Wednesday, November 23, 2011

ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి : వనం జ్వాలా నరసింహారావు



ఏడాది పాలన పూర్తిచేసిన సందర్భంలో

ఆత్మవిశ్వాసంతో ముందడుగు

(వేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి)

(ఆంధ్ర జ్యోతి: 25-11-2011)
వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 16వ ముఖ్యమంత్రిగా ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయింది. ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు చేపట్తున్న సమయంలోనూ, చేపట్టిన మరుక్షణం నుంచీ కిరణ్‌ కుమార్‌ రెడ్డి చుట్టూ సమస్యల తోరణాలు స్వాగతం పలికాయి. వాస్తవానికి ఆయన ధరించింది ముఖ్యమంత్రి పీఠం అనే కంటే, ముళ్ల కిరీటం అనాలి. ఆయన బాధ్యతలు స్వీకరించేనాటికే, రాష్ట్రం సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రదర్శించబోయే పాలనా దక్షతకు, సమర్థతకు అవన్నీ అగ్నిపరీక్షల లాంటివే. అన్నింటికన్నా అతి ప్రధానమైన సమస్య ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కొరకు, స్వపక్షీయుల-విపక్షీయుల ఆందోళనలు-ఉద్యమాలు. అలానే హైదరాబాద్ ఫ్రీ జోన్ అంశం మరో కీలకమైన సమస్య. కిరణ్ కుమార్ రెడ్డికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చి, రాజకీయంగా ఆయన ఎదుగుదలకు కారణమై, దరిమిలా ఆయన ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడానికి పరోక్షంగా తోడ్పడిన దివంగత ముఖ్యమంత్రి వై. ఎస్. రాజశేఖరరెడ్డి తనయుడు, కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎన్నికైన ఎంపీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ధిక్కార ధోరణి మరో ప్రధాన సమస్య అప్పట్లో. వీటికి తోడుగా, ఉద్యోగ సంఘాల-విద్యార్థుల-రాజకీయ, ఇతర ఐక్య కార్యాచరణ కమిటీల ఆందోళనల లాంటి అనేక సమస్యలు ఆయనను తక్షణమే చుట్టు ముట్టాయి. వీటన్నింటి కంటే ప్రధానంగా దివంగత నేత వైఎస్ కు అత్యంత అభిమాన పాత్రమైన-నత్తనడకన సాగుతున్న, జలయజ్ఞం ప్రాజెక్టులను పూర్తిచేయాల్సిన గురుతర బాధ్యత కూడా అయన ముందుందప్పట్లో.

ఈ నేపధ్యంలో కాంగ్రెస్ శాసన సభా పక్షం సభ్యులంతా సమావేశమై, హై డ్రామా నడుమ, సభా నాయకుడుగా కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపిక చేశారు. ఆయన ఎంపిక మార్గాన్ని సుగమం చేయడానికి, అతిరథ-మహారథ కాంగ్రెస్ నాయకులు ఇక్కడ హైదరాబాద్‌లోను, అక్కడ ఢిల్లీలోను, తమ వంతు పాత్రను అవధుల మేరకు పోషించారు. తన మార్పుకు అనుకూలంగా నాటి ముఖ్యమంత్రి రోశయ్య, ఢిల్లీకి వెళ్లి, అధిష్టానానికి-అధినేత్రికి తన (అధిష్టానం) మనసులో మాటను బయట పెట్టి, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి బాటలు వేశారు.

