Saturday, September 22, 2018

ఓటు నమోదు బాధ్యత ఓటరుదే : వనం జ్వాలా నరసింహారావు


ఓటు నమోదు బాధ్యత ఓటరుదే
వనం జ్వాలా నరసింహారావు
మనతెలంగాణ దినపత్రిక (23-09-2018)

లక్షలాది ఓటర్లను జాబితాలో లేకుండా చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమనీ, ఓటు హక్కును ఫణంగా పెట్టారనీ, అలాంటప్పుడు ఎన్నికలు స్వేచ్చాయుతంగా, నిష్పాక్షికంగా జరిగినట్లు ఎలా అవుతుందనీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేదో ప్రభుత్వ తప్పిదమన్నట్లుగా, దీనికంతటికీ ప్రభుత్వాన్నే బాధ్యత వహించమన్న రీతిలో మాట్లాడడం, ప్రశ్నించడం హాస్యాస్పదం.  న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తున్నారు వీరిలో కొందరు. ఇదిలా వుంటే, కొత్తగా ఓటుహక్కు కోసం దరఖాస్తుల రూపంలో విశేష స్పందన వస్తున్నదనీ, స్పెషల్ డ్రైవ్ ముగిసేదాకా ఈ ధోరణి కొనసాగవచ్చనీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అంటున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి పదిరోజుల ముందు వరకూ కూడా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కూడా ఆయన ప్రకటించారు. పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వయోజనులందరూ ఓటరుగా చేరడానికి వందరకాల వెసలుబాటు కలిగించింది మన రాజ్యాంగం. ఇవేవీ తెలుసుకోకుండా అర్థం-పర్థం లేని వ్యాఖ్యానాలతో వక్రభాష్యం చెప్పి ప్రభుత్వాన్ని విమర్శించడం తగదేమో!!

          ఓటరు నమోదుకు రకరకాల సూత్రాలు, పద్ధతులు, నియమ-నిబంధనలు వున్నాయి. ఎలెక్టోరల్ వ్యవస్థలో భాగంగా అంచలంచల హైరార్ఖీ-సోపానక్రమం మన రాజ్యాంగంలో పొందుపరచబడింది. అత్యున్నత స్థానంలో ఎన్నికల సంఘం వుండగా, ఆ తరువాత వరుస క్రమంలో, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, జిల్లా ఎన్నికల దికారి, ఎన్నికల నమోదు అధికారి, సహాయ ఎన్నికల నమోదు అధికారి...ఇలా బూత్ స్థాయి అధికారి దాకా ఆ సోపానక్రమంలో భాగమే. ఎవరెవరికి ఎన్నికలపరంగా ఎలాంటి బాధ్యత అప్పగించాలనే నిర్ణయం ఎన్నికల సంఘానిదే కాని ప్రభుత్వానిది కానేకాదు. రాష్ట ఎన్నికల అధికారిగా కాని, అదనపు-సంయుక్త ఎన్నికల అధికారిగా కాని, ఎవరిని నియమించాలి అనే నిర్ణయం కూడా కేంద్ర ఎన్నికల సంఘానిదే.  ఎన్నికలకు సంబంధించి అధికార సోపానక్రమంలో సంబంధిత అధికారి తీసుకునే నిర్ణయం పూర్తిగా రాజ్యంగ బద్ధమైనదే అవుతుంది కాని ప్రభుత్వం తీసుకునేది కాదు. ఓటరును చేర్పించడం అయినా, నిబంధనల ప్రకారం తొలగించడం అయినా ఎన్నికల సంఘానిదే కాని ప్రభుత్వానిది కాదు. అయినదానికీ-కానిదానికీ ప్రభుత్వాన్ని తప్పు పట్టడం సరైంది కాదు.

          ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 15 ప్రకారం, ప్రతి నియోగాకవర్గానికి ఒక ఓటర్ల జాబితా తయారుచేయాలి. దీన్ని ఎన్నికల సంఘం ప్రత్యక్ష పర్యవేక్షణలో, మార్గదర్శకత్వంలో రూపొందించడం జరుగుతుంది. ప్రభుత్వ ప్రమేయం వుండదు. ప్రభుత్వంలో వున్న పార్టీ, అర్హులైన తమ పార్టీవారిని చేర్పిమ్చుకునే హక్కుంది కాని, తన ప్రత్యర్థ పార్టీలకు చెందిన ఓటర్ల పేర్లను తొలగించే అవకాశమే లేదు. అలా జరగడానికి నిబంధనలు ఒప్పుకోవు. ఒక స్వేచ్చాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు ఓటరు నమోదు కార్యక్రమం సక్రమంగా జరగడం ఎంతైనా అవసరం. దాన్ని ఎవరూ కాదనలేరు. ఓటరు నమోదు కార్యక్రమంలో లోటుపాట్లు జరుగుతే దాని ప్రభావం ఎన్నికలమీద పడకతప్పదు. అది ఏ రూపంలోనైనా జరగవచ్చు. దొంగ ఓట్లు పడడానికి కానీ, ఓటరు కానివారు ఓటువేయడానికి కానీ ఇది దోహదపడవచ్చు. ఓటరు నమోదు కార్యక్రమానికి బాధ్యులైన అధికారులు తత్సంబంధిత చట్టాలను, నియమ-నిబంధనలను క్షుణ్ణంగా అవగాహన చేసుకుని వుండితీరాలి. వీరంతా ఎన్నికల సంఘానికి చెందిన వారే. ప్రభుత్వానికి ఈ ప్రక్రియలో నేరుగా కానీ, పరోక్షంగా కానీ ఎలాంటి సంబంధం వుండదు. వుండకూడదు కూడా. తప్పొప్పులకు ప్రభుత్వ పరంగా బాధ్యత లేదు. అంతా ఎన్నికల సంఘమే చూసుకుంటుంది. అందుకే ఎన్నికల సంఘానికి చెందిన అధికారులు ఆచి-తూచి, అన్ని జాగ్రత్తలూ తీసుకుని మరీ నమోదు ప్రక్రియను చేపట్టి పూర్తి చేస్తారు.

          ఎన్నికలలో ఓటు ఉపయోగించుకోగల హక్కున్నవారితో కూడిన ఓటర్ల జాబితా తయారు చేయడానికి, దానికొరకు అర్హులైన వారిని ఓటర్లుగా నమోదు చేయించడానికి, ఒక స్వతంత్ర ప్రతిపత్తి, హోదాకల కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ బాధ్యతను అప్పగించింది రాజ్యాంగం. రాజ్యాంగంలోని  324 (1) ప్రకరణను అనుసరించి, ఈ నమోదు కార్యక్రమ పర్యవేక్షణ, మార్గదర్శకత్వం ఎన్నికల సంఘానిదేనని రాజ్యాంగం స్పష్టంగా పేర్కొన్నది. భారతదేశంలో ఓటరు నమోదుకు సంబంధించి, భారత పార్లమెంట్ 1950 లో ఆమోదించిన ప్రజాప్రాతినిధ్య చట్టం, 1960 సంవత్సరం నాటి ఓటర్ల జాబితా తయారీ-సవరణ విస్పష్టమైన సూచనలు, ఆదేశాలు చేశాయి. తదనుగుణంగానే ఈ యావత్తు కార్యక్రమం కొనసాగుతుంది. ఓటరు నమోదు ప్రక్రియ అనేది కేవలం ఏ ఒక రోజో-వారమో-నెలో-సంవత్సరం పాటో మాత్రమే జరిగే వ్యవహారం కాదు. ఇదొక నిరంతర ప్రక్రియ. ఏటేటా ఓటర్ల జాబితాలో సవరణలు, మార్పులు-చేర్పులు, కూర్పులు జరుగుతూనే వుంటాయి. జనవరి నెల ఒకటో తేదీ ప్రామాణికంగా  ఏటా ఓటర్ల జాబితా సవరణ జరుగుతుంటుంది. జాబితా తయారవగానే ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించి, ప్రజల అభ్యంతరాలకు, అవసరమైన మార్పులేవన్నా వుంటే అవి చేయడానికి, బహిర్గతం చేస్తుంది ఎన్నికల సంఘం. ఇదంతా పూర్తి పారదర్శకతతో జరిగేదే. ఎవరైనా, ఏ రకమైన సవరణను కోరే అధికారం వుంటుంది. అలాంటప్పుడు లక్షల సంఖ్యలో తొలగించారని చేసే ఆరోపణలకు ఆస్కారం, తావు లేనే లేదు. ఏ స్థాయిలో కూడా ప్రభుత్వ జోక్యం ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ వుండనే వుండదు.


