Tuesday, November 15, 2011

సమస్యను జటిలం చెయ్యడమే కాంగ్రెస్ సంస్కృతి! : వనం జ్వాలా నరసింహారావు

ఇదీ కాంగ్రెస్ సంస్కృతి

నమస్తే తెలంగాణ (17-11-2011)

వనం జ్వాలా నరసింహారావు

తెలంగాణపై సాక్షాత్తు ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా మాట మారుస్తూ చాలా కాలం తరువాత పెదవి విప్పారు. ఏ చిదంబరమో, ఆజాదో, సింఘ్వీనో లేదా ప్రణబ్ కుమార్ ముఖర్జీనో అలాంటి ప్రకటనలు చేస్తే కొట్టి పారేయవచ్చు. "ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ ఇవ్వలేం" అని సూటిగా, స్పష్టంగా ప్రధాని చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందో-ఏమో కాని, ఆయన సహితం మాట తప్పడంలో మిగతా వారికి తీసిపోను సుమా అని చెప్పకనే చెప్పారు. గతంలో విదేశీ పర్యటనల నుంచి వచ్చినప్పుడు చెప్పినదానికి ఇప్పుడు చెప్పిన దానికీ తేడా వుంది. అలా అని వుండాల్సింది కాదు. ఏకాభిప్రాయమని, విస్తృతాభిప్రాయమనీ, చోటా మోటా నాయకుల లాగా మాట్లాడడం ఏమంత బాగా లేదు. తెలంగాణపై ఇంత కఠినమైన మాట ప్రధాని నోట వెలువడటం ఇదే మొట్ట మొదటిసారి! తెలంగాణ అంశంపై ప్రధాని మన్మోహన్ చేసింది సంచలన ప్రకటనే అనడంలో సందేహం లేదు. ప్రధాని ప్రకటన ప్రభావం రాబోయే పార్లమెంటు సమావేశాలపై తీవ్ర ప్రభావం చూపుతుందనడంలోనూ సందేహం లేదు. ఇప్పటికే ఘాటుగా (కనీసం పైకన్నా) విమర్శిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఇప్పటికైనా కనువిప్పు కావాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని "అభ్యర్థించడం" మానుకుని, "ఎందుకివ్వరు" అని ప్రశ్నించాలి-నిలదీయాలి.

కాంగ్రెస్ పార్టీకో సంస్కృతి వుంది. ఇది ఈ నాటిది కాదు. జవహర్లాల్ నెహ్రూ హయాం నుంచి, ఇందిర, రాజీవ్ ల పాలనలో కొనసాగిన ఆ సంస్కృతే, సోనియా గాంధీ సైతం తన కోటరీపైనా అదే సంస్కృతితో వ్యవహరిస్తుందా? ఒకవేళ అదే నిజమైతే, ఏ క్షణంలోనైనా, సోనియా తన పార్టీ నాయకులు ప్రధాని స్థాయి వరకూ చేసిన ప్రకటనలకు విరుద్ధంగా, తెలంగాణకు సానుకూలమైన ప్రకటన చేసే అవకాశం వుందనాలి. ఎవరిష్టమొచ్చినట్లు వాళ్లను మాట్లాడనిచ్చి, తన మనసులో మాట బయట పెడుతుందా? వాహనం కొనిచ్చి, స్టీరింగ్ చేతికిచ్చి, ఇష్టమొచ్చినట్లు తిరగమని చెప్పి, చివరకు తన కాంపౌండులో ఆ వాహనాన్ని పార్కు చేయించే సంస్కృతి కాంగ్రెస్ అధినాయకులకుంటుంది. కాకపోతే, అలా చేయనివారి విషయంలో అప్రమత్తంగా వుండేందుకు, వాహనం బ్రేకులను తన అధీనంలోనే వుంచుకుండే ఏర్పాటుంటుంది. అదే తెలంగాణ విషయంలో జరగొచ్చుననే ఆశ, రాష్ట్రం ఏర్పాటు చేయకపోతే కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులుండవేమోననే భయం సోనియాలో వుండవచ్చుననే ధైర్యం మనకున్నంత కాలం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకాక తప్పదు.

