Sunday, September 16, 2018

సీతాదేవి ప్రార్థించిన వెంటనే చల్లబడ్డ అగ్నిహోత్రుడు ..... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు


సీతాదేవి ప్రార్థించిన వెంటనే చల్లబడ్డ అగ్నిహోత్రుడు
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (17-09-2018)
హనుమంతుడి మేలుకోరుకునే పతివ్రత సీతాదేవి, ఆయన పరాక్రమం గురించి, రాక్షసులను ఆయన చంపిన సంగతి గురించి విని సంతోషించింది. ఇప్పుడు తనమరణంతో సమానమైన ఈవార్తను విని దిగులుపడి, ఆంజనేయుడి మేలుకోరి అగ్నిహోత్రుడిని ప్రార్ధిస్తుందిలా:

"నేను పతిసేవచేసే స్త్రీనైతే, నిష్టతో తపస్సు చేసిన దాననైతే, నేను నిజమైన పతివ్రతనే అయితే, ఓ అగ్నిదేవుడా! నీవు హనుమంతుడిపట్ల చల్లబడాలి. సూర్యవంశ రాజుల్లో శ్రేష్టుడైన శ్రీరామచంద్రమూర్తికి నామీద దయవుంటే, నాకింకా కొంచెం భాగ్యం మిగిలే వుండి వుంటే, హనుమంతుడికి చల్లగా అయిపో! మనసున్న రామచంద్రమూర్తితో సాంగత్యం నేనెప్పుడూ కోరేదాన్నైతే, మంచి నడవడిగల దాన్నని హనుమంతుడు నన్ను నమ్మితే, ఆయనకు శీతలుడవైపో. సుగ్రీవుడు త్వరగా ఇక్కడకు రావడం, నన్నీ శోకసముద్రం నుండి దాటించడం నిజమైతే, హనుమంతుడికి బాధలేకుండా చల్లగా అయిపో".

(ఇదొక అగ్ని పరీక్ష. సీతమ్మకేకాదు, రాముడికి కూడా! నేనే పతివ్రతనైతే, నాకు తపశ్శక్తి వుంటే, అదృష్టవంతురాలిని అయితే, తార వుత్తమరాలైతే, సుగ్రీవుడు సత్యవంతుడైతే---- ఇవన్నీ నిజమైతే, అగ్ని తన సహజ స్వభావాన్ని ఉపసంహరించుకోవాలి. అంతేకాదు, చల్లబడిపోవాలి. అందరిపట్ల, అన్ని విషయాలలో కాదు. కేవలం హనుమంతుడిపట్ల మాత్రమే చల్లబడమంది ఆ తల్లి. అంటే, చక్కగా చల్లబడ్డాడు. ఆమె అన్న మాటలన్నీ సత్యమని నిరూపించేసాడు అగ్నిదేవుడు. రామాయణంలో ఇదొక అత్యంత ఆశ్చర్యకరమైన సన్నివేశం. మరొక రహస్యం కూడా వుందిక్కడ. శీతోభవ అని సీతమ్మ ఆజ్ఞాపిస్తే అగ్ని విధేయుడై చల్లబడ్డాడు హనుమంతుడి విషయంలో. మరి సీతమ్మ దగ్ధోభవ దశానన అని అగ్నిని ఆజ్ఞాపిస్తే రావణుడు బూడిద అయ్యేవాడు కద! అందువల్లనే ఆ తల్లి అన్నది, నాకు శ్రీరాముడి ఆజ్ఞ లేదు కనుక అలా శపించడం లేదని. రావణుడికి గుండె పగిలేంత దిగులు పట్టుకుంది దీనివల్ల. అంతేకాదు. ముందు కాలంలో సీతమ్మ అగ్నిప్రవేశం చేయవలసిన సమయంలో అగ్ని సీతమ్మను దహించజాలడన్న విషయం కూడా రుజువయింది.

హనుమంతుడి విషయంలో అగ్నిహోత్రుడు చల్లబడితే, ఆమె చెప్పినవన్నీ సత్యమేనన్న భావం పైమాటల్లో కలుగుతుంది. రామచంద్రమూర్తి బ్రహ్మాస్త్రం సంధించి, నిన్ను రూపుమాపుతానని సముద్రుడిని బెదిరించినా, తనస్వభావాన్ని విడువలేనని చెప్పగలిగాడు ఆ వేళ సముద్రుడు. కాని,  హనుమంతుడికి చల్లదనం కలిగించమని సీతాదేవి మాట మాత్రంగా అడిగితే, అగ్ని చల్లబడింది. ఎంతటి మహాత్ములైన పురుషులకు కూడా సాధ్య పడనిది, పతివ్రతలైన స్త్రీలకు సాధ్య పడుతుందని దీనివలన తెలుస్తున్నది.