మొత్తం మీద ఒక్కొక్క సమస్యను అధిగమించే క్రమంలో, ఆయన తొలుత శ్రీకారం చుట్టింది, నిజాం ఆసుపత్రికి వెళ్లి "ఆరోగ్య శ్రీ" పథకం అమలును పరికించి, తనకు రాజశేఖరరెడ్డి పథకాలంటే అత్యంత ప్రీతిపాత్రమైన వని సందేశమివ్వడమే! ఆ తరువాత తన మంత్రివర్గం ఏర్పాటు చేసుకోవడంలో తనదైన శైలిని అనుసరించడం. ఆ తరువాత శాసన సభాపతి ఎంపిక, డిప్యూటీ స్పీకర్ ఎంపిక లాంటి వాటిలో తన మాట చెల్లించుకోవడంతో పాటు, అధిష్టానం ఆలోచనా ధోరణికి అనుగుణంగా నడుచుకోవడం. అలానే, కొన్నాళ్లకు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా అధిష్టానం బొత్స సత్యనారాయణను ఎంపిక చేసినప్పుడు, ఎదురు చెప్పకపోవడం కూడా కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ చతురతకు నిదర్శనం అనాలి. ఎంతమంది ఎమ్మెల్యేలు (అటు తెలంగాణ విషయంలోను, ఇటు వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి విషయంలోను) ఆయనను ఏదో ఒక నెపంతో విమర్శించినా, సంయమనం కోల్పోకుండా, తగు రీతిలో, ఎవరినీ నొప్పించకుండా-అందరినీ మెప్పించుకుంటూనే, స్పందించారే కాని, తన స్థాయి మరిచిపోయి ఎదురుదాడికి దిగలేదని అనాలి. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించని పక్షంలో వారు నిరవధిక సమ్మెకు దిగనున్నట్టు హెచ్చరించిన నాడు కూడా నిశ్శబ్దంతోనే ఆయన వ్యవహరించారు. రాష్ట్ర విభజనకు జరుగుతున్న ఉధృత పోరుతో పాటు, ప్రాంతాల మధ్య రోజురోజుకు పెరుగుతున్న అంతరాన్ని దృష్టిలో పెట్టుకొని పాలన కొనసాగించాల్సిన బాధ్యతను ఎంత మేరకు నిర్వర్తించారన్నది ప్రశ్నార్థకమైనప్పటికీ, అధిష్టానం మెప్పు పొందడంలో మాత్రం సఫలమైనారనే చెప్పాలి. ఒక విధంగా చెప్పాలంటే, కర్ర విరగకుండా-పాము చావకుండా, అసలు-సిసలైన కాంగ్రెస్ సంస్కృతికి అద్దం పట్టేలా ఆయన పాలన సాగుతుందనొచ్చునేమో!

ఏదేమైనా, ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన ఎదుర్కొన్న అనేక సమస్యలకు అందరూ భావించిన రీతిలో కాకపోయినా, కొందరి మెప్పైనా పొందే తరహాలో, పరిష్కారం కనుగొన్నారనే అనక తప్పదు. ఉదాహరణకు 14 ఎఫ్ తీసుకుందాం. ఎస్సై రాత పరీక్షల సందర్భంగా ఎంత గొడవైందో అందరికీ తెలిసిన విషయమే. ఐనా రాత పరీక్షలను జరిపించిన ఘనత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానిదే. ఆ తరువాత ఉద్యోగుల అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోగలిగారంటే అది కూడా కిరణ్ కుమార్ రెడ్డి చొరవే అనాలి. అలాగే, సకలజనుల సమ్మె ప్రభావం ఏ మాత్రం లేదని సమ్మె ఆరంభమైన మొదటి రోజుల్లో పేర్కొన్న కిరణ్ కుమార్ రెడ్డి, దరిమిలా, దాని ప్రభావాన్ని గుర్తించి సమ్మె విరమింపచేయడానికి తీసుకున్న చర్యలను కూడా ఆయన చొరవకు-పాలనా దక్షతకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఆయనకూ తెలుసు...ఉద్యోగ సంఘాల నాయకులకూ తెలుసు...యావత్ తెలంగాణ ప్రజలకూ తెలుసు...రాజకీయ ఐకాసకూ తెలుసు...తెరాసకూ, ఇతర రాజకీయ పార్టీలకూ తెలుసు... ముఖ్యమంత్రి ప్రేరణతో జరిగింది సకల జనుల సమ్మె విరమణ కాదని, కేవలం తాత్కాలిక విరామమేనని! ఐనా ఆ తాత్కాలిక విరమణకు కిరణ్ కుమార్ రెడ్డిని అభినందించాల్సిందే. రాజకీయంగా కిరణ్ కుమార్ రెడ్డి తన పావులను, అంబులపొదిలో అస్త్రాలను-శస్త్రాలను, అత్యంత చాకచక్యంగా ఉపయోగించడంలో అందె వేసిన చేయి అనక తప్పదు. అందుకు మొదటి ఉదాహరణగా జగన్ వర్గంగా పిలువబడుతున్న ఎమ్మెల్యేలను తన వర్గంలోకి తెచ్చుకోవడం పేర్కొనాలి!