తెలంగాణ సమస్య పరిష్కారం విషయంలో అఖిలభారత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, యుపిఎ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం, చాలా సీరియస్‌గా ఉందని, ఏ క్షణంలోనైనా దానికి అనుగుణంగా ఒక ప్రకటన వెలువడవచ్చని, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నోట్లో నుంచి వచ్చిన మాట తడి ఆరకముందే, పరిష్కారం మాట దేవుడెరుగు... సమస్యను మరింత జటిలం చేసే ప్రకటనలు వెలువడుతున్నాయి. ఆ ప్రకటనలు మొదట్లో కర్ర విరగకుండా, పాము చావకుండా, ఆ తరువాత కొంత అస్పష్టంగా వుంటే, ప్రధాని నోట మాత్రం ఒక రకమైన (అదో రకమైన అస్పష్టత!) స్పష్టత వచ్చింది.

రెండో "ఎస్సార్ సీ" ఏర్పాటుచేయడమే "తెలంగాణ సమస్యకు పరిష్కారం" అనీ, భారత దేశం మొత్తానికీ కాంగ్రెస్ పార్టీ విధానమిదేనని, "తెలంగాణకు మినహాయింపు లేదు" అనీ, కాంగ్రెస్ జాతీయ స్థాయి అధికార ప్రతినిధి రషీద్ అల్వీ దేశ రాజధానిలో ఒక ప్రకటన చేశారు. తెలంగాణ సమస్యకు, మాయావతి ఉత్తరప్రదేశ్ ను విభజించాలని చేసిన డిమాండుకు (బోడిగుండును, మోకాలును తలపై లేని జుట్టుతో కలిపి ముడివేసే ప్రయత్నం చేసినట్లు గా) సంబంధం కలిపారాయన ఆ సందర్భంగా. దేశంలోని పలు రాష్ట్రాలలో, ఏక కాలంలో, విభజన ఉద్యమాలు జరుగుతున్నట్లు, ఆ డిమాండ్లను పరిష్కరించడానికి, రెండో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఏర్పాటు మినహా మరో దారి లేదన్నట్లు ఆయన ఒక విచిత్రమైన కథనం అల్లారు. కాంగ్రెస్ పార్టీ మినహా మరే ఇతర పార్టీ కూడా దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునేవి కాదన్న తరహాలో రషీద్ అల్వీ మాట్లాడడం, "జాతీయ దృక్ఫధం" ఒక్క కాంగ్రెస్ పార్టీకే వున్నట్లు కూడా అయన కలర్ ఇచ్చారు. బహుశా బొత్సా ప్రకటనకు అర్థం ఇదేనేమో!

ఇంతలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి బాంబ్ పేల్చనే పేల్చింది. రాష్ట్రాన్ని నాలుగు భాగాలుగా విడదీయాలని, తీర్మానం చేసి, కేంద్రానికి పంపుతూ, హెచ్చరిక కూడా చేసింది. ఒక తేదీ ఖరారు చేసి, ఆ తేదీలోపున విభజన జరగకపోతే, నాలుగు ప్రాంతాల శాసనసభ సభ్యులు, వేర్వేరుగా సమావేశమై తీర్మానాలు చేసి పంపుతాం జాగ్రత్తా సుమా అని వార్నింగ్ ఇచ్చింది. తానొక ప్రాంతానికే పరిమితం కానని, యు. పి. లోని అన్ని ప్రాంతాలు తనకు సమానమేనని, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పరోక్షంగా సూచన చేసింది. తెలంగాణ విషయంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా ఇది సూచన అనుకోవచ్చు.

