Friday, November 11, 2011

తీపి గుర్తులు - చేదు అనుభవాలు (Part-1) : వనం జ్వాలా నరసింహారావు

తీపి గుర్తులు - చేదు అనుభవాలు (Part-1)

వనం జ్వాలా నరసింహారావు

మాజీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సిపిఐ(ఎం) నాయకుడు, ప్రజా వైద్యుడుగా పేరు తెచ్చుకున్న డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తిగారి జీవితచరిత్రను "తీపి గుర్తులు-చేదు అనుభవాలు" గా గ్రంధస్థం చెసే అవకాశం కలిగింది నాకు. 36 అధ్యాయాల ఆ పుస్తకంలోని వివరాలలో మొదటిది "డాక్టర్‍గారి నామాట" ఇది. వనం జ్వాలా నరసింహారావు

నా మాట

వయస్సు 84 నడుస్తోంది. ప్రస్తుతం పూర్తి వానప్రస్థం. బతుకుదెరువు కోసం చాలా ఏళ్లు వైద్య వృత్తి చేశాను. ఆసక్తి కొద్దీ చాలా కాలం రాజకీయ కార్య కర్తగా పని చేశాను. సాదా సీదా మధ్య తరగతి జీవితంలో, అందరి లాగానే ఎత్తు పల్లాలు, పువ్వులూ-రాళ్లూ-రెంటి రుచీ చూశాను. మెచ్చుకున్న వారు కొందరైతే, నొచ్చుకున్న వారు మరికొందరు. నా గొప్ప, అదృష్టం ఇటు విస్తృత కుటుంబంలోనూ, బయట సమాజంలోనూ చాలా మంది అభిమానులు వుండడం.

వారిలో కొద్దిమంది అడుగుతూ వచ్చిన ప్రశ్న: ఖాళీగానే వున్నారు గదా...జ్ఞాపకాలూ, అనుభవాలూ ఎందుకు రాసి వుంచకూడదు? అని. నా అనుభవాలు రాసి వుంచదగ్గంత ప్రత్యేకమైనవా? అన్న శంక ఒక వైపు వుండేది. ఎవరికి కావాలి ఇవన్నీ? చదివే ఓపిక ఎందరికి? చదివి ఏం నేర్చుకుంటారు? సమయం వృధా చేసుకోవడం తప్ప అనే నిర్వేదం-నిర్లిప్తత మరోవైపు వుండేది. అసలు కుదురుగా కూర్చుని రాసే శక్తీ-ఆసక్తీ లేక మరికొంత అనుకుంటూనే ఆ ఆలోచన పక్కన పెట్టేశాను.

ఒక శుభోదయాన మిత్రుడు జ్వాలా నరసింహారావు, మామూలుగానే-ముందుగా ఫోన్ చేసే వచ్చారు. ఆయన చిరకాల స్నేహితుడు. ప్రదర్శించని పాండిత్యం ఆయనది. జర్నలిజంలో పట్టా లేకపోయినా, విశేష అనుభవం, వృత్తిగత నైపుణ్యం వున్న వ్యక్తి. మార్క్సిజంపై విశ్వాసం, కమ్యూనిస్ట్ పార్టీలపై కించిత్తు అసంతృప్తి, కొందరు నాయకులపై వ్యక్తిగత గౌరవం-ఇదీ నాకు తెలిసిన "జ్వాలా". ఈ సారి తన వెంట ఒక "వాయిస్ రికార్డర్", "లాప్ టాప్ కంప్యూటర్" వగైరా ఎక్విప్‌మెంటుతో సహా వచ్చారు. "మీ జ్ఞాపకాలు చిన్నప్పటి నుండి ఈ నాటి వరకూ చెబుతూ పొండి. నేను రికార్డు చేసుకుంటాను" అంటూ పక్కనే కూర్చుని మొహమాట పెట్టేశారు.

