Tuesday, September 4, 2018

కొంగర కలాన్ నుంచి కెసిఆర్ విస్పష్ట సందేశం : వనం జ్వాలా నరసింహారావు


కొంగర కలాన్ నుంచి కెసిఆర్ విస్పష్ట సందేశం
వనం జ్వాలా నరసింహారావు
మన తెలంగాణ దినపత్రిక (05-09-2018)

హైదరాబాద్ శివారులోని కొంగర కలాన్ లో ఆదివారం (సెప్టెంబర్ 2, 2018) జరిగిన బ్రహ్మాండమైన బహిరంగ సభకు హాజరైన వారికి, అలాగే రాష్ట్రం, దేశమంతటా టెలివిజన్ సెట్లలో తన ప్రసంగం విన్నవారికీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నర్మగర్భంగాను, ప్రస్ఫుటంగాను అనేక కోణాలు ఆవిష్కరించారు. ఆయన తన ప్రసంగంలో ముందుగా ఎన్నికల అంశాన్ని నేరుగా ప్రస్తావించక పోయినప్పటికీ ఆ సందేశం నర్మగర్భంగా ఉంది. వచ్చే ఎన్నికల కొరకు మ్యానిఫెస్టో (ఎన్నికల ప్రణాళిక) కమిటీకి రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు అధ్యక్షుడిగా వ్యవహరిస్తారని ఆయన ప్రకటించినప్పుడు అందులో అది ప్రస్ఫుటంగా ఉంది. ఎన్నికల ప్రణాళికలో సంక్షేమ పథకాలు చేర్చుతామని ముఖ్యమంత్రి చెప్పారు. అయితే ఆయన రాష్ట్ర అసెంబ్లీ రద్దుకు నిర్ణయించుకుని, ఊహించినదానికంటే ముందుగా ఎన్నికలకు వెళతారా, లేదా అన్నది ప్రేక్షకుల ఊహకే విడిచిపెట్టారు. అసెంబ్లీకి ముందుగా ఎన్నికలపై ముఖ్యమంత్రి ఇతమిద్దంగా ఏమీ చెప్పకపోయినా, త్వరలో సరైన సమయంలో నిర్ణయం ప్రకటిస్తానని మాత్రం చెప్పారు.

         అయితే అచ్చువేసిన కరపత్రం ద్వారా, తన ప్రసంగం ద్వారా దాదాపు 500 అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల ముందుంచడానికి ముఖ్యమంత్రి ఈ సందర్భాన్ని ఉపయోగించుకున్నారు. దేశంలోనే మొట్టమొదటిసారి తాను ప్రవేశపెట్టిన పథకాలు, ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేయని పథకాలు, వాగ్దానం చేసిన పథకాలు దీంట్లో ఉన్నాయి. టీఆరెస్ ప్రభుత్వ “ప్రగతి నివేదిక’ ను సమర్పించటం సభ ఉద్దేశం అయినందున దాన్ని ఆయన విజయవంతంగా నిర్వర్తించారు.

         సభ ఫలితం గూర్చి ఏదో గాలిలో ఉహాగానాలు చేయడం మినహా రాజకీయ పార్టీలకు దేనికీ ఎటువంటి క్లూ దొరకలేదు. ముఖ్యమంత్రి ముందస్తు ఎన్నికలు ప్రకటిస్తారా, లేదా అనే ఊహాగానంలో వాటిని ముఖ్యమంత్రి ఉంచారు. ఆ నిర్ణయం ఏదైనా కావచ్చు. ఆయన దాన్ని తన వరకే గోప్యంగా ఉంచుకున్నారు. ముఖ్యమంత్రి మిషన్ భగీరథ పథకం ప్రస్తావన చేసి, ఎన్నికలకు ఆర్నెల్లముందే ప్రతీ ఇంటికి తాగునీరు అందిస్తున్నామని చెప్పటం ముందుగా ఎన్నికల గూర్చి అది మరో గూడార్థ సూచన. ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేయకపోతే ఓట్లు అడగబోమన్న వాగ్దానాన్ని నెరవేర్చానని చెప్పటం ద్వారా ముఖ్యమంత్రి ముందస్తు ఎన్నికలను ఒక విధంగా దృవీకరించారు.

