Tuesday, September 4, 2018

ఎన్నికల సంఘం ఓకే అనక తప్పదు... : వనం జ్వాలా నరసింహారావు


ఎన్నికల సంఘం ఓకే అనక తప్పదు...
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి దినపత్రిక (05-09-2018)

గాసిప్..గాసిప్..ఎక్కడ విన్నా, చూసినా అదే గాసిప్...తెలంగాణ రాష్ట్రంలో ముందస్తుగా ఎన్నికలు జరగబోతున్నాయన్న గాసిప్. కొన్ని పత్రికలైతే శాసనసభ రద్దుకు, ముందస్తు ఎన్నికలకు ముహూర్తం, తేదీలు కూడా ఖారారు చేసాయి. దీర్ఘకాలంగా కేంద్ర ప్రభుత్వం దగ్గర అపరిష్కృతంగా వున్న అనేక రాష్ట్ర సంబంధిత అంశాలమీద చొరవ తీసుకోవాలని కోరడానికి, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ధిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని కలిసిన ప్రతిసారీ, పత్రికల్లో ప్రధాన శీర్షికలతో ముందస్తు ఎన్నికల ప్రస్తావనకు చెందిన గాసిప్ వార్తలే కనిపిస్తున్నాయి. పాత్రికేయ జ్యోతిష్కుల భవిష్యత్ వాణిలోని నిజా-నిజాలు, శాసనసభకు ముందస్తు ఎన్నికల సాధ్యా-సాద్యాలను విశ్లేషించి చూస్తే బహుశా ఆసక్తికరమైన అంశాలు అవగతం కావచ్చునేమో! ఒకవేళ వారి అంచనాల ప్రకారం శాసనసభ రద్దయి, ముందస్తు ఎన్నికలకు పోతే, ఉత్పన్నమయ్యే ప్రశ్నలు కూడా ఆసక్తిగానే వుంటాయి.

అన్నింటికన్నా ప్రధానమైంది, ఏఏ పటిష్టమైన కారణాల వల్ల సీఎం శాసనసభ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు పోవాలనుకుంటున్నాడనే విషయం. ఒకవేళ అదే నిజమైతే, “సీఎం” అలా చేయకూడదా? అసెంబ్లీని రద్దు చేయమని అడిగి ప్రజాక్షేత్రంలోకి పోకూడదా? శాసనసభలో తిరుగులేని పరిపూర్ణ మెజారిటీ కలిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు, అవసరమనుకుంటే, కావాలనుకుంటే, ఎప్పుడైనా సరే సభను రద్దు చేయమని, రాజ్యాంగపరంగా గవర్నర్ ను కోరే హక్కు వుంది. కాకపోతే ఆ నిర్ణయం ఆయన ఎప్పుడు తీసుకుంటారని ప్రశ్నిస్తే, సమయం వచ్చినప్పుడు అనేదే సమాధానం.

కల్లబొల్లి మాటలతో, అమలుకువీలుకాని అబద్ధపు అసంబద్ధమైన వాగ్దానాలతో భారతదేశంలో ఓటర్లను మభ్యపెట్టడానికి సవాలక్ష మార్గాలున్నాయి. మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల నుంచీ ఇది నిరాటంకంగా కొనసాగుతున్న కఠోర వాస్తవం. ఇలాంటి కుటిల వాగ్దానాలు చేస్తున్న రాజకీయ పార్టీలను కట్టడి చేయడంలో రాజ్యంగ రక్షణ వున్న ఎన్నికల సంఘం కూడా దురదృష్ట వశాత్తు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నది. భయంకర నిశ్శబ్దం పాటిస్తున్నది. చివరకి ఈ యావత్తు వ్యవహారంలో ఓటర్ బాధితుడుగా మిగిలిపోతున్నాడు. ఉదాహరణకు, దీర్ఘకాలం అధికారం అనుభవించి, ప్రస్తుతం ప్రతిపక్షంగా వున్న ఒకానొక ప్రధాన రాజకీయ పార్టీ అనుదినం అసంబద్ధమైన వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నది. అధికారంలోకి వస్తే, రు. 2 లక్షల వరకు వ్యవసాయ ఋణాలను ఒకే-ఒక్క సారి మాఫీ చేస్తామనీ, ఆసరా పించన్లను రెట్టింపు చేస్తామనీ, ఒకే కుంటుంబానికి ఒకటికంటే ఎక్కువ పెన్షన్లు ఇప్పిస్తామనీ, నిరుద్యోగబృతి మంజూరు చేస్తామనీ, పెన్షన్ పొందడానికి వయోపరిమితి తగ్గిస్తామనీ...ఇంకా ఏదో-ఏదో చేస్తామనీ చెప్తున్నారు. ఇవన్నీ చెప్పెముందర వీటి అమలు సాధ్యా-సాధ్యాలు కాని, తద్వారా పడే ఆర్ధికభారానికి తగ్గ నిధులు ప్రభుత్వం దగ్గర వుంటాయా? లేదా? అనే విషయం కానీ, ఆ రాజకీయ పార్టీ ఆలోచన చేసిందా అనేది జవాబు దొరకని యక్షప్రశ్న. 2009 ఎన్నికల్లో కూడా అదే రాజకీయ పార్టీ ఎన్నో వాగ్దానాలు చేసింది...ఎన్నికల్లో గెలిచింది...చివరకు ఐదేళ్ళ పాలనలో కనీసం ఒక్క వాగ్దానాన్నీ కూడా నేరవేర్చలేకపోయింది.       


