Sunday, September 9, 2018

విభీషణుడు దూతను చంపకూడదంటే హనుమ తోక కాల్చమన్న రావణుడు .... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు


విభీషణుడు దూతను చంపకూడదంటే హనుమ తోక కాల్చమన్న రావణుడు
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (10-09-2018)
రావణాసురుడు హనుమంతుడిని చంపమని ఆజ్ఞాపించాడు. అదివిన్న విభీషణుడు, పండితుడైనందున, రాజాజ్ఞ నీతికి విరోధమనీ, దోషమనీ చెప్పుతాడు. రావణాసురుడి మేలుకోరి, హితోక్తులతో, మెత్తటి మాటలతో, రాజుకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తాడు. "రాజా! నన్ను క్షమించు. కోపం మాను. వీడిపైన దయచూపు. న్యాయం ఆలోచించు. నీతిశాస్త్రం ఎరిగిన రాజులు దూతను చంపడం దోషమని, ఆపని చేయరు. అందులోనూ కోతిని చంపడం, ఇంకా లోకనిందకు గురయ్యే విషయం. రాజ ధర్మానికి విరుధ్ధమైన పని. దేవతలను జయించిన నీ అంతటి గొప్పవాడు ఒక కోతిని చంపిస్తే, పేరూ, ప్రతిష్ట వుంటాయా?" అంటూ ఇంకా ఇలా చెప్పసాగాడు విభీషణుడు:

"క్షత్రియధర్మంలో పండితుడవు. కృతజ్ఞుడవు. సామాన్యధర్మం తెలిసిన వారిలో నీకు సమానులు లేరు. ప్రజలు చేసే తప్పొప్పులు తెలిసినవాడివి. పరమార్థం తెలిసిన పండితుల్లో శ్రేష్టుడవు. నీలాంటి పండితుడు, క్షణకోపంలో పోగూడని మార్గంలో పోతే, నేర్చిన విద్యకు ఫలితం కష్టపడటమే! చదివిన చదువును కార్యరూపంలో పెట్టకపోతే ఆ చదువు నిరర్ధకం. మూర్ఖుడు, పండితుడూ, ఒకేవిధంగా నడుచుకుంటే, వాళ్లకు, వీళ్లకు తేడా లేనట్లేకదా! శ్రమపడి చదవటమొక్కటే తేడా. శత్రువులను దండించడంలో నేర్పరివైన నీవు, ఔచిత్యం ఆలోచించి, దూతనెట్లా దండించాలో, ఎలా చేస్తే న్యాయమో, అట్లానే దండించు".

పాపాత్ములను దండించడం పాపం కాదనీ, పాపపు నడవడికల కోతిని అందుకే చంపమన్నానని రావణుడు విభీషణుడితో అంటాడు. పెద్దలు సమ్మతించని, కర్మం అధారంగాలేని, దోషంతో కూడిన రావణుడి మాటలకు, సమర్ధుడు, నేర్పరి, బుధ్ధిమంతుడైన విభీషణుడు చక్కగా జవాబు చెప్పాడీవిధంగా:

"రాక్షసరాజా! నీమాటకు ఎదురు చెప్తున్నానని కోప్పడవద్దు. నేను ధర్మం ప్రకారమే చెప్తున్నాను. కోపం మాని విను. దూతను, దూతకార్యం చేస్తున్నప్పుడు, చంపకూడదు. ఈ నిబంధన, మర్యాద, అన్ని జాతుల్లో, అన్ని ప్రదేశాల్లో వుందని పండితులు చెప్తారు. నిన్ను జయించగలవాడెవ్వడూ లేడు. వీడేదో అన్నాడని కోప్పడాల్సిన పనిలేదు. వీడు పగవాడే, అందులో సందేహంలేదు. వీడపకారం చేసాడు కాబట్టి దండించాల్సిందే. నేనువద్దనడంలేదు. క్షమించి విడిచిపెట్టమనీ అనడంలేదు. దూతనెలా దండించాల్నో, అలామాత్రమే, ఆవిధానం ప్రకారం మాత్రమే దండించాలంటున్నాను. ఆ పధ్ధతుల్లో దేహబాధ కలిగించటానికి కొన్నిమార్గాలు చెప్పారు పెద్దలు. ఆ ప్రకారమే దండించు".

