Friday, December 30, 2011

విపక్షాల వైఖరి మారాలి: వనం జ్వాలా నరసింహారావు


వనం జ్వాలా నరసింహారావు

పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానంలో, ఏ రకమైన చట్టాన్ని, ఎప్పుడు-ఎలా-ఎందుకు రూప కల్పన చేయాలో, చేసిన దానిని రాజ్యాంగ ప్రకరణాలకు-పార్లమెంటరీ విధానాలకు అనుగుణంగా ఆమోదింప చేసుకోవాలో, చేయడం వల్ల తలెత్తే పర్యవసానం ఎలా అధిగమించాలో అన్న విషయాలను నిర్ణయించే అధికారం కేవలం చట్ట సభలకు మాత్రమే వుంటుంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు మూల స్తంభాలైన కార్య నిర్వాహక వ్యవస్థ, శాసన ప్రక్రియ వ్యవస్థ, న్యాయ వ్యవస్థలు, వాటి-వాటి పరిధుల్లో తిరుగులేని అధికారాలను కలిగి వుండడం వల్ల, ఒక వ్యవస్థను మరోటి పూర్తిగా కబళించలేని విధంగా, అధిగమించలేని పద్ధతిలో, "అదుపులు-అన్వయాలు" ఆయా వ్యవస్థల అధికారాలను పరిమితం చేస్తుంటాయి. ఏ వ్యవస్థకు అపరిమితమైన అధికారాలను రాజ్యాంగం కట్టబెట్టలేదు. పార్లమెంటు తన హక్కుగా, బాధ్యతగా, పారదర్శకతతో చేయాల్సిన విధిని, అదేదో తమ పనిగా, ఎవరో కొందరు-పౌర సమాజం నెపంతో నో, లేదా మరే కారణంతో నో, తమపైన వేసుకోవడం అప్రజస్వామికం-అనైతికం.

చారిత్రాత్మక లోక్ పాల్ నమూనా బిల్లు రూపొందించే ప్రక్రియలో, క్రియాశీలక పాత్ర వహించిన గాంధేయ వాది అన్నా హజారేను ప్రతి భారతీయ పౌరుడు మనఃపూర్వకంగా అభినందించాల్సిందే! అంత మాత్రాన, భారత పార్లమెంటు సార్వభౌమాధికారాన్ని, తద్వారా కొనసాగాల్సిన ప్రజాస్వామ్య ప్రక్రియను కించపరిచే దిశగా అడుగులు వేయబూనుకోవడం సరైందికాదు. రాజ్యాంగ పరంగా సంక్రమించిన శాసన నిర్మాణ కర్తవ్యాన్ని నిర్వహించాల్సిన పార్లమెంటు అధికారం తిరుగులేనిదే! హజారే సూచించిన అంశాలు చాలావరకు పొందుపరిచి లోక్ పాల్ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టిన ప్రధాని మన్మోహన్ సింగ్ ను, ఆయన మంత్రి మండలిని అభినందించాల్సిన హజారే-ఆయన పౌర సమాజ బృందం, దానికి బదులుగా, పార్లమెంటు ఆమోదించనున్న ఆ చట్టాన్ని సుప్రీం కోర్టు తిరస్కరించనున్నదని ముందే జోస్యం చెప్పడం దురదృష్టకరం. ఒకవైపు లోక్ సభలో బిల్లును ప్రవేశపెట్తుంటే, మరో వైపు ముంబై నగరంలో నిరాహార దీక్షకు పూనుకోవడం ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన మనిషిని, అందరిలో ఒకడిగా మిగిల్చింది. చివరకేమైంది? పట్టుమని పదివేల మంది మద్దతును కూడా కూడగట్టుకోలేని దుస్థితికి దిగజార్చింది. హజారే అనుకున్న జన లోక్ పాల్ చట్టం రాకపోగా, ప్రభుత్వం ప్రయత్నించిన లోక్ పాల్-లోక్ ఆయుక్త కూడా ప్రస్తుతానికి చట్టం కాలేకపోవడం దురదృష్టం. 

