Sunday, September 2, 2018

దేశానికి ఉత్తేజపూరిత నూతన మార్గదర్శకత్వం కావాలి : వనం జ్వాలా నరసింహారావు


దేశానికి ఉత్తేజపూరిత నూతన మార్గదర్శకత్వం కావాలి
వనం జ్వాలా నరసింహారావు
మన తెలంగాణ దినపత్రిక (02-09-2018)
            అలనాటి మనజాతీయ మహనీయ నాయకులు ఉహించుకున్న భారతదేశానికీ, ప్రస్తుతం మనం వుంటున్న దానికీ అగాధమంత వ్యత్యాసం వుందని పలువురు భావించడంలో పొరపాటు లేదనే అనాలి. 

         తెలంగాణ రాష్ట్రం, నల్లగొండ జిల్లాలోని అన్నెపర్తి గ్రామానికి చెందిన పైడిమర్రి వెంకట సుబ్బారావు అనే ప్రముఖ తెలుగు భాషా రచయిత, ప్రభుత్వోద్యోగి, స్వతంత్ర-గణతంత్ర దినోత్సవాలనాడు భారతీయులు సర్వసాధారణంగా పఠించే భారత జాతీయ ప్రతిజ్ఞను రాసి, స్వరకల్పన చేశారు. 1962 లో విశాఖపట్నంలోజిల్లా ట్రెజరీ అధికారిగా పనిచేస్తున్న రోజుల్లో ఆయన దీన్ని రాసి, స్వర్గీయ తెన్నేటి విశ్వనాథం ద్వారా అప్పటి విద్యాశాఖ మంత్రి పీవీజీ రాజుకు అందచేసారు. అచిరకాలంలోనే అది బహుళ ప్రచారంలోకి వచ్చింది.

         భారత జాతీయ ప్రతిజ్ఞ ఇలా సాగుతుంది: “భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. సుసంపన్నమైన, బహువిధమైన నాదేశ వారసత్వసంపద నాకు గర్వకారణం. దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తాను. నా తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, పెద్దలందర్నీ గౌరవిస్తాను. ప్రతివారితోను మర్యాదగా నడచుకొంటాను. నా దేశం పట్ల, నా ప్రజల పట్ల సేవానిరతితో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందానికి మూలం”. 

స్వాతత్ర్య సమరంలో పాల్గొని, ప్రస్తుతం వర్తమాన కాలంలో మన మధ్యలేని ఆ సమరయోధులను గుర్తుచేసుకుంటూ, ఒక్కసారి వాళ్ల ఆశయాలు, ఆకాంక్షలు ఎంతమేరకు వాళ్ళు కోరుకున్న స్థాయిలో నేరవేరాయి, అని ప్రశ్నించుకుంటే వచ్చే జవాబు ఆశ్చర్యకరంగా వుంటుందనడంలో సందేహం లేదు. మన మధ్య సోదర-సోదరీమణి అనే భావన అసలు లేశమంతైనా వుందా? మన అపార ప్రాచీన, మహత్తర వారసత్వ సంపద పట్ల మనం గౌరవం చూపుతున్నామా? మన దేశంలో వుండాల్సిన విధంగా మనం వుంటున్నామా? మనం అసలు దేశానికి గర్వకారణమా? దేశాన్ని అభివృద్ధి మార్గంలో పయనించే విధంగా చేయడానికి జాతీయ స్థాయిలో ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థ నాయకత్వం సరిపోతుందా? మనకసలు దేశ ప్రజల అవసరాలకు అనుగుణంగా ముందుకు తీసుకుపోగల జాతీయ ఎజెండా ఏమన్నా వుందా? ప్రపంచంలోని మన తోటి దేశాలతో పోటీపడగల సత్తా మనకుందా? మన పయనం ఎటు? మన మార్గం ఏమిటి? ఇవన్నీ జవాబు దొరకని అంతులేని వింత ప్రశ్నలు.