"తల గొరిగిమ్చడం, అవయవహీనుడిగా చేయడం, కొరడాతో కొట్టించడం, కాల్చివాతలు వేయడం వంటివి కొన్ని పద్ధతులని పెద్దలంటారు. ఇలా చేయమని చెప్పారేకాని దూతను చంపవచ్చని ఎవరూ చెప్పలేదు. ధర్మాధర్మ విచక్షణ వున్న నీలాంటివాడు, ఉచితానుచితమైన పనేదనే విషయంలో, దృఢమైన మనస్సుతో ఆలోచించకుండా, ధర్మవిరుద్ధంగా చేయదల్చుకుంటే, ఇతరులకు నీవిలానే మార్గ దర్శకుడవుతావుకదా! ధర్మబద్ధంగా వాదించడంలోకానీ, లోకవ్యవహారం నడపడంలోకానీ, సకల శాస్త్రజ్ఞానమందుకానీ, చదివిన విషయం ధారణ చేయడంలొ కానీ, దేవదానవుల్లో నీకు సరిసమానమైన వాడు లేనేలేడు. నీకు నీవే సాటి".


"అయినా ఇతడిని చంపితే నీకు ఒరిగేదేంటి? శత్రుత్వం పోతుందా? వీడిని పంపించిన వాడిని దండిస్తే లాభముంటుంది, పగ తీరుతుంది, కీర్తిపెరుగుతుంది. వ్రేళ్లు పెకిలించకుండా కొమ్మ నరికితే వచ్చిన లాభమేంటి? మంచికో, చెడుకో, కడుపు కూటికొరకు ఇతరుల దూతగా వచ్చాడు. ఇక్కడి మాటలక్కడ, అక్కడి మాటలిక్కడ చెప్తాడు. వాడినెందుకు చంపడం? ఇక్కడితడిని చంపితే, సముద్రాన్ని దాటిరాగల బలవంతుడు మరొకడుండడు. వీడిచావు వార్త రామలక్మణులకు తెలియచేసి, వాళ్లనిక్కడకు పిల్చుకొచ్చేవారెవరూ వుండరు. కాబట్టి యుధ్ధమే వుండదు. యుద్ధం జరక్కపోతే, వీడిని పంపినవాడిని దండించలేవు. నీకు యుధ్ధమంటే ఇష్టం. ఎప్పుడు యుధ్ధమొస్తుందానని నీ భటులూ ఎదురు చూసేవారే! ఇంద్రుడిలాంటి వాడు వచ్చినా యుద్ధం మీద ఉత్సాహం చూపడమే నిజమైన మగతనం. దానిని నువ్వు తప్పించే ప్రయత్నం చేయొద్దు. కాబట్టి దూతను చంప వద్దు".

రాజకుమారుల మీద పగ సాధించదల్చుకున్న తన సేనానాయకులను, మేలుకోరేవారిని, చక్కగా ఆలోచించేవారిని, జీతాలు, బహుమతులు ఇచ్చి చేర్చుకున్నవారిని, గొప్ప వంశంలో పుట్టిన వారిని, ఆయుధాలు ధరించడంలో నేర్పరులను, యుద్ధంలో గెల్వాలన్న అభిలాష వున్నవారిని, చక్కగా యుద్ధం చేయగలవారిని, తాను పోషిస్తున్న వారిని, బలవంతులను, వారున్న చోటికే పంపి, వారి శక్తిసామర్ధ్యాలను చూపించమని రావణుడితో చెప్పాడు విభీషణుడు. కోతిని దండించడం పౌరుషమూకాదు, మర్యాదా కాదని మరీమరీ చెప్తాడు విభీషణుడు రావణుడితో. 