పార్లమెంటరీ ప్రజాస్వామ్య సిద్ధాంతాల ప్రకారం, అదుపులు అన్వయాలకు లోబడి, కార్య నిర్వహణ అధికారి (ప్రధాన మంత్రి) మంత్రి మండలి సమష్ఠి బాధ్యతకు అనుగుణంగా, చట్టాలను (రూప కల్పననుముందస్తుగా మంత్రి మండలిలో క్షుణ్ణంగా చర్చించి, బిల్లు రూపంలో పార్లమెంటు ఉభయ సభలలో ప్రవేశ పెట్టి-చర్చించిన తర్వాత, (సవరణలతో) ఆమోదించడమో, తిరస్కరించడమో జరగడం ఆనవాయితీ. ఇప్పుడదే జరిగింది. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన ఒకటి-రెండు సవరణలను ప్రభుత్వం లోక్ సభలో పరిగణలోకి తీసుకుంది . రాజ్యసభలో ప్రతిపాదనకు వచ్చిన సుమారు రెండువందల సవరణలను పరిగణలోకి తీసుకోవాలా-వద్దా అని నిర్ణయం జరగక ముందే, సభలో నెలకొన్న గందరగోళ పరిస్థితులలో సభాధ్యక్షుడు సభను నిరవధికంగా వాయిదావేశారు. అధికార-ప్రతిపక్షాలకు చెందిన సభ్యులందరూ, పార్లమెంటు సార్వభౌమాధికారం విషయంలో మాత్రం ఒక్కటయ్యారు. "లాబీ వర్గాల" కు (పౌర సమాజం వారితో సహా), పార్లమెంటు సభ్యులుకాని వారికి, లాంఛనంగా-చట్ట పరంగా, ఆ ప్రక్రియలో ముందుగా పాల్గొనే వీలు రాజ్యాంగం కలిగించలేదు. కాకపోతే, వారి పలుకుబడి-ప్రభావం చూపించి, ప్రభుత్వం మీద-పార్లమెంటు సభ్యుల మీద కొంత ఒత్తిడి తెచ్చే అవకాశం లేక పోలేదు. అది హక్కు ఎంత మాత్రం కానేకాదు. ప్రధాన ప్రతిపక్షాలన్నీ ధర్నా చౌక్‌లో అన్నా హజారే బృందానికి మద్దతిస్తూనే, పార్లమెంటు ఉభయ సభలలో మాత్రం తాము అనుకున్నదే చేశారు.

అన్నా హజారే-ఆయన పౌర సమాజం చెప్పిందల్లా చేస్తే, పార్లమెంటుకు, ప్రధానికి ఏదన్నా పాత్ర వుందనుకోవాలా? లేదా? పౌర సమాజానికి చెందిన కొందరు స్వయం ప్రకటిత నేతల ఒత్తిళ్లకు లొంగి, చట్టాల రూపకల్పనకు సంబంధించి పూర్తి అధికారాలను కలిగున్న పార్లమెంటు పరిధి నుంచి ఆ అధికారాలను పార్లమెంటే తర శక్తులకు బదిలీ చేస్తే ప్రజాస్వామ్యం ఏం కావాలి? ప్రధాని మన్మోహన్ సింగ్, సుమారు నాలుగున్నర దశాబ్దాల తర్వాత, చొరవ తీసుకుని (పోనీ హజారే చొరవ వల్ల అనుకుందాం), లోక్ పాల్ బిల్లును పార్లమెంటు ముందుకు తీసుకొచ్చారు. స్వయంగా ప్రధానిని కూడా లోక్ పాల్ పరిధిలో చేర్చమని ఆయనే కోరారు. చివరకు కమిటీ సభ్యుల సూచనను అంగీకరించారు. బహుశా అత్యున్నత స్థాయి కార్య నిర్వహణ అధికారిని (ప్రధాని), అత్యున్నత న్యాయ వ్యవస్థను, పార్లమెంటులో సభ్యుల పనితీరును, లోక్ పాల్ పరిధిలో తీసుకురాక పోవడం సమంజసమే మో! అదుపులు-అన్వయాలకు బాధ్యత వహించాల్సిన ఈ మూడు వ్యవస్థలను ఆ స్థాయిలో గౌరవించాల్సిన అవసరం వుందనాలి. లోక్ పాల్ సభ్యులుగా నియామకం కాబోయే తొమ్మిది మంది సభ్యులలో భవిష్యత్ లో ఏ నాడూ-ఎవరూ-ఎలాంటి పరిస్థితుల్లోను, ఇతర ఉన్నత స్థాయి-మధ్య స్థాయి-కింది స్థాయి వ్యక్తుల లాగా, ఏ బలహీనతలకు లోను కారన్న నమ్మకం వుందా? అలాంటి వారే ప్రధాని కూడా అని, న్యాయ మూర్తులని భావించడం మంచిదే మో!