          ఇంతకుముందే చెప్పినట్లు, మన దేశంలో, బహుశా మరికొన్ని పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశాల్లో, ఒక వ్యక్తి 18 సంవత్సరాల వయస్సు నిండడం అనేది ఒక కీలక మలుపు. అప్పటికే వారు వయోజనులవుతారు. మౌలికమైన ఎన్నో హక్కులు-బాధ్యతలు మనకు హటాత్తుగా సంక్రమిస్తాయి. అన్నింటికన్నా ప్రధానమైన హక్కు-బాధ్యత ఓటరుగా నమోదు కావడం, తద్వారా ఓటింగు హక్కును ఉపయోగించుకోవడం. అంటే మన దేశ భవిష్యత్ ను తీర్చిదిద్దే నాయకులను ఎంచుకునే హక్కు, తద్వారా, మన దేశ భవిష్యత్ లో భాగస్వాములయ్యే హక్కు 18 సంవత్సరాల వయస్సు నిండగానే లభిస్తుంది. ఇదొక రకంగా కష్టతరమైన బాధ్యత కూడా. “ఈ దేశాన్ని మార్చడం మన తరం కాదులే” అని విరక్త వాదన చేయకుండా ఓటింగులో పాల్గొని, మనవంతు సహకారాన్ని దేశ అభ్యున్నతికి అందించడానికి ఓటరుగా నమోదు కావడం అత్యంత అవశ్యం. ఎప్పుడో-అప్పుడు ఎన్నికల సంఘానికి చెందిన అధికారులు రాకపోతారా...మనల్ని ఓటరుగా నమోదు చేయకపోతారా...అని ఎదురు చూడకుండా, 18 సంవత్సరాలు నిండుతూనే, మనంతట మనం ఓటరుగా నమోదు చేసుకోవాలి. ఇది మన హక్కు అని భావించాలి. ఎన్నికల తేదీ ప్రకటించగానే నాకు ఓటు లేకుండా చేసారని పిర్యాదు చేయకూడదు.

          మనది ప్రపంచంలోనే అత్యంత పెద్ద పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య మనుగడ ప్రజాశక్తి మీదే ఆధారపడి వుంది. మన నిత్య బిజీ కార్యక్రమం నుండి కొంచెం ఓపిక-తీరిక చేసుకుని, ముందు ఓటరుగా నమోదు చేయించుకుని, ఓటర్ల జాబితాలో వుందా-లేదా అనేది నిర్ధారణ చేసుకుని, లేకపోతే కారణాలు తెలసుకుని, నమోదు అయ్యేదాకా-పేరు కనపడేదాకా ఆ పనిమీదే వుండి, ఎన్నికలప్పుడు మరికొంత తీరిక చేసుకుని ఓటు హక్కును ఉపయోగించుకున్నప్పుడే మనం మన కర్తవ్యం నేరవేర్చినట్లు. దేశాభ్యున్నతిలో భాగస్వామ్య పౌరుడిగా, మార్పు కారకుడి (కారకురాలి) గా కావడానికి ఇదే మార్గం. మనం వేసే ప్రతి ఓటు, మన గ్రామ, మండల, నియోగకవర్గ, మన నగర, మన జిల్లా, మన దేశ పాలనకు, స్థానిక-జాతీయ అంశాల-సమస్యల పరిష్కారానికి ప్రభావితం చేస్తుంది. ఓటుకు వుండే ఇలాంటి నిర్ణయాధికారం, మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను అవసరమైనప్పుడు నిలదీయడానికి, అవకతవకలకు-మంచీ చెడులకు బాధ్యులను చేయడానికి, ఉపయోగపడుతుంది. అన్నింటికన్నా ముఖ్యమైంది, మన గొంతు వినిపించే వీలు, దానికి విలువ ఇవ్వాల్సిన అవసరం కలిగిస్తుంది ఓటు. మన ఒక్క ఓటు ఒక్కోసారి నిర్ణయాత్మకమైన ఓటు కావచ్చు కూడా. అందుకే, మన ఓటు జాబితాలో లేదని పిర్యాదు చేయడం కన్నా, వుండేట్లు చూసుకోవడం మన కనీస బాధ్యత. రాజకీయ పార్టీలు కూడా పిర్యాదుకిచ్చే ప్రాధాన్యం ఓటరుగా చేర్పించడానికి ఇవ్వాలి.