స్వాతంత్ర్యం వచ్చి 71 సంవత్సరాలయింది...ఇంకా ఇలానే వుంటే నష్టపోతాం. దేశానికి కావాలి ఉత్తేజపూరితమైన నూతన నాయకత్వం...నూతన మార్గదర్శకత్వం. ఇన్నేళ్ళ స్వాతంత్ర్యం తర్వాత కూడా కనీస అవసరాలకు నోచుకోలేని బీద-సాద-పేద వారు కోట్లల్లో వున్నారు. పేదరికం ఇంకా తాండవిస్తోంది. చాలామంది నిరుద్యోగులుగానో, చిరుద్యోగులుగానో మనుగడ సాగిస్తున్నారు. మనతో పాటే స్వాతంత్ర్యం తెచ్చుకున్న అనేక దేశాలు, ఆదిలో బీదరికంలో వున్నా, రోజులు గడుస్తున్నాకొద్దీ బ్రహ్మాండమైన వృద్ధి, అభివృద్ధి సాధించి, ఆర్థికంగా పుంజుకొని, మనకంటే గణనీయంగా పురోగతి సాధించాయి. అలాంటి ఉదాహరణలు కోకొల్లలు.

ఇతర దేశాలతో పోల్చి చూస్తే, అనేక రంగాల్లో, మనదేశం ఎలాంటి నిస్సార ప్రగతిలో వుందో తెలుసుకోవడానికి చాలా ఉదాహరణలున్నాయి. హిమాలయ పర్వతాలకు ఆవల వున్న మన పొరుగు దేశం, చైనా, బహుశా వీటన్నిటిలోకి ఉత్తమమైన ఉదాహరణగా చెప్పుకోవాలి. ఒకటి కాదు, వంద విషయాల్లో ఆ దేశం మనకంటే ఎంత ముందంజలో వుందో తెలుసుకోవడానికి అనేక గణాంకాలున్నాయి. చైనా కూడా ఇంచుమించు మనదేశంతో పాటే స్వాతంత్ర్యం పొందింది. 1979 సంవత్సరం నుండి నిలకడగా తన వృద్ధిరేటును పదిలపర్చుకుంటూ వస్తున్నదాదేశం. 1992 నుండి మొదలుకొని, గత 25 సంవత్సరాలకు పైగా, వరుసగా, గణనీయమైన అభివృద్ధిని అన్ని రంగాల్లో నమోదు చేసుకుంటున్నది. చైనా స్థూల జాతీయోత్పత్తి 1971 సంవత్సరం వరకూ మనకంటే చాలా తక్కువ. కాని, ప్రస్తుతం మన దేశంకంటే నాలుగురెట్లు అధికం. 1968 సంవత్సరంలో భారత స్థూల జాతీయోత్పత్తి 180 బిలియన్ డాలర్లు కాగా, చైనాది కేవలం 134 బిలియన్ డాలర్లు మాత్రమే. వృద్ధి దిశగా పయనిస్తున్న చైనా దేశం 2016 కల్లా 9504 బిలియన్ డాలర్లకు చేరుకోగా, మనం మాత్రం, కేవలం 2465 బిలియన్ డాలర్ల దగ్గరే ఆగిపోయాం. అంటే, మరోలా చెప్పుకోవాలంటే, చైనా జీడీపీ 70% పెరగ్గా, మనది కేవలం 13% మాత్రమే పెరిగింది. ఎంత తేడా!!! అదే విధంగా చైనా తలసరి ఆదాయం 1968 లో 172.91 డాలర్లు మాత్రమే కాగా 2016 నాటికి సుమారు 40% పెరిగి 6893.78 డాలర్లకు చేరుకుంది. అదే కాలంలో, 1968 లో 340.36 డాలర్ల తలసరి ఆదాయం కలిగిన భారత దేశం, 2016 నాటికి కేవలం 5.47% మాత్రమే పెరిగి, 1861 డాలర్లకు చేరుకోగలిగింది. ఇది చాలా ఆందోళన చెందాల్సిన అంశం...దీన్ని సీరియస్ గా తీసుకోవాలి.