         “తుది నిర్ణయాన్ని మంత్రిమండలి నాకు విడిచిపెట్టింది. రాష్ట్రానికి, ప్రజలకు ఏది మంచిదో అది చేస్తాను. రానున్న రోజుల్లో నిర్ణయం తీసుకుంటాను” అని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పటం ముందస్తు ఎన్నికల గూర్చి మరో నర్మగర్భసూచన.


         కాంగ్రెస్ పార్టీపై ముఖ్యమంత్రి చేసిన విమర్శ మరో స్పష్టమైన సందేశం. ప్రతిదాన్ని రాజకీయం చేయడం కన్నా రాష్ట్ర ప్రజల బతుకులను మెరుగుపరచటం రాజకీయ పార్టీల లక్ష్యంగా ఉండాలని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క విభాగానికి లబ్ది చేకూర్చుతున్న తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న అనేక పథకాలను ముఖ్యమంత్రి ఉదహరించారు. కాంగ్రెస్ కు అధికారమిస్తే, గత 50 నెలల పైచిలుకు కాలంలో తమ ప్రభుత్వం చేసిన దానిలో వీసమెత్తు కూడా చేయలేదు అని అన్నారు. ఉద్యోగావకాశాల్లో 95 శాతాన్ని స్థానికులు పొందే వీలుకల్పించిన జోన్ ల ఏర్పాటును ఉత్తమ ఉదాహరణగా ఆయన ప్రస్తావించారు. టిఆర్ఎస్ అధికారంలో లేకపోతే ఉద్యోగాల్లో స్థానికులకు 95 శాతం రిజర్వేషన్ సాధ్యమయ్యేదా అని సభికులను ఆయన ప్రశ్నించారు.

         తమిళనాడు రాజకీయాలను ఉదాహరణగా చెబుతూ, రాష్ట్రాభివృద్ధి సాధించడంలో, జాతీయ పార్టీలనబడేవాటికి వ్యతిరేకంగా పోరాటం చేయడంలో ప్రాంతీయ పార్టీల ప్రాముఖ్యతను, పాత్రను ముఖ్యమంత్రి వక్కాణించారు. ప్రాంతీయ పార్టీలు ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ అవి ఆ రాష్ట్ర ప్రజల సొంత పార్టీలతో సమానమని, అవి ప్రజల ఆత్మ గౌరవాన్ని పరిరక్షిస్తాయని ఆయన చెప్పడం మరో సందేశం. తమిళనాడు దృశ్యాన్ని తెలంగాణతో పోల్చుతూ, తన నాయకత్వం కింద తెలంగాణ ప్రభుత్వానికి బ్రహ్మాండమైన తోడ్పాటిచ్చిన ప్రజలకు టిఆర్ఎస్ ఎన్నో మేళ్లు చేకూర్చిందన్నారు.

         గత 51 మాసాల టిఆర్ఎస్ పరిపాలనలో ఆరంభించిన, అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి వివరిస్తుంటే 600 ఎకరాల విస్తీర్ణంలోని సభా ప్రాంగణంలో గుమికూడిన దాదాపు 30 లక్షల మంది జన సమూహం తదేక శ్రధ్దతో విన్నారు. ఎడతెగకుండా హర్షధ్వానాలు చేశారు. అవాంతరరహిత, నిరంతర విద్యుత్ సరఫరా, రైతుల సాధికారీకరణ, దీనావస్థలో ఉన్న వ్యవసాయ రంగాన్ని రైతుబంధు, రైతు బీమా పథకాల ద్వారా పునరుద్దరించటం, సాంప్రదాయక కులవృత్తుల పునరుద్దరణ, మిషన్ కాకతీయ, దురవస్థలో ఉన్న చేనేత కుటుంబాల ఉద్దరణ, పశుపోషణ, గొర్రెల పెంపకానికి తోడ్పాటు అందించటం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం లాంటి వాటిని ముఖ్యమంత్రి ప్రస్తావించినపుడు అపారమైన సంతోషం పొందారు ప్రేక్షకులు. తమను ఆర్థికంగా, ఇతరత్రా ఆదుకుంటూ ప్రభుత్వం ఎలా పనిచేస్తున్నదో తమ అవగాహనను దృవీకరించారు.