ఇలాంటి కల్లబొల్లి మాటలతో, అబద్ధపు వాగ్దానాలతో, ఓటర్లను మభ్యపెట్టడంవల్ల, ఏ మాత్రం జరిగే అవకాశం లేకపోయినా, ఒకవేళ దురదృష్తవశాత్తు, ఇలాగే ఎక్కువకాలం వాళ్ల వాగ్దానాల పర్వం కొనసాగనిస్తే, అది వాళ్లకు లాభదాయకమై, అనుకోనిది జరిగితే నష్టపోయేది ప్రజలు, తెలంగాణ రాష్ట్రం. సిద్ధాంతాలు లేని, అనైతిక-అబద్ధపు మాటలు చెప్పే ప్రభుత్వమే అధికారంలోకి వస్తే, బంగారు తెలంగాణ భవిష్యత్ ఏంటి? తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం ఏంకావాలి? సాగునీటి ప్రాజెక్టుల భవిత్యం ఏమిటి? మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ఏమైపోవాలి? రైతు బంధు-రైతు భీమా పథకాలు కొనసాగుతాయా? వందలాది ఇతర ప్రజోపయోగ పథకాల గతి ఏంటి? దీర్ఘకాలిక పోరాట ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఇంకా ఎంతో ముందుకు పయనించాల్సిన ఈ సందర్భంలో అలాంటివారి చేతుల్లోకి పోతే ఎలా? ఎలాంటి పరిస్థితుల్లోనూ అలా జరగడానికి వీల్లేదు.

ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో చేసింది...ఇంకా చేయాల్సింది ఎంతో వుంది. అది జరగాలంటే మళ్లీ ఆయన నాయకత్వమే కావాలి. చెప్పుకుంటూ పోతే ప్రభుత్వం చేసినవి ఎన్నో వున్నాయి. విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించి, అచిరకాలంలోనే మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణ వెలిగిపోనుంది. దీన్ని కొనసాగించడం టీఆరెస్ ప్రభుత్వానికి తప్ప ఇతరులకు సాధ్యమా? ఏక గవాక్ష పారిశ్రామిక విధానాన్ని ఇంత పకడ్బందీగా మరెవరైనా అమలు చేయగలరా? రైతు బందు-రైతు భీమా  లాంటి పథకాల ద్వారా వ్యవసాయ రంగాన్నీ, రైతునూ ఆహర్నిషలూ ఆదుకోవాలంటే కేసీఆర్ లాంటి దార్శినికుడు కావాలి. గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ మరింత పరిపుష్టం కావాలంటే ఎవరికీ సాధ్యం? ఇలాంటివే ఇంకెన్నో!!!

ఏదేదో చేస్తామని చెప్తున్న ఈ స్వయంప్రకటిత రాజకీయ నాయకులకు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రీడిజైన్ చేసిన సాగునీటి ప్రాజెక్టుల గురించి ఒక్క ముక్కయినా అర్థమవుతుందా? అసలు ఏ ప్రాజెక్టులో ఎంత నీరు లభ్యం, ఎప్పుడెప్పుడు అవుతుందో వాళ్లకు తెలుసా? ఎటునుండి నీరు ఎటు వైపు పారుతుందో, నీటి యాజమాన్య విధానం ఏంటో వాళ్లకు అవగాహన వుందా? అలాంటప్పుడు ఇలా జరగడం అవసరమా? ఎప్పటికీ అలా జరగకూడదు. ధర్మాగ్రహంతో ప్రజల బాగోగులు పరిరక్షించడానికి ప్రజాస్వామ్య బద్ధంగా ఏం చేయడానికి వీలవుతుందో అదంతా చేయడమే నాయకుల కర్తవ్యం. అదే జరగబోతున్నదేమో తెలంగాణాలో బహుశా.    

ఈ నేపధ్యంలో ఎప్పుడు, ఎవరు శాసనసభను రద్దు చేయమని కోరే హక్కుందన్న ప్రశ్న వేసుకోవాలి. పాలక పార్టీ మెజారిటీ పక్ష శాసనసభ నాయకుడికి ఎప్పుడైనా సభను రద్దు చేయమని గవర్నర్ కు సలహా ఇచ్చే హక్కు వుంది. ఆయన ఈ పని ఎప్పుడు చేయదల్చుకుంటే అప్పుడు చేసే హక్కును ఎవరూ ప్రశ్నించలేరు. ఇటీవల వస్తున్న మీడియా కథనాలే నిజమైతే, అందులో ఏమన్నా వాస్తవముంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు, ఏ కారణం చెప్పకుండా, ఎప్పుడైనా శాసనసభను రద్దు చేయమని గవర్నర్ కు సిఫార్స్ చేసే హక్కు నిర్ద్వందంగా హక్కుంది. ఈ విషయంలో కొందరు ప్రతిపక్ష నాయకుల ఆరోపణలకు అర్థం లేదు. కేసీఆర్ కు శాసనసభలో పరిపూర్ణ మెజారిటీ వుంది. ఎప్పుడైనా, ఆయన కావాలనుకుంటే, సభను రద్దుచేయమని అడిగి ఎన్నికలకు పోవచ్చు.