వై. ఎస్. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా, చివరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన పదిమంది ఎమ్మెల్యే లైనా మిగులు తారా అన్నది సందేహంగా మారడానికి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ చాకచక్యమే కారణమనాలి. జగన్మోహన్ రెడ్డిపైన సి. బి. ఐ. విచారణకు కోర్టు ఆదేశాలు వెలువడినంతనే, కాంగ్రెస్, పీ.ఆర్.పి. టిడిపి. లకు చెందిన సుమారు ముప్పైమంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు పదవులకు (స్పీకర్ ఫార్మాట్‌లోనే!) రాజీనామాలు చేసారు. చేయడమే కాకుండా తమ వీరాభిమానాన్ని ఒకరిని మించి మరొకరు ప్రకటించుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ఏం మాయ చేశారో ఏమో కాని, ఇప్పుడు అలా రాజీనామా చేసిన వారంతా "రాజీనామా" లోని "నామా" తీసేసి "రాజీ" బాట పట్టారు. నల్లపురెడ్డి రాజీనామాను స్పీకర్ ఆమోదించడంతో గుబులుపుట్టి అలా చేస్తున్నారో, లేక, ఆయారాం-గయారాంల సంస్కృతి గుర్తుకు వచ్చి అలా జరుగుతుందో భగవంతుడికే తెలియాలి. కారణాలేవైనా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిది పైచేయనక తప్పదు.

అలానే తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాలు. మూకుమ్మడిగా, ఆ ప్రాంతానికి చెందిన నాలుగింట మూడొంతులమంది, మంత్రులతో సహా, తమ ఎమ్మెల్యేల పదవులకు రాజీనామాలు చేశారు. ఆ రాజీనామాలను మూకుమ్మడిగా "భావోద్వేగం" పేరిట స్పీకర్ ఆలశ్యంగానైనా తిరస్కరించారు. మళ్లీ రాజీనామాలు చేసిన వారే తక్కువైతే, చేయని వారు-చేసినవారు, ఒక్కొక్కర్నే ముఖ్యమంత్రి తన దారికి తెచ్చుకున్న చాకచక్యం అసలు సిసలైన రాజకీయ చతురతే. తన పార్టీకి చెందిన ఎంపీలు ఎంతగా తనను విమర్శిస్తున్నా, లెక్క చేయకుండా, తన దారేంటో తాను చూసుకుంటూ, తనకు కావాల్సింది ఎమ్మెల్యేలే కదా అన్న ధోరణిలో, ఈ పాటికే చాలామందిని తనవైపు తిప్పుకున్నారు. ఆ విషయంలోనూ కిరణ్ కుమార్ రెడ్డి అభినందనీయుడే! అలానే, అధిష్టానం ఆలోచనైనా-తన ఆలోచనైనా, పీ.ఆర్.పి. అధినేతను ఆయన బలగంతో సహా కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకుని, జగన్మోహన్ రెడ్డికి ఆదిలోనే చెక్ పెట్ట గలగడం "రియల్లీ గ్రేట్!". ఇంతెందుకు...కొందరు కాంగ్రేసేతర నాయకులు ఆరోపించినట్లు (వాస్తవమా కాదో భగవంతుడికే తెలియాలి!) సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడు, తన జిల్లాకే చెందిన తన చిరకాల ప్రత్యర్థి, నారా చంద్రబాబునాయుడుని సహితం తన దారిలోకి తెచ్చుకోగలిగి, అవసరమనుకుంటే శాసనసభలో ఆయన మద్దతు కూడా తనకే సుమా అని ప్రచారం చేయించుకోగలిగిన థీశాలి కిరణ్ కుమార్ రెడ్డి.

