Sunday, September 2, 2018

రావణుడికి బుధ్ధిచెప్పిన హనుమంతుడు ..... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు


రావణుడికి బుధ్ధిచెప్పిన హనుమంతుడు
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (03-09-2018)
హనుమంతుడు రావణుడితో సంభాషణ కొనసాగిస్తూ ఇంకా ఇలా అంటాడు.
"తపఃఫలం సదా రక్షిస్తుందనేమాట భ్రాంతే! తపఃఫలం పుణ్యమనుభవించినకొద్దీ క్షీణిస్తుంది. శాశ్వతంగా మిగిలిపోదు. నీ తపఃఫలం ఎంతవరకు అనుభవించాలో, అంతా ఇప్పటివరకూ అనుభవిస్తూ వస్తున్నావు. అది పూర్తయింది. ఇకనుండి నీవు చేసిన పాపఫలం నేటినుండే అనుభవిస్తావు”.

(చేసిన పున్యంవల్ల చక్రవర్తి కాగలిగినా చేసిన పాపంవల్ల పక్షవాతం వచ్చి మంచాన పడవచ్చు. పాప, పుణ్యాలలో తక్కువ భాగం మొదట అనుభవంలోకి వస్తుంది. అధిక భాగం తరువాత అనుభవించాలి. అయితే పాప, పుణ్యాలు సమంగా వుంటే,  రెండూ ఒకేసారి అనుభవించాల్సి వుంటుంది. చక్రవర్తి అయికూడా పక్షవాతంతో చావు, బ్రతుకుల మధ్య మంచాన పడడంవంటి స్థితి ఇలాంటిదే!)

“దాని ఫలితం త్వరలోనే నీకర్ధమవుతుంది. ఈ విషయం నాకెట్లా తెలుసనుకుంటున్నావా? జనస్థానంలో వున్న నీ తమ్ములందరూ చావడంతో మొదలయిందినీ పాపఫలం అనుభవించేరోజు. తర్వాత నీ స్నేహితుడు వాలి చచ్చాడు. అతడి విరోధి సుగ్రీవుడు రాముడికి మిత్రుడయ్యాడు. ఇవన్నీ నీకు అరిష్టసూచనలే! ఇవన్నీ ఆలోచించి, నీకేదిమంచిదని తోస్తే అదే చేయి".

"నీ అధర్మఫలాన్ని, నేడే, ఇక్కడే, ఇప్పుడే, నిన్ననుభవించేటట్లు, నామాటలను యదార్థం చేయగలను. నేనొక్కడినే లంకానగరాన్నంతా నాశనంచేయగలను. మీలో ఎవ్వరూ నన్ను బాధపెట్టగలిగేవారు లేనేలేరు. మీ శస్త్రాస్త్రాలు నన్నేమీ చేయలేవు. ఇంద్రజిత్తు దగ్గరున్న బ్రహ్మాస్త్రం పనికూడా అయిపోయింది. అదిమళ్లీ ఉపయోగపడదు”.

(బ్రహ్మాస్త్ర ప్రయోగం మీవాడికి తెలియదని తేలిపోయింది. ప్రయోగించాక ఎలా రక్షించుకోవాలో కూడా మీ సైనికులకు అసలే తెలియదు. యుద్ధానికి పనికిరాని దద్దమ్మలు  మీరు అని స్పష్టమైపోయింది. బ్రహ్మాస్త్రం మీద మరో కట్టు కడితే అది నిష్ప్రయోజనం అవుతుందన్న జ్ఞానం మీ వారికి లేనందువల్లే నాకు మార్గం సుగమమైంది అని హనుమ పరోక్ష సూచన!)

“అంతకన్నా ఎక్కువ అస్త్రాలతనిదగ్గరలేవు. నాకున్నవరబలం వల్ల తక్కిన అస్త్రాలు నన్నేమీ చేయలేవు. నేనిప్పుడు తిరగబడి తంతే నాకు అడ్డమొచ్చేవాళ్లు ఎవరూలేరు. కాని, నాకాపని రామచంద్రమూర్తి అప్పగించలేదు. అందుకే సహించి వూరుకున్నాను”.