అలా మొదలైందిది.

తీపి గుర్తులు - చేదు అనుభవాలు

ఒక వరస, పద్దతీ లేకుండా, గుర్తున్నంతవరకు చెప్పుకుంటూ పోయాను. ధార (ఫ్లో) ఆగిపోతుంటే, ఆయన ప్రశ్నలతో కదిలిస్తూ రావడం జరిగేది. కొన్ని ప్రశ్నలు గతాన్ని ఇంకా తవ్వేవి. ఇబ్బంది పెట్టేవి కొన్ని. మూసివుంచిన తలుపులు తెరిపించేవి కొన్ని. పాత్రికేయుడు కదా! అలా మూడు-నాలుగు రోజులు సాగింది.

రెండు మాసాల తరువాత, నీట్‍గా కంప్యూటర్‍పై టైప్ చేసిన ప్రతి-స్పైరల్ బైండ్‍తో వచ్చారు. చూసి ఇవ్వమన్నారు. నేను చెప్పినది ఒద్దికగా Chronological Order లో వుంచి, అధ్యాయాలుగా విభజించి, ఎడిట్ చేసిన పద్ధతి ముచ్చటగా వుంది. విషయాన్ని ఎక్కడా వక్రీకరించలేదు. వదిలి పెట్టలేదు.

కాని.... ...... ఆయన తన వ్యాఖ్యలూ-వ్యాఖ్యానాలూ జోడించారు. అందులో పొగడ్తల మోతాదు కాస్త ఎక్కువగానే వుంది. శతాబ్దాల నాటి ప్రఖ్యాత సాహితీవేత్త Johnson జీవిత చరిత్ర రాసిన Boswell గుర్తు వచ్చాడు. బహుశా ఇది, జీవిత చరిత్రకారుల తరతరాల సంప్రదాయ మేమో అనిపించింది! రెండోది.... కమ్యూనిస్ట్ పార్టీ డాక్యుమెంట్లు కొన్ని తీసుకుని Precept కూ Practice కూ వున్న తేడాను సున్నితంగా విశ్లేషించారు. అవి వారి అభిప్రాయాలు. ఏమైనా, ఆ లోతుల్లోకి వెళ్లి, చర్చించి, తిరగరాయించే ఓపిక నాకు లేదనిపించింది.

నేను చేసిన ఒకే ఒక సూచన .... నా కథనంలోని రాజకీయ పరిణామాల అంశాలకు సంబంధించి Documentary Evidenceను అనుబంధంలో చేర్చితే, విశ్వసనీయత చేకూరుతుందని. నా ఫైల్ లో వున్న వాటిని అందించాను. పేజీలు పెరిగిపోవచ్చన్న భయంతో కొన్ని వదిలేశారు. దానికి తుది రూపం తీసుకు వస్తానని వెళ్లారు. ఆ తుది రూపమే ఈ పుస్తకం.

అలా ముగిసింది కథ.... ... చదివే అలవాటు, ఓపిక వున్న వారు చదవండి.

కొండంత అభిమానంతో, నిష్కామంగా, ఇంత విలువైన-బరువైన కృషి చేసిన మిత్రుడు "జ్వాలా" కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలపకుండా ఈ వంట పూర్తి కాదు.

జ్ఞాపకాలు రాయమని ప్రోత్సహించిన మొదటి వ్యక్తి, మిత్రుడు తెలకపల్లి రవి. ఆ నాడు నా వల్ల కాదనేశాను. ఇప్పుడు మరో విధంగా సాకారమైంది. Thank You Comrade Ravi.

తరువాత స్నేహపూర్వకంగా ఒత్తిడి చేస్తూ, గుర్తుచేస్తూ వచ్చిన వారూ-ఇతరత్రా సహాయ పడిన వారూ వున్నారు. వారందరికీ ధన్యవాదాలు.

వై.ఆర్.కె

No comments:

Post a Comment