          ఓటరుగా నమోదు చేయించుకున్న తరువాత అనేక కారణాల వల్ల మనం ఇల్లు మారవచ్చు...వూరు మారవచ్చు. అలాంటప్పుడు, మారిన జాగాలో మనకు ఓటు వుండాలంటే, మనమే బాధ్యత తీసుకుని చిరునామా మార్చుకోవడానికి చర్యలు తీసుకోవాలి. ఎన్నికల సంఘానికి తెలియచేయాలి. చివరి క్షణంలో ఓటు లేదే అని చింతించకూడదు. దానికి కూడా ఒక నిర్ధుష్టమైన విధానం వుంది. ఎన్నికల సంఘాన్ని తప్పుపట్టకుండా మనమే ఆపని చేసుకుంటే మంచిది. చిరునామా మారిందా? లేదా? అనేది కూడా మనం నిర్ధారణ చేసుకోవాలి. ఐడీ కార్డు (దీన్నే ఓటరు ఫోటో గుర్తింపు కార్డు లేదా ఎపిక్ అంటారు) కూడా పొందడానికి విధానం వుంది. అది మన ఇంటికి రాలేదే? అని ఎదురు చూడకుండా ఈ-సేవ కేంద్రానికి పోయి తెచ్చుకుంటే మంచిది. మనం ఓటు వేయడానికి ఎన్నిరకాల అర్హత పొందాలో, అన్నీ మనం చేసుకోవడం మంచిది.

          ఓటరుగా నమోదు చేసుకోవడానికి పోస్టు ద్వారా కాని, ఇంటర్నెట్ లో డౌన్ లోడ్ చేసుకుని ఫార్మ్ 6 నింపి ప్రధాన ఎన్నికల అధికారికి దరఖాస్తు చేసుకోవాలి. మన పేరు నమోదు అయిందా? కాలేదా? అని తెలుసుకోవడం కూడా చాలా తేలిక. మన ప్రాంత ఎలెక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి దగ్గర కానీ, ఆన్ లైన్లో కానీ చూసుకోవచ్చు. మన పేరు లేకపోతె సోపానక్రమంలో వున్న ఏ అధికారినైనా కలిసి ఫిర్యాదు చేసి సరిదిద్దుకోవచ్చు. ఇన్ని వెసలుబాట్లు వున్నప్పుడు ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని నిందించడం సరైంది కాదు. వాస్తవానికి రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని నిందించే బదులు, ఒక నిరంతర ప్రక్రియగా, ఓటు హక్కుకు అర్హులైన 18 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతిఒక్కరినీ కలిసి వారికి ఓటరు నమోదు విషయంలో చైతన్యం కలిగించి, ఓటరుగా చేర్పించడం మంచిది. ప్రతిదానికీ ప్రభుత్వాన్ని నిందించడం సబబు కాదు. ముసాయిదా ఓటర్ల జాబితామీద అభ్యంతరాలను, ప్రతిపాదనలను తెలిపేందుకు, ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఎన్నికల సంఘం ఇచ్చిన గడువును (సెప్టెంబర్ 25), ఓటరును చైతన్యపరచడానికి  వినియోగించుకోవాల్సిన విషయాన్ని మరచి, బాధ్యతారాహిత్యంగా ప్రభుత్వంపై విమర్శలు చేయడం మానుకోవాలి. అర్హత కలిగిన ప్రతిఒక్కరినీ, ఒకవేళ ఈ పాటికే ఓటరుగా వారి పేరు జాబితాలోకి ఎక్కకపోతే, తక్షణమే వారితో దరఖాస్తు చేయించే కర్తవ్యం వందశాతం రాజకీయ పార్టీలదే.

1 comment:

  1. Anonymous said...
    ఉన్న ఓట్లు ఎందుకు పీకేశారో చెప్పకుండా ఈ చాట భారతం దేనికి. లక్షల ఓట్లు గల్లంతైనది నిజంకాదా. ఈ ముందస్తు మురికి ఎన్నికల వల్ల ఇరవై లక్షలమందికి ఓటు హక్కు లేకుండా పోవడం నిజం కాదా. 40 ఏళ్ళు జర్నలిజం అంటారు ఎందుకు బయ్యా ఇలా ఆత్మవంచన చేసుకుంటారు.

    ReplyDelete