(నేను  రామదాసుడిని. నన్ను నువ్వేమీ చేయలేవు. నువ్వు నన్ను ఏదో చేస్తావని  నేను భయపడేవాడినే అయితే, నీకు ఇంత ధైర్యంగా హెచ్చరికలు చేయనుకద! ఉపదేశం మాట ప్రక్కనపెట్టు. అలా భయపడే పనే అయితే ప్రాధేయపడి బయటపడే ప్రయత్నం చేసేవాడినేకద! అని ధ్వనింప చేయడం హనుమంతుడి ఉద్దేశ్యం)  


“జానకీదేవికి ద్రోహం చేసినవాడిని, తానే చంపుతానని ప్రతిజ్ఞ చేసాడు శ్రీరాముడు సుగ్రీవుడి ముందర. అందుకే ఈ విషయంలో నేనేమీ చేయలేకపోతున్నా. రామచంద్రమూర్తికి అపకారం చేసి ఇంద్రుకూడా సుఖపడలేడు. తక్కినవారి సంగతి అటుంచితే పాపాత్ముడవైన నీ సంగతి చెప్పాల్సిన పనేలేదు. నీ వశమందున్న జానకి ఉత్తమస్త్రీ. ఆమె లంకంతా పాడుచేసేందుకు వచ్చిన కాళరాత్రి. ప్రళయకాలంలో కాళరాత్రి ఏ విధంగా లోకాన్నంతా నాశనం చేస్తుందో, అట్లాగే, ఈమె లంకంతా నాశనం చేయబోతున్నది. నీ మెడలో తగులుకున్న యమపాశం ఈమె. నువ్వు బ్రతకాలనుకుంటే, లంకను కాపాడుకోవాలంటే, ఆమెను వదిలి పెట్టడమొక్కటే మార్గం".

("కాళరాత్రి" అంటే, ప్రళయకాలంలో సర్వసంహారం చేసే భగవంతుడి శక్తి. ఈమే విష్ణుశక్తి, భగవంతుడి మహామాయ. ఆయన ఆజ్ఞానుసారమే నడుస్తుంది. ఆయన సంకల్పం ప్రకారమే పనిచేస్తుంది. మహావిష్ణువు క్రీడాశరీరామ్, బ్రహ్మాదులకు అగోచరం. ఎవరైతే విష్ణువును భజిస్తారో, వారే మహామాయను దాటగలరు. ఇతర ఉపాయాలు ఎన్నైనా దాటలేరు. ఈ విష్ణుశక్తే లోక కల్యాణంకొరకు, సత్వ గుణాన్ని అంగీకరించి, లక్ష్మి, శ్రీ, భూమి, రుక్మిణి, సీత లాంటి రూపాలు సంతరించుకొని అవతరిస్తుంది. సంహారసమయంలో తమో గుణాన్ని పూనుతుంది. అప్పుడే కాళరాత్రి లాంటి పేర్లను ధరిస్తుంది.)

"రామచంద్రమూర్తి కోపాగ్నికి, సీత పాతివ్రత్యమనే అగ్నికి, లంకంతా కాలి బూడిదవుతుందని తెలుసుకో. మంత్రులతో, హితులతో, బంధువులతో, తమ్ముళ్లతో, పుత్ర, పౌత్రాదులతో సహా ఎందుకు నాశనమౌతావు? నువ్వేమో రాక్షసుడవు. శ్రీరామచంద్రమూర్తేమో మనుష్యుడు. మధ్యవర్తినైన నేను మీ ఇద్దరి జాతుల్లో దేనికీ చెందినవాడినికాను. నాకు లాభనష్టాలేవీ లేవిందులో. నేనుకేవల రామదాసుడను. శ్రీరాముడు సీతను చూసిరమ్మంటే దూతగా వచ్చాను. అబధ్ధాలు చెప్పాల్సిన పనిలేదు నాకు. నిజమే చెప్తున్నాను. నామాటలు వింటే నీకు మేలు కలుగుతుంది. నేనుమధ్యవర్తిని కనుక మీ ఇరువురి బలాబలాలు తెలుసు. నీవొక్క ఇంద్రుడినే గెలిస్తే, అతడు తనశక్తితో సమస్త ప్రపంచాన్నే సంహరించగలడు. తక్షణమే యధాపూర్వంగా సృష్టించనూ గలడు. నీకూ, ఆయనకూ పోలికేలేదు. సమానుల మధ్య యుద్ధం రాణిస్తుందికానీ, దోమకూ, ఏనుగుకూ ఎక్కడి యుద్ధం?".