పార్లమెంటు సార్వభౌమాధికారాన్ని, దాని శాసన నిర్మాణ కర్తవ్యాన్ని, ఆ కర్తవ్యంలో పాలు పంచుకుంటున్న గౌరవ సభ్యులను, కార్య నిర్వహణ అధికారి ప్రధానిని కాదని, ఆ మరణ నిరాహార దీక్షకు దిగడం ఎంతవరకు సబబు?

అత్యున్నత విలువల నుంచి హజారే స్ఫూర్తి పొంది ఉండవచ్చు గాక! ఆయన వెంట అశేష జన వాహిని నేడు నడుస్తుండవచ్చు కాక! ఆయన వేసిన ప్రతి అడుగులో అడుగు వేసుకుంటూ, పౌర సమాజానికి చెందిన అతిరథ-మహారథులు హజారే చెప్పే ప్రతి వాక్యాన్ని వేద వాక్కుగా పరిగణిస్తుండ వచ్చు గాక! అంత మాత్రాన ఆయన ఎంచుకున్నది మాత్రం అసలు సిసలైన నిఖార్సైన మార్గం అనే వీలు లేదు. ఇందిరా గాంధీ హయాంలో అత్యవసర పరిస్థితి విధించిన దరిమిలా, అసలే అంతంత మాత్రం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్న పార్లమెంటరీ వ్యవస్థ- అందులోని ఉభయ సభల రాజ్యాంగ బద్ధమైన అధికారాలను హరించే ప్రయత్నం చేస్తే వారెంత గొప్ప వారైనా వారి చర్యలను ఎదుర్కోవాల్సిందే. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై ప్రమాదకరమైన ప్రభావం పడే ఎటువంటి చర్యైనా అటు ప్రభుత్వం కాని, ఇటు ప్రతి పక్షాలు కాని, వీటన్నింటి కీ అతీతం అని అంటున్న పౌర సమాజం కాని చేపట్టి తే, దాన్ని అడ్డుకోవడం ప్రతి పౌరుడి కర్తవ్యం.

ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న లోక్ పాల్ బిల్లుకు ఒక  సుదీర్ఘ చరిత్ర వుంది. హజారే ఆందోళన - పౌర సమాజం జోక్యం - ప్రభుత్వ ఏమరుపాటు - రాందేవ్ బాబా రంగ ప్రవేశం - ప్రభుత్వం తొందర పాటు చర్యలు - రాజీ మార్గాల అన్వేషణ - పౌర సమాజం సభ్యులతో కలిసిన సంయుక్త కమిటీ ఏర్పాటు - జన లోక్ పాల్, ప్రభుత్వ లోక్ పాల్ ముసాయిదా బిల్లుల తయారీ - ఏకాభిప్రాయ సాధన - నాలుగై దు మినహా జన లోక్ పాల్ లో ప్రతిపాదించిన అంశాలన్నింటినీ చేర్చుతూ ప్రభుత్వం లోక్ పాల్ బిల్లు ముసాయిదా రూపొందించడం - మంత్రి మండలి ఆమోదం - లోక్ సభలో ప్రవేశ పెట్టడం - మధ్యలో అసంతృప్తి చెందిన అన్నా హజారే నెల రోజుల క్రితమే నిరవధిక నిరాహార దీక్షకు దిగుతానని ప్రకటన చేయడం - అన్న మాట ప్రకారం ఆగస్టు పదహారున దీక్షకు దిగేందుకు సన్నద్ధం కావడం - హజారే ముందస్తు అరెస్టు, అదే రోజు రాత్రి పొద్దు పోయాక ఆయనను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం - ఈ లోపల చిదంబరం తో సహా ముగ్గురు కేబినెట్ మంత్రులు ఢిల్లీ పోలీసుల చర్యను సమర్థించడం - హజారేతో సహా పలువురి నిర్బంధం, విడుదల - పార్లమెంటు లోపల, బయట ప్రభుత్వం, ప్రతి పక్షాల మధ్య మాటల యుద్ధం - చివరకు జైలులోనే వుంటానని భీష్మించుకుని కూర్చున్న హజారే మూడోరోజుకల్లా దిగి రావడం...ఒకటి వెంట ఒకటి జరిగిన పరిణామాలుఇక ఆ తర్వాత "సెన్స్ ఆఫ్ ద హౌజ్" పేరుతో అన్నా హజారే ప్రతిపాదనలకు ప్రభుత్వ పరంగా పరోక్ష ఆమోదం, అన్న మాట ప్రకారం ప్రభుత్వం లోక్ పాల్ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టడం, సభ ఆమోదం పొందడం, రాజ్యసభలో ఆమోదం పొందకుండానే సభ నిరవధికంగా వాయిదాపడడం తదనంతర పరిణామాలు. వీటిలో, అంతా సత్య సంధులే అనడం నిజం కాదు...ప్రభుత్వం ది ఒక రకమైన మొండి వైఖరై తే, ప్రతి పక్షాల ది మరో రకమైన మొండి తనం...ఇక పౌర సమాజానిది గజ మొండి తనం! వెరసి, మీడియాకు బిజీ-బిజీ-బిజీ! ఏదేమైనా ప్రస్తుతానికి లోక్ పాల్ చట్టం లేనట్లే!

నాలుగున్నర దశాబ్దాల తర్వాత లోక్ పాల్ బిల్లు ఆవశ్యకతను గుర్తుచేస్తూ, అన్నా హజారే నాయకత్వంలోని పౌర సమాజ బృందం మొదట్లో ఆందోళనకు దిగడం సమంజసమే. అప్పట్లో వారి డిమాండు ప్రభుత్వం లోక్ పాల్ బిల్లును తెచ్చి చట్టం చేయాలని మాత్రమే! ఆయన వెంట వున్న పౌర సమాజం సభ్యులు నిజాయితీ పరులే-అందులో సందేహం లేదు. గండం గట్టెక్కడానికి ప్రాధాన్యతనిచ్చే సర్కారు, పౌర సమాజాన్ని-ప్రతిపక్షాలను చీల్చాయి అప్పట్లో. ప్రతి పక్షాలను దూరం పెట్టి పౌర సమాజాన్ని దగ్గరకు తెచ్చుకునే వ్యూహంతో ముందుకు సాగింది. ఆందోళనను తాత్కాలికంగా పలచన చేయగలిగింది.

