Saturday, September 29, 2018

హేమంత ఋతువు వర్ణించి అన్నకు చెప్పిన లక్ష్మణుడు ..... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-28 : వనం జ్వాలా నరసింహారావు


హేమంత ఋతువు వర్ణించి అన్నకు చెప్పిన లక్ష్మణుడు
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-28
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (30-09-2018)

పర్ణశాలలో నిష్టురాలైన సీతతో, తమ్ముడు లక్ష్మణుడితో ఎంతో సుఖంగా శ్రీరామచంద్రమూర్తి వున్న సమయంలో శరత్కాలం పూర్తై, మంచుకాలం మొదలైంది. ఇలా హేమంత ఋతువు రాగా, ఆ ఋతువులో ఒక నాటి తెల్లవారు జామున రామచంద్రమూర్తి గోదావరి నదీ స్నానం చేయదానికి సీతాదేవితో పోతుండగా, లక్ష్మణుడు కమండలాలు తీసుకొని వెంట బోతున్నాడు. అప్పుడు లక్ష్మణుడు రామచంద్రమూర్తితో ఇలా అన్నాడు. "అన్నా! ఏ ఋతువువల్ల సంవత్సరం ప్రకాశిస్తుందో, నీకు ఇష్టమైన మాసమేదో, అలాంటి మార్గశిరం, హేమంత ఋతువు అయిన మంచుకాలం ఇప్పడు వచ్చింది కదా! ప్రజలకు దేహం కఠినమైంది. స్నానం చేయడానికి సాధ్యపడకుండా నీటికి పళ్లు వచ్చి కరవసాగింది. పైరుపచ్చలు కాంతిటొ కళకలలాడుతున్నాయి. అగ్నిహోత్రుడు గతంలో లాగా కాకుండా ఆప్తుడై ప్రజలను దగ్గరకు రానిస్తున్నాడు. తమకేది మంచిదో తెలుసుకొని కొత్త ధాన్యం రాగానే పాలలో పొంగించి దాన్ని పితృ దేవతలకు నివేదించి పాపరహితులవుతున్నారు. అన్నా! రాజులు యుద్ధానికి పోవడానికి, గ్రామాలలో వుండేవారు పాలు, పెరుగు తినడానికి, ఈ మంచుకాలం పనికొస్తుంది కదా? దక్షిణ దిక్కున సూర్యుడున్న కారణాన ఉత్తర దిక్కు ముత్తైదువు చిహ్నమై, ముఖానికి శాశ్వత కాంతిని కలిగించే కుంకుమ బొట్టులేని ఆడదాని లాగా వుంది”.

(ఇది దక్షిణాయనమైనందున సూర్యుడు దక్షిణ దిక్కునే వుంటాడు. శ్రీరామచంద్రమూర్తి ఉత్తర దేశాన లేనందున అది విధవలా వుంది).

"హిమవత్పర్వతం స్వభావంగానే మంచుగడ్దలకు స్థానం. అందులో ఈ కాలంలో సూర్యుడు దూరంగా వుండడం వల్ల మంచు కరగడం ఆగిపోయి హిమవంతుడు అనే పేరు వచ్చే అర్థంతో కాలమహిమవల్ల అలరారుతున్నాడు. ఉదయం, సాయంత్రం మంచు ఎక్కువగా వుండడం వల్ల జనాలు తిరగలేరు. మధ్యాహ్నం జనులంతా సుఖంగా తిరగడానికి కొంచెమే వేడి కల ఎండ వుంటుంది. చెట్ల నీడల్లో సూర్యకిరణాలు ఎక్కువగా పడని కారణాన నీళ్లు జిల్లుమంటూ తాకడానికే కష్ఠంగా వుంటాయి. ఎండలు కొంచెమే వ్యాపించడం వల్లా, మంచుతో కప్పబడడం వల్లా, చల్లటి గాలి వీస్తుండడం వల్లా, వనాలలో మనుష్య సమ్చారం లేదు. ఇక పక్షుల కీళ్ళు పట్టుకునిపోయి, అవయవాలు ముద్దపడి వుంటాయి. పగలీవిధంగా వుంటుంది. రాత్రుళ్లు బయట పడుకొనేవారుండరు. పుష్యా నక్షత్రం చూసి పొద్దు తెలుసుకోవాల్సి వుంటుంది. రాత్రుళ్లు బూజు పట్టినట్లు తెల్లపారి, చలిగాలి వీస్తుంటుంది. ఆహ్లాదం కలిగించేవాడు కాబట్టి చంద్రుడికి ఆ పేరొచ్చింది. ఇప్పుడా పేరును తనకు వ్యర్థం చేసుకొని, లోకులను సంతోష పర్చడానికి ఆ శక్తిని సూరుడికి ఇచ్చాడు. ఆ కారణాన తపనుడు అనే పేరు సూర్యుడికి వచ్చి చంద్రుడిలాగా అయ్యాడు. అంటే సూర్యుడు చంద్రుడిలాగా ప్రజలకు సంతోషం కలిగించేవాడయ్యాడు. చంద్రుడేమో మంచు కురవడం వల్ల ప్రజలకు బాధ కలిగించేవాడయ్యాడు”.