(హనుమంతుడు మొదలు పెట్టినప్పుడు అనునయంగా చెప్పాడు. రావణుడి ముఖకవళికలను కనిపెట్టి, భయపడే మాటలనడం ప్రారంభించాడు. "సృష్టించేవాడు బ్రహ్మ, సంహరించేవాడు రుద్రుడు" కదా! అయితే ఇవి రామ కార్యాలుగా హనుమంతుడు చెప్పడంలో అతిశయోక్తి లేదు. తగిన కారణం వుంది. అనంతకోటి బ్రహ్మాండానికి "పరబ్రహ్మం" ఒక్కడే! అతనికి సమానుడూ, అధికుడూ, ఎవరూ లేరు. గడ్డిపోచ కదలాలన్నా ఆయనే కారణం. ఆయనే సృష్టికొక అధికారిని, సంహరించటానికొక అధికారిని నియమించాడు. "బ్రహ్మ, రుద్రులు" నిమిత్తమాత్రులు. భగవంతుడైన "విష్ణుమూర్తి", రజోగుణం విశేషంగా వుండే జీవులందు ప్రవేశించి వారితో సృష్టి కార్యాన్ని, తమోగుణం వున్నవారిలో ప్రవేశించి సంహార కార్యాన్ని, సత్వగుణం వున్నవారిలో ప్రవేశించి రక్షించే పనినీ చేస్తాడు. అందుకే సమస్త ప్రయోజకర్త వాస్తవానికి ఆ "భగవంతుడే").

"మనుష్యులు, దేవతలు, అసురులు, యక్షులు, కింపురుషులు, గంధర్వులు, పన్నగులు, విద్యాధరసమూహాలు, సిధ్ధులు, ఇతర దేవజాతుల వారు, కిన్నరులు, వీరందరిలో పరాక్రమంలో మొదటివాడైన విష్ణుమూర్తితో సమానమైనవాడు శ్రీరామచంద్రమూర్తి ఒక్కడే. ఈ రాజశ్రేష్టుడిని, యుద్ధంలో, ఎవ్వరూ, ఏ కాలంలో, ఏ ప్రదేశంలోనూ, ఏ ప్రాణికూడా ఎదిరించలేదు. అంశ పూర్ణస్వరూపాన్ని దేంట్లోనైనా ఎదిరించగలదా? సముద్రంలోని అలలన్నీ కలిసినా, సముద్రంతో శత్రుత్వం తెచ్చుకుని బ్రతకగలవా? ఆయన త్రికాల సత్యమైన పరబ్రహ్మస్వరూపం. పూజ్యస్వభావం కలిగి, సమస్త లోకాలకు ప్రభువైన రామచంద్రమూర్తికి నీవు ద్రోహం చేసావుకనుక నువ్వేం చేసినా ఇక బ్రతుకలేవు. నువ్వొక్కడివే కాకుండా, నీతోపాటు, నాగ, యక్ష,  రాక్షస, గంధర్వ, దేవదానవులందరినీ తెచ్చుకున్నా ఆయనపై  నీగెలుపు అసాధ్యం".

"ఓ రాక్షసరాజా! చిల్లరదేవుళ్ల మాట అటుంచు. నీ మీద ప్రేమతో వరాలిచ్చిన స్వయంభు, చతురాస్యుడైన బ్రహ్మదేవుడైనా, ముక్కంటి త్రిపురాంతకుడు అయిన రుద్రుడైనా, ముప్పైమూడుకోట్ల దేవతలకు అధిపతైన ఇంద్రుడు, మహేంద్రుడైనా, లేక ఈ ముగ్గురూ కలిసొచ్చినా, యుద్ధంలో రాముడి బారినుండి నిన్ను రక్షించలేరు. శరణాగతియే నీకు రక్షణ. ఆయన్నే శరణుకోరు".

ఇలా హనుమంతుడు చెప్పుకుంటూ పోతుంటే మంచిమాటలైనా అవి కఠినంగా వుండడం వల్ల, పైగా ధైర్యంగా నొక్కి చెప్పడంతో, సహించ లేకపోయాడు రావణాసురుడు. మహాకోపంగా, గుడ్లు గిరగిరా తిప్పుకుంటూ, కనుబొమలు ముడిచి, వూగిపోయాడు.

No comments:

Post a Comment