ఒకసారి శాసనసభ రద్దు కాగానే, కొత్త శాసనసభ ఏర్పాటు చేయడానికి ఎన్నికలు నిర్వహించాలి. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే విషయంలో సంపూర్ణ అధికారం  కేంద్ర ఎన్నికల సంఘానికి వుంది. ఆ విషయం ఎవరూ కాదనలేరు. దీనికి సంబంధించినంతవరకు ప్రధాన మంత్రికి ఎలాంటి పాత్ర లేదు....వుండకూడదు కూడా. రకరకాల సందేహాలు వ్యక్తం చేస్తున్న కొందరి అభిప్రాయం, బహుశా, ప్రధానమంత్రి పరోక్షంగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేస్తాడని కావచ్చు. ఆ అవసరం ఆయనకుంటుందని భావించడం సరైంది కాదేమో. తెలంగాణాలో, ఒకవేళ, శాసనసభ రద్దు చేసి ఎన్నికలు ముందస్తుగా జరపాలనుకుంటే అలా జరగకుండా చూడడంవల్ల ప్రధానికి ఒరిగే లాభం లేదు.

శాసనసభ ఒక సమావేశానికీ, మరొక సమావేశానికీ మధ్య ఆర్నెల్ల కంటే ఎక్కువ వుండకూడదని రాజ్యంగా నిర్దేశిస్తున్నది. దీనర్థం: సభ సమావేశమైన-రద్దయిన ఆరునెలల లోపు ఎన్నికలు నిర్వహించడం మినహా మరో గత్యంతరం ఎన్నికల సంఘానికి లేదు. ఆ లోపుగా కొత్త ప్రభుత్వం ఏర్పడి తీరాలి కదా. తెలంగాణ విషయంలో కొందరు అంటున్నట్లు గుజరాత్ విషయంలో అప్పటి ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం ఉదహరించడం సమంజసం కాదు. నేటి ప్రధాని మోడీ, నాడు గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు, భారతదేశంలో కనీ-వినీ ఎరుగని రీతిలో చోటుచేసుకున్న 2002 హింసా సంఘటనల నేపధ్యంలో, జులై 19, 2002 న శాసనసభను రద్దు చేసి ఎన్నికలు నిర్వహించాలని కోరడం జరిగింది. అప్పట్లో రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలే వున్నాయి. ఎన్న్జికల సంఘం నిర్ణయం రాజ్యంగ ప్రకరణ 174 కు విరుద్ధంగా తీసుకోవడం జరిగింది. అల్లర్లు ఇంకా సమసిపోనందున, ఓటర్ల జాబితా తయారు కానందున, ఎన్నికల యంత్రాంగం సిద్ధంగా లేనందున, ఆర్నెల్ల లోపు ఎన్నికలు నిర్వహించడం సాధ్యపడదని ఈసీ నిర్ణయించింది. చివరకు రాష్ట్రపతి జోక్యం చేసుకుని సుప్రీం కోర్టు సలహా కోరగా, కథ సుఖాంతం అయింది.

మీడియా వార్తలు నిజమై, ఒకవేళ సీఎం కేసీఆర్ శాసనసభను రద్దు చేయాలని భావిస్తే, అదే జరుగుతే, రాజ్యాంగం ప్రకారం 2019 మార్చ్ నెలలోపు జరగాల్సి వున్నా, అంతవరకు ఆపాల్సిన పని ఎన్నికల సంఘానికి లేదు. డిసెంబర్ 2018 లోపు మిజోరాం, చత్తీస్ఘడ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికలు జరగాల్సి వుంది. అలాంటప్పుడు, తెలంగాణ శాసనసభ రద్దు చేయడం అంటూ జరుగుతే, ఆ రాష్ట్రాలతో పాటు తెలంగాణాలో కూడా ఎన్నికలు నిర్వహించడానికి  అంగీకరించడం మినహా ఎన్నికల సంఘానికి వేరే మార్గం లేనేలేదు. ఏం జరుగుతుందో, జరగబోతున్నదో, జరిగితే బాగుంటుందో అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. సమాధానం కూడా ఆసక్తికరమే. 

1 comment:

  1. The way you are espousing the cause of unwanted senseless wasteful early polls is disgusting. When we have the golden chance of simultaneous polls, where is the need for advancing polls. And that too for no valid reason. If responsible journos too don't call the bluff, very sad state of affairs.

    ReplyDelete