తెలంగాణపై నవంబర్ పన్నెండు తరువాత కేంద్రం వైపు నుంచి ఒక స్పష్టమైన నిర్ణయం వస్తుందని అందరూ భావిస్తున్న నేపథ్యంలో రషీద్ అల్వీ చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది. రాష్ట్ర విభజన విషయంలో ఎటూ తేల్చుకోలేకుండా ఉన్న కాంగ్రెస్ అధిష్ఠానం నెమ్మది నెమ్మదిగా ఎస్సార్ సీని తెర పైకి తెచ్చి, తెలంగాణ అంశాన్ని మరుగున పడవేసే దిశగా పావులు కదుపుతున్న అనుమానాలూ బలపడుతున్నాయి. మొదటి పర్యాయం ఎస్సార్ సీ వేయడానికొక చారిత్రక నేపధ్యం వుంది. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత రాష్ట్రాల పునర్విభజన అత్యవసరం ఐన నేపధ్యంలో, ఒక యూనిఫార్మిటీ కోసం చేసిన ఏర్పాటది. ఇప్పుడంత అవసరం లేదు. ఒక్కొక్క ఏర్పాటు ఉద్యమానికి ఒక్కో నేపధ్యముందిప్పుడు. మాయావతి డిమాండును, యావత్ తెలంగాణ ప్రజల డిమాండుకు ముడి పెట్టడం, అందుకొరకు ఏకంగా ఎస్సార్ సీని ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేయడం దుర్మార్గం. రషీద్ అల్వీ రాజకీయ నేపధ్యం కూడా, పొంతనలేని ఆయన వ్యాఖ్యల లాగానే వుందనాలి. అందుకేనేమో, తక్షణమే స్పందించారు ఆయన పార్టీ ప్రముఖులు కొందరు. అదీ నిజమేకదా! రషీద్ అల్వీ గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. పార్టీలు మార్చడంలో దిట్ట. కాంగ్రెస్‌లో చేరడానికి ముందు సమాజ్‌ వాదీ పార్టీలోనూ, తరువాత బిఎస్పీలోనూ, కొంతకాలం జనతాదళ్ లోను వున్నారాయన. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల మాజీ ఇన్ చార్జ్ దిగ్విజయ్ సింగ్ కూడా ఉత్తరప్రదేశ్ విభజన అంశాన్ని రెండో ఎస్సార్ సీయే తేల్చాలన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాంనబీ ఆజాద్ మాత్రం తెలంగాణ ఇస్తున్న ధోరణిలో (ఎలానో చెప్పకుండానే) మాట్లాడుతూనే వున్నారింకా.

ఇంకేముంది...తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఒక్కసారిగా గుర్రుమన్నారు. గరం గరంగా (అధిష్టానాన్ని అనే ధైర్యం లేదు కదా!) రషీద్ అల్వీని సున్నితంగా విమర్శించసాగారు. విపరీతార్థాలు వెతక సాగారు. అంగీకరించే ప్రసక్తే లేదన్నారు కొందరు. ఒకవిధంగా అన్ని పార్టీల వారూ ఐక్యంగానే విమర్శించారనవచ్చేమో! అందులో ఎవరు ముందు భాగంలో వున్నారో, చెప్పడం కష్టమేమో కాని, మొత్తం మీద...టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్ నేతలు గట్టిగా గొంతు పెంచారు. ఈ నేపధ్యంలో ప్రణబ్‌ ముఖర్జీతో బొత్స మంతనాలు చేశారు. మరికొందరేమో, పార్టీ వైఖరి ఎస్సార్ సీయే ఐనప్పటికీ, తేల్చేది మాత్రం యుపిఎ ప్రభుత్వమే అని భాష్యం చెప్పుకున్నారు. ఏదేమైనా, రషీద్ వ్యాఖ్యలు రాష్ట్రంలో సంచలనం సృష్టించాయి. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానంపైనా, కేంద్ర ప్రభుత్వంపైనా, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌ రావు కారాలు-మిరియాలు నూరారు. "తెలంగాణపై ఎంతో కసరత్తు చేశాక, కొండంత రాగం తీసి... ఏదో పాట పాడినట్ల్లు ఎస్సార్ సీ... బిస్సార్సీ అంటే అంగీకరించం'' అనీ, పిచ్చి వాగుడు మానుకోవాలని హెచ్చరించారు. ఏదేమైనా, ఎవరెన్ని చెప్పినా, ఎంతవరకైతే, ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసిన తెలంగాణను (హైదరాబాద్ ను రాజధానిగా చేయడంతో సహా) ఇవ్వకపోతే మరో తుపాను సృష్టిస్తామని కుండ బద్దలు కొట్టి మరీ హెచ్చరించారు కెసిఆర్. "సకల జనుల సమ్మె సమయంలో మెడపై కత్తి పెట్టి నిర్ణయం తీసుకోమంటే ఎలాగని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి గులాంనబీ ఆజాద్ అన్నారనీ, ఇప్పుడు అన్నీ సర్దుకున్నాయి కనుక, రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేయొచ్చు కదా?'' అని మండిపడ్డారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఎటువంటి ప్రకటన చేసినా ప్రభుత్వాలు కూలక తప్పదని కూడా హెచ్చరించారు. పనిలో పనిగా "సమైక్యవాద టీడీపీ భూస్థాపితం" చేయాలనీ, జేఏసీ తరఫున "కాంగ్రెస్‌కో ఖతం కరో.. తెలంగాణకో హాసిల్ కరో" అనే నినాదం తీసుకొచ్చి, తెలంగాణ రాష్ట్ర సమితిని ఒక "బలమైన రాజకీయ శక్తి" గా మలచనున్నట్లు కూడ ఆయన అన్నారు.