అత్యంత ప్రాధాన్యతను సంచరించుకున్న లోక్ పాల్ బిల్లు ముసాయిదాను ఖరారు పర్చే ముందర, సంప్రదాయ బద్ధంగా-ఆనవాయితీగా వస్తున్న ప్రతిపక్షాలను సంప్రదించే ఆచారాన్ని పక్కన పెట్టింది. కమిటీలో  పౌర సమాజం సభ్యులకు మాత్రమే ప్రభుత్వ సభ్యుల సరసన పెద్ద పీట వేసింది. ఆ చర్యతో, పౌర సమాజం సభ్యులు, తమ వాదనను వినిపించడంలో బలపడ సాగారు. పౌర సమాజం ఎదురు తిరిగింది. జన లోక్ పాల్ బిల్లు తప్ప ప్రభుత్వ బిల్లు తమకు ఆమోద యోగ్యం కాదు పొమ్మంది! ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించింది. తానేమీ తక్కువ తిన్నానా అన్న చందాన, ప్రభుత్వం తన చర్యలను సమర్థించుకునే బదులు, ఎదురుదాడికి దిగింది. అప్రజాస్వామిక చర్యలకు పూనుకుంది. అవసరం లేకపోయినా హజారే ను-ఆయన బృందాన్ని నిర్బంధంలోకి తీసుకుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకుంది. పార్లమెంటు సార్వభౌమాధికారం అన్న మాటను ఆలశ్యంగా తెరపైకి తెచ్చింది. అది కాదనే పరిస్థితి ప్రతిపక్షాలకు కలిగించింది. ప్రతిపక్షాలను హజారే వైపు మళ్లకుండా జాగ్రత్త పడాల్సింది.

అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలి అన్న సాకుతో, పార్లమెంటుకు, కార్య నిర్వహణ వ్యవస్థకు, న్యాయ స్థానాలకు, రాజ్యాంగానికి, రూల్ ఆఫ్ లాకు అతీతమైన ఒక సూపర్-డూపర్ నామినేటెడ్ బాడీని ఏర్పాటు చేయాలని పౌర సమాజం ప్రభుత్వాన్ని ఆజ్ఞాపించడం ఎంతవరకు సబబు? దానికి ఈ మహానుభావులంతా వంత పాడడం ఎంతవరకు న్యాయం? అరవై నాలుగు సంవత్సరాల స్వతంత్ర భారత దేశంలో-అరవై రెండు సంవత్సరాల భారత రాజ్యాంగ చరిత్రలో, అంచలంచలుగా బలపడాల్సిన రాజ్యాంగ వ్యవస్థలను, పటిష్టం చేయాల్సిన బాధ్యతను విస్మరించిన రాజకీయ నాయకులనేకమంది, అదే బాధ్యతను ఇన్నాళ్లు విస్మరించిన పౌర సమాజం నాయకులకు వత్తాసు పలకడంలోని ఔచిత్యం ఏమిటి? నలభై రెండేళ్ల క్రితం నాటిన లోక్ పాల్ మొక్కకు నీరు పోసిన వారు-పోయనివారు ఏకమై పోయారిప్పుడు. వాస్తవానికి మనకు రాజ్యాంగం ప్రసాదించిన అవినీతి వ్యతిరేక అస్త్ర-శస్త్రాలను, అదే రాజ్యాంగంలోని అనేకానేక ప్రకరణాలను, ఒకదానికి మరొక టి అనుసంధానం చేసి అవినీతి పరులపై ప్రయోగించడానికి, ఇదే రాజకీయ నాయకులు-పౌర సమాజం ప్రతినిధులు ఆదినుంచి పూనుకున్నట్లయితే, సమస్య ఇంత జటిలమయ్యేదా? అంతా జరిగినాక, ఇప్పుడు రాత్రికి రాత్రే, "సర్వోపతి" లాంటి ఒక దివ్యౌషధం కావాలని ప్రభుత్వంపై పౌర సమాజం ఒత్తిడి తేవడం సమంజసం కాదు.