ఎవరెన్ని చెప్పినా, ఎవరేమనుకుంటున్నా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలో తిరుగులేని ఆత్మవిశ్వాసం మాత్రం దినదినాభివృద్ధి చెందుతుందనడంలో సందేహం లేశ మాత్రమైనా లేదు. పాత్రికేయులతోను, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర నాయకులతోను ఆయన మాట్లాడుతున్న తీరులో అది ప్రతిబింబిస్తోందని ఆయనను కలిసిన పలువురు ఘంటాపథంగా చెబుతున్నారు. అనేక రకాల పధకాలను తన సొంత బాణీలో రూపొందించే ఆలోచనలో-కార్యరూపం దాల్చే ట్లు చేయడంలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి వున్న విషయం ఇటీవల కాలంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. రూపాయికి కిలో బియ్యం పధకాన్ని ప్రకటించిన కిరణ్ రాజీవ్ యువ కిరణాల పేరుతో డిసెంబరు నాటికి లక్ష ఉద్యోగాలు, మూడేళ్లలో పదిహేను లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెబుతున్న సంగతి తెలిసిందే. జనాన్ని ఆకట్టుకునే రీతిలో కొత్త స్కీములు ఉంటాయనీ ఆయన అంటున్నారు. మార్చి 31వ తేదీ కల్లా "మీ సేవ" ను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నట్లు కిరణ్ కుమార్ రెడ్డి అంటున్నారు. ఎటువంటి లంచగొండితనం లేకుండా "మీ సేవ" కేంద్రాల్లో కేవలం పావు గంటలో ధృవీకరణ పత్రాలు దొరుకుతాయని, అలా ఇవ్వకపోతే అక్కడే అందుబాటులో ఉండే టోల్ ఫ్రీ నంబరు 1100 నుంచి ఫిర్యాదు చేయవచ్చని ఆయన భరోసా ఇస్తున్నారు. 86 లక్షల మంది రైతులు, మహిళలకు 1800 కోట్ల రూపాయల మేరకు లబ్ది కలిగించే కార్యక్రమాలు చేపట్టింది ప్రభుత్వం. 50 లక్షల మంది మహిళలకు 600 కోట్ల రూపాయలతో లబ్ది చేకూర్చే కార్యక్రమాలతోపాటు 100 కోట్ల రూపాయలతో స్త్రీ నిధి కార్యక్రమం నిర్వహించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. పావలా వడ్డీ కింద రూ.300 కోట్లు, స్త్రీ శక్తి భవనాల నిర్మాణానికి రూ.300 కోట్లు వెచ్చించాలని కూడా ఒకానొక మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది.

కిరణ్ కుమార్ రెడ్డి పథకాలు మంచివే...ఆలోచనలూ మంచివే. అవి అమలైతే ప్రజలకు మేలు కలిగే మాటా నిజమే. ఇంత మంచి ఆలోచన చేస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ విషయంలో కూడా కించిత్తు చొరవ తీసుకుంటే మంచిదేమో! తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కావాలని నాలుగున్నర కోట్ల మంది ప్రజలు ముక్తకంఠంతో కోరుకుంటున్నారు. అందుకు ఆందోళనలూ చేశారు. ఉద్యమాలూ చేశారు. తమదైన శైలిలో ఎన్నో రకాల నిరశనలు కూడా తెలియచేశారు. తాను ఒక ప్రాంతానికే చెందిన నాయకుడులా వ్యవహరించకుండా, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి తరహాలో, రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా, రాష్ట్ర ప్రజల భవిష్యత్ దృష్ట్యా, సకల జనుల అభీష్టం మేరకు రాష్ట్ర విభజన జరగాలని శాసనసభలో ఒక తీర్మానం చేయించి, చరిత్రలో తన పేరును చిర స్థాయిగా వుండేట్లు చేసుకుంటే మంచిదేమో ఆలోచించమని ఆయన ఏడాది పాలన పూర్తయిన సందర్భంలో ప్రజలంతా కోరుకుంటున్నారు. హైదరాబాద్‌లో పుట్టి-పెరిగి-విద్యా బుద్ధులు గడిపిన ఆయన అసలైన తెలంగాణ వాది అని నిరూపించుకుంటే మంచిదేమో!

No comments:

Post a Comment