పోలికకు ఉదాహరణగా మరో అంశం-విద్యుత్ ఉత్పాదన తీసుకుందాం. భారత దేశం విద్యుత్ ఉత్పాదక స్థాపిత సామర్థ్యం 3.45 లక్షల మెగావాట్లతో, తలసరి వినియోగం 1122 యూనిట్లు మాత్రమే కాగా, చైనా స్థాపిత సామర్థ్యం 17.77 లక్షల మెగా వాట్లు....తలసరి వాడకం 4475 యూనిట్లు. ఎంత తేడా!! వ్యవసాయ యోగ్యమైన భూమి భారత దేశంలో 1979 సంవత్సరంలో 41 కోట్ల ఎకరాలుండగా, 2015 కల్లా అది కాస్తా 39 కోట్ల ఎకరాలకు పడిపోయింది. అదే చైనా విషయం తీసుకుంటే, అదే కాలంలో 24 కోట్ల ఎకారాల నుండి 29.75 కోట్ల ఎకరాలకు పెరిగింది.

తూర్పు ఆసియా పులులుగా పేర్కొనబడే దక్షిణ కొరియా, సింగపూర్, తైవాన్ దేశాలు; ఆగ్నేసియా దేశాలైన మలేసియా, ఇండొనీషియా, థైలాండ్, వియత్నాం, ఫిలిప్పీన్స్ మొదలైనవి, అద్భుతమైన, ఆశ్చర్యకరమైన అభివృద్ధిని సాధించాయి. ఇవన్నీ వాస్తవానికి చాలా చిన్న దేశాలు. అట్టడుగు స్థాయినుండి ఆకాశానికి ఎదిగిన మరో దేశం జపాన్. ప్రపంచంలోనే అత్యధిక తలసరి ఆదాయం వున్నా దేశం జపాన్.

మన దేశానికి కావాల్సింది, మన అవసరాలకు అనుగుణమైన వాతావరణం....దాన్ని సరిగ్గా వాడుకునే నాయకత్వం. మన ఆర్ధిక వ్యవస్థ పరపతినీ, మన సంపదనూ, మన అంతర్గత శక్తి-సామర్థ్యాలనూ, మన అపార వనరుల సంపదనూ సక్రమంగా ఉపయోగించుకొలేమా? అలా జరక్కుండా ఎవరు నిరోదిస్తున్నారు? ఇదేమీ అత్యంత క్లిష్టమైన, అసాధ్యమైన కార్యం కాదు....కావాల్సిందల్లా మనసు పెట్టి మార్గం ఆలోచించడమే!!! గత 71 సంవత్సరాల మాదిరిగా, మూసపద్ధతిలో ఆలోచనలు చేయకుండా, వినూత్నంగా ఆలోచించి, సరైన నిర్ణయాలు తీసుకోగలిగితే భారతదేశాన్ని ప్రగతిపథంలో నడిపించడం అసాధ్యం కానేకాదు. అందరూ అంటుండే “ఉత్తమ విధానాలు” అనే మాటకు స్వస్థిపలికి, “భవిష్యత్ విధానాలు” అనే నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాలి. అనాదిగా అవలంభిస్తూ వచ్చిన ఆచరణలకు సుదూరంగా కదిలి, భారత దేశాన్ని పునర్నిర్మించడం, పునర్వికాసం పొందేట్లు చేయడం, తద్వారా భారత దేశాన్ని ఒక అభివృద్ధి కేంద్రంగా మలచి ముందుకు సాగడం జరగాలి. అభివృద్ధి కుంటుబడడానికి ఇంతకాలం దారితీస్తున్న ఆలోచనల బీదరికానికి తక్షణం వీడ్కోలు పలికి, ఘనమైన, ఉన్నతమైన, నూతన ఆలోచనా విధానానికి స్వాగతం పలకాలి.

ఇంతకూ ఇదంతా ఇలా జరగడానికి, ఈ దేశం ఇతర దేశాలతో పోల్చి చూస్తే వెనుక పడడానికి ఎవరు బాధ్యులు? సహజంగానే ఈ ప్రశ్న ఉత్పన్నం కాకమానదు. జవాబు కూడా దొరికి తీరాలి. గత 71 సంవత్సరాలుగా అధికారంలో వున్న కాంగ్రెస్ పార్టీ సారధ్యంలోని నెహ్రూ-గాంధీ నాయకత్వం, జనతా-నేషనల్ ఫ్రంట్ సారధ్యంలోని మొరార్జీ-వీపీ సింగ్ నాయకత్వం, బీజేపీ-ఎన్డీయే సారధ్యంలోని వాజపాయి-మోడీ నాయకత్వం, మధ్య-మధ్యలో కాంగ్రెస్ కు చెందిన పీవీ-మన్మోహన్ నాయకత్వం, తదితరులంతా బాధ్యులే. కేంద్రంలో ఎవరు పాలన సాగించినా, అధికారంలో ఎక్కువ కాలం-దాదాపు పూర్తి కాలం వున్నది కాంగ్రెస్ ప్రభుత్వం, లేదా, బీజేపీ ప్రభుత్వం.