రే అయిందేదో అయిందను కుందాం. తన మాట నెగ్గ లేదనుకుని, మరింత పటిష్టమైన లోక్ పాల్ బిల్లు తేవాలని ప్రభుత్వాన్ని కోరటంలో తప్పు లేదనుకుందాం. దాని కొరకు దీక్షకు దిగడంలోను న్యాయం వుందను కుందాం. ఆయన వెంట నడుస్తున్న ఇతర పౌర సమాజం సభ్యులు, హజారే కంటే అధిక స్థాయిలో పట్టుదల ప్రదర్శించడాన్నీ ఒప్పుకుందాం. కాని, తమకు-తమ పౌర సమాజానికి-తమకు మద్దతిస్తున్న వారికి తప్ప ఇతరులెవరికీ లోక్ పాల్ బిల్లు విషయంలో, ఏమీ తెలవదని వాదించడం మాత్రం అన్యాయం. హజారే ఆరోగ్యం పట్ల ఆందోళన చెందిన ప్రభుత్వం-ప్రతి పక్షాలు, పరస్పరం సంప్రదింపులు చేసుకుని, అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కార మార్గాన్ని అన్వేషిస్తున్న సమయంలో తమవంతు సహకారం అందించడంలో హజారే బృందం సరైన పద్ధతిలో వ్యవహరించడం లేదనేది స్పష్టంగా కనిపిస్తోంది.

ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా-ప్రతిపక్షాలు ఎంత సహకారం అందించినా, పరిష్కారం కను చూపు మేరలో కనిపించడం లేదు. ప్రభుత్వం ఎన్నో మెట్లు దిగి వచ్చింది. జన లోక్ పాల్ బిల్లులోని  చాలా అంశాలను, పార్లమెంటు ప్రక్రియ నిబంధనల ప్రకారం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బిల్లులో చేర్చే ప్రయత్నం చేసింది. పార్లమెంటు స్థాయీ సంఘం ఆమోదం పొందడానికి రాజ్యాంగపరంగా వున్న వెసులుబాటులను పరిశీలించింది. పౌర సమాజం సభ్యులతో, అఖిల పక్షం సభ్యులతో ఉమ్మడి సమావేశాన్ని నిర్వహించింది. సిపిఎం నాయకుడు సీతారాం ఏచూరి, బిజెపి నాయకురాలు సుష్మా స్వరాజ్, ఇతర రాజకీయ పార్టీల నాయకులందరూ ఒక్క విషయంలో ప్రభుత్వానికి అండగా నిలిచారని చెప్పొచ్చు. పార్లమెంటు సార్వభౌమాధికారం, శాసన ప్రక్రియ, న్యాయ స్థానాల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లకుండా లోక్ పాల్ బిల్లును తేవాలన్నది వారి మాటల్లో స్ఫురించింది.

రాజ్య సభలో ఇంకా ఏమీ తేలకపోయినా, మన్మోహన్ సింగ్ సర్కారు లోక్ సభలో ప్రవేశపెట్టి, సభ ఆమోదం పొందిన లోక్ పాల్ బిల్లు, అన్నా హజారే బృందం సూచించినంత బలీయమైంది కాకపోవచ్చు. రాజ్యసభలో సూచించిన మోతాదులో 187 సవరణలు తేవాల్సినంత బలహీనమైన బిల్లు కూడా కాదు. అటు పౌర సమాజం, ఇటు ప్రతిపక్షాల సలహాల-సూచనలకు అనుగుణంగా రూపొందించిన "సంతులిత బిల్లు" అనవచ్చేమో! పౌర సమాజాన్ని రెచ్చగొట్టిన ప్రతిపక్షాలు, ఇలాంటి "సంతులిత బిల్లు" కు ఆక్షేపణలు తెలియచేయకుండా వుంటే సమంజసంగా వుండేదేమో! ఇప్పటికైనా ప్రతిపక్షాలతో సహా కొన్ని యుపిఎ భాగస్వామ్య పక్షాలు ఆ దిశగా ఆలోచన చేయాలి. ఇది బలహీనమైందన్న సాకుతో, లోక్ పాల్ చట్టం కాకుండా అడ్డుకునే ప్రయత్నాలు మానుకోవాలి. 

1 comment:

  1. http://teluguwebmedia.in మీకు నూతన సంవత్సర స్వాగతం పలుకుతోంది.
    -- ప్రవీణ్ శర్మ

    ReplyDelete