         ప్రేక్షకుల ఉత్సాహానికి ముఖ్యమంత్రి ప్రతిస్పందిస్తూ, టిఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా నిలుస్తూ మళ్లీ మళ్లీ అధికారంలోకి తెమ్మని ప్రజలను కోరడం ఎన్నికల తరహా ప్రచారానికి మరో స్పష్టమైన సందేశం. ప్రజల ఆర్థిక ప్రమాణాలు మెరుగుపరిచేందుకు, రాష్ట్ర సంపదను ప్రజలకు పంచటానికి కష్టపడి పనిచేయటాన్ని కొనసాగించేందుకు టిఆర్ఎస్ ప్రభుత్వం సంసిద్దంగా ఉందని చెప్పటం ద్వారా మంచి రోజులు ముందున్నాయని ముఖ్యమంత్రి ప్రజలకు హామీయిచ్చారు. పెన్షన్ సొమ్ము పెంపుదలను, నిరుద్యోగ భృతి ఇచ్చే అవకాశాన్ని ముఖ్యమంత్రి సూచన ప్రాయంగా వెల్లడించారు.

         ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తయి, కోటి ఎకరాలు నీటిసాగు కిందకు వచ్చినపుడు బంగారు తెలంగాణ ఆవిష్కృతమవుతుందని, యావత్ రాష్ట్రం ఆకుపచ్చజీవకళతో కళకళలాడుతుందని, అప్పుడు ఈ సంపదను ప్రభుత్వం మరింతగా ప్రజలకు పంచుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. తెలంగాణ ఇవాళ అభృద్ధికి మారుపేరుగా ఉందని, టిఆర్ఎస్ అధికారంలో ఉన్నంతకాలం ఇది ఇలాగే కొనసాగుతుందని చెప్పడం ద్వారా ముఖ్యమంత్రి మళ్లీ సందేశమిచ్చారు.

         2001 నాటి రోజులను ముఖ్యమంత్రి గుర్తుచేసుకుంటూ, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్ ఛార్జీలను అసాధారణంగా పెంచారని, అది తెలంగాణ రైతాంగాన్ని తీవ్రంగా నష్టపరుస్తుందని గ్రహించి, పెంచిన ఛార్జీలు తగ్గించాలని ముఖ్యమంత్రికి లేఖ రాశానని, అయితే ఆయన పెడచెవిన పెట్టారని చెప్పారు. ఆ ఒక్క సంఘటన తెలంగాణ రాష్ట్రం కొరకు పోరాడడానికి ఎలా ప్రేరణ అయిందీ, రాష్ట్రం సాధించేవరకు అహింసాయుతంగా తాను ఎలా పోరాటం సాగించిందీ సభికులకు చెప్పారు.

         తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక, అంతకు ముందు సైతం రాష్ట్ర పునరావిష్కరణ, కొత్తబాట పట్టించటంపై మేథోమధనాన్ని ముఖ్యమంత్రి ప్రేక్షకులతో పంచుకున్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన, ఆర్ధిక రంగాల్లో ఎదుర్కొన్న సమస్యలను, ఎదురైన సవాళ్లను, వాటిని తాము ఎలా విజయవంతంగా అధిగమించగలిగిందీ కూడా ముఖ్యమంత్రి వివరించారు.

         ప్రభుత్వం గత నాలుగున్నర ఏళ్లలో ఎంతో పురోగతి సాగించింది, సాధించాల్సింది ఇంకా ఎంతో ఉంది అని ముఖ్యమంత్రి అంతిమంగా చెప్పటంలో సందేశం సుస్పష్టం. ఎన్నికలు ఎప్పుడు జరిగినా,  ముందుగా వచ్చినా లేక నిర్ణీత సమయంలో వచ్చినా, టిఆర్ఎస్ ను తిరిగి అధికారంలోకి తేవటం అవసరం.

1 comment:

  1. ఎన్నికలు బాబోయ్. పనికిరాని వృధా ఖర్చు ముందస్తు ముదనష్టం ఎన్నికలు. పెజానీకానికి ఎంతమాత్రం అవసరం లేని పుచ్చలకాయ ఎన్నికలు.

    ReplyDelete