత్రించబడి" వుంటుందని న్యాయ మూర్తులు అన్నారు. స్వేచ్ఛ "చట్టం ఇచ్చిన కానుక" లాంటిదని, అదే చట్టం ఆ కానుకను వెనక్కు తీసుకోవచ్చునని వారంటారు. తాత్కాలికంగా పౌరుల ప్రాధమిక హక్కుల ఉల్లంఘన జరిగినంత మాత్రాన, సుప్రీం కోర్టు-హైకోర్టుల అధికారాలకు భంగం కలిగిందని భావించరాదని కూడా న్యాయ మూర్తులు పేర్కొనడం విశేషం. రాష్ట్రపతి ఎమర్జెన్సీ ఉత్తర్వులకనుగుణంగా, డిటెన్యూలకు హెబియస్ కార్పస్ పిటీషన్ ద్వారా కోర్టును ఆశ్రయించడానికి అవకాశం లేదని కోర్టు స్పష్టం చేస్తూ, అంతర్గత భద్రత కాపాడడం రాజ్యాంగ రీత్యా చెల్లుబాటవుతుందని అన్నారు.

అల నాడు అత్యున్నత న్యాయస్థానానికి చెందిన ఆ నలుగురు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పు వల్ల, భారీ సంఖ్యలో దేశ పౌరుల ప్రాధమిక హక్కుల ఉల్లంఘన జరిగిందని, ఈ నాడు, అదే అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పడం ప్రజాస్వామ్యంలో ప్రాధమిక హక్కుల పరిరక్షణ దిశగా మరో అడుగు ముందుకు వేసేందుకు దోహద పడుతుందనాలి. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాధమిక హక్కులను ఆస్వాదించే హక్కు, అనుభవించే హక్కు, భంగం కలిగినప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు, దేశంలోని ప్రతి పౌరుడికి తాత్కాలికంగానైనా రద్దు చేసే అధికారం ఎవరికీ వుండరాదు. ఎమర్జెన్సీ లాంటి చీకటి రోజులు మళ్లీ తలఎత్తకూడదు. ప్రభుత్వ-ప్రభుత్వేతర మానవ హక్కుల సంస్థలు, వ్యక్తులు నిరంతరం ఆ దిశగా, తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహిస్తున్న ఉద్యమకారులతో సహా ఎవరి పౌరహక్కుల ఉల్లంఘన జరగడానికి వీలులేదని ఘంటాపథంగా నొక్కి చెప్పాలి. అరెస్టులు ఇంతటితో ఆగిపోవాలి. అరెస్టు ఐన వారి పౌరహక్కులు తక్షణమే పునరుద్ధరించబడాలి.

తెలంగాణ-సమైక్యాంధ్ర అన్న విషయాన్ని కాసే పన్నా మరిచిపోయి, పౌరహక్కుల ఉల్లంఘన జరిగిందని ఎలుగెత్తి చాటడమే మేధావుల (ఆంధ్రా మేధావులతో సహా) కనీస కర్తవ్యం. పౌరహక్కుల కొరకు పోరాడే మీడియా కనీస ధర్మం. End

1 comment:

  1. 1) "....అరెస్టులను కాని ఖండించిన రాజకీయ పార్టీలు ఒక్కటీ కూడా లేవు. చట్టాన్ని తమ పార్టీ కార్యకర్తలమీద ఉపయోగించలేదన్న సంతృప్తితో వున్నారు వారంతా!..."

    2)"...దశాబ్దంన్నర తరువాత ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన దరిమిలా, అన్ని రాజకీయ పార్టీలకు అరెస్టులు స్వానుభవంలోకొచ్చ్చాయి. అప్పుడు గుర్తుకువచ్చింది వారందరికీ. భారత చైనా యుద్ధం నేపథ్యంలో చోటుచేసుకున్న సిపిఎం నాయకుల అరెస్టును అప్పుడే ఖండించి వుంటే, తమకీ గతి పట్టి వుండేది కాదని!..."

    Is it always necessary to call whatever the Government acts or reacts anti people? People include the majority of law abiding citizens also and they too have rights atleast not to be disturbed from the way they want to live, by handful of individuals who may brand themselves as Progressive, Great Thinkers or Intellectuals.

    The two incidents cited by you relate to different situations. Your theory that had the political parties come out against the first one the second would not have happened is not at all correct. The first one is an action taken by the Government when a foreign power was trying to invade our country and some inside the country were appearing to be supporting that power (to suit their political ends) planning to invade us.

    The second incident was when there was turmoil within the country and the then Government took decision to arrest, in their view, trouble makers.

    How these two can be equated and conclude that had there been opposition to 1962 incident the 1975 arrests would not have taken place?

    In my view Government was perfectly right in taking the decision in 1962 to save the country from propaganda in favour of an invading country from within.

    ReplyDelete