తెలంగాణ అంశంపై తమ పార్టీ వారే అయినా దిగ్విజయ్‌ సింగ్, రషీద్ అల్వీ వంటి వారి వ్యాఖ్యలను పట్టించుకోబోమని, సోనియాగాంధీ, గులాంనబీ ఆజాద్ మాట్లాడితేనే పరిగణనలోకి తీసుకుంటామని కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ (ఇంకో రూట్ నుంచి) శల విచ్చారు. తెలంగాణ అంశాన్ని రెండో ఎస్సార్ సీకి నివేదించే ఉద్దేశం కేంద్రానికి అసలు లేనే లేదని, కేవలం ఉత్తరప్రదేశ్ విషయంలో మాత్రమే అది వర్తిస్తుందని మరో రకమైన కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేశాయి. ఇదో రూట్. ఇంతకూ, శ్రీకృష్ణ కమిటీ నివేదికలో సూచించిన సిఫారసుల ఆధారంగా, తెలంగాణపై కేంద్రం ఒక నిర్ణయం తీసుకోబోతున్నాదా? గ్రేటర్ హైదరాబాద్ పరిధిని విస్తరించి కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించే అవకాశాలేమైనా వున్నాయా? లేక రెండు ప్రాంతాలకూ వేర్వేరు రాజధానులను ప్రకటించవచ్చా? పోనీ, హైదరాబాద్‌ను ప్రస్తుతానికి ఉమ్మడి రాజధానిగా నిర్ణయించి, తరువాత సీమ+ఆంధ్ర=సీమాంధ్రకు వేరే రాజధాని (నులను)ని ప్రకటించడమా? ఏదీ కాకుండా, ఇంకా నాన్చుడు ధోరణేనా? ఇవన్నీ మిలియన్ డాలర్ల ప్రశ్నలు. సమాధానం దొరికీ దొరకని ప్రశ్నలు. సార్క్ సమావేశాలకు వెళ్లిన మన్మోహన్ సింగ్ స్వదేశానికి తిరిగి వచ్చిన తరువాత ఏమన్నా తేలనుందా? ఏం తేల్చినా, అది పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందేనా? అంతా అయోమయం. స్పష్టత లేదు.

ఇదిలా వుంటే చర్చల జోరు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీతో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ "కీలక చర్చలు" జరిపారు. ఒకసారి కాదు...పలుమార్లు! ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాంనబీ ఆజాద్‌తో వారు చర్చలు చేశారు. టెలివిజన్ ఛానళ్ల లాగానే (ప్రత్యేకంగా బైట్) సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కేశవరావు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రషీద్ అల్వీని కల్సి చర్చించారు. కేశవరావు ప్రణబ్ ముఖర్జీతో కూడా చర్చించారు. ప్రణబ్‌ను కలిసే ముందు బొత్స, కేశవరావు చర్చలు జరిపారు! తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు చంద్ర శేఖరరావుతో కూడా కోర్ కమిటీ సభ్యుడొకరు చర్చలు జరిపారట. ఇక తెలంగాణ కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ రోజువారీ చర్చలుండనే వున్నాయి. చర్చోఫ చర్చలైతే జరుగుతున్నాయి కాని ఫలితం శూన్యం. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ-ప్రధానమంత్రి కార్యాలయం తెలంగాణ అంశంపై తీసుకోవాల్సిన నిర్ణయం గురించి సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నట్లు మరో వార్త. నిజంగా వీళ్ళు త్రికరణ శుద్ధిగా చర్చలు చేస్తుంటే, ఈ పాటికి తెలంగాణ రాష్ట్రం ఎప్పుడో ఏర్పాటయ్యేదికదా!