"అష్టాక్షరి" మంత్రంలో "ప్రణవం, నమస్సు, నారాయణపదం" వున్నాయి. "ప్రణవం" అంటే జీవాత్మ పరమాత్మకేవుపయోగ పడాలనీ, ఆయన సేవకే వినియోగపడాలనీ అర్థం. "నమస్సు" అంటే స్వాతంత్ర్య రాహిత్యాన్నీ, పారతంత్ర్యాన్నీ తెలుపుతుంది. చతుర్ధీ విభక్తి యుక్తమైన "నారాయణపదం" భగవత్ ప్రియమైన భాగవత సేవను తెల్పుతుంది. భాగవత సేవ భగవత్ ప్రీతికరమ్. "ప్రణవం" లక్ష్మణుడు: జీవితాంతం అన్నకు శుశ్రూశ చేశాడు. లక్ష్మణుడిని వాల్మీకి మహర్షి లక్ష్మణుడు లక్ష్మీవర్ధనుడు అని సంభావిస్తాడు. లక్ష్మి అంటే సిరిసంపదలని మనం భావిస్తాం. అలాంటి సిరిసంపదలను లక్ష్మణుడు ఎన్నడైనా కోరుకున్నాడా? అనుభవించాడా? వాటికోసం ఆరాటపడ్డాడా? అంటే  లేనేలేదని సమాధానమొస్తుంది. కానీ లక్ష్మి అంటే భగవంతుడికి సేవ చేసే భాగ్యం అని మన పెద్దలు తేల్చివేసారు. కాబట్టి లక్ష్మణుడు లక్ష్మీవర్ధనుడు. అంటే అతడు భగవదవతారమైన శ్రీరాముడి సేవానిరతుడనీ, భగవత్ కైంకర్యాన్ని అవిచ్చిన్నంగా సాగించే కైంకర్య లక్ష్మీవర్ధనుడని అర్థం చేసుకోవాలి. "నమస్సు" భరతుడు: కేవలం పరతంత్రుడై రాముడులేని అయోధ్యలో, వానప్రస్థుడి లాగా ఉన్నాడు. "నారాయణపదమ్" శతృఘ్నుడు: రామ పరతంత్రుడై, భాగవతుడైన భరతుడికి ప్రీతిగా ప్రవర్తించాడు. ఈ మూడింటినీ ఒక్క సీతాదేవే అనుష్టించి చూపింది. పతి సేవ చేసే స్త్రీనని అగ్నిహోత్రుడికి తెలిపి రామకైంకర్యాన్ని స్థిరపరచింది. రావణుడిని దగ్ధం చేయననీ, హనుమంతుడి వెంట రాననీ చెప్పి తన పారతంత్ర్యాన్ని ప్రకటించింది. రామదాసుడగు హనుమంతుడికి అపాయం లేకుండా చేసి భాగవత ప్రీతిని కనపరచింది.

సీత అగ్నిహోత్రుడిని ప్రార్థించిందేకాని, తనతపోబలంతో నువ్విట్లా కమ్మని శాసించలేదు. స్త్రీలకు రక్షాకార్యం స్వధర్మం. బిడ్డలను రక్షించడానికి, భర్తకున్న స్వాతంత్ర్యం భార్యకూ వుంది.)

ఇలా ప్రార్ధిస్తున్న సీతాదేవికి, హనుమంతుడికి అపాయం లేదన్న సూచనలు రాసాగాయి. కాలుతున్న తోకనుండి మండే గాలి రాకుండా, మంచులాంటి చల్లటి గాలి వీచింది ఆమెవైపు. అగ్ని తనను కాల్చకుండా చల్లబడిపోవడం చూసి హనుమంతుడు ఆశ్చర్యపోయాడు, కారణం తెలియక. అకస్మాత్తుగా అనిలుడు శీతలుడైనాడేమిటా! అని ఆయనకు ఆశ్చర్యం కలిగింది.  అయితే కాసేపు ఆలోచించిన తర్వాత, కారణం తెలిసిందనుకుంటాడు. లోగడ సముద్రం దాటి వచ్చేటప్పుడు, ఎలాగైతే శ్రీరాముడి మహిమవల్ల, సముద్రం, పర్వతం, సహాయపడ్డాయో, అదేవిధంగా, ఇప్పుడుకూడా జరిగి వుంటుందని తలుస్తాడు. అప్పుడు తనదగ్గరున్న రామముద్రిక కాపాడగా, ఇప్పుడు సీతమ్మ ఇచ్చిన చూడామణి తనదగ్గరుండి కాపాడిందనుకుంటాడు. సముద్రుడు, మైనాకుడు శ్రీరాముడిపట్ల చూపిన ప్రీతిని, అగ్నిహోత్రుడు మాత్రం ఎందుకు చూపడనీ, ఇదంతా రామచంద్రమూర్తి మహిమేననీ, ఆయన పని చేస్తున్న తనకు ఆయనెందుకు అపాయం కలుగనిస్తాడనీ, భావిస్తాడు. 

(సదా రామ కైంకర్యమ్ చేసేవారికి, శ్రీరామచంద్రమూర్తి అపాయం కలుగనీయడు, సహాయమే చేస్తాడు)

పతివ్రతైన సీతాదేవి దయవలన, శ్రీరామానుగ్రహం వల్ల, వాయుదేవుడికి అగ్నిహోత్రుడు మిత్రుడైనందువల్ల తనపైన ప్రేమతో చల్లబడ్డాడనుకుంటాడు. ఇలాకొంతసేపు ఆలోచించి, సింహనాదం చేసి, పర్వత శిఖరమంత ఎత్తున్న లంకానగర ద్వారం గోపురం మీదకు చివాలున దూకుతాడు. ఆ పని చేసేటప్పుడు, దేహాన్ని చిన్నగా చేయడంతో, కట్టిన కట్లన్నీ వాటంతట అవే వూడి జారిపడిపోయాయి. సీతారాముల కటాక్షానికి పాత్రుడైన హనుమంతుడు, అటుపక్క, ఇటుపక్క చూసి, పూర్వపు భయంకరాకారాన్నే తిరిగి దాల్చి, ద్వారం దగ్గరున్న పొడగాటి గుదిబండను తీసుకుని, కావలివాళ్లను దాంతో చంపుతాడు. తోకమండుతుంటే హనుమంతుడు ఏంచేయాలన్న ఆలోచనలో పడ్డాడు.

No comments:

Post a Comment