అంతే కాకుండా మంచుతుంపరలు వ్యాపించడం వల్ల, చంద్రబింబం నోటి ఆవిరి కమ్మడం వల్ల గుడ్డి అయిన యుద్ధంలాగా కనపడుతున్నది. నిండు పున్నమి నాటి రాత్రి మంచుతో మలినం కావడం వల్ల సంతోషం కలిగించలేక పోయింది. ఇది ఎండవల్ల నల్లబడ్డ సీతాదేవిలాగా వుంది కాని ఆమెకున్న కాంతి మాత్రం లేదు. పడమటి గాలి స్వభావంగా చల్లగా వుంటుంది. దానికితోడు మంచుబిందువులు చేరాయి. కాబట్టి ఉదయం వేళ గాలి ఇనుమడించిన చలితో కూడి వుంది. యవగోధూమాల పైరులవల్ల ప్రకాశించే మంచు బిందువులతో కప్పబడిన అడవి సూర్యోద్య సమయం కావడాన క్రౌంచ పక్షులు వీటి ధ్వనివల్ల ప్రకాశిస్తున్నాయి. ఖర్జూరపు పూలలాంటి కాంతి కలిగి, ఎన్నులు, వడ్ల గింజలతో నిండి ఆ బరువుకు తలలు వంచి పండడం వల్ల అపరంజి బంగారు కాంతికలిగిన పైరు చూశావా? సూర్యుడు ఉదయించినా మంచంతా పోలేదింకా. తుంపరగా, సన్నగా, వ్యాపించే వుంది. ఆ కారణాన సూర్యుడు ఉదయించి చాలా పొద్దు పోయినా చందమామలాగా వున్నాడు. శ్రీరామచంద్రా! మధ్యాహ్నానికి ముందు ఎండ వేడి లేక సుఖంగా దేహాన్ని తాకుతూ, మధ్యాహ్నంలో కొంచెం ఎరుపు, కొంచెం తెలుపుగా సూర్యకిరణాలున్నాయి”.

మంచు తుంపరలు రాలడం వల్ల కొంచెం తడిసి వున్న లేబచ్చిక పట్టులలో సూర్యుడి ఈరెండ పడిన విధం చూశావా రామా! సూర్యకాంతి ఈ బిందువులమీద పదడం వల్ల అవి వజ్రాలలాగా కనపడుతున్నాయి. అన్నా! ఈ అడవి ఏనుగును చూడు. అది మిక్కిలి దప్పికతో బాధపడుతూ నీళ్లు తాగాలని తొండంకొనతో నీటిని తాకి అది జిల్లుమనగా తాగలేక తొండాన్ని ముడుచుకుంటున్నది. నీటిపక్షులు ఎప్పుడూ నీళ్లలోనే వుండేవైనప్పటికీ, నీటి వెంట తీరంలో కూర్చుని, నీళ్లలో దిగదానికి భయపడుతున్నాయి. వీటిని చూస్తే పిరికివాళ్లు యుద్ధరంగంలోకి దిగడానికి భయపడే విధంగా కనపడుతున్నది. లోపలా, బయటా మంచనే చీకటి, విస్తారంగా కప్పడం వల్ల అదవి పూలు లేనిదానిలాగా కనపడ్తున్నది. నీళ్లలో వుండే బెగ్గురు పక్షులు మంచు ఆవిరి కప్పడం వల్ల బయటకు రాకున్నా, వాటి ధ్వనులవల్ల వునికి తెలుస్తున్నది. భూమేమో మంచు తెరలతో తడిసిపోయింది. పైపైన మంచు రాలడం వల్ల సూర్యకిరణాలలో వేడి లేకుండా వున్నందున, రామచంద్రా, నిర్మలమైన రాళ్లమీద పడ్ద నీళ్లు కూడా విషాలై పోయాయి. తామరపూలు పూసి చాలాకాలం అయినందున మంచువల్ల అందం చెడి, వాడిపోయి, కాంతిహీనమై, అకరువులు, దిమ్మెలు రాలిపోగా కాడలు మాత్రమే వున్న తామరలతో కొలనులు అందవిహీనంగా వున్నాయి”.