అసలు సమస్య చర్చలు కాదు. సమస్య పరిష్కారం దొరక్క కూడా కాదు. మనసుంటే మార్గముంటుందంటారు. హృదయమంటూ వుంటేనే స్పందన వుంటుంది. ప్రజాస్వామ్యంలో నమ్మకమున్న వారికే దాని విలువ అర్థమవుతుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించేవారికి మాత్రమే మాటకు కట్టుబడి వుండే అలవాటుంటుంది. పార్టీపరంగా కాని, వ్యక్తుల పరంగా కాని, కాంగ్రెస్ కు, ఆ పార్టీ నాయకులకు ప్రజాస్వామ్యం పట్ల ఏ మాత్రం అవగాహన లేదనాలి. ఎన్నికల ప్రణాళికలో, కనీస ఉమ్మడి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని చేర్చిన విషయం కాంగ్రెస్ అధిష్టానానికి కాని, ఆ పార్టీ నాయకులకు కాని తెలియదా? ఎన్నికల ప్రణాళిక రచనలో తెలంగాణ అంశాన్ని చేర్చిన సంగతి ప్రణబ్ ముఖర్జీకి గుర్తులేదా? అలా చేర్చడంలో ఆయన పాత్ర లేదా? ఆయనకు తెలియకుండానే కనీస ఉమ్మడి కార్యక్రమంలో దాన్ని పెట్టారా? పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగంలో ఆ విషయాన్ని చేర్చిన సంగతి ఈ నాయకులెవరికీ తెలియదా? ప్రధాన మంత్రి చేసిన వాగ్దానం ఆయనకూ గుర్తులేదా? ఒకసారి దక్షిణాఫ్రికా పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో తన వెంట వచ్చిన పాత్రికేయులతో మాట్లాడుతూ, తెలంగాణ అంశంపై స్పష్టంగా, పార్టీ పరంగా-ప్రభుత్వ పరంగా తమ ప్రాధాన్యతా అంశం అని ప్రధాని చెప్ప లేదా? ఎన్ని సార్లు ...ఇంకెన్ని సార్లు మాట మారుస్తారు వీళ్లు?

ఇంతెందుకు. రెండేళ్ల క్రితం నాటి డిసెంబర్ తొమ్మిది ప్రకటన, పార్లమెంటులో చేసిన వాగ్దానాలు మర్చిపోయారంటే, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై నమ్మకం లేనట్లే! ఇలా మరో రెండేళ్లు గడుపుతారేమో కాని, శాశ్వతంగా అపవాదు మూటకట్టుకుంటున్నామన్న సంగతి మర్చిపోతున్నారు కాంగ్రెస్-యుపిఎ నాయకులు. నిర్ణయం తీసుకోవాల్సిన సోనియాగాంధీని ఇంత వ్యూహాత్మకంగా తప్పుదోవ పట్టిస్తున్న వారెవరో కాని వారికి జోహార్లు పలకాల్సిందే! చీటికీ-మాటికీ ప్రకటనలు గుప్పిస్తున్న ఈ ఛోటా-మోటా నాయకులకు, అసలామె అనుమతు వుందో-లేదో? సోనియాకు సమస్య తీవ్రతను వివరించిన దాఖలాలు లేవనిపిస్తోంది. బహుశా రేపో-మాపో యౌవరాజ్య పట్టాభిషేకం జరుగుతుందన్న వార్తలొస్తున్నాయి. యువరాణిగారు కూడా రంగప్రవేశం చేయబోతున్నట్లు కథనాలు వినవస్తున్నాయి. సోనియాకు చెప్పని వారు, వీరికి చెపుతారన్న నమ్మకం ఏంటి? వీరికి అర్థమయ్యేలోపున ఎన్నికలొస్తాయి. ఇక ఆ తరువాత ఏం జరుగుతుందో భగవంతుడికే తెలియాలి. సమస్యకు దొరికేది పరిష్కారం కాదు. దాన్ని మరింత జటిలం చెయ్యడమే! End

5 comments:

  1. you are correct. they can't pool all for all times.

    ReplyDelete
  2. మీది మరీ అత్యాస అని అర్థం అవుతున్నది. సోనియా గారు చెప్పకుండా మిగిలిన వారందరూ చెబుతారా? దీన్నే దింపుడు కళ్ళం అంటారేమో

    ReplyDelete
  3. అందుకే దాన్ని దింపుడు కళ్ళం ఆశ అన్నది. మేధావులు మీరు కూడా ప్రజలను భ్రమ లలో వుంచకండి. నిజాలు చెప్పండి, తెలంగాణా రావడం అనేది ఎప్పటికీ జరగదు అని

    ReplyDelete
  4. అసలు ప్రధాన మంత్రి ప్రకటన తరువాత, తెలంగాణా లో భూన భొంతరాలు బద్దలవుతాయి అనుకున్నా. ఏమీ జరగలేదు. అంటే ఉద్యమం అనేది లేదు అనే కదా

    ReplyDelete