విభీషణుడు చెప్పినదంతా సత్యమేనని ఒప్పుకుంటాడు రావణుడు. దూతను చంపడం రాజనీతికి తగినపని కాదనీ, అయినా వూరికే విడిచిపెట్టకుండా, ఏదో ఒక శిక్షవేయాలనీ భావిస్తాడు. కోతికిష్టమైన అవయవం తోకైనందున, దానిని కాల్చి పంపితే వీడికది తగిన శిక్షని తలుస్తాడు. అవయవాలు వికృతంగా మారిపోయి, కృశించిన వీడిని చూసి, వీడి బంధువులూ, స్నేహితులందరూ, నవ్వుకునేరీతిలో తోకను కాల్చి వూరంతా తిప్పమని ఆజ్ఞాపించాడు రావణాసురుడు. ఇలా ఆజ్ఞాపించిన వెంటనే, రాక్షసులు పాతగుడ్డలు తెచ్చి, చముర్లో తడిపి, తోకకు చుట్టసాగారు. హనుమంతుడు తన దేహాన్ని పెంచసాగాడు. రాక్షసులు రెచ్చిపోయి, తోకకు నిప్పంటించారు. బాలభానుడిలా కోపించిన హనుమంతుడు తనతోకతో వాళ్లను కొట్టాడు. హనుమంతుడి తోక కాలుతుంటే, పిల్లలు, పెద్దలు, స్త్రీలు సంతోషించారు.

రాక్షసులు చుట్టుముట్టి, తోకకు నిప్పంటించి బాధపెట్టుతుంటే, హనుమంతుడు పరిపరివిధాలుగా ఆలోచించసాగాడు. "తాను ఏమి చేయాలిప్పుడు? తాను విడిపించుకోదల్చుకుంటే వీళ్లు తనకడ్డమా? త్రాళ్లు తెంచుకుని వీళ్ళందరినీ చంపాల్నా? ఇదికోపగించుకునే సమయం కాదు. ఏదిమేలో అదే ఆలోచించాలి. వీళ్లనెందుకు కొట్టాలి? రావణుడి ఆజ్ఞ ప్రకారమే వీళ్లు తనను బాధిస్తున్నారే తప్ప, వాళ్ల తప్పేమీలేదే! వాళ్లు తనకోవిధంగా మేలే చేస్తున్నారు. రాత్రివేళ మొత్తం లంకను చూడడం సాధ్యపడలేదు. వీళ్లిప్పుడు తిప్పితే చూడొచ్చు. వీళ్లు రెక్కలు విరిచి కట్టితే కట్టుకోనిద్దాం. నా దేహాన్ని కాల్చినా కాల్చవచ్చు. అటూ-ఇటూ ఈడిస్తే ఈడ్వవచ్చు. వీళ్లు చేసేపనిని వడ్డీతో సహా తీరుస్తా" అనుకుంటాడు.

ఇలా హనుమంతుడు ఆలోచిస్తున్నప్పుడే, అతడిని వాడావాడా తిప్పారు రాక్షసులు. విజృంభించి శంఖాలు పూరిస్తూ, చప్పట్లు కొడుతూ, తిట్టుకుంటూ, కొట్టుకుంటూ, వూరంతా తిప్పారు. రాక్షసులు తిప్పుతుంటే, హనుమంతుడు కష్టపడకుండానే, సందు-సందు, గొంది-గొంది, వాడ-వాడ, వీధి-వీధి, రహస్య ప్రదేశాలు, ఇళ్ళకున్న దొడ్డి దోవలు, చిన్న-చిన్న ఇళ్లు, పెద్ద-పెద్ద మేడలు తిరిగి చూశాడు. "వీడే మనవూరికొచ్చిన గూఢచారి" అని గొంతెత్తి రాక్షసులు కేకలేస్తుంటే, పిల్లలు, పెద్దలు, ముసలివారు, గుంపులు-గుంపులుగా వచ్చి, తోక కాల్తున్న ఆంజనేయుడిని చూసి సంతోషించి గెంతులేసారు. కొందరు రాక్షసస్త్రీలు పరిగెత్తుకుంటూ సీతాదేవి దగ్గరకు వెళ్లి:"ఎవరో ఎర్రటి ముఖమున్న కోతిని, నీతో గుసగుసలాడిన కోతిని, రాక్షసులు పట్టుకుని, తోక కాల్చి వూళ్లో తిప్పుతున్నారు" అని ఆమెకు చెప్పారు. వీళ్లు సీతాదేవి కావలి కత్తెలయి వుండాలి. వారివురి సంభాణను విన్నప్పటికీ, వాళ్లమాటలు అర్ధమై వుండకపోయుండాలి.

No comments:

Post a Comment