ఇలా, పుండులాగా, బాధాకరమైన మంచుకాలంలొ, అయోధ్యలో దుఃఖంతో కుమిలిపోతూ, రాజ్యసంపదలన్నీ వదలి, భోగాలు ఆశించక, ఉపవాసాలుండి, జడలు-నారలు ధరించి, మంచాలు-పరుపులు వదలి, ఆరుబయట నేలమీద పడుకుంటూ, కొంచెం మాత్రమే పళ్లు తింటూ, నీమీద వున్న భక్తితో భరతుడు కష్టపడుతున్నాడు కదా? అన్నయ్యా! మనం లేచిన వేళకే భరతుడు కూడా నిద్రలేచి సరయూనదిలో స్నానం చేయడానికి, మంత్రులు, ఇతరులు సేవిస్తుండగా నిర్మలమైన మనస్సుతో, అయ్యో ఇలా పోవాల్సివచ్చిందికదా అనే విచారం లేకుండా పోతుంటాడు కదా? నీకంటేకూడా సుకుమారుడు, వీరుడు, పల్చటి కడుపు కలవాడు, చక్కటివాడు, కష్టింపతగినవాడు, సమస్త ధర్మాలు తెలిసినవాడు, సజ్జనులకు సంతోషకారుడు, సత్యవాది, దోషం లేని పనులు చేసేవాడు, మదించిన శత్రువుల గర్వం అణచేవాడు, తీయటి మాటలు చెప్పేవాడు, మోకాళ్లదాకా చేతులున్నవాడు, మాత్సర్యం, దుష్కామం లేనివాడు, చేయతగని పనులు చేయడానికి సిగ్గుపడేవాడు, ఇంద్రియనిగ్రహం కలవాడు, గాఢమైన భక్తి వున్నవాడు, అఖిలభోగాల రాశి, నీ తమ్ముడు భరతుడు ఆశను వదలి అడవిలో తపించే నీలాగా, తపస్సులో నిష్టబూని, స్వర్గాన్ని తిరస్కరించినవాడయ్యాడు. తండ్రిని పోలిన కూతురు, తల్లిని పోలిన కొడుకు ధన్యులని సామెత వుండగా, సముద్రంలో కలిసిన నీరు సముద్రంలాగా కావాల్సి వుండగా, ధర్మ స్వభావుడైన దశరథుడికి భార్య అయ్యి, ఇలాంటి సుగున సంపత్తికల కొడుకుకు తల్లి ఐన కైక ఇంతటి దుష్టురాలు, వాడికల మనసున్నదిగా ఎలా కాగలిగిందో?” 

(లక్ష్మణుడి సందేహం న్యాయమైందేకాని, రామలక్ష్మణుల, భరతశత్రుఘ్నుల జన్మలకు బీజం కారణం కాదు. క్షేత్రమూకాదు. పాయస రూపం వహించిన భగవత్తేజం కారణం కాబట్టి తల్లిదండ్రుల గుణాలు వీరికి అంటాల్సిన అవసరం లేదు).

ఈ విధంగా లక్ష్మణుడు చెప్పగా, శ్రీరాముడు, "లక్ష్మణా! ఎందుకు నిర్నిమత్తంగా కైకను దూషిస్తావు? రఘువంశనాథుడైన ఆమె కొడుకును ప్రశంసించు. అది నాకు సంతోషం కలిగిస్తుంది. వనవాసం పూర్తిగా చేసుకోవాలని మనస్సు ధృఢం చేసుకొన్నా, భరతుడిని తలచుకున్నప్పుడు, అయ్యో! భరతుడి దగ్గరకు పోతే బాగుండేదే, ఆయన్ను విడిచి వచ్చానే, అని పామరులలాగా నాకూ దుఃఖం కలుగుతున్నది. నాయనా! లక్ష్మణా! కొందరి మాటలు వినడానికి మొదట్లో మధురంగానే వుంటాయికాని, చివరకు, అవే అప్రియాలై పరిణమిస్తాయి. భరతుడి మాటలు అలాంటి ఇచ్చకాలు కావు. కొన్ని పదార్థాలు నాలుకకు తియ్యగా వున్నా లోపలికి పోయినాకొద్దీ వికారంగా మారుతాయి. భరతుడి మాటలు అలాకాకుండా అమృతంలాగా వుంటాయి. లోపలి పోయినా దేహారోగ్యం కలిగించే ఔశధుల్లాంటివి. అదీ కూడా ఒకటి-రెండు చుక్కలు కావు. అమృతరసప్రవాహం కాబట్టి సర్వదా అతడి మాటలు నాకు ఇప్పటికీ మరపుకు రావు. నిన్ను, భరతుడిని, శత్రుఘ్నుడిని, సీతను కూడిన నేను సంతోషంతో వుండేదెన్నడోకదా" అని అంటూ, విచారపడుతూ గోదావరి నదికి స్నానం చేయడానికి పోయాడు. సీతాలక్ష్మణులతో స్నానం చెసి వచ్చి, సంధ్యావందనం లాంటివి చేసుకొని, బ్రహ్మ యజ్ఞాన్ని చెసి, పార్వతీ నందులతో కూడిన రుద్రుడిలాగా కనిపించాడు.

No comments:

Post a Comment