ప్రప్రధమ ప్రధానమంత్రి, నవభారత నిర్మాతగా పేరొందిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ విదానాలైన వ్యవసాయ సంస్కరణలు, పారిశ్రామికీకరణ...తద్వారా విదేశీ వస్తువుల స్థానంలో స్వదేశీ వస్తువుల ఉపయోగం, మిశ్రమ ఆర్ధిక విధానం....తద్వారా ప్రభుత్వ, ప్రయివేట్ రంగ సంస్థల సహజీవనం లాంటివి ఏ మేరకు భారత దేశ అభివృద్ధికి దోహదపడ్డాయో అధ్యయనం చేసి, విశ్లేషణ చేయాల్సిన అవసరం ఎంతైనా వుంది. నెహ్రూ మొదట్లో నమ్మినట్లు, దేశంలో ప్రాధమిక-భారీ పరిశ్రమల ఏర్పాటు భారతదేశ ఆర్ధిక వ్యవస్థ బలపడడానికి, అభివృద్ధికి, ఆధునీకరణ చెందడానికి ఉపయోగపడ్డాయా? లేదా? ఆలోచించాల్సిందే.

ఒకే ఒక్క కలం పోటుతో ఇందిరాగాంధీ, 14 భారీ ప్రయివేట్ బ్యాంకులను, బొగ్గు లాంటి పరిశ్రమలను, భీమాలాంటి సేవలను జాతీయం చేసింది. ఆమె ఆ నిర్ణయం దేశాన్ని ప్రగతిపథాన తీసుకెళ్లాయా? లేదా? ప్రతికూల ఉత్పాదక దిశగా పయనించాయా? అనేది కూడా అధ్యయనం చేయాలి. జాతీయం చేయబడ్డ బ్యాంకులు ఏ మేరకు సామాన్య ప్రజా బాహుళ్యానికి ఉపయోగపడ్డాయో అనేది, దేశం ఆర్థికంగా పురోగతి సాధించడానికి ఆ చర్య ఏమన్నా తోడ్పడిందా అనేది లోతుగా ఆలోచించాల్సిన అంశం. జాతీయం చేయబడ్డ బ్యాంకులను అడ్డం పెట్టుకుని, రాజకీయ లబ్ది కోసం, అవినీతి భారీ ఎత్తులో జరిగిందన్న ఆరోపణలు కూడా వచ్చాయి. లాభ-నష్టాలను తప్పక అధ్యయనం చేయాల్సిందే.

రాజీవ్ గాంధీ హయాంలో చోటుచేసుకుందని అనుకుంటున్న సాంకేతిక విప్లవం, పురోగతి, ఆయన వుండగానే స్థిరీకరణకు నోచుకోలేదు. బోఫార్స్ లాంటి కుంభకోణాలలో ఇరుక్కుని అందులోంచి బయటపడే ప్రయత్నంతోనే ఆయన కాలం అంతా గడిచింది. ఆయన హయాంలో అంతా కుంటుబడిన అభివృద్దే!

ఒక విధంగా విశ్లేషిస్తే, బహుశా, దేశంలో ఏదైనా అభివృద్ధి జరిగితే, అది పీవీ కాలంలోనే అనాలి. ఆర్ధిక సంస్కరణలు, లైసెన్స్ రాజ్ ఉపసంహరణ, ప్రపంచీకరణ, ఆర్థికంగా కుప్పకూలబోయే భారత దేశాన్ని ఆ గండం నుంచి గట్టెక్కించడం, లాంటివి పీవీ చేసినా, ఆయన తరువాత అధికారంలోకి వచ్చిన బీజేపీ పాలకులు ఆ ఫలితాలను స్థిరీకరించలేకపోయారు. ఆయన కాలంలో, ఆయన నాయకత్వంలో జరిగిన ఆర్థికాభివృద్ది కొనసాగించగలిగినట్లయితే, కొంత మేలు జరిగేదేమో?

మన్మోహన్ సింగ్ గ్రామీణ వైద్య మిషన్, ఆధార్ ప్రయోగాలు, సమాచార హక్కు చట్టం ఒక విధంగా ప్రయోజనం చేకూరేవే అయినా, వాటి ద్వారా ప్రత్యక్షంగా దేశాభివృద్ధి జరిగే అవకాశాలు అంతగాలేవనే అనాలి. మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధానిగా అయిదేళ్ళ పాటు అధికారంలో వున్న బీజేపీ నాయకుడు అటల్ బిహారీ వాజపాయి బహుశా పోఖ్రాం ప్రయోగం తప్ప దేశాన్ని ఉద్ధరించిన పనులేం చేయలేదు. సర్వ శిక్షా అభియాన్, జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్ట్ లాంటి చెప్పుకోదగ్గ  కార్యక్రమాలున్నా, ఆయన ఇండియా షైనింగ్ ప్రచారం ఒక పెద్ద విఫల ప్రయోగం అని చెప్పాలి. ఇక మోడీ సంగతి చెప్పక్కరలేదు. ఏ వర్గానికీ, ఏ రాష్ట్రానికీ, ఆ మాటకొస్తే పదికాలాల పాటు పదిమంది చెప్పుకునే ఏ అంశానికీ ఆయన ప్రాధాన్యం ఇవ్వలేదు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ మోడీకి పెద్ద ఎత్తున నష్టం చేకూర్చి పెట్టాయి. దేశ ఆర్థికాభివృద్ధికి అవెలా ఉపయోగపడతాయో ఆయనకూ తెలియదు...ఇతరులకూ తెలియదు. ఇక ఇతర ప్రధానుల రోజుల, నెలల పాలనలో చెప్పుకోదగ్గ గోప్పలేమీ లేవనాలి.

అందుకే...ఇందుకే....భారతదేశంలో గుణాత్మక మార్పు రావాలి....కావాలి. ఇప్పుడు దేశాన్ని శాసిస్తున్న రాజకీయ వ్యవస్థ మార్పుకు గురికావాలి. రెండు జాతీయ పార్టీలు కూడా ఈ దేశాన్ని అభివృద్ధి పథాన నడిపించడంలో ఘోరంగా విఫలమయ్యాయి. ఇరు రాజకీయ పార్టీలు ఒకరికి మరొకరు మాత్రమే ప్రత్యామ్నాయమనే భావన పోవాలి. కొత్త నాయకత్వం రావాలి. అభివృద్ధి మార్గంలో తీసుకెళ్లగలిగే జాతీయ ఎజెండా రూపుదిద్దుకోవాలి. రాజకీయ, ఆర్ధిక, సామాజిక, న్యాయ, ఇతర రంగాల్లో ప్రజాపరయోజనకరమైన సంస్కరణలకు నాంది పలకాలి. బహుశా తెలంగాణ ముఖమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ సంవత్సరం మార్చ్ నెలనుండి చెప్తూ వస్తున్న “దేశరాజకీయలలో గుణాత్మక మార్పు” వీటన్నిటికీ సమాధానం కావచ్చు. ప్రగతి నివేదనలో ఆయన చెప్పబోయే తెలంగాణ అభివృద్ధి-సంక్షేమ కార్యక్రామాల నివేదిక అంశాల ప్రాతిపదికన, రాష్ట్రం ఒక రోల్ మోడల్ గా, ఒక అభివృద్ధి నమూనాగా దేశానికి దిక్సూచి కావాలి. అందుకే దేశానికి కావాలి ఉత్తేజపూరిత మార్గదర్శకత్వం....నూతన నాయకత్వం. దానికి తెలంగాణ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర బిందువైతే ఇంక అంతకంటే కావాల్సింది ఏముంది?

No comments:

Post a Comment